Sri Devi Bhagavatam-1
Chapters
అథ అష్టాదశో%ధ్యాయః వ్యాసః: శృణు రాజ న్ప్రవక్ష్యామి కృష్ణస్య చరితం మహత్ | (అ)వతారకారణం చైవ దేవ్యాశ్చరితమద్భుతమ్.
1 ధరైకదా భరాక్రాంతా రుదతీ చాతికర్శితా | గోరూపధారిణీ దీనా భీతా%గచ్ఛ త్త్రివిష్టపమ్.
2 పృష్టా శ##క్రేణ కింతే%ద్య వర్తతే భయమిత్యథ | కేన వై పీడితా%సి త్వం కింతే దుఃఖం వసుంధరే.
3 తచ్ఛ్రుత్వేలా తదోవాచ శృణు దేవేశ! మేఃలమ్ ! దుఃఖం పృచ్ఛసి యత్త్వం మే భారాక్రాంతా%స్మి మానద.
4 జరాసంధో మహాపాపీ మాగధేషు పతిర్మమ | శిశుపాల స్తథా చైద్యః కాశిరాజః ప్రతాపవాన్. 5 రుక్మీ చ బలవాన్ కంసో నరకశ్చ మహాబలః | శాల్వః సౌభపతిః క్రూరః కేశీ ధేనుకవత్సకౌ. 6 సర్వేధర్మ విహీనాశ్చ పరస్పర విరోధినః | పాపాచారా మదోన్మత్తాః కాలరూపశ్చ పార్థివాః. 7 తైరహం పీడితా శక్ర భారాక్రాంతాక్షమా విభో | కిం కరోమి క్వ గచ్ఛామి చింతామే మహతీస్థితా. 8 పీడితాహం వరాహేణ విష్ణునా ప్రభవిష్ణునా | శక్ర జానీహా హరిణా దుఃఖాద్ధుఃఖతరం గతా. 9 యతో%హం దుష్టదైత్యేన కశ్యపస్యాత్మజేన వై | హృతా%హం హిరణ్యాక్షేణ మగ్నా తస్మిన్మహార్ణవే. 10 తదా సూకరరూపేణ విష్ణునా నిహతో%ప్యసౌ | ఉద్ధతా%హం వరాహేణ స్థాపితా హి స్థిరా కృతా. 11 నో చే ద్రసాతలే స్వస్థా స్థితా స్యాం సుఖశాయినీ | న శక్తా%స్మ్యద్య దేవేశ ! భారం వోఢుం దురాత్మనామ్. 12 పదునెనిమిదవ అధ్యాయము శ్రీభూదేవి తన భారముబాప దేవతలను వేడుట వ్యాసమునీంద్రు డిట్లనెను : ఓ రాజా! శ్రీకృష్ణుని మహాద్భుతమైన పవిత్ర చరిత్రము - అతని యవతారములు - శ్రీ త్రిభువనేశ్వరీదేవి మహాద్భుత ప్రతిభలు వెల్లడింతును, శ్రద్ధగ నాలింపుము. మున్నొకప్పుడు శాంతమూర్తియగు భూదేవి పాపాత్ముల బరువు మోయలేక కృశించి భయపడి దీనయై యేడ్చుచు గోరూపముతో దేవలోకమున కేగెను. ఇంద్రుడామెను గని, ఓ వసుంధరా! ఇపుడు నీకు వచ్చిన భయమేమి? నిన్నెవరు బాధించిరి? నీ కీ తీరని శోక మేల గల్గెను? అనగా భూమాత సురపతి కిట్లనెను: ఓ మానదా ! నీవు నా దుఃఖ బాధలను గూర్చి యడుగుచున్నావు కావున చెప్పెద - వినుము. నేనిపుడు మోయలేనంత బరువు మోయుచున్నాను. మగధపతియైన జరాసంధుడు పాపాత్ముడు. చైద్యుడగు శిశుపాలుడు దుర్మార్గుడు. దుర్దంతుడగు కాశీపతియు దుర్మార్గుడే. బలశాలురైన నరకుడు - రుక్మి - కంసుడు - సౌభపతియగు శాల్వుడు - క్రూరుడగు కేశి - ధేనుకవత్సకులు - వీరెల్లరును పరస్పర విరోధులు - ధర్మహీనులు - పాపమతులు - మదోన్మత్తులు - కాలభయంకరులు - ఇట్టి దురహంకారులచే నేను మిక్కిలిగ పీడింపబడితిని. నేను వారి భారము మోయజాలకున్నాను. ఇంద్రా! ఇపుడు నేనేమి చేయుదు? ఎటకేగుదును? అను తీరని చింతతో బాధపడుచున్నాను. నేను మునుపు వరాహరూపము దాల్చిన ప్రభవిష్ణువైన విష్ణునిచే నెక్కువుగ బాధింపబడితిని. అది ఇతర దుఃఖముల కంటె దుఃఖతరమైనది. ఎట్లు నీ మున్ను కశ్యపాత్మజుడు దుష్టదైత్యుడు నగు హిరణ్యాక్షుడు నన్ను హరించి సాగరమునందు పడవైచెను. నాడు శ్రీ విష్ణువు వరాహరూపము దాల్చి యా రాక్షసుని జంపి నన్ను సముద్ధరించి నాలోని బాధ దీర్చి నన్ను స్థిరముగ నిలిపెను. హిరణ్యాక్షుచేతను - అతని నుండి రక్షించుటకుగా విష్ణునిచేతను కదల్చబడనిచో రసాతలమున సుఖముగ నుండెడి దాననే కదా! ఓ దేవేశా! నేను నే డా దురాత్ముల భారము మోయలేకున్నాను. అగ్రే దుష్టః సమాయాతి హ్యష్టావింశ స్థథా కలిః | తదా%హం పీడితా శక్ర గంతా%స్మ్యాశు రసాతలమ్. 13 తస్మాత్త్వం దేవదేవేశ! దుఃఖరూపార్ణవస్య చ | పారదో భవ భారం మే హర పాదౌ నమామి తే. 14 ఇంద్రః: ఇలే కింతే కరోమ్యద్య బ్రహ్మాణం శరణం వ్రజ | అహం తత్రా%%గమిష్యామి సతే దుఃఖం హరిష్యతి. 15 తచ్ఛ్రుత్వా త్వరితా పృథ్వీ బ్రహ్మలోకం గతా తదా | శక్రోపి పృష్ఠతః ప్రాప్తః సర్వదేవరపురః సరః. 16 సురభీ మాగతాం తత్ర దృష్ట్వోవాచ ప్రజాపతిః | మహీం జ్ఞాత్వా మహారాజ! ధ్యానేన సముపస్థితామ్. 17 కస్మాద్రుదసి కల్యాణి కిం తే దుఃఖం వదాధునా | పీడితా%సి చ కేన త్వం పాపాచారేణ భూర్వద. 18 ధరోవాచ: కలి రాయాతి దుష్టో%యం బిభేమి తద్భయాదహమ్ | పాపాచారాః ప్రజాస్తత్ర భవిష్యంతి జగత్పతే. 19 రాజానశ్చదురాచారాః పరస్పర విరోధినః | చౌరకర్మ రతాః సర్వే రాక్షసాః పూర్వవైరిణః. 20 తాన్హత్వా నృపతీ న్భారం హర మే%ద్య పితామహ | పీడితా%స్మి మహారాజా ! సైన్యభారేణ భూభృతామ్. 21 బ్రహ్మోవాచ: నాహం శక్త స్తథా దేవి భారవతరణ తవ | గచ్ఛావః సదనం విష్ణో ర్దేవదేవస్య చక్రిణః. 22 స తే భారాపనోదం వై కరిష్యతి జనార్దనః | పూర్వం మయా%పి తే కార్యం చింతితం సువిచార్యచ. 23 తత్ర గచ్ఛ సురశ్రేష్ఠ! యత్ర దేవో జనార్దనః | వ్యాస: ఇత్యుక్త్వా వేదకర్తా%సౌ పురస్కృత్య సురాంశ్చ గామ్. 24 ఇక ముం దిరువదెనిమిదవ కలియుగము రాగలదు. అపుడు నేను కడు ఇడుములు వడి వడిగ పాతాళమున కేగుదును. ఓ దేవేశ్వరా! నన్నీ దుఃఖసాగరమునుండి కాపాడి నా భార ముడుపుము. నీ పాదములకు మ్రొక్కుచున్నాను. అన విని ఇంద్రుడిట్లనెను : ఓ భూదేవి! ఇపుడు నేను నీ కేమియు సాయము చేయజాలను. నీవు బ్రహ్మను శరణువేడుము. అతడు నీ దుఃఖములు తొలగింపగలడు. అచటికి నేను రాగలను. అను మాటలు విని భూదేవి సత్వరముగ బ్రహ్మలోకమేగెను. ఆమె వెనుక దేవతలతోగూడి దేవేశుడు నరిగెను. ప్రజాపతి తనకొరకు వచ్చిన భూదేవిని గని ఆమెరాకకు కారణమును ధ్యానయోగమున గ్రహించి ఇట్లనెను : ఓ కల్యాణీ! భూదేవీ! నీవేల వెతతో గుందుచున్నావు? నీకు గలిగిన శోకమేమి, నిన్నే పాపాత్ముడు బాధించెను? నాకంతయు వెల్లడింపుము. ధరాదేవి యిట్లు పలికెను: ఓ జగత్పితా! పాపిష్టమగు కలియుగము రానున్నది. దానికి భయపడుచున్నాను. అపుడు ప్రజలు పాపాచారులగుదురు. రాజులెల్లరును పరస్పర విరోధులు దురాచారులు గాగలరు. రాక్షసులు వైరభావములతో దొంగతనమునకు పాల్పడుదురు. ఓ పితామహా! మహాప్రభు! ఆ దుష్ట నరపతులు నంతమొందించి నా బరువు దింపుము. ఆ రాజుల సైన్యవాహినుల భారముతో నేనెంతయో బాధపడుచున్నారు అను భూదేవి పలుకులు విని బ్రహ్మ యిట్లనెను : ఓ క్షమాదేవీ! ఇంద్రునివలె నేను గూడ నీ బరువు దింపజాలను. కనుక దేవదేవుడును చక్రియునైన విష్ణుని సన్నిధి కరుగుదము. జనార్దనుడొక్కడే నీ యీ పాపభారము దింప సమర్థుడు. నీ యీ బాధల గూర్చి నే నింతకు మున్నే యాలోచించుచుంటిని. ఓ యింద్రా! నీవును వైకుంఠమునకు రమ్ము అని వేదకర్త పలికి భూదేవి తోడను దేవతలతోడను బయలుదేరెను. జగామ విష్ణుసదనం హంసారూఢ శ్చతుర్ముఖః | తుష్టావ వేదవాక్యైశ్చ భక్తి ప్రవణమానసః. 25 బ్రహ్మా: సహస్రశీర్షా త్వమసి సహస్రాక్షః సహస్రపాత్ | త్వం వేదపురుషః పూర్వం దేవదేవః సనాతనః. 26 భూతపూర్వం భవిష్యచ్చ వర్తమానం చ యద్విభో | అమరత్వం త్వయా దత్త మస్మాకం చ రమాపతే! 27 ఏతావాన్మహిమా తే2స్తి కోన వేత్తి జగత్త్రయే | త్వం కర్తా%ప్యవితా హంతా త్వం సర్వగతిరీశ్వరః. 28 ఇతీడితః ప్రభుర్విష్ణుః ప్రసన్నో గరుడధ్వజః | దర్శనం చ దదౌ తేభ్యో బ్రహ్మాదిభ్యో%మలాశయః. 29 పప్రచ్ఛ స్వాగతం దేవన్ప్రసన్న వదనో హరిః | తతస్త్వాగమనే తేషాం కారణం చ సవిస్తరమ్. 30 తమువాచాబ్జజో సత్వా ధరాదుఃఖం చ సంస్మరన్ | భారావతరణం విష్ణో | కర్తవ్యం తే జనార్దన. 31 భువి ధృత్వా%వతారం త్వం ద్వాపరాంతే సమాగతే | హత్వా దుష్టాన్నృపా నుర్వ్యా హర భారం దయానిధే. 32 విష్ణురువాచ:- నా%హం స్వతంత్ర ఏవా%త్ర న బ్రహ్మ న శివ స్తథా | నేంద్రో%గ్ని ర్న యమస్త్వస్టా న సూర్యోవరుణ స్తథా. 33 యోగమాయావశే సర్వమిదం స్థావరజంగమమ్ | బ్రహ్మాది స్తంబపర్యంతం గ్రథితం గుణసూత్రతః. 34 యథా సా స్వేచ్ఛయా పూర్వం కర్తు మిచ్ఛతి సువ్రత | తథా కరోతి సుహితా వయం సర్వే%పి తద్వశాః. 35 యద్యహం స్యాం స్వతంత్రో వై చింతయంతు దియా కిల | కుతో%భవమత్స్యవపసుః కచ్ఛపో వా మహార్ణవే. 36 తిర్యగ్యోనిషు కో భోగః కా కీర్తిః కిం సుఖం పునః | కిం పుణ్యం కిం ఫలం తత్ర క్షుద్రయోనిగతస్య మే. 37 కోలో వా%థ నృసింహో వా వామనో వా%భవం కుతః | జమదగ్నిసుతః కస్మాత్సంభ##వేయం పితామహ. 38 నృశంసం నా కథం కర్మ కృతవానస్మి భూతలే | క్షతజై స్తు హ్రదాన్సర్వా న్పూరయేయం కథం పునః. 39 తత్కథం జమదగ్నే శ్చ పుత్త్రో భూత్వా ద్విజోత్తమః | క్షత్త్రియా న్హతవానాజౌ నిర్ధయో గర్భగానపి. 40 రామో భూత్వా%థ దేవేంద్ర ప్రావిశం దండకం వనమ్ | పదాతి శ్చీరవాసాశ్చ జటావల్కల వాన్పునః. 41 అసహాయో హ్యపాథేయో భీషణ నిర్జనే వనే | కుర్వన్నాఖేటకం తత్ర వ్యచరం విగతత్రపః. 42 న జ్ఞాతవా న్మృగం హైమం మాయయా పిహితస్తదా | ఉటజే జానకీం త్యక్త్వా నిర్గత సత్త్పదానుగః. 43 లక్ష్మణో%పి చ తాం త్యక్త్వా నిర్గతో మత్పదానుగః | వారితో%పి మయా%త్యర్థం మోహితః ప్రాకృతైర్గుణౖః. 44 భిక్షురూపం తతః కృత్వా రావణః కపటాకృతి | జహార తరసా రక్షో జానకీం శోకకర్శితామ్. 45 దుఃఖార్తేన మయా తత్ర రుదితం చ వనే వనే | సుగ్రీవేణ చ మిత్రత్వం కృతం కార్యవశాన్మయా. 46 అన్యాయేన హతో వాలీ శాపాచ్చైవ నివారితః | సహాయా న్వానరాన్కృత్వా లంకాయాం చలిత పునః. 47 బద్ధో%హం నాగపాశైశ్చ లక్ష్మణశ్చ మమానుజః | విసంజ్ఞౌ పతితౌ దృష్ట్వా వానరా విస్మయం గతాః 48 అపుడు బ్రహ్మ హంస వాహనమెక్కి మధుసూదనుని దివ్య ధామమున కరిగెను. అతడా వేదాతీతుని వేద వాక్కులతో నిండైన భక్తి భావములతో నీవిధముగ ప్రస్తుతింప దొడగెను. బ్రహ్మ యిట్లనెను : ఓ మహాదేవా! నీవు సహస్ర శీర్షుడవు. సహస్రాక్షుడవు. సహస్ర పాదుడవు. వేద పురుషుడవు. దేవదేవుడవు-సనాతనుడవు-పురుషోత్తముడవు. రమాపతీ! ఈ భూత భావి వర్తమానములు నీవే. నీవే మాకు పూర్వ మమరత్వము ప్రసాదించితివి. ఈ సర్వమునకు కర్తవు-భర్తవు-హరవు నీవే. నీవు సర్వగతివి. నీ వీశ్వరుడవు. ఈ ముజ్జగములందు నీ యిట్టి మహిమ నెవడెఱుగ గలడు, అని యిట్లు బ్రహ్మ ప్రస్తుతింపగ శ్రీహరి ప్రసన్నాత్ముడై గరుడారూఢుడై నిర్మలాత్ముడై బ్రహ్మాదులకు దర్శనభాగ్య మొసగెను. హరి వారినెల్లరను స్వాగతము అడిగి వారి రాకకు కారణమడిగెను. అపుడు బ్రహ్మ హరికి మ్రొక్కి యిట్టులనెను : జనార్దనా ! నీవీ భూదేవి భారముడుపవలయును. దానికి నీవే సమర్థుడవు. దయానిథీ! ద్వాపర యుగము పూర్తికానున్నది. నీవు భూమిపై నవతరించి దుష్టనరపతుల సంహరించి భూభారము దింపుము అన విని విష్ణు విట్లనెను : ఈ విషయమున నేనుగాని - బ్రహ్మగాని - శివుడుగాని స్వతంత్రులము గాము. ఇంద్రాగ్నులు - యమ వరుణులు - సూర్యుడు - విశ్వకర్మ - వీరిలో నేయొక్కరును స్వతంత్రులు గారు. ఈ చరాచరాత్మకమైన విశ్వమంతయును యోగ మాయాశక్తి వశమందున్నది. ఆ జగదేకమాత యొక్క గుణ సూత్రములలో నీ బ్రహ్మాదిస్తంబ పర్యంతముగల జగమంతయు గ్రుచ్చబడినది. ఆ బ్రహ్మాండ జనని స్వేచ్ఛచే స్వతంత్రించి తానేది చేయదలచునో దానిని చేసి తీరును. మే మెల్లర మా చిద్రూపిణి చేతి కీలుబొమ్మలము. నాకే స్వాంతంత్ర్యమున్నచో నేను మహా సముద్రములో చేప - తాబేలు - రూపము లేల దాల్తునో నీ మదిలో నీవే యాలోచించుకొమ్ము. నేను పెక్కు నీచయోనులందు జన్మించితిని. అట్టి నాకు భోగమేది? సుఖమేది? కీర్తి యెక్కడిది? పుణ్య ఫలితము లెక్కడివి? నేను స్వతంత్రుడ నైనచో వరాహముగ - నృసింహుడుగ - వామనుడుగ - పరశురాముడుగ నేల యవతరింతును? భూమిపై హింసాకర్మమేల యొనర్తును? ఈ గుంటలను కురుక్షేత్రమందలి స్యమంత పంచకమను హ్రదములను నెత్తురు టేర్లతో నేల పరిమార్తును? దేవేంద్రా! నేను శ్రీరామావతారమెత్తి దండకవనము చేరితిని. నారచీరలు దాల్చితిని. నేనా విజన ప్రదేశమున సహాయము లేక - దారిబత్తెములేక - లజ్జవదలి - వ్యాధుని వృత్తితో సంచరించితిని. ఆనాడు నన్నేదో తెలియని మాయ యావరించెను. కనుకనే బంగారులేడి నిజరూప మెఱుగలేక జానకిని పర్ణశాలలో వదలి జింక వెంట బడితిని. లక్ష్మణుడు గూడ నా యాన దాటి ప్రకృతి గుణములకు మోహితుడై సీతను విడిచి నన్ననుసరించెను. కపట వేషధారియగు రావణుడు దొంగసన్యాసి రూపమున వచ్చి వేగమే శోకపీడితురాలగు సీత నపహరించెను. నేనపుడు తీరని దుఃఖార్తితో బావురుమని విలపించుచు వనము వనము గ్రుమ్మరితిని. నా కార్యము నెరవేరుటకు సుగ్రీవునితో నేస్తము నెఱపితిని. నే నన్యాయమున కొడిగట్టి వాలి నంతమొందించి యతనిని శాపముక్తుని చేసితిని. వానరుల కండగ నిలిచి లంకను జొచ్చితిని. అట నేనును లక్ష్మణుడును నాగపాశములచే బంధింపబడితిమి. స్పృహదప్పి పడిపోతిమి. మమ్ముగని వానరులు భయ విస్మయములందిరి. గరుడేన తదా%%గత్య మోచితౌ భ్రాతరౌ కిల | చింతా మే మహతీ జాతా దైవం కిం వా కరిష్యతి. 49 హృతం రాజ్యం వనే వాసో మృత స్తాతః ప్రియా హృతా | యుద్ధం కష్టం దదాత్యేవ మగ్రే కిం వా కరిష్యతి. 50 ప్రథమం తు మహాదుఃఖ మరాజ్యాస్య వనాశ్రయమ్ | రాజపుత్య్రా%న్వితసై#్యవ ధనహీనస్య మే సురాః. 51 వరాటికా2పి పిత్రా మే న దత్తా వననిర్గమే | పదాతిరసహాయో%హం ధనహీనశ్చ నిర్గతః. 52 చతుర్దశైవ వర్షాణి నీతాని చ తదా మయా | క్షాత్త్రం ధర్మం పరిత్యజ్య వ్యాధవృత్త్యా మహావనే. 53 దైవాద్యుద్ధే జయః ప్రాప్తో నిహతో%సౌ మహాసురః | ఆనీతా చ పునః సీతా ప్రాప్త్రా%యోధ్యా మయా తథా. 54 వర్షాణి కతిచిత్తత్ర సుఖం సంసార సంభవమ్ | ప్రాప్తం రాజ్యం చ సంపూర్ణం కోసలా నధితిష్ఠతా. 54 పురైవం వర్తమానేన ప్రాప్త రాజ్యేన వై తదా | లోకాపవాదభీతేన త్యక్తా సీతా వనే మయా. 56 కాంతావిరహజం దుఃఖం పునః ప్రాప్తం దురాసదమ్ | పాతాళం సా గతా పశ్చాద్ధరాం భీత్త్వా ధరాత్మజా. 57 ఏవం రామావతారే%పి దుఃఖం ప్రాప్తం నిరంతరమ్ | పరతంత్రేణ మే నూనం స్వతంత్రః కో భ##వేత్తదా. 58 పశ్చాత్కాలవశాత్ప్రాప్తః స్వర్గో మే భ్రాతృభిః సహ | పరతంత్రస్య కా వార్తా వక్తవ్యా విబుధేన వై. 59 పరతంత్రో%స్మ్యహం నూనం పద్మయోనే ! నిశామయ | తథా త్వమపి రుద్రశ్చ సర్వే చాన్యే సురోత్తమాః. 60 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థ స్కంధే%ష్టాదశోధ్యాయః అంతట నాగాంతకుడైన గరుడు డేతెంచి మా నాగబంధములు త్రెంచి మమ్ము విముక్తులనుగ జేసెను. దైవము మమ్మింకేమేమి చేయునో యని నే నపుడు తలచితిని. నాకు రాజ్యము పోయెను. వనవాసము మిగిలెను. తండ్రి వెళ్ళిపోయెను. భార్య హరింపబడెను. సంకట ప్రదమగు సమరము దాపురించెను. ఇకముందేమి మూడన్నదోయని తలచితిని. రాజ్యము పోగొట్టుకొనుట కాఱడవుల పాలగుట రాచకూతురు సిరిసంపదలు కోల్పోవుట వీని మించిన దుఃఖము లింకేమి యుండును! నేను వనముల కేగునపుడు నా తండ్రి నాకు చిల్లిగవ్వగూడ ఈయలేదు. ఆనాడు దిక్కులేక కాలినడకతో నిర్ధనుడనై యిల్లు వీడితిని. ఆ ఘోరాటవిలో క్షత్రియ ధర్మమునకు స్వస్తి చెప్పి వ్యాధ వృత్తి చేపట్టి పదునాలుగేడు లెటో గడిపితిని. ఆ రావణాసురుడు దైవయోగమున చంపబడెను. నన్ను జయలక్ష్మి వరించెను. తిరిగి సీత తేబడెను. నే నయోధ్య చేరితిని. నే నెన్నియో కష్టము లెదుర్కొని పిమ్మట రాజ్యము బొందితిని. కోసల రాజ్యమునకు శాసకుడనై కొన్నేండ్లు సంసార సుఖము లనుభవించితిని. అంతలో నొక లోకాపవాదము తలయెత్తెను. దాని మూలమున సీతను మరల నడవుల కంపితిని. అపుడు మరల మోయరాని భార్యా వియోగ భారము మోయవలసి వచ్చెను. ఆ పిమ్మట భూమి జాతయగు సీత భూమిని చీల్చుకొని పాతాళమున కేగెను. ఆ తరువాత కొన్నాళ్ళకు నా తమ్ముల గూడి స్వర్గమును చేరితిని. ఇట్లు నేను శ్రీరఘురామావతారమందు స్వతంత్రత లేక నిరంతర దుఃఖము లనుభవించితిని. ఇక నీ భూమిపై స్వతంత్రుడైనవా డెవ్వడుండును? పరతంత్రుని బాధలు పండితులైనవారే పలుక జాలుదురు. బ్రహ్మా! వినుము. ఇట్లు నేను పరతంత్రుడను. అటులే యథార్థముగ నీవును రుద్రుడును సకల దేవతలును పరతంత్రులే సుమా! ఇది శ్రీమద్దేవీ భాగవత చతుర్థ స్కంధమందు శ్రీభూదేవి తన భారము తొలగింప దేవతలను వేడుటయను పదునెనిమిదవ అధ్యాయము.