Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

12. స్వామి జ్ఞానదృష్టి

జ్ఞానదృష్టి అనగా తనసూక్ష్మబుద్ధితో త్రికాలవిషయములను తెలుసుకోగలిగిన ప్రతిభ, దూరదృష్టి, దూరశ్రవణము ఈ జాతికి చేరినవే. దివ్యమూలికలు, మంత్రసాధన, యోగాభ్యాసము వలన ఈ శక్తి కలుగుతుందని చెప్పుదురు. సూర్యోదయముముందు ఉషోరేఖలు అలముకొని దిశామండలము ఎట్లు రాగరంజితమగునో, అట్లే ఆత్మసాక్షాత్కారమునకు ప్రాతిపదికగా జ్ఞానదృష్టి కలుగుచున్నది. భగవదుపాసన చేసే వారికి సిద్ధులు అయత్నముగా లభించును. ఋషులు, యోగులు సిద్ధులు అవసరమైన సిద్ధులను వాడుకొందురు.

స్వామికి ఇట్టిసిద్ధులు కైవసము. చిటుకలో ఆయన ఇతరుల చిత్తవృత్తులను ఎరుగును. దేశాంతర లోకాంతర విషయములు, దేవతావిశేషములు ఉన్న పాటున చెప్పును. స్వామి జ్ఞానదృష్టికి సంబంధించిన అనుభవములు కొన్ని.

నారాయణశాస్త్రి, గీతాపారాయణ చేయుచుండగా స్వామివచ్చి, 'గీతాపారాయణమునకు ఏకాగ్రత అవసరమనిరి' స్వామికి తాను గీతాపారాయణ చేస్తున్నట్లు ఎట్లు తెలిసినది?

ఒకమారు శాస్త్రులు నాలుగుకాసుల మల్లెపూలుకొని, అరుణాచలేశ్వరునికి, అమ్మవారికి, రమణులకు అర్పించి మిగిలిన దానిని స్వామివారికి ఇవ్వవలెనని సంకల్పించెను. కానీ స్వామి మాత్రం కనపడలేదు. తీసిన పూలు తక్కిన మువ్వురికి సమర్పించెను. సాయంత్రము స్వామికనపడి - 'కాలణాపూలు అయితే ఏమి? భక్తి ప్రధానము' అని అనిరి.

తిరుప్పుగళ్‌ స్వామి ఒకరు ద్రావిడదేశమున ఇటీవల వరకు ఉండిరి. వారికి విద్యాగంధము లేదు. కాని సుబ్రహ్మణ్య భక్తులు. ఆయన తిరుప్పుగళ్‌ పాడేవారు. శ్రావ్య మైన కంఠం. వారి పాటలువిన్న, నా సికులూ ఆస్తికులు కావలసినదే. వారు తిరువణ్ణామలెవాగా, స్వామి - 'తిరుప్పుగళే మీకు మంత్రం' అని అన్నారట. స్వామి మరల 'మీపూర్వులలో కొందరు సన్యాసము తీసుకొన్న వారేకదా?' అని అడిగారు. ''ఔను శ్రాద్ధము పెట్టునపుడు 'బ్రహ్మీభూతులైన - అను పదమును వాడుచుంటిని-' అని తిరుప్పుగళ్‌ స్వామి అనెను. ''ఈ మాటతో - నీవూ వారివలె సన్యాసి ఐపో'' అన్న ఆదేశము తిరుప్పుగళ్‌ స్వామికి వినవచ్చెను. తరువాత వారు వళ్ళిమ లైలో స్థిరపడి ప్రఖ్యాతిబడిసిరి.

చెంగల్వరాయులు చిదంబరమున సన్యాసము తీసుకొని జ్ఞానగురువును అన్వేషిస్తూ తిరువణ్ణామలై వచ్చెను. గురు లాభమునకై అతడు సుబ్రహ్మణ్యశ్వరుని ప్రార్థించుచుండెను. మూడురోజులు ఉపవాసముండి సుబ్రహ్మణ్యుని ఆలయమునకు రాగా, స్వామికనపడి, 'నాయనా! మూడురోజులుగా నీవు భోజనమే చేయలేదా.' అని అడిగిరి. చెంగల్వరాయనికి భావముతో కనులనీరు నిండెను. 'నీవు ఈ సుబ్రహ్మణ్యశ్వరుని వద్దనే ఉండిపో' అని అనిరి. నాటినుండి చెంగల్వరాయనికి స్వామియే సుబ్రహ్మణ్యుడు.

చెంగల్వరాయుడు పూర్వాశ్రమములో న్యాయవాది. సుబ్బరామయ్య అనే పురోహితుని భార్య ఒకపుడు ఏదో విరక్తితో ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నించింది. ఉరి పోసుకొని చూరునుండి వేలాడుచుండగా ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి చీవాట్లు వేశారు. ఈ వార్త పోలీసుకు తెలిసి ఆమెపై అభియెగం తెచ్చారు. చెంగల్వరాయుడు ఆమె పక్షంలో వాదించవలసి వచ్చింది. దారిలో ఆమెను చూచినపుడు ఎన్నో ఏండ్లనాటి ఈ పాతసంగతులు అతనికి జ్ఞప్తికి వచ్చింది.

చెంగల్వరాయుడు స్వామివద్దకు వచ్చి నిలువగానే, స్వామి చుట్టు ప్రక్కనున్న వారితో 'ఒక అమ్మాయి ఉరిపోసుకొన్నది కానీ ఆ యత్నం ఫలించలేదు. ఉరిలో తగుల్కొన్న పుడు కానీ ఉరి అంటే ఏమిటో తెలియలేదు. ఆ పిల్లకు కేకలు వేస్తే జనమూ పోలీసులూ రాకుండా ఉంటారా? కావలిస్తే ఈ చెంగల్వరా యణ్ణి అడగండి. ఆ కథ చెప్పుతాడు' అని అన్నారు.

తాను త్రోవలో అనుకొన్న విషయము స్వామి ఏకరువు పెట్టుతున్నారని చెంగల్వరాయుడు గ్రహించారు. 'నీది వాలాజాపేట నీపేరు అబ్బాయికదా!' అని స్వామి అడిగారు. తలిదండ్రులు చిన్నతనములో చెంగల్వరాయనికి పెట్టిన ముద్దు పేరు. అబ్బాయి. ఆ పేరు ఎప్పుడో వాడుకలో నుండి పోయినది. ఇది స్వామి ప్రతిభకు తార్కాణం.

రాజుశాస్త్రి తన శిష్యులకు శిశుపాలవధ మాఘకావ్యాలు బోధిస్తున్నారు. ఒకరోజు 'కాయమానము' అన్న పదము కనపడినది. దానికి గుడారమని అర్థం. దానిని నిఘంటువును చూచి చెప్పవలసినదే. వాడుకలో లేనిమాట అది. శిబిరము, కుటీరము, పటగృహము అనేవి పర్యాయపదములు. రాజుశాస్త్రి పాఠం చెప్పుతుండగా స్వామి వీధిలో వెడుతున్నారు. వేడుకకు రాజుశాస్త్రి ''గుడారానికి'' ఏదైనా పర్యాయపదం చెప్పండి'' అని అడిగారు. స్వామి నిలువనైనా నిలువక - ''కాయమానము'' అని చెప్పి వెళ్ళారట. తాను తలచిన పదమే స్వామి చెప్పుట శాస్త్రికి వింతగా తోచినది.

ఒకరోజు పెరుమాళ్ళస్వామి స్నానం చేస్తూ ''ములై పాల్‌'' తీర్థము గట్టులో తన విభూతిసంచీ, అందులోని డబ్బా పెట్టి మరచిపోయినాడు. స్నానమైన వెనుక ఊరిలోనికి వస్తూ స్వామిని చూచి, ''స్వామీ! అంగడిలో ఏవైన భక్ష్యములు కొని ఇస్తాను రండి'' అని అన్నారు. స్వామి కొంతదూరం అతనితో పోయి, ''నీదగ్గర డబ్బెక్కడ? ములైపాల్‌ తీర్థంపో'' అని వెళ్ళిపోయారట. అప్పటికిగాని పెరుమాళ్ళస్వామికి తన విభూతిసంచి జ్ఞాపకం రాలేదు.

