Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

15.ఉపదేశములు

ఇంతవఱకు భక్తబృందముల అనుభవములను చూచితిమి. ఇకమీదట స్వామి అప్పుడపుడు వారికిచ్చిన ఉపదేశములను అనుశీలనము చేయుదము.

''నహిజ్ఞానేన సదృశం పవిత్ర మహవిద్యతే'' అని గీత. లోకములో ప్రజలకష్టములకు, దుఃఖములకు కారణము అజ్ఞానమే. జ్ఞానలాభము ఉపాసనామూలముగా గల్గును. ఉపాసనా సౌకర్యమునకు పూర్వపుణ్య సంస్కార ముండవలెను. పుణ్య సంస్కారము భగవదనుగ్రహమున కాని లభించదు. ప్రజలు ఇట్లు కార్యకారణక్రములో చిక్కుకొని తపిస్తూ వుంటారు.

స్వామి ఉత్తమాధికారులకు స్పర్శదీక్ష నిచ్చి అనుగ్రహించుట కద్దు. స్పర్శదీక్ష అనగా గురువు శిష్యుని దేహ భాగము దేనినైనను స్పృశించి శిష్యుని ఆత్మవికాసమునకు అడ్డుపడే ప్రతిబంధకములను తొలగించుట.

రామస్వామి శాస్త్రులు తిరువణ్ణామలెలో సబ్‌ రిజిస్ట్రారుగా పనిచేయుచుండిరి. వేదాంతగ్రంథపఠన, వైదిక కర్మలు చేయుచూ ధార్మిక జీవితం గడిపేవారు. ఉదయము నాలుగు గంటలకు లేచి, ఏదో లక్ష్యము పై దృష్టి నిలిపి ధ్యానము చేయవలెనని వారు తంటాలు పడుచుండిరి. ఆసమయమునకు స్వామి వచ్చి తలుపు తట్టిరి, శాస్త్రిగారు లేచి తలుపుతీసిరి. స్వామికి నమస్కరించి లోనికి తీసుకొనిపోయిరి. ''ఏమి చేయుచున్నావు'' అన్న స్వామి ప్రశ్నకు తన అవస్థను శాస్త్రిగారు చెప్పిరి. ఓహో! అట్లనా! అని తనచేతి రెండు వ్రేళ్ళతో స్వామి శాస్త్రి గారి కంఠభాగమును నొక్కిరి. అంతటితో ఆయనకు ఒడలు కంపించి దేహధ్యాస తొలగి, అనిర్వచనీయమైన ఆనందాను భూతి కల్గెను. అరగంటసేపు అయిన పిదప శాస్త్రిగారు కండ్లు తెరచిరి. స్వామి 'ధ్యానం చేయడం అంటే ఇది' అని వెళ్లి పోయిరి. అనాటి నుండి ఆయనలో ఒక ఉదాత్తపరిణామం ఏర్పడింది. వారిలో శాంతి, నిండుదనమూ నెలకొన్నది. వారిలో ఆధ్యాత్మిక అభ్యున్నతి యొక్క లక్షణములు గోచరించెను. కొన్ని సంవత్సరములకు పిదప శాస్త్రిగారు విదేహ కైవల్య మొందిరి.

చిత్తూరు మురుగేశమొదలియారు సబ్‌ రిజిస్ట్రారుగా పని చేసి పెన్షన్‌ పుచ్చుకొన్నవారు. దైవభక్తి, సాధుసాంగత్యాభిలాష కల్గిన పెద్దమనుష్యులు. వారు తమిళ భాషలోని నాలాయిర ప్రబంధములను శ్రావ్యంగా పాడేవారు. స్వామిని వుదయమూ సాయంత్రమూ దర్శించేవారు. తనకు 'జ్ఞానోదయము ఏదైనా కల్గునా?' అని స్వామిని ప్రార్థించిరి.

ఆయన వైరాగ్యమును గుర్తించి స్వామి, ఆయనను ఇలయనార్‌ గుడికి తీసుకొని వెళ్ళి మొదలి శిరస్సుపై తనకుడి చేతి నుంచిరి. అంతటితో మొదలికి స్వరూపసాక్షాత్కార మేర్పడి బ్రహ్మానందావేశము కల్గెను. ఆయన బంధువులు 'ఈయన ఇట్లున్నారేమి' అని స్వామిని అడిగిరి.

'సంస్కారమున్నవాడు. ఉపదేశము చేయమన్నాడు. నేను చేసితిని, కర్పూరము అంటుకొన్నట్లు ఉపదేశము వెంటనే ఫలిచినది.' అని స్వామి అనిరి.

మొదలికి ఈ భావావేశము సుమారు మూడురోజులుండెను. ఆ మూడురోజులూ మొదలి స్వామి వలెనే వీథులలో తిరుగుచూ, రమనాశ్రమము మూడు నాలుగు మార్లు వెళ్ళి వచ్చెను. బంధువుల ప్రార్థనపై స్వామి, మొదలిని నీవు యిక యింటికి వెళ్ళవచ్చును' అని అనిరి. అంతటితో అతని భావావేశము తగ్గెను. ఇది జరిగిన పిదప చాలకాలము మొదలి చిత్తూరులో శాంతముగా పారమార్థిక ప్రవృత్తితో జీవితము గడపెను.

స్వామివద్దకు జనం దాదాపు కామ్యార్థంగానే వచ్చే వారు. ఆధ్యాత్మిక లాభం కోసం వచ్చేవారు అరుదు. వారి సంపాద తాపత్రయములను పోగొట్టి స్వామి ఈశ్వరభక్తి యొక్క ఆవశ్యకతను బోధించేవారు. జ్ఞానలాభ##మైన కానీ, సుఖదుఃఖ ద్వంద్వములు వదలవు. ఒకమారు స్వామి 'తెల్లవారితే అంగడి తీయటం. రాత్రి అయితే అంగడి మూయటం. యిలా వున్నది. ఏం ప్రయోజనం? అరుణాచలేశ్వరుని చూచే నాథుడెవరు?' అని అడిగారట. లోకాయతులపై స్వామికి అనుకంప. అందుచేతనే వారి హృదయం నుండి వ్యథతో కూడిన ఈ మాటలు వచ్చినవి.

ఒక రోజు నారాయణశాస్త్రిని చూచి స్వామి,

'శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనంధ్యాయేత్‌ సర్వవిఘ్నోప శాంతయే' అని మూడు మార్లు చదివిరి. విఘ్నోపశాంతికి పై శ్లోకం మూడు మార్లు చదువవలెనని అర్థం.

'మీరేమివ్యాపారం చేస్తున్నారు?'

నారాయణశాస్త్రిని నాలుగైదుమార్లు స్వామి ఈ ప్రశ్న వేశారు. నారాయణశాస్త్రి 'వీలైనంతవఱకు ఈశ్వరప్రణిధానమే చేస్తున్నాను. వేరు వ్యాపార మేమీ లేదు' అని బదులివ్వగా స్వామి మరల మరల అదే ప్రశ్నవేసేవారు. నీవు పూర్తిగా సంసారిక బంధములను తొలగించుకొని నిరంతరం భాగవత్రైంకర్యములో మగ్నుడవు కావలెనని స్వామి ఆదేశ##మైనట్లు తోచును.

'మీరు ఆముదమును త్రాగెదరా? మీకు వ్యాధీగీధీ లేకుండా చేయనా? అరగంటసేపయితే అదిమలం. బ్రహ్మం నిర్మలం.

మలమునువదలి నిత్యశుద్ధ బుద్ధమైన బ్రహ్మమున ఉపాసించవలసినదని స్వామి బోధ.

'ఈశ్వరుడెవరో తెలుసుకుంటే శరీరం తానుగ పోతుంది' దేహాభిమానం, అహంకారం, మమకారం - ఇదే మృత్యుస్వరూపము. ప్రమాదమే మృత్యువని సనత్సజాతీయం. దేహాత్మ బుద్ధిని వదలటమే మృత్యుంజయము.

'ఉల్లంఘ్యసింధో స్సలిలం సలీలం'

ఆంజనేయుడు సముద్రమును లీలగా దాటినాడు. సీతా దేవి దుఃఖమును తీర్చి, ఆమె శోకవహ్ని చేతనే లంకను కాల్చినాడు. అట్టి ఆంజనేయునికి నమస్కారం అని శ్లోకము యొక్క తాత్పర్యం. ఆంజనేయుడు రామానుగ్రహము చేతనే సముద్రమును లఘింప కలిగినాడు. శిష్యుడున్నూ గురువు అనుగ్రహం ఉంటే కాని భవజలనిధిని అంజనేయునివలె లంఘనము చేయగలడు. అటు తర్వతనే శోక నిరాకరణమై దేహమైన - నవద్వారపురిలంక జ్ఞానాగ్ని చేత భస్మమవదు. ఈ భావమును తెలుపుటకు స్వామి మొదటిపాదమును మాత్రము చదివి ఊరకుండిరి.

'రామాయణం చదవటమెట్లు? రామాయణం చదవటమెట్లు?

'రామోవిగ్రహవా& ధర్మః' రాముడు ధర్మస్వరూపి. వాల్మీకి నారదమునిని 'ఈభూమండలంలో శ్లాఘ్యగణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మము ఎరిగినవాడు, ఉపకారము మరువనివాడు, సత్యవాది, అచలసంకల్పుడు, సదాచార సంపన్నుడు, భూతదయ కల్గినవాడు, విద్వాంసుడు, నేర్పరి, ప్రియదర్శనుడు, ధైర్యశాలి, జీతక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయారహితుడు, యుద్ధమున దేవతలనుకూడ భయపెట్ట గలవాడు, ఎవడు?' అని ప్రశ్నించెను. అందులకు నారదుడు పై గుణములన్నీ రామునికి, సత్యప్రరాక్రమునికి కలవని రామగుణవర్ణనము చేయును.

రామాయణము చదవటం అంటే రాముని గుణములను ఆచరణలోనికి తేవడం. రామాయణాన్ని అనుష్ఠానంలో ఉంచడం. అదే రామాయణ పారాయణ అని స్వామి బోధిస్తున్నారు.

ఇది శివలింగం. దీనిని పూజచేస్తే చాలు. జ్ఞానం, మోక్షం, అన్నీ సిద్ధిస్తాయి.

నారాయణశాస్త్రులు ఒకమారు, స్వామి వద్దకు వెళ్ళి 'స్వామీ! నాకు రామకృష్ణాద్యవతార మూర్తులపై భక్తి ఉన్ననూ, మనస్సు మాత్రం ఏ ఒక్క మూర్తిపై లగ్నం కానంటుంది. అందుచేత మీరు నన్ను అనుగ్రహించాలి' అన్నపుడు స్వామి పై వాక్యం చెప్పినారు.

అనగా గురువే శివస్వరూపమనీ, గురువే శివుడూ, శివుడే గురువు. గురూపాసనే జ్ఞానదాయకము, మోక్షదాయక మని స్వామి వారి బోధ.

''జాతీభేదమూ, మతృభోగమూ వదలితే సమాధి సిద్ధి''

వాడు వేరు నేను వేరు అనే భేదబుద్ధి, గ్రామ్యధర్మముపై కోరిక ఈ రెండు ఆత్మానుభూతికి ప్రతిబంధకాలు. స్వామి 'ఉదరమంతరం కురుతే' అన్న ఉపనిష ద్వాక్యానికి అర్థం పై బోధలోక్లుప్తంగా చెప్పినారు. సమాధ్యవస్థపై ఆసక్తి కలవారు ఈ బోధను అనుష్ఠించవలెను.

'బ్రహ్మగొప్పనా? వసిష్ఠుడు గొప్పనా?'

వసిష్ఠునికి తండ్రి అగుటచే బ్రహ్మయే గొప్ప అని నారాయణశాస్త్రులనిరి. స్వామి కాదు కాదు. వసిష్ఠుడే గొప్ప ఎందుకనగా విశ్వామిత్రుని చూచి నీవు బ్రహ్మర్షినైతివి. అని బ్రహ్మచెప్పిననూ, విశ్వామిత్రుడు వసిష్ఠుని వాక్కులో తాను బ్రహ్మర్షి నైతినని వచ్చినకానీ ఒప్పుకొను అని పంతము పట్టినందున, వసిష్ఠుడే గొప్ప' అని అన్నారు. విశ్వామిత్రునికి వసిష్ఠుడు గురువు. గురువు వాక్కు గుండా తాను బ్రహ్మర్షి అని వచ్చినకానీ, నమ్మలేక పోయినాడు. అందరూ గురు భక్తిని అలవరచుకోవలెను.

'మోక్షమంటే ఇదే. మోక్షమంటే ఇదే'

సుబ్బులక్ష్మి ఇంట్లో ఉన్న ఒక పెద్ద నిలువటద్దము ముందు స్వామి నారాయణశాస్త్రులను కౌగిలించుకొని ప్రతి బింబమును చూపుతూ మోక్షమంటే 'ఇదే, మోక్షమంటే ఇదే' - అని అన్నారు. దీనివల్ల జీవబ్రహ్మైకమే మోక్షమని అవిద్య అనే అద్దము తీసివేస్తే ప్రతిబింబరూపుడైన జీవుడు పోయి బింబము మాత్రమే మిగులునని స్వామిబోధ.

'రామరామమహాబాహో' అని చెప్పితే చాలు మోక్షం'

ఆదిత్యహృదయంలో అగస్త్యమహర్షి రాముని 'రామ రామ మహాబాహో' అని సంబోధించును. అతస్త్యమహర్షి వలె మనమూ ప్రీతితో రామనామజపం చేస్తే ముక్తి లభిస్తుందని స్వామివారి బోధ.

''ఆదిత్య హృదయం పారాయణ చేయవలె. సూర్యోదయ సమయంలో అరనిముషమైనా ధ్యానం చేయవలె. రాక్షసుడు చస్తాడు.''

ఒకరోజు శేషాద్రి స్వామి సూర్యుని చూస్తూ నిలుచున్నారట. అపుడు నారాయణశాస్త్రులు వెళ్ళి నమస్కరించారు. స్వామి నారాయణశాస్త్రులను చూచి పై విధంగా అన్నారు. కామవాసనలు పోవలెనంటే ఆదిత్య హృదయం పారాయణ చేయవలె. (అనుబంధము చూడండి) కోపమనే పదానికి స్వామివారి భాష 'రాక్షసుడు' రాక్షసుడు చావడమంటే కామక్రోధములు నాశనముకావటము. జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు - పదితలలు రావణాసురుడు. ఈ పదితలల రాక్షసుడు చావడానికి ఆదిత్యహృదయ పారాయణ. ఆదిత్య హృదయ పారాయణ చేసి యేకదా రాముడు దశగ్రీవుని సంహారం చేసినాడు.

'సుందరకాండ చదువు, జ్ఞానం కల్గుతుంది.'

'పరిత్యక్త సర్వాశామపి ఉపగత దక్షిణాసం.'

ఈ విద్యను మీరు చక్కగా అభ్యసించాలి.''

ఈ వాక్యం రామాయణ చంపువులోనిది. అగస్త్య మహర్షి అన్ని దిశలనూ వదలి దక్షిణదిశకు వచ్చి చేరినారట. ఇదొక అర్థం. అగస్త్యులవారు అన్ని ఆశలను వదలుకొన్నారు. కాని దక్షినాశను (దక్షిణతీసుకోవటం) మాత్రం వదలుకోలేదట. ఇదొక చమత్కారపు శ్లేష. ఈ శ్లోకార్థం చెప్పడంలో 'నీకు ఆశలు ఉండరాదు. జానెడు పొట్టకోసం అక్కడా ఇక్కడా పరుగెత్తి సంపాదించడ మెందుకు? దొరికిన దానితో సంతోషించు' అని బోధ. 'నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం' అని శంకరులు భజగోవిందం శ్లోకములలో బోధించినారు.

''రాముడు సర్వవ్యాపి. అందుచేత రామనామం ఎప్పుడు స్మరిస్తూ వుండవలె.''

రామనామం చాలమందికి ఉపదేశించి ఉన్నారు. కలియుగములో రామనామం మించినది ఏదీ లేదు. కాలదేశ, నియమములు లేక సదా జపించుటకు వీలైన మంత్రం అదే. ఒక వారము రోజులు ఇలయనార్‌ కోవిలలో పడుకోమని స్వామి నారాయణశాస్త్రులతో అన్నారు. అట్లే శాస్త్రులు తన శిరస్సు స్వామిచరణములపై ఉంచి రోజూ నిద్రపోయేవారు. మూడవరోజు నారాయణశాస్త్రులకు ఒక కలవచ్చింది. అరటి తోటలో శాస్త్రి ఉండగా స్వామి ఒక అరటిగెల తెచ్చి ఇచ్చి, ఈ కాయలు ఇంకా పండలేదు. అని అన్నారట. గెలలో కొన్ని కాయలు పండి కొన్ని పండక వున్నవి. 'రామ రామ' అని చెప్పుతూ వుంటే జోరుగా పోవచ్చును అని అన్నారు. 'నీకు కాషాయములు ఇంకా పక్వము కాలేదు. దానికీ రామనామమే ముందని' స్వాప్నిక సందేశమువలె నున్నది.

ఇట్లే ఆరవరోజు మరొక కలవచ్చింది. ఒక చెట్టు క్రింద శాస్త్రికూరుచుని రామనామం చేస్తూ ఉండగా స్వామి ఒక పెద్ద కత్తి నెత్తుకొని వెనుక నుండి శాస్త్రులను చంపుటకు వచ్చిరట. ఆయన లేవకుండానే తన తలను మాత్రం స్వామి చేతిలో చిక్కనీయక అటూ ఇటూ తిప్పి చేతులతో స్వామియొక్క హత్యాకాండను ప్రతిఘటిస్తూ ఉండినారు. కొంతసేపయిన పిదప కత్తిని పారవేసి 'నీవేమిజపం చేస్తున్నావు? నీకు దేహస్మరణ ఉండవచ్చునా? దేహం మరచిపోవలె' అని చెప్పి అదృశ్యమైరి.

ఉదయము తనకలను స్మరించి శాస్త్రి తనకు ఇంకా పరపక్వత కలుగలేదెయని విచారపడగా 'ఈశ్వరుడున్నాడు. భయమెందులకు?' అని అన్నారు.

ఒకడు కత్తి నెత్తుకొని తన్ను చంపుటకు వచ్చినా దేహముపై ధ్యానవదలి నిర్భయంగా ఉన్నపుడే దేహాత్మక బుద్ధి పోయినదని అర్థం.

వారము దినములలో అక్కడ పడుకొనిన పిదప స్వామి ఇంక నీవు ఇక్కడ పడుకోవద్దు. పోయి వీథిలో పడుకో అని శాస్త్రులతో చెప్పినారట. శాస్త్రి అట్లే తాను పారాయణ చేసే భాగవతము స్వామివద్ద ఉంచి బయటకు వెళ్లి పడుకొన్నాడు. ఆ భాగవతంలో ఒక చిన్న కాగితంలో శాస్త్రి ఒక శ్లోకం వ్రాసి పెట్టుకొన్నాడు. తెల్లవారి లేచి చూస్తే ఆ కాగితం ముక్కలు ముక్కలు గా చించబడి యధాస్థానములో ఉన్నది.

సన్నిందా సతినామ వైభవకథా శ్రీశేశయో ర్భేదధీః

అశ్రద్ధా శ్రుతిశాస్త్ర దేశికగిరాం నామ్న్యర్థవాదీభ్రమః

నామా స్తీతి నిషిద్ధవస్తునిహిత త్యాగౌచ ధర్మాంతరైః

సామ్యం నామని శంకరస్య సహరే ర్నామాపరాధాదశ.

బోధేంద్ర సరస్వతులు వ్రాసిన పదినామపరాధము లను గూర్చి చేప్పే శ్లోకం. నామాపరాధములు పది ఈ క్రిందివి.

1. సాధునింద, 2. దుష్టులకు విముఖులకు నామప్రాశ స్త్యముగూర్చి చెప్పుట, 3. శివకేశవులయందు భేదబుద్ధి, 4. శ్రుతులలో నమ్మకము లేకుండుట, 5. వేదములలో నమ్మకము లేకుండుట, 6. గురునింద, 7. భగవన్నామమునందు అర్ధవాదకల్పన, 8. నామమున్న దని నిషిద్ధకార్యాచరణ, 9. స్వధర్మత్యాగము, 10. ఈశ్వర నామసంకీర్తన. ఇతర పురుషార్దములతో సమమని భావించుట.

బోధేంద్రులు మోక్షప్రాప్తికి నామకీర్తనమే సాధన మనీ, దానికి కట్టుబాట్లు అవసరమనీ భావించియుండవచ్చును. స్వామి ఆ కాగితమును చించివేసి నందువల్ల ఇన్ని కట్టుబాట్లు ఉండరాదనీ, ఎప్పుడూ రామనామజపం చేయవచ్చుననీ, దానికి ఏకాగ్రత మాత్రం అవసరమనీ తక్కినవి అనవసరమనీ అభిప్రాయపడినట్లు న్నది.

'సత్కర్మలు చేస్తూ రావాలి'.

అపదా మపహర్తారం దాతారం సర్వసంపదా !

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం ||

ఒక రోజు నారాయణశాస్త్రుల జందెము తీసి తన మెడలో వేసుకొని ఐదునిముషముల కాలము నవ్వుచూ తర్వాత జందెమును మరలశాస్త్రుల మెడలో వేసి మీరు ప్రాతఃకాలములో సన్యాసం తీసుకొంటారా యని అడిగిరట. అందులకు శాస్త్రి సన్యాసము తీసుకొనుటకు తగిన వైరాగ్యము లేదా అని స్వామీ! అని బదులిచ్చారట. 'సత్కర్మలు చేస్తూ రావాలి' అని స్వామి అనగా శాస్త్రి 'సత్కర్మ అనగా ఏమి' అని మరల ప్రశ్నించిరి. స్వామి 'అపదా మపహర్తారం' అన్న శ్లోకం చదివి 'సత్కర్శ' అనగా అదే అని చెప్పి వెళ్ళి పోయారట. అనగా రామనామ స్మరణ ఆపదలను తొలగించి ఐహిక వాంఛ పూర్తి చేయుట కాక ఆముష్మికం కూడ ఇవ్వగలదని తాత్పర్యం.

''పాప మెట్లు తొలగును? భారతమును కొని ఇచ్చెదను

శ##నైః శ##నైః అపూజయత్‌''

వ్యాసులు చాల గొప్పవారు. గొప్పవారంటే ఇంతా అంత కాదు. చాల గొప్ప. చాల గొప్పవారు. అని స్వామిపలికి పై వాక్యములను వరుసగా చెప్పినారు. పాపము తొలగవలెనంటే భారతము చదువవలెను. భారతము చాలపెద్దది కనుక మధ్యలో ఆపక కొంచెము కొంచెముగా చదివి ముగించవలెను. అని స్వామి బోధన. స్వామి భారతమునుకొని ఇచ్చెదను అని చెప్పిన దానికి ప్రతిఫలముగా శాస్త్రుల స్నేహితుడు సేలము వాస్తవ్యుడు భారతము పదునెనిమిది పర్వములనూ కొని శాస్త్రికి బహూకరించెను.

''కావేరీ విరజాతో యమ్‌ వైకుంఠం రంగమందిరం

పరవాసుదేవో రంగేశః ప్రత్యక్ష పరమం పదం''

నారాయణశాస్త్రులు శ్రీరంగం వెళ్ళి రంగనాథుని సేవించి తులసి, కుంకుమ ప్రసాదములతో స్వామివద్దకు రాగా పై శ్లోకం చదివారు. కావేరీలో స్నానం చేస్తే పాపనాశం. రంగనాథుని దర్శనం మోక్షదాయకం. చిదంబరమూ అంతే. మీరు రంగని చూచితిరా?' అని అడిగిరి. స్వామి దివ్యదృష్టికి ఆశ్చర్యపడి ప్రసాదములను శాస్త్రి స్వామికిచ్చారు. దీనివలన శ్రీరంగమూ, చిదంబరమూ ముక్తిక్షేత్రము లని వ్యక్తమౌతుంది.

''మాదృశానా మానాధానాం కా గతిః పురుషోత్మ?

అహం సన్యాసివేషణ బోధయామి ధనంజయ''

స్వామి ఒకప్పుడు సాధుసత్రంలో ఉన్నారు. అపుడు ఈ విచిత్రమైన శ్లోకం చదివినారు. కృష్ణా! నావలె దిక్కులేని వారికి గతి ఏమి? అని అర్జునుడు అడుగగా కృష్ణుడు అర్జునా! నేను సన్యాసి వేషంలో జ్ఞానోపదేశం చేస్తున్నాను అని బదులిచ్చినాడట. ఇచ్చట కృష్ణుడు స్వామియూ, శాస్త్రి ధనం జయుడున్నూ, ఈ విధంగా స్వామి చమత్కారంగా సంభావించారు.

'కాశికి తర్వాత మీరుపోవచ్చును. రామేశ్వరానికీ మీరు తప్పక ఇప్పుడే వెళ్ళండి. రామేశ్వరయాత్ర చేస్తే బ్రహ్మత్యాపాతకం కూడ తొలగుతుంది.'

నారాయణశాస్త్రులు స్వామితో ఇట్లా అన్నారు. 'మిమ్ములను ఒకమారు దర్శించి వెళ్ళితే మనస్సు సాత్వికంగా ఉంటుంది. అటుపైన యథాప్రకారం దాని త్రోవ అదిపోతుంది. ఈ మనస్సు అణిగే విధానం ఏది?' అని అడిగారు. స్వామి అప్పటికి ఊరకుండి అటుతర్వాత పై చెప్పిన ఆదేశం ఇచ్చినారు. అయ్యో చేతిలో డబ్బు లేదే యాత్ర ఎట్లా చేయడం అని శాస్త్రి మనసులో అనుకొన్న వెంటనే 'డబ్బు దొరుకుతుంది. యాత్ర చేయండి' అని స్వామి అన్నారు. ఇంతలో ఒకరు ఒక విభూతి పొట్లమును తెచ్చి స్వామివద్ద ప్రసాదముగ తీసుకొందామని అనుకొన్నారు. స్వామి ఆపొట్లము విప్పి, విభూతినంతా తన తలకూ దేహమునకు పూసుకొని క్రిందపడిన విభూతిని నారాయణశాస్త్రుల ఒంటినిండుగా పూసినారు. పొట్లము తెచ్చిన వాడు ప్రసాదము ఏదీతనకు మిగులలేదే యని క్రిందపడిన విభూతిని కొంచెం ఎత్తుకొనిపోగా 'ఛీ, అవతలకు పో' అని గద్దించినారు. అతడు చేయునది లేక క్రింద ఉండగా పారవేసిన పొట్లము కాగితమును తీసుకొనపోగా 'ఒరేయ్‌. దానిని తాకవద్దు. తాకితే పాము కరుస్తుంది అని బెదిరించారు. వాడు నిరాశతో వెళ్ళిపోయాడు. శాస్త్రితో 'నీవు రామేశ్వరం వెళ్ళవచ్చును' అని అనుజ్ఞ ఇచ్చారు. శాస్త్రి తిరుచునాపల్లి చేరుకొన్నాడు. అక్కడ డి.ఇ.ఒ. ఉద్యోగం చేసి విరమించిన నటేశయ్యరును చూడటం తటస్థించింది. అయ్యరు బాగా చదువుకొన్నవాడు. సత్సంగి, పరోపకారి. శాస్త్రికి అయ్యరుతో పరిచయంకద్దు. అయ్యరు శాస్త్రిని ఇంటికి తీసుకొని పోయి సత్కరించి ఏమితోచినదో ఏమో నూరు రూపాయలు ఇచ్చి పంపినారు. శాస్త్రి ఇది గురువనుగ్రహమే అని సంతోషించి రామేశ్వరయాత్ర పూర్తిచేసుకొన్నాడు. యాత్రానంతరం శాస్త్రికి మనశ్శాంతి యేర్పడినది. చిత్తశాంతికి క్షేత్రాటనం, తీర్థ సేవ ఉపకారులని స్వామి బోధిస్తున్నట్లు తేలుతుంది.

''ఒక సన్యాసి నారాయణ నారాయణ అని చెప్పుకొంటూ ఉండినాడు. అంతకంటే వేరు ఏంకావాలి.''

విష్ణుసహస్రనామా 'అర్తావిషణ్ణా శ్శిధిలాశ్చ భీతాఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః -- సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్సుఖినో భవంతి.' అని నారాయణస్మరణ పాటవం తెలుపుతున్నది. నారాయణస్మరణ అందరికీ అవసరమనీ వ్యాధులను పోగొట్టే మంత్రమదేననీ స్వామి ఒకప్పుడు సెలవిచ్చారు.

జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిం|

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే||

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః||

మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యవాసం

వర్షిష్ఠాంతే వసదృషిగణౖ రావృతం బ్రహ్మనిష్ఠై |

ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం

స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

మందస్మితం స్ఫురితముగ్ధ ముఖారవిందం

కందర్పకోటి శతసుందర దివ్యమూర్తిం |

అతామ్రకోమల జటాఘటితేందురేఖం

అలోకయే వటతటీనిలయం దయాళుం ||

పై నాలుగుశ్లోకములు ప్రతిదినమూ చదివి గురువును అనుసంధించాలని స్వామి ఒకరికి బోధించినారు.

'అనన్యా శ్చింతయంతో మా యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాబియుక్తానాం యోగక్షేమం వహామ్యహం'

పై చెప్పిన గీతాశ్లోకం ఎవరెవరు అనుదినం గురువందనం చేసి అనన్య శరణంగా గురువునే నమ్ముకొని తనభారం అంతా గురువుపై వేసి నిత్యయుక్తులై నిశ్చింతతో ఉంటారో వారి యోగక్షేమములు ఆగురువే వహిస్తాడని స్వామి ఒక భక్తునికి హామీ నిచ్చినారు.

''శ్రీరంగనాధుని సేవించినామోక్షం; హరికథ చెప్పినా మోక్షం' మీకు నేను పంచాంగం ఇస్తే తీసుకొంటారా?''

ఇవన్నీ నారాయణశాస్త్రులను చూచి చెప్పిన మాటలు. పంచాంగ మనగా తిథీవారనక్షత్రయోగకరణములను తెల్పు పుస్తకముకాదు. శ్రీగోపాలతాపినీ ఉపనిషత్తులోని అష్టదశాక్షరియు, పంచపాదియు అగు శ్రీకృష్ణమంత్రమును పంచాంగ మని సంకేతంగా స్వామి వ్యవహరించారు.

'రాఘవత్వే అభవత్సీతా రుక్మిణీ కృష్ణజన్మని |

అన్యేషు సావతారేషు విష్ణో రేషా నపాయినీ.'

ఒకమారు నారాయణశాస్త్రులు అమ్మవారి ఆలయానికి వెళ్లి కుంకుమ ప్రసాదం తెచ్చుకోగా దానిని శాస్త్రులనుదుట విభూతివలె పూసి పై శ్లోకం చదివారు. శివశక్తులు ఎట్లు ఒకరి నొకరు వదలకు వాగర్ధములవలె, ఏకవపుషులై ఉంటారో అట్లే విభూతి కుంకుమలను భేదభావంలేక విభూతివలె పూసుకొనవలె నని స్వామి అభిప్రాయం.

''మీరు కౌముదిని చదివినారా? నేను కోటి కౌముదులను చదివినాను.''

ఒకమారు స్వామి శాస్త్రిని 'మీరు కౌముదిని చదివినారా? అని ప్రశ్నించారు. 'ఆ చదివినాను.' అని శాస్త్రి బదులు చెప్పగా, 'ఎట్లా చదివారు?' అని స్వామి తిరిగి ప్రశ్నించారు. ఆ ఇ ఉణ్‌ - హల్‌. ఇతిమహేశ్వరాణి సూత్రాణ్యణాది సంజ్ఞార్థని. అని శాస్త్రి చెప్పగా, స్వామి 'కాదు కాదు దానికి లెక్కా పక్కా లేదు. అబ్బ అబ్బ ' అని తల ఆడించినారు. కౌముది అంటే వెన్నెల అని ఒక అర్థం. వ్యాకరణ శాస్త్రానికీ కౌముది అని పేరు. నారాయణశాస్త్రి వ్యాకరణం అనే అర్థం తీసుకోగా స్వామి బ్రహ్మానుభవ మనే వెన్నెల అనే అర్థం తీసుకొన్నారు, శాస్త్రి 'మీబ్రహ్మానుభూతి నా కెట్లు వస్తుంది?'' అని అడుగగా, స్వామి;

'పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం,

ధర్మ సంస్థానార్ధాయ సంభవామి యుగే యుగే.'

అని బదులిచ్చారు. యుగయుగములలోను ధర్మసంస్థాపనార్థము దుష్టవినాశము కొరకు స్వామి అవతరిస్తూ ఉంటాడు. అట్లే ఋషుల రూపంలోనూ, జ్ఞానుల రూపంలోను భగవంతుడు దక్షిణామూర్తియై అవతరించి జ్ఞానకౌముదిని ఇచ్చి అనుగ్రహిస్తూ ఉంటారని స్వామి భావం ఐ ఉంటుంది.

''మీరు ఏ దారిలో పోవడమా అని ఇంకా నిర్ణయించలేదా? కామాక్షి మీనాక్షి విశాలాక్షి అందరూ ఒక్కటే. వాళ్ళను నమ్ముకుంటే మోక్షం ఇస్తారు.''

మోక్షప్రాప్తికి యాగయాగాది మార్గాలు అనుష్ఠించడం కష్టం. శంకరులవారు 'మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి' అని అన్నారు. అన్ని మార్గాలలోను భక్తి మార్గం సులభం. అందులోనూ అమ్మవారి పూజ చాల సులభం. తండ్రికంటే తల్లికి పిల్లలంటే ప్రేమ. కామాక్షీ విశాలాక్షీ అని పేర్లు పెట్టుకొన్న సర్వస్వరూపి, సర్వేశి, సర్వ శక్తి సమన్విత యైన జగన్మాత ప్రాపకంపొందాలి. భక్తునికి ఏమూర్తిపై మనస్సు సులభంగా లగ్నమౌతుందో ఆ మూర్తిని ధ్యానించ వలసినదని స్వామి అభిప్రాయం.

'శ్రీకృష్ణ కర్ణామృతం - లలితాసహస్రనామం శివసహస్రనామం - ఈమూడూ తప్పిస్తే వేరే లోకం ఎక్కడ?'

స్వామి తన జీవితంలో మొదట కృష్ణవిగ్రహం పెట్టుకొని పూజచేసేవారు. తర్వాత వారికి బాలామంత్రదీక్ష, దానితోబాటు శివానుసంధానం ఏర్పడినది. ఈ రత్నత్రయాన్ని వారు సాధించినారు. తన్ను అనుసరించేవారు అదేవిధంగా చేసి బాగుపడవలెనని స్వామిబోధ.

''మనమంతా ఒకరోజు పోవలసిన వాళ్ళమే కదా!''

ఎచ్చమ్మకు పుత్రికావియోగం కల్గింది. అపుడు స్వామి ఈ మాట అన్నారు. జీవితంలో అనుదినమూ మృత్యుదర్శనం చేస్తున్నా, ఈ లోకం శాశ్వతమన్న అభిప్రాయం మనలను వీడటం లేదు. 'కాలోహి పరమేశ్వరః' ఏ చోటునుంచి వచ్చామో, ఆ చోటుకు మనం ఎన్నడైన ఒకరోజు పోవలసినదే.

'మీరు పెళ్ళి చేసుకో పోతారా?'

స్వామి పరబ్రహ్మానందయోగీంద్ర సరస్వతీస్వామిని చూచి పైవిధంగా అడిగారట. మీరు చెప్పునది నాకేమీ అర్థం కావటం లేదు అని యోగీంద్రులు అనగా స్వామి అహంకార మమకారములను వదలి పెట్టటమే పెళ్ళి. అదే కల్యాణం. ఇంద్రియనిగ్రహమే శోభనం - అని అన్నారట.

'మనకు ఒక్క వస్తువూ సొంతం లేదు.'

శివప్రకాశం మొదలి కూతురు చనిపోయినపుడు అతనికి ఉపశమనంగా స్వామి పై విధంగా ఓదార్చినారు.

''రాక్షసుడు చచ్చిపోయాడా?''

స్వామి పరిభాషలో రాక్షసుడు అంటే కోపం. కోపిష్ఠులను చూచినపుడు అంతా రాక్షసుడు చచ్చిపోయాడా అని అడిగే వారు. చిత్తవృత్తినిరోధం కావాలని కోరేవారు కోపం అణచుకోవాలని భావం.

'చిగిర్చినపుడంతా ఛేదిస్తూ రావాలి,'

అరుణాచలంలో తంబిరా& అనే వానికి కొంచెం స్త్రీ వ్యామోహం ఉండేది. ఒకరోజు ఆలయంలో దేవదాసి నృత్యం చేస్తుంటే తంబిరా& ఆదాసినే గమనిస్తూ వచ్చినాడు. మరుసటి రోజు అతడు స్వామిని చూచుటకు రాగా చిగిర్చినపుడంతా ఛేదిస్తూ రావాలి అని నాలుగు గులకరాళ్ళనేరి వానిపై రువ్వి తరిమివేశారు. సాధుసాంగత్యంచేత క్రమేణ తంచిరాసుకు స్త్రీ వ్యసనం తగ్గి సన్మార్గంలో పడ్డాడు.

''రావణుడు చస్తే కానీ తలలు మొలవవు.'

ఇది భార్గవరాముడనే శిష్యుణ్ణి చూచి చెప్పినది. ఇతనికి కొంచెం ఇంద్రియలౌక్యం ఉండేది. రావణుడు అనగా కామం రావణుడు చావటం అంటే కామాన్ని జయించటం. రావణుని పదితలలు దశేంద్రియాలు. రావణుడు చస్తే కాని కామంపోదు. ఇంద్రియజయం సాధ్యం కాదు. దేహధ్యాస చేతనే కామం కలుగుతున్నది. కామనాశనానికి, ఇంద్రియ విజయానికీ అద్వైతదృష్టి అవసరమని స్వామి బోధన.

సత్యం శాంతం సమనం ఇవే మనపరిజనం. మన పరివారం. మన సొంతబంధువులు. ఇవే మన సొంత బంధువులు.''

ముముక్షువులకు పై చెప్పిన గుణములు చాల ముఖ్యం. 'సత్యంవద' అని తైత్తరీయము ఆదేశిస్తున్నది. భూతహితమై నదే సత్యం. సాధనపంచకములో ఆచార్యులు 'శాంత్యాదిః పరిచీయతాం' అని సాధకులు సాధించవలసిన గుణాలలో శాంతం ఒకటి అని పేర్కొన్నారు. సహనం అంటే ద్వంద్వా తీతంగా ఉండటం సమచిత్తత్వమే సహనం. ఔరసులు అనుజులు ఎట్లా బంధువులో ఆత్మానుసంధానం చేసేవారికి పై గుణములు సొంత బంధువులు.

''అంతా ఒకటే కదా:''

స్వామికోసం ఎవరో ఒక లోటా పాలు తెచ్చి ఇస్తే దానిలో సగం పిల్లిత్రాగింది. ఆ మిగిలిన పాలు స్వామి త్రాగబోగా, అక్కడ ఉన్న వారు వారించారు. అపుడు స్వామి 'అంతా ఒకటే కదా?' అని అన్నారు. ఈ సన్నివేశం స్వామి సమదర్శిత్వమును. విధినిషేధములందు వారు ఎట్లు అతీతంగా ఉండినారో తెలుపుతుంది.

''ఏదిమంచి? ఏది చెడుపు?''

ఒకమారు ఒక ఇంటిముందు ఎంగిలి విస్తళ్లు ఎవరో వేయగా స్వామి కుక్కలతో బాటు తానూ ఆఉచ్ఛిష్టం అసహ్యం లేక తినడం చూచి గృహయజమాని 'స్వామీ! ఆ ఎంగిలికూడెందుకు? లోన మృష్టాన్నమున్నది రండి.' అని అన్నారట. అతడు ఎంత బలవంత పఱచినా స్వామి ఎంగిలి కూడు తినటం మానలేదు. ఏదిమంచి; ఏది చెడ్డ? అని ప్రశ్నించారు. స్వామి నిత్యశుద్ధులు కనుక లౌకిక దృష్టిలో హేయమైన కర్మలు అయనను ఏవియు అంటవు.

''ఈగవలె శుద్ధం, చీమవలె బలం, కుక్కవలె విశ్వాసం, రతీదేవివలె ప్రేమ, ఎవనికుంటుందో వానికి గురుభక్తి సులభం.''

ఈగ అమేధ్యవస్తువులపై వ్రాలినా దానికి పరిశుభ్రత జాస్తి. చీమ ఉదయాస్తమానము ఏదో పనివదలక చేస్తూ ఉంటుంది. నాలుగు మెతుకులు వేస్తే కుక్క ఆజన్మాంతము యజమాని యింటిని కావలి కాస్తూ ఉంటుంది. రతీదేవికి పాతివ్రత్య మెక్కువ. ఇట్లు మనోవాక్కాయకర్మలు గురువుకు అర్పించిన వానికే గురులాభం కల్గుతుంది. ఆధ్యాత్మిక పరిణామం గురుభక్తి లేనిదే రాదు.

'వేగిన గింజ మొలవదు'

కర్మలు ఈశ్వరార్పణబుద్ధితో చేస్తే బంధమోచకం. అట్లుకాక నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావంతో చేస్తే అది బంధకారకం. అంటే కర్మఫలాన్ని ఈశ్వరునికి అర్పిస్తే కర్మసంగమంలో మనుష్యుడు చిక్కుకోడు. కార్యాన్ని యజ్ఞార్థంగా చేయడమే వేగిన గింజ వేగినగింజలు మొలకెత్త నట్లు ఈశ్వరునికి ప్రీతిగా చేసినకర్మలు బంధకారకములు కావని అభిప్రాయం.

''ధ్యానం చేయడం అంటే ఇది''

ఒకరోజు స్వామి ఎచ్చమ్మ ఇంటికి వెళ్ళినారు. ఎచ్చమ్మ సాత్త్విక స్వభావ. రమణభక్తురాలు. 'ఎచ్చమ్మా! ఏమి చేస్తున్నావు?' అని అడిగారు. మీ పటమును రమణుల పటమును పూజిస్తున్నాను అని అన్నారు. 'ధ్యానాభ్యాసం చేయరాదా?' అని అడిగారు. 'ధ్యానం చేయడమెట్లా?' అని ఎచ్చమ్మ తిరుగు ప్రశ్నవేసింది. స్వామి వెంటనే పద్మాసనస్థుల కనులుమూసుకొని నాలుగు గంటలసేపు అలాగే కూర్చుని పోయారు. అటుపై కండ్లుతెరచి 'ధ్యాన చేయడం అంటే ఇది' అని వెళ్లిపోయారు.

''పనసపండు తొనవలె ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి.'

పనసపండుతొన బీజము ఆవరించి ఉంటుంది. ఈశ్వరుడే జగత్తుకు బీజము. ఆ బీజములో నుంచి పుట్టిన జగత్తు ఈశ్వరుణ్ణి ఆచ్చారించుకొని ఉన్నది. పనసపండు తొనలోని బీజముకూడా పంచకోశాంతరస్థితుడైన జీవునివలె - ఈశ్వరుని వలె ఉంటున్నది. ఈశ్వరుని ధ్యానం చేయవలెనంటే పనసపండు తొనలోనుంచి బీజమును వెలికి దీసినట్లు పంచకోశ నిరాకారణ చేసి ఆత్మానుసంధానం చేయవలెనని భావం.

''ఆత్మబోధోపనిషత్తు నూరుసార్లు చదవవలెను. నారాయణ నారాయణ అని చెప్పుకొంటూ ఋషులు మోక్షం పొందినారు''.

ఆత్మబోధోపనిషత్తు ఓంకారప్రశస్తిని అష్టాక్షరిమహిమను వర్ణించింది. దానిని అనుష్ఠిస్తే హృదయేశుడైన వాసుదేవుని దర్శనము చేయవచ్చుననీ, ఆసాక్షాత్కారం చేతన ఋషులు ముక్తి పొందిరనీ, మీరున్నూ ఋషులు నిర్దేశించిన మార్గాన్ని అనుసరించాలనీ స్వామి బోధ.

''కామాక్షి దర్శనం చేశావా? కామకోటి పీఠం చూశావా? కామాక్షి మోక్షాన్నిచ్చే తల్లి.''

ఎచ్చమ్మ కంచికి పోయి తిరిగిరాగా పై విధంగా స్వామి చెప్పారు. పీఠమనగా శ్రీచక్రం. కామాక్షిని ఉపాసిస్తే ఆమె మోక్ష మిస్తుందని స్వామిబోధ.

ఆత్మాత్వం గిరిజామతిః పరిజనాః ప్రాణాః శరీరంగృహం

పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి,

సంచారః పదమోః ప్రదక్షణవిధి స్తోత్రాణి సర్వాగిరిః

యద్య త్కర్మ కరోమితత్త దఖిలం శంభో తవారాధనం.

ఏకాకార సమస్తలోక జనకం హేమాద్రి బాణాసనం

నాగావాస కరీటకుండలధరం నాగేంద్ర భూషోజ్జ్వలం,

రాకాచంద్ర సమానకాంతి వదనం రాజీవనేత్రార్చితం

శోకారణ్యదవానలం శుభకరం శోణాద్రినాథం భ##జే.

''అరుణాచలేశ్వరుని సర్వదా సేవిస్తూ, విశేషించి మంగళవారం గిరిప్రదక్షిణం చేయి. భక్తి వృద్ధిఔతుంది.''

''ఈకంబ త్తిలయనారును ప్రదక్షణం చేయి. కోపాన్ని వదలిపెట్టు. దుష్టులతో చేరవద్దు.''

'గుహుడు పడవను నడిపినాడు. రాముడు గుహుని ఆలింగనం చేసుకొన్నాడు. గుహుడు గంగలోపడి చనిపోయాడు.'

వెంకట్రామయ్యరును, గుహునిశీలముపై ఉపన్యాస మిమ్మని పురజనులు కోరారు. ఆయన ఒప్పుకొని బయలుదేరినాడు. త్రోవలో స్వామి కనపడి 'ఎక్కడకు ప్రయాణం?' అని అడిగారు. వెంకట్రామయ్యరు - 'ఉపన్యాసం ఇమ్మన్నారు. ఏమిమాట్లాడవలెనో తోచటం లేదు.' అని అనగా స్వామి పై వాక్యములను చెప్పి పోయిరమ్మన్నారు.

గుహుడు పడవను నడపటం కర్మయెగం. తమ తమ కర్మలను చక్కగా అనుష్ఠించడం. రాముడు గుహుని ఆలింగనం చేసుకోవటం భక్తి యోగం. 'స్వకర్మణా తమభ్యర్చ' కర్మలను చక్కగా అనుష్ఠించిన వానిపై భగవంతునికి అనుగ్రహం కలుగుతుంది. గుహుడు గంగలో పడి చనిపోవడం దేహధ్యాసను మరచిపోవడం. అది జ్ఞానయోగం. ఇట్లు మూడు యోగాలు గుహుని శీలములో ఉన్నవని స్వామి సూచించారు. ఈ మూడు యోగములూ పరస్పర విరుద్ధములు కావని స్వామిబోధ.

''ఓం శివ శివ. ఓం రామ రామ.''

శివప్రకాశ మొదలిని చూచి స్వామి ఒకరోజు, నీకు బలాతిబల విద్య బోధిస్తాను నేర్చుకో అని పై మంత్రం ఉపదేశించారు. బలాతిబలమంత్రం, రామునికి విశ్వామిత్రుడు ఉపదేశించినట్లు రామాయణములో ఉన్నది. ఆమంత్రము గాయత్రీ మంత్రముతో చేరిన నూరక్షరములరహస్య మంత్రము. సావిత్రీ ఉపనిషత్తులో చెప్పబడినది. దానిని శతాక్షరి అని కూడా అంటారు. ఋషి ఛందస్సు, దేవత- మెదలైనవి. ఈ ఉపరనిషత్తులలోనే చెప్పబడినవి. కాని మొదలికి ఈశతాక్షరిని ఉపదేశించక, స్వామి పై విధంగా ఉపదేశించారు. గురుముఖంగా వచ్చిన విద్య ఏదియైనను బలాతి బలవద్యయే.

జ్ఞానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోఃపదం|

మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా||

గురువాక్యం ఏదైనప్పటికి మంత్రమే.

''అపసర్ప సర్ప భద్రంతే దూరం గచ్ఛ మహాయశాః,

జ,మేజయస్య యజ్ఞాంతే ఆస్తీక వచనం స్మర.''

ఇది పాముమంత్రం. స్వామి సీతారామయ్యకు దీనిని ఉపదేశించి ఉదయాస్తమానం నూరుమారులు జపిస్తే పాములు కానీ, తేళ్ళు కానీ రావు. వానివలన భయమూ ఉండదు- అని అన్నారు.

''ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఒక పెద్ద ఓడ, ఓడలో ఐదుమంది ప్రయాణం చేస్తున్నారు. ఓడనావికుడు మరొకడు. జాగ్రత్తగా మారి ఓడను నడపవలె''

వేలూరు సుందరమ్మ ఆజపామంత్రం అంటే ఏమి? అని అడుగగా స్వామి పై విధంగా జవాబు చెప్పినారు.

ఆజపామంత్రం స్వయంగా ఎప్పుడూ ఉచ్ఛ్వస నిశ్వాస రూపంగా జరిగే 'సో7హం' అనే మంత్రం. రోజుకు మనిషి 21600 మార్లు శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతూ ఉంటుంది. అహంసః, సోహం. అనేవి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కలసి ఉంటుంది. 'నేనే అతడు, అతడే నేను.' అని ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రం అందరి దేహాలలోను శ్వాసప్రక్రియగా నడుస్తూ ఉంటుంది, దీనిని గమనించక ప్రాణికోటి గతానుగతికంగా ఉంటూ ఉన్నది. దీనిని గమనించి ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనూ మంత్రార్థమును జోడు చేసి మనస్సు నిల్పిన వానికి సిద్ధి. అపుడు మనం నాదస్వరూపంగా ఉన్న పరమాత్మతో ఐక్యం కాగలం. అదే సిద్ధి. అదే ఆత్మజ్ఞాన మని హంసోపనిషత్తు తెలుపుచున్నది.

పెద్దసముద్రం అనగా చావు, పుట్టుకలనే జననమరణ సముద్రం. పాంచభౌతిక శరీరమే నావ లేక ఓడ. ఇంద్రియము అను అధిష్టించిన దేవతలే ఐదుగురు ప్రయాణికులు. తాదా త్మ్యక అధ్యాసతో ప్రతివిషయములోను అభినివేశ ముంచుకొన్న జీవుడే నావికుడు. జాగ్రత్తగా ఓడను నడపటం నిస్సంగియై దేహభాషను తొలగించుకొని ఆత్మస్వరూపంలో స్థిరం కావటం. అజపా మంత్రతాత్పర్యమును స్వామి సులభరీతిలో పై విధంగా చెప్పినారు.

''భోజనం చేసేటపుడు నాలుక ద్వారా ఎవడు రసాన్ని ఆస్వాదిస్తున్నాడో వానిని తెలుసుకొంటే చాలు.''

ఎచ్చమ్మతో స్వామి ఈ విధంగా అన్నారు. 'భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం.' అని గీత. పరమేశ్వరుడే భోక్త. ఈశ్వరుడే జీవభావంతో రసేంద్రియంద్వారా రసాస్వాదన చేస్తూ ఉంటాడు. వానిని తెలుసుకోవడమే జీవిత పరమార్థం.

''జ్ఞానం అంటే అదేకదా?''

ఒకమారు సూర్యునిచూస్తూ స్వామి, జ్ఞానం అంటే అదేకదా?' అని అన్నారు. ఇందులో ఒక విశేషార్ధం ఉన్నది. ఒక్క సూర్యుడు వివిధ జలాశయాలలో అనేక సూర్యులుగా ప్రతిబింబిస్తుంటాడు. అట్లే సర్వక్షేత్రములలోను భాసిస్తున్నా పరమాత్మ ఏమో ఒక్కడే. ప్రతిబింబ సూర్యుడు బింబహూతుడైన సూర్యునికంటే అన్యంగా కనపడుతాడు. బుద్ధిలో ప్రతిబింబమయ్యే ఆత్మాభాషకూడ ఆత్మకంటే వేరుగా కనపడుతూవుంటుంది. ప్రతిబింబసూర్యుని చంచలత్వాది గుణములు, సూర్యుని కెట్లు చెందవో - చిదాభానుని కర్తృత్వాది గుణములు ఆత్మకు సంక్రమించవు. స్వయంప్రకాశమానుడై సూర్యుడు వస్తువులను ప్రకాశింపచేసినట్లే, ఆత్మ స్థూలవస్తు సముదాయమును ప్రకాశింపచేసి తాను వెలుగొందుతూ వుంటుంది. స్వామి ఈతత్త్వమునే క్లుప్తంగా పై విధంగా చెప్పినారు.

''యముణ్ణి జయించనివాడు ఒక మనుష్యుడా''

ధృతరాష్ట్రుడు సనత్సుజాతమహర్షిని చూచి, మృత్యువనేది లోకంలో ఉన్నదా? అని ప్రశ్నించాడు. అందులకు మహర్షి ''ప్రమాదంవై మృత్యుమహం బ్రవీమి'' అని అన్నారు. ప్రమాదం అంటే బ్రాహ్మీస్థితిలో లేకపోవడం. లేదా ఆత్మ నిరతిలో ఉండక పోవటం. అదే మృత్యువు. జనసమరణ ప్రవాహంలో చిక్కుకొనడం ఈ ప్రమాదం మూలముననే. అట్టి మృత్యువును జయింపనివాడు ఒక మనుష్యుడా? అని స్వామి ప్రశ్న. సాధ్యమైనంతవఱకు ప్రవృత్తినుంచి తప్పుకొని నివృత్తి అనుసరించవలె అని బోధ.

''అతత్త్వ జగతో విస్మృతిః సతు బ్రహ్మణః''

స్వామి ఒకమారు అరుగుమీద ఉన్న రెండు స్తంభముల చుట్టూ చిన్న పిల్లవానివలె గబ గబ చుట్టుతున్నారట. ఒక సంస్కృత విద్వాంసుడు ఇద్దరు స్నేహితులతో కలసి స్వామిని చూడటానికి వెళ్ళినపుడు ఈ చర్య ఆయనకు ఆశ్చర్యం కల్గించింది. ఈయనకు ఏదైన మతిభ్రంశ కలదాయని సందేహముతోచి - 'అపితే విస్మృతిః? అని ప్రశ్నించాడు. అందులకు స్వామి, 'అత త్త్వజగతో విస్మృతిః నతు బ్రహ్మణః' అని బదులు చెప్పారట. విస్మృతి అనగా మరచిపోవడం. విస్మృతి అంటే ఉన్మత్త పిచ్చితనం అని కూడా అర్థం. 'అపితే విస్మృతిః' అన్న ప్రశ్నలో నీకేమైనా చిత్రభ్రమనా? అన్న ధ్వని యున్నది. అందులకు స్వామి లౌకికవిషయంలో విస్మృతి కాని బ్రహ్మవిషయంలోకాదు అని బదులివ్వగా పండితుడు నివ్వెర పోయెనట.

''పోయె దెక్కడ? వచ్చే దెక్కడ? నేను నాచోటులో ఉంటాను. నీవు నీ చోటులో ఉండు.''

సేలం శాంతాశ్రమస్వామికి క్షేత్రాటన అంటే చాల అభిలాష. ఎప్పుడూ, ఒక చోట నిలువక క్షేత్రాటన చేసేవారు. స్వామి ఆయనను చూచి పై విధంగా అన్నారు. క్షేత్రాటన చేయనివారికి చేయ మని బోధ. మితిమీరి చేసే వారికి క్షేత్రాటన సాధనాంగమే కానీ సాధ్యం కాదని బోధ. శంకరులు

''కశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ

వ్యాపినీ జ్ఞానగంగా

భక్తిః శ్రద్ధా గమేయం నిజగురుచరణ

ధ్యానయోగః ప్రయాగః

విశ్వేశోయం తురీయః సకలజనమనః

సాక్షిభూతోంతరాత్మా

దేహే సర్వం మదీయే యది వసతి పున

స్తీర్థమన్య త్కిమస్తి.

అని అన్నారు.

త్రిభువనజనని జ్ఞానగంగయే ప్రవాహం. శరీరమే కాశీ క్షేత్రం. భక్తి శ్రద్ధలే గయ. గురుచరణధ్యానయోగమే ప్రయాగ. తురీయుండైన విశ్వేశ్వరుడే ఆత్మ, సాక్షి. అన్నీ శరీరములోనే యున్నవి. ఇక వేరే తీర్థము లేందుకు?

ఆత్మపూజలో శంకరులు ---

కిం కరోమి క్వ గచ్ఛామి కిం గృహ్ణామి త్యజామికిం|

ఆత్మనా పూరితం సర్వం మహాకల్పాంబునాయధా||

అని వ్రాసినారు. మహాప్రళయంలో ఎక్కడచూచినా బలమే. ఎటుచూచిననూ ఆత్మతో నిండి ఈశావాస్యముగా కనపడుచున్నది. దేనిని గ్రహించడం? దేనిని వదలడం? ఎక్కడకు పోవడం? ఎక్కడకు రావడం? వారి వారి స్వరూపములో ఉండటమే క్షేత్రాటనం అని స్వామి బోధ.

'ఎవరు స్త్రీ?

ఒకపుడు స్వామి ఎచ్చమ్మను, నీవు ఇంటినివదలి హాయిగా గోపురంలో వాసం చేయరాదా? అని అడిగినారట. అందులకు ఎచ్చమ్మ 'నేను స్త్రీనికదా? నాకు అంత పరిపక్వ స్థితిరాలేదు.' అని బదులు చెప్పినది. స్వామి 'ఎవరు స్త్రీ' అని బదులు ప్రశ్న వేశారు. ఎచ్చమ్మ దేహాత్మక బుద్ధిని తొలగించడానికి ఈ ప్రశ్న.

దక్షిణామూర్త్యష్టకంలో --

దేహం ప్రాణమపీంద్రయాణ్యసి చలాం బుద్ధిం చ శూన్యంవిదుః

స్త్రీ బాలాంధ జడోపమా స్త్వహమితి భ్రాంతా భృశంవాదినః

మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహ సంహారిణ

తసై#్మ శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే.

ఈ భావమే చెప్పబడినది. ఈ సందర్భంలో మీరాబాయి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకోతగ్గది.

మీరాబాయి గిరిధరపాలునికి స్వాత్మార్పణ చేసుకొన్నది. అందుచే ఉత్తర మధురనువదలి కృష్ణభగవానుని విలాసాలాకు ఆటపట్టైన బృందావనం వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినపుడు బృందావనంలో వల్లభాచార్యులనే కృష్ణభక్తులున్నారు. వారి దర్శనం చేసుకొందామని మీరాబాయి కబురు పంపినది. ఆయన తాను స్త్రీని చూడనొల్లనని జవాబు చెప్పి పంపారట. అందులకు మీరాబాయి 'ఈ బృందావనంలో ఉన్న పురుషుడు ఒక శ్రీకృష్ణుడే. తక్కిన వారంతా స్త్రీలే. అట్లుకాక మరొకరు తన్ను పురుషుడని భావించుకొనే పక్షంలో అతడు బృందావనమే వదలి వెళ్ళవలసి వస్తుంది' అని తిరుగ జవాబు పంపినదట. దానితో వల్లభాచార్యులు ఆమె మహత్త్వమును గుర్తించారట.

''ఇందులోనూ ఈశ్వరుడున్నాడు. బాగాచూస్తే తెలుస్తుంది.''

ఒకమారు గుడిలో స్వామి ఒక స్తంభం చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. ఎచ్చమ్మ 'స్వామీ ఈ స్తంభానికి ఎందుకు ప్రదక్షణ చేస్తున్నారు?' అని అడిగింది. స్వామి 'ఇందులోనూ ఈశ్వరుడున్నాడు. బాగా చూస్తే తెలుస్తుంది. అని అన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి. ఆయన ఆబ్రహ్మస్తంబ పర్యంతం వ్యాపించి ఉన్నాడని శాస్త్రములు చెప్పుతున్నవి. హిరణ్యకధాపుడు ప్రహ్లాదుని 'ఈ స్తంభములో నీహరి ఉన్నాడా?' అని ప్రశ్నించి స్తంభమును తన్నగానే దానిలోనుంచి హరి ఆవిర్భవించినాడు. సర్వత్ర, విశ్వేశ్వరుని విశ్వరూపసందర్శనం చేయవలెనని స్వామి బోధ.

''శ్రీరాముని చరణకమలములను నమ్ముకొంటే ముక్తి. నీవు ఈ విషయం మరచిపోవుకదా?''

తిరుచి రుక్మిణమ్మ దేవీభక్తురాలు, మూకపంచశతి ఆర్యాశతకంలోంచి పదవశ్లోకమూ, పదునైదవ శ్లోకమూ ఆమె చదివి నమస్కరించగా, స్వామి సజలనయనుడై ఆమెను దగ్గరగా పిలిచి కౌగిలించుకొనిరి. వెంటనే రుక్మిణమ్మ మూర్చపోయినది. స్వామి తనచేతితో ఆమె కనులు తుడువగా, రెండు నిముషములకు స్మృతిని కోల్పొయింది. స్వామి చరణములను తన శిరస్సుతో స్పృశించి నమస్కరించినది. అపుడు స్వామిపై విధంగా అన్నారు.

'జ్ఞానీ త్వాత్మైవ మే మతం' తత్త్వజ్ఞుడు నా ఆత్మ స్వరూపుడే - అని గీత. భగవచ్చరణములకు, గురుపాదములకు భేదము లేదు. గురుపాదములే రామచంద్రుని చరణములు. రాముని పాదములు నమ్ముకొన్నవారికి అనగా గురుభక్తి యుతులకు ముక్తి కరతలామలకం.

''నిరాహారంగా ఉంటే మోక్షం. వైరాగ్యం అహరిస్తే మోక్షం''

నిరాహారమంటే విషమత్యాగం. ఏది లోనికి ఆహరింపబడునో అది ఆహారం. శ్రద్దావిషయానుభవం కూడ ఆహారమే. దానిని వదిలితే మోక్షం. మోక్షం అంటే చిత్త వృత్తి నిరోధమే. అది అభ్యాసంచేతనూ, వైరాగ్యం చేతనూ లభిస్తుంది. అందుకే స్వామి 'వైరాగ్యం అహరిస్తే మోక్షం. అని అన్నారు.

'స వైరాగ్యాత్‌ పరం భాగ్యం న బోధా దపరం సుఖం'

న హరే రపరస్త్రాతా న సంసారా త్పరో రివుః'

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page