Sri Sivamahapuranamu-II    Chapters   

అథ షడ్వింశో%ధ్యాయః

విష్ణువు యొక్క మోహమును తొలగించుట

వ్యాస ఉవాచ |

బ్రహ్మపుత్ర నమస్తే%స్తు ధన్యస్త్వం శైవసత్తమ | యచ్ఛ్రావితా మహాదివ్యా కథేయం శాంకరీ శుభా || 1

ఇదానీం బ్రూహి సుప్రీత్యా చరితం వైష్ణవం మునే | స బృందాం మోహయిత్వా తు కిమకార్షీత్కుతో గతః || 2

వ్యాసుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మపుత్రా! నీకు నమస్కారము. ఓ శివభక్తాగ్ర గణ్యా! నీవు ధన్యుడవు. నీవు మహాదివ్యము. శుభకరమునగు ఈ శంకరుని గాథను వినిపించి నావు (1). ఓ మునీ! ఇపుడు విష్ణుచరితమును ప్రేమతో చెప్పుము. ఆయన బృందను మోహింప జేసిన తరువాత ఏమి చేసెను? ఎచటకు వెళ్లెను? (2).

సనత్కుమార ఉవాచ |

శృణు వ్యాస మహాప్రాజ్ఞ శైవప్రవరసత్తమ | వైష్ణవం చరితం శంభుచరితాఢ్యం సునిర్మలమ్‌ || 3

మౌనీ భూతేషు దేవేషు బ్రహ్మాదిషు మహేశ్వరః | సుప్రసన్నో%వదచ్ఛంభు శ్శరణాగతవత్సలః || 4

సనత్కుమారుడిట్లు పలికెను-

ఓ వ్యాసా! వినుము. నీవు గొప్ప బుద్ధిశాలివి. శివభక్తులలో ఉత్తముడవు. శంభుని చరితముతో విరాజిల్లునది, మిక్కిలి పవిత్రమైనది అగు విష్ణు చరితమును చెప్పెదను (3) శరణాగతవత్సలుడు, మహేశ్వరుడునగు శంభుడు బ్రహ్మాది దేవతలు మిన్నకుండగా మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (4).

శంభురువాచ |

బ్రహ్మన్‌ దేవవరాస్సర్వే భవదర్థే మయా హతః | జలంధరో మదంశో%పి సత్యం సత్యం వదామ్యహమ్‌ || 5

సుఖమాపుర్న వా తాతాస్సత్యం బ్రూతామరాః ఖలు | భవత్కృతే హి మే లీలా నిర్వికారస్య సర్వదా || 6

శంభుడు ఇట్లు పలికెను-

ఓ బ్రహ్మా! సర్వదేవపుంగవులారా! జలంధరుడు నా అంశనుండి జన్మించిన వాడే అయిననూ, మీ కొరకై వానిని సంహరించితిని. నేను నిస్సందేహముగా సత్యమును పలుకుచున్నాను (5). ఓ పుత్రులారా! మీకు సుఖము కలిగినదా? లేదా ? ఓ దేవతలారా! సత్యమును పలుకుడు. సర్వదా నిర్వికారుడనగు నా లీల మీకొరకు మాత్రమే గదా! (6)

సనత్కుమార ఉవాచ |

అథ బ్రహ్మాదయో దేవా హర్షాదుత్ఫుల్లలోచనాః | ప్రణమ్య శిరసా రుద్రం శశంసుర్విష్ణు చేష్టితమ్‌ || 7

సనత్కుమారుడిట్లు పలికెను -

అపుడు బ్రహ్మ మొదలగు దేవతలు ఆనందముతో విప్పారిన నేత్రములు గల వారై రుద్రునకు తలవంచి నమస్కరించి విష్ణువృత్తాంతమును చెప్పిరి (7).

దేవా ఊచుః |

మహాదేవ త్వయా దేవా రక్షితాశ్శత్రుజాద్భయాత్‌ | కించిదన్యత్సముద్భూతం తత్ర కిం కరవామహే || 8

బృందా విమోహితా నాథ విష్ణునా హి ప్రయత్నతః | భస్మీ భూతా ద్రుతం వహ్నౌ పరమాం గతిమాగతా || 9

బృందాలావణ్య సంభ్రాంతో విష్ణుస్థిష్ఠతి మోహితః | తచ్చితాభస్మ సంధారీ తవ మాయావిమోహితః || 10

స సిద్ధ మునిసంఘైశ్చ బోధితో%స్మాభిరాదరాత్‌ | న బుధ్యతే హరిస్సో%థ తవ మాయావిమోహితః || 11

కృపాం కురు మహేశాన విష్ణు బోధయ బోధయ | త్వదధీనమిదం సర్వం ప్రాకృతం స చరాచరమ్‌ || 12

దేవతలిట్లు పలికిరి -

ఓ మహాదేవా! నీవు శత్రువుల వలన కలిగిన భయమునుండి దేవతలను రక్షించితివి. కాని ఇపుడు మరియొక సమస్య ఉదయించినది. దాని విషయములో మేము ఏమి చేయవలెను? (8) ఓ ప్రభూ! విష్ణువు ప్రయత్నపూర్వకముగా బృందను మోహింపజేయగా, ఆమె వెంటనే అగ్నిలో భస్మమై సరమగతిని పొందినది (9). బృందయొక్క సౌందర్యముచే భ్రమితుడైన విష్ణువు మోహమును పొంది యున్నాడు. నీ మాయచే విశేషముగా మోహమునుపొంది యున్న విష్ణువు ఆమె యొక్క చితాభస్మను ధరించుచున్నాడు (10). మేము సిద్ధుల, మహర్షుల సంఘములతో గూడి ఆతనికి సాదరముగా బోధించితిమి. కాని నీ మాయచే విశేషముగా మోహితుడై యున్న ఆ విష్ణువు జ్ఞానమును పొందుట లేదు (11). ఓ మహేశ్వరా! నీవు దయను చూపి విష్ణువునకు బోధించుము ; బోధించుము. ప్రకృతినుండి పుట్టిన స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతయూ నీ ఆధీనములో నున్నది (12).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య మహేశో హి వచనం త్రిదివౌకసామ్‌ | ప్రత్యువాచ మహాలీలస్స్వచ్ఛందస్తాన్‌ కృతాంజలీన్‌ || 13

సనత్కుమారుడిట్లు పలికెను -

గొప్ప లీలలు గలవాడు, స్వతంత్రుడు అగు మహేశుడు దేవతల ఈ మాటలను విని చేతులు జోడించి నమస్కరించుచున్న వారికి ఇట్లు బదులిడెను (13).

మహేశ ఉవాచ |

హే బ్రహ్మన్‌ హే సురాస్సర్వే మద్వాక్యం శృణుతాదరాత్‌ | మోహినీ సర్వలోకానాం మమ మాయా దురత్యయా || 14

తదధీనం జగత్సర్వం యద్దేవాసురమానుషమ్‌ | తయైవ మోహితో విష్ణుః కామధీనో%భవద్దరిః || 15

ఉమాఖ్యా సా మహాదేవీ త్రిదేవజననీ పరా | మూల ప్రకృతిరాఖ్యాతా సురామా గిరిజాత్మికా || 16

గచ్ఛధ్వం శరణా దేవా విష్ణుమోహాపనుత్తయే | శరణ్యాం మోహినీం మాయాం శివాఖ్యాం సర్వకామదామ్‌ || 17

స్తుతిం కురుత తస్యాశ్చ మచ్ఛక్తే స్తోషకారిణీమ్‌ | సుప్రసన్నా యది చ సా సర్వం కార్యం కరిష్యతి || 18

మహేశుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! సర్వదేవతలారా! నా మాటను శ్రద్ధతో వినుడు. సర్వప్రాణులను మోహింపజేయు నా మాయ దాట శక్యము కానిది (14). దేవతలు, మానవులు, మరియు రాక్షసులతో సహా జగత్తు అంతయు దానికి లోబడి యున్నది. పాపహారియగు విష్ణువు దానిచేతనే మోహింపబడిన వాడై కామమునకు వశుడైనాడు (15). మూల ప్రకృతియని పిలువబడు ఆ మాయ పర్వతరాజు పుత్రికయై ఉమా మహాదేవి యను పేరుతో ఆనందమును కలుగ జేయు చున్నది. ఆ పరామయాయే త్రిమూర్తులకు తల్లి (16). ఓ దేవతలారా! శరణు పొందదగినది, మోహింపజేయునది, శివా యను పేరు గలది, కోర్కెలనన్నిటినీ ఈ డేర్చునది అగు ఆ మాయను విష్ణువుయొక్క మోహమును పోగొట్టుట కొరకై శరణు పొందుడు (17). నా శక్తికి సంతోషమును కలిగించే స్తుతిని చేయుడు. ఆమె ప్రసన్నురాలైనచో కార్యమునంతనూ చక్కబెట్టగలదు (18).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా తాన్‌ సురాన్‌ శంభుః పంచాస్యో భగవాన్‌ హరః | అంతర్దధే ద్రుతం వ్యాస సర్వైశ్చ స్వగణౖస్సహ || 19

దేవాశ్చ శాసనాచ్ఛంభో ర్బ్రహ్మాద్యా హి సవాసవాః | మనసా తుష్టువుర్మూల ప్రకృతిం భక్తవత్సలామ్‌ || 20

సనత్కుమారుడిట్లు పలికెను-

ఓ వ్యాసా! పంచముఖుడు, పాపహారియగు శంభు భగవానుడు ఆ దేవతలతో నిట్లు పలికి గణములందరితో గూడి అంతర్ధానము జెందెను (19). బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలు శంభుని శాసనముచే భక్తవత్సలురాలగు మూలప్రకృతిని మనస్సులో స్తుతించిరి (20).

దేవా ఊచుః |

యదుద్భవాస్సత్త్వరజస్తమోగుణాస్సర్గస్థితిధ్వంస విధాన కారకా |

యదిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూలప్రకృతిం నతాస్స్మతామ్‌ || 21

పాహి త్రయోవింశగుణాన్‌ సుశబ్దితాన్‌ జగత్యశేషే సమధిష్ఠితా పరా |

యద్రూపకర్మాణి జగత్త్రయే%పి తే విదుర్న మూలప్రకృతిం నతాస్స్మతామ్‌ || 22

యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్యమోహాత్యయసంభవాదీన్‌ |

న ప్రాప్ను వంత్యేవ హి భక్తవత్సలా సదైవమూల ప్రకృతిం నతాస్స్మ తామ్‌ || 23

కురు కార్యం మహాదేవి దేవానాం నః పరేశ్వరి | విష్ణుమోహం హర శివే దుర్గే దేవి నమో%స్తుతే ||24

జలంధరస్య శంభోశ్చ రణ కైలాసవాసినః | ప్రవృత్తే తద్వధార్థాయ గౌరీశాసనతశ్శివే || 25

బృందా విమోహితా దేవి విష్ణునా హి ప్రయత్నతః | స్వవృషాత్త్యాజితా వహ్నౌ భస్మీభూతా గతిం గతా || 26

జలంధరో హతో యుద్ధే తద్భయాన్యోచితా వయమ్‌ | గిరిశేన కృపాం కృత్వా భక్తాను గ్రహకారిణా || 27

దేవతలిట్లు పలికిరి -

దేవినుండి సత్త్వరజస్తమోగుణములు పుట్టినవో, ఏది సృష్టిస్థితిలయములను కర్మలను అనుష్ఠించుచున్నదో, దేవి సంకల్పము చే ఈ జగత్తు జన్మమరణములను పొందుచున్నదో, అట్టి మూలప్రకృతికి నమస్కరించుచున్నాము (21). సంపూర్ణమగు జగత్తునందు స్పష్టముగా పరిగణించి ప్రకటింపబడిన ఇరువది మూడు గుణములను అధిష్ఠించి యున్న పరాశక్తి మమ్ములను రక్షించుగాక! ముల్లోకములలో దేని యొక్క రూపమును మరియు కర్మలను జనులు ఎరుంగరో అట్టి మూలప్రకృతిని నమస్కరించుచున్నాము (22). దేనియందు భక్తి గల పురుషులుసర్వదా దారిద్ర్యము, అజ్ఞానము, జన్మ మరణములను నిశ్చితముగా పొందరో, అట్టి భక్తవత్సలయగు మూలప్రకృతిని సర్వదా నమస్కరించుచున్నాము (23). ఓ మహాదేవీ! పరమేశ్వరీ ! మా కార్యమును చక్కబెట్టుము. ఓ శివా! దుర్గాదేవీ! విష్ణువు యొక్క మోహమును తొలగించుము. నీకు నమస్కారమగు గాక! (24) ఓ శివా! కైలాసవాసియగు శంభునకు, జలంధరునకు యుద్ధము జరుగుచుండగా, గౌరీ దేవియొక్క ఆజ్ఞను పొంది వాని వధకొరకై (25) విష్ణువు ప్రయత్నపూర్వకముగా బృందను మోహింపజేసినాడు. ఆమె తన ధర్మమును నిలబెట్టుకొని అగ్నిలో దేహత్యాగమును చేసి పరమ గతిని పొందినది (26). యుద్ధములో జలంధరుడు సంహరింపబడినవాడు. మాకు వాని వలన భయము తప్పినది. భక్తులను అనుగ్రహించే కైలాసపతి మాపై దయను చూపినాడు (27).

తదాజ్ఞయా వయం సర్వే శరణం తే సమాగతాః | త్వం హి శంభు ర్యువాం దేవి భక్తోద్ధారపరాయణౌ || 28

బృందాలావణ్య సంభ్రాంతో విష్ణుస్తిష్ఠతి తత్రవై | తచ్చితా భస్మ సంధారీ జ్ఞానభ్రష్టో విమోహితా || 29

స సిద్ధ సురసంఘైశ్చ బోధితో%పి మహేశ్వరి | న బుధ్యతే హరిస్సో%థ తవ మాయావి మోహితః || 30

కృపాం కురు మహాదేవి హరిం బోధయ బోధయ | యథా స్వలోకం పాయాత్స సుచిత్తస్సురకార్యకృత్‌ || 31

ఇతి స్తువంతస్తే దేవాస్తేజోమండల మాస్థితమ్‌ | దదృశుర్గగనే తత్ర జ్వాలావ్యాప్తదిగంతరమ్‌ || 32

తన్మధ్యాద్భారతీం సర్వే బ్రహ్మాద్యాశ్చ సవాసవాః | అమరాశ్శుశ్రువుర్వ్యాస కామదాం వ్యోమచారిణీమ్‌ || 33

ఆయన ఆజ్ఞచే మేము అందరము నిన్ను శరణు పొందినాము. ఓ దేవీ! నీవు మరియు శంభుడు మీరిద్దరు భక్తులను ఉద్ధరించుటయే ఏకైకధ్యేయముగా గలవారు (28). విష్ణువు బృందయొక్క సౌందర్యముచే ఆకర్షితుడై అచటనే నిలిచియున్నాడు. ఆతడు జ్ఞానభ్రష్టుడై మోహమును పొంది ఆమెయొక్క చితభస్మను ధరించియున్నాడు (29). ఓ మహేశ్వరీ! సిద్ధులు, దేవతాగణములు ఆతనికి బోధించినారు. కాని నీ మాయచే మిక్కిలి మోహితుడై యున్న ఆ హరి జ్ఞానమును పొందుటలేదు (30). ఓ మహాదేవి! దయచూపి విష్ణువునకు బోధించుము. ఆతడు స్వస్థచిత్తుడై తన లోకమును చేరి దేవకార్యమును చేయు విధముగా బోధించుము (31). ఇట్లు స్తుతించుచున్న ఆ దేవతలు ఆకాశమునందు ఆవిర్భవించిన ఒక తేజోరాశిని చూచిరి. ఆ తేజోరాశియొక్క జ్వాలలు దిగంతములకు వ్యాపించెను (32). బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలందరు ఆ తేజోరాశిమధ్యమునుండి శబ్దమును వినిరి. ఓ వ్యాసా! ఆ ఆకాశవాణి కోర్కెల నీడేర్చునది (33).

ఆకాశవాణ్యువాచ |

అహమేవ త్రధా భిన్నా తిష్ఠామి త్రివిధైర్గుణౖః | గౌరీ లక్ష్మీ స్సురా జ్యోతీ రజస్సత్త్వ తమో గుణౖః || 34

తత్ర గచ్ఛత యూయం వై తాసామంతిక ఆదరాత్‌ | మదాజ్ఞయా ప్రసన్నాస్తా విధాస్యంతే తదీప్సితమ్‌ || 35

ఆకాశవాణి ఇట్లు పలికెను-

నేను మూడు రకముల గుణములచే మూడు రూపములుగా విడివడి యున్నాను. సత్త్వరజస్తమోగుణములచే నేను గౌరి, లక్ష్మి, సరస్వతి అను రూపములను ధరించియున్నాను. ఓ దేవతలారా! (34) మీరు ఆదరముతో వారి వద్దకు వెళ్లుడు. ప్రసన్నులైన వారు నా ఆజ్ఞచే మీ కోరికను నెరవేర్చగలరు (35).

సనత్కుమార ఉవాచ |

శృణ్వతామితి తాం వాచ మంతర్ధానమగా న్మహః | దేవానాం విస్మయోత్ఫుల్ల నేత్రాణాం తత్తదా మునే || 36

తతస్సర్వే%పి తే దేవా శ్శ్రుత్వా తద్వాక్య మాదరాత్‌ | గౌరీం లక్ష్మీం సురాం చైవ నేముస్తద్వాక్యచోదితాః || 37

తుష్టువుశ్చ మహాభక్త్యా దేవీస్తాస్సకలాస్సురాః | నానావిధాభిర్వాగ్భిస్తే బ్రహ్మాద్యా నతమస్తకాః || 38

తతో%రం వ్యాస దేవ్యస్తా ఆవిర్భూతాశ్చ తత్పురః | మహాద్భుతైస్స్వతేజోభి ర్భాసయంతో దిగంతరమ్‌ || 39

అథ తా అమరా దృష్ట్వా సుప్రసన్నేన చేతసా | ప్రణమ్య తుష్టువుర్భక్త్యా స్వకార్యం చ న్యవేదయన్‌ || 40

తతశ్చైతాస్సురాన్‌ దృష్ట్వా ప్రణతన్‌ భక్తవత్సలాః | బీజాని ప్రదదుస్తేభ్యో వాక్య మూచుశ్చ సాదరమ్‌ || 41

సనత్కుమారుడిట్లు పలికెను-

వారా మాటలను విను చుండగనే ఆ తేజస్సు అంతర్హితమయ్యెను. ఓ మునీ! దేవతలు అపుడా తేజస్సును ఆశ్చర్యముతో విప్పారిన నేత్రములతో చూచుచుండిరి (36). అపుడా దేవతలందరూ ఆ వాక్యమును ఆదరముచే విని దానిచే ప్రేరేపించబడినవారై గౌరీలక్ష్మీసరస్వతులను ప్రణమిల్లిరి (37). బ్రహ్మ మొదలగు ఆ దేవతలందరు తలలను వంచి మహాభక్తితో ఆ దేవీమూర్తులను వివిధములగు వాక్కులతో స్తుతించిరి (38). ఓ వ్యాసా! అపుడు వెంటనే ఆ దేవీ మూర్తులు వారి యెదుట ఆవిర్భవించిరి. వారు మహాద్భుతమగు తమ తేజస్సులచే దిగంతము వరకు ప్రకాశింపచేయుచుండిరి (39). అపుడు దేవతలు వారిని గాంచి ప్రసన్నమగు మనస్సు గలవారై వారికి భక్తితో ప్రణమిల్లి స్తుతించి తమ కార్యమును విన్నవించిరి (40). భక్తవాత్సల్యము గల ఆ దేవీ మూర్తులు అపుడు నమస్కరించియున్న దేవతలను గాంచి వారికి బీజములనిచ్చి వారితో సాదరముగా నిట్లనిరి (41).

దేవ్య ఊచుః |

ఇమాని తత్ర బీజాని విష్ణుర్యత్రావ తిష్ఠతి | నిర్వపధ్వం తతః కార్యం భవతాం సిద్ధిమేష్యతి || 42

దేవీమూర్తులు ఇట్లు పలికిరి -

ఈ బీజములను విష్ణువు ఉన్న స్థానమునందు నాటుడు. అట్లు చేయుట వలన మీ పని సిద్ధించగలదు (42).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా తాస్తతో దేవ్యోంతర్హితా అభవన్మునే | రుద్రవిష్ణువిధీనాం హి శక్తియస్త్రి గుణాత్మికాః || 43

తతస్తుష్టా స్సురాస్సర్వే బ్రహ్మాద్యాశ్చ సవాసవాః | తాని బీజాని సంగృహ్య యయుర్యత్ర హరిస్థ్సితః || 44

బృందాచితా భూమితలే చిక్షిపుస్తాని తే సురాః | స్మృత్వా తాస్సంస్థి తాస్తత్ర శివశక్త్యంశకా మునే || 45

నిక్షిప్తేభ్యశ్చ బీజేభ్యో వనస్పత్యస్త్రయో%భవన్‌ | ధాత్రీ చ మాలతీ చైవ తులసీ చ మునీశ్వర || 46

ధాత్ర్యుద్బవా స్మృతా ధాత్రీ మాభవా మాలతీ స్మృతా | గౌరీభవా చ తులసీ తమస్సత్త్వ రజోగుణాః || 47

విష్ణుర్వనస్సతీర్దృష్ట్వా తదా స్త్రీ రూపిణీర్మునే | ఉదతిష్ఠత్తదా తాసు రాగాతిశయ విభ్రమాత్‌ || 48

దృష్ట్వా స యాచతే మోహాత్కామాసక్తేన చేతసా | తం చాపి తులసీ ధాత్రీ రాగేణౖవావలోకతామ్‌ || 49

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ మునీ! బ్రహ్మ విష్ణురుద్రుల శక్తులు, త్రిగుణస్వరూపులు అగు ఆ దేవీమూర్తులు ఇట్లు పలికి పిదప అంతర్ధానమును చెందిరి (43). అపుడు బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలందరు సంతసిల్లి ఆ బీజములను శ్రద్ధగా స్వీకరించి విష్ణువు ఉన్న స్థానమునకు వెళ్లిరి (44). ఆ దేవతలు వాటిని బృందాదేవియొక్క చితభూమియందు నాటిరి. ఓ మునీ! వారు శివుని శక్తియొక్క అంశలగు ఆ దేవీమూర్తులను స్మరిస్తూ అచట నిలబడియుండిరి (45). ఓ మహర్షీ! నాటిన బీజములనుండి ధాత్రి, మల్లె మరియు తులసి అను మూడు మొక్కలు ఉద్భవించెను (46). సరస్వతినుండి ధాత్రి, లక్ష్మీదేవి నుండి మల్లె, మరియు గౌరీదేవి నుండి తులసి తమస్సత్త్వరజో గుణరూపములై పుట్టినవి (47). ఓ మునీ! స్త్రీ రూపములో నున్న ఆ మొక్కలను చూడగానే విష్ణువు మోహముచే వాటియందు అతిశయించిన రాగము గలవాడై లేచి నిలబడెను (48). ఆతడు మోహమువలన కామనతో మిక్కిలి రాగయుక్తమైన మనస్సుతో వారిపై ఇచ్ఛను కలిగియుండెను. తులసి మరియు ధాత్రి కూడా ఆతనిని ప్రేమతో చూచిరి (49).

యచ్చ బీజం పురా లక్ష్మ్యా మాయమైవ సమర్పితమ్‌ | తస్మాత్తదుద్భవా నారీ తస్మిన్నీర్ష్యా పరా భవత్‌ || 50

అతస్సా బర్బరీత్యాఖ్యా మవాపాతీవ గర్హితామ్‌ | ధాత్రీ తులస్యౌ తద్రాగాత్తస్య ప్రీతిప్రదే సదా || 51

తతో విస్మృతదుఃఖో%సౌ విష్ణుస్తాభ్యాం సహైవ తు | వైకుంఠమగమత్తుష్ట స్సర్వదేవైర్నమస్కృతః || 52

కార్తికే మాసి విప్రేంద్ర ధాత్రీ చ తులసీ సదా | సర్వదేవప్రియా జ్ఞేయా విష్ణోశ్చైవ విశేషతః || 53

తత్రాపి తులసీ ధన్యాతీవ శ్రేష్ఠా మహామునే | త్యక్త్వా గణశం సర్వేషాం ప్రీతిదా సర్వకామదా || 54

వైకుంఠస్థం హరిం దృష్ట్వా బ్రహ్మేంద్రాద్యాశ్చ తే %మరాః | నత్వా స్తుత్వా మహావిష్ణుం స్వస్వధామాని వై యయుః || 55

పూర్వము ఏ బీజము లక్ష్మీదేవి యొక్క శక్తిచే సమర్పింపబడినదో, దాని నుండి ఉద్భవించిన యువతి ఆ కారణముచేతనే ఆతనియందు ఈర్ష్య గలది ఆయెను (50). కావుననే మల్లె మిక్కిలి నిందించదగిన 'బర్బరి' అను పేరును గాంచెను. ధాత్రి మరియు తులసి మొక్కలు విష్ణువునందు ప్రేమను చూపుటచే ఆయనకు సర్వదా ప్రీతిపాత్రములాయెను (51). అపుడు ఆ విష్ణువు తన దుఃఖమును విస్మరించి వారిద్దరితో గూడి దేవతలందరు నమస్కరించుచుండగా సంతోషముతో వైకుంఠమును చేరెను (52). ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! కార్తీకమాసములో ధాత్రి మరియు తులసి సర్వదేవతలకు, విశేషించి విష్ణువునకు ప్రీతికరములని యెరుంగుము (53). ఓ మహర్షీ! ఆ రెండింటిలో తులసి మరింత ధన్యము, శ్రేష్ఠము. విఘ్నేశ్వరుని మినహాయించి తులసి సర్వదేవతలకు ప్రీతిని కలిగించి, కోర్కెలనన్నిటినీ ఈడేర్చును (54). బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు ఆ దేవతలు పాపహారియగు మహావిష్ణువు వైకుంఠమునందుండుటను గాంచి ఆయనకు నమస్కరించి స్తుతించి తమ తమ ధామములకు వెళ్లిరి (55).

వైకుంఠో%పి స్వలోకస్థో భ్రష్టమోహస్సుబోధవాన్‌ | సుఖీ చాభూన్మునిశ్రేష్ఠ పూర్వవత్సంస్మరన్‌ శివమ్‌ || 56

ఇత్యాఖ్యాన మఫ°ఘఘ్నం సర్వకామప్రదం నృణామ్‌ | సర్వకామవికారఘ్నం సర్వవిజ్ఞాన వర్ధనమ్‌ || 57

య ఇదం హి పఠేన్నిత్యం పాఠయేద్వాపి భక్తిమాన్‌ | శృణుయాచ్ఛ్రావయేద్వాపి స యాతి పరమాం గతిమ్‌ || 58

పఠిత్వా య ఇదం ధీమానాఖ్యానం పరమోత్తమమ్‌ | సంగ్రామం ప్రవిశేద్వీరో విజయీ స్యాన్న సంశయః || 59

విప్రాణాం బ్రహ్మవిద్యాదం క్షత్రియాణాం జయప్రదమ్‌ | వైశ్యానాం సర్వధనదం శూద్రాణాం సుఖదం త్విదమ్‌ || 60

శంభుభక్తి ప్రదం వ్యాస సర్వేషాం పాపనాశనమ్‌ | ఇహలోకే పరత్రాపి సదా సద్గతిదాయకమ్‌ || 61

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే విష్ణుమోహ విధ్వంసవర్ణనం నామ షడ్వింశో%ధ్యాయః (26).

ఓ మహర్షీ! విష్ణువు కూడ మోహము తొలగి జ్ఞానమును పొందినవాడై పూర్వమునందు వలె శివుని స్మరిస్తూ తన లోకమునందు సుఖముగా నుండెను (56). పాపసందోహములను నశింపజేయునది, మానవుల సర్వకామనల నీడేర్చునది, సర్వకామవికారములను పోగొట్టునది అగు ఈ గాథ సర్వవిజ్ఞానమును వర్ధిల్లజేయును. (57). ఎవడైతే దీనిని నిత్యము భక్తితో పఠించునో లేక పఠింపజేయునో, వినునో, లేదా వినిపించునో, అట్టివాడు పరమగతిని పొందును (58). బుద్ధిమంతుడగు ఏ వ్యక్తి సర్వశ్రేష్ఠమగు ఈ గాథనుపఠించి యుద్దరంగమును ప్రవేశించునో, అట్టి వీరుడు నిస్సంశయముగా విజయమును పొందును (59). ఈ గాథ బ్రాహ్మణులకు బ్రహ్మవిద్యను, క్షత్రియులకు జయమును, వైశ్యులకు సమస్త సంపదలను, శూద్రులకు సుఖమును ఇచ్చును (60). ఓ వ్యాసా! అందరి పాపములను పోగొట్టి శంభునియందు భక్తిని కలిగించే ఈ గాథ ఇహపరలోకములలో సర్వదా సద్గతినిచ్చును (61).

శ్రీ శివమహాపురాణములోని రుస్రంహితయందలి యుద్ధఖండలో విష్ణు మోహవిధ్వంస వర్ణనమనే ఇరువది యారవ అధ్యాయము ముగిసినది (26).

Sri Sivamahapuranamu-II    Chapters