Sri Devi Bagavatham-2    Chapters   

అథత్రింశోధ్యాయః.

వ్యాసః: తతస్తే తు వనోద్దేశే హిమాచలతటా శ్రయాః | మాయాబీజజపాసక్తా స్తపశ్చేరుః సమాహితాః. 1

ధ్యాయతాం పరమాం శక్తిం లక్షవర్షాణ్య భూన్నృప | తతః ప్రసన్నా దేవి సాప్రత్య

క్షం దర్శనం దదౌ. 2

పాశాంకుశ వరాభీతి చతుర్బాహు స్త్రీలోచనా | కరుణారస సంపూర్ణా సచ్చిదానంద

రూపిణీ. 3

దృష్ట్వా తాం సర్వజనీనం తుష్టువుర్మునయోమలాః | నమస్తే విశ్వరూపాయై వై

శ్వానరసుమూర్తయే. 4

నమస్తే జలరూపాయై సూత్రత్మవపుషే నమః | యస్మి న్సర్వేలింగదేహా ఓతప్రోతా

వ్యవస్థితాః. 5

నమః ప్రాజ్ఞ స్వరూపాయై నమో వ్యాకృతమూర్తయే | నమః ప్రత్యక్స్వరూపాయై నమస్తే బ్రహ్మమూర్తయే. 6

నమస్తే స్వరూపాయై సర్వలక్ష్మాత్మ మూర్తయే | ఇతి స్తుత్వా జగద్దాత్రీం భక్తి గద్గదయా గిరా. 7

ప్రణము శ్చరణాంభోజం దక్ష్వాద్యా మునయో మలాః | తతః ప్రసన్నా సాదేవి

ప్రోవాచ పికభాషీణీ. 8

వరం బ్రూత మహాభాగ వరదా7హం సదా మతా | తస్యాస్తు వచనం శ్రుత్వా హరివిష్ణ్వోస్తనోః శమమ్‌. 9

తయో స్త చ్చక్తిలాభం చ వవ్రిరే నృపసత్తమ | దక్షో7థ పునరప్యాహ జన్మ దేహి

కులే మమ. 10

భ##వేత్తవాంబ యేనా హం కృతకృత్యో భ##వే ఇతి | జపం ధ్యానం తథా పూజం స్థా

నాని వివిధాని చ. 11

వదమే పరమేశాని స్వముఖేనైవ కేవలమ్‌ | దేవ్యువాచ :మచ్చక్త్యో రవమానా చ్చ జాతా వ స్థాతయోర్ద్వయోః. 12

న తాదృశ ప్రకర్తవ్యో మేపరాధః కదాచన | అధునా నత్కృపాలేశా చ్చరీరే స్వస్థతా తయోః. 13

ముప్పదవ అధ్యాయము

అటుపిమ్మట వారలెల్లరును హిమాలయముల వనములకేగి శ్రీమాయాబీజజప పరాయణులై నిశ్చలముగ తపమారంభించిరి. రాజా! వారొక లక్షయేండ్లు పరాశక్తిని ధ్యానించిన పిమ్మట శ్రీదేవి ప్రసన్నయై వారికి దర్శనభాగ్యమొసంగెను. ఆ సచ్చిదానంద స్వరూపిణి యగు త్రిలోచన దయారసముపూర్తిగ వెల్లివిరియగ తన నాలుగు చేతులందు పాశము-అంకుశము-వరాభయముద్రలు దాల్చెను. ఆ యెల్లలోకాలు పరిపాలించు జననినిగని నిర్మలమనస్సులు గలమును లిటుల దేనిని సన్నుతించిరి! ఓ వైశ్వానర స్వరూపిణి! ఓ విశ్వరూపిణి! నీకు మా ప్రణామములు. ఏ చిద్రూపిణియం దెల్ల లింగదేహములు నిండియుండునో యా సూత్రాత్మ స్వరూపిణికి జలరూపిణికి మా ప్రణమములు. ఎల్ల దేహములందునిండియున్న యవ్యా కృతరూపిణి- ప్రాజ్ఞస్వరూపిణి- ప్రత్యక్స్వరూపిణి-యగు బ్రహ్మమూర్తికి మా ప్రణమములు. సర్వస్వరూపిణి-సర్వలక్ష్య స్వరూపిణ-యగు జగదంబికకు మాప్రణమములు. ఆ తల్లిని మధుర భక్తితో సన్ను తింతుము. అని దక్షాదులు ములు నిర్మలచిత్తులు దేవి చరణకమలములకు ప్రణమిల్లిరి. పిదక పికభాషణియగు శ్రీదేవి సుప్రసన్నయై వారి కిట్లనెను: ఓ మహాత్ములారా! నేను వరదాయినిని. ఏదేని వరము గోరుకొనుడు. అను దేవి మాటలు విని వారు హరిహరులకు మేలు గల్గవలయునని కోరిరి. హరిహరులు మరల తమ తమ శక్తులను గలియవలయునని వారు గోరిరి. అపుడు దక్షుడు ప్రత్యేకముగ నిట్లనెను. నా వంశమున నీవు జన్మింపుము తల్లీ. అంబ! నీవు నా యింట జన్మించుము. నేను కృతకృత్యుడను గాగలను. నిన్ను గూర్చి జపము-ధ్యానము పూజలు నీ వివిధ నివాసస్థానములు తెల్పుము. ఓ పమమేశానీ! వీని నన్నిటిని నీ ముఖము నుండి వెల్లడించుము. దేవి యిట్లనెను: నా శక్తుల నవమానించుటవలననే హరిహరుల కా దురవస్థ వాటిల్లెను. అట్టి యపరాథ మిక ముందెన్నడు నెవ్వరును చేయరాదు. ఇపుడు నా దయాలేశమున వారి శరీరము కారోగ్యము చేకూరగలదు.

భవిష్యతి చ తే శక్తీ త్వద్‌ గృహే క్షీరసాగరే | జనిష్యత స్తత్ర తాభ్యాం ప్రాప్స్యతః ప్రేరితే మయా. 14

మాయాబీజం హి మంత్రోమే ముఖ్యః ప్రియకరః సదా | ధ్యానం విరాట్స్వరూపం మే థవాత్వత్పురతః స్థితమ్‌. 15

సచ్చిదానందరూపం వా స్థానం సర్వజగన్మమ | యుష్మాభిః సర్వదా చాహం పూజ్యా ధ్యేయా చ సర్వదా. 16

వ్యాస ఉవాచ : ఇత్యుక్త్వాంతర్తధే దేవి మణిద్వీపాధివాసినీ |

దక్షాద్వా మునయః సర్వే బ్రహ్మణం పునరాయయుః. 17

బ్రహ్మణ సర్వవృత్తాంతం కథయామాసు రాదరాత్‌ | హరో హరిశ్చ స్వస్థౌ తౌ స్వస్వకార్యక్షమౌ నృప. 18

జాతౌ పరాంబాకృపయా గర్వేణ రహితౌ తదా | కదాచి దథ కాలేతు మహః శాక్త మహతరత్‌. 19

దక్షగేహే మహారాజ : త్రైలోక్యేప్యుత్సవోభవత్‌ | దేవాః ప్రముదితాః సర్వే పుష్పవృష్టం చ చక్రిరే. 20

నేదు ర్దుం దుభయః స్వర్గే కరకోణాహతా నృప | మనాం స్యాస న్ప్రసన్నాని సాధూనామమ లాత్మనామ్‌. 21

సరితో మార్గవాహిన్యః సుప్రభోభూద్దివాకరః | మంగళాయాం తు జాతాయం జాతం సర్వత మంగళమ్‌. 22

తస్యా నామ సతీం చక్రే సత్యత్వాత్పర సంవిదః | దదౌ పునః శివాయాథ తస్య శక్తి స్తు యాభవత్‌. 23

సా పునర్జ్వలనే దగ్దా దైవయోగాన్మనోర్నృప | జనమేజయః : అనర్థకర మేతత్తే శ్రావితం వచనం మునే. 24

ఏతాదృశం మహద్వస్తు కథం దగ్దం హుతాశ##నే | యన్నామ స్మరణా న్నృణాం సంసారాగ్నిభయం నహి. 25

కేన కర్మవిపాకేన మనో ర్దగ్దం తదేవ హి | వ్యాసః : శృణు రాజ న్పురావృత్తం సతీదాహస్యకారణమ్‌. 26

ఆ యిర్వురు శక్తలలో నొకతె నీ యింట మఱియెకతె క్షీరసాగరమున జన్మింపగలరు. హరిహరులు నాప్రేరణ వలన తిరిగి వారిని బడయగలరు. నా ముఖ్యమంత్రము శ్రీమాయాబీజము. అది నాకత్యంతము ప్రియకరమైనది. కనుక నా విరాట్స్వరూపమునగాని యీ త్రిభువనేశ్వరీ స్వరూపముగాని ధ్యానించవలయును. లేక సకల జగముల నిండిన నా సచ్చిదానంద స్వరూపమునైన ధ్యానింపవలయును. మీరు సతతము నన్ను పూజించి ధ్యానింపుడు. ఈ ప్రకారముగ పలికి మణిద్వీపాధివాసినియగు దేవి యంతర్దాన మొందెను పిమ్మట దక్షాదిమునులు మరల బ్రహ్మను చేరిరి. వారు జరిగిన వృత్తాంతమంతయును బ్రహ్మకు నివేదించిరి. హరిహరు లంతట స్వస్థులై తమ తమ కార్యములు తామే నిర్వహింప గలిగిరి. ఆనాటినుండి హరిహరులు పరాంబ దయవలన గర్వము మాని శాంతితో నుండిరి. ఒకానొక సమయన పరాశక్తి యవతరించెను. మహారాజా! దేవి దక్షునింట నవతరించెను. అపుడు ముల్లోకము లుత్సవములు జరుపుకొనెను. అమరులు ప్రమోదభరితులై పూలసోనలు కురిసిరి. రాజా! స్వర్గధామమున సురలు తమ చేతులందలి కోణములను సాధనములచేత దేవదుందుభులు మ్రోగించిరి. సాధుసజ్జనులు మనస్సులు నిర్మల ప్రసన్నములయ్యెను. నదు లువ్వెత్తుగ ప్రవహించెను. సూర్యుడు మేలు వెల్గులు విరజిమ్మెను. సర్వమంగళ యవతరింపగ నెల్లెడల మంగళ సర్వస్వ మొప్పారెను. ఆ పుట్టినట్టి బాల సత్యస్వరూపిణియే యగుటవలన సత్యజ్ఞానులామెను సతి యనిరి.ఆదక్షుని కూతురు మరల శివునకే యీయబడెను. ఆ దాక్షాయణి దక్షునపరాధమునకు దైవయోగమున నగ్నిలో దుమికెను. జనమేజయు డిట్లనెను: ఓ మునివరా! ఎంతటి యనర్థ కరమైనమాట వినిపించితివే! ఏ త్రిభువనేశ్వరి నామము స్మరించినంత మాత్ర నెల్లవారి సంసారాగ్ని భయము తొలగిపోవునో యట్టి మహాదేవి యేల నగ్నిలో దగ్దమయ్యెను. దక్షు డేమి యపరాధము చేసెనని యామె యగ్ని కాహుతి యయ్యెను? వ్యాసు డిట్లనెను: రాజా! సతీదేవి దగ్దయగుటకుగల కారణము వెల్లడింతు నవధరింపుము.

కదా చితథ దుర్వాసా గతో జంబూ నదేశ్వరీమ్‌ | దదర్శ దేవీం తత్రా సౌ మాయాబీజం జజాప సః. 27

తతః ప్రసన్నా దేవేశీ నిజకంఠగతాం స్రజమ్‌ | భ్రమద్ర్బ మరసంసక్తాం మకరందమదాకులమ్‌. 28

దదౌ ప్రసాదభూతాం తాం జగ్రహ శిరసా మునిః | తతో నిర్గత్య తరసా వ్యోమమార్గేణ తాపసః. 29

అజగామ స యత్రా೭೭స్తే దక్షః సాక్షాత్సతీపితా |సందర్శనార్థ మంబాయా ననామ చ సతీ పదే. 30

పృష్టో దక్షేణ సముని ర్మాలా కస్యా స్త్యలౌకికీ | కథం లబ్దా త్వయా నాథ దుర్లభా భువి మానవైః . 31

తచ్చ్రత్వా వచనం తస్య ప్రోవాచాశ్రు యుతే క్షణః | దేవ్యాః ప్రసాద మతులం ప్రేమగద్గదితాంతరః. 32

ప్రార్థయామాస తాం మాలాం తం మునిం స సతీపితా | అదేయం శక్తిభక్తాయ నాస్తి త్రైలోక్య మండలే. 33

ఇతి బుద్ధ్యాతు తాం మాలాం మనవే స సమర్పయత్‌ | గృహీతా శిరసా మాలా మనునా నిజమందిరే. 34

స్థాపితాః శయనం తత్ర దంపత్యో రతి సుందరమ్‌ | పశుకర్మరతో రాత్రౌ మాలాగంధేన మోదితః. 35

అభవ త్స మహీపాల స్తేన పాపేన శంకరే | శివే ద్వేషమతి ర్జాతో దేవ్యాం సత్యాం తథా నృప. 36

రాజం స్తేనాపరాధేన తజ్జన్యో దేహ ఏవ చ | సత్యా యోగాగ్నినా దగ్దః సతీధర్మదిదృక్షయా. 37

పునం శ్చ హిమవత్పృష్ఠే ప్రాదురాసీత్తు తన్మహః | జనమేజయః దహ్యమానే సతీదేహే జాతేకిమకరోచ్చివః. 38

ప్రాణాధికా సతీ తస్య తద్వియోగేన కాతరః | వ్యాసః : తతః పరంతు యజ్ఞాతంమయా వక్తుం న శక్యతే. 39

ఒకప్పుడు దుర్వాసమహర్షి జంబూనదీతీర మేగి యచట వెలసిన శ్రీదేవిని సందర్శించి శ్రీమాయాబీజము నచట జపించెను. అంతట శ్రీదేవేశ్వరి ప్రసన్నయై పూలజుంటి తేనియలకు తిరుగాడు గండుతుమ్మెదలుగల తన మెడలోని పూలదండ ముని కిచ్చెను. ముని దానిని దేవిప్రసాదముగ గ్రహించెను. తాపసు డాకాశమార్గమున బయలుదేరెను. అతడు సతి తండ్రియగు దక్షు డున్నచోటి కరిగెను. అట జగదంబను దర్శించి యామె పాదపద్మములకు నమస్కరించెను. ఆ పూమాల జూచి 'యిదెవరది? మానవ దుర్లభ##మైన యిదినీ కెట్లు లభించె'నని దక్షుడనెను. దక్షుని మాటలు విని కన్నుల ప్రేమాశ్రులు నిండ 'నిది శ్రీదేవి ప్రసాద' మని డగ్గుత్తికతో ముని పలికెను. దానిని తన కిమ్మని సతి తండ్రియగు దక్షడు ముని నడిగెను. శక్తి భక్తులకు ముల్లోకములం దీయరానిది లేదు. అని తలంచి ముని దేవి పుష్పమాలను దక్షున కొసంగెను. దక్షుడు దానిని తన తలపై దాల్చి యింటి కేగెను. ఆ రేతిరి దాని నతడు దంపతుల మెత్తని పానుపుపై నుంచెను. దాని పరిమళములు మూర్కొనుచు దక్షదంపతులు రతియందు సుఖించిరి. దానికై సతీశివులా గ్రహించిరి. రాజా! అందులకై దక్షుడు సతీశివులను ద్వేషించి యవమానించెను. తన పని నేరమి కాదనుటకును తన పాతివ్రత్యము లోకములకు ప్రకంటించుటకును సతీదేవి యోగా గ్నిని కల్పించుకొని దక్షు డిచ్చినతనువును కాల్చివేసెను. పిమ్మట సతీదేవి హిమవంతున కుద్బవించెను. జనమేజయు డిట్లనెను: సతీదేవి దగ్దగాగ శివు డేమి చేసెను? తనకు ప్రాణప్రియయగు సతీ విరహమును శివు డెట్లు సహించెనో తెల్పుము.వ్యాసు డిట్లనెను : రాజా ! తర్వాత వృత్తాంతము తెల్పుటకు నాకే శక్తి చాలకున్నది.

త్రైలోక్య ప్రలయో జాతః శివకోపాగ్నినా నృప | వీరభద్రః సముత్పన్నో భద్రకాళీగణాన్వితః. 40

త్రైలోక్యనాశనోద్యుక్తో వీరభద్రో యదాభవత్‌ | బ్రహ్మాదయ స్తదా దేవాః శంకర శరణం యయుః. 41

జాతే సర్వస్వనాశేపి కరుణానిధి రీశ్వరః | అభయం దత్తవాం స్తేభ్యో బస్తవక్రేణ తంమనుమ్‌. 42

అజీవయ న్మహాత్మాసౌ తతః భిన్నం మహేశ్వరః | యజ్ఞవాట ముపాగమ్య రురోద భృశదుఃఖితః. 43

అపశ్యతాం సతీం వహ్నౌ దహ్యమానాంతు చిత్కశామ్‌ | స్కంధేప్యారోపయామాస హా సతీతి వదన్ముహుః. 44

బభ్రామ భ్రాంతచిత్త స్స న్నానాదేశేషు శంకరః | తదా బ్రహ్మాదయో దేవా శ్చింతా మాపు

రనుత్తమామ్‌. 45

విష్ణు స్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణౖః | చిచ్చేదావయావా న్సత్యా స్తత్తత్థ్సానేషు తేపతన్‌. 46

తత్తత్థ్సా నేషు తత్రాసీన్నానామూర్తిధరో హరః | ఉవాచ చ తతో దేవా న్థ్సానేష్వీతేషు యే శివామ్‌. 47

భజంతి పరయా భక్త్యా తేషాం కించి న్న దుర్లభమ్‌ | నిత్యం సన్నిహితా యత్ర

నిజాంగేషు పరాంబికా. 48

స్థానేష్వేతేషు యేమర్త్యాః పురశ్చరణ కర్మిణః | తేషాం మంత్రాః ప్రసిధ్యంతి మాయాబీజం

విశేషతః. 49

ఇత్యుక్త్వా శంకరస్తేషు స్థానేషు విరహాతురః | కాలం నిన్యే నృపశ్రేష్ఠేః జపధ్యాన సమధిభిః. 50

జనమేజయః : కాని స్థానాని తాని స్యుః సిద్దపీఠాని చానఘ | కతి సంఖ్యాని నామాని కాని తేషాం చ మే వద. 51

తత్ర స్థితానం దేవీనాం నామాని చ కృపాకర | కృతార్థోహం భ##వే యేన తద్వదాశు మహామునే. 52

శివుని కోపాగ్నికి ముల్లోకములందు ప్రళయమే సంభవించెను. అంత శ్రీభద్రకాళీ గణములు వెంటరాగా శ్రీవీరభద్రు డవతరించెను. వీరభద్రుడు ముల్లోకములను నాశనము చేయపూనుకొనగనే బ్రహ్మది దేవతలు శివుని శరణు వేడిరి. సతీ నాశమున సర్వనాశ##మైనప్పటికిని శంకరుడు దయతో వారి కభయ మొసంగెను. మేక తలను దక్షుని మొండెమున కతికింప జేసెను. ఇట్లు దక్షుని బ్రదికించి దేవతల కభయమిచ్చి విచారగ్రస్తుడై శివుడు యజ్ఞశాలకేగి గోడున దురపిల్లెను.

పిమ్మట చిత్కళాస్వరూపిణియగు సతీదేవి యగ్నిలో దహింపబడుచుండుటగని హా సతీ! యని యామెను తన భుజముపై వేసికొనెను. ఆమెను మోసికొనుచు చలించిన మనస్సుతో శివుడు నానా దేశములు గ్రుమ్మరుచుండగ బ్రహ్మాది దేవతలు చింతాక్రాంతులైరి. వెనువెంటనే శ్రీహరి వచ్చి విల్లమ్ములుగొని సతి యవయవములు ముక్కముక్కలుగ ఛేదింపగ నవి పలుచోట్ల పడెను. ఆ బాగాలు పడినచోట్ల నెల్ల శివుడు పలురూపులుదాల్చి వెలసెను. శివుడు దేవతల కిట్లనెను:ఈస్థానములందలి శివాదేవిని కొలవవలయును. ఆ విధముగ పరాభక్తితో దేవిని సేవించినవారికి దుర్లభ##మైనది లేదు. దేవినిజాంగములు పడిన తావులందెల్ల పరాంబ నెలకొనియున్నది. అట్టిస్థానములందు పురశ్చరణ చేసిన వారి మంత్రములు త్వరితగతిన

సిద్ధించును. మాయాబీజమైనచో మఱింత త్వరిత తరముగ సిద్ధి గాంచగలదు. అని పలికి శివుడు విరహాతురుడై యాయాచోట్ల నెల్ల నంబికను పీఠము లెన్ని? వాని పేరు లేమి?అన్నియును చక్కగ విశదముగ తెలుపుము. ఓ మహామునీ ఆయా స్థానములందు నెలకొన్న దేవి నామములు తెలుపుము. అవన్నియు విని జన్మసార్థకత గాంచగలను.

వ్యాసః: శృణు రాజన్ప్రవక్షామి దేవీపీఠాని సాంప్రతామ్‌ | యేషాం శ్రవణ మాత్రేణ పాపహీనో భ##వేన్నరః. 53

యేషు యేషు చ పీఠేషుపాస్యేయం సిద్దికాంక్షిభిః | భూతికామై రభిధ్యేయా తాని వక్ష్యామి

తత్త్వతః. 54

వారాణస్యాం విశాలాక్షీ గౌరిముఖనివాసినీ | క్షేత్రే వైనైమిశారణ్య ప్రోక్తా సా లింగధారిణీ. 55

ప్రయాగే లలితా ప్రోక్తా కాముకీ గంధమాదనే | మానసే కుముదా ప్రోక్తా దక్షిణచోత్తరేతథా. 56

విశ్వకామా భగవతీ విశ్వకామప్రపూరిణీ | గోమంతే గోమతీ దేవి మందరే కామచారిణీ. 57

మదోత్కటా చైత్రరథే జయంతీ హస్తినాపురే | గౌరీ ప్రోక్తా న్యాకుబ్జే రంభాతు మలయాచలే. 58

ఏకామ్రపీఠే సంప్రోక్తా దేవీ సా కీర్తిమత్యపి | విశ్వే విశ్వేశ్వరీం ప్రాహుః పురుహూతాం చ పుష్కరే. 59

కేదారపీఠే సంప్రోక్తా దేవీ సా కీర్తిమత్యపి | మందా హిమవతః పృష్ఠే గోకర్ణే భద్రకర్ణికా. 60

స్థానేశ్వరి భవానీ తు బిల్వకే బిల్వపత్రికా | శ్రీశైలే మాధవీ ప్రోక్తా భద్రా భ##ద్రేశ్వరే తథా. 61

వరాహశైలే తు జయా కమలా కమలాలయే | రుద్రాణీ రుద్రకోట్యాంతు కాళీ కాలంజరే తథా. 62

శాలగ్రామే మహాదేవీ శివలింగే జలప్రియా | మహాలింగే తు కపిలా మాకోటే ముకుటేశ్వరీ. 63

మాయాపుర్యాం కుమారీ స్యాత్సంతానే లలితాంబికా | గయాయాం మంగళా ప్రోక్తా విమలా పురుషోత్తమే. 64

ఉత్పలాక్షీ సహస్రాక్షే హిరణ్యాక్షే మహోత్పలా | విపాశాయా మమోఘాక్షీ పాటలా పుండ్రవర్ధనే. 65

వ్యాసు డిట్లనెను: ఓ రాజా ! ఇపుడు శ్రీదేవీ పీఠముల గూర్చి వివరింతును, సావధానముగ వినుము. వానిని విన్నంతనే నరుడు సర్వపాపముక్తుడు గాగలడు. పరమసిద్ధిని విభూతిని గోరువా రేయే పీఠములందే యే నామములతో దేవి నుపాసించి ధ్యానింతురో తెలుపగలను. శ్రీ గౌరీముఖము పడినచోటు కాశి. అచట దేవిని విశాలాక్షి యందురు. నైమిశారణ్యక్షేత్రమునందలి దేవి లింగధారిణి, ప్రయాగలో లలిత, గంధమాదనమున కాముకి, దక్షిణ మానసమున కుముద, ఉత్తర మానసమున విశ్వకామములు తీర్చు విశ్వాకామ, గోమంతమందు గోమతి, మందరమున కామ చారిణియై, చైత్రరథమున మదోత్కట హస్తినాపురమందు జయంతి, కన్యాకుబ్జమందు గౌరి, మలయాచలమున రంభ, ఏకామ్ర పీఠమున కీర్తిమతి, విశ్వమందు విశ్వేశ్వరి పుష్కరమున పురుహూత, కేదారమందు సన్మార్గదాయిని, హిమాలయము వెనుక భాగమున మంద గోకర్ణమున భద్రకర్ణిక, స్థానేశ్వరమున భవాని, బిల్వకమున బిల్వపత్రిక, శ్రీశైలమున మాధవి, భ##ద్రేశ్వరమున భద్ర, వరాహశైలమున జయ కమలాలయమున కమల, రుద్రకోటియందు రుద్రాణి, కాలంజరమున కాళి, శాలగ్రామమున మహాదేవి, శివలింగమున జలప్రియ మహాలింగమున కపిల, మాకోటమున ముకుటేశ్వరి, మాయా పురియందు కుమారి, సంతానమందు లలితాంబిక, గయలో మంగళ, పురుషోత్తమమున విమల, సహస్రాక్షమున ఉత్పలాక్షి, హిరణ్యాక్షమున మహోత్పల, విపాశలో అమోఘాక్షి, పుండ్రవరమున పాటలయని దేవిని వ్యవహరింతురు.

నారాయణీ సుపార్శ్వేతు త్రికూటే రుద్రసుందరీ | విపులే విపులా దేవీ కల్యాణీ మలయాచలే. 66

సహ్యాద్రా వేకవీరా తు హరిశ్చంద్రే తు చంద్రికా | రమణా రామతీర్థే తు యమునాయాం మృగావతీ. 67

కోటవీ కౌటతీర్థే తు సుగంధా మాధవీ వనే | గోదావర్యాం త్రిసంధ్యా తు గంగా తీరే రతిప్రియా. 68

శివకుండే శుభా నందా నందినీ దేవికాతటే | రుక్మిణీ ద్వారవత్యాం తు రాధా బృందావనే వనే. 69

దేవకీ మధురాయాం తు పాతాళే పరమేశ్వరీ | చిత్రకూటే తథా సీతా వింధ్యే వింధ్యాధి వాసినీ. 70

కరవీరే మహాలక్ష్మీ రుమాదేవీ వినాయకే | ఆరోగ్యా వైద్యనాథే తు మహాకాళే మహేశ్వరీ. 71

అభ##యే త్యుష్ణ తీర్థేషు నితంబా వింధ్య పర్వతే | మాండవ్యే మాండవీ నా మా స్వాహా మహేశ్వరీ పురే. 72

ఛగలండే ప్రచండా తు చండికామరకంటకే | సోమేశ్వరే వరారోహా ప్రభాసే పుష్కరావతీ. 73

దేవమాతా సరస్వత్యాం పారావారా తటే స్మృతా | మహాలయే మహాబాగా పయోష్ణ్యాం పింగలేశ్వరీ. 74

సింహికా కృతశౌచే తు కార్తికే త్వతిశాంకరీ | ఉత్పలావర్తకే లోలా సుభద్రా శోణసంగమే. 75

మాతా సిద్ధవనే లక్ష్మీ రనంగా భరతాశ్రమే | జాలంధరే విశ్వముఖీ తారా కిష్కింధ పర్వతే. 76

దేవదారువనే పుష్టి ర్మేధా కాశ్మీర మండలే | భీమాదేవి హిమాద్రౌ తు తుష్టిర్విశ్వేశ్వరీ తథా. 77

కపాలమోచనే శుద్ది ర్మాతా కాయవరోహణ | శంఖోద్దారే ధరా నామ ధృతిః పిండారకే తథా. 78

సుపార్శ్వమున నారాయణి త్రికూటమందు రుద్రసుందరి విపులమున విపుల మలయాఛలమున కల్యాణి సహ్యగిరిపై ఏకవీర హరిశ్చంద్రమున చంద్రిక రామతీర్థమున రమణ యమునయందు మృగావతి కోట తీర్థమున కోటవి మాధవీ వనమున సుగంధ గోదావరియందు త్రిసంధ్య గంగాతీరమందు రతిప్రియ శివకుండమున శుభానంద దేవికాతటమున నందిని ద్వారకయందు రుక్మిణి బృందావనమున రాధ మధురలో దేవకి పాతాళమందు పరమేశ్వరి చిత్రకూటమున సీత వింధ్యాద్రిపై వింధ్యాదివాసిని కరవీరమున మహాలక్ష్మీ వినాయకమున ఉమాదేవి వైద్యనాధమున ఆరోగ్య మహాకాళమున మహేశ్వరి ఉష్ణతీర్థమున అభయ వింధ్యగిరిపై నితంబ మాండవ్యమున మాండవి మహేశ్వరీపురమున స్వాహా ఛ గండమున ప్రచండ అమర కంటకమన చండిక సోమేశ్వరమున వరారోహ ప్రభసమున పుష్కరావతి సరస్వతిలో దేవమాత సాగరతటమునందు పారా వార మహాలయమున మహాభాగ పయోష్ణిలో పింగలేశ్వరి కృతశౌచమున సింహిక కార్తికమున అతిశాంకరి ఉత్పలావర్తమున లోల శోణసంగమున సుభద్ర సిద్ధవనమందు లక్ష్మిమాత భరతాశ్రమున అనంగ జాలంధరమున విశ్వముఖి

కిష్కింధపర్వత మున తార దేవదారువనమందు పుష్టి కాశ్మీరమండలమందున మేధ హిమాద్రియందు భీమాదేవి విశ్వేశ్వరీ క్షేత్రమున తుష్టి కపాలమోచనమున శుద్ధి కాయావరోహణమున శ్రీమాత శంఖోద్ధారమున ధర పిండారకమున ధృతియని శ్రీదేవికి నామములు.

కలాతు చంద్రభాగాయా మచ్చోదే శివధారిణీ | వేణాయా మమృతా నామ బదర్యా ముర్వశీ తథా 79

ఔష దిశ్చోత్తరకురౌ కుశద్వీపే కుశోదకా | మన్మథా హేమకూటే తు కుముదే సత్యవాదినీ. 80

అశ్వత్థే వందనీయా తు నిధిర్వైశ్రవణాలయే | గాయత్రీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ. 81

దేవలోకే తథేంద్రాణీ బ్రహ్మాస్యేషు సరస్వతీ | సూర్యబింబే ప్రభానామ మాతృణాం వైష్ణవీమాతా. 82

అరుంధతీ సతీనాంతు రామసు చ తిలోత్తమా | చిత్తే బ్రహ్మకలా నామ శక్తిః సర్వశరీరిణామ్‌. 83

ఇమాన్యష్టశతాని స్యుః పీఠాని జనమేజయ | తత్సంఖ్యాకా స్తదీశాన్యో దేవ్యశ్చ పరికీర్తితాః .84

సతీ దేవ్యంగభూతాని పీఠాని కథితాని చ | అన్యాన్యపి ప్రసంగేన యాని ముఖ్యాని భూతలే. 85

యః స్మరేచ్ఛృణుయాద్వాపి నామష్టశత ముత్తమమ్‌ | సర్వపాపవినిర్ముక్తో దేవీలోకం పరంవ్రజేత్‌. 86

ఏతేషు సర్వపీఠేషు గచ్చే ద్యాత్రాం విధానతః | సంతర్పయే చ్చ పిత్రాదీన్‌ శ్రాద్ధాదీని విధాయ చ. 87

కుర్యా చ్చ మహతీం పూజాం భగవత్యా విధానతః | క్షమాపయే జ్జగద్ధాత్రీం జగదంబాం ముహుర్ముహుః 88

కృతకృత్యం స్వమాత్మానం జానీయా జ్జనమేజయ | భక్ష్యభోజ్యాదిభిః సర్వాన్బ్రాహ్మణా న్బోజయేత్తతః 89

సువాసినీః కుమారీశ్చ వటుకాదీం స్తథా నృప | తస్మిన్‌ క్షేత్రే స్థితా యేతు చాండాలాద్యా అపిప్రభో. 90

దేవీరూపాః స్మృతాః సర్వే పూజనీయోస్తతో హితే | ప్రతి గ్రహాదికం సర్వం తేషు క్షేత్రేషు వర్జయేత్‌. 91

చంద్రభాగయందు కళ అచ్చోదమున శివధారిణి వేణయం దమృత బదరియం దుర్వశి ఉత్తరకురువులందు ఔషధి కుశద్వీపమున కుశోదక హేమకూటమున మన్మథ కుముదమున సత్యవాదిని అశ్వత్థమున వందనీయ వైశ్రవాణాలయమందు నిధి వేదదనమున గాయత్రి శివసన్నిధియందు పార్వతి దేవలోకమం దింద్రాణి బ్రహ్మముఖమందు సరస్వతి సూర్యబింబమున ప్రభ మాతృగణములందు వైష్ణవియని శ్రీదేవికి క్షేత్రభేదమున వ్యవహారము. సతులందురుంధతీదేవి అందకత్తెలలో తిలోత్తమ- ఎల్లరి చిత్తములందు చిత్కలాశక్తి-గ దేవి విలసిల్లుచున్నది. ఓ జనమేజయా! ఇవి మొత్తము నూటయెనిమిది శ్రీదేవీ పీఠములు. శ్రీదేవి నామములను నూటయెనిమిదిగ ప్రసిద్ధిగాంచెను. ఈ ప్రకారముగ దేవి శరీరము నుండి యేర్పడిన దేవి పీఠములు తెల్పితిని. ఈ భూతలమం దింకను ముఖ్యములైన దేవీ నిలయములు గలవు. ఎవడీ నూట యెనిమిది దేవీ పీఠనామములు వినునో చదువునో వాడు సకల పాపముక్తుడై తుదకు దేవీసాలోక్యమందగలడు. ఈ యెల్ల పుణ్యదేవీపీఠనామములు వినునో చదువునోవాడు సకల పాపముక్తుడై తుదకు దేవీసాలోక్యమందగలడు. ఈ యెల్ల పుణ్యదేవీ పీఠములకు యాత్రజేసి తెలిసినవాడు యథావిధిగ పితరులకు సంతర్పణము శ్రాద్ధాదులాచరింపవలయును. శ్రీభగవతికి విధివిధానముగ దేవీపూజలు జరిపి మాటిమాటికిని జగద్దాత్రియగు జగదంబను క్షమించ వేడుకొనవలయును. ఇట్లోనరించి తానొక ధన్యజీవుడనని భావింపవలయును. రాజా! ఎల్ల బ్రాహ్మణులను భక్ష్యభోజ్యాదులతో సంతోషపఱచవలయును. బ్రహ్మచారులను బాలలను భోజనాదులచే తనుపవలయును. ఆయా క్షేత్రములందలి తక్కినవారిని చండాలాదులను తనుపవలయును. పిమ్మట వీరి నెల్లరను దేవీ స్వరూపులుగ భావింపవలయును. పూజింపవలయును. ఆ పుణ్యతీర్థములందు దానములు గ్రహింపరాదు.

యథాశక్తి పురశ్చర్యాం కర్యాన్మంత్రస్య సత్తమః | మాయాబీజేన దేవేశీం తత్తత్పీఠాధివాసినీమ్‌. 92

పూజయే దనిశం రాజ న్పురశ్చరణకృద్బవేత్‌ | విత్తే శాఠ్యం న కుర్వీత దేవీభక్తిపరో నరః. 93

య ఏవం కురుతే యాత్రాః శ్రీదేవ్యాః ప్రీతమానసః | సహస్రకల్ప పర్యంతం బ్రహ్మలోకే మహత్తరే. 94

వసంతి పితర స్తస్య సోపి దేవీపురే తథా | అంతే లబ్ద్వా పరం జ్ఞానం భ##వేన్ముక్తో భవాంబుధేః. 95

నామాష్టశతజాపేన బహవః సిద్దతాం గతాః | యత్రైత లిఖితం సాక్షా త్పుస్తకేవాపి తిష్ఠతి. 96

గ్రహమారీభయాదీని తత్ర నైవభవంతి హి | సౌభాగ్యం వర్ధతే నిత్యం యథా పర్వణి వారిధిః 97

న తస్య దుర్లభం కించి న్నామాష్ట శతజాపినః | కృతకృత్యో భ##వేన్నూనం దేవీభక్తిపరాయణః. 98

నమంతి దేవతా స్తంవై దేవీరూపో హి స స్మృతః | సర్వథా పూజ్యతే దేవైః కిం పునర్మనుజోత్తమైః. 99

శ్రాద్దకాలే పఠే దేత న్నా మాష్టశత ముత్తమమ్‌ | తృప్తా స్తత్పితరః సర్వే ప్రయాంతి పరమాం గతిమ్‌. 100

ఇమాని ముక్తిక్షేత్రాణి సాక్షాత్సంవిన్మయానిచ| సిద్ధపీఠాని రాజేంద్రః సంశ్రయే న్మతిమాన్నరః. 101

పృష్టం యత్తత్త్వయా రాజ న్నుక్తం సర్వం మహేశితుః | రహస్యాతి రహస్యం చ కిం భూయః శ్రోతు మిచ్ఛసి.

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే త్రింశోధ్యాయః.

తన శక్తి కొలది మాయాబీజమంత్రమునకు పురశ్చరణ చేయవలయును. మాయా బీజముతో మాయా పీఠములందు వసించు దేవేశిని పూజించవలయును. దేవీ మంత్రమును రాత్రింబవళ్లు జపించి దేవిని పూజించిన పురశ్చరణ జరుగును. దేవీ భక్తి తత్పరు డెన్నడును దేవీపూజకై ధనమునకు వెనుకముందు లాడరాదు. ఎవడీ విధముగ ప్రీతచిత్తముతో శ్రీ దేవీ యాత్రలు జరుపునో యతని పితరులు వేయి కల్పములవఱకు మహత్తర బ్రహ్మలోకమునందు వసింతురు. అటుపిదప పరమజ్ఞానము బడసి సంసారసాగరము దాటి శ్రీమంతమగు దేవీపురమున విరాజిల్లుచుందురు. ఈ నూటయెనిమిది దేవీ నామ ములు చదివినవారు సిద్దులైరి. ప్రతియింట నివి పుస్తకరూపమున వ్రాయబడియుండవలయును. అచ్చోట దుష్ట-గ్రహ-మారీ-భయాదులు గలుగవు. మఱియును నిండుపున్నమనాటి సంద్రమువలె నిత్యము శాంతి సౌభాగ్యములు వర్ధిల్లును. ఈ దేవీ నామాష్టశతకము జపించువానికి లోకమున దుర్లభ మనునది లేదు. అట్టి దేవీ భక్తి పరాయణుడు కృతకృత్యుడు. ధన్యజీవనుడు. అట్టివానిని దేవీ స్వరూపునిగ నెంచి యెల్లదేవతలు నమస్కరింతురు. అతడు దేవతలచేతనే పూజింపబడును. ఇక నరులవలన చెప్పెడి దేమున్నది! ఈ దేవీ నామాష్టశతకమును శ్రాద్ధకాలమందు పఠించినచో పితృదేవతలు తృప్తులై పరమ గతిని జెందుదురు. ఈ సిద్దపీఠము లన్నియును జ్ఞానతీర్థములు-ముక్తిక్షేత్రములు. మతిమంతుడీ దేవీసిద్దక్షేత్రములు తప్పక సేవింపవలయును. శ్రీ మహేశ్వరిని గూర్చి నీ వడిగిన గుహ్యములు గుహ్య తమముల నెల్ల నీకు వివరించితిని. ఇంకేమి విన వలతువో తెలుపుము.

ఇది శ్రీ దేవి భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున ముప్పదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters