Sri Devi Bagavatham-2
Chapters
అథ తృతీయో೭ ధ్యాయః వ్యాసః ఇతిప్రచ్ఛ తాన్సర్వాన్రాజా చింతాకుల స్తథా | పర్యపృచ్ఛ త్సుహృద్వర్గం సామ్నాచో గ్రతయాపి చ. 1 పీడ్యమానం జనం వీక్ష్య పితరం దుఃఖితం తథా | విచింత్య శూలఖేదం సా సుకన్యా చేద మబ్రవీత్. 2 వనే మయా పిత స్తత్ర వల్మీకో వీరుధావృతః | క్రీడంత్యా సుదృఢో దృష్ట శ్ఛద్రద్వయసమన్వితః.
3 తత్ర ఖద్యోతవద్దీప్తజ్యోతిషీ వీక్షితే మయా | సూచ్యా విద్ధే మహారాజ పునః ఖద్యోతశంకయా. 4 జలక్లిన్నా తదా సూచీ మయా దృష్టా పితః కిల | హే హేతి చ శ్రుతః శబ్దో మందో వల్మీకమధ్యతః. 5 తదా೭హాం విస్మితారాజ న్కిమేతదితి శంకయా | న జానే కం మయా విద్ధం తస్మిన్వల్మీకమండలే. 6 రాజా శ్రుత్వా తు శర్యాతిః సుకన్యావచనం మృదు | మునే స్త ద్దేలనం జ్ఞాత్వా వల్మీకం క్షిప్ర మభ్యగాత్. 7 తత్రా పశ్యత్తపోవృద్ధం చ్యవనం దుఃఖితం భృశమ్ | స్పోటయామాస వల్మీకం మునిదేహావృతం భృశమ్. 8 ప్రణమ్య దండవ ద్బూమౌరాజాతం భార్గవం ప్రతి | తుష్టావ వినయోపేత స్తమువాచ కృతాంజలిః. 9 పుత్ర్యా మమ మహాభాగ క్రీడంత్యా దుష్కృతం కృతమ్ | అజ్ఞానాద్బాలయా బ్రహ్మన్కృతం తతంతుమర్హసి. 10 అక్రోధనా హి మునయో భవంతీతి మయా శ్రుతమ్ | తస్మాత్త్వమపి బాలాయాః క్షంతుమర్హసి సాంప్రతమ్. 11 వ్యాసః : ఇతి శ్రుత్వావచస్తస్య చ్యవనో వాక్యమబ్రవీత్ | వినయోపనతం దృష్ట్యా రాజానం దుఃఖితం భృశమ్. మూడవ అధ్యాయము - సుకన్యా వృత్తాంతము ఈ విధముగ శర్యాతి చింతాక్రాంతుడయ్యెను. అతడు తన సైనికులను మిత్రవర్గమును కోపముతో మంచిమాటలతో దాని కారణ మడిగెను. అంతలో సుకన్య దుఃఖితుడగు తన తండ్రిని చింతాతురులగు జనులను గాంచెను. ఆమె ముంటితో పుట్టను బొడిచిన విషయమును తలంచి తండ్రితో నిట్లనియెను: తండ్రీ! నేను వనములో నాడుకొనుచుండగ నాకు తీగలచే గప్పబడిన యొక పెద్దపుట్ట గనంబడెను. దానికి రెండు పెద్ద రంధ్రములు గలవు. మహారాజా! నే నా రంధ్రముల నుండి మిణుగురులను బోలు రెండు కాంతులు గాంచితిని. అవి మిణుగురులు గాబోలునని నేను వానిని ముంటితో బొడిచితిని. అంతలో నా పుట్టలోనుండి 'అయ్యో చచ్చితిని' అను మెల్లని స్వరము నా చెవుల బడెను. తండ్రీ! నే నా ముంటిని లాగి చూతును గదా- యది తడిసియుండెను. దానిని చూడగానే నా కనుమానము గల్గెను. ఇదేమో వింతగ నున్నదని యబ్బుర మొందితిని. ఆ పుట్టలో నేనేల గ్రుచ్చితినో నాకే తెలియకుండెను. అను సుకన్య మెత్తని పలుకులు వినియిదంతయు నా మునికి జరిగిన యపరాధఫలితమని యెఱింగి శర్యాతి వెంటనే యా పుట్టను జేర జనియెను. రాజు వెంటనే మునిచుట్టు పెరిగిన పుట్టను పగులగొట్టించి దుఃఖితుడై ముసలి తబిసియైన చ్యవనుని గాంచెను. అంత శర్యాతి భార్గవునకు దండప్రణామము లాచరించి నుతించి సవినయముగ నతని కిట్టు లనియెను. మహాభాగా! ఈ నా కూతురు బాల్య చాపల్యముతో చిలిపిగనాట లాడుకొనుచు నీ పొరపాటు పని చేసెను. ఈ సుకన్యను నీ చల్లని నిండుచూపులతో కనికరించి కావుము. మునివరులు నిత్తెము శాంతచిత్తులై యుందురని విందును. కనుక నా బాలను క్షమించుము. అని రాజు దిగులుతో వినయముతో ప్రార్థిం చుటగని చ్యవను డతని కిట్లు పలికెను : చ్వవనః రాజన్నాహం కదాచిద్వై కరోమిక్రోధమణ్వపి | న మయో೭ద్వైవ శప్తస్త్వం దుహిత్రా పీడనే కృతే. నేత్రే పీడా సముత్పన్నా మమ చాద్య నిరాగసః | తేన పాపేన జానామి దుఃఖిత స్త్వం మహీపతే. 14 అపరాధం పరం కృత్వా దేవీభక్తన్య కోజనః | సుఖం లభేత యదపి భ##వే త్త్రాతా శివః స్వయమ్. 15 కిం కరోమి మహీపాల నేత్రహీనో జరావృతః | అంధస్య పరిచర్యాంచ కః కరిష్యతి పార్థివ. 16 రాజోవాచ : సేవకా బహవః సేవాం కరిష్యంతి తవానిశమ్ | క్షమస్వ మునిశార్దూల స్వల్పక్రోధాహి తాపసాః. చ్యవనః అంధో೭హం నిర్జనోరాజం స్తపస్తప్తుం కథంక్షమః | త్వదీయాః సేవకాః కింతేకరిష్యంతిమమప్రియమ్. క్షమాపయసి చేన్మాం త్వం కురు మేవచనం నృప | దేహి మే పరిచర్యార్థం కన్యాం కమలలోచనామ్. 19 తుష్యే నయా೭మహారాజ పుత్ర్యా తవ మహామతే | కరిష్యామి తప శ్చాహం సా మే సేవాం కరిష్యతి. 20 ఏవం కృతే సుఖం మే స్యాత్తవచైవ భవిష్యతి | సంతుష్టే మయి రాజేంద్ర సైనికానాం న సంశయః. 21 విచింత్య మనసా భూప కన్యాదానం సమాచర | న చాత్ర దూషణం కించి త్తాపసోహం యతవ్రతః. 22 వ్యాసః శర్యాతి ర్వచనం శ్రుత్వా మునేశ్చింతాతురో೭భవత్ | నదాస్యే೭ప్యథవా దాస్యేకించిన్నోవాచ భారత. కథ మంధాయ వృద్దాయ కురూపాయ సుతామిమామ్ | దేవకన్యోపమాం దత్త్వా సుఖీస్యా మాత్మసంభవామ్. 24 కోవా೭೭త్మనః సుఖార్థాయ పుత్ర్యాఃసంసారజం సుఖమ్ | హరతే೭ల్పమతిః పాపో జానన్నపి శుభాశుభమ్. 25 ఓయి రాజా! నాలో నెన్నడు నిసుమంతయును కోపము లేదు. నీ కన్య సుకన్య నన్నింతగ బాధించినది. ఐనను నేను నిన్నిప్పటికిని శపించలేదు. రాజా! నేను తప్పుచేసి యెరుగను. మీ కన్యమూలమున నా కన్నుల కింతగ బాధ గల్గుచున్నది. ఈ పాపఫలితముగ నీ వింతగ దుఃఖము లనుభవించుచున్నావని నాకు తోచుచున్నది. అపరాజిత దేవి శివకుటుంబిని యగు శ్రీదేవి భక్తున కపరాధము చేసినవాడు శివునిచేత రక్షితుడైనను సుఖము గాంచడు. రాజా! నేను ముసలివాడను. ఇపుడు గ్రుడ్డివాడనైతిని. ఇక నా బ్రతుకు కటికిచీకటి మయము. ఇంక నాకు కావలసిన పరిచర్యలుచేసి నన్ను సేవించువారెవరు? అనగా రాజిట్లనియెను: ''ఓ మునిప్రవరా ! తాపసోత్తముల కోపము క్షణమాత్ర ముండును. కనుక క్షమించుము. నాకు పల్వురు సేవకులు గలరు. వారు నిన్ను బాయకసేవింతురు.'' చ్యవను డిట్లనెను: ''ఓయి రాజా! ఇది యేకాంతప్రదేశము. నేను గ్రుడ్డివాడను. ఇక నాతపమెట్లు సాగగలదు? నీ సేవకులు నాకు ప్రియము గూర్తురనుట యెట్లు నమ్మదగును! రాజా! నమ్న ప్రసన్నునిగ జేసికొనదలచినచో నా ప్రియవచనము వినుము. నా మాట నిలవబెట్టుము. కమలలోచనయగు నీ సుకన్యను నా కప్పగించుము. ఆమె నన్ను బాయక నా పరిచర్యలు చేయవలయు. మహారాజా! నీవు నీ కన్యను నాకిచ్చిన తృప్తినందుదును. ఆ పడతి నాకు సేవలు సేయగలదు. నా తపము నిర్వఘ్నముగ సాగును. రాజేంద్రా! నేను చెప్పినట్లు చేయుము. నేను సంతుష్టుడ నగుదును. దానిచే నీకు మేలగును. నీ సైనికుల యడ్డంకులు తొలగును. రాజా! నీవు నెమ్మదిలో చక్కగ నాలోచించుకొని నీ కన్యను నాకు దానము సేయుము. నేను తాపసుడను నియతవ్రతుడను. ఆమెను నాకిచ్చుట వలన నీకెట్టి దోషమును తగులదు.'' అను తీయని ముని వచనములువిని శర్యాతి చింతాతురుడై తన సుకన్య నిత్తునని మునికి మాట యీయలేదు. ఈయనని పలుకలేదు. ఇతడు గ్రుడ్డివాడు. కురూపి ముసలివాడు. ఇట్టివానికి నాకు బుట్టిన దేవ కన్యను బోలు సుకన్య నర్పించి నేనేమి సుఖము బడయగలను? ఎంత పాపియైనను మతిహీనుడైనను రాబోవు మంచిచెడుగు లెఱింగియును తన స్వార్థమునకు తన కూతురు సంసార సుఖమును బలి యీయదలంచునా? ప్రాప్య సా చ్యవనం సుభ్రూః పంచబాణశరార్దితా | అంధం వృద్ధం పతిం ప్రాప్య కథం కాలం నయిష్యతి. 26 ¸°వనే దుర్జయః కామో విశేషేణ సురూపయా | ఆత్మతుల్యం పతిం ప్రాప్య కిమువృద్దం విలోచనమ్. 27 గౌతమం తాపసం ప్రాప్య రూప¸°వన సంయుతా | అహల్యా వాసనేనాశు వంచితా వరవర్ణినీ. 28 శప్తా చ పతినా పశ్చాత్ జ్ఞాత్వా ధర్మ విపర్యయమ్ | తస్మా ద్బవతు మే దఃఖం న దదామి సుకన్యకామ్. 29 ఇతి సంచింత్య శర్యాతి ర్విమానాః స్వగృహం య¸° | సచివాం శ్చ సమాదాయ మంత్రం చక్రే೭తి దుఃఖితః. భో మంత్రిణో బ్రువంత్వద్య కిం కర్తవ్యం మయా೭ధునా | పుత్రీ దేయా೭థ వ్రిపాయ భోక్తవ్యం దుఃఖమేవవా. విచారయధ్వం మిళితా హితం స్యాన్మమవై కథమ్ | మంత్రిణ ఊచుః : కిం బ్రూమో೭స్మి న్మహారాజ సంకటే೭తి దురాసదే. 32 దుర్బగాయ సుకన్యైషా కథం దేయా೭తి సుందరీ | వ్యాసః : తదా చింతాకులం వీక్ష్య పితరం మంత్రిణ స్తదా. సుకన్యా త్విం గితం జ్ఞాత్వా ప్రహస్యేద మువాచహ | పితః కస్మా ద్బవానద్య చింతావ్యాకులితేంద్రియః. 34 మత్కృతే దుఃఖసంవిగ్నో విషణ్ణవదనో೭సి వై | అహం గత్వా మునిం తత్ర సమాశ్వాస్య భయార్దితమ్. 35 కరిష్యామి ప్రసన్నం తమాత్మదానేన వై పితః | ఇతి రాజా వచః శ్రుత్వా భాషితం యత్సుకన్యయా. 36 తామువాచ ప్రసన్నాత్మా సచివానాం చ శృణ్వతామ్ | కథం పుత్రి త్వ మంధస్య పరిచర్యాం వనే೭బలా. 37 కరిష్యసి జరార్తస్య క్రోధనస్య విశేషతః | కథ మంధాయ చానేన రూపేణ రతిసన్నిభామ్. 38 ఈ నాగారాల పట్టి యీ ముసలి చీకును పతిగబొంది ఏమి సుఖమునందును? కాలము నెట్లు దొర్లించునో! ¸°వన ముననున్నయువతి తన కన్నిట నీడు జోడగు భర్తను పొందియును తనియదు. ఇంక నా సుకన్య యీ ముసలి గ్రుడ్డివానితో నేమి సుఖములు పొందును? సురూపము నిండు జవ్వనముగల అహల్యకు గౌతమ తాపనుడు పతి ఐన నామె యింద్రునివలన వచింపబడెను గదా? ఆ పిదప ధర్మహాని జరుగు టెఱిగి గౌతముడు వారిని శపించెను. కనుక నాకెన్ని కష్టములు గల్గినను సుకన్యను మాత మితని కీయను. అని తలపోసి రాజు దుఃఖితమతియై తన యింటికేగి మంత్రులను రావించి ఆలోచనలు జరిపి వారితో నిట్లనెను: ఓ మంత్రులారా! ఇప్పుడు నా కర్తవ్యమేమి? నా పుత్రికను ముసలి బ్రాహ్మణున కీయవలయునా? లేక యీ దుఃఖము లనుభవింపవలయునా? మీరెల్లరును గలిసి నాకు మేలు తెఱగు నాలోచింపుడు. మంత్రులిట్ల నిరి: మహారాజా! ఇట్టి దురంతమైన ధర్మ సందేహములకు మేము మాత్రమేమి సమాధానము లీయగలము? ఆ దౌర్బాగ్యున కీ యందాల సుకన్యను చూచి చూచునెట్లు చేజేతుల నప్పగింత పెట్టగలము? ఇట్లు మంత్రులును తన తండ్రియును చింతాక్రాంతు లగుట సుకన్య గ్రహించెను. ఆమె వారి భావ మెఱింగి నవ్వుచు తన తండ్రితో నిట్లు పలికెను తండ్రీ! నీ వేల వ్యాకుల చిత్తుడవైతివి? నా మనుగడగూర్చి నీ వింతగ దుఃఖముతో విచారింపనేల? ఆ మునిపుంగవుని మదికి నేను బాధ గల్గించితిని. కనుక నా మునివర్యుని సన్నిధికేగి యతని మదికి నచ్చునట్లు మాటాడగలను. ఆ ముని ప్రవరునకు నేను నన్నర్పించు కొందును. అతనిని సుప్రసన్నుని జేయగలను.' అని పలికిన తనకూతురు ప్రియవాక్కులు రాజు వినెను. అంత రాజు సంతుష్టిజెంది మంత్రులెల్లరు వినునట్లు సుకన్యతో నిట్లనెను: ఓ పుత్త్రీనీవబలవు. ఆ వనమందలి మునివర్యుడు గ్రుడ్డి వృద్దు. ముక్కోపి ముసలియగు మునిమాన్యునకు నీవు తాల్మితో నెట్లు సపర్యలు చేయగలవు. నీవు సుందరాంగివి. నిన్నొక గ్రుడ్డివాని కెట్టు లప్పగింపగలను? దదామి జరయా గ్రస్తదేహాయ సుఖవాంఛయా | పిత్రా పుత్రీ ప్రదాతవ్యా వయోజ్ఞాతిబలాయచ. 39 ధనధాన్య సమృద్ధాయ నాధనాయ కదాచన | క్వ తే రూపం విశాలాక్షి క్వాసౌ వృద్ధో వనేచరః. 40 కథం దేయా మయా పుత్రీ తసై#్మ చాతివరాయచ | ఉటజే నియతం వాసో యస్యం నిత్యం మనోహరే. 41 కథ మంబుజపత్రాక్షి కల్పనీయో మయా తవ | మరణం మే వరం ప్రాప్తం సైనికానాం తథైవచ. 42 నతే ప్రదాన మంధాయ రోచతే పికభాషిణి | భవితవ్యం భవత్యేవ ధైర్యంనైవ త్యజామ్యహమ్. 43 సుస్థిరా భవ సుశ్రోణి న దాస్యే೭ధాయ కర్హిచిత్ | రాజ్యం తిష్ఠతు వాయాతు దేహో೭యం చ తథైవమే. 44 నత్వాం దాస్యా మ్యహం తసై#్మ నేత్రహీనాయ బాలికే | సుకన్యా తం తదా ప్రాహ శ్రుత్వా తద్వచనం పితుః. ప్రసన్నవదనా೭తీవ స్నేహయుక్త మిదంవచః | సుకన్యోవాచ : నమేచింతాపితః కార్యాదేహిమాంమునయే೭ధునా. సుఖం భవతు సర్వేషాం లోకానాం మత్కృతేన హి | సేవయిష్యామి సంతుష్టా పతిం పరమపావనమ్. 47 భక్త్యాపరమయా చాపి వృద్దం చ విజనే వనే | సతీ ధర్మపరా చాహం చరిష్యామి సుసమ్మతమ్. 48 న భోగే೭చ్ఛా೭స్తి మేతాతస్వస్థంచి త్తంమమానఘ | వ్యాసం : తచ్చ్రుత్వాభాషితంతస్యామంత్రిణో విస్మయంగతాః. రాజాచ పరమప్రీతో జగామ మునిసన్నిధౌ | గత్వా ప్రణమ్య శిరసా తమువాచ తపోధనమ్. 50 స్వామి న్గృహాణ పుత్రీం మే సేవార్థం విధివద్విభో | ఇత్యుక్త్వా೭ సై#్మ దదౌ పుత్రీం వివాహవిధినానృప. 51 ఆ ముసలిముని తన సుఖము తాను గోరుకొనును. అతనికి నిన్నెట్టు లర్పింపగలను? ఏ తండ్రియేని తన కూతున కన్నివిధముల నీడు జోడు కులము బలము గలవానితో పెండ్లిచేయును. ప్రతివాడు తన కుమార్తెను ధనధాన్యములు సంప దలుగలవానికే యుచ్చును. కాని యొక నిఱుపేద కీయదలంపడు గదా! ఓ విశాలాక్షీ! నీ యీ నిండు గడుసుజవ్వనమేడ! ఆ వనములందు గ్రుమ్మరుచున్న ముసలి చీకేడ! ఓ పుత్రీ! వయసుమీఱి సత్తువ గోల్పోయిన మునికి నిన్నెటు లీయగలను? నీవు నిత్తె మంతిపురమున నుండుదానవు. పర్ణశాలలో నెట్లు మనుగడ సాగింతువు? కమలాక్షీ! ఇపుడు నేనేమి చేయగలను? నా సైనికులు నేను చచ్చిన చత్తుము గాక! కాని పికభాషిణీ! బాలామణీ ! నిన్నొక గ్రుడ్డివాని కర్పించుట నా కెంతమాత్ర మిష్టములేదు. కాగలదేమో కాకమానదు. నేను ధైర్యము వదలకుందును. బాలా ! నీవు గుండె నిబ్బరముతో నుండుము. నా రాజ్యము నా దేహమున్నను పోయినను నాకు దిగులులేదు. నిన్ను మాత్ర మొక గ్రుడ్డివాని చేతిలో పెట్టను. కన్నులు లేని వానికే విధముగనైన నిన్నీయను.'' అను తన తండ్రి మాటలను సుకన్య వినెను. ఆమె విప్పారిన మొగముతో తన యంతరాత్మ ప్రభోధించిన వచనము లిట్లు పలికెను. తండ్రీ ! నన్ను గూర్చి యింతగ చింతింపగా నేల? నన్నా మునివర్యున కిప్పుడే ప్రదానము చేయుము. నావలన లోకములు మేలుపొంది సుఖించుగాక! ఆ పరమపావనుడు మహా శక్తుడగు మునిపతిని పరమ సంతోషమున సేవించు కొనగలను. ఆ యేకాంత ప్రదేశమునందు పరాభక్తితో పతివ్రత ధర్మముతో చక్కగ ముసలి మునితో మసలు కొందును. తండ్రీ! నాలో విషయ భోగేచ్ఛలేదు. నా మనస్సునకు విషయ సంకల్పసంబంధము లేదు. నా చిత్తము ప్రకృతి శాంతమైనది. అను సుకన్య సూక్తులాలకించి మంత్రులు పరమ విస్మయమందిరి. అపుడు రాజు పరమ ప్రీతితో మునివరుని సన్నిధి కరిగెను. ఆ తపోధనునకు తలవంచి ప్రణమిల్లి రాజిట్లనెను. ఓ స్వామీ! ఓ విభూ! నా పుత్రికను నీ సేవలకు తప్పక స్వీకరింపుము. అని రాజు వివాహ మంగళ విధానములో తన సుకన్యను చ్యవనునకు ధారపోసెను. ప్రతిగృహ్య మునిః కన్యాం ప్రసన్నో భార్గవో೭భవత్ | పారిబర్హం నజగ్రాహ దీయమానం నృపేణహ. 52 కన్యా మేవా గ్రహీత్కామం పరిచర్యార్థ మాత్మనః | ప్రసన్నే೭స్మి న్మునౌ జాతం సైనికానాం సుఖం తదా. 53 రాజ్ఞ శ్చ పరమాహ్లాదః సంజాత స్తతణాదపి | దత్త్యా పుత్రీం యదా రాజా గమనాయ గృహంప్రతి. 54 మతిం చకార తన్వంగీ తదోవాచ నృపం సుతా | సుకన్యోవాచః గృహాణ మమవాసాంసి భూషణానిచమే పితః. వల్కలం పరిధానాయ ప్రయచ్చాజిన ముత్తమమ్ | వేషం తు మునిపత్నీనాం కృత్వా తపసి సేవనమ్. 56 కరిష్యామి తథా తాత యథా తే కీర్తిరచ్యుతా | భవిష్యతి భువః పృష్టే తథా స్వర్గే రసాతలే. 57 పరలోక సుఖాయాహం చరిష్యామి దివానిశమ్ | దత్త్యా೭ంధాయ య చ వృద్ధాయ సుందరీం యువతీంతుమామ్. 58 చింతా త్వయా న కర్తవ్యా శీలనాశసముద్బవా | అరుంధతీ వసిష్ఠస్య ధర్మపత్నీ యథాభువి. 59 తథైవాహం భవిష్యామి నాత్రకార్యావిచారణా | అనసూయా యథాసాధ్వీ భార్యా೭త్రేః ప్రథితాభువి. 60 తధైవాహం భవిష్యామి పుత్రీ కీర్తికరీ తవ | సుకన్యా వచనం శ్రుత్వా రాజా పరమధర్మవిత్. 61 దత్త్వా೭జినం రురోదాశు వీక్ష్య తాం చారుహాసినీమ్ | త్యక్త్వా భూషణవాసాంసి మునివేషధరాం సుతామ్. 62 వివర్ణవదనో భూత్వా స్థిత స్తత్రైవ పార్థివః | రాజ్ఞ్యః సర్వాః సుతాం దృష్ట్వా వల్కలాజినధారిణీమ్. 63 రురుదుర్బృశ శోకార్తా వేపమానా ఇవాభవన్ | తా మాపృచ్చ్య మహీపాలో మంత్రిభిః పరివారితః | య¸° స్వనగరం రాజా ముక్త్వా పుత్రీం శుచా೭ర్పితామ్. 64 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే తృతీయో೭ధ్యాయః. చ్యవనముని సుకన్యనుచేపట్టి ప్రసన్నుడయ్యెను. అతడు రాజొసంగు కట్నములు కానుకలు ముట్టలేదు. మునీశుడు సుకన్యను మాత్రమే తన పరిచర్యలకు గ్రహించెను. అట్లు చ్యవనుడు ప్రసన్నుడుగాగ సైనికులు మున్నగువారు నిరోధము పాసి సుఖమొందిరి. రాజు తన కన్నెనిట్లు మునికర్పించి సంతోషమొంది తన యింటికి వెళ్ళుచుండెను. అంతలతాంగియగు సుకన్య తన తండ్రితోనిట్లనెను. తండ్రీ! ఈ విలువైన సొమ్ములు వస్త్రములు తీసికొనుము. నాకు జింక చర్మము నారచీరలు నిమ్ము. ఒకముని భార్యకు తగిన వేషముతో నేనీతపస్వికి సేవలు సేతును. తండ్రీ! నీ కీర్తి యీ భూమిపైనే కాక స్వర్గపాతాళములందును శాశ్వతమై వెలయు గాక. నేను పరలోక సుఖములకొఱకీ పరమ తాపసుని రేబవళ్ళు పరిచరింతును. ఈ ముసలి గ్రుడ్డివాని కందాల జవరాలినగు నన్నొప్పగించినందుకు చింతింపకుము. నాసౌశీల్యము చెడు నేమో యను తలంపు నీకెంత మాత్రము వలదు. ఈ భూమిపై నరుంధతి వసిష్ఠుని ధర్మపత్నియైనది. నేను నటులే యితని కగుదును. దీనికి విచారింపబని లేదు. ఈ భూమిపై అత్రిపత్నియగు అనసూయ పరమ సాధ్వియై ప్రసిద్ధి గాంచెను. నేను నటులే పరమ సాధ్వికాగలను. లోకముల వాసిగాంతును. అను సుకన్య వాక్కులను ధర్మ విదుడగు రాజు వినెను. సుకన్య రాజ భూషణవస్త్రములు తీసి నార చీరలు కట్టుకొనెను. రాజామెకు జింక చర్మమొసంగెను. ఇట్లు ముని భార్య వేషముతో శాంతి కాంతివలె చిరున గవున చెన్నంధు తన కూతునుగాంచి రాజొకేసారి గొల్లుమని యేడ్చెను. రాజు వెల వెల బారిన మొగముతో స్తబ్దుడై యుండెను. రాణులెల్లరేతెంచి నార చీరలు దాల్చిన సుకన్యను గాంచి యెలుగెత్తి దురపిల్లిరి. వారు శోకార్తలై పెదవులు తడ బడ పెద్ద పెట్టునవాపోయిరి. ఈ విధానమున శర్యాతి మహారాజు తన సుకన్యను చ్యవనముని ప్రవరునకు అప్పగింత పెట్టి మునియను మతితో మంత్రులతో తన యింటికేగుదెంచెను. ఇది శ్రీదేవీ భాగవత మందలి సప్తమ స్కంధమందు తృతీయాధ్యాయము.