Bharatiya Samskruthi-I Chapters
ఓమ్
శ్రీ గురుభ్యో నమః
రమాసహిత సత్యనారాయణస్వామినే నమః
భారతీయ సంస్కృతి
(పరిచయము)
''సంస్కృతిర్వావ హైవేహ ఇమాని దేవశిల్పాని''
ఆంగ్లభాషలో Civilisation (నాగరికత), Culture అను వ్యవహారము కలదు. అ Culture అను పదమునకు 'సంస్కృతి' అని వ్యవహారము. నాగరికత వేషభాషలు మొదలగువాటికి చెందినది; బాహ్యము. సంస్కృతి అందరము. ఆచారవ్యవహారములు, గుణగణములు, విశ్వాసములు జీవితలక్ష్యము మొదలగు వానియొక్క మేలు కలయికచే పరంపరాగతముగా దేశవాసులకు జాతికి లభించిన సంస్కారము. పుట్టుకతోనే లభించు ఈ సంస్కారము విద్యాబుద్ధులచేతను, లోకవిజ్ఞానముచేతను పరిణతినొంది జీవనపథమునకు ఉపయోగపడుచున్నది. ఉదాత్తస్వభావము, సద్గుణమలయందు ప్రీతి, వ్యవహారనైపుణ్యము, దేవతా విశ్వాసము, సదాచారము, పాపపుణ్యములందు, పూర్వజన్మ, పునర్జన్మలందునమ్మిక, భారతీయసంస్కృతిలో ఇమిడియున్నవి.
శ్లో|| సర్వే7త్ర సుఖినః నన్తు సర్వే నన్తు నిరామయాః |
సర్వస్తరతు దుర్గాణి మాకశ్చి ద్దుఃఖభాగ్ భ##వేత్ ||
అందఱు సుఖపడుదురుగాక! అందఱు ఆరోగ్యవంతులగుదురు గాక! అందఱు కష్టములనుండి గట్టెక్కుదురు గాక! శుభములను బడయుదురు గాక! ఏ ఒక్కరును దుఃఖమును పొంద కుందురు గాక!
ఇది, భారతసంస్కృతి లక్ష్యము, సర్వమతసహనము, త్యాగనిరతి, దీని విశిష్ట లక్షణములు.
ప్రకృతి - వికృతి
'ప్రక్రియతే అనయా ఇతి ప్రకృతిః|' సృష్టికి మూల కారణము సత్త్వ రజ స్తమోగుణాత్మకము, జడము, సుఖదుఃఖ మోహములను కలిగించు భోగ్యసంపదను ఇచ్చును. ఈ ప్రకృతియే పంచభూతములుగాను, ఇంద్రియములుగాను, దేహముగాను పరిణమించును. ఇవి ప్రకృతికార్యములు - 'వికృతి' అను పేరుతో వ్యవహరింపబడును. 'ప్రకృతి' అనగా కారణము, 'వికృతి' అనగా కార్యము. చేతనుడగు పురుషుడు (ఆత్మ) ఈ ప్రకృతి, వికృతుల కంటె వేఱౖనవాడు. చేతనుడే, సుఖదుఃఖ భోక్త. భోగ్యసంపద భోక్తృపరతంత్రము. చేతనుని కొఱకే భోగ్యసంపద ఏర్పడుచున్నదని భావము. ఆహారపానీయములు, సమస్త భోగోప కరణములు ప్రకృతికి చెందినవి. వికృతి కూడా ప్రకృతిలో భాగమే అయి ఉన్నది.
భాష యొక్క ఉద్దేశ్యము, ఉపయోగము
భావవ్యక్తీకరణములనకు ఉపయోగపడుట, భాషయొక్క ముఖ్య ఉద్ధేశ్యము. సంస్కతభాష అతి ప్రాచీనము. దానినుండి ఇప్పుడు దేశములో వాడుకలోనున్న హిందీ మొదలగా గల భాషలు జనించినవి. ఆంధ్రభాషలో గూడ సంస్కృతసమ, సంస్కృతభవ శబ్దములు ఎక్కువగా వాడుకలో నున్నవి. ఉదా:- చంద్రః సంస్కృతము, చంద్రుడు-తత్సమము, చందురుడు-తద్భవము. ఆకాశః సంస్కృతము, ఆకాశము- తత్సమము, ఆకసము - తద్భవము. ఈ విధముగా సంస్కృత పదజాలము ప్రకృతిగాను, తత్సమ, తద్భవపదములు వికృతిగాను వ్యవహరింపబడుచున్నది. ఇంతవఱకు ఒకరి భావమును మఱియొకరికి తెలియజేయుటకు ఈ భాషలు ప్రవర్తిల్లినవి. భాస వర్ణ, పద, వాక్యాత్మకము. ధ్వని కూడా భావవ్యక్తీకరణకు ఉపయోగించును. కాని, అది భాష కాదు. ఆవిధముగానే సంజ్ఞలు, చేష్టలు కూడ కొంతవఱకు భావమును స్థూలముగా తెలియజేయుచున్నను, భాషవలె స్పష్టముగా మనస్సు లోని వివిధ భావములను వ్యక్తీకరించలేవు. వ్యవహారములోనున్న భాషలు కాలక్రమమున, ఉచ్చారణలో మార్పుచెందుచుండును. సంస్కృతభాష, ఇప్పుడు తక్కువ వ్యవహారములో నున్నది. సంస్కృత భాష అతి ప్రాచీన మగుటచే సృష్ట్యాది చరిత్రను, భారతీయ సంస్కృతిని గ్రహించుటకు ఉపయోగించును. ఈ భాష వేదములందు మార్పునొందక, కాపాడబడుచున్నది. స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్యములందలి భాష, లౌకికభాష, వ్యాకరణ నియమమును పాటించును. సంస్కృత శబ్దములు సాధు శబ్దములు, ఉచ్చారణమాత్రముచేత పుణ్యమును కలిగించునవి. అపశబ్ధములు కూడా, భావాభివ్యక్తికి ఉపయోగించునుగాని, పుణ్యమును కలిగింప నేరవు.
