Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము

ద్వితీయ ఖండము

ఆంధ్రానువాదసహితము

అనువాదకులు :

గురుశిశువు శ్రీ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

పరిష్కర్త :

విద్వాన్‌ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి

వ్యాకరణ విద్యా ప్రవీణ, సాహిత్య విద్యా ప్రవీణ, వేదాంత విశారద

ప్రకాశకులు :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు

గురు కృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు-500 020.

ప్రథమ ముద్రణము సర్వస్వామ్యములు ప్రకాశకులవి

1987 మూల్యము : రు. 72-00

ప్రతులు : 2000

ప్రతులకు: ముద్రణ:

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు, ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ పై#్ర జెస్‌,

గురుకృప, 1-1-385,

1-1-140/1, అశోక్‌ నగర్‌, గాంధీనగర్‌,

హైదరాబాదు - 500 020 హైదరాబాదు - 500 380.

శ్రీః

ధర్మము - వేదము - పురాణము

ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠాహేతు రుచ్యతే | ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః ||

సమస్త జగత్తునకు స్థితిహేతువు ధర్మము. ధర్మమును పాటించిన వాని నది కవచమువలె రక్షించును. ఉల్లంఘించిన వానిని నశింపజేయును. కావున ధర్మ రక్షణ ద్వారా జగద్రక్షణము కావించుకొనుట మానవ ధర్మము. ధరింపబడినదై మనలను ధరించు (కాపాడు) దానికే ధర్మమను పేరు సార్థకము. అట్టి ధర్మము వేదైకసమధి గమ్యము. వేదము శబ్ద రూపము. సమస్త వాఙ్మయ ప్రపంచమునకు మూల మదియే.

''ఇద మంధం తమః కృత్స్నం జాయతే భువనత్రయం | యది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారం నదీప్యతే ||''

శబ్ద రూపమగు ఆ జ్యోతి సృష్టికి పూర్వము నుండియు లేనిచో ఈ ప్రపంచమంతయు అంధప్రాయమై యుండెడిదని దండి మహాకవి చెప్పినాడు.

'యో బ్రహ్మాణం విదధాతి పూర్వం | యోవై వేదాంశ్చ ప్రహిణోతి తసై#్మ.'

అను శ్వేతాశ్వతరోపనిషద్వాక్యము వలన - నిత్యసిద్ధము లయిన వేదలమును పరమేశ్వరుడు బ్రహ్మకు ఉపదేశించినట్లు తెలియుచున్నది.

''అనాది నిధనా నిత్యా వాగుత్సృష్టా స్వయంభువా | అదౌ వేదమయీ దివ్యా యత స్సర్వాః ప్రవృత్తయః||''

అను వాక్యము వలన సమస్త వాజ్మయోత్పత్తికి కారణమైనదియు ఆద్యంత శూన్యమును నిత్యమును వేదరూపమును నగు దివ్య వాక్కును సృష్టికి ఆదియందు స్వయంభూ బ్రహ్మ ఆవిష్కరించెను. ఆతడు వేదములకు కర్త మాత్రము కాదు. అని తెలియయుచున్నది.

''ఋగ్యజు స్సామాథర్వాఖ్యాన్‌ వేదాదీన్‌ ముఖతోసృజత్‌ |

శాస్త్ర మిజ్యాం స్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాత్‌ క్రమాత్‌ ||''

'ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేద మాత్మనః | స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్‌ పూర్వాదిభి ర్మఖైః'

'ఇతిహాస పురాణాని పంచమం వేద మీశ్వరః | సర్వేభ్య ఏవ వక్త్రేభ్యః ససృజే సర్వదర్శనః ||'

అను శ్రీమద్భాగవత తృతీయ స్కంధగత వచనము వలన గూడ వేదవిర్భావము ఆ బ్రహ్మ నుండియే జరిగినట్లు తెల్లమగుచున్నది.

''అస్య మహతో భూతస్య నిశ్వసిత మేతద్య దృగ్వేదో యజుర్వేద స్సామవేదః''అను శ్రుతియు పై విషయమునే బలపరుచు చున్నది.

వేదము

విశ్వ నిశ్శ్రేయస కారణమును ఇతర ప్రమాణ వేద్యము కానిదియు నగు ధర్మమును బోధించు అపౌరుషేయ వాక్యమునకు వేదమని పేరు. ఆ వేదము మంత్ర బ్రాహ్మణ బేధమును రెండు భాగములుగా నున్నది. అందు మంత్ర భాగము అనుష్ఠాన సాధనములగు ద్రవ్యమును దేవతలను బోధించును.

వేదము - ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఆథర్వణ వేదము అని నాలుగు విధములు. ఆ వేదముల పరిమితి పతంజలి భగవానునిచే వ్యాకరణ మహాభాష్యము నందు ఇట్లు చెప్పబడినది.

''ఏకశత మధ్వర్యు (యజుః) శాఖాః - సహస్రవర్త్మా సామ వేదః - ఏకవింశతిధా బాహ్వృచ్యమ్‌ (ఋగ్వేదః) నవధా ఆధర్వణో వేదః ||'' అని, కాని యిపుడి శాఖలలో కొన్ని లుప్తప్రాయములు.

బ్రాహ్మణము అష్ట విధములు. ''ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సుత్రాణి వ్యాఖ్యానాని అను వాఖ్యానాని అసై#్యవ నిశ్వసితాని.'' అని బృహదారణ్యక శ్రుతి తెలుపుచున్నది.

పురాణము

బ్రాహ్మణాంతర్గతముగా వక్కాణింపబడిన పురాణము ప్రపంచ పూర్వా7వస్థా ప్రతిపాదకము. వేదార్థ నిరూపకమును కరుణాపయోనిధయు సాక్షాన్నారాయణ రూపుడును నగు వేదవ్యాస భగవానునిచే ప్రణీతమునునై పంచ లక్షణ శాస్త్రముగను దశలక్షణ శాస్త్రముగను పేరొందినది.

''యస్మాత్‌ పురాహ్యన క్తీదం పురాణం తేన తత్‌ స్మృతమ్‌.''

అని బ్రహ్మాండ పురాణము నందు ప్రక్రియా పాదము నందు పురాణ శబ్ద నిర్వచనము గలదు.

''సహోవాచ ఋగ్వేదం భగవోధ్యేమి యజుర్వేదం సామవేద మాధర్వణం చతుర్థ మితిహాస పురాణం పంచమం వేదానాం వేదమతి.'' అను ఛాందోగ్యశ్రుతి ననుసరించి పురాణములు వేదాత్మకము లనుటకు సంశయములేదు.

''ప్రవృత్తిః సర్వ శాస్త్రాణాం పురాణా దభవత్తతః | కాలేనాగ్రహణం దృష్ట్వా పురాణస్య మహామతిః.

హరి ర్వ్యాస స్వరూపేణ జాయతేచ యుగే యుగే | చతుర్లక్ష ప్రమాణన ద్వాపరే ద్వాపరే సదా.

త దష్టాదశధా కృత్వా భూతలే నిర్దశ త్యపి.''

అను బృహన్నారధీయోక్తి వలన ఏక రూపమున నున్న పురాణమునే సాక్షాన్నరాయణుడు వేదవ్యాస రూపమున ఆవిర్భవించి పదునెనిమిదిగా పదునెనిమిది విభజించే ననియు అందువలన మహాపురాణములు 18 ఉప పురాణములు 18 యేర్పడె ననియు తెలియుచున్నది. ఇందు కొన్ని మాత్రమే ఉప లబ్దము లగుచున్నవి.

 

విష్ణు పురాణము

 

అష్టాదశ మహాపురాణములలో విష్ణు పురాణము మహోత్కృష్టమైనది. ఇది షడంశాత్మకముగ నలరారు చున్నది. ఇందు 6412 శ్లోకములు గలవు. విష్ణుపారమ్య మిందు వర్ణితము. ఇది ఆంధ్రభాషలోనికీ అనూదితమై మూల తాత్పర్యములతో ముద్రితమై శ్రీ కాంచీ కామకోటి జగద్గురు శంకరాచార్య స్వామి చరణుల కరకమలములం దంచితమై భాగ్యనగరస్థ శ్రీ ఆర్షభారతీ సంస్థచే ఆంధ్ర జనలోకమునకు ఇదివరలోనే అందజేయబడినది.

