అథ చతుర్దశో%ధ్యాయః
గృహపత్యవతారము
నందీశ్వర ఉవాచ|
స విప్రో గృహమాగత్య మహాహర్ష సమన్వితః | ప్రియాయై కథయామాస తద్‌వృత్తాంతమశేషతః || 1
తచ్ఛ్రుత్వా విప్రపత్నీ సా ముదం ప్రాప శుచిష్మతీ | అతీవ ప్రేమ సంయుక్తా ప్రశశంస విధిం నిజమ్ || 2
అథ కాలేన తద్యోషి దంతర్వత్నీ బభూవ హ | విధివద్విహితే తేన గర్భాధానాఖ్య కర్మణి || 3
తతః పుంసవనం తేన స్పందనాత్ర్పా గ్విపశ్చితా | గృహ్యోక్త విధినా సమ్యక్ కృతం పుంస్త్వ వివృద్ధయే || 4
సీమంతో%థాష్టమే మాసే గర్భరూప సమృద్ధికృత్ | సుఖప్రసవసిద్ధౌ చ తేనాకారి కృపావిదా || 5
అథాతశ్శుభతారాసు తారాధిపవరాననః | కేంద్రే గురౌ శుభే లగ్నే సుగ్రహేషు యుగేషు చ || 6
అరిష్టదీప నిర్వాణస్సర్వారిష్టవినాశకృత్ | తనయో నామ తస్యాం తు శుచిష్మత్యాం బభూవ హ || 7
నందీశ్వరుడిట్లు పలికెను-
ఆ బ్రాహ్మణుడు మహానందముతో కూడినవాడై ఇంటికి వచ్చి ఆ వృత్తాంతమునంతనూ ప్రియురాలికి చెప్పెను (1). ఆ బ్రాహ్మణుని భార్యయగు శుచిష్మతి ఆ వృత్తాంతమును విని ఆనందించెను. ఆమె మిక్కిలి ప్రేమ గలదియై తన భాగ్యమును కొనియాడెను (2). తరువాత కొంతకాలమునకు ఆయన యథావిధిగా గర్భాధాన సంస్కారముననుష్ఠించగా ఆమె గర్భవతి ఆయెను (3). తరువాత పూర్ణ గర్భవికాసమునకు పూర్వమునందు విద్వాంసుడగు ఆ విశ్వానరుడు గృహ్యసూత్రములో చెప్పిన విధానముతో పురుషత్వ వృద్ధి కొరకై పుంసవనమును చక్కగా అనుష్ఠించెను (4). తరువాత ఎనిమిదవ మాసములో దయాళువగు ఆ బ్రాహ్మణుడు గర్భరూపమును సమృద్ధము చేయునది, సుఖప్రసవమును కలిగించునది యగు సీమంతమును జరిపించెను (5). తరువాత నక్షత్రములు శుభకరములై యుండగా, బృహస్పతి కేంద్రమునందుండగా, శుభగ్రహ యోగములయందు శుభలగ్నములో చంద్రుని వంటి మోము గలవాడు (6), విపత్తులను నశింపజేయువాడు, మృత్యురూపమగు అమంగళమును తొలగించువాడు అగు శివుడు, ఆ శుచిష్మతికి పుత్రుడై ప్రకటమయ్యెను (7).
శర్వస్సమస్తసుఖదో భూర్భువస్స్వర్నివాసినామ్ | గంధవాహన వాహాశ్చ దిగ్వధూర్ముఖవాససః || 8
ఇష్టగంధ ప్రసూనౌఘైర్వవృషుస్తే ఘనా ఘనాః | దేవదుందుభయో నేదుః ప్రసేదుస్పర్వతో దిశః || 9
పరితస్సరితస్ప్వచ్ఛా భూతానాం మానసైస్సహ | తమో%తామ్యత్తు నితరాం రజో%పి విరజో%భవత్ || 10
సత్త్వాస్సత్త్వ సమాయుక్తా స్సుధావృష్టిర్బభూవ వై | కల్యాణీ సర్వథా వాణీ ప్రాణినః ప్రియవత్యభూత్ || 11
రంభాముఖ్యా అప్సరసో మంగలద్రవ్యపాణయః | విద్యాధర్యశ్చ కిన్నర్యస్త థామర్యస్సహస్రశః || 12
గంధర్వోరగయక్షాణాం సుమానిన్య శ్శుభస్వరాః | గాయంత్యో మంగలం గీతం తత్రా జగ్మురనేకశః || 13
మరీచిరత్రిః పులహః పులస్త్యః క్రతురంగిరాః | వసిష్ఠః కశ్యపో%గస్త్యో విభాండో మాండవవీసుతః || 14
భూర్భువ స్సువర్లోకములలో నివసించువారికి సమస్తసుఖములను ఇచ్చే శర్వుడు అవతరించెను. ఆ సమయములో సుగంధమును కలిగియున్న వాయువులు దిక్కులు అనే యువతుల ముఖములపై వస్త్రములైనవి (8). మహామేఘములు అభీష్టమగు సుగంధముగల పుష్పములను అధికముగా వర్షించినవి. దేవదుందుభులు మ్రోగినవి. దిక్కులన్నియు నిర్మలమైనవి (9). జలాశయములన్నియు తేటపడెను. ప్రాణుల మనస్సులు ప్రసన్నమయ్యెను. చీకట్లు తొలగిపోయెను ధూళి అణగారి దిక్కులు స్వచ్ఛమయ్యెను (10) ప్రాణులు ఆనందమును పొందినవి. అమృతవర్షము కురిసెను. మానవుల వాక్కు అన్ని విధములుగా మంగళకరము, ప్రియమైనది ఆయెను (11). రంభాద్యప్సరసలు, విద్యా ధరయువతలు, కిన్నరస్త్రీలు, వేలాది మంది దేవతాస్త్రీలు, గంధర్వ నాగ యక్షుల యువతులు మంగళద్రవ్యములను చేత బట్టి మధురస్వరముతో మంగళగీతములను పాడుతూ పెద్ద సంఖ్యలో అచటకు విచ్చేసిరి (12, 13). మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగిరస్సు, వసిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు, మాండవీ పుత్రుడగు విభాండుడు విచ్చేసిరి (14).
లోమశో రోమచరణో భరద్వాజో%థ గౌతమః | భృగుస్తు గాలవో గర్గో జాతూకర్ణః పరాశరః || 15
ఆపస్తంబో యాజ్ఞవల్క్యో దక్షవాల్మీకి ముద్గలాః | శాతాతపశ్చ లిఖితశ్శిలాదశ్శంఖ ఉంఛభుక్ || 16
జమదగ్నిశ్చ సంవర్తో మతంగో భరతోంశుమాన్ | వ్యాసః కాత్యాయనః కుత్సశ్శౌనకస్సు శ్రుతశ్శుకః || 17
ఋష్యశృంగో%థ దుర్వాసాశ్శుచి ర్నారదతుంబురూ | ఉత్తంకో వామ దేవశ్చ పవనో%శితదేవలౌ || 18
సాలంకాయన హారీతౌ విశ్వామిత్రో%థ భార్గవః | మృకండుస్సహ పుత్రేణ పర్వతో దారుకస్తథా || 19
ధౌమ్యోపమన్యువత్సాద్యా మునయో మునికన్యకాః | తచ్ఛాంత్యర్థం సమాజగ్ముర్ధన్యం విశ్వానరాశ్రమమ్ || 20
బ్రహ్మా బృహస్పతియుతో దేవో గరుడవాహనః | నందిభృంగి సమాయుక్తో గౌర్యా సహ వృషధ్వజః || 21
లోమశుడు, రోమచరణుడు, భరద్వాజుడు, గౌతముడు, భృగువు, గాలవుడు, గర్గుడు, జాతూ కర్ణుడు పరాశరుడు (15), ఆపస్తంబుడు, యాజ్ఞవల్క్యుడు, దక్షుడు, వాల్మీకి, ముద్గలుడు, శాతాతపుడు, లిఖితుడు, శిలాదుడు, ఉంఛవృత్తిచే జీవించు శంఖుడు (16). జమదగ్ని, సంవర్తుడు,మతంగుడు, భరతుడు, అంశుమంతుడు, వ్యాసుడు, కాత్స్యాయనుడు, కుత్సుడు, శౌనకుడు, సువ్రతుడు, శుకుడు (17), ఋష్యశృంగుడు, దూర్వాసుడు, శుచి, నారదుడు, తుంబురుడు, ఉత్తంకుడు, వామదేవుడు,పవనుడు, అశితుడు, దేవలుడు (18), సాలంకాయనుడు, హారీతుడు, విశ్వామిత్రుడు, భార్గవుడు, మృకండుడు, ఆతని పుత్రుడగు మార్కండేయుడు, పర్వతుడు, దారుకుడు (19), ధౌమ్యుడు, ఉపమన్యుడు, వత్సుడు మొదలగు మహర్షులు, మునికన్యకలు జన్మకాలమందు చేయబడే శాంతికొరకై విశ్వానరుని పవిత్రమగు ఆశ్రమమునకు విచ్చేసిరి (20). బ్రహ్మ, బృహస్పతి, గరుడ వాహనుడగు విష్ణు దేవుడు, నంది భృంగులతో గూడి పార్వతీపరమేశ్వరులు విచ్చేసిరి (21).
మహేంద్రముఖ్యా గీర్వాణా నాగః పాతాల వాసినః | రత్నాన్యాదాయ బహుశస్ససరిత్కా మహాబ్ధయః || 22
స్థావరా జంగమం రూపం ధృత్వాయాతాస్సహస్రశః | మహామహోత్సవే తస్మిన్ బభూవాకాలకౌముదీ || 23
జాతకర్మ స్వయం తస్య కృతవాన్ విధిరానతః | శ్రుతిం విచార్య తద్రూపం నామ్నా గృహపతిస్స్వయమ్ || 24
ఇతి నామ దదౌ తసై#్మ దేయమేకాదశే%హని | నామకర్మ విధానేన తదర్థం శ్రుతిముచ్చరన్ || 25
చతుర్నిగమ మంత్రోక్తై రాశీర్భిరభినంద్య చ | సమాయాద్ధంసమారుహ్య సర్వేషాం చ పితామహ || 26
కృత్వా బాలోచితాం రక్షాం లౌకికీం గతిమాశ్రితః | ఆరుహ్య యానం స్వం ధామ హరో%పి హరిణా య¸° || 27
అహో రూపమహోతేజస్త్వహో సర్వాంగలక్షణమ్ | అహో శుచిష్మతీ భాగ్యమామి రాసీత్స్వయం హరః || 28
అథవా కిమిదం చిత్రం సర్వభక్త జనేష్వహో | స్వయమావిరభూద్రుద్రో యతో రుద్రస్త దర్చితః || 29
ఇతి స్తువంతస్తే%న్యోన్యం సంప్రహృష్టతనూరుహాః | విశ్వానరం సమాపృచ్ఛ్య జగ్ముస్సర్వే యథాగతమ్ || 30
మహేంద్రుడు మొదలగు దేవతలు, పాతాళమునందు నివసించు నాగులు,నదులు, సముద్రములు అనేక రత్నములను తీసుకొని వచ్చిరి (22). పర్వతములు పురుషరూపమును దాల్చి వేల సంఖ్యలో వచ్చిరి. ఆ మహోత్సవమునందు కాలము కాని కాలములో వెన్నెలలు కురిసినవి (23). బ్రహ్మ వినయపూర్వకముగా ఆ బాలునకు జాతకర్మను స్వయముగా చేయించెను. ఆ బాలుని రూపమును మరియు వేదమును పరిశీలించి ఆతనికి స్వయముగా గృహపతి యని పేరిడెను (24). పదకొండవ రోజున వేదమంత్రముల నుచ్చరిస్తూ నామకర్మ విధానముతో ఆ పేరును పెట్టెను (25). ఆ తరువాత అందరికీ పితామహుడగు బ్రహ్మ నాల్గు వేదములలోని మంత్రములతో ఆశీర్వదించి అభినందించి హంసారూఢుడై తన లోకమునకు వెళ్లెను (26). లోకపు పోకడనను సరించి శివవిష్ణువులు కూడ బాలునకు తగిన రక్షను చేసి తమ వాహనముపై తమ ధామమలకు వెడలిరి (27). అహో| ఏమి రూపము ! ఏమి తేజస్సు! అవయవములన్నియు ఎంత చక్కగా నున్నవియో! అహో! శుచిష్మతి భాగ్యవంతురాలు. శివుడు స్వయముగా ఆమెకు పుత్రుడై అవతరించినాడు (28). అయిననూ, భక్తజనుల విషయములో ఇట్లు జరుగుటలో ఆశ్చర్యమేమున్నది? వారు రుద్రుని అర్చించినారు. కాన రుద్రుడు స్వయముగా ఆవిర్భవించినాడు (29). వారందరు ఇట్లు స్తుతిస్తూ, తమలో తాము మాటలాడు కొనుచూ, గగుర్పాటుతో గూడిన దేహములు గలవారై విశ్వానరుని వద్ద సెలవు తీసుకొని వచ్చిన దారిన వెళ్లిరి (30).
అతః పుత్రం సమీహంతే గృహస్థాశ్రమవాసినః | పుత్రేణ లోకాన్ జయతి శ్రుతిరేషా సనాతనీ || 31
అపుత్రస్య గృహం శూన్యమపుత్ర స్యార్జనం వృథా | అపుత్రస్య తపశ్ఛిన్నం నో పవిత్రత్య పుత్రతః || 32
న పుత్రాత్పరమో లాభో న పుత్రాత్పరమం సుఖమ్ | న పుత్రాత్పరమం మిత్రం పరత్రేహ చ కుత్రచిత్ || 33
నిష్క్రమో%థ చతుర్థేస్య మాసి పిత్రా కృతో గృహాత్ | అన్నప్రాశనమభ్దాహే చూడార్ధే చార్థవత్కృతా || 34
కర్ణవేధం తతః కృత్వా శ్రవణర్‌క్షే స కర్మవిత్ | బ్రహ్మతేజో%భివృద్ధ్యర్థం పంచమేబ్దే వ్రతం దదౌ || 35
ఉపాకర్మ తతః కృత్వా వేదానధ్యాపయత్సుధీః | అబ్దం వేదాన్ స విధినా %ధ్యైష్ట సాంగపదక్రమాన్ || 36
విద్యాజాతం సమస్తం చ సాక్షిమాత్రం గురోర్ముఖాత్ | వినయాది గుణానావిష్కర్వన్ జగ్రాహ శక్తి మాన్ || 37
ఇందువలననే గృహస్థాశ్రమములో నున్నవారు పుత్రుని కాంక్షించెదరు. పుత్రుడు పుణ్యలోకములను పొందుటలో కారణమగునని సనాతనమగు వేదము చెప్పుచున్నది (31). పుత్రుడు లేని వాని ఇల్లు శూన్యముగా నుండును. వాని సంపాదన వ్యర్థము. వాని తపస్సు చెడిపోవును. పుత్రుడు లేని వానికి పవిత్రత ఉండదు (32). పుత్రుని కంటె గొప్ప లాభము గాని, గొప్ప సుఖము గాని లేదు. ఇహపరలోకములలో పుత్రునికంటె గొప్ప మిత్రుడు లేడు (33). తండ్రి ఆ బాలునకు నాల్గవ మాసములో ఇంటి గడపను దాటుట అను ఉత్సవమును, ఆరవమాసములో అన్నప్రాశనమును, సంవత్సరము దాటిన తరువాత కేశవపనమును చేయించెను (34) కర్మవేత్తయగు ఆ తండ్రి శ్రవణా నక్షత్రమునాడు ఆ బాలునకు చెవులను కుట్టించెను. అయిదవయేట ఆ బాలునిచే బ్రహ్మతేజస్సును వర్ధిల్లజేయు వ్రతమును చేయించెను (35). తరువాత ఉపాకర్మను జరిపించి ఆ సద్ర్బాహ్మణుడు ఆ బాలునకు వేదములను చెప్పించెను. ఆతడు ఒక సంవత్సరకాలము అంగములతో పదక్రమములతో గూడిన వేదములను యథావిధిగా అధ్యయనము చేసెను (36). శక్తిమంతుడగు ఆ బాలుడు విద్యలనన్నింటిని గురుముఖమునుండి నియమ రక్షణకొరకు మాత్రమే గ్రహించుటయే గాక వినయము మొదలగు సద్గుణములను కూడ ప్రకటించెను(37).
తతో%థ నవమే వర్షే పిత్రో శ్శుశ్రూషణ రతమ్ | వైశ్వానరం గృహపతిం ద్రష్టు మాయాచ్చ నారదః || 38
విశ్వానరోటజం ప్రాప్య దేవర్షిస్తం తు కౌతుకీ | అపృచ్ఛత్కుశలం తత్ర గృహీతార్ఘ్యాసనః క్రమాత్ || 39
తతస్సర్వం చ తద్భాగ్యం పుత్రధర్మం చ సమ్ముఖే | వైశ్వానరం సమవదత్ స్మృత్వా శివపదాంబుజమ్ || 40
ఇత్యుక్తో మునినా బాలః పిత్రోరాజ్ఞామవాప్య సః | ప్రణమ్య నారదం శ్రీమాన్ భక్త్యా ప్రహ్వ ఉపావిశత్ || 41
వైశ్వానర సమభ్యే హి మమోత్సంగే నిషీద భోః | లక్షణాని పరీక్షే%హం పాణిం దర్శయ దక్షిణమ్ || 42
తతో దృష్ట్యా తు సర్వం హి తాలు జిహ్వాది నారదః | విశ్వానరం సమవదచ్ఛి వప్రేరణయా సుధీః || 43
తరువాత తొమ్మిదవ యేట తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడై యున్న విశ్వానరపుత్రుడగు గృహపతిని దర్శించుటకు నారదుడు వచ్చెను (38). అట్టి కుతూహలముతో దేవర్షియగు నారదుడు విశ్వానరుని పర్ణశాలను చేరుకొని అర్ఘ్యము మొదలగు వాటిని స్వీకరించి ఆసనముపై గూర్చుండి కుశలప్రశ్నలనడిగెను (39). ఆయన శివుని పాదపద్మములను స్మరించి విశ్వానరుని పుత్రుని యెదుటనే ఆ బాలుని భాగ్యమును, ఆతడు పాటించే పుత్రధర్మమును గూర్చి విస్తారముగా చెప్పెను (40). మహర్షి ఇట్లు చెప్పగా ఆ బాలుడు తల్లిదండ్రుల యాజ్ఞచే నారదమహర్షికి సవినయముగా భక్తితో నమస్కరించి కూర్చుండెను. అపుడా మహర్షి మిక్కిలి శోభిల్లే బాలునితో నిట్లనెను (41). ఓయీ! విశ్వానరకుమారా! ఇటు రమ్ము. నా ఒడిలో గూర్చుండుము. నీ కుడిచేతిని చూపుము. నేను లక్షణములను పరీక్షించెదను (42). నారదుడు అపుడు బాలుని హస్తరేఖలను, నోటిలోపలి భాగమును, నాలుకను ఇతరము సర్వమును చూచెను. బుద్ధి శాలియగు నారదుడు అపుడు శివునిప్రేరణను పొంది విశ్వానరునితో నిట్లనెను (43).
నారద ఉవాచ|
విశ్వానరమునే వచ్మి శృణు పుత్రాంక మాదరాత్ | సర్వాంగస్త్వంకవాన్ పుత్రో మహాలక్షణవానయమ్ || 44
కిం తు సర్వగుణోపేతం సర్వలక్షణలక్షితమ్ | సంపూర్ణనిర్మల కలం పాలయేద్విధు వద్విధిః || 45
తస్మాత్సర్వప్రయత్నేన రక్షణీయస్త్వ సౌ శిశుః | గుణో%పి దోషతాం యాతి వక్రీ భూతే విధాతరి || 46
శంకే%స్య ద్వాదశే మాసి ప్రత్యూహో విద్యుదగ్నితః | ఇత్యుక్త్వా నారదో%గచ్ఛద్దేవలోకం యథాగతమ్ || 47
ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం గృహపత్యవతారవర్ణనం నామ చతుర్దశో%ధ్యాయః (14)
నారదుడిట్లు పలికెను -
ఓ విశ్వానరమహర్షీ! నీ పుత్రుని యందు గల చిహ్నములను గురించి చెప్పెదను. ఆదరముతో వినుము. గొప్ప లక్షణములు గల ఈ నీ పుత్రుని యందు చిహ్నములు సర్వావయవములయందు గలవు (44). కాని సర్వగుణములతో గూడినవాడు, సర్వలక్షణములతో ప్రకాశించువాడు, చంద్రుని వలె పూర్ణస్వచ్ఛ కళలు గలవాడు అగు ఈ బాలుని విధాత రక్షించుగాక! (45) కావున నీవు ప్రయత్నములన్నిటినీ ఆచరించి ఈ శిశువును రక్షించుము. విధి వక్రించినచో గుణము కూడా దోషము అగును (46). ఈ బాలునకు పన్నెండవ సంవత్సరములో విద్యుత్తు (మెరుపు) వలన, లేక అగ్ని వలన గండము గలదని నాకు శంక కలుగుచున్నది. ఇట్లు పలికి నారదుడు వచ్చిన దారిన దేవలోకమునకు వెళ్లెను (47).
శ్రీ శివ మహాపురాణములోని శతరుద్ర సంహితయందు గృహ పత్యవతారవర్ణనమనే పదనాల్గవ అధ్యాయము ముగిసినది (14).