Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచదశో%ధ్యాయః వ్యాసః: సంయుగే చ సతి తత్ర భూపయో రాహవాయ సముపాత్త శస్త్రయోః| క్రోధలోభవశయోః సమంతతః సంభభూవ తుములస్తు విమర్దః.
1 సంస్థితః స సమరే ధృతచాపః పార్థపః పృథులబాహుయుధాజిత్ | సంయుతః స్వబలవాహనాదికై రాహవాయ కృతనిశ్చయో నృపః.
2 వీరసేన ఇహ సైన్యసంయుతః క్షాత్రధర్మమనుసృత్య సంగరే | పుత్త్రికాత్మజ హితాయ పార్థివః సంస్థితః సురపతేః సమతేజాః
3 స బాణవృష్టిం విససర్జ పార్థివో యుధాజితం వీక్ష్య రణ స్థితం చ | గిరింతడిత్వానివ తోయవృష్టిభిః క్రోధాన్విత సత్యపరాక్రమో%సౌ. 4 తంవీరసేనో విశిఖైః శిలాశితైః సమావృణో దాశుగమై రజిహ్మగైః | చిచ్ఛేదబాణౖశ్చ శిలీముఖానసౌ తేనైవ ముక్తా నతివేగపాతినః.
5 గజరథతురగాణాం సంబభూవాతి యుద్ధమ్ సురనరముని సంఘైర్వీక్షితం చాతిఘోరమ్ | వితతవిహగబృందై రావృతం వ్యోమ సద్యః పిశిత మశిత కామైః కాకగృధ్రాదిభిశ్చ.
6 తత్రాద్భుతా క్షతజసింధు రూవాహ ఘోరా బృందేభ్య ఏవ గజవీరతుంగమాణామ్ | త్రాసాపహా నయనమార్గగతా నరాణామ్ పాపాత్మనాం రవిజమార్గ భ##వేవ కామమ్.
7 కీర్ణాని భిన్నపులినే నరమస్తకాని కేశావృతాని చ విభాతి యథైవ సింధౌ | తుంబీఫలాని విహితాని విహర్తు కామై ర్బాలైర్యథా రవిసుతా ప్రభ##వైశ్చ నూనమ్.
8 వీరం మృతం భువిగతం పతితం రథాద్వై | గృధ్రః పలార్థ ముపరి భ్రమతీతి మన్యే | జీవో%ప్యసౌ నిజశరీర మవేక్ష్య కాంతమ్ | కాంక్షత్యహో%తి వివశో%పి పునఃప్రవేష్టుమ్.
9 పదునైదవ అధ్యాయము మనోరమ సుదర్శనునితో మునుల శరణు వేడుట వ్యాసు డిట్లనియె: ఆ విధముగ నిరువురు రాజులను శస్త్రపాణులై మోహరించి రణరంగమున నిలుచుండిరి. క్రోధ లోభవశులగు వారిరువుర మధ్య తీవ్రమైన పోరాటము సంఘటిల్లెను. యుధాజిత్తు ధనుర్బాణధారియై తన విపుల సేనతో రణమున కాయత్తు డయ్యెను. వీరసేనుడును క్షాత్రధర్మానుసారముగ సురపతి సమతేజుడై సేనాసమేతుడై సమర రంగమున బోరుటకు సంసిద్ధుడయ్యెను. సత్యపరాక్రముడగు వీరసేనుడు క్రోధోద్రిక్తుడై తన యెదుట నున్న యుధాజిత్తుపై పిడుగులు పడునట్లు మహావేగముగల వాడి బాణములతో వర్షము గురిపించెను. యుధాజిత్తు తన పైకి వచ్చు శత్రు బాణములను తన వాడి బాణములతో సగములోనే తునుకలు చేయుచుండెను. ఆ రీతిగ రథ గజ తురగ పదాతి దళముల నడుమ తుముల యుద్ధము సాగుచుండెను. సుర నర మునిగణము లా పోరు గాంచుచుండెను. కాకులు గ్రద్దలు మున్నగు పక్షుల గుంపులచే నింగి కప్పబడెను. వీర గజతురగముల శరీరములనుండి నెత్తురు టేర్లు ఘోరముగ కాల్వలు గట్టసాగెను. అవి పాపాత్ముల పాలిటి వైతరుణి ప్రవాహములవలె ఘోరముగ నుండెను. యమునానదీ తట జాతులైన-ఆట లాడుకొను బాలురచే యమునయందుంచబడిన తుంబీఫలములో యన రక్తనదీతీర మందలి నెత్తుటి తిన్నెల పై తెగిపడిన పీనుగుల తలలు పడియుండెను. ప్రేతాత్మలు తమ చక్కని తనువులను వదలిపోలేక అవశములైనను మరల వానిలో బ్రవేశింప దలంచుచున్నవో యన నరదమునుండి నేలగూలిన మృతవీరుల శవములపై కాకులును గ్రద్దలును కాట్లాడుచుండెను. ఆజౌ హతో%పి నృవరః సువిమానరూఢః స్వాంకే స్థితాం సురవధూం ప్రవదత్యభీష్టమ్ | పశ్యాధునా మమ శరీర మిదం పృథివ్యాం బాణాహతం నిపతితం కరభోరు! కాంతమ్. 10 ఏకో హతస్తు రిపుణౖవ గతోంతరిక్షమ్ దేవాంగనాం సమధిగమ్యయుతో విమానే | తావత్ప్రియాహుతవహే సుసమర్ప్య దేహం జగ్రాహ కాంత మబలా సబలా స్వకీయా. 11 యుద్ధే మృతే చ సుభ##టే దివి సం తౌ తా వన్యోన్య శస్త్రనిహతౌ సహ సంప్రయాత! | తత్రైవ జఘ్నతు రలం పరమాహితాస్త్రా వేకాప్సరోర్థ విహతౌ కలహాకులౌ చ. 12 కశ్చిద్యువా సమధిగమ్య సురాంగనాంవై రూపాధికాం గుణవతీం కిల భక్తియుక్తః | స్వీయా న్గుణా న్ప్రవితతా న్ప్రవదంస్తదా%సౌ తాం ప్రేమదా మనుచకార చ యోగయుక్తః. 13 భౌమం రజో%తి వితతం దివి సంస్థితం చ రాత్రిం చకార తరణిం చ సమాపృణోద్యత్ | మగ్నం తదేవ రుధిరాంబునిధా వకస్మాత్ ప్రాదుర్బభూవ రవి రప్యతి కాంతియుక్తః. 14 కశ్చిద్గతస్తు గగనం కిల దేవకన్యాం సంప్రాప్య చారువదనాం కిల భక్తియుక్తామ్ | నాంగీచకార చతురో వ్రతనాశ భీతో యాస్యత్యయం మమ వృథా హ్యనుకూలశబ్దః. 15 సంగ్రామే సంవృతే తత్ర యుధాజిత్పృథివీపతిః | జఘాన వీరసేనం తం బాణౖ స్త్రీవైః సుదారుణౖః. 16 నిహతః స పపాతోర్వ్యాం ఛిన్న మూర్ధా మహీపతిః | ప్రభగ్నం తద్బలం సర్వం నిర్గతం చ చతుర్దిశమ్. 17 ఆ రణమందు నిహతుడై యమరుడైన యొక వీరుడు దివ్య విమాన మెక్కి తన్ను వలచివచ్చి తన యొడిలో నున్న యచ్చర లేమతో 'నో కరభోరు! బాణపు దెబ్బలకు నేలగూలిన నా చక్కని మేను గనుమా' యని యామెకు చూపుచుండెను. మఱొక్క వీరుడు హతుడై అంతరిక్షమున కేగి యమరకన్యతో దివ్య విమానమున విహరించుచుండగ నతని అబల (భార్య) సహగమనము చేసి సబలయైన దివ్యరూపమున తన పతిని కలిసికొనెను. ఇరువురు వీరులు పరస్పర శస్త్రములతో పోరి యొకేసారి యీల్గి దివి కేగి యచ్చట నొకే యందాల యచ్చరలేమ పొందికకై తగవులాడుకొనుచుండిరి. అమరుడైన వేరొక్కవీరుడు తన్నుమించిన రూప ¸°వనగుణములుగల దేవకన్యను బడసి యామెకు తనపై ప్రీతి మెండుగ నుండునట్లుగ తన గోరంతలను కొండంతలుజేసి చెప్పుకొనుచు ప్రేమతో ఆమె ననుసరించెను అత్తఱి నేలనుండి నింగి కెగసిన ధూళి సూర్యుని గప్పివేసెను. రాత్రి నొనరించెను. ఆ ధూళియే వెంటనే రక్తపు సంద్రమున బడుటవలన రవి మరల మింట వెల్గెను. ఇంకొక్క వీరుడు దివి కేగి భక్తియుక్త చారువదన యగు నొక్క దేవకామినిని జేరియు తన నిశ్చలబ్రహ్మచర్య మెక్కడ చెడిపోవునో యని తన పేరున కెక్కడ కళంక మేర్పడునోయని యా యన్నుల మిన్న కూడికకు నొప్పక మిన్నకుండెను. అట్లు దారుణముగ పోరు జరుగుచుండగ యుధాజిత్తు తన తీవ్రబాణములతో వీరసేనుని సంహరించెను. వీరసేనుడు తలతెగి నేలబడగనే యతని సమస్తబలము చెల్లాచెదరై నలుదెసలు ముట్ట పరుగెత్తెను. మనోరమా హతం శ్రుత్వా పితరం రణ మూర్ధని | భయత్రస్తా%థ సంజాతా పితుర్వైర మనుస్మరణ. 18 హనిష్యతి యుధాజిద్వై పుత్రం మమందురాశయః | రాజ్యలోభేన పాపాత్మా సేతి చింతాపరా%భవత్. 19 కిం కరోమి! క్వగచామి పితా మే నిహతో రణ | భర్తా చాపి మృతో%ద్యైవ పుత్రో%యం మమ బాలకః. 20 లోభో%తీవ చ పాపిష్ఠస్తేనకో న వశీకృతః | కిం న కుర్యా త్తదావిష్టః పాపం పార్థివసత్తమః. 21 పితరం మాతరం భ్రాతౄ న్గురూ న్స్వజన బాంధవాన్ | హంతి లోభసమావిష్టో జనో నాత్ర విచక్షణా. 22 అభక్ష్య భక్షణం లోభా దగమ్యాగమనం తథా | కరోతి కిల తృష్ణార్తో ధర్మత్యాగం తథా పునః. 23 న సహాయో%స్తి మే కశ్చి న్నగరే%త్ర మహాబలః | యదాధారే స్థితా చాహం పాలయామి సుతం శుభమ్. 24 హతే పుత్రే నృపేణాద్య కిం కరిష్యా మ్యహం పునః | న మే త్రాతా%స్తి భువనే యేనవై సుస్థితా హ్యహమ్. 25 సా%పి వైరయుతా కామం సపత్నీ సర్వదా భ##వేత్ | తీలావతీ నమేపుత్రే దయావతీ. 27 తన తండ్రి రణమున నిహతుడగుట విని మనోరమ తన తండ్రి వైరియగు యుధాజిత్తువలని భయమున విహ్వల చిత్తయయ్యెను. యుధాజిత్తు తీరని రాజ్యదాహముచే దురాశయుడు-పాపాత్ముడు. అతడు తప్పక తన కొడుకునుగూడ హతమార్చునని యామె చింతిల్లెను. నే నిపు డేమి చేయుదును? నాకు దిక్కెవ్వరు? నా తండ్రి మరణించెను. నా పతియు దివంగతు డయ్యెను. ఇక నా కొడుకో! అతడు బాలుడు. లోభము చాల చెడ్డది. దాని కెంత మంచివాడైనను తలవంచి తీరును. అట్టి లోభావిష్టులైన రాజు లేదైన చేయగలరు. లోభావిష్టుడగు నరుడు తన బందుగులను అన్నదమ్ములను తలిదండ్రులను గురువులను సైతము వెనుకముందు లాడక చంపివేయగలడు. ఆతడు తినరానిది తినును. పోరాని చోట్లకు పోవును. వేయేల! లోభతృష్ణార్తుడైన నరు డేదియైన చేయజాలును. తుద కతడు స్వధర్మమునకును తిలోదకము లిచ్చును. నే నిపుడీ నగర మందుండి నా సత్పుత్త్రుని గాపాడుకొనదలచినచో నా కిట గుండె ధైర్యముతో సాయపడువాడు లేడు. నా కొమరు డొకవేళ వైరి రాజుచేత జచ్చెనా - పిమ్మట నేను చేయగలుగునదేమి? నా కీ లోకమున నా యను వాడెవ్వడు? అతనిని చూచుకొనియే గద నా బ్రదుకు వెలగవలె! నే నింకెవనికి చెప్పుకొని సుఖింతును? నా సవతి లీలావతియు నాపై నెల్లపుడు పగబూని నది కావచ్చును. ఆమె యింక నా కొమరునిపై జాలి పూనుట కల్ల. ఇప్పు డిచ్చోటికి యుధాజిత్తు వచ్చినచో నేనీ నగరము నుండి బయటకు పోజాలను. ఆతడు నా కొమరుని కారాగారబద్ధుని చేసి తీరును. శ్రూయతే హి పురేంద్రేణ మాతుర్గర్భ గతః శిశుః | కృంతితః సప్తధా పశ్చాత్కృతాస్తే సప్త సప్తధా. 28 ప్రవిశ్య చోదరం మాతుః కరే కృత్వా%ల్పకం పతిం | ఏకోనపంచాశదపి తే%భవన్మరుతోదివి. 29 సపత్న్యై గరళం దత్తం సపత్న్యా నృపభార్యయా | గర్భనాశార్థ ముద్దిశ్య పురైతద్వై మయాశ్రుతమ్. 30 జాతస్తు బాలకః పశ్చాద్దేహే విషయుతం కిల | తేనాసౌ సగరో నామ విఖ్యాతో భువి మండలే. 31 జీవమానో%థ భర్తా వై కేయ్యా నృపభార్య | రామః ప్రవ్రాజితో జ్యేష్ఠో మృతో దశరథో నృపః. 32 మంత్రిణ స్త్వవశాః కామం యే మే పుత్రం సుదర్శనమ్ | రాజానం కర్తుకామా వై యుధాజిద్వశగాశ్చతే. 33 న మే భ్రాతా తథా శూరోయో మే బంధా త్ప్రయోచయేత్ | మహత్కష్టం చ సంప్రాప్తం మయావై దైవయోగతః. 34 ఉద్యమః సర్వథా కార్యః సిద్ధి ర్దైవా ద్ధి జాయతే | ఉపాయం పుత్రరక్షార్థం కరోమ్యద్య త్వరాన్వితా. 35 ఇతి సంచింత్య సా బాలా విదల్లం చాతిమానినమ్ | నిపుణం సర్వకార్యేషు చింత్యం మంత్రివరోత్తమమ్ 36 సమూహూయ తమేకాంతే ప్రోవాచ బహుదుఃఖితా | గృహీత్వా బాలకం హస్తే రుదతీ దీనమానసా. 37 పితా మే నిహతః సంఖ్యే పుత్రో%యం బాలకస్తథా | యుధాజిద్బలవా న్రాజా కిం విధేయం వదస్వ మే 38 తామువాచ విదల్లో%సౌ నా%త్ర స్థాతవ్యమేవ చ | గమిష్యామో వనే కామం వారాణస్యాః పునః కిల. 39 తత్ర మే మాతులః శ్రీమా న్వర్తతే బలవత్తరః | సుబాహు రితి విఖ్యాతో రక్షితా స భవిష్యతి. 40 యుధాజి ద్దర్శనోత్కంఠ మనసా నగరా ద్బహిః | నిర్గత్య రథ మారుహ్య గంతవ్యం నాత్ర సంశయః. 41 తొల్లి యింద్రుడు తన తల్లి గర్భమునందలి శిశువు నేడు ఖండములుగ చేసెను. తిరిగి యా ఖండములు ఏడు ఏడులుగ నయ్యెను. అట్టు లింద్రుడు తన తల్లి గర్భము ప్రవేశించి యొక చిన్న వజ్రము తునుకతో ఖండింపగ నలువది తొమ్మిదిమంది మరుత్తులు పుట్టి వారు దివిపై విలసిల్లుచున్నారు. మున్నొక రాజు భార్య తన సవతి గర్భవతియగుట కని యా గర్భ నాశమున కామె కింత విషము తినిపించెనని నే వింటిని. పిదప ఆమెకు పుట్టిన శిశువు విషయుతుడగుటవలన భూమండలమునందు సగరుడను విఖ్యాత నామము బడసెను. పూర్వము కైక తన సవతి కుమారుడును జ్యేష్ఠుడును నగు శ్రీరామచంద్రు నడవుల కంపగ రామ! రామ! రామ! యని యతనిని తలంచుచు దశరథుడు ప్రాణములు వదలెను గదా! ఆనాడు నా సుదర్శనునకు పట్టముగట్ట తలపెట్టిన మంత్రివర్యు లీనాడు యుధాజిత్తుని వశమున నున్నారు. ఇపుడు నా యన్నయు నన్నీ యిక్కట్టులనుండి పాపజాలినవాడు కాడు. అక్కటా! నాకు దైవదుర్విపాకమున నెంతటి సంకటము వాటిల్లెను. ఏది యెట్టులైనను ప్రయత్న మవశ్యకార్యము. కార్యసిద్ధి దైవాధీనము. కనుక నే నిపుడు నా పుత్త్ర రక్షార్థము సత్వరముపాయ మొనరింతును అని మనోరమ యీ రీతి తనలో దలపోసి సర్వకార్య నిపుణుడును అతిమానియు నగు విదల్లుడను మంత్రివర్యుని బిలిచి తన బాలుని గొని దీనాననయై 'నా తండ్రి రణమున గూలిపోయెను. నా కొడుకు బాలకుడు. యుధాజిత్తు బలశాలియగు శత్రురాజు. ఇప్పట్టున నా కర్తవ్య మేదియో యానతిమ్ము' అని యేకాంతమున నతనితో చెప్పి యేడ్చెను. 'మన మిట నుండదగదు. వనముల కేగి యచటినుండి కాశి జేరుదము. అచట మా మేనమామ సుబాహుడు గలడు. అతడు మహాబలవంతుడని ప్రఖ్యాతి గడించినవాడు. అతడు మనకు తప్పక శరణ మిచ్చును. నీవు నీ తండ్రిని దర్శించు నెపమున వెడలుము. పిమ్మట మనము రథ మెక్కి పోవచ్చును. దీనివలన నెవరికిని సందియ మావంతయు గలుగదు' అని విదల్లు డామెతో ననెను. ఇత్యుక్త్వా తేన సా రాజ్ఞీ గత్వా లీలావతీం ప్రతి | ఉనాచ పితరం ద్రష్టుం గచ్ఛామ్యద్య సులోచనే! 42 ఇత్యుక్త్వా రథ మారుహ్య సైరంధ్రీసంయుతా తదా | విదల్లేన చ సంయుక్తా నిఃసృతా నగరా ద్బహిః. 43 తత్ర హ్యార్తా%తికృపణా పితుఃశోక సమాకులా | దృష్ట్వా యుధాజితం భూపం పితరం గతజీవితమ్. 44 సంస్కార్య చ త్వరాయుక్తా వేపమానా భయాకులా | దినద్వయేన సంప్రాప్తా రాజ్ఞీ భాగీరథీతటమ్. 45 నిషాదై ర్లుంఠితా తత్ర గృహీతం సకలం వసు | రథం చాపి గృహీత్వా తే నిర్గతా దస్యవః శఠాః. 46 రుదతీ సుత మాదాయ చారువక్త్రా మనోరమా | నిర్య¸° జాహ్నవీతీరే సైరంధ్రీకరలంబితా. 47 ఆరుహ్య చ భయా చ్ఛీఘ్ర ముడువం సా భయాకులా | తీర్త్వా భాగీరథీం పుణ్యాం య¸° త్రికూటపర్వతమ్. 48 మంత్రిమాటలు విని మనోరమ లీలావతిని జేరి నేను నా జనకుని చూడ నేగుచున్నానని పలికి సైరంధ్రితోను విదల్లునితోను రథ మెక్కి నగరమునుండి నిర్గమించెను. ఆమె విగతజీవుడై పడియున్న తన తండ్రిని గాంచి ఆర్తయు అతి దీనయు శోకసమాకులయు భయవిహ్వలయునై వణకుచు తన తండ్రికి పరలోకక్రియ లొనర్పజేసి పిదప రెండునాళ్లలో గంగాతటము చేరెను. అచట పెక్కురు శఠులు దస్యులు విషాదులు చేరి యామె ధనమును దోచుకొని రథముగొని పారిపోయిరి. అట్టులా చారువక్త్రయగు మనోరమ సైరంధ్రి చేయూతగాగ తన తనయుని వెంటబెట్టుకొని వలవల ఏడ్చుచు గ్రక్కున నొక్క పడవ యెక్కి భయాకులమతితో పుణ్యభాగీరథిని దాటి త్రికూట పర్వతము జేరెను. భారద్వాజాశ్రమం ప్రాప్తా త్వరయా చ భయాకులా | సంవీక్ష్య తాపసాం స్తత సంజాతా నిర్భయా తదా. 49 మునినా సా తతః పృష్టా కా%సి కస్య పరిగ్రహః | కష్టేనాత్ర కథం ప్రాప్తా సత్యం బ్రూహి శుచిస్మితే ! 50 దేవీ వా మానుషీ వా%సి బాలపుత్రా వనే కథమ్ | రాజ్యభ్రష్టేవ వామోరు భాసి త్వం కమలేక్షణ! 51 ఏవం సా మునినా పృష్టా నోవాచ వరవర్ణినీ | రుదతీ దుఃఖసంతప్తా విదల్లం చ సమాదిశతమ్. 52 విదల్ల స్తమువాచేదం ధ్రువసంధి ర్నృపోత్తమః | తస్య భార్యా ధర్మపత్నీ నామ్నా చేయం మనోరమా. 53 సింహేన నిహతో రాజా సూర్యవంశీ మహాబలః | పుత్రో%యం నృపతే స్తస్య నామ్నా చైవ సుదర్శనః. 54 అస్యాః పితా%తి ధర్మాత్మా దౌహిత్రార్థం మృతో రణ | యుధాజిద్భయసంత్రస్తా సంప్రాప్తా విజనే వనే. 55 త్వామేవ శరణం ప్రాప్తా బాలపుత్రా నృపాత్మజా | త్రాతా భవ మహాభాగ! త్వమస్యా మునిసత్తమ! 56 ఆర్తస్య రక్షణ పుణ్యం యజ్ఞాధిక ముదాహృతమ్ | భయత్రస్తస్య దీనస్య విశేషఫలదం స్మృతమ్. 57 ఋషిః: నిర్భయా వత్సకల్యాణి! ప్తుం పాలయ సువ్రతే! న తే భయం విశాలాక్షి! కర్తవ్యం శత్రుసంభవమ్. 58 పాలయస్వ నుతం కాంతం రాజా తే%యం భవిష్యతి | నాత్ర దుఃఖం తథా శోకః కదాచి త్సంభవిష్యతి. 59 వ్యాసః: ఇత్యుక్తా మునినా రాజ్ఞీ స్వస్థా సా సంబభూ వ హ | ఉటజే మునినా దత్తే వీతశోకా తదా%వసత్. 60 సైరంధ్రీసహితా తత్ర వదల్లేన చ సంయుతా | సుదర్శనం పాలయానా న్యవసత్సా మనోరమా. 61 ఇతి శ్రీదేవీ మహాపురాణ తృతీయ స్కంధే పంచదశోధ్యాయః. పిమ్మట ఆమె త్వరత్వరగ భారద్వాజాశ్రమముజేరి యచటి తాపసులను వీక్షించి భయాకులత్వము వీడి నిర్భయత్వ మందెను. ఆమెను గని భరద్వాజ ముని 'ఓ శుచిస్మితా! నీ వెవరవు? ఎవ్వారి ధర్మపత్నివి? ఇన్ని క్లేశములతో నిక్కడి కేల వచ్చితివి? నీకు వచ్చిన బాధ యేమి? సర్వము నిజము తెలుపుము. నీవు దేవతవో! మానుషివో! ఈ బాలపుత్త్రుని గొని వచ్చుటచే నీవు రాజ్యభ్రష్టవని తోచుచున్నది.' అని పలికెను. దుఃఖసంతప్తయగు మనోరమ కన్నీరుమున్నీరుగా విలపించుచు తా బలుకలేక విదల్లుని బలుకు మనగా విదల్లు డిట్లనియె: 'ఈ యమ ధ్రువసంధి నరేశుని ధర్మపత్ని. పేరు మనోరమ. ఆ రాజు రవి వంశజుడు. అత డొక సింహమువాత బడెను. ఈ బాలకు డతని కొడుకు. ఇతని పేరు సుదర్శనుడు. ఈ మనోరమ తండ్రియు తన మనుమని పక్షమున బోరి నిహతు డయ్యెను. అంత నీమె యుధాజిత్తువలని భీతిచే నిట్లు వనములు పట్టి మీ యాశ్రమము ప్రవేశించినది. మహానుభావుడవగు ఓ మునిసత్తమా! ఈమె తన చిన్నారి ముక్కుపచ్చలారని రాకుమారునితో నిన్ను శరణు వేడుచున్నది. నీవు వీరికి రక్షకుడవు గమ్ము. ఆర్తులకు శరణ మిచ్చుట యాగములకంటె నధికపుణ్యప్రదమని పెద్దలందురు. అందును భయత్రస్తుడు దీనుడునైన వానికిచ్చుట విశేష పుణ్యఫలప్రదము, ఋషి యిట్లనియె: 'ఓ కల్యాణీ!సువ్రతా!నీవు నిర్భయముగ నిచట నీ కుమారుని పోషించుకొనుచుండుము. నీకిట శత్రుభీతి యేమాత్రమును గలుగదు. నీ బాలుని సుదర్శనుని కాపాడుకొనుము. ఇతడే రాజు గాగలడు. ఇట నీకు దుఃఖ శోకములు లేశమాత్రము సంభవింపవు, అని ఋషి పలికెను. భారద్వాజుని ప్రియవచనములు విని మనోరమ గుండె నిబ్బరము చేసికొని ముని చూపిన కుటీరమందు వీతశోకయై మసింపసాగెను. ఈ రీతిగ మున్యాశ్రమమున మనోరమ సైరంధ్రీవిదల్లులతో తన కుమారుని పోషించుకొనుచుండెను. అని వ్యాసముని జనమేజయునితో పలికెను. ఇది శ్రీదేవీభాగవతమందలి తృతీయస్కంధమున పదునేనవ యధ్యాయము.