Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ముప్పదినాల్గవ అధ్యాయము - నానావిధోత్పాత కథనము

రామః-అద్భుతానాం ఫలం దేవః శకునంచ తధా వదః | త్వం హివేత్సి విశాలాక్షః జ్ఞేయం సర్వమశేషతః ||

పుష్కరః- అత్రతే వర్ణయిష్యామి యదువాచ మహాతపాః | అత్ర యో వృద్ధగర్గస్తు సర్వధర్మభృతాం వరః ||

అద్భుతముల యొక్క ఫలము వాని శాంతిని గూర్చి తెల్పుము. నీవు సమగ్రముగ నెఱింగిన వాడవు గదాయని పరశురాముం డడుగ పుష్కరిండిట్లనియె. సర్వధర్మము లెఱింగిన వారిలో శ్రేష్ఠుడు మహాతపస్వియునగు వృద్ధ గర్గా చార్యులు సెప్పిన యీ యంశమును నీకెఱింగింతును.

సరస్వత్యాం సుఖాసీనం గర్గం స్రోతసి భార్గవ! | ప్రవచ్ఛాత్రిర్మహాతేజాః గర్గం మునజనప్రియమ్‌ ||

అత్రిః-నశ్యతాం పూర్వరూపాణి జనానాం కథయస్వమే | నగరాణాం తధారాజ్ఞాం త్వంహి సర్వ విదుచ్యసే ||

గర్గః- పురుషాపచారా న్నియత మపరజ్యన్తి దేవతాః | తతోపరాగా ద్దేవానా ముపసర్దః ప్రవర్తతే ||

దివ్యాన్తరిక్షభౌమం తత్త్రివిధం పరికీర్తతమ్‌ | గృహర్షం వైకృతం దివ్య మాంతరిక్షం నిబోధమే ||

ఉల్కాపాతో దిశాం దాహః పరివేష స్తధైవ చ | గంధర్వనగరం చైవ వృష్టిస్తు వికృతాచ యా ||

ఏవ మాదీని లోకేస్మిన్‌ నాభసాని వినిర్దిశేత్‌ | చర స్థిర భవం భూమౌ భూకలామపి భూమిజమ్‌ ||

సరస్వతీ నదీతీరమందు సుఖాసీనుడైయున్న గర్గుని మునుల కెంతేని గూర్చు వానిని మహతేజస్వియగు అత్రి మహర్షి నీవు సర్వజ్ఞుడవు గావున మానవులు నగరములు రాజులు నశించుటకు మున్ను వారి రూపము లెట్లుండునో తెల్పుమున గర్గుం డిట్లనియె. పురుషుడు (నరుడు) సేసిన యపచారము వలన దేవతలు కుపితులగుదురు. దేవతాగ్రహముచే ఉపసర్గము (ఉత్పాతము) ఆరంభమగును. అది దివ్యము, అంతరిక్షము, భౌమమునని మూడు విధములు. గ్రహనక్షత్రములందు వికృతి దివ్యము. కొఱవులు పడుట, దిక్కులందు అగ్నిజ్వాలలు పరివేషము = గుడి కట్టుట. గంధర్వ నగరము = ఆకసమున నగపడు మిధ్యా నగరము విపరీత వర్షము మొదలగునవి యాంతరిక్షములు. భూమి యందలి స్థావరజంగమభూతములకు గల్గుబాధ భౌమము.

జలాశయానాం వైకృత్యం భూమౌ తదపి కీర్తితమ్‌ | భౌమం యామ్యఫలం జ్ఞేయం చిరేణ భువి వశ్యతే ||

నాభసం మధ్యఫలదం మధ్యకాల ఫలప్రదమ్‌ | దివ్యం తీవ్రఫలం జ్ఞేయం శీఘ్రకారి తధైవచ ||

అద్భుతేతు సముత్పన్నే యదివృష్టిః శివాభ##వేత్‌ | సప్తాహాభ్యన్తరే జ్ఞేయ మద్భుతం నిష్ఫలం హి తత్‌ ||

అద్భుతస్య విపాకశ్చే ద్వినాశాన్తేర్న దృశ్యతే | త్రిభిర్వర్షైస్తధాజ్ఞేయం సుమహద్భయకారకమ్‌ ||

నదీనద తటాకాదుల వైకృతము కూడ భౌమమే. ఇది యామ్యఫలము. అనగా యమలోకము చూపునది. చిరకాలమునకు భూమి యందిది కనిపించును. నాభసోత్పాతము (అంతరిక్షము) మధ్యకాలమందు ఫలము నిచ్చును. దివ్యాద్భుతము తీవ్రఫలప్రదము. అద్భుతమేర్పడినపుడు ఏడురోజులలో శుభవృష్టి (వర్షము) కురియునేని యా ఉత్పాతము వ్యర్థమైపోవును. అద్భుతపు ఫలము శాంతి క్రియ చేయకుండ కలుగకున్నచో అది మూడు సంవత్సరములలోవిపరీత భయముగూర్చును.

రాజ్ఞః శరీరే లోకేచ పురద్వారే పురోహితే | పాక మాయాతి పుత్రేషు తధా వైకోశవాహనే ||

దత్తస్వభావజా యేచ భవన్త్యద్భుత సంజ్ఞకాః | శుభావహాస్తే విజ్ఞేయాస్తాంశ్చమే గదతః శృణు ||

దాని ఫలితము రాజు శరీరమందు, లోకులమీద, పురద్వారమందు, పురోహితునియందును, రాజు కొడుకులందు, ధనాగారమునందు, వాహనములందు ఫలించును. అనగా వీనియందు ఉత్పాత ఫలలక్షణములు గనిపించునన్నమాట. ఉత్తములైన సమాజములగు అద్భుతోత్పాతమలు శుభఫలప్రదములగును. వానిని నావలన వినుము.

వజ్రాశని మహీకంప సంధ్యా నిర్ఘాత నిస్వనాః | పరివేషం రజో ధూమం రక్తార్కోస్తమనోదయే ||

ద్రుమేభ్యో వరయశ్చేహ బహుపుష్ప ఫలాపగా | గోపక్ష మధువృద్ధిశ్చ శుభాని మధుమాధవే ||

పిడుగులు, భూకంపము, సంధ్యాకాలమున సుడిగాలులుకలుగుట, పెద్దపెద్దపిడుగుల చప్పుడు, సూర్యునిచుట్టు గుడికట్టుట, ధూళి, పోగ గ్రమ్ముట, ఉదయాస్తమయములందు సూర్యుడెఱ్ఱగా నుండుట అశుభములు. వసంతర్తువు నందు చెట్లనుండి పుష్ప ఫలాది సమృద్ధి కలుగుట, గొవక్ష మధువృద్ధియు శుభములు.

తారోల్కాపాత కలుషం కపిలార్కంతు మండలమ్‌ | అనగ్నిజ్వలనా స్ఫోట ధూమరేష్వ నిలావహమ్‌ ||

రక్త పద్మారుణం సాంధ్యం నభః క్షుబ్ధార్ణవోపమమ్‌ | సరితా చాంబు సంశోషం దృష్ట్వా గ్రీష్మే శుభం వదేత్‌ ||

గ్రీష్మర్తువులో చుక్కలురాలుట, కొఱవులు వడుట, నభోమండలమున కపిల వర్ణముతో సూర్యుడు కనిపించుట, అగ్ని లేకుండనే మంటలు, చిటపటలు, పొగ, హోరుగాలి, సంధ్యాకలము ఎఱ్ఱతామర పూవట్లుండుట, ఆకాశము క్షోభించిన సముద్రమట్లు కనిపించుట, నదులెండిపోవుట కనిపించునేని శుభఫలమని చెప్పవలెను.

శక్రాయుధం పరీవేశం విధుశుష్కవిరోహణమ్‌ | కంపోద్వేలన వైకృత్యం త్రసనం దారుణం క్షితేః ||

సద్యో దపాన సరసాం వృద్ధవ్వతరణ ప్లవాః | శీర్ణతా చాహ్ని తేహానాం వర్షాసుచ భవిష్యతి ||

వర్షర్తువు నందు ఇంద్రధనుస్సు, చంద్రునకు గుడికట్టుట, భూకంపము, భూమిదొర్లుట, దారుణ భయము, నదులు, నూతులు, సరస్సులు పొంగుట. గుఱ్ఱములతో దాటుట, పడవలు, పగటి యందు ఇండ్లు శిధిలమగుట జరుగును.

దివ్యస్త్రీ భూత గంధర్వ విమానాద్భుత దర్శనమ్‌ | గృహ నక్షత్ర తారాణాం దర్శనం దివాకరే ||

గీత వాదిత్ర నిర్ఘోషో వన పర్వత సానుషు| రసవృద్ధీ రసోత్పత్తిః శరత్కాలే శుభాః స్మృతాః ||

శరదృతువు నందు దివ్యస్త్రీలు, భూతములు, గంధర్వులు, విమానములు అద్భుతములు గనిపించుట; సూర్యుడుండగ గ్రహనక్షత్ర తారాగ్రహ దర్శనము, సంగీతము, వాద్యములఘోషయు, వనములందు, పర్వతములందు చరియలందు, రసవృద్ధి, రసోత్పత్తి యివి శరత్కాలమందు గనిపించుట శుభప్రదములు.

శీతా లులత్తుషారత్వం నందనం గృహపక్షిణామ్‌ | రక్షోయక్షాది సత్వానాం దర్శనం వాగమానుషీ ||

దిశో ధూమాంధకారశ్చ శరభోఘన పర్వతాః | ఉచ్చైః సూర్యోదయాస్తౌచ హేమన్తే శోభనాః స్మృతాః ||

హేమంతర్తువునందు చల్లని మంచు గురియుట; గృహపక్షులకు ఆనందదాయకముగా నుండుట, రక్షస్సులు, యక్షులు జీవులు అక్కడ ఉండుట అమానుషవాక్కు దెసలందు పొగ చీకటి మొదలగునవి శోభనములని చెప్పబడును.

హిమపాతా7నిలోత్పాతౌ విరూపాద్భుత దర్శనమ్‌ | కృష్ణాంజనాభ మాకాశం తారోల్కాపాత పింజరమ్‌ ||

చిత్ర గర్భోద్భవం స్త్రీషు గోజాశ్వ మృగపక్షిషు | పత్రాంకుర లతానాంచ వికారాశ్శిశిరే శుభాః ||

శిశిరర్తులో మంచు పడుట, వాయువు విపరీతముగా వీచుట, ఆకాశము నల్ల కాటుకవలె నుండుట, చుక్కలు రాలుట కొఱవులు పడుట చేత కలుషమయి యుండుటయు వికృత లక్షణమైన అద్భుతము. స్త్రీలయందు, గోవులు, మేకలు, గుఱ్ఱము, జంతువులు, పక్షులలో విచిత్ర గర్భ సంభవము, ఆకులు చిగుళ్ళు, తీగలయందు వికారము గనిపించుట అశుభప్రదములు.

ఋతు స్వభావేన వినాద్భుతస్య జాతస్య దృష్టస్య తు శీఘ్రమేవ |

కృత్వాశమం శాన్తి రనంతరం తు కార్యా యధోక్తా వసుధాధిపేన ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే నానావిధోత్పాత కధనం నామ చతుస్త్రింశదుత్తర శతతమోధ్యాయః.

ఋతు స్వభావమునకు వెంటనే విరుద్ధముగా గనిపించు నుత్పాతములకు వెంటనే ఉపశాంతిని చేసి శాంతి చేయవలెను. ఈ ప్రక్రియ రాజు (పరిపాలకుడు) చేయవలసినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున నానావిధోత్పాత కథనము అను నూటముప్పది నాల్గవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters