Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకాదశోధ్యాయః

వీరభద్రుడు

నందీశ్వర ఉవాచ |

ఏవమభ్యర్థితో దేవైర్మతిం చక్రే కృపాలయః | మహాతేజో నృసింహాఖ్యం సంహర్తుం పరమేశ్వరః || 1

తదూర్ధ్యం స్మృతవాన్‌ రుద్రో వీరభద్రం మహాబలమ్‌ | ఆత్మనో భైరవం రూపం ప్రాహ ప్రలయకారకమ్‌ || 2

ఆజగామ తతస్సద్యో గణానామగ్రణీర్హసన్‌ | సాట్టహాసైర్గణవరైరుత్పతద్భిరితస్తతః || 3

నృసింహరూపైరత్యుగ్రైః కోటిభిః పరివారితః | మాద్యద్భిరభితో వీరైర్నృత్యద్భిశ్చ ముదాన్వితైః || 4

క్రీడద్భిశ్చ మహావీరై ర్ర్బహ్మాద్యైః కందుకైరివ | అదృష్టపూర్వై రన్యైశ్చ వేష్టితో వీరవందితః || 5

కల్పాంత జ్వలన జ్వాలో విలసల్లో చనత్రయః | అశస్త్రో హి జటాజూటీ జ్వలద్బాలేందుమండితః || 6

బాలేందు వలయాకార తీక్షణ దంష్ట్రాంకురద్వయః | ఆఖండలధనుఃఖండా శని భభ్రూలతాన్వితః || 7

మహాప్రచండహుంకార బధిరీకృత దిఙ్మఖః | నీలమేఘాంజనశ్యామో భీషణశ్శ్మశ్రులో%ద్భుతః || 8

వాద్యఖండ మఖండా భాం భ్రామయంస్త్రి శిఖం ముహుః | వీరభద్రో%పి భగవాన్‌ వీరశక్తి విజృంభితః || 9

నందీశ్వరుడిట్లు పలికెను-

దేవతలిట్లు ప్రార్థించగా, దయానిధియగు పరమేశ్వరుడు నృసింహరూపములో నున్న మహాతేజస్సును శమింపజేయ నిర్ణయించెను (1). తరువాత రుద్రుడు మహాబలశాలి, తనయొక్క భయావహమగు రూపము, ప్రలయమున చేయగలవాడు అగు వీరభద్రుని స్మరించెను (2). అపుడు వెంటనే ఆ గణాధ్యక్షుడు నవ్వుకుంటూ విచ్చేసెను. ఆతని చుట్టూ అట్ట హాసము చేయుచూ ఇటునటు గెంతుచున్న, భయంకరనృసింహరూపమును దాల్చియున్న కోట్లాది గణవీరులు ఉండిరి. బలమదాన్వితులైన ఆ వీరులు ఆనందముతో నాట్యమును చేయుచుండిరి (3, 4). ఆ మహావీరులు బ్రహ్మాదులను బంతి ఆట ఆడగల్గుదురు. వారింతకు ముందెన్నడు కనీవినని పరాక్రమమును కలిగి యుండిరి. ఆ వీరులు వీరభద్రుని చుట్టు ముట్టి వందనములాచరించుచుండిరి (5). ప్రళయకాలాగ్నితో సమమగు తేజస్సు గలవాడు, మూడునేత్రములతో ప్రకాశించువాడు, చేతిలో ఆయుధములు లేనివాడు, జటా జూటమును దాల్చినవాడు, ప్రకాశించే బాలచంద్రుడు అలంకారముగా గలవాడు (6), చంద్రరేఖవలె వలయాకారముగా నున్న తీక్షణమైన రెండు దంష్ట్రల అంకురములు గలవాడు, ఇంద్ర ధనస్సు యొక్క తునకలవలె భాసించు తీగలవంటి కనుబొమలు గలవాడు (7), మిక్కిలి ప్రచండమగు హుంకారముచే దిక్కులు చెముడు పొందునట్లు చేయువాడు, నల్లని మేఘమువలె, కాటుకవలె శ్యామలవర్ణము గలవాడు, భయంకర అద్భుతాకారుడు, మీసములు గలవాడు (8), అఖండకాంతి గల త్రిశూలమును వాద్యవిశేషమును వలె పలుమార్లు త్రిప్పుచున్నవాడు అగు వీరభద్ర భగవానుడు వీరశక్తితో విజృంభించెను (9).

స్వయం విజ్ఞాపయామాస కిమత్ర స్మృతి కారణమ్‌ | ఆజ్ఞాపయ జగత్స్వామిన్‌ ప్రసాదః క్రియతామితి || 10

ఇత్యాకర్ణ్య మహేశానో వీరభద్రోక్త మాదరాత్‌ | విలోక్య వచనం ప్రీత్యా ప్రోవాచ ఖలదండధృక్‌ || 11

వీరభద్రుడు స్వయముగా శివునకు ఇట్లు విన్నవించెను: హే జగత్ర్పభూ! నన్ను స్మరించుటకు కారణమేమి? నన్ను అనుగ్రహించి ఆజ్ఞాపించుడు (10). దుష్టులను శిక్షించే మహేశ్వరుడు వీరభద్రుని ఈ పలుకులను విని ఆతనిని ఆదరముతో చూచి ప్రేమతో ఇట్లు పలికెను (11).

శంకర ఉవాచ |

అకాలే భయముత్పన్నం దేవానామపి భైరవమ్‌ | జ్వలితస్స నృసింహాగ్ని శ్శ మయైనం దురాసదమ్‌ || 12

సాంత్వయన్‌ బోధయాదౌ తం తేన కిం నోపశామ్యతి | తతో మత్పరమం భావం భైరవం సంప్రదర్శయ || 13

సూక్ష్మం సంహృత్య సూక్ష్మేణ స్థూలం తేజసా | వక్త్రమానయ కృత్తిం చ వీరభద్ర మమాజ్ఞయా || 14

శంకరుడిట్లు పలికెను-

కాలము కాని కాలములో దేవతలకు కూడా మహాభయము సంప్రాప్తమైనది. నృసింహుని క్రోధాగ్ని మండుచునే యున్నది. సమీపింప శక్యము కాని ఆ అగ్నిని శాంతింప జేయుము (12). ముందు ఆతనికి మంచి మాటలతో నచ్చ జెప్పుము. అయిననూ ఆతడు శాంతించినచో, అప్పుడు నా యొక్క పరమభయంకరమగు రూపమును ప్రద్శించుము (13). ఆతని సూక్ష్మమగు పరాక్రమమును సూక్ష్మతేజస్సుతో మరియు స్థూలమగు పరాక్రమమును అదే విధమగు తేజస్సుతో ఉపశమింప జేయుము. ఓ వీరభద్రా! నా ఆజ్ఞచే ఆతని తలను, చర్మమును తీసుకొని రమ్ము (14).

నందీశ్వర ఉవాచ|

ఇతి నిష్ఠో గణా ధ్యక్షో(?)ప్రశాంతం వపురాస్థితః | జగామ రంహసా తత్ర యత్రాస్తే నరకేసరీ || 15

తతస్తం బోధయామాస వీరభద్రో హరో హరిమ్‌ | ఉవాచ వాక్యమీశానః పితా పుత్ర మివౌరసమ్‌ || 16

నందీశ్వరుడిట్లు పలికెను-

ఈ విధముగా ఆదేశింపబడినవాడై గణాధ్యక్షుడగు వీరభద్రుడు ప్రసన్నమగు రూపమును దాల్చి నృసింహుడు ఉన్నచోటకు వేగముగా చేరుకొనెను (15). అపుడు పాపహరుడు, ఈశానస్వరూపుడు అగు వీరభద్రుడు ఆ నృసింహునకు కన్నకొడుకునకు వలె నచ్చచెప్పి ఇట్లు పలికెను (16).

వీరభద్ర ఉవాచ |

జగత్సుఖాయ భగవన్నవతీర్ణో%సి మాధవ | స్థిత్యర్థం త్వం ప్రయుక్తో%సి పరేశః పరమేష్ఠినా || 17

జంతుచక్రం భగవతా ప్రచ్ఛిన్నం మత్స్వరూపిణా | పుచ్ఛేనైవ సమాబధ్య భ్రమన్నేకార్ణవే పురా || 18

బిభర్షి కర్మరూపేణ వారాహేణోద్ధృతా మహీ | అనేన హరిరూపేణ హిరణ్య కశిపుర్హతః || 19

వామనేన బలిర్బద్ధస్త్వ యా విక్రమతా పునః | త్వమేవ సర్వభూతానాం ప్రభవః ప్రభురవ్యయః || 20

యదా యదా హి లోకస్య దుఃఖం కించిత్‌ ప్రజాయతే | తదా తదావతీర్ణస్త్వం కరిష్యసి నిరామయమ్‌ || 21

నాధికస్త్వత్సమో%ప్యస్తి హరే శివపరాయణః | త్వయా వేదాశ్చ ధర్మాశ్చ శుభమార్గే ప్రతిష్టితాః || 22

యదర్థమవతారో%యం నిహతస్స హి దానవః | హిరణ్యకశిపుశ్చైవ ప్రహ్లాదో%పి సురక్షితః || 23

అతీవ ఘోరం భగవన్నరసింహవపుస్తవ | ఉపసంహార విశ్వాత్మంస్త్వమేవ మమ సన్నిధౌ || 24

వీరభద్రుడిట్లు పలికెను-

హే భగవాన్‌ ! లక్ష్మీపతి! నీవు జగత్తుల సుఖము కొరకు అవతరించితివి. పరమేశ్వరుడు దేవదేవుడవగు నిన్ను జగద్రక్షణ కొరకు నియోగించినాడు (17). భగవంతుడవగు నీవు పూర్వము ప్రళయకాలములో సర్వము జలపూర్ణమై యుండగా మత్స్యరూపమును దాల్చి వివిధప్రాణులను నీ తోకతో ఒక చోటకు చేర్చి రక్షించితివి (18). నీవు యజ్ఞ వరాహరూపమును దాల్చి భూమిని పైకి లేవనెత్తితివి. ఈ నృసింహరూపముతో హిరణ్యకశిపుని సంహరించితివి (19). నీవు వామనుడవై అడుగులతో బ్రహ్మాండమును కొలిచి బలిని బంధించితివి. ప్రాణులన్నింటికి ఉత్పత్తి స్థానము నీవే. అవినాశియగు నీవే జగత్ర్పభుడవు (20). ఏ ఏ సమయములలో జగత్తునకు కొంత దుఃఖము కలుగునో, ఆయా సమయములలో నీవు అవతరించి ఆ దుఃఖహేతువును తొలగించెదవు (21). ఓ హరీ! శివ భక్తిలో నీతో సమానమగువాడు గాని, నిన్ను మించినవాడు గాని లేడు. నీవు ధర్మములను, వేదములను మంగళకరమగు మార్గములో నిలబెట్టితివి (22). నీవీ అవతారమును ఎందులకు స్వీకరించితివో, ఆ హిరణ్యకశిపుడనే రాక్షసుడు సంహరింపబడి ప్రహ్లాదుడు చక్కగా రక్షింపబడినాడు (23). హే భగవాన్‌! నీ ఈ నృసింహదేహము మిక్కిలి భయంకరముగానున్నది. హే జగద్రూపా! నీవు నా సన్నిధిలో నిశ్చయముగా దీనిని ఉపసంహరించుము (24).

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్తో వీరభ##ద్రేణ నృసింహశ్శాంతయా గిరా | తతో%ధికం మహాఘోరం కోపం చక్రే మహామదః || 25

ఉవాచ చ మహాఘోరం కఠినం వచనం తదా | వీరభద్రం మహావీరం దంష్ట్రాభిర్భీషయన్‌ మునే || 26

నందీశ్వరుడిట్లు పలికెను-

వీరభద్రుడు శాంతమగు వాక్కుతో నిట్లు పలుకగా, మిక్కిలి గర్వించియున్న నృసింహుడు అంతకు ముందున్న దానికంటే అధికముగా మిక్కిలి భయమును గొల్పు కోపమును ప్రదర్శించెను (25). ఓ మునీ! అపుడు నృసింహుడు తన దంష్ట్రలతో భయమును కలిగించుచూ మిక్కిలి ఘోరము కఠినము అగు వాక్కును మహావీరుడగు వీరభద్రుని ఉద్దేశించి పలికెను (26).

నృసింహ ఉవాచ |

ఆగతో%సి యతస్తత్ర గచ్ఛ త్వం మా హితం వద | ఇదానీం సంహరిష్యామి జగదేతచ్చరాచరమ్‌ || 27

సంహర్తుం నహి సంహారః స్వతో నా పరతో%పి వా | శాసితం మమ సర్వత్ర శాస్తా కో%పి న విద్యతే || 28

మత్ర్పసాదేన సకలమభయం హి ప్రవర్తతే | అహం హి సర్వశక్తీనాం ప్రవర్తక నివర్తకః || 29

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా | తత్తద్విద్ధి గణాధ్యక్ష మమ తేజోవిజృంభితమ్‌ || 30

దేవతా పరమార్థజ్ఞం మామేవ పరమం విదుః | మదంశా శ్శక్తి సంపన్నా బ్రహ్మ శక్రాదయస్సురాః || 31

మన్నాభికమలా జ్ఞాతః పురా బ్రహ్మా జగత్కరః | సర్వాధికస్స్వతంత్రశ్చ కర్తా హర్తాఖిలేశ్వరః || 32

ఇదం తు మత్పరం తేజః కిం పునశ్శ్రోతుమిచ్ఛసి | అతో మాం శరణం ప్రాప్య గచ్ఛ త్వం విగతజ్వరః || 33

అవేహి పరమం భావ మిదం భూతం గణశ్వర | మామకం సకలం విశ్వం సదేవాసురమానుషమ్‌ || 34

కాలో%స్మ్యహం లోకవినాశ##హేతుః లోకాన్‌ సమాహర్తుమహం ప్రవృత్తః |

మృత్యోర్మృత్యుం విద్ధి మాం వీరభద్ర జీవన్త్యేతే మత్ర్ప సాదేన దేవాః || 35

నృసింహుడిట్లు పలికెను-

ఎక్కనుండి వచ్చితివో, నీవు అచటికే పొమ్ము, నాకు హితమును బోధించకుము. ఈ స్థావరజంగమాత్మకమగు జగత్తును ఈ క్షణములో నశింప జేసెదను (27). నన్ను నేను గాని, ఇతరులు గాని ఉపసంహరించుట సంభవము గాదు. నా శాసనము సర్వత్రా ప్రసరించును. నన్ను ఏ విషయములోనైననూ శాసించగలవాడు లేనే లేడు (28). నా అనుగ్రహము చేతనే సర్వము భయము లేకుండగా నడుచుచున్నది. శక్తులనన్నిటినీ ప్రేరేపించువాడును, ఉపసంహరించువాడను నేనే (29). ఓ గణాధిపతీ! ఈ జగత్తులో మహిమ, శోభ, సంపద, శక్తి గల ఏ ప్రాణి గలదో, అవి అన్నియూ నా తేజస్సు యొక్క విలాసయేనని ఎరుంగుము (30). పరమతత్త్వము నెరింగిన పరమాత్మను నేనే నని దేవతలు ఎరుంగుదురు. బ్రహ్మ ఇంద్రుడు మొదలగు దేవతలు నా అంశంనుండి జన్మించి శక్తిని పొందియున్నారు (31). జగత్తుని సృజించే బ్రహ్మ పూర్వము నా నాభియందలి కమలమునుండి ఉద్భవించినాడు. సర్వులకంటె అధికుడు, స్వతంత్రుడు, సృష్టికర్త మరియు సంహర్త అగు సర్వేశ్వరుడు నేనే (32). ఈ అవతారము నా సర్వాధికతేజోరూపము. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? కావున నీవు నన్నుశరణు పొంది భయాది జ్వరములను తొలగించుకొని వెళ్లుము (33). ఓ గణాధ్యక్షా! ఈ విధముగ నున్న పరమసత్యమునెరుంగుము. దేవతలు, రాక్షసులు మరియు మనుష్యులతో గూడియున్న జగత్తు అంతయూ నాదే (34). లోకముల వినాశమునకు కారణమగు మృత్యువు నేనే. నేను లోక సంహారము కొరకు ప్రవర్తిల్లుచున్నాను. ఓ వీరభద్రా! నేను మృత్యువునకు కూడ మృత్యువునని యెరుంగుము. ఈ దేవతలు నా అనుగ్రహము చేతనే జీవించియున్నారు (35).

నందీశ్వర ఉవాచ|

సాహంకారం వచుశ్శ్రుత్వా హరేరమితవిక్రమః విహస్యోవాచ సావజ్ఞం తతో విస్ఫురితాధరః || 36

నందీశ్వరుడిట్లు పలికెను-

సాటిలేని పరాక్రమము గల వీరభద్రుడు అహంకారముతో గూడియున్న నృసింహుని మాటలను విని కోపముతో వణుకుచున్న క్రింది పెదవి గలవాడై అనాదరణ పూర్వకముగా నవ్వి ఇట్లు పలికెను (36).

వీరభద్ర ఉవాచ|

కిం న జానాసి విశ్వేశం సంహర్తారం పినాకినమ్‌ | అసద్వాదో వివాదశ్చ వినాశస్త్వయి కేవలః || 37

తవాన్యాన్యవతారాణి కాని శేషాణి సాంప్రతమ్‌ | కృతానియేన కేనైవ కథా శేషా భవిష్యతి || 38

దోషం తం వద యేన త్వమవస్థామీదృశీం గతః | తేన సంహార దక్షేణ దక్షిణాశేష(శ)మేష్యసి || 39

ప్రకృతిస్త్వం పుమాన్‌ రుద్రస్త్వయి వీర్యం సమాహితమ్‌ | త్వన్నాభిపంక జాజ్జాతః పంచవక్త్రః పితామహః || 40

జగత్త్ర యీ సర్జనార్థం శంకరం నీలలోహితమ్‌ | లలాటే%చింతయత్సో%యం తపస్యుగ్రే చ సంస్థితః || 41

తల్లలాటా దభూచ్ఛంభు స్సృష్ట్యర్థే తేన భూషణమ్‌ | అతో%హం దేవదేవస్య తస్య భైరవరూపిణః || 42

