Siva Maha Puranam-3
Chapters
శ్రీగణశాయ నమః శ్రీ శివ మహాపురాణము ఉమా సంహితా అథ ప్రధమో%ధ్యాయః శ్రీకృష్ణ-ఉపమన్యు సంవాదము శ్రీగౌరీశంకరాభ్యాం నమః | అథ పంచమీ ఉమాసంహితా ప్రారభ్యతే | యో ధత్తే భువనాని సప్త గుణవాన్ స్రష్టా రజస్సంశ్రయః | సంహర్తా తమసాన్వితో గుణవతీం మాయామతీత్య స్థితః | సత్యానందమనంతబోధమమలం బ్రహ్మాదిసంజ్ఞాస్పదం నిత్యం సత్త్వసమన్వయాదధిగతం పూర్ణం శివం ధీమహీ || 1 గుణములకు అధిష్ఠానమగు ఏ పరమేశ్వరుడైతే రజోగుణమునాశ్రయించి ఏడు లోకములను ధరించి పాలించుచున్నాడో, తమోగుణము నాశ్రయించి సంహరించుచున్నాడో, ఏ పరమేశ్వరుడు త్రిగుణాత్మికయగు మాయకు అతీతుడై యున్నాడో, అట్టి సత్యస్వరూపుడు, ఆనందఘనుడు, సర్వపరిచ్ఛేదరహితుడు, జ్ఞానఘనుడు, సంసారదోషవర్జితుడు, బ్రహ్మవిష్ణురుద్రులను పేర్లతో వ్యవహరింప బడువాడు, నిత్యుడు, సాత్త్వికభావమును పెంపొందించు కొనుట వలన లభించువాడు, పూర్ణుడు అగు శివుని మేము ధ్యానించుచున్నాము (1). ఋషయ ఊచుః | సూత సూత మహాప్రాజ్ఞ వ్యాసశిష్య నమో%స్తు తే | చతుర్థీ కోటిరుద్రాఖ్యా శ్రావితా సంహితా త్వయా || 2 అథోమాసంహితాంతఃస్థనానాఖ్యానసమన్వితమ్ | బ్రూహి శంభోశ్చరిత్రం వై సాంబస్య పరమాత్మనః || 3 ఋషులు ఇట్లు పలికిరి- ఓ సూతా! వ్యాసశిష్యుడవగు నీవు మహాబుద్ధిశాలివి. నీకు నమస్కారమగుగాక! కోటి రుద్రసంహిత యను పేరు గల నాల్గవ సంహితను నీవు వినిపించి యుంటివి (2). ఇప్పుడు ఉమాసంహితలో ఉన్న సాంబపరమాత్మునియొక్క అనేకగాథలతో గూడిన చరితమును చెప్పుము (3). సూత ఉవాచ | మహర్షయ శ్శౌనకాద్యాః శృణుత ప్రేమతశ్శుభమ్ | శాంకరం చరితం దివ్యం భుక్తిముక్తిప్రదం పరమ్ || 4 ఇతీదృశం పుణ్యప్రశ్నం పృష్టవాన్మునిసత్తమః | వ్యాసస్సనత్కుమారంవై శైవం సచ్చరితం జగౌ || 5 సూతుడు ఇట్లు పలికెను- శౌనకాది మహర్షులారా! శుభకరము, దివ్యము, భుక్తిని మరియు ముక్తిని ఇచ్చునది, సర్వోత్కష్టము అగు శంకరచరితమును ప్రేమతో వినుడు (4). వ్యాసమహర్షి ఇటువంటి పవిత్రమగు ప్రశ్నను సనత్కుమారుని యెదుట వేయగా, ఆయన శివుని సచ్చరిత్రమును చెప్పియుండెను (5). సనత్కుమార ఉవాచ | వాసుదేవాయ యత్ర్పోక్తముపమన్యుమహర్షిణా | తదుచ్యతే మయా వ్యాస చరితం హి మహేశితుః || 6 పురా పుత్రార్థమగమత్కైలాసం శంకరాలయమ్ | వసుదేవసుతః కృష్ణస్తపస్తప్తుం శివస్య హి || 7 అత్రోపమన్యుం సందృష్ట్వా తపంతం శృంగ ఉత్తమే | ప్రణమ్య భక్త్యా స మునిః పర్యపృచ్ఛత్కృతాంజలిః || 8 సనత్కుమారుడు ఇట్లు పలికెను- ఓ వ్యాసా! ఉపమన్యుమహర్షి వాసుదేవునకు చెప్పియున్న మహేశ్వర చరితమును మాత్రమే నేను చెప్పుచున్నాను (6). వసుదేవుని కుమారుడగు శ్రీకృష్ణుడు పూర్వము పుత్రుని గోరి శివుని గురించి తపస్సును చేయుట కొరకై కైలాసమునకు వెళ్లెను (7). అచట శ్రేష్ఠమగు హిమవత్పర్వతశిఖరముపై తపస్సు చేయుచున్న ఉపమన్యుమహర్షిని చూచి, మననశీలుడగు ఆ కృష్ణుడు భక్తితో చేతులను జోడించి ప్రణమిల్లి ఇట్లు ప్రశ్నించెను (8). శ్రీకృష్ణ ఉవాచ | ఉపమన్యో మహాప్రాజ్ఞ శైవప్రవర సన్మతే | పుత్రార్థమగమం తప్తుం తపో%త్ర గిరిశస్య హి || 9 బ్రూహి శంకరమాహాత్మ్యం సదానందకరం మునే | యచ్ఛ్రుత్వా భక్తితః కుర్యాం తప ఐశ్వర్యముత్తమమ్ || 10 శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను- ఓ ఉపమన్యూ! నీవు మహాబుద్ధిశాలివి, శివభక్తులలో అగ్రగణ్యుడవు మరియు సద్బుద్ధి గలవాడవు. నేను పుత్రుని గోరి శివుని కొరకై తపస్సును చేయుటకు ఇచ్చటకు వచ్చియుంటిని (9). ఓ మహర్షీ! సర్వదా ఆనందమును కలిగించే శంకరుని మహిమను గురించి చెప్పుము. నేను దానిని భక్తితో విని, శివుని గురించి ఉత్తమమగు తపస్సును చేసెదను (10). సనత్కుమార ఉవాచ | ఇతి శ్రుత్వా వచస్తస్య వాసుదేవస్య ధీమతః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా హ్యుపమన్యుస్స్మరన్ శివమ్ || 11 సనత్కుమారుడు ఇట్లు పలికెను- బుద్ధిశాలియగు వాసుదేవుని ఈ వచనములను విని ఉపమన్యుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (11). ఉపమన్యురువాచ | శృణు కృష్ణ మహాశైవ మహిమానం మహేశితుః | యమద్రాక్షమహం శంభోర్భక్తివర్ధనముత్తమమ్ || 12 తపఃస్థో%హం సమద్రాక్షం శంకరం చ తదాయుధాన్ | పరివారం సమస్తం చ విష్ణ్వాదీనమరాదికాన్ || 13 త్రిభిరం శైశ్శోభమానమజస్రసుఖమవ్యయమ్ | ఏకపాదం మహాదంష్ట్రం సజ్వాలకబలైర్ముఖైః || 14 ద్విసహస్రమయూఖానాం జ్యోతిషా%తివిరాజితైః | సర్వాస్త్ర ప్రవరాబాధమనేకాక్షం సహస్రపాత్ || 15 యశ్చ కల్పాంతసమయే విశ్వం సంహరతి ధ్రువమ్ | నావధ్యో యస్య చ భ##వేత్ త్రైలోక్యే సచరాచరే || 16 మహేశ్వరో భుజోత్సృష్టం త్రై లోక్యం సచరాచరమ్ | నిర్దదాహ ద్రుతం కృత్స్నం నిమేషార్ధాన్నం సంశయః || 17 తపఃస్థో రుద్రపార్శ్వస్థం దృష్ట వానహమవ్యయమ్ | గుహ్యమస్త్రం పరం చాస్య న తుల్యమధికం క్వచిత్ || 18 యత్తచ్ఛూలమితి ఖ్యాతం సర్వలోకేషు శూలినః | విజయాభిధమత్యుగ్రం సర్వశస్త్రాస్త్ర నాశకమ్ || 19 దారయేద్యన్మహీం కృత్స్నాం శోషయేద్యన్మహోదధిమ్ | పాతయేదఖిలం జ్యోతిశ్చక్రం యన్నాత్ర సంశయః || 20 ¸°వనాశ్వో హతో యేన మాంధాతా సబలః పురా | చక్రవర్తీ మహాతేజాసై#్త్రలోక్యవిజయీ నృపః || 21 ఉపమన్యుడు ఇట్లు పలికెను- గొప్ప శివభక్తుడవగు ఓ శ్రీ కృష్ణా! ఉత్తమమగు భక్తిని పెంపొందించే మహేశ్వరుని మహిమను నేను చూచితిని. ఆ శంభుని మహిమను వినుము (12). నేను తపస్సును చేయచుండగా, సమస్తపరివారముతో కూడియ్ను శంకరుని, ఆయనయొక్క ఆయుధములను, మరియు విష్ణువు మొదలగు దేవతలను చూచితిని (13). తన స్వరూపమునందు మూడు అంశలతో ప్రకాశించువాడు, నిత్యానందస్వరూపుడు, వినాశము లేనివాడు, ఒక అంశ##చే జగద్రూపముగా ప్రకటమై యున్నవాడు, పెద్ద కోరలు గలవాడు, మంటలను మ్రింగుచున్న నోళ్లు గలవాడు (14), రెండు వేల కిరణముల కాంతిచే అతిశయించి ప్రకాశించుచున్నవాడు, శ్రేష్ఠమగు అస్త్ర ములన్నింటితో నిండియున్నవాడు, అనేకనేత్రములు గలవాడు, అసంఖ్యాకమగు పాదములు గలవాడు అగు శంకరుని చూచితిని (15). ఆయన కల్పాంతము నందు జగత్తును నిశ్చయముగా ఉపసంహరించును. చరాచరప్రాణులతో కూడియున్న ముల్లోకములలో ఆయనచే సంహరింప బడని వాడు లేడు (16). ఆ మహేశ్వరుడు తన భుజములనుండి సృష్టించబడే, స్థావరంజంగమాత్మకమగు ప్రాణులతో కూడి యున్న ముల్లోకములను క్షణకాలములో దహించి వేయుననుటలో సందేహము లేదు (17). తపస్సును చేయుచున్న నేను రుద్రుని ప్రక్కనే యున్న పరమరహస్యమగు ఆ శూలమనే ఆయుధమును చూచితిని. దానికి వినాశము లేదు. దానితో సమమైనది కాని, దానికంటే అధికమైనది గాని ఆయుధము మరియొకటి లేదు (18). అతిభయంకరమైనది, సకలశస్త్రములను మరియు అస్త్రములను వినాశము చేయునది, విజయము అను పేరు గలది అగు ఆ ఆయుధమునకు శూలము అనియు, దానిని ధరించే శివునకు శూలి అనియు ముల్లోకములలో ప్రసిద్ధి కలిగినది (19). అది భూమినంతనూ పగులగొట్ట గలదు; మహాసముద్రమును ఎండింప జేయగలదు; నక్షత్రసమూహమునంతనూ కూల్చగలదు; ఈ విషయములో సందేహము లేదు (20). యువనాశ్వుని కుమారుడు, మహాతేజశ్శాలి, ముల్లోకములను జయించిన వాడు అగు మాంధాత చక్రవర్తిని అది సైన్యముతో సహా పూర్వము వధించినది (21). దర్పావిష్టో హైహయశ్చ నిఃక్షిప్తో లవణాసురే | శత్రుఘ్నం నృపతిం యుద్ధే సమాహూయ సమంతతః || 22 తస్మిన్ దైత్యే వినస్టే తు రుద్రహస్తే గతం తు యత్ | తచ్ఛూలమతి తీక్ష్ణాగ్రం సంత్రాసజననం మహత్ || 23 త్రిశిఖాం భ్రుకుటీం కృత్వా తర్జయంతమివ స్థితమ్ | విధూమ్రానలసంకాశం బాలసూర్యమివోదితమ్ || 24 సూర్యహస్తమనిర్దేశ్యం పాశహస్తమివాంతకమ్ | పరశుం తీక్ష్ణధారం చ సర్పాద్యైశ్చ విభూషితమ్ || 25 కల్పాంతదహనాకారం తథా పురుషవిగ్రహమ్ | యత్తద్భార్గవరామస్య క్షత్రియాంతకరం రణ || 26 రామో యద్బలయమాశ్రిత్య శివదత్తస్య వై పురా | త్రిస్సప్తకత్వో న క్షత్రం దదాహ హృషితో మునిః || 27 సుదర్శనం తథా చక్రం సహస్రవదనం విభుమ్ | ద్విసహస్రభుజం దేవమద్రాక్షం పురుషాకృతిమ్ || 28 ద్విసహస్రేక్షణం దీప్తం సహస్రచరణాకులమ్ | కోటిసూర్యప్రతీకాశం త్రైలోక్యదహనక్షమమ్ || 29 వజ్రం మహోజ్జ్వలం తీక్ష్ణం శతపర్వమనుత్తమమ్ | మహాధనుః పినాకం చ సతూణీరం మహాద్యుతిమ్ || 30 శక్తిం ఖడ్గం చ పాశం చ మహాదీప్తం సమాంకుశమ్ | గదాం చ మహతీం దివ్యామన్యాన్యస్త్రాణి దృష్టవాన్ || 31 పొగరుమోతు లవణాసురుడు శత్రుఘ్న మహారాజును యుద్ధమునకు ఆహ్వానించగా ఆయన ఆ రాక్షసుని సంహరించెను (22). మిక్కిలి వాడి కొనగలది, అతిశయించిన భయమును కలిగించునది అగు ఆ శూలము ఆ రాక్షసుడు నశించగానే రుద్రుని చేతియందు చేరినది (23). పొగలేని అగ్ని వలెనున్నది, ఉదయించే సూర్యుని పోలినది అగు ఆ శూలము మూడు అగ్రములను కనుబొమలుగా చేసుకొని భయపెట్టుచున్నదా యన్నట్లు ఉండెను (24). అతిశయించిన కాంతిని కలిగియుండుటచే ఇదమిత్థముగా నిర్దేశించ శక్యముకాని ఆ శూలమును శివుడు ధరించినప్పుడు మృత్యుపాశమును చేతబట్టిన యమునివలె, సూర్యుని చేతితో పట్టుకున్నవాని వలె ప్రకాశించును. పదునైన ధార గలది, సర్పములు మొదలగు వాటిచే అలంకరింప బడినది (25), ప్రలయకాలాగ్నిని పోలియున్నది, పురుషాకారముతో సమమగు పొడవు గలది అగు గండ్రగొడ్డలిని కూడ చూచితిని. భార్గవరాముడు యుద్ధములో దానితో క్షత్రియులను సంహరించినాడు (26). పూర్వము దానిని శివుడు భార్గవరామునకు ఈయగా, ఆయన దానితో ఇరువది ఒక్క పర్యాయములు క్షత్రియులను సంహరించి లోకములో క్షత్రియులు లేకుండగా చేసి ఆనందించెను (27) వేయి ముఖములు గలది, సర్వ సమర్థమైనది, రెండు వేల భుజములు రెండు వేల నేత్రములు మరియు వేయి పాదములు గల పురుషుని రూపమును దాల్చి కోటిసూర్యుల కాంతితో వెలిగిపోవుచున్నది, ముల్లోకములను దహించే సామర్థ్యము గలది అగు సుదర్శనచక్రము చూచితిని (28, 29). అతిశయించిన ప్రకాశము గలది, వంద వాడి అంచులు గలది, సర్వోత్తమమైనది అగు వజ్రమును, అంబులపొదితో గూడి గొప్పగా ప్రకాశించే పినాకమనే గొప్ప ధనస్సును, శక్తిని, కత్తిని, గొప్ప కాంతులు గల పాశమును, అంకుశమును, దివ్యమైన గొప్ప గదను మరియు ఇతరములగు అస్త్రములను చూచితిని (30, 31). తథా చ లోకపాలానామస్త్రాణ్యతాని యాని చ | అద్రాక్షం తాని సర్వాణి భగవద్రుద్రపార్శ్వతః || 32 సవ్యదేశే తు దేవస్య బ్రహ్మ లోకపితామహః | విమానం దివ్యమాస్థాయ హంసయుక్తం మనోపమమ్ || 33 వామపార్శ్వే తు తసై#్యవ శంఖచక్రగదాధరః | వైనతేయం సమాస్థాయ తథా నారాయణః స్థితః|| 34 స్వాయంభువాద్యా మనవో భృగ్వాద్యా ఋషయస్తథా | శక్రాద్యా దేవతాశ్చైవ సర్వ ఏవ సమం యయుః || 35 స్కందశ్శక్తిం సమాదాయ మయారస్థస్సఘంటకః | దేవ్యాస్సమీపే సంతస్థౌ ద్వితీయ ఇవ పావకః || 36 నందీ శూలం సమాదాయ భవాగ్రే సమవస్థితః | సర్వభూతగణాశ్చైవ మాతరో వివిధాః స్థితాః || 37 తే %భివాద్య మహేశానం పరివార్య సమంతతః| అస్తువన్ వివిధైః స్తోత్రైర్మహాదేవం తదా సురాః || 38 యత్కించిత్తు జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతే%థ వా | తత్సర్వం భగవత్పార్శ్వే నిరీక్ష్యాహం సువిస్మితః || 39 సుమహద్దైర్యమాలంబ్య ప్రాంజలిర్వివిధైః స్తవైః | పరమానందమసమగ్నో%భూవం కృష్ణాహమధ్వరే || 40 సమ్ముఖే శంకరం దృష్ట్వా బాష్పగద్గదయా గిరా | అపూజయం సువిధివదహం శ్రద్ధాసమన్వితః || 41 అంతేగాక, రుద్రభగవానుని ప్రక్కన నేను లోకపాలకుల అస్త్రముల నన్నింటినీ చూచితిని (32). ఆ దేవుని ఎడమ ప్రక్కన లోకపితామహుడగు బ్రహ్మ హంసలను పూన్చిన, మనోవేగము గల దివ్యవిమానమును అధిష్ఠించి యుండెను (33). మరియు ఆయనకు ఎడమ ప్రక్కనే నారాయణుడు శంఖచక్రగదలను ధరించి గరుడునిపై కూర్చుండి యుండెను (34). స్వాయంభువుడు మొదలగు మనువులు, భృగువులు మొదలగు ఋషులు, మరియు ఇంద్రుడు మొదలగు దేవతలు అందరు అచటకు చేరిరి (35). కుమారస్వామి శక్తిని మరియు ఘంటను చేతబట్టి, నెమలిపై కూర్చుండి పార్వతీదేవికి సమీపములో రెండవ అగ్నివలె ప్రకాశించుచుండెను (36). నంది శూలమును పట్టుకొని శివుని యెదుట నిలబడెను. భూతగణములు, మరియు మాతృగణములు అందరు నిలబడియుండిరి (37). అపుడా దేవతలు మహేశ్వరుడు, మహాదేవుడు అగు శివుని ప్రణమిల్లి చుట్టూ నిలబడి వివిధస్తోత్రములతో స్తుతించిరి (38). ఈ జగత్తులో కానవచ్చే మరియు వినవచ్చే సర్వపదార్థములను నేను ఆ భగవానుని ప్రక్కన చూచి మిక్కిలి ఆశ్చర్యమును పొందితిని (39). ఓ శ్రీ కృష్ణా! అచట జరిగే యజ్ఞములో నేను గొప్ప ధైర్యమును చిక్కించుకుని చేతులను జోడించి వివిధస్తోత్రములతో స్తుతించి పరమానందములో మునిగిపోతిని (40). శ్రద్ధావంతుడనగు నేను నా యెదుట శంకరుని చూచి కన్నుల వెంబడి నీరు స్రవించుచుండగా, బొంగురు కంఠముతో ఆయనను యథావిధిగా పూజించితిని (41). భగవానథ సుప్రీతశ్శంకరః పరమేశ్వరః | వాణ్యా మధురయా ప్రీత్యా మామాహ ప్రహసన్నివ || 42 న విచాలయితుం శక్యో మయా విప్ర పునః పునః | పరీక్షితో%సి భద్రం తే భవాన్ భక్త్యాన్వితో దృఢః || 43 తస్మాత్తే పరితుష్టా%స్మి వరం వరయ సువ్రత | దుర్లభం సర్వదేవేషు నాదేయం విద్యతే తవ || 44 స చాహం తద్వచః శ్రుత్వా శంభోస్సత్ర్పేమసంయుతమ్ | దేవం తం ప్రాంజలిర్భూత్వాబ్రువం భక్తానుకంపినమ్ || 45 భగవన్ యది తుష్టో%సి యది భక్తిః స్థిరా మయి | తేన సత్యేన మే జ్ఞానం త్రికాలవిషయం భ##వేత్ || 46 ప్రయచ్ఛ భక్తిం విపులాం త్వయి చావ్యభిచారిణీమ్ | సాన్వయస్యాపి నిత్యం మే భూరి క్షీరౌదనం భ##వేత్ || 47 మమాస్తు తవ సాన్నిధ్యం నిత్యం చైవాశ్రమే విభో | తవ భ##క్తేషు సఖ్యం స్యాదన్యోన్యేషు సదా భ##వేత్ || 48 ఏవముక్తో మయా శంభుర్విహస్య పరమేశ్వరః | కృపాదృష్ట్వా నిరీక్ష్యాశు మాం స ప్రాహ యదూద్వహ || 49 పరమేశ్వరుడగు శంకరభగవానుడు అప్పుడు మిక్కిలి సంతోషించి చిరునవ్వుతో మధురమగు వచనముతో ప్రీతిపూర్వకముగా నాతో నిట్లనెను (42). ఓ బ్రాహ్మణా! నేను పలుమార్లు ప్రయత్నతించినప్పటికీ నీలో చలనము కలుగలేదు. నేను నిన్ను పరీక్షించుట పూర్తి అయినది. నీ యందు దృఢమగు భక్తి గలదు (43) గొప్ప వ్రతము గలవాడా! కావుననే నేను చాల సంతసించితిని. దేవతలందరికి లభ్యము కాని వరమును కోరుకొనుము. నీకు ఈయదగనది లేదు (44). శంభుని గొప్ప ప్రేమతో కూడిన ఆ మాటలను విని నేను భక్తులయందు దయను చూపే ఆ దేవునకు చేతులు జోడించి ప్రణమిల్లి ఇట్లు పలికితిని (45). ఓ భగవాన్!నీవు సంతోషించినచో, నాయందు దృఢమగు భక్తి యున్నచో ఆ సత్య ప్రభావముచే నాకు మూడు కాలములయందలి విషయములు తెలియుచుండు గాక! (46) నీయందు అచంచలమైన విస్తృతమగు భక్తిని ఇమ్ము. మరియు నాకు నా వంశమునకు నిత్యము పాలు,అన్నము సమృద్ధిగా లభించుగాక! (47) ఓ విభూ! నా ఆశ్రమములో నీ సన్నిధి నిత్యము ఉండుగాక! నీ భక్తులకు సర్వకాలములలో పరస్పరప్రేమ కలుగు గాక! (48) ఓ శ్రీ కృష్ణా! నేను ఇట్లు పలుకగా, శంభుపరమేశ్వరుడు నవ్వి, నన్ను దయాదృష్టితో చూచి వెంటనే నాతో నిట్లనెను (49). శివ ఉవాచ| ఉపమన్యో మునే తాత వర్జితస్త్వం భవిష్యసి | జరామరణజైర్దోషైస్సర్వకామాన్వితో భవ || 50 మునీనాం పూజనీయశ్చ యశోధనసమన్వితః | శీలరూపగుణౖశ్వర్యం మత్ర్పసాదాత్పదే పదే || 51 క్షీరోదసాగరసై#్యవ సాన్నిధ్యం పయసాం నిధేః | తత్ర తే భవితా నిత్యం యత్ర యత్రేచ్ఛసే మునే || 52 అమృతాత్మకం తు త్ క్షీరం యావత్సంయామ్యతే తతః | ఇమం వైవస్వతం కల్పం పశ్యసే బంధుభిస్సహ || 53 త్వద్గోత్రం చాక్షయం చాస్తు మత్ర్పసాదాత్సదైవ హి | సాన్నిధ్యమాశ్రమే తే%హం కరిష్యామి మహామునే || 54 మద్భక్తిస్సుస్థిరా చాస్తు సదా దాస్యామి దర్శనమ్ | స్మృతశ్చ భవతా వత్స ప్రియస్త్వం సర్వథా మమ || 55 యథాకామసుఖం తిష్ఠ నోత్కంఠాం కర్తుమర్హసి | సర్వం ప్రపూర్ణతాం యాతు చింతితం నాత్ర సంశయః || 56 శివుడు ఇట్లు పలికెను- వత్సా! ఓ ఉపమన్యుమహర్షీ! నీకు ముసలితనము, మరణము అనే దోషములనుండి విముక్తి కలుగగలదు. నీ కోర్కెలు అన్నియు ఈడేరును (50). కీర్తియే ధనముగా గల నీవు మునులకు కూడ పూజనీయుడవు. నా అనుగ్రహముచే నీకు ప్రతి పదమునందు శీలము, రూపము, సద్గుణములు, ఐశ్వర్యము లభించును (51). ఓ మహర్షీ! నీవు కోరిన ప్రతిస్థలమునందు పాలసముద్రముయొక్క నిత్యసన్నిధి నీకు సిద్ధించగలదు (52). సృష్టి ఉన్నంతవరకు నీకు అమృతరూపములగు ఆ పాలు లభించగలవు. మరియు, నీవు బంధువులతో సహా ఈ వైవస్వతకల్పమును చూచెదవు (53). నా అనుగ్రహముచే నీ గోత్రము అక్షయమగుగాక! ఓ మహర్షీ! నేను సర్వదా నీ ఆశ్రమములో నివాసమును చేయగలను (54). నీకు నా యందలి భక్తి సుస్థిరముగా నుండుగాక! ఓ కుమారా! నీవు స్మరించిన వెంటనే నేను నీకు దర్శనమీయగలను. నీవు నాకు అన్ని విధములుగా ప్రియమైన వాడవు (55). నీవు నీకు నచ్చిన విధములో సుఖముగా నుండుము. ఆదుర్దాను చెందకుము. నీవు కోరుకునే సర్వము నీకు పూర్ణముగా లభించగలదు. దీనిలో సందేహము లేదు (56). ఉపమన్యురువాచ | ఏవముక్త్వా స భగవాన్ సూర్యకోటిసమప్రభః | మమేశానో వరాన్ దత్త్వా తత్రైవాంతరధీయత || 57 ఏవం దృష్టో మయా కృష్ణ పరివారసమన్వితః | శంకరః పరమేశానో భుక్తిముక్తిప్రదాయకః || 58 శంభునా పరమేశేన యదుక్తం తేన ధీమతా | తదవాప్తం చ మే సర్వం దేవదేవ సమాధినా || 59 ప్రత్యక్షం చైవ తే జాతాన్ గంధర్వాప్సరసస్తథా | ఋషీన్ విద్యాధరాంశ్చైవ పశ్య సిద్ధాన్ వ్యవస్థితాన్ || 60 పశ్య వృక్షాన్ మనోరమ్యాన్ స్నిగ్థపత్రాన్ సుగంధినః | సర్వర్తుకుసుమైర్యుక్తాన్ సదా పుష్పఫలాన్వితాన్ || 61 సర్వమేతన్మహాబాహో శంకరస్య మహాత్మనః | ప్రసాదాద్దేవదేవస్య విశ్వం భావసమన్వితమ్ || 62 మమాస్తి త్వఖిలం జ్ఞానం ప్రసాదాచ్ఛూలపాణినః | భూతం భవ్యం భవిష్యం చ సర్వం జానామి తత్త్వతః || 63 తమహం దృష్టవాన్ దేవమపి దేవాస్సురేశ్వరాః | యం న పశ్యంత్యనారాధ్య కో%న్యో ధన్యతరో మయా || 64 షడ్వింశకమితి ఖ్యాతం పరం తత్త్వం సనాతనమ్ | ఏవం ధ్యాయంతి విద్వాంసో మహత్పరమమక్షరమ్ || 65 సర్వతత్త్వవిధానజ్ఞః సర్వతత్త్వార్థదర్శనః | స ఏవ భగవాన్ దేవః ప్రధానపురుషేశ్వరః || 66 యో నిజాద్దక్షిణాత్పార్శ్వాద్ర్బహ్మాణం లోకకారణమ్ | వామాదప్యసృజద్విష్ణుం లోకరక్షార్థమీశ్వరః || 67 కల్పాంతే చైవ సంప్రాప్తే%సృజద్రుద్రం హృదః ప్రభుః | తతస్సమాహరత్కృత్స్నం జగత్ స్థావరజంగమమ్ || 68 యుగాంతే సర్వభూతాని సంవర్తక ఇవానలః | కాలో భూత్వా మహాదేవో గ్రసమానస్స తిష్ఠతి || 69 సర్వజ్ఞస్సర్వభూతాత్మా సర్వభూతభవోద్భవః | ఆస్తే సర్వగతో దేవో దృశ్యస్సర్వైశ్చ దైవతైః || 70 అతస్త్వం పుత్రలాభాయ సమారాధయ శంకరమ్ | శీఘ్రం ప్రసన్నో భవితా శివస్తే భక్తవత్సలః || 71 ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయం కృష్ణోపమన్యుసంవాదో నామ ప్రథమో%ధ్యాయః (1). ఉపమన్యువు ఇట్లు పలికెను- కోటి సూర్యులతో సమానమగు కాంతి గల ఆ ఈశానభగవానుడు ఈ విధముగా పలికి నాకు వరములనిచ్చి అచటనే అంతర్థానమాయెను (57). ఓ శ్రీ కృష్ణా! భుక్తిని మరియు ముక్తిని ఇచ్చువాడు, పరమేశ్వరుడు అగు శంభుని పరివారముతో కూడియుండగా నేను ఈ విధముగా చూచియుంటిని (58). ఓ దేవదేవా! శ్రీకృష్ణా! పరమేశ్వరుడు, ప్రజ్ఞానస్వరూపుడు, అగు శంభుడు చెప్పినవాటిని అన్నింటినీ నేను ధ్యానప్రభావముచే పొందితిని (59). నీ యెదుటనే యున్న గంధర్వులను, అప్సరసలను, ఋషులను, విద్యాధరులను, మరియు సిద్ధులను నీవు ప్రత్యక్షముగా చూడుము (60). మనస్సునకు ఆహ్లాదమును కలిగించునవి, దట్టమగు ఆకులను కలిగియున్నవి, సుగంధమును వెదజల్లుచున్నవి, ఋతువులన్నింటియొక్క పుష్పములతో ప్రకాశించునవి, సర్వదా పుష్పములతో మరియు ఫలములతో కూడియున్నవి అగు ఈ వృక్షములను చూడుము (61). ఓ మహాబాహో! ఈ జగత్తు అంతయు మహాత్ముడు, దేవదేవుడు అగు శంకరుని అనుగ్రహము చేతనే ఉనికిని కలిగియున్నది (62). శూలపాణియగు శంకరుని అనుగ్రహముచే నాకు సర్వము తెలియును. భూతభవిష్యద్వర్తమానవిషయములన్నింటియొక్క స్వరూపము నాకు తెలియును (63). దేవతలు, లోకపాలకులు ఏ ఈశ్వరుని దర్శనమును ఆయనను ఆరాధించకుండగా పొందజాలరో, అట్టి దేవుని నేను చూచితిని. నాకంటే ధన్యుడు మరియెవరు గలరు? (64) ఇరువది ఆరు లక్షణములను కలిగియున్నది, సనాతనము, మహత్తత్త్వముకంటే ఉత్కృష్టమైనది, వినాశము లేనిది అగు పరమతత్త్వమును పండితులు ఈ శివుని రూపముగా ధ్యానించుచున్నారు (65). తత్త్వములన్నింటియొక్క విధానమును తెలిసిన వాడు, తత్త్వములన్నింటియొక్క సారమును దర్శించువాడు, ప్రకాశస్వరూపుడు అగు ఆ భగవానుడు మాత్రమే ప్రకృతి-పురుషులకు ప్రభువు అగుచున్నాడు (66). ఆ ఈశ్వరుడు తన కుడి ప్రక్కనుండి లోకములను సృష్టించు బ్రహ్మను, ఎడమ ప్రక్కనుండి ఆ లోకముల రక్షణ కొరకై విష్ణువును సృష్టించెను (67). ఆ ప్రభుడు ప్రళయకాలము రాగానే తన హృదయమునుండి రుద్రుని సృష్టించగా, ఆయన చరాచరజగత్తునంతనూ ఉపసంహరించెను (68). ఆ మహాదేవుడు ప్రళయకాలమునందు సంవర్తక-అగ్నియై మరియు మృత్యుస్వరూపుడై ప్రాణులనన్నిటినీ మ్రింగివేసి తాను మాత్రమే మిగిలియుండును (69). సర్వము తెలిసినవాడు, సర్వప్రాణుల ఆత్మరూపుడు, సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు అగు ఆ దేవుడు సర్వదేవతలచే దర్శింపబడు చున్నవాడై సర్వమును వ్యాపించి యున్నాడు (70). కావున నీవు పుత్రుని పొందుట కొరకై శంకరుని చక్కగా ఆరాధించుము. భక్తవత్సలుడగు శివుడు శీఘ్రముగా నీపై ప్రసన్నుడు కాగలడు (71). శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు శ్రీకృష్ణ-ఉపమన్యు సంవాదమనే మొదటి అధ్యాయము ముగిసినది (1).