Brahmapuranamu    Chapters   

అథ చతుశ్చత్వారింశదధికద్విశతతమోధ్యాయః

విద్యావిద్యయోః స్వరూపకథనమ్‌

వసిష్ఠఉవాచ:

సాంఖ్యదర్శన మేతావ దుక్తం తే నృపసత్తమ | విద్యావిద్యే త్విదానీం మే త్వం నిబోధాను పూర్వశః || 1

అభేద్య మాహు రవ్యక్తం సర్గప్రలయ ధర్మిణః | సర్గప్రలయ ఇత్యుక్తం విద్యావిద్యే చ వింశకః || 2

పరస్పరస్య విద్యా వై త న్నిభో ధానుపూర్వశః | యథోక్త మృషిభి స్తాత సాంఖ్య స్యాతి నిదర్శనమ్‌ || 3

కర్మేంద్రియాణాం సర్వేషాం విద్యా బుద్ధీంద్రియం స్మృతమ్‌ | బు ద్దీంద్రియాణాం చ తథా విశేషా ఇతి నః స్మృతమ్‌ ||

విషయాణాం మనస్తేషాం విద్యా మాహు ర్మనీషిణః | మనసః పంచభూతాని విద్యా ఇ త్యభిచక్షతే || 5

అహంకరాస్తు భూతానాం పంచానాం నాత్ర సంశయః | అహంకార స్తథా విద్యా బుద్ధిర్విద్యా నరేశ్వర! || 6

బుద్ధ్యాః ప్రకృతి రవ్యక్తం తత్త్వనాం పరమేశ్వర | విద్యా జ్ఞేయా నరశ్రేష్ఠ విధి శ్చ పరమః స్మృతః || 7

అవ్యక్త మపరం ప్రాహు ర్విద్యా వై పంచవింశకః | సర్వస్య సర్వ మిత్యుక్తం జ్ఞేయజ్ఞానస్య పారగః || 8

జ్ఞాన మవ్యక్త మి త్యుక్తం జ్ఞేయం వై పంచవింశకమ్‌ | తథైవ జ్ఞాన మవ్యక్తం విజ్ఞాతా పంచవింశకః || 9

విద్యా7విద్యా-క్షరాక్షర-బుద్ధత్వా ప్రతిబుద్ధత్వ ప్రతిపాదనము

వసిష్ఠ మహర్షి జనకునితో ఇట్లు పలికెను: ఓనృపసత్తమా! ఇంతవరకును నీకు సాంఖ్య దర్శనమును తెలిపితిని. ఇకమీద విద్యావిద్యల తత్త్వమును క్రమానుసారము తేలిపెదను. ఎఱుగుము. సృష్టిప్రళయములు జననమరణములు ధర్మములుగానుండి సంసారచక్రమునందు సంసరించువాడు అవ్యక్తతత్త్వమును వివేచించి తెలిసికొనజాలడు. ఒకదాని కంటె మఱియొకటి ఉత్తరోత్తరము విద్యారూపము అయినది. పైదానికంటెముంద ఱిది అవిద్యారూపమయినది. విద్య-అవిద్య అనుభేదము రెండు- స్థూల-స్థూలతరతత్త్వ ములనడుమనుండెడి యోగ్యతాభేదముచే చేయు నిర్ణయము. ఇదిసాంఖ్యతత్త్వవేత్తలు వివేచించి ప్రతిపాదించిన విషయము. ఎట్లనిన-వరుసగా 1.కర్మేంద్రియములు 2. జ్ఞానేంద్రియములు 3. పంచతన్మాత్రలు - లేదా విషయములు 4. మనస్సు (5. పంచభూతములు) 6. అహంకారము 7. బుద్ధి 8. అవ్యక్తము ఇవి వరుసగా ఒకదానికంటె మఱియొకటి విద్యారూపమయినవి. అనగా ఉత్తరోత్తరము సూక్ష్మతర మయినవి. అన్నిటికంటె విద్యారూపమయినది పంచవింశలి తమమగు పరమాత్మ తత్త్వము.

విద్యావిద్యే తు తత్త్వేన మ యోక్తే వై విశేషతః | అక్షరం చ క్షరం చైవ య దుక్తం త న్నిబోధ మే|| 10

ఉభా వేతౌ క్షరా వుక్తౌ ఉభా వేతా వన క్షరౌ | కారణం తు ప్రవక్ష్యామి యథా జ్ఞానం తు జ్ఞానతః || 11

అనాదినిధనా వేతౌ ఉభా వే వేశ్వరౌ మతౌ | తత్త్వసంజ్ఞా వుభా వేవ ప్రోచ్యేతే జ్ఞాన చింతకైః || 12

సర్గప్రలయ ధర్మిత్వా దవ్యక్తం ప్రాహు రవ్యయమ్‌ | త దేత ద్గుణసర్గాయ వికుర్వాణం పునః పునః || 13

గుణానాం మహదాదీనా ముత్పద్యతి పరస్పరమ్‌ | అధిష్ఠానం క్షేత్ర మాహు రేత ద్వై పంచవింశకమ్‌ || 14

య దంతర్గుణజాలం తు త ద్వ్యక్తాత్మని సంక్షిపేత్‌ | త దహం త ద్గుణౖ స్తత్తు పంచవింశే విలీయతే || 15

గుణా గుణషు లీయంతే త దేకా ప్రకృతి ర్భవేత్‌ | క్షేత్రజ్ఞోపి తదా తావ త్జేత్రజ్ఞః సంప్రణీయతే || 16

యదాక్షరం ప్రకృతి ర్యం గచ్ఛతే గుణసంజ్ఞితా | నిర్గుణత్వం చ వై దేహే గుణషు పరివర్తనాత్‌ || 17

ఏవ మేవ చ క్షేత్రజ్ఞః క్షేత్రజ్ఞాన పరిక్షయాత్‌ | ప్రకృత్యా నిర్గుణ స్త్వేష ఇత్యేవ మనుశుశ్రుమ || 18

క్షరో భవ త్వేష యదా గుణవతీ గుణ ష్వథ | ప్రకృతిం త్వథ జానాతి నిర్గుణత్వం త థాత్మనః || 19

తథా విశుద్ధో భవతి ప్రకృతేః పరివర్జనాత్‌ | అన్యోహ మన్యేయ మితియదా బుద్ధ్యతి బుద్ధిమాన్‌ || 20

త దైషోవ్యథతా మేతి న చ మిశ్ర త్వ మావ్రజేత్‌ | ప్రకృత్యా చైష రాజేంద్ర మిశ్రోన్యో న్యస్యదృశ్యతే

యదా తు గుణజాలం త త్ర్పాకృతం విజుగుప్సతే | పశ్యతే చ పరం పశ్యం స్తదా పశ్య న్ను సంసృజేత్‌ || 22

ఇక క్షరాక్షరతత్త్వమును తెలిపెదను: వివేచించగా వ్యక్తము అవ్యక్తము అనురెండును క్షరములే. అవి రెండును అక్షరములే. ఇది కొంత సంశయజనకముగాను విచిత్రముగాను కనబడినను రెండును క్షరమును అక్షరమును అగుననుటకు హేతువు ఏమో సాంఖ్య దర్శన వివేచనాను సారము ప్రతిపాదింతును. వాస్తవస్థితిలో రెండును ఆదియు నాశమును లేనివే. రెండును సర్వశక్తిమంతములగు ఈశ్వరతత్త్వములే. రెండును పరమార్థ తత్త్వములే. ఎట్లన-పంచవింశకత్త్వము అనబడు పరమార్థ తత్త్వము సృష్టి ప్రళయ - జననమరణ-రూపసంసార ప్రవృత్తికై మొదట అవ్యక్తమై క్రమముగా మహదాదిగా భూతభౌతిక సృష్టివరకు తన్నుతానేమాయావశమున పరిణమింపజేసికొని ఇట్టి తనలో సృష్టికాలమున తాను ప్రవేశించుచు ప్రళయకాలమున ఈ వ్యక్త సంసారరూపమగు తన్నేతనలో లయముచేసి కొనుచు ఉన్నది. వరమార్థమున ఇవియన్నియు అఖండ-ఏకైక-తత్త్వమే కదా ! ఒకే ప్రకృతియేకదా ! కనుక వ్యవహారమున మాత్రమే అపరాప్రకృతి-పరాప్రకృతి-క్షరము-అక్షరము-అనుభేదము.వస్తుస్థితిలో రెండును క్షరములే-రెండును అక్షరములే. అనగా అక్షర తత్త్వము తన్నుతాను క్షరరూపమున పరిణమింపజేసికొని తన రూపాంతరమే అగుజడదేహమున తాను ప్రవేశించి ఉపాధిచే తానునుక్షరునివంటివాడై అహమను అభిమానముతో కర్తయై భోక్తయై సుఖియై దుఃఖియై వీటికి భయపడి విరక్తుడై ముముక్షువై జ్ఞాతయగుచున్నాడు. అప్పుడు ఈ భ్రాంతికల్పిత క్షర తత్త్వమును దృష్టిలో ఉంచుకొనగా అక్షరతత్త్వము జ్ఞేయమగును. ఈ జ్ఞాతయగు క్షర సదృశతత్త్వము ముక్తుడయినపుడు ఈతడు జ్ఞాతయుకాక జ్ఞేయమును కాకత్రిపుటిలోని జ్ఞాధాత్వర్థరూపమైన జ్ఞానమునుకాక వీటన్నిటికిని అతీతమగుచిద్రూపి జ్ఞానతత్త్వమగు చున్నాడు. కనుక ఈ వివేచనము ననుసరించి ఏదియవ్యక్తము? ఏదివ్యక్తము? ఏదిక్షరము? ఏది అక్షరము? అంతయు క్షరమే. అంతయు అక్షరమే. అంతయు వ్యక్తమే. అంతయు అవ్యక్తమే. అక్షరుడే మాయావశమున క్షరుడై సగుణుడై నపుడు క్రమముగా సంసార విషయములపై నిర్వేదము చెంది విరక్తుడై సాంఖ్య వివే చనముచేతాను నిర్గుణుడననియు తాను పరాప్రకృతియే యనియు ఎరుగును. అపుడు అపరా ప్రకృతి స్థితిని విడిచి శుద్ధుడగును. అప్పుడు ఇతనికి ఏదుఃఖములును ఉండవు. కేవలము సుఖ-ఆనంద-శుద్ధ స్వరూపుడగుచున్నాడు. సుఖదుఃఖ మిశ్రస్వరూపముతొలగు చున్నది. సంసారమున సంసరించవలసిన బంధము దూరమగుచున్నది.

కిం మయా కృత మేతావ ద్యోహం కాల నిమజ్జనః | యథామత్స్యో | యథామత్స్యో హ్యభిజ్ఞానా దనువర్తితవాన్జజలమ్‌|| 23

అహ మేవ హి సంమోహా దన్య మన్యం జనా జ్జనమ్‌ | మత్స్యో య థోదకజ్ఞానా దనువర్తితవా నిహ || 24

మత్స్యోన్యత్వ మథాజ్ఞానా దుదకా న్నాభిమన్యతే | ఆత్మానం త దవజ్ఞానా దన్యం చైవ న వే ద్మ్యహమ్‌ || 25

మమాస్తు ధి క్కుబుద్ధస్య యోహం మగ్న ఇమం పునః | అనువర్తితవా న్మోహా దన్య మన్యం జనాజ్జనమ్‌|| 26

అయ మనుభ##వే ద్బంధు రనేన సహ మే క్షయమ్‌| సామ్య మేకత్వతాం యాతో యాదృశ స్తాదృశ స్త్వహమ్‌ || 27

తుల్యతా మిహ పశ్యామి సదృశోహమనేన వై | అయం హి విమలో వ్యక్త మహ మీదృశక స్తదా || 28

యోహ మజ్ఞానసంమోహా దజ్ఞాయా సంప్రవృత్తవాన్‌ | సంసర్గా దతిసంసర్గా త్థ్సితః కాలమ మిమం త్వహమ్‌|| 29

సోహ మేవం వశీభూతః కాల మేతం న బుద్ధవాన్‌ | ఉత్త మాధమ మధ్యానాం తా మహం కథ మావసే || 30

సమాన మాయయా చేహ సహవాస మహం కథమ్‌ | గచ్ఛా మ్యబుద్ధభావత్వా ది హేదానీం స్థిరో భవ || 31

సహవాసం న యాస్వామి కాల మేతం వివంచనాత్‌ | వంచితో హ్యనయా యద్ధి నిర్వికారో వికరాయా || 32

న తత్త దపరాద్ధం స్యా దపరాధో హ్యయం మమ | యోహ మ త్రాభవం సక్తః పరాఙ్ముఖ ముపస్థితః || 33

తతోస్మి న్బహురూపోథ స్థితో మూర్తి రమూర్తిమాన్‌ | ఆమూర్తి శ్చాప్యమూర్తాత్మా మమత్వేనప్రధర్షితః ||

ప్రకృత్యా చ మయా తేన తాసు తా స్విహ యోనిషు | నిర్మమస్య మమల్వేన వికృతం తాసు తాసు చ || 35

యోనీషు వర్తమానేన నష్టసంజ్ఞేన చేతసా | సమతా న మయా కాచి దహంకారే కృతా మయా || 36

ఆత్మానం బహుధా కృత్వా సోయం భూయో యునక్తిమామ్‌ | ఇదానీ మవబుద్ధోస్మి నిర్మమో నిరహంకృతః ||

మమత్వం మనసా నిత్య మహంకార కృతాత్మకమ్‌ | అపలగ్నా మిమాం హిత్వా సంశ్రయిష్వే నిరామయమ్‌ || 38

అనేన సామ్యం యాస్యామి నానయాహ మచేతసా | క్షేమం మమ సహానేన నైవైక మనయా సహ || 39

ఏవం పరమసంబోదా త్పంచవింశోనుబుద్ధవాన్‌ | అక్షరత్వం నిగచ్ఛతి త్యక్త్యా క్షర మనామయమ్‌ || 40

అవ్యక్తం వ్యక్తధర్మాణం సగుణం నిర్గుణం తథా | నిర్గుణం ప్రథమం దృష్ట్వా తాదృ గ్భవతి మైథిల || 41

అక్షరక్షరయో రేత దుక్తం తవ నిదర్శనమ్‌ | మయేవా జ్ఞాన సంపన్నం యథా శ్రుతినిదర్శనాత్‌ || 42

నిఃసందిగ్ధం చ సూక్ష్మం చ విశుద్ధం విమలం తథా | ప్రవక్ష్యామి తు తే భూయ స్త న్నిబోధ యథాశ్రుతమ్‌ || 43

సాంఖ్య యోగో మయా ప్రోక్తః శాస్త్రద్వయ నిదర్శనాత్‌ | యదేవ సాంఖ్య శాస్త్రోక్తం యోగదర్శన మేవ తత్‌

ప్రబోధన పరం జ్ఞానం సాంఖ్యానా మవనీపతే | విస్పష్టం ప్రోచ్యతే తత్ర శిష్యాణాం హితకామ్యయా || 45

బృహచ్చైవ మిదం శాస్త్ర మి త్యాహు ర్విదుషో జనాః | అస్మంశ్చ శాస్త్రే యోగానాం పునర్భవపురఃసరమ్‌ || 46

పంచవింశాత్పరం తత్త్వం పఠ్యతే చ నరాధిప | సాంఖ్యానాం తు పరం తత్త్వం యథావ దనువర్ణితమ్‌ || 47

బుద్ధ మప్రతిబుద్ధం బుద్ధ్యమానం చ తత్త్వతః | బుధ్యమానం చ బుద్ధత్వం ప్రాహు ర్యోగనిదర్శనమ్‌ || 48

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వసిష్ఠ కరాల జనక సంవాదే విద్యావిద్యయోః స్వరూపవర్ణనం నామ చతుశ్చత్వారింశ దధిక ద్విశతతమోధ్యాయ.

ఇట్లు క్షరస్థితినుండి అక్షరస్థితికి-మిశ్రస్థితినుండి శుద్ధతాస్థితికి పోవుటలోని క్రమమునే అప్రతిబుద్ధత్వదశనుండి ప్రతిబుద్ధత్వ దశకు పోవుట అందురు.

అది ఎట్లనిన: సుఖదుఃఖ సంమిశ్రమగు ఈసంసారమునందు గలదోషములను గుర్తించి విరక్తుడైన జీవుడు ఇట్లను కొనును: నేను ఇంతకాలమును ఏమిచేసితిని? నీటిలో నున్నచేప ఆనీరువేరు నేనువేరు అని తెలియక అనీరుతనకొరకే యున్నట్లు భావించికొని ఆనీటిని విడువలేక ఆమహాజలరాశిలోనే ఒకచోటినుండి మరియొకచోటికి సంచరించుచు దాని నుండి బయటకు వచ్చినచో తనగతి ఏమగునో యనిభయపడునట్లే నేనును నన్నీ దృశ్య ప్రపంచముకంటె అతీతమగు-భిన్నమగు తత్త్వమునుగాగురైఱుగక ఇంతకాలము సుఖదుఃఖ సంమిశ్రమును జననమరణ పరంపరా బహుళమునునగు ఈ సంసార ప్రవాహములో కొట్టుకొని పోవుచుంటిని. ఇక్కడనున్నవారందరును నావలెనేయున్నారు. కాని ఈ అవ్యక్త-జ్ఞేయ-అక్షర-తత్త్వము విమలమైనది. నేనును పూర్వము ఇట్టి స్థిలోనేయుంటిని. ఇంతవరకు అజ్ఞానముచే కలిగిన సంమోహుచే ప్రవృత్తుడనై అజ్ఞుడనుగా ఉంటిని. దీనికి అంతటికిని సంసర్గము-అతిసంసర్గము కారణము. దీనికి వశీభూతుడనై ఇంతకాలమును ఉత్తమ మధ్యమాధమ స్థితులనువాని వ్యత్యాసమునుకూడ గుర్తించవలేకపోతిని. ఇంక మీదటకూడ నేను ఈస్థితిలోనే ఇట్లుండజాలను. ఆ స్థిరస్థితికి పోవలెను. ఇంతకాలమును ఈ అపరాప్రకృతితో సహ వాసముచేవంచితుడనై ఇట్లుంటిని. ఇకవంచితుడనుకాజాలను. నేను వస్తుతః నిర్వికారుడను. వికారములను పొందితిని. ఇది ఈ అపరాప్రకృతియొక్క అపరాధముకాదు. నాయపరాధమే. తాత్త్వికస్థితికి పరాఙ్ముడనై ఈ మాయాకల్పిత సుఖములయందు ఆసక్తుడనైతిని. వాస్తవమున రూపములేని నేను బహురూడుడనై మమకారాహంకారాభి మానములకు వశుడనైయుంటివి. నిర్మముడనగు నేను మమకారవశుడనై ఆయా జన్మలయందు వికృతరూపుడనై తెలివిని కోల్పోయి అహంకారముతో సమత్వమును పొంది దానిని వదలుకొనలేకుంటిని. ఈ అపరాప్రకృతి తన్ను బహురూపములతో పరిణమింపజేసికొని ఇంకను నన్ను తనలో మునిగియుండునట్లు ఆజ్ఞాపించుచున్నది. నేనామెయాజ్ఞను పాటించను. ఇప్పటికి నా తప్పు తెలిసినది. నేను అహంమమకార రహితుడను. మమకారముకూడ అహంకారజనితము. ఈ రెంటిని విడిచి నిరామయతా స్థితిని పొందుదును. కాని ప్రతిబోధ రహితమగు ఈ అపరాప్రకృతిని ఆశ్రయించి యున్నంతవరకు నేను ఈ పరమార్ధతత్త్వముతో సామ్యమును పొంది ముక్తుడను కాజాలను. కనుక నేను అందులకై మొదట ఈ అహంతత్త్వముతో సామ్యసహవాస ములను విడిచెదను. ఈమెతో కూడియున్నంతవరకు నాకు క్షేమముకలుగదు. అనియిట్లు ప్రతి బుద్ధుడై క్షరత్వ వ్యక్తత్వ సగుణత్వ-స్థితులను వదలి అక్షరత్వ-అవ్యక్తత్వ- నిర్గుణత్వ-స్థితికిచేరును.

ఓజనకమహారాజా! నీకు ఇట్లు క్షరాక్షరతత్త్వ వివేచన ప్రకారమును ప్రతిపాదించితిని. ఇది సంశయ రహితము. విమలము-విశుద్ధము-సూక్ష్మము. పరంపరాగతమగు- సంప్రదాయ సిద్ధమైన-మఱియొక అంశము చెప్పెదను. వినుము-సాంఖ్యము యోగము అను రెండు దర్శనములను నీకు తెలిపితినికదా. వానిలో సాంఖ్యమే యోగము. యోగమే సాంఖ్యము. సాంఖ్య దర్శనము శిష్యుల-ముముక్షువుల హితమును కోరితత్త్వమును విస్పష్టముగా వివేచించి ప్రతిపాదించును. విద్వాంసులగువారు ఈ శాస్త్రము చాల గొప్పదియని చెప్పుదురు. ఈ శాస్త్రములో ప్రతిపాదించిన విషయమునే యోగదర్శన మున పునర్భవపురఃసరముగా-అనగా అనుభవ పూర్వకముగాఅందుకొను విధానము అధ్యయనము చేయబడుచున్నది.

ఇంతవరకును సాంఖ్యుల పరమార్థతత్త్వవివేచన ప్రకారము శాస్త్రప్రమాణాను సారము అనువర్ణించితిని. బుద్ధము-ఆప్రతిబుద్ధము. అక్షరము-క్షరము-ఈ రెండును వీటికి రెంటికి నడుమనున్న బుధ్యమానము అనుమూడు తత్త్వములును సాంఖ్యదర్శనమున వివేచించబడును. బుద్దము-అనగా బోధాత్మక మగు పరమార్థతత్త్వము. అప్రతిబుద్ధ మనగా అపరాప్రకృతికిమూలమగు మాయాతత్త్వము. బుధ్యమాన మనగా ముముక్షుని శ్రవణమననాది విచారణావ స్థయును ఆత్మ దర్శనమును కోరి యోగసాధనచేయు దశయును. యోగ దర్శనమునందు బుధ్యమానత్వ బుద్ధత్వ దశలు మాత్రము అనుభవదశలో ప్రతిపాదింపబడును.

ఇది శ్రీమహాపురాణమున అదిబ్రాహ్మమున వసిష్ఠ జనక సంవాదమున క్షరాక్షర విద్యావిద్యా బుద్ధత్వాప్రతిబుద్ధత్వ వివేచనమను రెండు వందల నలువదినాలుగవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters