Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తమోధ్యాయః

వ్యాసః దత్తే గ్రహేతు రాజేంద్ర వాసవః కుపితో భృశమ్‌ | ప్రోవాచ చ్యవనం తత్ర దర్శయ న్బలమాత్మనః.

మా బ్రహ్మబంధో మర్యాదా మిమాం త్వం కర్తు మర్హసి | వధిష్యామి ద్విషంతం త్వాం విశ్వరూప మివాపరమ్‌.

చ్యవనః : మావమంస్థా మహాత్మానౌ రూపద్రవిణవర్చసా | ¸° చక్రతుర్మామఘవన్‌ బృందారక మివాపరమ్‌.

ఋతే త్వాం విబుధా శ్చాన్యే కథం వా೭೭దదతే గ్రహమ్‌ | అశ్వినావసి దేవేంద్ర దేవౌ విద్ది పరంతపౌ. 4

ఇంద్రః : భిషజౌ నార్హతః కామంగ్రహం యజ్ఞే కథంచన | యది దిత్ససిమందాత్మన్‌ శిరశ్ఛేత్స్యామిసాంప్రతమ్‌.

వ్యాసః : అనాదృత్యతుతద్వాక్యం వాసవస్యచ భార్గవః | గ్రహం తుగ్రాహయామాస భర్తృయన్నివ తంభృశమ్‌.

సోమపాత్రం యదాతాభ్యాం గృహీతం తు పిపాసయా | సమీక్ష్య బలభిద్దేవ ఇదం వచన మబ్రవీత్‌. 7

అభ్యా మర్థాయ సోమం త్వం గ్రాహయిష్యసి చేత్స్వయమ్‌ | వజ్రం తు ప్రహరిష్యామి విశ్వరూప మివాపరమ్‌. 8

వాసవేనైవ ముక్తస్తు భార్గవశ్చాతి గర్వితః | జగ్రాహ విధివ త్సోమ మశ్విభ్యా మతి మన్యుమాన్‌. 9

ఇంద్రోపి ప్రాక్షిప త్కోపా ద్వజ్ర మసై#్మ స్వమాయుధమ్‌ | పశ్యతాం సర్వదేవానాం సూర్యకోటిసమప్రభమ్‌.

ఏడవ అధ్యాయము

సుకన్యా వృత్తాంతము

జనమేజయరాజా! చ్యవనుడట్లు సోమపాత్రము చేతబునినంతనే దేవేంద్రుడు కోపముతో తన బలము చూపుచు చ్యవనున కిట్లనెను: ఓ బ్రాహ్మబంధూ! వీరిని సోమపానముచే గౌరవింపవలదు. అట్లు చేసిన విశ్వరూపుని చంపినట్లు నిన్ను చంపగలను. అన చ్యవను డిట్లనెను: ఇంద్రా! ఈ మహాత్ములు నాకు రూపసంపద నొసంగిరి. వీరి నవమానింపకుము. వీరు నన్ను రెండవ దేవునివలె మార్చివేసిరి. దేవేంద్రా! నీవు తొలుత త్రావకున్న దేవతలును త్రాగరు. కనుక పరంతపులగు అశ్వి దేవతలను దేవతలుగ నెఱుంగుము. ఇంద్రు డిట్లనెను: ఓ మందమతీ! వీరు వైద్యులు. యజ్ఞమున సోమార్హులుగారు, ఒకవేళ వారికి సోమ మిచ్చినచో నీ తల తెగవ్రేతును. ఇంద్రుని మాట లెక్కచేయక భార్గవుడతనిని బెదిరించుచు సోమము గ్రహించెను. వారు సోమపాత్రము చేతుల ధరించి దప్పి దీర్చుకొనదలచిరి. అంతలో నింద్రుడు చూచి యిట్లనెను : వీరికై నీవు సోమము గ్రహించినచో నిన్ను రెండవ విశ్వరూపుని చంపినట్లు నా వజ్రముతో చంపుదును. ఇట్లు దేవేంద్రుడు పలుకగనే భార్గవు డభిమానపూర్వకముగ కోపముతో నశ్వినులకొఱకు సొమము యథావిధిగ చేబూనెను. ఇంద్రు డంత కోపముతో నెల్ల సురలు చూచుచండగ సూర్యకోటి ప్రకాశముగల తన వజ్రాయుధము మునిపై విసరెను.