త్వత్సంహారే నియుక్తో%స్మి వినయేన బలేన చ దేవదేవేన రుద్రేణ సకలప్రభుణా హరే || 43

వీరభద్రుడిట్లు పలికెను-

పినాకధారి, లయకర్త, విశ్వేశ్వరుడునగు శివుని యెరుంగవా? నీయందు చెడు వాదము, కలహము మరియు వినాశలక్షణము మాత్రమే కానవచ్చుచున్నవి (37). నీవు స్వీకరించవలసిన అవతారములింకనూ ఇపుడు ఏమి మిగిలియున్నవి? ఎవరో ఒకరు వాటిని ధరించినచో కథ పరిసమాప్తమగును (38). నీవిట్టి అవస్థను పొందుటకు హేతువు అగు దోషమెయ్యదియో చెప్పుము. సంహారసమర్థుడగు ఆ ప్రభువు తలచుకున్నచో నీకు మిగిలిన దక్షిణ ముట్టగలదు లేదా, యముని వద్దకు చేరగలవు (39). నీవు ప్రకృతివి. శివుడు పురుషుడు. నీయందు బీజము నిక్షిప్తమైనది. నీ నాభియందలి పద్మమునుండి అయిదు మోముల పితామహుడు జన్మించినాడు (40). ఆతడు జగత్తును సృష్టించుట కొరకై ఉగ్రమగు తపస్సును చేసి నీలలోహితుడగు శంకరుని లలాటస్థానమునందు ధ్యానించినాడు (41). అపుడు శంభుడు సృష్టికొరకై ఆతని లలాటమునుండి జన్మించినాడు. దేవదేవుడు, భైరవరూపుడు అగు ఆ శివునకు అలంకారము అగు నేను శివుని గణాధ్యక్షులలో ఒకడిని (42). ఓ నృసింహా! నీకు శాంతముగా నచ్చజెప్పుమనియు, లేదా బలమును ప్రయోగించుమనియు దేవదేవుడు, సర్వజగత్ర్పభుడు అగు రుద్రుడు నన్ను నియోగించినాడు (43).

ఏకం రక్షో విదార్యైవ తచ్ఛక్తి కలయా యుతః | అహంకారావలేపేన గర్జసి త్వమతంద్రితః || 44

ఉపకారో హి సాధూనాం సుఖాయ కిల సంమతః | ఉపకారో హ్యసాధూనామపకారాయ కేవలమ్‌ || 45

యన్నృసింహ మహేశానం పునర్భూతం తు మన్యసే | తర్హ్యజ్ఞానీ మహా గర్వీ వికారీ సర్వథా భవాన్‌ || 46

న త్వం స్రష్టా న సంహర్తా భర్తాపి న నృసింహక | పరతంత్రో విమూఢ్యాత్మా న స్వతంత్రో హి కుత్రచిత్‌ || 47

కులాలచక్రమచ్ఛక్త్యా ప్రేరితో%సి పినాకినా | నానావతారకర్తా త్వం తదధీనస్సదా హరే || 48

అద్యాపి తవ నిక్షిప్తం కపాలం కూర్మ రూపిణః | హరహారలతా మధ్యే దగ్ధః కశ్చిన్న వధ్యతే || 49

విస్మృతః కిం తదంశేన దంష్ట్రోత్పాడనపీడితమ్‌ | వారాహ విఘ్నహస్తే%ద్య యాక్రోశాం తారకారిణా || 50

ఆ శివుని శక్తిలోని లేశమును పొంది ఒకే రాక్షసుని చీల్చి చంపి శ్రమనెరుగని వాడవై అహంకారముతో, గర్వముతో గర్జించుచున్నావు (44). సాధువులకు ఉపకారమును చేసినచో సుఖము కలుగుననుట నిర్వివాదము. కాని దుష్టులకు ఉపకారమును చేసినచో కేవలము అపకారము మాత్రమే లభించును (45). ఓ నృసింహా! మహేశ్వరుడు జన్మించినాడని నీవు తలంచినచో, నీవు సర్వవిధములుగా అజ్ఞానివి, పెద్ద గర్వము గలవాడవు, మరియు మనోవికారము గలవాడవని స్పష్టమగుచున్నది (46). ఓయీ నృసింహా! నీవు సృష్టికర్తవు గాదు. లయకర్తవు గాదు, స్థితికర్తవు గాదు, నీవు అస్వతంత్రుడవు, మరియు మోహమును పొందిన బుద్ధిగలవాడవు. నీకు ఎచ్చటనైననూ స్వాతంత్ర్యము లేదు (47). ఓ హరీ! పినాకి కుమ్మరి చక్రమును వలె నిన్ను తన శక్తిచే ప్రేరేపించగా, నీవు అనేక అవతారములను దాల్చితివి. సర్వకాలములలో నీవు ఆయనకు వశుడవై యున్నావు (48). కూర్మరూపధారివగు నీ కపాలము శివుని మెడలోని హారములో ఇంకనూ నిహితమై యున్నది. నీవు ఇంకనూ ఇతరులనెవ్వరినీ సంహరించలేదు గదా! (లేదా, దహింపబడిన వానిని మరల వధించుట సంభవము కాదు?) (49) నీవు వరాహావతారమును స్వీకరించినపుడు తారకసంహారియగు కుమారస్వామి నీ కోరలను పీకి నీకు దుఃఖమును కలిగించినాడు. నీవావిషయమును కొంతవరకు విస్మరించితివా యేమి? (50)

దగ్ధో%సి పశ్య శూలాగ్నేర్విష్వక్సేనచ్ఛలాద్భవాన్‌ | దక్షయజ్ఞే శిరశ్ఛిన్నం మయా తేజస్స్వరూపిణా || 51

అద్యాపి తవ పుత్రస్య బ్రహ్మణః పంచమం శిరః | ఛిన్నం న సజ్జితం భూయో హరే తద్విస్మృతం త్వయా || 52

నిర్జితస్త్వం దధీచేన సంగ్రామే సమరుద్గణమ్‌ | కండూయమానే శిరసి కథం తద్విస్మృతం త్వయా || 53

చక్రం విక్రమతో యస్య చక్రపాణ తవ ప్రియమ్‌ | కుతః ప్రాప్తం కృతం కేన త్వయా తదపి విస్మృతమ్‌ || 54

యే మయా సకలా లోకా గృహీతాస్త్వం పయోనిధౌ | నిద్రాపరవశ##శ్శేషే స కథం సాత్త్వికో భవాన్‌ || 55

త్వదాదిస్తంబపర్యంతం రుద్రశక్తి విజృంభితమ్‌ | శక్తిమానభితస్త్వం చ హ్యనలాత్త్వం విమోహితః || 56

తత్తేజసో హి మాహాత్మ్యం పుమాన్‌ ద్రష్టుం న హి క్షమః | అస్థూలా యే ప్రపశ్యంతి తద్విష్ణోః పరమం పదమ్‌ || 57

హే విష్ణో ! నీవు అస్త్రమహిమచే అనేక నారాయణులను సృష్టించగా నేను త్రిశూలమునుండి పుట్టిన అగ్నితో దహించి వేసితిని. తేజస్స్వరూపుడనగు నేను దక్షయజ్ఞములో దక్షుని శిరస్సును నరికితిని (51). ఓ హరీ! నేను నీ కుమారుడగు బ్రహ్మయొక్క అయిదవ తలను దునిమితిని. అది ఇంకనూ అతుకు కొనకుండగా అటులనే యున్నది. నీవా విషయమును విస్మరించితివి (52). దధీచమహర్షి దేవగణములతో గూడియున్న నిన్ను యుద్ధములో జయించినాడు. నీవు తలను గోకుకొనుచుంటివి. నీవా విషయమునెట్లు మరచితివి? (53) ఓ చక్రపాణీ! నీవు పరాక్రమించి ప్రయోగించిన చక్రము ఎచటకు పోయినది? ఎవరు దానిని ఏమి చేసిరి? నీవా విషయమును కూడా విస్మరించితివి (54). ఈ సకలలోకముల భారమును నేను స్వీకరించినాను. నీవు క్షీరసముద్రమునందు నిద్రలో మునిగియున్నావు. అట్టి నీవు సత్త్వగుణప్రధానుడవు ఎట్లు అయితివి? (55) నీతో మొదలిడి తృణము వరకు గల జగత్తు రుద్రుని శక్తిచే విజృంభించుచున్నది. చుట్టువారియున్న ఈ జ్వాలలతో గూడిన నీ శక్తి కూడా రుద్రుని నుండియే లభించినది. కాని నీవు మిక్కిలి మోహమును పొంది యున్నావు (56). ఆ తేజస్సుయొక్క మాహాత్మ్యమును మానవుడు దర్శింపజాలడు. విష్ణువు కంటె ఉత్కృష్టమైన శివుని ధామమును సూక్ష్మదృష్టిగలవారు మాత్రమే దర్శించెదరు (57).

ద్యావాపృథివ్యా ఇంద్రాగ్నేర్యమస్య వరుణస్య చ | ధ్వాంతోదరే శశాంకే చ జనితా పరమేశ్వరః || 58

కాలో% సి త్వం మహాకాలః కాలకాలో మహేశ్వరః | అతస్త్వముగ్ర కలయా మృతోర్మృత్యుర్భ విష్యసి || 59

స్థిరో%ద్య త్వక్షరో వీరో వీరో విశ్వావకః ప్రభుః | ఉపహంతా జ్వరం భీమో మృగః పక్షీ హిరణ్మయః || 60

శాస్తా%శేషస్య జగతస్తత్త్వం నైవ చతుర్ముఖః | నాన్యే చ కేవలం శంభుస్సర్వశాస్తా న సంశయః || 61

ఇత్థం సర్వం సమాలోక్య సంహరాత్మానమాత్మనా | వినష్టం న త్వమాత్మానం కురు హే నృహరే బుధ || 62

నో చేదిదానీం క్రోధస్య మహాభైరవరూపిణః | వజ్రాశనిరివ స్థాణౌ త్వయి మృత్యుః పతిష్యతి || 63

స్వర్గలోక భూలోకములను, ఇంద్రాగ్నియమవరుణాది దేవతలను సృష్టించి, చీకటితో నిండియున్న చంద్రుని యందు కాంతిని నింపినవాడు ఆ పరమేశ్వరుడే (58). నీవు కాలుడవు. కాని మహేశ్వరుడు మహాకాలుడు, మరియు కాలునకు కాలుడు. కావున నీవు ఉగ్రుడగు శివుని అంశను పొంది మృత్యువునకు మృత్యువు కాగల్గుదువు (59). నీవు వీరుడవు. ఇచట స్థిరముగ నుండుము. వీరుడు, జగద్రక్షకుడు, భయంకరుడు, తేజ్స్వరూపుడునగు శివప్రభుడు మృగపక్షుల సమాహార రూపమును దాల్చి నీ గర్వమునడంచగలడు (60). కావున సమస్త జగత్తు యొక్క శాసనకుడవు నీవు గాని, చతుర్ముఖబ్రహ్మ గాని కాదు. ఇతరులు కూడా కాదు. శంభుడొక్కడే సర్వశాసకుడనుటలో సందియము లేదు (61). కావున ఈ విషయమునంతనూ నీవు పరిశీలించి నీ అంతట నీవే ఉగ్రరూపమును ఉపసంహరించుము. ఓ నృసింహా! నీవు బుధుడవు. నీ వినాశమును నీవే కొని తెచ్చుకొనుట తగదు (62). నీవు అట్లు చేయనిచో, ఈ క్షణములోనే మహాభయంకరాకారుడగు శివుని క్రోధము యొక్క ప్రభావముచే చెట్టుపై పిడుగువలె నీపై మృత్యువు పడగలదు (63).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వా వీరభద్రో%పి విరరామాకుతోభయః | దృష్ట్వా నృసింహాభిప్రాయం క్రోధమూర్తి శ్శివస్య సః || 64

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం శరభావతార వర్ణనం నామ ఏకాదశో%ధ్యాయః (11)

నందీశ్వరుడిట్లు పలికెను-

శివుని క్రోధమునుండి పుట్టినవాడు, దేనికీ భయపడినవాడు నగు ఆ వీరభద్రుడు ఇట్లు పలికి, నృసింహుని అభిప్రాయమును గని, మిన్నకుండెను (64).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్ర సంహితయందు శరభావతార వర్ణనమనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

Siva Maha Puranam-3    Chapters