Sri Sivamahapuranamu-I    Chapters   

అథ చతుర్విం శోధ్యాయః

శ్రీరామునకు పరీక్ష

నారద ఉవాచ |

బ్రహ్మన్‌ విధే ప్రజానాథ మహాప్రాజ్ఞ కృపాకర | శ్రావితం శంకరయశస్సతీ శంకరయోశ్శుభమ్‌ || 1

ఇదానీం బ్రూహి సత్ర్పీత్యా పరం తద్యశ ఉత్తమమ్‌ | కిమకార్‌ష్టం హితత్‌ స్థౌ వై చరితం దంపతీ శివౌ || 2

నారదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! విధీ! ప్రజాపతీ! మహాప్రాజ్ఞా! కృపాసింధో! సతీపరమేశ్వరుల మంగళకరమగు యశస్సును వినిపించితివి (1). ఇపుడు పవిత్రము, ఉత్తమము అగు ఆ యశస్సును ప్రీతితో ఇంకనూ చెప్పుము. ఆ దంపతులైన సతీపరమేశ్వరులు అచట ఉన్నవారై ఏమి చరితమును చేసిరి?(2).

బ్రహ్మోవాచ |

సతీశివ చరిత్రం చ శృణుమే ప్రేమతో మునే | లౌకికీం గతి మాశ్రిత్య చిక్రీడాతే సదాన్వహమ్‌ || 3

తతస్సతీ మహాదేవీ వియోగమలభన్మునే | స్వపతశ్శంకరస్యేతి వదంత్యేకే సుబుద్ధయః || 4

వాగర్ధావివ సంపృక్తౌ శక్తీ శౌ సర్వదా చితౌ | కథం ఘటేత చ తయోర్వియోగస్తత్త్వతో మునే || 5

లీలారుచిత్వాదథ వా సంఘటేతాఖిలం చ తత్‌ | కురతే యద్యదీశశ్చ సతీ చ భవరీతిగౌ || 6

సా త్యక్తా దక్షజా దృష్టా పతినా జనకాధ్వరే | శంభోరనాదరాత్తత్ర దేహం తత్యాజ సంగతా || 7

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! నేను సతీశివుల చరిత్రను చెప్పెదను. ప్రేమతో వినుము. వారు అచట ప్రతిదినము అన్నివేళలా లోకపు పోకడను అనుసరించి క్రీడించిరి (3). ఓ మహర్షీ! అపుడు మహాదేవి యగు సతి శంకరుడు నిద్రించు చుండగా వియోగమును పొందినదని కొందరు ప్రాజ్ఞులు చెప్పుచున్నారు (4). ఓ మహర్షీ! శబ్దార్ధముల వలె కలిసి ఉండే చిత్స్వరూపులగు ఆ శక్తీశులకు ఏ కాలమునందైననూ వాస్తవమగు వియోగము ఎట్లు సంభవమగును?(5). కాని లీలల యందు అభిరుచి గల వారిద్దరికి సర్వము సంభవమే యగును. ఏలయన, సతీశివులు లోకమర్యాదననుసరించి లీలలను ప్రకటించెదరు (6). ఆ దక్ష పుత్రి తన తండ్రి చేసిన యజ్ఞములో శంభునకు ఆదరము లేకుండుటను గని, శంభునిచే విడువ బడి, ఆ యజ్ఞశాలయందు దేహత్యాగమును చేసెను (7).

పునర్హిమాలయే సైవావిర్భూతా నామతస్సతీ | పార్వతీతి శివం ప్రాప తప్త్వా భూరి వివాహతః || 8

ఆ సతీ దేవి మరల హిమవంతునకు కుమారై యై జన్మించి, పార్వతి యను పేరును బడసి, తీవ్రమగు తపస్సును ఆచరించి, శివుని వివాహమాడెను (8).

సూత ఉవాచ |

ఇత్యా కర్ణ్య వచస్తస్య బ్రహ్మణస్స తు నారదః | పప్రచ్ఛ చ విధాతారం శివాశివమహద్యశః || 9

సూతుడిట్లునెను -

ఆ నారదుడు ఆ బ్రహ్మ యొక్క ఈ మాటను విని, శివాశివుల గొప్ప యశస్సును గురించి బ్రహ్మను ప్రశ్నించెను (9).

నారద ఉవాచ |

విష్ణుశిష్య మహాభాగ విధే మే వద విస్తరాత్‌ | శివా శివ చరిత్రం తద్భవాచార పరానుగమ్‌ || 10

కిమర్థం శంకరో జాయాం తత్యాజ ప్రాణతః ప్రియామ్‌ | తస్మా దాచక్ష్వమే తాత విచిత్రమితి మన్మహే || 11

కతో హ్యధ్వరజః పుత్రా నాదరోభూచ్ఛివస్య తే | కథం తత్యాజ సా దేహం గత్వా తత్ర పితృక్రతౌ || 12

తతః కిమభవత్త త్ర కిమకార్షీన్మహేశ్వరః | తత్సర్వం మే సమాచక్ష్వ శ్రద్ధాయుక్‌ తచ్ఛ్రుతావహమ్‌ || 13

నారుదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! లోకాచారమును అనుకరించే శివాశివుల చరిత్రమును నాకు విస్తరముగా చెప్పుము (10). శంకరుడు ప్రాణములకంటె ప్రియతరమగు భార్యను విడనాడుటకు కారణమేమి? తండ్రీ! ఇది నాకు విచిత్రముగ తోచుచున్నది. కాన చెప్పుము (11). నీ కుమారుడు యజ్ఞమునందు శివుని అనాదరము చేయుటకు కారణమేమి? తండ్రి చేయుచున్న యజ్ఞమునకు వెళ్లిన ఆ సతి దేహమునెట్లు త్యజించెను? (12). తరువాత ఏమాయెను? మహేశ్వరుడేమి చేసెను? ఆ వృత్తాంతమునంతనూ నాకు చక్కగా చెప్పుము. నేను ఆవృత్తాంతమును వినుట యందు శ్రద్ధ గలవాడను (13).

బ్రహ్మోవాచ |

శృణు తాత పరప్రీత్యా మునిభిస్సహ నారద | సుతవర్య మహాప్రాజ్ఞ చరితం శశి మౌలినః || 14

నమస్కృత్య మహేశానం హర్యాది సురసేవితమ్‌ | పరబ్రహ్మ ప్రవక్ష్యామి తచ్చరిత్రం మహాద్భుతమ్‌ || 15

సర్వేయం శివలీలా హి బహు లీలాకరః ప్రభుః | స్వతంత్రో నిర్వికారీ చ సతీ సాపి హి తద్విధా || 16

అన్యథా కస్సమర్థో హి తత్కర్మ కరణ మునే | పరమాత్మా పరబ్రహ్మ స ఏవ పరమేశ్వరః || 17

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! నారాదా! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. గొప్ప బుద్ధి శాలివి.చంద్ర శేఖరుని చరితమును మునులతో గూడి పరమప్రీతితో వినుము (14). విష్ణువు మొదలగు దేవతలచే సేవింపబడే, పరబ్రహ్మయగు మహేశ్వరునకు నమస్కరించి, అత్యద్భుతమగు ఆయన చరితమును చెప్పెదను (15). ఇదంతా శివలీల. స్వతంత్రుడు, నిర్వికారుడునగు ఆ ప్రభువు అనేక లీలలను ప్రదర్శించును. ఆ సతీదేవియూ ఆయనవలెనే లీలలను ప్రదర్శించును (16). ఓ మహర్షీ! ఆయన తక్క మరియెవ్వరు ఆయన చేసిన కర్మలను చేయగల్గుదురు? ఆయనయే పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు (17).

యం సదా భజతే చాహం శ్రీశోపి సకలాస్సురాః | మునయశ్చ మహాత్మానస్సిద్ధాశ్చ సనకాదయః || 18

శేషస్సదా యశో యస్య ముదా గాయతి నిత్యశః | పారం న లభ##తే తాత స ప్రభు శ్శంకరశ్శివః || 19

తసై#్యవ లీలయా సర్వోయమితి చిత్త విభ్రమః | తత్ర దోషో న కస్యాపి సర్వవ్యాపీ స ప్రేరకః || 20

ఏకస్మిన్‌ సమయే రుద్రస్సత్యా త్రిభువనే భవః | వృషమారుహ్య పర్యాటద్రసాం లీలావిశారదః || 21

నేను, విష్ణువు, సర్వదేవతలు, మహాత్ములగు మునులు, మరియు సనకాది సిద్ధులు సర్వదా ఆయనను సేవించెదము (18). నిత్యము ఆనందముతో ఆయన కీర్తిని గానము చేయు శేషుడు ఆ కీర్తియొక్క అంతమును చేరలేక పోయెను. కుమారా! ఆ శంకరప్రభువు మంగళముల నిచ్చును (19). ఈ చిత్త భ్రాంతి అంతయూ ఆయన లీలవలననే సంప్రాప్తమైనది. దీని యందు ఎవ్వరి దోషము లేదు. సర్వవ్యాపకుడగు ఆయనయే సర్వమును ప్రేరేపించుచున్నాడు (20). సత్తారూపుడు, లీలాపండితుడు నగు ఆ రుద్రుడు ఒక సమయమునందు సతితో గూడి వృషభము నధిష్ఠించి ముల్లోకములలో పర్యటించుచూ భూలోకమును దర్శించెను (21).

ఆగత్య దండకారణ్యం పర్యటన్‌ సాగరాంబరామ్‌ | దర్శయన్‌ తత్రగాం శోభాం సత్యై సత్యపణః ప్రభుః || 22

తత్ర రామం దదర్శాసౌ లక్ష్మణనాన్వితం హరః | అన్విష్యంతం ప్రియాం సీతాం రావణన హృతాం ఛలాత్‌ || 23

హా సీతేతి ప్రోచ్చరంతం విరహావిష్ట మానసమ్‌ | యతస్తతశ్చ పశ్యంతం రుదంతం హి ముహుర్ముహుః || 24

సమిచ్ఛంతం చ తత్ర్పాప్తిం పృచ్ఛంతం తద్గతిం హృదా | కుంజా ది భ్యో నష్టధియ మత్రపం శోకవిహ్వలమ్‌ || 25

సత్యమగు శపథము గల ఆ ప్రభువు సముద్రముపై ఆకసములో పర్యటించుచూ, దండకారణ్యమునకు వచ్చి అచటి సౌందర్యమును సతీదేవికి చూపించుచుండెను (22). రావణునిచే మోసముతో అపహరింపబడిన ప్రియురాలగు సీతకొరకు లక్ష్మణునితో గూడి అన్వేషించుచున్న రాముని ఈ శివుడు అచట చూచెను (23). రాముడు 'హా సీతా!' అని బిగ్గరగా అరచుచూ, విరహముచే ఆవేశింపబడిన మనస్సు గలవాడై, ఇటునటు వెదకుచూ, అదే పనిగా ఏడ్చుచుండెను (24). రాముడు ఆమెను పొందవలననే కోరికతో, ఆమె వెళ్లిన మార్గము కొరకు లతలను, వృక్షములను ప్రశ్నించుచుండెను. ఆయన బుద్ధి నష్టమయ్యెను. ఆయన సిగ్గును వీడి శోకముచే విహ్వలుడై యుండెను (25).

సూర్యవంశోద్భవం వీరం భూపం దశరథాత్మజమ్‌ | భరతాగ్రజ మానందరహితం విగతప్రభమ్‌ || 26

పూర్ణకామో వరాధీనం ప్రాణమత్స ముదా హరః | రామం భ్రమంతం విపినే సలక్ష్మణముదారధీః || 27

జయేత్యుక్త్వాన్యతో గచ్ఛన్‌ అదాత్తసై#్మ స్వదర్శనమ్‌ | రామాయ విపినే తస్మిన్‌ శంకరో భక్తవత్సలః || 28

ఇతీదృశీం సతీ దృష్ట్వా శివలీలాం విమోహినీమ్‌ | సువిస్మితా శివం ప్రాహ శివమాయా విమోహితా || 29

సూర్యవంశములో పుట్టినవాడు, వీరుడు, రాజకుమారుడు, దశరథుని పుత్రుడు, భరతుని అన్న అగు రాముడు ఆనందమును గోల్పోయి, కాంతి విహీనుడై, ఉండెను (26). తల్లి కోరిన వరములకు అధీనుడై అడవిలో లక్ష్మణునితో కలిసి తిరుగాడు చున్న రామునికి విశాలహృదయము గలవాడు, పూర్ణకాముడునగు ఆ శివుడు ఆనందముతో నమస్కరించెను (27). భక్తవత్సలుడగు శంకరుడు మరియొక్క స్థానమునకు వెళ్లుచూ అడవిలో రామునికి తన దర్శనమునిచ్చి 'జయ' అని పలికెను (28). మోహింపజేసే ఇట్టి శివలీలను చూచి, శివమాయచే విమోహితురాలైన సతీదేవి మిక్కిలి విస్మయమును పొంది శివునితో నిట్లనెను (29).

సత్యువాచ |

దేవదేవ పరబ్రహ్మ సర్వేశ పరమేశ్వర | సేవంతే త్వాం సదా సర్వే హరి బ్రహ్మోదయస్సురాః || 30

త్వం ప్రణమ్యో హి సర్వేషాం సేవ్యో ధ్యేయశ్చ సర్వదా | వేదాంత వేద్యో యత్నేన నిర్వికారీ పరప్రభుః || 31

కావిమౌ పురుషౌ నాథ విరహవ్యాకులాకృతీ | విహరంతౌ వనే క్లిష్టౌ దీనౌ వీరౌ ధనుర్ధరౌ || 32

తయోర్జ్యేష్ఠం కంజశ్యామం దృష్ట్వావై కేన హేతునా | ముదితస్సుప్రసన్నాత్మాభవో భక్త ఇవాధునా || 33

ఇతి మే సంశయం స్వామిన్‌ శంకర ఛేత్తు మర్హసి | సేవ్యస్య సేవకేనైవ ఘటతే ప్రణతిః ప్రభో || 34

సతీదేవి ఇట్లు పలికెను -

ఓ దేవదేవా! పరబ్రహ్మా!సర్వేశ్వరా!పరమేశ్వరా! హరిబ్రహ్మాది దేవతలందరు సర్వదా నిన్ను సేవించెదరు (30). సర్వులచే సర్వదా నమస్కరింప , సేవించ, ధ్యానించ దగినవాడవు నీవే. మానవుడు నిర్వికారి, పరమాత్మ అగు నిన్ను ప్రయత్న పూర్వకముగా వేదాంతములనుండి యెరుంగ వలెను (31). ఓ నాథా! విరహముచే దుఃఖితమైయున్న ఆకారము గలవారు, వనమందు దీనులై కష్టపడుతూ తిరుగుతున్నవారు, వీరులు, ధనుర్ధారులునగు ఈ పురుషులిద్దరు ఎవరు?(32). వారిద్దరిలో నల్లకలువ వలె శ్యామ వర్ణము గల జ్యేష్ఠుని చూచి నీవు భక్తుని వలె ప్రసన్నుడవై సంతసించుటకు కారణమేమి?(33). ఓ శంకరస్వామీ! నీవు నా ఈ సంశయమును నివారింప దగుదువు. ఓ ప్రభూ! స్వామికి సేవకుడు ప్రణమిల్లుటయే యుక్తముగ నుండును గదా!(34).

బ్రహ్మోవాచ |

ఆదిశక్తిస్సతీ దేవీ శివా సా పరమేశ్వరీ | శివమాయావశీ భూత్వా పప్రచ్ఛేత్థం శివం ప్రభుమ్‌ || 35

తదాకర్ణ్య వచస్సత్యాశ్శంకరః పరమేశ్వరః | తదా విహస్య స ప్రాహ సతీం లీలా విశారదః || 36

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆదిశక్తి, పరమేశ్వరి, శివుని అర్థాంగి అగు ఆ సతీదేవి శివుని మాయకు వశురాలై శివప్రభువును ఇట్లు ప్రశ్నించెను (35). పరమేశ్వరుడు, లీలాదక్షుడునగు శంకరుడు సతీదేవి యొక్క ఆ మాటను విని నవ్వి ఇట్లనెను (36).

పరమేశ్వర ఉవాచ |

శృణు దేవి సతి ప్రీత్యా యథార్థం వచ్మి న చ్ఛలమ్‌ | వరదాన ప్రభావాత్తు ప్రణామం చైవమాదరాత్‌ || 37

రామలక్ష్మణనామానౌ భ్రాతరౌ వీరసమ్మతౌ | సూర్యవంశోద్భవౌ దేవి ప్రాజ్ఞౌ దశరథాత్మజౌ || 38

గౌరవర్ణో లఘుర్బంధు శ్శేషాంశో లక్ష్మణాభిధః | జ్యేష్ఠో రామాభిధో విష్ణుః పూర్ణాంశో నిరుపద్రవః || 39

అవతీర్ణః క్షితౌ సాధురక్షణాయ భవాయ నః | ఇత్యుక్త్వా విరరామాసౌ శంభుస్సూతికరః ప్రభుః || 40

పరమేశ్వరుడిట్లు పలికెను -

ఓ సతీదేవీ! వినుము. నేను సత్యమును చెప్పెదను. అసత్యమాడను. వరదాన ప్రభావము వలన, ఆదరము వలన నేను ఇట్లు ప్రణమిల్లితిని (37). రామలక్ష్మణులను పేరు గల ఈ సోదరు లిద్దరు వీరులచే పూజింపబడువారు. ఓ దేవీ! దశరథుని కుమారులగు ఈ ప్రాజ్ఞులు సూర్యవంశమునందు పుట్టినవారు (38). పచ్చని రంగు గల ఈ చిన్నవాడు లక్ష్మణుడు. శేషుని అంశ##చే జన్మించినవాడు. విష్ణువు పూర్ణాంశతో రాముడను పేర జ్యేష్ఠుడై జన్మించినవాడు. ఆయన వలన ఎవ్వరికీ హాని లేదు (39). విష్ణువు భూమి యందు సాధువులను రక్షించుట కొరకు, మన సుఖము కొరకు జన్మించినాడు. ఇట్లు పలికి జగత్కారణుడు అగు శంభు ప్రభుడు మిన్న కుండెను (40).

శ్రుత్వా పీత్థం వచశ్శంభోర్న విశశ్వాస తన్మనః | శివమాయా బలవతీ సైవ త్రైలోక్య మోహినీ || 41

అవిశ్వస్తం మనో జ్ఞాత్వా తస్యాశ్శంభుస్సనాతనః | అవోచద్వచనం చేతి ప్రభుర్లీలా విశారదః || 42

శంభుని ఈ మాటలను వినిన తరువాతనైనూ ఆమె మనస్సునకు విశ్వాసము కలుగలేదు. ముల్లోకములను మోహింపజేయు శివుని మాయ బలీయమైనది (41). లీలా పండితుడు, సనాతనుడు అగు శంభు ప్రభుడు ఆమె మనస్సులో విశ్వాసము కలుగలేదని యెరింగి ఇట్లు పలికెను (42).

శివ ఉవాచ |

శృణు మద్వచనం దేవి న విశ్వసితి చేన్మనః | తవ రామ పరీక్షాంహి కురు తత్ర స్వయా ధియా || 43

వినశ్యతి యథా మోహస్తత్కురు త్వం సతి ప్రియే | గత్వా తత్ర స్థితస్తావద్వటే భవ పరీక్షికా || 44

శివుడిట్లు పలికెను -

ఓ దేవీ! నా మాటను వినుము. నీ మనస్సునకు విశ్వాసము కలుగనిచో, నీవు నీ బుద్ధిని ఉపయోగించి రాముని పరీక్షించుము (43). ఓ సతీ! ప్రియురాలా! నీ మోహము తొలగునంత వరకు ప్రయత్నించుము. నేను ఆ మర్రి చెట్టు నీడలో నిలబడి యుందును. నీవు పరీక్షను చేయుము (44).

బ్రహ్మోవాచ |

శివాజ్ఞయా సతీ తత్ర గత్వాచింతయదీశ్వరీ | కుర్యాం పరీక్షాం చ కథంరామస్య వనచారిణః || 45

సీతారూపమహం ధృత్వా గచ్ఛేయం రామసన్నిధౌ | యది రామో హరిస్సర్వం విజ్ఞాస్యతి న చాన్యథా || 46

ఇత్థం విచార్య సీతా సా భూత్వా రామసమీపతః | ఆగమత్తత్పరీక్షార్థంసతీ మహ పరాయణా || 47

సీతారూపాం సతీం దృష్ట్వా జపన్నామ శివేతి చ | విహస్య తత్ర్ప విజ్ఞాయ నత్వావోచ ద్రఘూద్వహః || 48

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివుని యాజ్ఞచే ఈశ్వరి యగు సతి అచటకు వెళ్లి ఇట్లు తలపోసెను. వనములో సంచరించే రాముని ఏవిధముగా పరీక్షించవలెను? (45). నేను సీతారూపమును ధరించి రాముని వద్దకు వెళ్ళెదను. రాముడు విష్ణువు అయినచో, ఆయనకు అంతయూ తెలియగలదు. కానిచో తెలియదు (46). ఇట్లు తలంచి ఆమె సీతారూపమును దాల్చి రాముని వద్దకు వెళ్లెను. మోహపరాయణయైన సతి ఈ తీరున రాముని పరీక్షించుటకు పూనుకొనెను (47). రఘురాముడు సీతా రూపములో నున్న సతిని చూచి శివానామమును జపించుచూ నవ్వి ఆ సత్యమునెరింగి నమస్కరించి ఇట్లు పలికెను (48).

రామ ఉవాచ |

ప్రేమతస్త్వం సతి బ్రూహి క్వ శంభుస్తే నమో గతః | ఏకా హి విపినే కస్మాదాగతా పతినా వినా || 49

త్యక్త్వా స్వరూపం కస్మాత్తే ధృతం రూపమిదం సతి | బ్రూహి తత్కారణం దేవి కృపాం కృత్వా మమోపరి || 50

రాముడిట్లు పలికెను -

సతీ! నీవు అను రాగముతో చెప్పుము. నీకు నమస్కారము. శివుడు ఎచటకు వెళ్లినాడు? నీవు భర్త తోడు లేకుండా ఒంటరిగా ఈ అడవిలోనికి ఏల వచ్చితివి?(49). ఓ సతీ! నీవు నీ రూపమును వీడి ఈ రూపము నేల ధరించితివి? ఓ దేవీ! నీవు నాయందు దయను చేసి ఇట్లు చేయుటకు గల కారణమును చెప్పుము (50).

బ్రహ్మోవాచ |

ఇతి రామవచశ్ర్శుత్వా చకితాసీత్సతీ తదా | స్మృత్వా శివోక్తం మత్వా చావితథం లజ్జితా భృశమ్‌ || 51

రామం విజ్ఞాయ విష్ణుం తం స్వరూపం సంవిధాయ చ | స్మృత్వా శివ పదం చిత్తే సత్యు వాచ ప్రసన్నధీః || 52

శివో మయా గణౖశ్చైవ పర్యటన్‌ వసుధాం ప్రభుః | ఇహాగచ్ఛచ్చ విపినే స్వతంత్రః పరమేశ్వరః || 53

అపశ్యదత్ర స త్వాం హి సీతాన్వేషణ తత్పరమ్‌ | సలక్ష్మణం విరహిణం సీతయా క్లిష్ట మానసమ్‌ || 54

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు సతీదేవి రాముని ఈ మాటలను విని విస్మితురాలాయెను. శివుని వచనము అమోఘమని ఆమెకు తలపునకు వచ్చి, చాల సిగ్గుపడెను (51). రాముడు విష్ణువేయని ఎరింగి, తన రూపమును మరల పొంది, మనస్సులో శివుని పాదములను స్మరించి, ప్రసన్నమైన బుద్ధిగలదై సతీదేవి ఇట్లు పలికెను (52). స్వతంత్రుడు, పరమేశ్వరుడునగు శివ ప్రభుడు నాతో, మరియు గణములతో గూడి భూమిని పర్యటిస్తూ, ఈ అడవికి కూడా వచ్చినాడు (53). ఆయన ఇచట లక్ష్మణునితో గూడి సీతను వెదుకుటలో తత్పరుడై ఉన్నట్టియు, సీతా విరహముచే దుఃఖితమగు మనస్సు గల్గిన నిన్ను చూచినాడు (54).

నత్వా త్వాంస గతో మూలే వటస్య స్థిత ఏవ హి | ప్రశంసన్‌ మహిమానం తే వైష్ణవం పరమం ముదా || 55

చతుర్భుజం హరిం త్వాం నో దృష్ట్వేవం ముదితోభవత్‌ | తచ్ఛ్రుత్వా వచనం శంభోర్భ్రమ మానీయ చేతసి |

తదాజ్ఞయా పరీక్షాం తే కృతవత్యస్మి రాఘవ || 57

జ్ఞాతం తే రామ విష్ణుస్త్వం దృష్టా తే ప్రభుతాఖిలా | నిస్సంశయా తదాపి తచ్ఛృణు త్వం చ మహామతే || 58

ఆయన నీకు నమస్కరించి, విష్ణువు యొక్క గొప్ప మహిమను ఆనందముతో ప్రశంసించి, ఆ మర్రిచెట్టు క్రింద నిలబడి యున్నాడు (55). ఆయన ఇప్పుడు చతుర్భుజుడగు విష్ణువును చూడక పోయిననూ చూచినట్లే సంతసించెను. నీ ఈ పవిత్రమగు రూపమును చూచి, ఆయన ఆనందమును పొందినాడు (56). శంభుని ఆ మాటలను విన్న పిదప, నాకు మనస్సులో భ్రాంతి కలిగినది . ఓ రామా! ఆయన ఆజ్ఞచే నేను నిన్ను పరీక్షించితిని (57). రామా! నీవు విష్ణువే యని నాకు తెలిసినది. నీ ప్రభుశక్తిని పూర్ణముగా నేను చూచితిని. నా సందేహము తొలగినది. ఓ మహా బుద్ధిశాలీ! అయినను, నా మాటను నీవు వినుము (58).

కథం ప్రణమ్యస్త్వం తస్య సత్యం బ్రూహి మామాగ్రతః | కురు నిస్సంశయాం త్వం మాం శమలం ప్రాప్నుహి ద్రుతమ్‌ || 59

నీవు శివునకు నమస్కరింపదగినవాడవు ఎట్లు అగుదువు? నా ఎదుట సత్యమును పలుకుము. నా ఈ సంశయమును నివారింపుము. నాకు వెంటనే మనశ్శాంతిని కలిగించుము (59).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్యా రామశ్యో త్ఫుల్లలోచనః | అస్మరత్స్వం ప్రభుం శంభుం ప్రేమాభూద్ధృది చాధికమ్‌ || 60

సత్యా వినాజ్ఞయా శంభుసమీపం నాగమన్మునే | సంవర్ణ్య మహిమానం చ ప్రోవాచ రాఘవస్సతీమ్‌ || 61

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయా యాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే రామపరీక్షా వర్ణనం నామ చతుర్వింశోధ్యాయః (24).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వికసించిన పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు ఆమె ఈ మాటను విని, తన ప్రభువగు శంభు విస్మరించెను. ఆయనకు హృదయములో ప్రేమ ఉప్పొంగెను (60). ఓ మహర్షీ! రాముడు సతి అనుజ్ఞ లేకుండుటచే, శివుని వద్దకు వెళ్లలేదు. ఆయన మహిమను మనస్సులో భావన చేసి రాఘవుడు సతీదేవితో నిట్లనెను (61).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు సతీ ఖండలో రామ పరీక్షా వర్ణన మనే ఇరుది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).

Sri Sivamahapuranamu-I    Chapters