ప్రేరితం చాశనిం ప్రేక్ష్య చ్యవన స్తపసా తతః | స్తంభయామాస వజ్రం స శక్రస్వామితతేజసః. 11

కృత్యయా స మహాబాహు రింద్రం హంతు మహోద్యతః | జుహావాగ్నౌ శ్రుతం హవ్యం మంత్రేణ మునిసత్తమః.

తత్ర కృత్యా సముత్పన్నా చ్యవనస్య తపోబలాత్‌ | ప్రబలః పురుషః క్రూరో బృహత్కాయో మహాసురః. 13

మదో నామ మహాఘోరో భయదః ప్రాణినా మిహ | శరీరః పర్వతాకార స్తీక్షదంఎ్టో్ర భయానకః. 14

చతస్ర శ్చా೭೭యతా దంష్ట్రా యోజనానాం శతంశతమ్‌ | ఇతరే త్వస్య దశనా బభూవు ర్దశయోజనా ః. 15

బాహూ పర్పతసంకాశా వాయతౌ క్రూరదర్శనౌ | జిహ్వాతు భీషణా క్రూరా లేలిహానా నభ స్తలమ్‌. 16

గ్రీవా తు గిరిశృంగాభా కఠినా భీషణా భృశమ్‌ | నభా వ్యాఘ్రనఖప్రఖ్యాః కేశాశ్చాతీవ భీషణాః. 17

శరీరం కజ్జలాభం చ తస్య చాస్యం భయానకమ్‌ | నేత్రే దావానలప్రఖ్యే భీషణ చ భయానకే. 18

హను రేకా స్థితా తస్య భూమావేకా దివంగతా | ఏవం విధః సముత్పన్నో మదోనామ బృహత్తమః. 19

అట్లు ప్రేరితమైన వజ్రమును చూచి చ్యవనమహర్షి తన తపోవీర్యముచే నమితతేజముగల యింద్రుని వజ్రమును స్తంభింపజేసెను. పిదప మహాబాహువగు మునిసత్తముడు దేవేంద్రుని చంపు తలంపుతో కృత్యకొఱకు మారణమంత్రములతో నగ్నిని వేల్చెను. చ్యవనుని తపోబలమున కృత్య యుత్పన్నమయ్యెను. కృత్యవలన మహాబలము-గొప్పకాయముగల క్రూర మహాసురుడు గల్గెను. అతని పేరు మదాసురుడు. అతడు ఘోరుడు ప్రాణులకు భయంకరుడు. వాని మేను పర్వతమంత గలదు. వాని వాడికోఱలు భయంకరములు. అతని నాల్గుకోఱలు నూఱు యోజనములంత గలవు. తక్కిన కోఱలు పది యోజనములంత గలవు. వాని భుజములు పర్వతములంతటివి. చూపులు క్రూర భీకరములు. నాలుక భయంకరముగ గగన తలమును నాకునేమో యనున ట్లుండెను. వాని మేను గిరిశిఖరమువలె కఠిన భీకరముగ నుండెను. గోళ్ళు వాడి పులిగోళ్ళు, వెండ్రుకలు వెఱపు గొల్పునవి. వాని శరీరము నల్లగ కాటుకకొండవలె నుండెను. ముఖమతిభయంకరము. కన్నులు దావాగ్నులవలె భీషణ భయంకరములు. వాని యొక దౌడ నేలను వేరొకటి నింగిని తాకు నట్లుండెను. ఈ విధముగ పెద్ద శరీరముగల మదుడను పేరుగల యసురుడు పుట్టెను.

తం విలోక్య సురాః సర్వే భయమాజగ్ము రంహసా | ఇంద్రోపి భయసంత్రస్తో యుద్ధాయ న మనోదధే. 20

దైత్యోపి వదనే కామం వజ్ర మాదాయ సంస్థితః | వ్యాప్తం నభో ఘెరదృష్టి ర్గ్రసన్నివ జగత్త్రయమ్‌. 21

స భక్షయిష్య నక్రుద్ధః శతక్రతు ముపాద్రవత్‌ | చుక్రుశు శ్చ సురాః సర్వే హాహతాః స్మేతి సంస్థితాః. 22

ఇంద్రః స్తంభితబాహు స్తు ముముక్షుర్వజ్ర మంతికాత్‌ | న శశాక పవిం తస్మి న్ప్రహర్తుం పాకశాసనః. 23

వజ్రహస్తః సురేశాన స్తం వీక్ష్య కాలసన్నిభమ్‌ | సస్మార మనసా తత్ర గురుం సమయకోవిదమ్‌. 24

స్మరణా దాజగామాశు బృహస్పతి రుదారధీః | గురు స్తత్సమయం దృష్ట్వా విపత్తిసదృశం మహత్‌. 25

విచార్య మనసా కృత్యం తమువాచ శచీపతిమ్‌ | దుఃసాధ్యోయం మహామంత్రై స్త్వయం వజ్రేణవాసవ. 26

అసురో మద సంజ్ఞ స్తు యజ్ఞకుండా త్సముత్థితః | తపోబల మృషేః సమనక్‌ చ్యవనస్య మహాత్మః. 27

అనివార్యో హ్యయం శత్రు స్త్వయాదేవైస్తథామయా | శరణం యాహి దేవేశ చ్యవనస్య మహాత్మనః. 28

స నివారయితా నూసం కృత్యా మాత్మకృతాం కిల | న నివారయితుం శక్తాః శక్తిభక్తరుషం క్వచిత్‌. 29

ఇత్తుక్తో గురుణా శక్ర స్తదా೭೭గచ్ఛన్మునిం ప్రతి | ప్రణమ్య శిరసా నమ్ర స్తమువాచ భయాన్వితః. 30

అతనిని చూడగనే వేల్పు లెల్లరు భయకంపితులైరి. ఇంద్రు డంతటివాడే భయత్రస్తుడై యుద్దము మాట మఱచి పోయెను. ఆ దైత్యుడు తన పెద్దనోట వజ్రము పట్టుకొని ఘోరమైన చూపులతో ముల్లోకములను వ్యాపించు నట్లుండెను. అతడు క్రుద్దుడై యింద్రుని మ్రింగబోయెను. అయ్యో! హతులమైతిమని వేల్పు లెల్ల రొక్కపెట్టున పెద్దగ విలపించిరి. ఇంద్రుని భుజములు కదలకస్తంభిచిపోయెను. అతడు వజ్రము వ్రేటువేయుట కశక్తుడయ్యెను. వజ్రహస్తుడగు దేవేంద్రుడు కాలాంతకుడగు దనుజుని చూచి యేమియు తోచక సమయకోవిదుడగు గురుని తలంచెను. ఉదార హృదయుడగు గురుడు తన్ను దలంచినంత మాత్రన యేతెంచెను. అప్పటి సమయము కష్టకాలమని యెఱింగెను. గురుడు కృత్యనుగూర్చి యాలో చించి యితడు మహామంత్రములకుగాని వజ్రమునకుగాని సాధ్యుడుగాడని యింద్రుతో ననెను. మహాబలుడగు మదాసురుడు చ్యవనమహర్షి తపోబలమున యజ్ఞకుండమునుండి పుట్టెను. దేవేశా! ఇపు డీ యసురుని దేవతలుగాని నీవుగాని నేనుగాని వారింపజాలము. కనుక చ్యవనమహామునిని శరణు పొందుము. శ్రీపరాభట్టారికా భక్తులకు కోపము వచ్చినచో దానినెవరును వారింపజాలరు. చ్యవనుడు తన కృత్యను తానే వారింపగలడు. అని గురుడు పలుకగ దేవేంద్రుడు చ్యవనముని సన్నిధికేగి భయవినయములతో తలవంచి నమస్కరించి యిట్లు పలికెను.