 

శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము

విష్ణు పురాణమే విష్ణుధర్మోత్తర మహాపురాణ మనుపేర నమరి ఖండత్రయ రూపమున నున్నది. అందు ఈ ఖండము ద్వితీయము. ఈ ఖండమునుందు 183 అధ్యాయములు తృతీయ ఖండమున 355 అధ్యాయములు కలవు.

ప్రథము ఖండమునందు సృష్టికి ప్రారంభమందలి బ్రహ్మ యొక్క జననము మొదలుకొని అనేక వంశములు, వ్రతాదులు, గాయత్రీ మహామంత్ర ప్రభావము, ఉపాఖ్యానములు శంకరగీత నారాయణ కవచము మునులచే నిత్యాను సంధేయ విషయములు మిక్కుటముగ గలవు.

ఈ పురాణమును గురించి నారదీయ మహాపురాణము నందు

అతః పరస్తు సూతేన శౌనకాదిభి రాదరాత్‌ | పృష్టేన చోదితాః శశ్వ ద్విష్ణు ధర్మోత్త రాహ్వయాః.

నానాధర్మ కథాః పుణ్యా వ్రతాని నియమా యమాః | ధర్మశాస్త్రం చార్థశాస్త్రం వేదాంతం జ్యోతిషం తథా.

వంశాఖ్యానం ప్రకరణాః స్త్రోత్రాణి మనవ స్తథా | నానావిద్యాశ్రయాః ప్రోక్తాః సర్వ లోకోపకారకాః.

ఏత ద్విష్ణు పురాణంవై సర్వ శాస్త్రార్థ సంగ్రహః.

అని ప్రశంస గలదు. అనగా శౌనకాది మునులు ఆదరముతో నడుగగా సూత మహర్షి విష్ణు ధర్మోత్తరము అను పేరు గల అనేక ధర్మ బోధకములగు పవిత్రములయిన కథలు వ్రతములు నియమములు యమములు ధర్మశాస్త్రము అర్థశాస్త్రము వేదాంతము జ్యోతిషము వంశముల కీర్తించుట ప్రకరణమలు స్తోత్రములు మనువుల చరిత్ర అనేక విద్యలకు సంబందించినవి సర్వ లోకములకు ఉపకరించునట్టివి అగు విషయముల ననేకములను చెప్పెను. ఈ విష్ణు పురాణము సర్వ శాస్త్రార్థ సంగ్రహరూప మైనది.

ధర్మసూత్ర ప్రధానమగు నిట్టి శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమును శ్రీ కాంచీపట్టణ విరాజమాన శ్రీకామకోటి పీఠాధిప శ్రీశ్రీశ్రీమచ్చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి కరకమల సంజాత శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి హస్త పద్మసంజాత శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ నవ్య శ్రీచరణ కరకమలములందు సప్రశ్రయముగను సాంజలి బంధముగను సమర్పించు మహాభాగ్యము శ్రీ సద్గురుదేవుల గురు కృపవలన చేకూరినందులకు నెంతయు సంతసించుచున్నాము.

శ్రీ కాంచీ కామకోటి పీఠ జగద్గురువుల యొక్కయు శ్రీ శృంగేరీ శారదాపీఠ జగద్గురువుల యొక్కయు ఆమోఘాశీస్సులతో భాగ్యనగరమున శ్రీ పల్లంపాటి వెంకటేశ్వర్లు గారిచే వ్యవస్థాపితమైన శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్టువారు ఇట్టి మహోత్కృష్ట గ్రంథములను ఆంధ్ర సోదరుల కరకమలములకు అందింప గల్గినందులకు మిక్కిలి ఆనందించుచున్నారు. ప్రతి ఆంధ్రుడును వీనిని చదివి దానివలన కలిగిన విజ్ఞానమును ఆచరణలో నుంచుకొని లోకకళ్యాణ సంధాయకులగుచు మా కృషిని సార్థకము చేయుదురు గాక!

ఇతిశమ్‌

బుధవిధేయః

విద్వాన్‌ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రీ

వ్యాకరణ విద్యా ప్రవీణః-సాహిత్య విద్యాప్రవీణః-వేదాంత విశారదః.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters