Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

శ్రీః

శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతము

శ్రీ మదగ్ని మహాపురాణము

ఆంధ్రానువాద సహితము

(ద్వితీయ సంపుటము)

అనువాదము

శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

సంస్కృత శాఖాధ్యక్షులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ప్రకాశకులు :

శ్రీవేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 020.

 

ప్రథమ ముద్రణము : సర్వస్వామ్యములు ప్రకాశకులవి

నవంబరు - 1989 మూల్యము రు. 81-00 లు.

ప్రతులు : 2,000

ప్రతులకు: ముద్రణ:

శ్రీ వేంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్‌ సహజ ప్రింటర్స్‌,

గురుకృప బాకారం, ముషీరాబాద్‌,

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 048.

హైదరాబాద్‌-500 020. ఫోన్‌ : 867041.

శ్రీ ః

ప్రస్తాపన

వాఙ్మయంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. వాటిఅన్నింటి ప్రధానోద్దేశ్యం మానవునికి సన్మార్గాన్ని ఉపదేశించడమే. ప్రతిఒక్క మానవుడూ సన్మార్గాన్ని అనుసరించినట్లుయితే సమాజం అంతా తనంతతానే సన్మార్గంలో ఉంటుంది. ఈ సన్మార్గ ప్రవృత్తికే 'ధర్మం'అని పేరు. ధర్మ శబ్దానికి ప్రసిద్ధమైన నిర్వచనాలు రెండు మూడు ఉన్నాయి. ''ఇది చెయ్యాలి'' అని వేదం ఏది బోధిస్తుందో అని ''ధర్మం'' అనేది ఒక నిర్వచనం. ''చోదనా లక్షణో7ర్థో ధర్మః'' (జై.సూ) మానవుల అభ్యుదయానికీ, అనగా ఐహిక సుఖానికీ, నిఃశ్రేయసానికీ, అనగా పారలౌకిక సుఖానికీ, (మోక్షం అని కూడా దీనికి అర్థం చెప్పవచ్చును) సాధనమైనది ధర్మం అనేది మరొక నిర్వచనం. ''యతో7భ్యుదయనిఃశ్రేయససిద్ధిః స ధర్మః'' (వై.సూ) అసలు ధర్మ శబ్దానికే ''ధరించేది'' ''నిలబెట్టేది'' అని అర్థం. అనగా లోక వ్యవహారం అస్తవ్యస్తం కాకుండా, నిలబెట్టేదానికి ధర్మం అని పేరు.

ఈ ధర్మం ప్రవృత్తిరూపమూ, నివృత్తిరూపము అని రెండువిధాలుగా ఉంటుంది. ఈరెండు విధాలైన ధర్మాన్నీ కూడా వేదపురాణాదులు బోధిస్తాయి. వేదంలో ఉన్న పూర్వభాగం అంతా ప్రవృత్తి రూపధర్మమైన కర్మకాండను ఉపదేశిస్తుంది. ఉత్తరభాగం - దానికే వేదాంతం అని పేరు - జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది. జ్ఞానమే నివృత్తిరూప ధర్మం. ఈ కర్మ చెయ్యాలి, ఆకర్మ చెయ్యాలి అని పూర్వభాగం బోధిస్తే, అకర్మలన్నీ ఇచ్చే ఫలం ఆశాశ్వతమైనది; అందుచేత ఫలదృష్టితో కాకుండా కర్తవ్యతామాత్రాదృష్టిలో కొంత కాలం కర్మలను ఆచరించగా అచరించగా కొన్నాళ్ళకి చిత్తం పరిశుద్ధం అపుతుంది; అప్పుడు ఆకర్మలన్నీ పరిత్యజించి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యాలి'' అని చెపుతుంది ఉత్తర భాగం.

పురాణాలన్నీ కూడా ఇంచుమించు ఈవిషయాలనే బోధిస్తాయి. వేదోక్తాలైన కర్మలన్నీ ఏవిధంగా ఆయాఫలాలు ఇస్తాయో కర్మనిరపేక్షంగా ఆచరిస్తే చిత్తశుద్ధిని కలగచేస్తాయో, అదేవిధంగా తత్తద్దేవతోపాసనలు, తదంగాలైన మంత్ర జపాదులు, దేవాలయ నిర్మాణ దేవతా పూజాదులు కూడా ఈప్సితార్థసిద్ధినీ, చిత్తశుద్ధినీ కలిగిస్తాయి. ఇది ప్రవృత్తి ధర్మంలో అంతర్గతం అయినది. ఈ విషయాలు బోధిస్తూ అనేకమైన శాక్త -శైవ-వైష్ణవాగమాదులు ఉన్నాయి. కొన్ని పురాణాలు ఈ విషయాలను కూడ ప్రతిపాదిస్తాయి. అగ్ని పురాణంలో ఈ విషయాలు అత్యధికంగా నిక్షిప్తమై ఉన్నాయి.

భారతీయులు అతిశయోక్తి ప్రియులు. ఇది వేదాలలోనూ, స్మృతులలోనూ, పురాణాలలోను, చివరికి లౌకిక వాఙ్మయం అయిన కావ్యాల్లోనూ కూడా కనబడుతుంది. ఏదైనా పనిచేస్తే దానివల్ల మంచిఫలం కాని, చెడ్డఫలంకాని కలుగుతుంది అని చెప్పేటప్పుడు గోరంతను కొండంతగా చేసి చెప్పడం మనకుఅలవాటు. ఉదాహరణకి-చాతుర్మాస్యయాగం చేసిన వానికి లభించే పుణ్యం అక్షయ్యమైనది. ''అక్షయ్యం హ వై చాతర్మాస్య యాజినః ఫలం భవతి'' అనివేదంలో చెప్పబడింది. ఆవిధంగా అది అక్షయ్యమే అయితే ఇతర యాగాలతో పనే ఉండదు. ప్రతి ఒక్కడూ చాతుర్మాస్యయాగం చేస్తే సరిపోతుంది. అందుచేత ఇక్కడ అక్షయ్యం అనగా ఏనాటికీ తరగని పుణ్యము అని అర్థం కాదు; ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని తాత్పర్యం అని వ్యాఖ్యానం చెప్పవలసి వచ్చింది. ఇదే విధంగా ''అశ్వ మేధ యాగం చేసిన వాడూ, అశ్వమేధయాగ ప్రక్రియ తెలిసినవాడూ కూడా బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తులవుతారు'' ''తరతి తరతి బ్రహ్మహత్యాం యో7శ్వమేధేన యజతేయ ఉచైన మేవం వేది'' అని మరొకచోట చెప్పబడింది. విధానం తెలుసుకుంటేనే అంత ఫలం లభిస్తున్నప్పుడు ఎంతో శ్రమపడి యాగం చెయ్యడం ఎందుకు అని ఆశంకించుకొని వ్యాఖ్యాతలు - బ్రహ్మహత్య చెయ్యాలని మనస్సులో సంకల్పించినా కూడా పాపమే; అశ్వమేధయాగ ప్రక్రియ తెలుసుకుంటే ఈ మానసిక పాపం నశిస్తుంది. నిజంగా బ్రహ్మ హత్య చేసిఉంటే ఆ పాపం పోవడానికి గాయం చెయ్యాలి అని సమన్వయం చేసి చెప్పారు. ఇలా వందలకొలది ఉదాహరణలు చూపవచ్చు. ''ఇది ఒక విషయంలో ఉన్న మంచిచెడ్డలను చెప్పే విధానం మాత్రమే. దానిని అక్షరశః గ్రహించ కూడదు; సత్యంగా భావించ కూడదు'' అని మీమాంసకులు మనకు అనేక స్థలాలలో స్పష్టంగా చెప్పే ఉన్నారు. శాస్త్రంలో ''నహినిందాన్యాయం'' అని ఒక న్యాయం ఉన్నది. ''నహి నిన్దా నిన్ద్యం నిన్దితుం ప్రవర్తతే, అపి తు స్తుత్యం స్తోతుమ్‌ '' అనేది ఆ న్యాయం. ''ఏదైనా ఒక విషయాన్ని కాని వస్తువును కాని, వ్యక్తిని కాని నిందిస్తున్నారంటే అట్లా నిందించడంలో వారి తాత్పర్యం కాదు; ఒకదానికి ఉన్న ప్రాశస్త్యాన్ని చెప్పడానికే మరొకదాన్ని నిందించడం జరుగుతుంది'' అని ఈ న్యాయానికి అర్థం. దీన్నే కొంచెం మారుస్తే ''నహి స్తుతి న్యాయం'' అవుతుంది. ''న హి స్తుతిః స్తుత్యం స్తోతుం ప్రవర్తతే అపితు నిన్ద్యం నిన్దితుమ్‌'' ఒక దానిని స్తుతిస్తున్నారంటే దానిని స్తుతించడంలో తాత్పర్యం కాదు నిందించాలనుకొన్న దానిని నిందించడంలో తాత్పర్యం అని ఈ న్యాయం ఏర్పడుతుంది. ఈ దృష్టిలో చూస్తే వేదాలలో కనబడే స్తుతి రూపంలో కాని నిందా రూపంలో కాని ఉన్న అతిశయోక్తులు మనకు అర్థం అవుతాయి. అలా కాకపోతే అవి చాలా విడ్డూరంగాను, విపరీతంగాను కనబడతాయి.

''స్కన్దే కవాటే పాషాణ అర్ద్రవస్త్రం న నిక్షిపేత్‌

అథవా నిక్షి పేన్మూఢః రౌరవం నరకం వ్రజేత్‌.''

అని ఒక స్మృతి వాక్యం. ''తన బుజం మీద కాని, తలుపు మీద కాని, బండ్రాతి మీదగాని తడిబట్ట ఉంచకూడదు. అథవా ఎక్కడైనా మూఢాత్ముడు అలా ఉంచుతే రౌరవ నరకం లోనికి వెళ్ళిపోతాడు''అని దీని భావం. తడి బట్ట బుజంమీద చాలాసేపు ఉంచుకుంటే అనారోగ్యం చేయవచ్చు; తలుపు నాని చిమికి పోవచ్చు. రాతి మీద చాలా సేపు ఉంటే బట్ట చిమికి పోవచ్చు. అందుచేత అలా చేయవద్దని చెప్పడం బాగానే ఉంది. అలా ఉంచితే రౌరవంలో పడతాడు అనేది అత్యతిశయోక్తి. కొందరు వేద బాహ్యులనీ, వారి చెవిలో వేదవాక్యాలు పడితే అతికఠోరమైన శిక్ష ఇవ్వాలనీ చెప్పే వాక్యాల వంటి వాక్యాలు కూడా ఈ కోవకి చెందినవే. వాటి తాత్పర్యార్థం వేరనీ, ఆనాటి విధి నిషేధవాక్యాలు ఆ విధంగానే ఉండేవనీ గ్రహించకపోతే మొత్తం ఈ వాఙ్మయం మీదనే చాలా మందికి వైమనస్యమూ, వైముఖ్యమూ కలిగే ప్రమాదం ఉన్నది. అది కనబడుతూన్నది కూడా.

పురాణాల విషయం కూడా అంతే. పురాణాలలో అనేక వ్రతాలు చెప్పబడి ఉన్నాయి. ప్రతి ఒక్క వ్రతానికి చివర - ''ఇది వ్రతాలన్నింటిలోకీ అత్యుత్తమమైన వ్రతం, దీన్ని మించిన వ్రతం మరొకటి లేదు'' అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి స్థలాలలో అన్నింటిలోనూ మనం వెనక చెప్పుచున్న న హి నిందా న్యాయాన్నో, న హి స్తుతి న్యాయాన్నో సమన్వయించు కోవాలి. లేకపోతే కుదరదు. అదేవిధంగా కొన్ని పురాణాలలో ఒక్కొక్క దేవతకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ దేవతకు సంబంధించిన కథలు చాలా చెప్పి, ఆ దేవతయే జగత్సృష్టి - స్థితి - లయాలకు కారణమనీ, ఇతర దేవతలందరూ ఈ దేవతకు దాసుల వంటి వారనీ వర్ణించడం జరుగుతుంది. దానితో 'ఈ' పురాణంలో చెప్పినట్లు విష్ణువే ప్రధాన దేవత అంటూ వైష్ణవులూ, శివుడే గొప్పవాడని శైవులు, దేవియే సర్వోత్తమ దేవత అనిశాక్తేయులూ, మరొకదేవత గొప్పదనీ మరికొందరూ చెపుతూ, తమకిష్టమైన దేవతకు ప్రాధాన్యం ఇచ్చిన పురాణాలే ప్రమాణాలనీ, ఇతర పురాణాలు ఆ ప్రమాణాలనీ వాదులాడుకుంటూ ఉంటారు. చివరకి సుందోప సుంద న్యాయంచేత అన్ని పురాణాలూ కూడా అప్రామాణ్య వరాహతాలు కావలసి వస్తుంది. అందుచేత వివిధ వ్రతాల విషయంలో అనుసరించిన సమన్వయాన్నే దేవతల విషయంలో కూడా అనుసరించవలసి ఉంటుంది.

బహుశా ఈ లాంటి భ్రాంతి కలగవచ్చుననే ఉద్దేశ్యంతోనే ప్రతి పురాణంలోనూ, సంక్షిప్తంగానో, విస్తృతంగానో, అక్కడక్కడ నివృత్తి ధర్మాన్ని కూడా బోధించడం కనబడుతుంది. ఈ అగ్ని పురాణంలో అక్కడక్కడ అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు సూత్ర రూపంగా చెప్పినా చివరి ఆరు అధ్యాయాలలో జ్ఞాన మార్గాన్ని గూర్చి, అద్వైతతత్వాన్ని గూర్చి అతి విస్తృతంగా చెప్పబడింది. కొన్ని అధ్యాయాలలో భగవద్గీతాసారం చెప్పబడింది.

''అహం సాక్షీ చ చిన్మాత్రో జాగ్రత్స్వప్నాదికస్యచ|

నాజ్ఞానం చైవ తత్కార్యం సంసారాదిక బన్ధనమ్‌.

నిత్యశుద్ధ బుద్ధముక్త సత్యమానన్ద మద్వయమ్‌|

బ్రహ్మాహమస్మ్యహం బ్రహ్మ పరంజ్యోతిర్విముక్త ఓమ్‌.''

- అ. పు. 377-20, 21

''యత్తద్ర్బహ్మ యతః సర్వం యత్సర్వం తస్య సంస్థితమ్‌|

అగ్రాహ్యక మనిర్దేశ్యం సుప్రతిష్ఠంచ యత్పరమ్‌.

పరాపరస్వరూపేణ విష్ణుః సర్వహృది స్థితః|

యజ్ఞేశం యజ్ఞపురుషం కేచి దిచ్ఛన్తి తత్పరమ్‌|

కేచిద్విష్ణుం హరం కేచిత్‌ కేచిద్ర్బహ్మాణ మీశ్వరమ్‌.

ఇన్ద్రాదినామభిః కేచిత్‌ సూర్యం సోమంచ కాలకమ్‌|

బ్రహ్మాదిస్తమ్బ పర్యన్తం జగద్విష్ణుం వదన్తిచ.''

-అ. పు. 382. 16 19.

ఒకే పరమాత్మ వివిధ నామరూపాలతో వర్ణింపబడుతున్నాడు; వాస్తవంలో జీవపరమాత్మలకే భేదం లేదు; ఉన్న భేదం అంతా వ్యావహారిక దశలోనే, అని గ్రహించిన పిమ్మట ఆయాదేవతల విషయంలో ఉత్కర్షాపకర్ష బుద్ధికి కాని, ఆయా పురాణాల ప్రామాణ్యా ప్రామాణ్యా చింతకు కాని అవకాశం లేదు. ఇలాంటి అద్వైత దృష్టిని ప్రసాదించి, ఆపాతతః ఆంతరంగిక విరోధం ఉన్నట్లుగా కనబడే శ్రుతులలో కాని, స్మృతులలో కాని, పురాణాలలో కాని ఆంతరంగిక విరోధం ఏదీ లేదనీ, ఈమూడింటికీ పరస్పర విరోధం కూడా లేదనీ ప్రతిపాదించడం చేతనే శంకర భగవత్పాదులు ''శ్రుతిస్సృతి పురాణాలయులు''గా కొనియాడబడు తున్నారు.

అందుచేత కొందరు విభిన్న సాంప్రదాయికులు భావించినట్లు కొన్ని పురాణాలే ప్రమాణాలు, కొన్ని కావు అని కాని కొందరు ఆధునికులు భావిస్తున్నట్లుగా అసంబంద్ధాలూ అతిశయోక్తి భరితాలూ అవడంచేత ఏ పురాణమూ కూడా పరిగ్రాహ్యం కాదు అని కాని అనుకోకుండా, సరియైన అవగాహనతో ఈ పురాణాలను పఠిస్తే లాభం పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికే ఇంతగా వ్రాయవలసి వచ్చినది.

కేవలమూ ఋషిదేవతాదుల కథలు, రాజుల చరిత్రలూ చెప్పడమే కాకుండా అన్ని పురాణాలలోనూ, కూడా ప్రసక్తాను ప్రసక్తంగా రాజధర్మాది లౌకిక విషయాలు కూడా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. (చూ.మొదటి సంపుటం ఉపోద్ఘాతము) ఆ విధంగా చూస్తే పురాణాలన్నీ ప్రాచీన భారతదేశానికి సంబంధించిన ఆచార వ్యవహారాదులకు, మత విశ్వాసాదులకు, తదితర సాంస్కృతిక విషయాలకూ, విద్యాస్థానాలకూ దర్పణాలని చెప్పవచ్చును.

ఈ నాడు అలభ్యంగాను, కష్టలభ్యంగాను ఉన్న ఈ పురాణాలను ఆంధ్రభాషానువాదంతో ఆంధ్ర పాఠకలోకానికి అందజేస్తున్న శ్రీ.పి. వెంకటేశ్వర్లుగారి శ్రద్ధ ప్రశంసనీయము.

15-11-1989 పుల్లెల శ్రీ రామచంద్రుడు.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page