క్షమస్య మునిశార్దూల శమయాసుర ముద్యతమ్‌ | ప్రసన్నో భవ సర్వజ్ఞ వచనం తేకరోమ్యహమ్‌. 31

సోమార్హా వశ్వినా వేతా పద్యప్రభృతి భార్గవ | భవిష్యతః సత్య మేత ద్వచో విప్ర ప్రసీద మే. 32

మిథ్యా తే నోద్యమోహ్యేష భవత్వేవ తపోధన | జానే త్వమపి ధర్మజ్ఞ మిథ్యానైవ కరిష్యసి. 33

సోమపా వశ్వినా వేతౌ త్పత్కృతౌ చ సదైవ హి | భవిష్యత శ్చ శర్యాతేః కీర్తి స్తు విపులా భ##వేత్‌. 34

మయా యద్ది కృతం కర్మ సర్వథా మునిసత్తమ | పరీక్షార్థంతు విజ్ఞేయం తవ వీర్య ప్రకాశనమ్‌. 35

ప్రసాదం కురు మే బ్రహ్మన్‌ మదం సంహరచోత్థితమ్‌ | కల్యాణం సర్వదేవానాం తథా భూయోవిధీయతామ్‌. 36

ఏవ ముక్తస్తు శ##క్రేణ చ్యవనః పరమార్థవిత్‌ | సంజహార తతః కోపం సముత్పన్నం విరోధజమ్‌. 37

దేవ మాశ్వాస్య సంవిగ్నం భార్గవస్తు మదం తతః | వ్యభజత్‌ స్త్రీషు పానేషు ద్యాతేషు మృగయాసు చ. 38

మదం విభజ్య దేవేంద్ర మాశ్వాస్య చకితం భియా | సంస్థాప్య చ సురా న్సరా న్మఖం తస్య న్యవర్తయత్‌. 39

తతస్తు సంస్కృతం సోమం వాసవాయ మహాత్మనే | అశ్విభ్యాం సర్వధర్మాత్మా పాయయామాస భార్గవః. 40

మునివరేణ్యా ! సర్వజ్ఞా! నా తప్పు క్షమింపుము. నా పైకి వచ్చుచున్న దనుజుని వారింపుము. ప్రసన్నుడవు కమ్ము. నీ మాట చెల్లింతును. భార్గవా: బ్రాహ్మణోత్తమా! ఈనాటినుండి యశ్వినులు సోమపానమునకు తగినవారగుదురు. నామాట నిజము. నాయెడ దయ చూపుము. తపోధనా! ధర్మజ్ఞా! నీ ప్రయత్నము వమ్ముగాదు. నీవు వ్యర్థమైన పనియేదియు చేయవని నాకు తెలియును. అశ్వినులు నీచే నిరంతరముగ సోమపాయులైరి. ఈ శర్యాతిరాజు కీర్తియు శాశ్వతమయ్యెను. మునిసత్తమా! నేను చేసిన పనియంతయును నీ తపోవీర్యము నల్గురికి వెల్లడించుటకు నిన్ను పరీక్షించుటకే చేసితిని. బ్రాహ్మణవర్యా! మదాసురుని సంహరింపుము. మమ్ము కనికరింపుము. ఎల్ల వేల్పులకు మేలు చేకూర్చుము. అను దేవపతి మాటలువిని పరమార్థవిదుడగు చ్యవనుడు విరోధమువలన గల్గిన కోపమును తీసివేసికొనెను. ఇట్లు భార్గవుడింద్రు నూరడించి మదాసురుని స్త్రీలు త్రాగుడు జూదము వేట యును నాల్గుచోట్లనుండ నియమించెను. ఇట్టు ముని దేవేంద్రునోదార్చి మదుని మదమడచి దేవతలను తమ తమ స్థానములకంపి యజ్ఞమును పూర్ణ మొనరించెను. ఆ పిదప సర్వధర్మాత్ముడగు భార్గవుడు పవిత్రమైన సోమమును దేవేంద్రునిచే అశ్వినులచే త్రాగించెను.

ఏవం తౌ చ్యవనే నార్యా వశ్వినౌ రవిపుత్రకౌ | విహితౌ సోమపౌ రాజ. న్సర్వథా తపసోబలాత్‌. 41

సరస్త దపి విఖ్యాతం జాతం యూపవిమండితమ్‌ | ఆశ్రమ స్తు మునేః సమ్యక్‌ పృథివ్యాం విశ్రుతోభవత్‌. 42

శర్యాతి రపి సంతుష్టోహ్యభవత్తేన కర్మణా | యజ్ఞం సమాప్య నగరే జగామ సచివైర్వృతః. 43

రాజ్యం చకార ధర్మజ్ఞో మనుపుత్రః ప్రతాపవాన్‌ ఆ నర్త స్తస్య పుత్రోభూ దానర్తా ద్రేవతోభవత్‌. 44

సోంతః సముద్రే నగరీం వినిర్మాయ కుశస్థలీమ్‌ | అస్థితో భుంక్త విషయా నానర్తాదీ నరిందమః 45

తన్య పుత్రశతం కకుద్మి జ్యేష్ఠముత్తమమ్‌ | పుత్రీ చ రేవతీ నామ్నా సుందరీ శుభలక్షణా. 46

వరయోగ్యా యదాజాతా తదా రాజా చ రేవతః | చింయామాస రాజేంద్రో రాజపుత్రా స్కులోద్బవాన్‌. 47

రైవతం నామ చ గిరిమాశ్రితః వృథివీపతిః | చకార రాజ్యం బలవా నానర్తేషు నరాధిపః. 48

విచింత్య మనసా రాజా కసై#్మ దేయా మయా సుతా | గత్వా పృచ్ఛామి బ్రహ్మాణం సర్వజ్ఞం సురపూజితమ్‌. 49

ఇతి సంచిత్య భూపాలః సుతా మాదాయ రేవతీమ్‌ | బ్రహ్మలోకం జగామాశు ప్రష్టుకామః పితామహమ్‌. 50

యత్ర దేవాశ్చ యజ్ఞాశ్చ ఛందాంసి పర్వతా స్తథా | అబ్దయః సరిత శ్చాపి దివ్యరూపధరాః స్థితాః. 51

ఋషయః సిద్దగంధర్వాః పన్నగా శ్చారణా స్తథా | తస్థుః ప్రాంజలయః సర్వే స్తువంతశ్చ పురాతనాః. 52

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే సప్తమోధ్యాయః.

రాజా! ఇట్లు రవిపుత్రులు-ఆర్యులు నగు అశ్వినులను చ్యవనమహర్షి తన తపోబలమున సోమపాయులుగ జేసెను. నాటినుండి యా సరస్సు యూపమండితమై యలరారెను. చ్యవన మున్యాశ్రమము భూమిపై ప్రఖ్యాతి గాంచెను. అట్లు శర్యాతియు చ్యవనుని మహిమను సంతుష్టుడై జన్నము పూర్తి గావించి మంత్రులగూడి తన నగరి కరిగెను. ఇట్లు ముసుపుత్రుడగు శర్యాతి ప్రతాపముతో ధర్మజ్ఞతతో చక్కగా రాజ్య మేలెను.

అతని కొడు కానర్తుడు. ఆనర్తుని కొడుకు రేవతుడు. రేవతుడు సాగరములో కుశస్థలియను పురము నిర్మంచి యానర్తాది దేశములలోని భోగభాగ్యములను నిరాటంకముగ ననుభవించెను. రేవతునకు నూర్గురు కుమారులు. పెద్దవాడు కుకుద్మిఉత్తముడు. కూతురు రేవతి. ఆమె సుందరి-శుభలక్షణ. తన కొమరితకు పెండ్లి వయస్సు రాగానే రేవతుడుత్తమ కులసంజాతులగు రాజపుత్రుల గుఱించి యాలోచించెను. అతడు రైవతగిరిపై నివసించుచు విక్రమముతో ఆనర్తాదిదేశము లందు రాజ్యము చేసెను. అతడు తన కూతు నెవని కీయవలయునో తెలియదలచి సురపూజితుడు సర్వజ్ఞుడునైన బ్రహ్మ సన్నిధి కేగదలచెను. ఇట్లు తలంచి రేవతుడు రేవతిని తోడ్కొని పితామహు నడుగుటకు బ్రహ్మలోకము జేరెను. ఆ బ్రహ్మ లోకమునందు ఎల్లదేవతలు యజ్ఞములు ఛందములు గిరులు సాగరములు సరస్సులు దివ్యరూపములు దాల్చి వెలుగొందుచుండెను. అట మఱియును సిద్దులు గంధర్వులు ఋషులు చారణులు పన్నగులు మున్నగువారు చేతులు జోడించి బహ్మనుసంస్తుతించుచుండిరి.

ఇది శ్రీదేవీ భాగవతమందలి సప్తమ స్కంధమందు సప్తమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters