Sanathana Dharmamu Chapters Last Page
పీఠిక
శ్రీ కందుకూరి శివానందమూర్తిగారు, ఆనందవనము
భీమునిపట్నం - 531 163.
అనాదియైనవీ, అనంతములయినవీ అయిన వేదమూలాధారముగా గల ఆర్యసంస్కృతి, వర్తమాన భారతదేశమున హిందూమతముగా వ్యవహరింపబడుచున్నది.
అనాదియగుటచేతనూ, అనేక మంది ద్రష్టల తపఃఫల స్వరూపమగుట చేతనూ, ఈ మతమునకు పరిధులు లేవు. మహర్షుల అనుభవములు వైదిక వాఙ్మయముగా లభించిననూ, వేదమతమును దానికి కర్తృత్వమునెవ్వరూ స్వీకరించలేదు. ఆ కర్తృత్వమూ, వైవిధ్యమూ, అనంతత్వమూ మన సంస్కృతియొక్క లక్షణములయినవి. వేదములు, వేదార్థమును అటులుంచి, వేదమతసారమునూ, వేదమతధర్మములనూ, ఆ సిద్ధాంతముల నిర్ణయములనూ, ఈ మతమందలి ఈశ్వరస్వరూప ప్రయోజనాది నిర్ణయములను అనేకమంది వేత్తలు బోధించినారు.
అట్టి అనంతమైన సాహిత్యము అనేకచోట్ల పరస్పర వైరుధ్యమును, భిన్న ధృక్పధములనూ సూచించుటచేత ఈ మతస్థులకు - బహుశః యావన్మందికీ - శతాధికములైన సందేహములున్నవి. మనము ఏకేశ్వరోపాసకులమా? శివకేశవులు, రాజరాజేశ్వరీ, మహాలక్ష్మీ మొదలయిన దేవతలు సంపూర్ణులయిన ఈశ్వర తత్త్వములేనా? ఈ అనేక తత్త్వములు ఏకేశ్వర తత్త్వమునందు ఎట్లు పర్యవసించుచున్నవి? ఈ దేవతల ఉపాసనల వలన వారి వారికి కలుగు జ్ఞానమోక్షములు ఒకేవిధమయినవేనా? అసలు ధర్మస్వరూపమెట్టిది? ఇట్టి ఎన్నో వందల సందేహములు హిందూమతస్థుల యందు గలవు.
ఆయా సంప్రదాయ ప్రవర్తకుల వాదిప్రతివాదుల సాహిత్యము, చదివినకొలదీ సంఘమందు ప్రజలను పరస్పర భిన్న భావముల వైపు తీసికొని పోవుచున్నది.
ఒక గ్రంథము, ఒక ప్రవక్త, ఒక విధమైన (స్థూల) ఆచార విధి ఉన్న మతములందు భిన్న భావములకు అవకాశము తక్కువ. అట్లుకాక మన సంఘమందు వైవిధ్యము సంక్రమించుచున్నది. ఇట్టిచో హిందువులకున్న సందేహములకంతులేదు.
ఈ కారణము అనేకమంది ఏదో ఒక గరువును, ఒకరి బోధనలను, ఒక భక్తిని, ఒక విశ్వాసమును ఆశ్రయించుచున్నారు. వాఙ్మయమునంతయూ చదివి, విషయచర్చ చేసి సత్యమును గ్రహించు విజ్ఞానము ఎల్లరకూ యుండుట దుర్లభము. సాంప్రదాయ సిద్ధమైన ప్రస్థానత్రయ విజ్ఞానము సామాన్యుల కందుబాటులో లేదు.
నేటి హిందూసమాజమునకు బహుసందేహ పీడను తొలగించు బోధ అత్యావశ్యకము. ప్రత్యేక సంప్రదాయ ప్రవర్తకులు సార్వజనీన బోధ చేయజాలరు. సర్వజ్ఞత్వము, బ్రాహ్మీస్థితి, సనాతనవేద వాఙ్మయము మొదలు మధ్యయుగ ప్రవర్తకములగు అనేక మతసిద్ధాంతములతో బాటు అధునాతన ప్రపంచ విషయ పరిజ్ఞానము, బ్రహ్మజ్ఞానికి సహజమయిన అవ్యాజమయిన కరుణ, ప్రాకృతుల యెడ క్షమ ఇన్ని కళ్యాణగుణములున్న పురుషులు ఒక్కరు ఉన్నచో మన కష్టములు తీరును. అట్టివారు మన కష్టముల తీర్చవలెను.
కాంచీక్షేత్రస్థ మహాస్వాములట్టి యోగపురుషులు. వారి బోధలలో కేవల మానసికమైన యుక్తితో కూడిన బోధ మాత్రమే యుండదు, దానియందొక అనుగ్రహశక్తి యుండును. అది మనల రక్షింపగలదు. భక్తి, శ్రద్ధ, వినయములతో చదివినవారికి ఆంతరంగికమైన శాంతిని ప్రసాదింపగలదు. అట్టి మహోన్నతమయిన దీ గ్రంథము. ఇందలి వాక్యములు పరమ ప్రామాణికములు.
కాంచీపుర క్షేత్రస్థ మహాస్వాములవారి ప్రసంగముల నాంధ్రుల కందించుచున్న చిరంజీవి చల్లా విశ్వనాథశాస్త్రిగారు, అనువాదకులయిన శ్రీ విశాఖగారును, వారి ఇష్టదైవమైన మహాస్వామివారి అనుగ్రహమునకు పాత్రులగుటయే కాక, అపరిమిత పుణ్య సముపార్జనము చేసికొనినారు. ఆస్తికులయిన ఆంధ్రులందరూ వీరికి ఋణబడియున్నారు.
- శుభం భూయాత్ -