Sri Devi Bhagavatam-1
Chapters
అథ అష్టావింశో%ధ్యాయః జనమేజయః: రథం రామేణతచ్చీర్ణంవ్రతందేవ్యాః సుఖప్రదమ్ | రాజ్యభ్రష్ట కథం సో%థకథం సీతాహృతాపునః. 1 వ్యాసః: రాజా దశరథః శ్రీమానమోధ్యాధిపతిః పురా | సూర్యవంశవరశ్చాసీ ద్దేవబ్రాహ్మణ పూజకః. 2 చత్వారో జజ్ఞిరే తస్య పుత్రా లోకేషు విశ్రుతాః | రామలక్ష్మణశత్రుఘ్నా భరతశ్చేతి నామతః. 3 రాజ్ఞః ప్రియంకరా స్సర్వే సదృశా గుణరూపతః | కౌసల్యాయాః సుతో రామః కై కేయ్యా భరతః స్మృతః. 4 సుమిత్రాతన¸° జాతౌ యమళౌ ద్వౌ మనోహరౌ | తే జాతా వై కిశోరాశ్చ ధనుర్బాణధరాః కిల. 5 సూనవః కృతసంస్కారా భూపతేః సుఖవర్ధకాః | కౌశికేన తదా%%గత్య ప్రార్థితో రఘనందనః. 6 రాఘవం మఖరక్షార్థం సూనుం షోడశవార్షికమ్ | తసై#్మ సో%యం దదౌ రామం కౌశికాయ సలక్ష్మణమ్. 7 తౌ సమేత్య మునిం మార్గే జగ్మతు శ్చారుదర్శనౌ | తాటకా నిహతా మార్గే రాక్షసీ ఘోరదర్శనా. 8 రామేణౖ కేన బాణన మునీనాం దుఃఖదా సపదా | యజ్ఞరక్షా కృతా తత్ర సుబాహుర్నిహతః శఠః. 9 మారీచో%థ మృతప్రాయో నిక్షప్తో బాణవేగతః | ఏవం కృత్వా మహత్కర్మ యజ్ఞస్య పరిరక్షణమ్. 10 ఇరువది యెనిమిదవ అధ్యాయము శ్రీసీతారామ చరిత్ర ''శ్రీరాము డెట్లు రాజ్యభ్రష్టు డయ్యెను? సీతాపహరణ మెట్లు జరిగెను? రాము డేవిధముగ సుఖప్రదమగు శ్రీదేవీ వ్రత మాచరించెను? అంతయు నాకు తేటతెల్ల మొనరింపుము'' అని జనమేజయు డడుగ వ్యాస భగవాను డిట్లనెను: పూర్వము సూర్యవంశజుడగు దశరథ మహారాజయోధ్యా పురమేలుచుండెను. ఆ రాజు దేవ బ్రాహ్మణులను బూజించువాడు. ఆ పురము సకల సంపదలతో స్వయంసమృద్ధము. ఆ రాజునకు శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులను పేర్లతో త్రిలోక విఖ్యాతి బడసిన నలువురు కొమరు లుద్భవించిరి. సుగుణగణములందు సురూపసంపదలందు వారికి వారే సాటి. వారు తమ తండ్రి కత్యంత ప్రీతిపాత్రులు. శ్రీరాముడు కౌసల్యానందనుడు. భరతుడు కైక కొడుకు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులను నిరువురు కొమరులు గలిగిరి. వారు బాల్యమునుండియే ధనుర్బాణధరులైయొప్పెసగిరి. వారు నలువురును తమ కులోచిత సంస్కారములు బడసి తమ తల్లిదండ్రులకు ప్రియము సుఖము గూర్చుచుండిరి. అంత నొక్కనాడు విశ్వామిత్ర మహర్షి యేతెంచి శ్రీరాముని తనతో బంపుమని దశరథుని కోరెను. దశరథుడు పదారేండ్ల ప్రాయముగల రాముని లక్ష్మణుని యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుని వెంట బంపెను. ఆ సుందరాకారులు ముని వెంట బయనించుచు త్రోవలో ఘోరరూపయగు తాటక యను రక్కసిని చంపిరి. ఒక్క రామబాణముననే మునులకు దుఃఖదాయినియగు ఆ రక్కసి మడిసెను. సుబాహు దానవుడు సమసెను. రాముని బాణ వేగమున మారీచుడు చచ్చినంతపనియై దూరముగ చిమ్మివేయబడెను. ఇట్లు రామలక్ష్మణులచే కౌశికుని యాగ పరిరక్షణమను సత్కర్మము నెరవేర్చి - గతాస్తే మిథిలాం సర్వే రామలక్ష్మణకౌశికాః | అహల్యా మోచితా శాపా న్నిష్పాపా సా కృతా%బలా. 11 విదేహనగరే తౌ తు జగ్మతు ర్మునినా సహ | బభంజ శివచాపం చ జనకేన పణీకృతమ్. 12 ఉపయేమే తతః సీతాం జానకీం చ రమాంశజామ్ | లక్ష్మణాయ దదౌ రాజా పుత్రీ మేకాం తథోర్మిలామ్. 13 కుశధ్వజసుతే కన్యే ప్రాపతు ర్ర్భాతరా వుభౌ | తథా భరతశత్రుఫ°్న సుశీలౌ శుభలక్షణౌ. 14 ఏవం దారక్రియా స్తేషాం భ్రాతౄణాం చాభవన్నృప | చతుర్ణాం మిథిలాయాం తు యథావిధి విధానతః. 15 రాజ్యయోగ్యం సుతం దృష్ట్వా రాజా దశరథ స్తదా | రాఘవాయ ధురం దాతుం మనశ్చక్రే నిజాయ వై. 16 సంభారం విహితం దృష్ల్వా కైకేయీ పూర్వకల్పితౌ | వరౌ సంప్రార్థయామాస భర్తారం వశవర్తినమ్. 17 రాజ్యం సుతాయ చైకేన భరతాయ మహాత్మనే | రామాయ వనవాసం చ చతుర్దశ సమాస్తథా. 18 రామస్తు వచనాత్తస్యాః సీతాలక్ష్మణసంయుతా | జగామ దండకారణ్యం రాక్షసై రుపసేవితమ్. 19 రాజా దశరథః పుత్త్రవిరహేణ ప్రపీడితః | జహౌ ప్రాణా నమేయాత్మా పూర్వశావ మనుస్మరన్. 20 భరతః పితరం దృష్ట్వా మృత మాతృకృతేన వై | రాజ్యమృద్ధం న జగ్రాహ భ్రాతుః ప్రియచికీర్షయా. 21 అటనుండి శ్రీరామలక్ష్మణులు కౌశికుని వెంట మిథిలకు జనుచుండిరి. మార్గమధ్యమున పరమపావనమగు శ్రీరామ పాదధూళి సోకినంతనే యహల్య పాపరహితయై శాపవిముక్త యయ్యెను. వారు ముని వెంట విదేహనగర మరిగిరి. అట జనకుడు సీతా స్వయంవరమున శివచాపమును పణముగ నుంచెను. దానిని రామభద్రు డవలీలగ దునిమి రమాంశ సంజాతయగు జానికిని వివాహ మయ్యెను. జనకుడు తన మరొక పుత్రియగు నూర్మిళను లక్ష్మణున కొసంగెను. సుశీలురు శుభలక్షణోపేతులు నగు భరతశత్రుఘ్ను లిర్వురును కుశధ్వజుని కూతులను పెండ్లి చేసికొనిరి. ఆ విధముగ నలుగు రన్నదమ్ములకు మిథిలాపురియందు విధి విధానముగ వివాహ మంగళ మహోత్సవము జరిగెను. శ్రీరామచంద్రుడు రాజ్యమునకు యోగ్యుడుగాగ దశరథు డతనికి పట్టము గట్టదలచెను. ఆ రామ పట్టాభిషేక మహోత్సవము గని యీసున కైక తన వశవర్తియగు దశరథుని తన వెనుకటి రెండు వరములిమ్మని కోరెను. అందులో మొదటిది తన కొడుకగు భరతునకు రాజ్యమిచ్చుట. రెండవది రాముని బదునాలుగేండ్లడవుల కంపుట. ఆ తల్లి మాట ప్రకారము సత్యధర్మపరాక్రము డగు రాముడు సీతను లక్ష్మణుని వెంటగొని నిశాచరులు తిరుగు దండకాటవి కేగెను. దశరథుడు శ్రీరామ వియోగ భారము సైపలేక తన కున్న శాపము దలంచుచు హే రామ! రామ! యనుచు ప్రాణములు వదలెను. భరతుడు తన తల్లి కుతంత్రమును తండ్రి చావును గని రామునకు ప్రియము గూర్చు తలంపుతో రాజ్యము గైకొనకుండెను. పంచవట్యాం వసన్రామో రావణావరజాం వనే | శూర్పణఖాం విరూపాం వై చకారాతి స్మరాతురామ్. 22 ఖరాదయ స్తు తాం దృష్ట్వా ఛిన్ననాసాం నిశాచరాః | చక్రుః సంగ్రామ మతులం రామేణామితతేజసా. 23 స జఘాన ఖరాదీంశ్చ దైత్యా నతిబలాన్వితాన్ | మునీనాం హితమన్విచ్ఛన్ రామః సత్యపరాక్రమః. 24 గత్వా శూర్పణఖా లంకాం ఖరదూషణఘాతనమ్ | దూషితా కథయామాస రావణాయ చ రాఘవాత్. 25 సో%పి శ్రుత్వా వినాశం తం జాతః క్రోదవశః ఖలః | జగామ రథ మారుహ్య మారీచస్యాశ్రమం తదా. 26 కృత్వా హేమమృగం నేతుం ప్రేషయామాస రావణః | సీతాప్రలోభనార్థాయ మాయావిన మసంభవమ్. 27 సో%థ హేమమృగో భూత్వా సీతాదృష్టిపథం గతః | మాయావీ చాతిచిత్రాంగ శ్చర న్ర్పబల మంతికే. 28 తం దృష్ట్వా జానకీ ప్రాహ రాఘవం దైవనోదితా | చర్మానయస్వ కాంతేతి స్వాధీనపతికా యథా. 29 అవిచార్యాథ రామో%పి తత్ర సంస్థాప్య లక్ష్మణమ్ | సశరం ధను రాదాయ య¸° మృగపదానుగః. 30 సారంగో%పి హరిం దృష్ట్వా మాయాకోటివిశారదః | దృశ్యాదృశ్యో బభూవాథ జగామ చ వనాంతరమ్. 31 మత్వా హస్తగతం రామః క్రోధాకృష్టధనుః పునః | జఘాన చాతితీక్షేన శ##రేణ కృత్రిమం మృగమ్. 32 స హతో%తిబలాత్తేన చుక్రోశ భృశదుఃఃతః | హా లక్ష్మణ: హతో%స్మీతి మాయావీ నశ్వరః ఖలః. 33 రాముడు పంచవటిలో నివసించుచుండగా రావణుని చెల్లెలు శూర్పణఖ కామాతిరేకమున రాముని సమీపించి లక్ష్మణునిచే వికృతగ జేయబడినది. ఆమె ముక్కు చెవులు తెగుటచూచి రాక్షసులు మహాతేజస్వి యగు రామునితో పోరు సలిపిరి. సత్యపరాక్రముడగు రాము డతిబలులగు ఖరాది రాక్షసులను దునుమాడి మునులకు హితము చేకూర్చెను. ఆ దుష్ట శూర్పణఖ లంక కేగి శ్రీరాముని చేతిలో ఖరదూషణాదులు చచ్చుటను రావణునకు దెలిపెను. వారి మరణవార్త విని రావణుడు కోపోద్రేకమున రథ మధిరోహించి మారీ చాశ్రమమున కేగెను; సీతన ప్రలోభ##పెట్టులకు మారీచుని అసంభవమైన బంగరు లేడిగ జేసి దానిని సీత కడ కంపెను. మాయావి యగు అతడు బంగరు లేడియై చిత్రవిచిత్ర గతులతో దుముకుచు సమీపమున తిరుగుచు కంటబడెను. దానిని గాంచి దైవ ప్రేరణచేత సీత స్వాధీన పతికవలె తన కా జింక తోలు తెచ్చి యిమ్మని రామునడిగెను. రాము డనాలోచితముగ నచ్చట లక్ష్మణు నుంచి ధనుర్బాణములు దాల్చి ఆ జింకను వెంబడించెను. ఆ మాయా చతురమగు లేడి రాముని గని యతనికి గనబడి కనబడక వనాంతరమునకు చేరెను. అది తన చేతి కందుబాటులో నుండు టెరిగి రాముడు మహాక్రోధముతో తీవ్రశరముతో మాయలేడిని గూలనేసెను. ఆ మాయావి యగు దుష్ట మారీచుడు రాముని బాణపు దెబ్బ తిని హే లక్ష్మణా! హతుడ నైతినని రోదించి నేలగూలెను. స సబ్ద స్తుముల స్తావ జ్జానక్యా సంశ్రుత స్తదా | రాఘవస్యేతి సా మత్వా దీనా దేవర మబ్రవీత్. 34 గచ్ఛ లక్ష్మణ! తూర్ణం త్వం హతో% సౌరఘునందనః | త్వా మాహ్వయతి సౌమిత్రే! సాహాయ్యం కురు! సత్వరమ్. 35 తత్రా%%హ లక్ష్మణః సీతా మంబః రామవధాదపి | నాహం గచ్ఛే%ద్య ముక్త్వా త్వా మసహాయా మిహాశ్రమే. 36 ఆజ్ఞా మే రాఘవస్యాత్ర తిష్ఠేతి జనకాత్మజే | తదతిక్రమభీతో%హం న త్యజామి తవాంతికమ్. 37 హృతం వై రాఘవం దృష్ట్వా వనే మాయావినా కిల | త్యక్త్వా త్వాం నాధిగచ్ఛామి పద మేకం శుచిస్మితే. 38 కురు ధైర్యం! న మన్యే%ద్య రామం హంతుం క్షమం క్షితౌ | నాహంత్యక్త్వా గమిష్యామి విలంఘ్యరామభాషితమ్. 39 రుదతీ సుదతీ ప్రాహ తం తదా విధినోదితా | అక్రూరా వచనం క్రూరం లక్ష్మణం శుభలక్షణమ్. 40 అహం జానామి సౌమిత్రే: సానురాగం చ మాంప్రతి | ప్రేరితం భరతేనైవ మద్దర్థ మిహ సంగతమ్. 41 నాహం తథావిధా నారీ సై#్వరిణీ కుహకాధమా | మృతే రామే పతిం త్వాం న కర్తుమిచ్ఛామి కామతః. 42 నాగమిష్యతి చే ద్రామో జీవితం సంత్యజామ్యహమ్ | వినా తేన న జీవామి విధురా దుఃఃతా భృశమ్. 43 గచ్ఛ! వా తిష్ఠ: సౌమిత్రే! న జానే%హం తవేప్సితమ్ | క్వ గతం తే%త్ర సౌహార్దం జ్యేష్ఠే ధర్మరతే కిల. 44 ఆ యార్తనాదము విని యది తన రామునిదే యని తలచి సీత దీనయై లక్ష్మణా! నీవు వేగిరమే వెళ్ళుము. రఘునందనుడు హతు డగుచు నిన్ను కేక వేసెను. అతనికి వెంటనే సాయపడుము' అని లక్ష్మణునితో పలుక నత డిట్లనియె: అమ్మా! రాముడు హతుడైనను నాశ్రమమున నిస్సహాయురాలవగు నిన్ను వదలి నేను వెళ్ళను. నన్నిచ్చట నుండుమని రామాజ్ఞ. దానిని మీరి నేను నీ సాన్నిధ్యము వదలను. ఆ మాయామృగము రాఘవుని కడు దూరము గొనిపోయి యుండినను నిన్ను వీడి నే నడుగైన ముందుకు వేయను. ధైర్య మవలంబింపుము: ఈ నేలపై మహావీరుడగు రామచంద్రుని చంపగల వాడు లేడు. రామాజ్ఞను త్రోసిపుచ్చి నిన్ను వదలి నేను వెళ్ళను.' ఆ సీత కల్లకపటము లేనిదైనను క్రూరభావమున శుభలక్షణలక్షితుడగు లక్ష్మణుని గని విధి ప్రేరణచే విలపించుచు నిట్లనియెను: సౌమిత్రీ! నీవు నాయం దనురక్తుడ వగుట నే నెఱుగుదును. భరతు డందులకే నిన్ను ప్రేరించి పంపెను. ఓ మోసగాడా! నే నొక మోసగత్తె యగు స్వేచ్ఛాచారను గాను. రాముడు చనిపోయినను కామవశత నిన్ను పతిగా గొనను. ఆ రాముడు తిరిగి రానిచో నేను నా జీవితమునే వదలి పెట్టుదును. అతడు లేమి విధవనై వంతలపాలై మనజాలను. నీవుండుము లేక పొమ్ము. నీ యభీష్టము నాకు తెలియదుగాని ధర్మరతుడగు జ్యేష్ఠు నందలి నీ సౌహార్ద మేమయ్యెను?' తచ్చ్రుత్వా వచనం తస్యా లక్ష్మణో దీనమానసః | ప్రోవాచ రుద్ధకంఠస్తు తాం తదా జనకాత్మజామ్. 45 కి మాత్థ క్షితిజే ! వాక్యం మయి క్రూరతరం కిల | కిం వద స్యత్యనిష్టం తే భావి జానే ధియా హ్యహమ్. 46 ఇత్యుక్త్వా నిర్య¸° వీర స్తాం త్యక్త్వా ప్రరుదన్భృశమ్ | అగ్రజస్య య¸° పశ్యన్ శోకార్తః పృథివీపతే. 47 గతే%థ లక్ష్మణ తత్ర రావణః కపటాకృతిః | భిక్షువేషం తతః కృత్వా ప్రవివేశ తదాశ్రమే. 48 జానాకీ తం యతిం మత్వా దత్వా%ర్యం వన్యమాదరాత్ | భైక్ష్యం సమర్పయామాస రావణాయ దురాత్మనే. 49 తాం పప్రచ్ఛ స దుష్టాత్మా నమ్రపూర్వం మృదుస్వరమ్ | కా%సి పద్మపలాశాక్షి! వనే చైకాకినీ ప్రియే! 50 పితా కస్తే%థ వామోరు: భ్రాతా కః కః పతిస్తవ | మూఢైవై కాకినీ చాత్ర స్థితా%సి వరవర్ణిని. 51 నిర్జనే విపినే కిం త్వం సౌధార్హా త్వమసి ప్రియే | ఉటజే మునిపత్నీవద్దేవకన్యా సమప్రభా. 52 అను సీత పలుకులు విని దీనవదనుడు గద్గదకంఠుడునై లక్ష్మణుడు జానకి కిట్లు పలికెను. ఓ భూమిజా! ఇంత కఠినతరముగ నా విషయమున పలుక నేల? దీనివలన మున్ముందు నీకు ఏదేని అరిష్టము చుట్టుకొనునని నా మదికి దోచుచున్నది'' అని పలికి లక్ష్మణుడు తుట్టతుదకు సీతను బాసి విలపించుచు రామభద్రుని పదచిహ్మములను గనుచు నేగెను. వెనువెంటనే రావణుడు కపటభిక్షు వేషమున నాశ్రమమును ప్రవేశించెను. సీత యతనిని యతిగ నెంచి సాదరమున నర్ఘ్యమొసగి యతనికి వన్యభోజ్య పదార్థము లర్పించెను. ఆ దురాత్ముడు మెత్తని కంఠమున మెల్లగ నామె కిట్లనెను. ఓ పద్మదళాక్షీ! ప్రియా! నీ వెవ్వతెవు? ఈ వనమున నొంటిగ నుంటివేల? నీ తండ్రి యెవడు? సోదరు డెవడు? పతి యెవడు? ఏకాకినివై మూఢురాలవువలె నుంటివేల? సౌధము లం దుండదగిన నీ వీ యడవులం దొంటిగ నుండలేల? దేవకన్యాసమాన ప్రభగల నీవు ఈ పర్ణశాలలో ముని పత్నిగ నుండదగవు.' ఇతి తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ విదేహజా | దివ్యం దిష్ట్యా యతిం జ్ఞాత్వా మండోదర్యాః పతిం తదా. 53 రాజా దశరథః శ్రీమాం శ్చత్వార స్తస్యవైసుతాః | తేషాం జ్యేష్ఠః పతిర్మే%స్తి రామనామేతి విశ్రుతిః. 54 వివాసితో%థ కైకేయ్యా కృతే భూపతినా వరే | చతుర్దశ సమా రామో వసతే%త్ర సలక్ష్మణః 55 జనకస్య సుతా చాహం సీతానామ్నీతి విశ్రుతా | భంక్త్వా శైవం ధనుః కామం రామేణాహం వివాహితా. 56 రామబాహుబలేనాత్ర వసామో నిర్భయా వనే | కాంచనం మృగ మాలోక్య హంతుం మే నిర్గతః పతిః. 57 లక్ష్మణో%పి పునః శ్రుత్వా రవం భ్రాతుర్గతో%ధునా | తమో ర్బాహుబలా దత్ర నిర్భయా%హం వసామి వై. 58 మయేదం కథితం సర్వం వృత్తాంతం వనవాసకే | తే%త్రాగత్యార్హణాం తే వై కరిష్యంతి యథావిధి. 59 యతి ర్విష్ణుస్వరూపో%సి తస్మాత్త్వం పూజితో మయా | ఆశ్రమో విపినే ఘోరే కృతో%స్తి రక్షసాం కులే. 60 తస్మాత్త్వాం పరిపృచ్ఛామి సత్యం బ్రూహి మమాగ్రతః | కో%సి త్రిదండిరూపేణ విపినే త్వం సమాగతః. 61 ఇట్లు పలికిన తరువాత గూడ ప్రారబ్ధముచే వైదేహి మండోదరిపతి యగు రావణుని దివ్య యతిగనే భావించి యతని కిట్లనెను: శ్రీయుతుడగు దశరథ మహారాజునకు నలువురు కుమారులు. వారిలో పెద్దవాడు నా పతి. అతడు పావన రామ నామమున విఖ్యాతుడు. దశరథు డిచ్చిన వరము కారణమున కైకేయి రాము నడవుల కంపెను. ఇట రాముడు లక్ష్మణునితో పదునాలుగేండ్లు వసించును. నేను జనకుని కూతురను. నన్ను సీత యందురు. శ్రీరాముడు శివధనుస్సు విఱిచి నన్ను వివాహము చేసికొనెను. ఆ రఘునాథుని బాహుబలమున మే మిట వనమున నిర్భయముగ మనగలుగుచున్నాము. నా నాథు డొక కాంచనమృగమును గని దానిని వధింప నరిగెను. అన్న పిలుపు విని లక్ష్మణుడు నిపుడే యేగెను. వారి భుజ విక్రమమున నే నిట భీతిలేక వసించుచున్నాను. మా వనవాస వృత్తాంత మంతయును నీ కెఱింగించితిని. వా రిపుడే వచ్చి నీకు తగిన సత్కారము లొనరింపగలరు. యతివగు నీవు కేవలము విష్ణు స్వరూపుడవు. కనుక నేను నిన్ను బూజించితిని. ఈ మా యాశ్రమము ఘోర రాక్షస కులముల మధ్య నడవిలో నున్నది. కాని, త్రిదండి రూపమున నీ యడవి కేతెంచిన నీ వెవడవో నా యెదుట నిజము పలుకుము. రావణః: లంకేశో%హంమరాళాక్షి! శ్రీమాన్మండోదరీపతిః | త్వత్కృతేతు కృతం రూపం మయేత్థం శోభనాకృతే. 62 ఆగతో%హం వరారోహే భగిన్యా ప్రేరితో%త్రవై | జనస్థానే హతౌ శ్రుత్వా భ్రాతరౌ ఖరదూషణౌ. 63 అంగీకురు నృపం మాం త్వం త్యక్త్వా తం మానుషం పతిమ్ | హృతరాజ్యం గతశ్రీకం నిర్బలం వనవాసినమ్. 64 పట్టరాజ్ఞీ భవ త్వం మే మందోదర్యుపరి స్ఫుటమ్ | దాసో%స్మి తవ తన్వంగి స్వామినీ భవ భావినిః. 65 జేతా%హం లోకపాలానాం పతామి తవ పాదయోః | కరం గృహాణ మే%ద్య త్వం సనాథం కురు జానకిః. 66 పితా తే యాచితః పూర్వం మయా వై త్వత్కృతే%బలే | జనకో మామువాచేత్థం పణబంధో మయా కృతః. 67 రుద్రచాపభ యాన్నాహం సంప్రాప్త స్తు స్వయంవరే | మనోమే సంస్థితం తావ న్నిమగ్నం విరహాతురమ్. 68 వనే%త్ర సంస్థితాం శ్రుత్వా పూర్వానురాగమోహితః | ఆగతో%స్మ్యసితాపాంగి సఫలం కురు మే శ్రమమ్. 69 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయ స్కంధే%ష్టావింశోధ్యాయః. అను సీత పలుకులు విని రావణు డిట్లనియె: శోభనాంగీ! నేను లంకాధిపతిని. మందోదరీపతిని. నీ కొఱ కీ రూపు దాల్చి వచ్చితిని. ఈ జనస్థానమున ఖరదూషణులను నిరువురు సోదరులు చచ్చిరని నా సోదరి చెప్పగా నామెచే ప్రేరితుడనై వచ్చితిని. ఆ రాముడు రాజ్యభ్రష్టుడు; వనవాసి; దుర్బలుడు; భాగ్యహీనుడు; మనుజ మాత్రుడు నగు పతి. అతనిని వదలి రాజు నగు నన్ను వరింపుము. నీవే మండోదరికంటె పై స్థానమున పట్టపురాణివి కమ్ము. నేను నీ దాసుడను. ఓ భామినీ! నాకు స్వామినివి గమ్ము. ఓ జానకీ! నేను లోకపాలురనే జయించితిని. ఇపుడు నీ పాదాలపై బడుచున్నాను. నన్నను గ్రహించి సనాధుని చేయుము. అబలా! నేను నీ నిమిత్తముగ నీ జనకుని యాచించితిని. కాని, యతడు పణ మేర్పరచితినని నాతో ననెను. నాకారాధ్యుడగు రుద్రుని చాపమును నేను భంగము చేసిన నా దైవమునకు నవమాన మగునను భయముచే నేను స్వయంవరమునకు రాలేదు. కాని, నా మనస్సు మాత్రము విరహాతురమై నీ యందే లగ్నమై యున్నది. నీ వీ వనమందుండుట విని పూర్వానురాగ మోహితుడనై వచ్చితిని. నా శ్రమను సఫల మొనరింపుము. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి తృతీయ స్కంధమందు ఇరువది యెనిమిదవ యధ్యాయము.