Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వితీయోధ్యాయః

జనమేజయ ఉవాచ : మామాఖ్యాహి మహాభాగ రాజ్ఞాం వంశం సువిస్తరమ్‌ | సూర్యా న్వయ ప్రసూతానాం ధర్మజ్ఞానాం విశేషతః. 1

వ్యాస ఉవాచ: శృణు భారతవక్ష్యామి రవివంశస్య విస్తరమ్‌ | యథాశ్రుతం మయా పూర్వంనారదాదృషిసత్త మాత్‌.

ఏకదా నారదః శ్రీమా న్సర స్వత్యా స్తటే శుభే | అజగా మా೭೭శ్రమే పుణ్య విచర న్స్వేచ్చయా మునిః. 3

ప్రణమ్య శిరసా పాదౌతస్యాగ్రే సంస్థిత స్తదా | తత స్త స్యాసనం దత్త్వా కృత్వార్హణ మథా దరాత్‌. 4

విధివ త్పూజయిత్వా త ముక్తవా న్వచనం త్విదమ్‌ | పావితోహం మునిశ్రేష్ఠ పూజ్య స్యాగమనేన వై. 5

కథాం కథయ సర్వజ్ఞ రాజ్ఞాం చరిత సంయుతామ్‌ | రాజా నో యే సమా ఖ్యాతాః సప్తమేస్మిన్మనోః కులే. 6

తేషా ముత్పత్తి రతులా చరితం పరమాద్బుతమ్‌ |

శ్రోతుకామోస్మ్యహం బ్రహ్మ న్సూర్య వంశస్య విస్తరమ్‌. 7

సమా ఖ్యాహి ముని శ్రేష్ఠ సమాసవ్యాస పూర్వకమ్‌ | ఇతి పృష్టో మయా రాజన్నారదః పరమార్థ విత్‌. 8

ఉవాచ ప్రహస న్ర్వీతః సమాభాష్య మూదాన్వయమ్‌ |

శృణు సత్యవతీ సూనో రాజ్ఞాం వంశ మనుత్తమమ్‌. 9

పావనం కర్ణసుఖదం ధర్మజ్ఞానాదిభి ర్యుతమ్‌ | బ్రహ్మా పూర్వం జగత్కర్తా నాభిపం కజసంభవః 10

విష్ణో రితి పురాణషు ప్రసిద్ధః పరికీర్తితః | సర్వజ్ఞః సర్వ కరాసౌ స్వయం భూః సర్వశక్తి మాన్‌. 11

తప స్తప్త్వాస విశ్వాత్మా వర్షణా మయుతం పురా | సృష్టి కామః శివాం ధ్యాత్వా ప్రాప్వశక్తి మనుత్తమామ్‌

పుత్రా నుత్పాదయా మాస మాన సాన్‌ శుభలక్షణాన్‌ | మరీచిః ప్రథితస్తేషా మభవ త్సృష్టి కర్మణి. 13

ద్వితీయాధ్యాయము - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగు రాజుల చరిత్ర నాకు వివరముగ వినిపింపుము. ఆన వ్యాసు డిట్లనెను: ఓ భారతా ! నేను మున్నొకప్పుడు ఋషిసత్తముడగు నారదునివలన సూర్యవంశ చరిత్ర విస్తరము వింటిని. ఆ వినిన విధమునే నేను నీకిపుడు తెలిపెదను. ఒకప్పుడు శ్రీమంతుడగు నారదముని స్వేచ్చగ పర్యటించుచు పావన సరస్వతీ తీరమందలి నాపుణ్యాశ్రమము జేరెను. అపుడు నేను నారదుని పాదములకు మ్రొక్కి యాస నమిచ్చి గౌరవించి యతనిముందు నిలుచుంటిని. అతనిని యథావిధిగ పూజించి నేనిటు లంటిని: 'ఓ మునివరా! నీవు లోక పూజ్యు డవు. నీ రాకవలన నేను తరించితిని. ఏడవ మనువునకు జన్మించిన రాజులు ఘనముగ పేరు ప్రతిష్ఠలు గడించిరి. వారి కథలు చరిత్రలు నాకు వినిపింపుము. మహానుభావా! వారి జన్మలు పుణ్యధన్యములు. వారికి వారే సాటి. వారి చరిత లత్యద్బుత ములు. అట్టి సూర్యవంశజుల చరిత్ర విపులముగ వినకుతూహలము గల్గుచున్నది. మునివరా! ఆ కథలను సమాస వ్యాస పూర్వకముగ (ఒక విషయమును మొదట దానియందలి అంశముల కథనముతో తెలుపుట సమాసము-వానిలో నొక్క యంశ మునే విస్తరించి అదే క్రమమున చెప్పుట వ్యాసము-పరిష్కర్త) తెలుపుము. అని నేను పరమార్థవిదుడగు నారదు నడిగితిని. అది విని నవ్వుచు నారదుడు పరమప్రీతితో నిట్లు పలుకదొడగెను. సత్యవతీ తనయా! వినుము. సూర్యవంశ రాజుల పవిత్ర వంశ ముత్తమమైనది. వారి వంశము పావనము. కర్ణామృతము. పరమధర్మమయము. జ్ఞానసంపన్నము. పూర్వము విష్ణువు నాభి కమలమునుండి బ్రహ్మ యుద్బవించెను. అని పురాణములందు ఘనముగ వర్ణింపబడెను. బ్రహ్మ స్వయంభువు సర్వజ్ఞుడు సర్వశక్తియుక్తుడు విశ్వాత్ముడు. అతడు విశ్వరచన చేయగోరి వేల యేండ్లు ఘోరముగ తపమొనరించెను. అతడు శ్రీమాతృదేవిని ధ్యానించి మహాశక్తిని సంపాదించెను. బ్రహ్మ మానసపుత్రులను సృజించెను. వారు శుభలక్షణలక్షితులు. వారిలో మరీచి సృష్టిరచనలో పేరెన్నిక గాంచెను.

తస్య పుత్రో తి విఖ్యాతః కశ్యపః సర్వ సమ్మతః | త్రయోదశైవ తస్యా೭೭స న్బార్యా దక్షసుతాః కిల. 14

దేవాః సర్వే సముత్పన్నాదైత్యా యక్షాశ్చ పన్నగాః | పశవః పక్షిణ శ్చైవ తస్మాత్స్పష్టి స్తు కాశ్యపీ. 15

దేనానాం ప్రథితః సూర్యో వివస్వాన్నామ తస్యతు | తస్య పుత్రః స విఖ్యాతో వైవస్వతమను ర్నృపః. 16

తస్య పుత్ర స్తథేక్ష్వాకుః సూర్యవంశ వివర్థనః | నవాభవన్సుతా స్తస్య మనో రిక్ష్వాకు పూర్వజాః 17

తేషాం నామాని రాజేంద్ర శృణుషై#్వకమనాః పునః | ఇక్ష్వాకు రథ నాభాగో ధృష్టః శర్యాతి రేవ చ. 18

నరిష్యంత స్తథా ప్రాంశు ర్నృగో దిష్ట శ్చ సప్తమః | కరూష శ్చ వృషధ్రశ్చ నవైతే మానవాః స్మృతాః. 19.

ఇక్ష్వాకుస్తు మనోః పుత్రః ప్రథమః సమజాయత | తస్య పుత్రశతం చాసీ జ్యేష్ఠో వికుక్షి రాత్మవాన్‌. 20

నవానాం వంశ విస్తారం సంక్షేపేణ నిశామయ | శూరాణాం మనుపుత్రాణాం మనోరంతర జన్మనామ్‌. 21

నాభాగస్య తు పుత్రోభూదంబరీషః ప్రతాపవాన్‌ | ధర్మజ్ఞః సత్యసంధ శ్చ ప్రజాపాలన తత్పరః. 22

ధృష్టా త్తు ధార్షకం క్షత్త్రం బ్రహ్మభూత మజాయత | సంగ్రామకాతరం సమ్య గ్ర్బహ్మకర్మరతం తథా. 23

శర్యాతే స్తనయశ్చాభూ దానర్తో నామ విశ్రుతః | సుకన్యా చ తథా పుత్రీ రూపలావణ్య సంయుతా. 24

చ్యవనాయ సుతా దత్తా రాజ్ఞాప్యంధ్యాయ సుందరీ | మునిః సులోచనో జాతస్తస్యాః శీలగుణన హ. 25

మరీచి కుమారుడు కశ్వపుడు. అతడు విశ్వమాన్యుడు-లోక ప్రియుడు-విశ్వవిఖ్యాతుడు. దక్షుని పదుముగ్గురు కూతురు లతని భార్యలు. కశ్యప ప్రజాపతి వలన దేవతలు దైత్యులు యక్షులు పన్నగములు పశుపక్షులు సృజియింపబడెను. ఇది కాశ్యపసృష్టి యన మహిమ గాంచెను. ఎల్ల దేవతలలో సూర్యుడు ప్రముఖుడు. సూర్యునకు వివస్వంతు డను పేరు గలదు. వివస్వంతుని పుత్రుడు వైవస్వతమనువు. అతడు ఘనకీర్తి గడించెను. వైవస్వతునకు సూర్యకుల వర్ధనుడగు ఇక్ష్వాకుడు సంభవించెను. ఇక్ష్వాకుడు గాక వైవస్వతునకు మఱి తొమ్మండుగురు జన్మించిరి. వారి పేర్లు నాభాగుడు దృష్టుడు శర్యాతి నరిష్యంతుడు ప్రాంశుడు నృగుడు దిష్టుడు కరూషుడు వృషధ్రుడు వీరు మనుసంభవులు. వైవస్వత మనువున కిక్ష్వా కుడు జ్యేష్టపుత్రుడు. ఇక్ష్వాకునకు నూర్గురు కుమారులు. వారిలో వికుక్షి పెద్దవాడు ఆత్మవంతుడు. ఆ వైస్వత మనువునకు మరల తొమ్మండుగురు శూరులుద్బవించిరి. వారి వంశ క్రమము సంగ్రహముగ తెల్పుదును. వినుము. నాభాగున కంబరీషుడు జన్మించెను. ఇతడు పరమ భాగవతోత్తముడు ధర్మజ్ఞుడు సత్యసంధుడు ప్రజాపాలనతత్పరుడు. ధృష్టునకు ధార్షకులు గల్గిరి. వీరు రాజులైనప్పటికి బ్రహ్మభూతులు. యుద్దకాముకులు గారు. బ్రహ్మకర్మనిరతులు. శర్యాతికి ఆనర్తుడను కొడుకును చక్కని సుకన్యయను కన్యయుబుట్టి కీర్తి వహించిరి. శర్యాతి తన యందచందాల ముద్దుపట్టిని గ్రుడ్డి వాడగు చ్యవనున కిచ్చెను. ఆమె సౌశీర్యము-సౌజన్యము-పాతివ్రత్యము ప్రభావమున చ్యవనునకు కండ్లు వచ్చెను.

విహితోరవిపుత్రా భ్యామిశ్విభ్యామితినః శ్రుతమ్‌ | జనమేజయః సందేహోయంమహాన్ర్బథాయాంకథి

తస్త్వయా. యద్రాజ్ఞామునయేంధాయ దత్తా పుత్రీ సులోచనా | కురూపా గుణహీనా వా నారీ లక్షణవర్జితా. 27

పుత్రీ యదాభ##వేద్రాజా తదాంధాయ ప్రయశ్చతి | జ్ఞాత్వాంధం సుముఖీం కస్మాద్దత్తవాన్నృవసత్తమః 28

కారణం బ్రూహిమే బ్రహ్మన్నను గ్రాహ్యోస్మి సర్వదా | ఇతి రాజ్ఞోవచ ః శ్రుత్వా పరీక్షిత సుతస్యవై.

ద్వైపాయనః ప్రసన్నాత్మా తమువాచ హసన్నివ | వైవసవతసుతః శ్రీమాన్‌ శర్యాతిర్నామ పార్థివః 30

తస్య స్త్రీణాం సహస్రాణి చత్వార్యాసన్పరి గ్రహాః | రాజపుత్ర్యః సురూపాశ్చ సర్వలక్షణ సంయుతాః. 31

పత్న్యః ప్రేమయుతాః సర్వాః ప్రియా రాజ్ఞః సుసమ్మతాః | ఏకా పూత్రీతు తాసాం వై సుకన్యా నామ సుందరీ.

పితుః ప్రియా చ మాతృణాం సర్వాసాం చారుహాసిని | నగరా న్నాతిదూరేభూత్సరో మానససన్నిభమ్‌.

బద్ద సోపాన మార్గం చ స్వచ్చ పానీయ పూరితమ్‌ | హంసకారండ వాకీర్ణం చక్రవాకోవశోభితమ్‌. 34

దాత్యూహ సారసా కీర్ణం సర్వపక్షిగణా వృతమ్‌ | పంచధాకమ లోపేతం చంచరీక సుసే వితమ్‌ 35

పార్శ్వత శ్చ ద్రుమా కీర్ణం వేష్టితం పాదపైః శుభైః | సాలై స్తమాలైః సరలైః పున్నాగాశోకమండితమ్‌. 36

వటాశ్వత్థ కదంబై శ్చ కదళీ ఖండరాజితమ్‌ | జంబీరై ర్బీజపూరై శ్చ ఖర్జూరైః పనసై స్తథా. 37

క్రముకై ర్నారి కేలై శ్చ కేతకైః కాంచ నద్రు మైః | యూథికాజాలకైః శుభ్రైః సంవృతం మల్లికాగణౖః. 38

జంబ్వా మ్ర తింతిణీభి శ్చ కరం జకుటకా వృతమ్‌ | పలాశ నింబ ఖదిర బిల్వామలక మండితమ్‌. 39

బభూవ కోకిలారా వకేకాస్వన విరాజితమ్‌ | తత్సమీపే శుభే దేశే పాదపానాం గణావృతే. 40

సూర్యున కశ్వి కుమారులు గల్గిరి. వారు మునికి కంటివెలుగు ప్రసాదించిరని నేను వింటిని. అన జనమేజయు డిట్లనెను. ఓ మహత్మా ! నీవు చెప్పిన కథలో నాకు సందేహము గల్గుచున్నది. రాజు తన కన్యను సుకన్యనొక గ్రుడ్డి ముని కిచ్చె నంటివి గదా ! లోకమున నొకని కూతురు రూపగుణములు లేనిది గావచ్చును. అతడు తన కూతురునొక గ్రుడ్డివాని కిచ్చిన ఈయవచ్చును. కాని యే మచ్చలేని చక్కదనాల చుక్కయగు తన గారాబాల కన్నియ సుముఖియగు సుకన్య నొక్క చీకుమునికంటగట్టుటకు రాజు మన సెట్టు లొప్పుకొనెను! మహానుభావా! నా యందు దయయుంచి దీని మూలకారణము తెలుపుము. అను జనమేజయుని మాటలను వ్యాసుడు వినెను. అతడు ప్రసన్నతతో నవ్వుచు నతనితో నెట్లనెను. వైవస్వతుని కుమారుడు శర్యాతిరాజు. శర్యాతికి నాల్గువేలమంది రాచకన్నియలు భార్యలైరి. వారెల్లరును సకల శుభలక్షణలు. వారెల్లరును తమ పతి కనుకూలలై పతిప్రియలై వర్దిల్లిరి. వారికి సుకన్యయను చక్కనికన్య కుమారిగ జన్మించెను. ఆ చిఱుతనవ్వుల సింగారి తన తల్లిదండ్రులకు ముద్దుల మూటగసొంపు మీరెను. రాచనగరికి దరిదాపున మానససరోవరమును మఱపించు సరోవరము గలదు. దానిలోనికి దిగుడు మెట్లు గలవు. ఆ కొలంకులో రాయంచలు కారండవ చక్రవాకములు స్వేచ్చావిహారములు సల్పుచుండెను. ఆ కొలను భరతపక్షులు సారసములు మున్నగు జలపక్షులతో శోభిల్లుచుండెను. అందైదు విధముల నొప్పు మారు కమలములు తేనెసోనలతో ఝంఝుమ్మను గండుతుమ్మెదలు మదనరాగములతో కనులవిందొన రించుచుండెను. దానికి నలుగడల పెద్ద పెద్ద సాలతమాల తరువులు అశోకములు సరల పున్నాగములు - వటవృక్షములు-రావిచెట్లు-కదంబవనములు-అరటిచెట్లు-జంబు-జంబీర-పనస-ఖర్జూరవృక్షములు-పోకమ్రాకులు-కొబ్బరిచెట్లు-మొగలిచెట్లు-కోవిదారతరువులు-మల్లియతీవియలు-చల్లగ నుల్లమున కుల్లాసముగ నలరారుచుండెను. మఱియు అచ్చట గున్నమావి నేరేడు చింత కరంజ కుటక మోదుగ వేప ఉసిరిగ ఖదిర మున్నగు వృక్షములు విలసిల్లుచుండెను. అందు కోయిలల కలకుహూరావములు నెమిళ్ల కేకారవములు చెవులకు తియ్యదనంబు గొల్పుచుండెను. ఆ ప్రదేశ మిట్లు పలువిధములగు తరువులతో పవిత్రమై యొప్పెను.

భార్గవ శ్చ్యవనః శాంత స్తాపనః సంస్థితో మునిః | జ్ఞాత్వాసౌ విజనం స్థానం తపస్తేపే సమాహితః. 41

కృత్వా దృఢాసనం మౌనమాధాయ జితమారుతః | ఇంద్రియాణి చ సంయమ్య త్యక్తహార స్తపోనిధిః. 42

జలపానాదిరహితో ధ్యాయన్నాస్తే పరాంబికామ్‌ | స వల్మీకోభవ ద్రాజన్‌ లతాభిః పరివేష్టితః. 43

కాలేన మహతా రాజ స్సమాకీర్ణః పిపీలికైః | తథా చ సంవృతో ధీమాన్మృత్పిండ ఇవ సర్వతః. 44

కదాచిత్స మహీపాలః కామినీగణ సంవృతః | ఆజగామ సరో రాజ న్విహర్తు మిద ముత్తమమ్‌. 45

శర్యాతిః సుందరీబృంద సంయుతః సలిలేమలే | క్రీడాసక్తో మహీపాలో బభూవ కమలాకరే. 46

సుకన్య వన మాసాద్య విజహార సఖీవృతా | సుమనాంసి విచిన్వంతీ చంచలా చంచలోపమా. 47

సర్వాభరణ సంయుక్తా రణచ్చరణనూవురా | చంక్రమ్యమాణా వల్మీకం చ్యవనస్య సమాదదత్‌. 48

క్రీడాసక్తో పవిష్టా సా వల్మీకస్య సమీపతః | దదర్శ చాస్య రంధ్రంవై ఖద్యోత ఇవ జ్యోతి షీ. 49

కి మేతదితి సంచిత్య సముద్దర్తుం మనోదధే | గృహీత్వా కంటకం తీక్షణం త్వరమాతా కృశోదరీ. 50

సా దృష్టా మునినా బాలా సమీపస్థా కృతోద్యమా | విచరంతీ సుకేశాంతా మన్మథస్యేవ కామినీ. 51

అది నిర్జన ప్రశాంత ప్రదేశ మగుటచేత పరమశాంతుడు దాంతుడు మహాతపస్వి భార్గవుడునైన చ్యవనమహర్షి యచ్చోట నిష్టించి ఘోరనియమములతో తప మాచరించుచుండెను. ఆ తపోధను డింద్రియములు జయించి యాహారముమాని సుఖాసనమందుండి ప్రాణాయామ పరాయణత్వమున నాత్మ విచారముతో లోచూపుతో మౌనమూని యుండెను. అమునీశ్వ రుడు నీరు సైతము ముట్టక హ్రీంకారిణియగు పరాభట్టారికాదేవిని హృదయకమలమున ధ్యానించుచుండెను. ఆ విధిగ నిష్ఠగ నుండగా నతని చుట్టును పైని తీవెలతో చుట్టబడిన గొప్పపుట్ట పుట్టెను. అట్లు దీర్ఘకాలము గడచుటవలన ఆ పుట్టనిండ చలి చీమలు చేరియుండెను. తన మీద చీమలపుట్టలు కోవలుగ పెరిగినను ప్రజ్ఞాధీరుడగు చ్యవనుడు మట్టిముద్దవలె గదలక మెదలకుండెను. ఒకనాడు శర్యాతిరాజు తన కామినీగణము వెంట రాగ వనవిహారమున కాదివ్యసరస్సును కేతెంచెను. అతడు సరస్సులోని నిర్మలజలములందు తన సుందరీ బృందమునుగూడి తమిమీర క్రీడాసక్తుడయ్యెను. సుకన్య మెఱుగుబోడి చప లాక్షి ; ఆమె పూలుగోయుచు కేరింత లాడుచుండెను. ఆ పడుచుపిల్ల తన మేనిసొమ్ములు తళతళలాడగా గజ్జెలందియలు ఘల్లుఘల్లు రనగ గంతులతో చ్యవన మునీశుని పుట్టదాపునకు జేరెను. ఆ చిలిపికన్నె పిల్లలాటల తమకముతో పుట్టచెంత గూరుచుండి పుట్టరంధముల నుండి మిణుంగురులను బోలు రెండు మినుకుమినుకుమను వాడి వెలుగులుగాంచెను. ఆ తలోదరి యిదేమి వింతయో తెలిసికొందమని వాడి ముల్లుగొని వేగిరముగవానిని పీకివేయ పూనుకొనెను. ఇట్లు కమ్మని ముంగురులబాల ప్రయత్నించి పుట్ట కెట్టుదుట నేగెను. రతీదేవివలె అందకత్తె అగు ఆమె చ్యవనునకు కనబడెను.

తాం వీక్ష్య సుదతీం తత్ర క్షామకంఠ స్తపోనిధిః| తా మభాషత కల్యాణీం కిమేత దితి భార్గవః. 52

దూరం గచ్చ విశాలాక్షి తాపసోహం వరాననే | మాభిందస్వాద్య వల్మీకం కంటకేన కృశోదరి. 53

తేనేదం ప్రోచ్యమానాపి సా చాస్య న శృణోతివై | కిముఖల్విద మిత్యుక్త్వా నిర్బిభేదాస్య లోచనే. 54

దైవేన నోదితా భిత్త్వా జగామ నృపకన్యకా | క్రీడంతీ శంకమానా సా కిం కృతం తు మయేతి చ. 55

చుక్రోధ స తథా విద్ధ నేత్రః పరమమన్యమాన్‌ | వేదనాభ్యర్దితః కామం పరితాపం జగామ హ. 56

శకృన్మూత్ర నిరోధోభూత్సైనికానాం తు తతణాత్‌ | విశేషేణ తు భూపస్య సామాత్యస్య సమంతతః 57

గజోష్ట్రతురగాణాంచ సర్వేషాం ప్రాణినాం తదా | తతో రుద్ధే శకృ న్మూత్రే శర్యాతి ర్దఃఖితోభవత్‌. 58

సైనికైః కథితం తసై#్మ శకృన్మూత్ర నిరోధనమ్‌ | చింయామాస భూపాలః కారణం దుఃఖ సంభ##వే. 59

విచింత్యాహ తతో రాజా సైనికా న్స్వజనాం స్తథా | గృహ మాగత్య చింతార్తః కేనేదం దుష్కృతం కృతమ్‌.

సరసః పశ్చిమే భాగే వనమధ్యే మహాతపాః | చ్యవన స్తాపస స్తత్ర తపశ్చరతి దుశ్చరమ్‌. 61

కేనాప్యపకృతం తత్ర తాపసేగ్ని సమప్రభే | తస్మా త్పీడా సముత్పన్నా సర్వేషా మితి నిశ్చయః. 62

తపోవృద్ధస్య వృద్ధస్య వరిష్ఠస్య విశేషతః | కేనావ్యపకృతం మన్యే భార్గవస్య మహాత్మనః. 63

జ్ఞాతం వా యది వాజ్ఞాతం తస్యేదం ఫలముత్తమమ్‌ | కైశ్చ దుష్టైః కృతం తస్య హేలనం తాపసస్యహ.

ఇతిపృష్టస్తమూచూస్తే సైనికా వేదనార్దితాః | మనోవాక్కాయ జనితం న విద్మోపకృతం వయమ్‌. 65

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే ద్వితీయోధ్యాయః.

భార్గవుడా సుదతినిగాంచి డగ్గుత్తికతో నిట్లనెను : ''కళ్యాణీ! శోభనాంగీ! ఇదేమి చేయుచుంటివి. తలోదరీ! విశాలాక్షీ! వరారోహా! నేనొక తబిసిని. ముంటితో పుట్టను పొడువకు. దూరముగ నేగుము.'' అని చ్యవనుడు పలుకు చున్నప్పటికిని సుకన్య వానిని పెడచెవినిబెట్టి యిదేమి చూతమని ముని వెల్గుచూపులను గ్రుచ్చెను. అట్టులా రాచకన్నె కాలయోగమున ప్రేరితురాలై యాటలాడుచు పుట్టను గ్రుచ్చెనే కాని యామె తరువాత నేనెంతపని చేసితినని లోనలోన విచారించుచు నాచోటు వదలెను. తన కన్నులలో ముల్లు గ్రుచ్చుకొనుటవలన చ్యవనుడు వేదనతో పరితాపముతో కోపావిష్టుడయ్యెను. ఆ మునివరుడు వెనువెంటనే సైనికులయెక్కయు మంత్రులయెక్కయు రాజుయెక్కయు మలమూత్రములు నిరోధించెను. చ్యవనుని మహిమమున గజతురగములయెక్కయు నొంటెలయెక్కయు తక్కిన ప్రాణులయెక్కయు మలమూత్రము లొక్కపెట్టున నాగిపోవుటవలన రాజు కడు దుఃఖితుడయ్యెను. సైనికు లెల్లరి మలమూత్ర నిరోధముగూర్చి రాజు తెలిసికొనెను. ఇట్టి దుఃఖమొకేసారి గల్గుటకు కారణమేమోయని రాజు చింతించెను. చింతార్తుడై అతడు విచారముతో తన యింటికేగి తన సైనికులలో జనులలో నెవడేని చేయరాని పని చేసెనేమోయని తెలిసికొనెను. ఆ సరస్సునకు పడమటి దెసను నట్టడివిలో చ్యవనమహర్షి తీవ్రముగ తప మొనరించుచుండెను. ఆ నిప్పువంటి తపస్వి కెవరో యేదో యపరాధము చేసి యుండవచ్చును. దాని మూలమున నెల్లరికిట్టి కడగండ్లు వాటిల్లినవి. ఆ బార్గవుడు తపో వృద్ధుడు - వృద్ధుడు - మహామనీషి - పరిష్ఠుడు. అట్టి మునివర్యున కెవరో యపచారము చేసిరని తలంతును. ఎవరో దుష్టులు తెలిసియో తెలియకయో యా తాపసు నవమానించి యుండవచ్చును. ఈ యడ్డంకి తప్పక దాని మూలముననే జరిగి యుండవచ్చునని రాజు తలచెను. రాజు ప్రశ్నింపగసైనికులు లోన బాధజెందుచు మా మనోవాక్కాయములతో నీ మునివర్యునకెట్టి యపకారము చేయలేదని యనిరి.

ఇది శ్రీదేవి భాగవత సప్తమ స్కంధమందు ద్వితీయాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters