Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

5. "Sri Seshadri Swamigal" of Tiruvannamalai

and

The Spirit - Medium కి తెలుగు అనువాదము అని, ఉపనిషత్తు జీవాత్మను గుఱించి తెలియజేయు చున్నది. ఈ జ్ఞానమే ఆత్మ సాక్షాత్కారము. దీనిని పొందుటకు, కర్మ, భక్తి, జ్ఞానము అని మూడుమార్గములు కలవు. సమర్థుడైన గురువునొద్ద గ్రంథములను శ్రద్ధగ చదివినచో దీనినంతను సిద్ధాస్త రూపముగ తెలిసికొనగల మనుటలో సంశయము లేదు. కాని దీనిని నిత్యజీవితములో క్రియారూపమున సమన్వయించుట ఆపరమాత్మతో మహనీయమైన ఐక్యమును అనుభవము లోనికి తెచ్చుకొనుట. బ్రతికియుండగనే శరీరమును దాని క్రియ లను అన్నిటిని మఱచుట, పరమార్థదృష్టియందు, ఈ దృశ్య ప్రపంచమునంతను సశ్వరముగను అసత్తుగను భావించుట, మనసును విషయములనుండి ఉపసంహరించి, నిత్యము పరమాత్మానుసంధానముతో నుండునట్లు చేయుట - ఇవి అన్నియు మాటలతో చెప్పుటకు సులభ##మైన సోపానములే. కాని వీనిని క్రియారూపమును అనుభవములోనికి తెచ్చుకొనుట కష్టము. ఆత్మసాక్షాత్కారమునకు ప్రతిమానవుడును పై మార్గము ననుసరింపవలయునని అనుకొందుము. కాని, అట్లనుసరించినవారిలో ఏ కొందఱో సంసిద్ధిని పొందుదురు. సిద్ధిపొందిన ఈ కొందఱినే జ్ఞానులు, సిద్ధులు, జీవన్ముక్తులు నని యందుము. భారతదేశ మున ప్రతికోటిమానవులలో ఒకడు జీవన్ముక్తుడుగ పుట్టునని అందురు. కాని ఆజీవన్ముక్తులు కోటలలోను, పట్టణములలోను గుంపులు గుంపులుగా మూగరు. తపస్సు చేసుకొనుటకై అడవులలోనికో, ఏకాన్తప్రదేశముకో చేరుదురు. ఈ మహాపురుషులలో కొందఱు మాత్రము మనకు మేలు చేకూర్చుటకు, యా దృచ్ఛికముగ, పట్టణములలో నివసించినారు. అయినను మన కతీతమైన జీవితమును గడపినారు. ప్రజాసామాన్యముతో కలిసి మెలసి తిరిగినను ఆ ప్రజాసంపర్కమువలన వారేమాత్రమును వికారమును పొందలేదు. వారు వారి మనస్సును సర్వ ప్రపంచ మునకును అతీతముగ నుంచిరి. మన వేద శాస్త్రములలో సూచితమైన మార్గమును వారు వాస్తవముగ అనుసరించిరి ఆలోచన చేయగల మానవులకు అనుసరణీయములగు ఉదాహరణములైరి.

ఆత్మసాక్షాత్కారమను లక్ష్యమును చేరుటకు సిద్ధులు విభిన్నములు విస్పష్టములునైన మార్గముల ననుసరించిరి. అందువలన జీవన్ముక్తుల జీవితములలో మన మెన్నిక చేసుకొనుటకు వీలుగా, విభిన్నమార్గములు మనకు గోచరించును. మన మనసునకును, అనుభవమునకును తగినట్లు ఎన్నిక చేసుకొనుటయే మనము చేయవలసిన పని. అందువలన ఈ విశాల దేశములో నున్న ఆత్మసాక్షాత్కార విద్యాలయములలోని ప్రయోగశాలనెడు మహర్షుల జీవితములన్నిటిని చదువుట మనకు అత్యంతావశ్యకము. వీరి మార్గము లనేకములు. కొందఱు యోగ మార్గమున కుండలినీ విద్యను సాధించిరి. ఇతరులు సులభముకనపడు కేవలనిష్కాను భక్తి మార్గముననుసరించిరి. అన్యులు ఉపనిషత్ర్పతిపాదితమైన శుద్ధజ్ఞానమార్గము నవలంబించిరి. శ్రీమద్భగవద్గీత (రెండవ అధ్యాయమునందు) జ్ఞానిని, స్థిత ప్రజ్ఞునిగ సూచించి అతని జీవితమును ప్రవర్తనను వర్ణించినది. తిరువణ్ణామలైలో నివసించిన, సిద్ధపురుషులైన శ్రీశేషాద్రి స్వామివారు ఈ స్థితప్రజ్ఞులకోవకు చెందినవారే. వారు నలుబది సంవత్సరములు ఆపట్టణమున గడిపి 4-1-1929 నాడు తమ భౌతికశరీరమును విడిచినారు. వారి శరీరము తిరువణ్ణామలైలో సమాధి చేయబడినది. ఆసమాధియొద్ద ప్రతిదినము వేదోక్త విధానము ననుసరించి పూజలు జరుగుచున్నవి.

శ్రీ శేషాద్రి, కంచిలో, వేదాధ్యయమునకు జ్యోతిష పరిజ్ఞానమునకు ప్రసిద్ధి చెందిన శిష్టాచార సంపన్నమైన ఒక కుటుంబమున పుట్టినారు. రెండు సంవత్సరముల వయసులోనే తమ దివ్యత్వమును ప్రదర్శించినారు. శ్రీ శేషాద్రి యొక్క తల్లి, ఒకనాడు, ఆయనను ఒక దేవాలయమునకు తీసికొని వెళ్ళినది. ఒక వర్తకుడచట కంచు కృష్ణవిగ్రహముల నమ్ముచున్నాడు. ఒక్కొక్కదాని విలువ 12 పైసలు. శ్రీ శేషాద్రి ఒక విగ్రహము కావలెననినాడు. ఆ వర్తకుడు శ్రీ శేషాద్రికి ఒక విగ్రహమును ఉచితముగ నిచ్చినాడు. ఆ నాడా వర్తకుని యొద్ద నూరు విగ్రహములు అమ్ముడుపోయినవి. అతడాశ్చర్య పడినాడు. మఱునాడాతడు శ్రీ శేషాద్రియొద్దకు వచ్చి ''నీది సువర్ణస్పర్శ'' అని అతని నభినందించినాడు. శ్రీ శేషాద్రికి 14వ ఏట పితృవియోగము కలిగినది. ఆయన తల్లియైన మరకతాంబాలే, ఆయనను, ఆయన సోదరుడైన నరసింహుని పెంచినది. శ్రీ కామకోటిశాస్త్రిగారు, శ్రీ శేషాద్రికి మాతామహులు. వారు శ్రీశేషాద్రికి గొప్ప భవిష్యత్తు కలదని గుర్తించిరి. శ్రీ శేషాద్రిని తన స్నేహితునియొద్ద శాస్త్రములను చదువుట కుంచిరి. శ్రీ శేషాద్రి పుట్టుజ్ఞాని. అందువలన ఆయన చదువంతయు పునఃపఠనము మాత్రమేయైనది. అచిరకాలములోనే ఆయన సర్వశాస్త్రపారంగతులైనారు. ఆయన దేవాలయమునకుగాని శ్మశానమునకుగాని వెళ్ళి నిరంతరము జపము చేసెడి వారు. తమ ఇంటగాని, బంధువులతో గాని ఉండెడివారు కాదు. ఆయన మనస్సును సంసారము వైపునకు త్రిప్పవలయునని ఎంచిన ఆయన తల్లికి, యీప్రవృత్తి మనశ్చింతను కలిగించినది. ఆయన తన వివాహ ప్రస్తావనను తిరస్కరించినారు. అది ఉచితమే. సంసార విషయములను శ్రీ శేషాద్రి అంతకంతకు విసర్జించినాడు. ఆయన చర్యలలో వర్ధమాన జ్ఞాని లక్షణములు కనపడెడివి. భగవద్గీతలోను ఇతర మతగ్రంథములలోను తెలిపినట్లు ప్రపంచ విషయములను ఒకటొకటిగా వదలివేసినారు. వారి జీవిత చరిత్రలోని యీభాగమును మనలో నెవరును నిర్లక్ష్యము చేయగూడదు. అచటనాగి, ఆ భాగమునర్థము చేసికొని, సాధ్యమైనంత వఱకు, అందలి విషయములను, మన జీవితములలో సమన్వయ పఱచుటకు యత్నింపవలెను.

బాలుడైన శ్రీ శేషాద్రి బంధువుల కందఱకు ఒక సమస్యయైనాడు. ఒక గదిలో ఆయన నుంచి గదికి తాళము వేసినారు. తాళము తాళముగనే యున్నది. ఆయన గదిలో లేడు. కొన్ని దినములు ఆహారమునే తీసికొనడు. శరీరము, శరీరసౌకర్యము లపై శ్రద్ధయే లేదు. ఒడలు మురికిపోవునట్లు స్నానముచేయవలయుననిగాని, మంచి వస్త్రములను ధరింపవలయుననిగాని, శరీరమునకు ఎండ వాన గాలివాన సోకకుండ చూడవలయు ననిగాని యావయే లేదు. ఱాతిమాద పడుకొనినను మెత్తని పరుపుమీద పడుకొనినను భేదము కనుపడెడిది కాదు. రమ్మని పిలిచినవారి దగ్గఱకు వెళ్ళక, పిలువనివారి యింటికి వెళ్లును. వయసు వచ్చినకొలది ఈ లక్షణములు అధికములుగా జొచ్చినవి.

తల్లియైన మరకతంబాల్‌కు అవసానకాలము వచ్చినది. శ్రీ శేషాద్రిని పిలిచినది. ''సత్సంగత్వే నిస్సంగత్వం'' అను భజగోవింద శ్లోకమును చదివినది. అరుణాచల! అని మూడు సార్లు పలికినది. ఇది ఆమె కుమారునికి చేసిన అంత్యోపదేశ మేమో! ఆమె కనులు మూసినది. ఆమె వాక్యములు శ్రీ శేషాద్రికి ఉపదేశములైనవి. వెంటనే అరుణాచలమను పేర ప్రసిద్ధి నందిని తిరువణ్ణామలైకి ఆయన వెళ్ళినారు. 40 సంవత్సరముల జీవిత శేషమంతయు అచటనే గడిపి 1929 లో సిద్ధినందినారు.

శ్రీ శేషాద్రి తిరువణ్ణామలైలో దేవియొక్క ఆలయము నకుగాని శ్రీ సుబ్రహ్మణ్యశ్వరాలయమునకు గాని వెళ్లెడివారు. ఎల్లపుడు పట్టణములో తిరుగుచుండెడివారు. వారి ప్రవర్తనములు అతిగహనములు. వారిమాటలు, వానిఫలములు దుర్బోధములు. ఈ స్థితియందున్న శ్రీ శేషాద్రిస్వామి చరిత్ర జ్ఞాన మార్గానుయాయులకు ఉపదేశముగను హృదయంగమముగను ఉండెడిది. ఇటువంటి సిద్ధుల కేవల దర్శనము మన ఆధ్యాత్మికాభివృద్ధిలో ఒక మెట్టుగ నుపకరించును.

సిద్ధపురుషులు జీవించియున్నపుడు, వారి శరీరముపై శ్రద్ధ వహింపరు. శరీరమును వదలిన తరువాత ఈ ప్రపంచముతో సంబంధమును పెట్టుకొనవలెనని కోరరు. కాని శ్రీ శేషాద్రి స్వామి అనుగ్రహము విలక్షణమైనది. వారి శరీరమును తిరువణ్ణామలైలో సమాధియందుంచుట సాధ్యమైనది. కాని వారి ఆత్మను సమాధియందుంచుట సాధ్యముకాలేదు. శ్రీ స్వామి వేఱొకరూపమున, అనగా భూతరూపమున ఆవిర్భవించినారు. 1929 సంవత్సరమునకు ముందటవలెనే ప్రజలతో సంబంధము పెట్టుకొని, ఉపదేశించుచున్నారు. ఈ రోడ్‌ రైలు స్టేషనుకు రెండు మైళ్ళ దూరముననున్న వీరప్పన్‌ సత్రములో ఉన్న శ్రీ శివరామకృష్ణ అయ్యర్‌ లో ఆవేశించినారు. శ్రీ శివరామకృష్ణ అయ్యర్‌ తల్లి పేరు శ్రీమతి కావేరిఅమ్మల్‌. ఆమె పవిత్ర చరిత్ర. ఆమె భర్త ఈరోడ్‌లో ప్రభుత్వపు రెవెన్యూశాఖలో ఉద్యోగిగ నున్నారు. ఆమెకు నలుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు నున్నారు. చివరి కుమారుడు శ్రీ శివరామకృష్ణయ్యర్‌. బాల్యము నుండియు శ్రీమతి కావేరిఅమ్మళ్‌ పవిత్ర చరిత్ర. సుమారు నలుబది సంవత్సరములు ఆమె ఏ అన్నమును తినలేదు. పండ్లు, పాలు, లేదా మంచిగంధపుపొడి కలిపినవీ మాత్రమే తీసికొనెడిది. ఆమెకు సుబ్రహ్మణ్యశ్వరుని యందు ఉత్కటమైన భక్తి కలదు. ప్రతిదినము ఉదయమున 4-00 గంటలమధ్య తనయింట పూజచేసెడిది. అప్పుడు కొందరు బంధువులను మాత్రమే రాని చ్చెడిది, తిరువసనల్లూర్‌ నందలి శ్రీ అయ్యవల్‌ వలె ఈ మెయు దివ్యశక్తులను సాధించినది. కావేరినది ఆమె గ్రామమునకు ఒక మైలు దూరమున ప్రవహించు చుండెడిది. ఒకనాడామె నదికి స్నానము చేయుటకు వెళ్ళలేక పోయినది. అపుడానది, తన పూజాగృహము పై భాగమునుండి లోనికి ప్రవహించునట్లు చేసి, ఆ ప్రవాహములో ఆమె స్నానము చేసినది. ఆ పవిత్ర చరిత్రయం దింకను ఎన్ని యో శక్తులున్నవి. కాని ఆమె జీవించి యుండగా ఆ శక్తుల విషయ మెవరికిని తెలియదు. ఒకప్పుడు ఆమె తిరువణ్ణామలైలో నున్న తన బంధువులయింట ఒక కార్యము జరుగుచుండగా, తిరువణ్ణామలై వెళ్ళి ఒక సత్రములో విడిది చేసినది. ఉదయముననే పూజ చేయుచున్నది. ఆకస్మికముగ శ్రీ శేషాద్రిస్వామి వచ్చినారు. ఆహారము కావలెనని అడిగినారు. ఆమె పూజకై ఉంచిన అరటిపండును స్వామికి ఇచ్చినది. స్వామి ఆ పండులో సగము తినినారు. ఇంతలో ఏడేండ్ల వయసుననున్న శ్రీ శివరామకృష్ణయ్యర్‌ అచటికి వచ్చినారు. శ్రీ స్వామి తాను సగముతినగా మిగిలిన పండును శివరామకృష్ణన్‌ నోట క్రుక్కినారు. ఇది శ్రీ స్వామి ఆ బానకిచ్చిన దీక్షయేమో. తరువాత కాలమున ఆ శివరామకృష్ణయ్యరే శ్రీ స్వామి భూతముగా ఆవేశించుటకు ఆశ్రయమైనారు. (spirit medium)

ఇరువది సంవత్సరములు గడిచినవి. శ్రీమతి కావేరి అమ్మాళ్‌, తన ప్రార్థనలో అడిగిన కోరికననుసరించి శ్రీ శేషాద్రి స్వామి ఆమెకు కలలో కనపడి తాను భూతమై శివరామ కృష్ణునియం దావేశింతునని చెప్పినారు. అటులే ఆవేశించి నారు. శ్రీస్వామిని బ్రతికియుండగా చూచినవారు, భూతమై ఆవేశించిన స్వామిలో గూడ అపూర్వపు మాటలకు భావములను గుర్తింపగలిగినారు. ఒక పలచని కొయ్యపలక, దాని వెనుక అడుగుననున్న రెండు లంకెలపై నుండును. దానికి ముందు భాగమున ఒక రంధ్రము ఉండును. అందులో పెన్సలు పెట్టుదురు. (ఈ పలక, అంగడిలో అన్ని చోట్లను దొఱకును) ఆ పలక క్రింద ఒక తెల్లకాగితము ఉండును. మొట్టమొదట శ్రీశివరామకృష్ణ అయ్యర్‌ ఆ పలకను తాకెడివారు. ఆవేశించిన భూతమే ఆపలకను నడిపెడిది. అపుడు కాగితము మీద పెన్సలు వ్రాసిన అక్షరములు పడును. వానిలో భూతరూపము ఆవేశించిన శ్రీ స్వామియొక్క సందేశముండెడిది. కొంత కాలమైన తరువాత కాగితమును ఉపయోగించుట మానివేసినారు, శ్రీశివరామకృష్ణయ్యర్‌కు తాను వ్రాయవలసిన అక్షరములు స్ఫురించెడివి. వానిని ఆయన పలికెడివారు. ఇంకను కొంత కాలమైన తరువాత ఆయనకు సమాధిస్థితి కలిగెడిది. అపుడు తానేమి మాట్లాడుచున్నది ఆయనకు తెలియదు. ఆయన ముఖమున శ్రోతలు రెండు లేక మూడుగంటలు ఉపన్యాసమును వినెడి వారు. అవి ప్రామాణికముగను ఉపదేశకముగను ఉండెడివి శ్రీ శివరామకృష్ణయ్యర్‌ సామాన్య మానవునివలెనే మాట్లాడెడివారు. ఏమి మాట్లాడుచున్నది మాత్ర మాయనకు తెలియదు. సమాధిస్థితి అయిన తరువాత, సమాధిస్థితిలో ఏమిజరిగినదనీ, అచటనున్నవారిని అడిగెడువారు. ఈ కొయ్యపలక సహాయ్యముతో శ్రీ శేషాద్రిస్వామి ఉపదేశములను పెద్ద పుస్తకములలోను, చిన్న పుస్తకములలోను వ్రాసినారు. వీనినన్నిటిని మొదట ''జీవ్యప్రదర్శిని'' అను పేరుతోను తరువాత ''మోక్ష ప్రదర్శిని'' అను పేరుతోను నడిచిన తమిళమాస పత్రికలలో ప్రకటించినారు.

శ్రీ శేషాద్రిస్వామి భక్తులు ఒకసమాజముగ ఏర్పడి, ఆసమాజమును సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ చట్టము క్రింద రిజిస్టరు చేసినారు. దానికి శ్రీ శేషాద్రిస్వామిగళ్‌ అధిష్ఠానమ్‌ అసోసియేషన్‌ ఉంజలూరు అని పేరు పెట్టినారు. ఈ రోడ్‌కు 20 మైళ్ళ దూరముననున్న ఉంజలూరులో, శ్రీ స్వామివారి భక్తులు, స్వామివారి యోగసమాధిని నిర్మించినారు. ఆసమాజాధ్వర్యమున, అచట ప్రతిదినము వేదవిహితముగ పూజలు జరుగును. ఇంతటి పేరు, మహిమలుగల, సిద్ధపురుషులు శ్రీకోలందై ఆనంద స్వామివారు వేఱొకరు గలరు. వారు మధురలో నుండెడి వారు. 1932 లో శరీరమును విడిచినారు. వారు గూడ శ్రీశివరామకృష్ణయ్యరులో ఆవేశించెడివారు. పై సమాజమువారే, ఈ ఆనందస్వామివారికి మధురలో అరసరాది అను తావున ఒక సమాధిని నిర్మించినారు. అచటగూడ శాస్త్రనుసారముగ పూజలు జరుగును. శ్రీ శేషాద్రిస్వామివారి శరీరమును తిరువణ్ణామలైలో 1929 లో సమాధియం దుంచినారు. అదియు ఈ సమాజపర్య వేక్షణముననే యున్నది. అచట సక్రమముగ పూజలు జరుగును. తిరువణ్ణామలైలోని శ్రీస్వామివారి ముఖ్య శిష్యులనేకులు ఈసమాజములో సభ్యులుగ చేరినారు. వారు తిరువణ్ణామలైలోని ఈ అధిష్ఠానమునకు అమూల్యమైన సేవ చేయుచున్నారు.

మన దురదృష్టమువలన శ్రీశివరామకృష్ణయ్యరు గారు తమ 61-వ ఏట 3-3-74 న మరణించినారు. కాని శ్రీస్వామి వారి అనుగ్రహ మపారము. పై ఇద్దరు సిద్ధపురుషులును శ్రీ శివరామకృష్ణయ్యరు కుమారులైన శ్రీశేషాద్రిగారిని తమ భూతావేశమునకు ఆశ్రయముగా (Spirit Medium) చేసికొనినారు. పూర్వమువలెనే ఈ యిద్దఱి సిద్ధపురుషుల బోధలను కొయ్యపలక సహాయ్యముతోగాని, సమాధిస్థితిలో నున్న శ్రీ శేషాద్రిగారి ముఖమున గాని మనము వినగలము.

శ్రీ కుజుమణి నారాయణ శాస్త్రిగారు అనువారు గొప్ప సంస్కృత విద్వాంసులు. శ్రీ శేషాద్రిస్వామి వారితో కలసి మెలసియుండి, వారికి అత్యంత సన్నిహితముగ నుండి వారి జీవితమును పరిశీలించినారు. వారు దయతో తమిళములో శ్రీస్వామివారి జీవితమునే వ్రాయకున్నచో ప్రపంచమునకు ఈ చరిత్ర లభించెడిది కాదు. వారు వేదాన్తులు, పండితులు అగు వలన విషయమంతయు పాఠకులకు సులభముగ తెలియును బాగుగా వ్రాసినారు. ఆ పుస్తకము యొక్క సర్వస్వామ్యము ఈ సమాజమువారి అధీనమున నున్నవి. తమిళమురాని తెలుగు వారికి తెలియుటకై ఈ గ్రంథమును తెనుగులోనికి అనువదింప వలయునని శ్రీ స్వామివారి శిష్యులు కొందఱు కోరినారు. అందువలన ఆ గ్రంథమును తెనుగులోనికి అనువదించి ప్రకటించుటకు తెనాలిలోనున్న శ్రీ సాధన గ్రంథ మండలి వ్యవస్థాపకు లయిన శ్రీబులుసు సూర్యప్రకాశశాస్త్రిగారికి అనుమతి యిచ్చుటయైనది. పాఠకులకు ఈ గ్రంథపఠనమువలన శ్రీ స్వామివారి జీవిత విశేషములు తెలియును. పాఠకులకు ఆసక్తి యున్నచో శ్రీ స్వామివారిని, వారు ఆవేశమున నున్నపుడు, చూడవచ్చును. ఈ సమాజ కార్యాలయము - శ్రీ శేషాద్రి నిలయము, 6వ వీధి తాటబద్‌ కోయంబత్తూరు 12. (Sri Sesha Nilayam 6th Street, Tatabad - Coimbatore 12.) నందు కలదు. ఆ అడ్రసుతో కార్యదర్శిగారితో ఉత్తరప్రత్యుత్తరములు జరుపవచ్చును. కొన్ని తేదీలలో శ్రీశేషాద్రిగారి ముఖమున శ్రీస్వామివారి ఉపన్యాసమును కోయంబత్తూరు లోను, మధురలోనుగూడ వినవచ్చును. శ్రీ శేషాద్రిగారు మద్రాసులో ఉద్యోగము చేయుచున్నారు. ఆందువలన కొన్ని ఉపన్యాసములను మద్రాసులోకూడ వినవచ్చును. ఈ విషయమునకు సంబంధించిన వివరములు సమాజ కార్యదర్శిగారికి వ్రాసి తెలిసికొనవచ్చును.

-భాగవతుల కుటుంబరావు.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page