సుబ్రహ్మణ్యం మొదలియారు సేలం వాస్తవ్యులు. వకీలు ఉద్యోగం. స్నేషితులతో బంధువులతో స్వామిదర్శనార్థం వచ్చారు. స్వామిని ఎంత వెదకినా కనబడలేదు. నిరాశ చేసుకొని పోనీ కంచివరకు వెళ్ళి తిరిగివచ్చేటపుడు చూద్దామని అందరూ కారు ఎక్కి కాంచీపురం పోయేసంబరంలో ఉన్నారు. ఎవరూ గమనించని సమయంలో స్వామి అక్కడకు వచ్చి ''ఈకారు కంచిపోతుందా?'' అని అడిగారు. మొదలికారు నుండిదిగి సపరివారముగా అక్కడే స్వామికి నమస్కరించారట.

టి. కె. సుందరేశమయ్యరు చిన్న తనంలో ఏడవ తరగతి చదువుతూ ఇంటి అరుగుపైన లెక్కలు వేసుకొంటూ వున్నాడు. స్వామి ''ఏమిచేస్తున్నాము?'' అని అడిగారు. ''ఇవన్నీ లెక్కలు స్వామీ లెక్కలు మీకు తెలియవు'' అని గంభీరంగా అన్నాడు. ''ఓహో అట్లనా? జవాబులు చెప్తాను రాసుకో'' అని అన్నారు. బాల్యచాపల్యంతో సుందరేశం మొదటిలెక్కకు ఉత్తరం ఎంత? అని అడిగాడు. ''రెండు'' అని అన్నారు. ''రెండో లెక్కకు? నాలుగున్నర'' మూడో లెక్కకు? '634' - ఈ విధంగా బదులిచ్చారు. సుందవరేశం గణిత పుస్తకంలో చివరనున్న జవాబులపట్టికలో చూడగా స్వామి చెప్పిన జవాబులు సరిగానుండెను. ఏ బడిలోనూ జరుగని విధముగా స్వామికి లెక్కల పరీక్ష సుందరేశం చేత జరిగెను.

ఈ సుందరేశ##మే పెరిగి పెద్దవాడైనపిదప ఇతనికి సందేహం వచ్చింది. ''వర్ణాశ్రమవ్యవస్థ చెడిపోవుచున్నది. కదా? దీనిని రక్షించుటకు ఒక అవతారపురుషుడు పుట్టకూడదా? కాని జనులు సమిష్టి కర్మను చక్కగా నిర్వర్తిస్తే కదా అట్టి అవతారపురుషుడు రాగలడు? అట్లైనచో ఆసమిష్టికర్మ ఏమి?'' అన్న ప్రశ్న లుదయించినవి. కాని సుందరేశమునకు స్వామిని అడుగవలెనన్న సంకోచము. ఆలయానికి సుందరేశము వెడుతున్నపుడు స్వామికనపడ్డారు. ''నీ సందేహాలు నన్నడుగు నేను చెప్పుతాను. నీవనుకొనే సమిష్టి కర్మ యజ్ఞం. ఇక అవతార పురుషుడు పుట్టడానికి చాలకాలం ఉంది'' అని అన్నారట.

ఒకమారు ఒక పశువులకాపరి కొండచరియలలో పశువులను మేపుతున్నాడు. ఆ చోటికి చిరుతపులి వచ్చింది. దానిని చూడగానే క్రిందు పైనాచూడక వాడు కాళ్ళకు బుద్ధిచెప్పి నాడు. ఈ సంబరములో అతడు రాతిపై నుంచి దుముకడములో కాలికి దెబ్బ తగిలింది. ఏలాగో బ్రతుకుజీవుడా అని ప్రాణములు రక్షించుకొని బయటపడ్డాడు. అతడు వీధిలో పోవు చుండగా స్వామి చూచి ''నీవు పశువులను మేపడానికి అడవికి వెడుతావుకదా? అక్కడ చిరుతలూ అవీ ఉండవూ? జాగ్రత్త. ఐతే అవి నిన్ను ఏమీ చేయవులే'- అని అన్నారట. నిన్నజరిగిన విషయం స్వామికి ఎట్లా తెలిసిందని ఆశ్చర్యపోయాడు.

జి. నరసింహయ్యరు తనకుమార్తెకు పెళ్ళిచేశారు. స్వామి దంపతులను ఆశీర్వదిస్తే మంచిదని బలవంతపఱచి బండిలో పిలుచుకొనిపోతూ, నాకు వీరుఏదైనా ఉపదేశం చేయరాదా అని మనస్సులో అనుకొన్నారట. స్వామి వెంటనే ''నీవు అరుణాచలేశ్వరుని సేవ అన్ని వేళలా చేస్తూ ఉండు. గిరి ప్రదక్షిణము ప్రతిమంగళవారమూ చేస్తూరా? అని అన్నారట. స్వామి తన మనోభావం తెలుసుకొని ఉపదేశమిచ్చి నందులకు ఆయన చాల సంతోషించాడు.

ఒకమారు అర్ధనారి అనే ఆయన స్వామి తన అరుగు మీద కూర్చని ఉండగా స్వామిని ఇట్లే ఒక ఫోటో తీసి పూజలో ఉంచుకొంటే బాగా వుంటుంది. అని అనుకొన్నాడు. స్వామి వెంటనే 'నా ఫోటో వెంకటసుబ్బయ్య ఇంట్లో ఉంది ఆయనను అడుగు ఒక కాపీ ఇస్తాడు. దానిని ఉంచుకో' అని అన్నారట. అతడు వెంకటసుబ్బయ్యను అడిగి స్వామి ఫోటోను పూజాగృహంలో వుంచుకున్నాడు.

రామభద్రశర్మ సోదరికి పొరుగూరిలో ప్రసవకాలం సమీపించింది, శర్మకు పోదామా వద్దా అని విచికిత్స. స్వామి శర్మను చూచి 'నీ వేమీ దిగులుపడకు. ఈసరికి ప్రసవమై ఉన్నది.'' అని అన్నారట. శర్మకు సంతోషమూ, ఆశ్చర్యమూ కల్గింది.

తిరువెంకట మొదలియారు మానసికముగా పంచాక్షరీ జపం చేస్తున్నారు. స్వామి ఆయన వీపుతట్టి 'ఈ రోజు నీవు పంచాక్షరీ జపించవద్దు. రామనామం చేయి' అని అన్నారట.

F. T. పీటర్సు అనే ఆయన పోస్టుమాస్టరు జనరలుగా వుద్యోగం చేసేవారు. వారిబావగారు ఆరోజుల్లో స్టేషన్‌ మాస్టరుగా వున్నారు. ఒక పెద్ద స్టేషనులో ఇక గుజరాతీ వర్తకుడు రవాణా చేసిన సామాను తప్పిపోయింది. దానికి స్టేషన్‌ మాస్టరు అజాగ్రత్తయే కారణమని అతడు కోర్టులో కేసు వేశాడు. స్టేషను మాష్టరుకు వ్యతిరేకంగా తీర్పు అయ్యే పక్షంలో ఆయన పదివేల రూపాయలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. స్టేషనుమాష్టరు తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లు ఋజువు చేసే రికార్డులను దాఖలా చేశారు. కాని అవి మధ్యలో ఎక్కడో తప్పిపోయి కోర్టువారి చేతికి అందలేదు. ఇందుచేత కోర్టువారికి స్టేషనుమాష్టరుపట్ల మరింత సందేహం వృద్ధికావడానికి కారణమయింది.

ఈ సమయంలో స్వామి విషయం పీటర్సుగారికి తెలిపింది. స్వామిని చూచి ఈ కేసు పర్యవసానం ఏమవుతుందో తెలుసుకొనిరమ్మని ఆయన తనదగ్గర పనిచేకయుచున్న ఒక ఉద్యోగిని పంపారు. ఆయన తిరువణ్ణామలె వచ్చారు. వారిని చూడగానే స్వామి - 'బుస్‌, బుస్‌, బుస్‌, బుస్‌ - గుప్‌ గుప్‌ గుప్‌ గుప్‌ - కూకూ-' అని రైలుబండి ధ్వనులను అనుకరణం చేసి అట్లాపోయింది. ఇట్లాపోయింది ఏమైతే ఏం? కడపట దొరికింది.' అని చెప్పి వెళ్ళిపోయారట.

ఆ ఉద్యోగి ఈ విషయం పీటర్సుగారికి తెలియచేస్తూ, రికార్డులు ఈ సరికి దొరికి ఉండవలెనని స్వామి చెప్పినట్లు అర్ధం ఔతుందని తంతికొట్టారట. అదే సమయానికి తప్పిపోయిన రికార్డులు దొరికినవని మరొకతంతికూడ పీటర్సుగారికి అందినది. స్టేషన్‌ మాష్టరుపైన కేసు కొట్టివేయబడింది.

జిల్లాజడ్జి సుందరేశయ్యరుకు ఒక కుమార్తె - వివాహమునకు యుక్తవస్కగా నుండినది. ఆయన వరాన్వేషణ చేస్తున్నారు. తిరువత్తూరులో సీతారామయ్య అనే సంపన్న గృహస్థునికి ఒక కుమారుండుండెను. సుందరేశయ్యరు సీతా రామయ్యను పెళ్ళి చూపులకు పిలిచినాడు. పిల్లను చూచి వయస్సు కొంచెం అధికంగా వున్నందువల్ల తాను అంగీకరింపనని సీతారామయ్య అన్నాడు. ఈ విషయంలో కొంచెం వాదులాటజరిగింది. అ సమయంలో స్వామి అక్కడకు వచ్చారు. అందరూ ఆయనకు నమస్కరించి కాఫీ ఫలహారాలు తెచ్చి పెట్టారు. స్వామి ఉన్నట్టుండి సీతారామయ్యను చూపి సుందరేశయ్యరుతో - 'నీ అమ్మాయిని వీరింటికి శుభ్రంగా పంపవచ్చును' స్వామి వాక్కులను త్రోసివేయలేక సీతారామయ్యయూ అంగీకరించవలసివచ్చెను.

ముత్తుసామి మొదలియారు భార్య పేరు తాయమ్మ. ఆమె షష్టీవ్రతాలు ఆచరించేది. ఒకరోజు తాయమ్మ పాలు, పండ్లు, పూలు తీసుకొని ఇలయనారు గుడికి వెళ్ళింది. 'ఓహో! స్వామి కైంకర్యం చేయవచ్చినావా? నేనే సుబ్రహ్మణ్యుడిని. ఇంకేం అవన్నీ తీసుకొనిరా!' అని పూలను నెత్తికి చుట్టుకొని, పండ్లను చుట్టూ ఉన్న పిల్లలకు పంచిపెట్టి, పాలను సగం త్రాగి, సగం ఆలోటాలోనే వుంచి ప్రసాదంగా ఇచ్చి వేశారు. కలియుగంలో సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షదైవమని ప్రతీతి. ఆమె అదృష్టమే అదృష్టం.

కాని తాయమ్మకు తాను తీసుకొనిపోయిన పూజా ద్రవ్యములు స్వామి తీసుకోవడం కానీ, ఆయన ఉచ్చిష్ఠమును తాను స్వీకరించడం కానీ మనస్కరించలేదు. ఇంటికి వెళ్లి ఆ పాలను క్రిందపోసి, ఆ పాత్రనుకూడ వాడుకొనక ఒకమూల పెట్టినిది - మరుసటిరోజు స్వామిని చూడటానికి వెళ్ళినపుడు - తాయమ్మను చూడగానే 'పోపోగాడిదా! నీకు చాలమడుగు కదూ? ఆచారంకదూ? పాలను పారబోసి పాత్రనుకూడ అవలకు నెట్టినావు 'పోపో' అని కసురుకొని ఒక రాతి నెత్తికొని అదలించినారట. ఆరు నెలల వరకు స్వామి ప్రసన్నుడు కాలేదు. తరువాత పూర్వం వలెనే వాత్సల్యం చూపేవారు.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page