'సంస్కృతం నామ దైవీ వావ్' సంస్కృతము దేవభాష. దేవతలు సంస్కృతభాషను వాడుకొందురు. కనకనే, దేవతాను గ్రహముకొఱకు ఉచ్చరించు మంత్రములు సంస్కృతములో నున్నవి. ఈ భాషలు ముఖ, కంఠ, తాల్వాది స్థానములందు వాయువుయొక్క అభిఘాతసంయోగముచే (తాకిడిచే) అభివ్యక్త 'వైకరీ' శబ్దములు, బుద్ధిలో ఆలోచించుటకు ఉపయోగించు శబ్దములు 'మధ్యమా' శబ్దములు, యోగులు దర్శించు సూక్ష్మశబ్దములు 'పశ్యంతీ' శబ్దములు. ఈ శబ్దములకన్నింటికి అతి సూక్ష్మమైన (మూలమైన) శబ్దము 'పరా' శబ్దము. అంతకంటెను సూక్ష్మమైనది నాదము. సంస్కృతభాషాశబ్దములు లోకవ్యవహారమునకేగాక తత్త్వానుసంధానముకొఱకు విచారించుటకు నుపయోగించును. 'మంత్రాధీనం తు దైవతమ్' మంత్రశబ్దశక్తి మహిమచే దేవతా సాక్షాత్కారము కూడా కలుగును. కనుక, సంస్కృత భాష అసాధారణము, విజ్ఞానదాయకము.
దేవాలయములు
శ్లో|| దేహో దేవాలయః ప్రోక్తః | జీవో దేవః సనాతనః |
త్యజే దజ్ఞాననిర్మాల్యం | సో7హంభావేన పూజయేత్ ||
దేహమే, ఒక దేవాలయము. అందు ఉన్న జీవుడు సాక్షాత్తు పరమాత్మయే. అజ్ఞానమనెడి నిర్మాల్యము, (నిన్న చేసిన పూజా ద్రవ్యము) వదలిపెట్టవలెను. నః అహమ్-నేను 'ఆ పరమాత్మనే' అను భావముతో పూజించవలయును.
'ఏకో దేవః సర్వభూతేషు గూఢః|' ఒకే పరమాత్మ సర్వ ప్రాణి హృదయములందు ఉన్నాదు. దేవుడు (ఈశ్వరుడు) జగత్తును సృజించెను. అందు కృమి, కీట, పశు, పక్ష్యాదులు, మానవులు నివసించుచున్నారు. వీరి దేహములందు దేవుడు (పరమాత్మే) జీవరూపముగా ప్రవేశించి ఉన్నాడు. జీవులు దేహాభి మానము కలవారై వ్యవహరించును క్లేశములను అనుభవించు చున్నారు. మానవులు బుద్ధివికాసము కలవారగుటచే క్లేశములనుండి వినిర్ముక్తులగుటకు ఈశ్వరారాధనము (పూజా, జపధ్యానాదు,లను) చేసికొనెడివారు, ఈ ఈశ్వరారాధనచేత దేహాభిమానమును (రాగద్వేషములను) జయించి, ఆ దేహమునకే తాము పరిమితుల మైనవారము అను జీవభావమును త్యజించి, ఆ దేహమునందు చిద్రూప ప్రత్యగాత్మరూపులుగానున్న తాము సర్వవ్యాపక పరమాత్మయొక్క అంశ ('మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః') అపి గ్రహించి ఘటాకాశము మహాకాశముయొక్క అంశ అయినను, మహాకాశస్వరూపమే అయినటుల, ప్రత్యగాత్మలు పరముత్మస్వరూపులే యను అనుభవముతో బ్రహ్మానందము ననుభవించుచు కృతార్థులైరి. వారి సాధనకు దేహము ముఖ్య స్థానము. సో7హమ్ = సః+అహమ్ - ఆ పరమాత్మయే నేను అను భావననయే పూజ. అజ్ఞానమును నిర్మాల్యమునువలె భావించి తాను పరమాత్మయే అను ధృఢానుభవముతో పరమానందమును అనుభవిచెడివారు. కొన్నాళ్ళకు, గ్రామ, నగరాదులు ఏర్పడుటతో సమష్ఠిపూజాస్థానములు (దేవాలయములు) అందఱకు ఉపయోగ కరముగా ఏర్పడినవి. ఈ దేవాలయములందు ఆగమశాస్త్ర ప్రకారము కళావాహనాదలు చేసి, దేవతావిగ్రహ ప్రతిష్ఠ జరుపబడుచున్నది. పరమాత్మయొక్క చైతన్యకళ శాస్త్రోక్తవిధానముచే అందు నిలిపి, ఆరాధించువారికి ఆ దేవతామూర్తి, అభీష్టఫలముల నొసగుచున్నది. చైతన్య విలసితమగు దేవతామూర్తి సంరక్షణము నకు గోపుర, ప్రాకారాది నిర్మాణమలు జరిగినవి. పూజాదులచే ఆ దేవతామూర్తియందు అభివ్యక్తమగు శేక్తిని సంరక్షించుకొనుచున్నంతవఱకు ఆ దేవాలయములు మానవుల క్లేశములను పోగొట్టు కొనుటకొఱకు, సాధకులైనవారికి అభీష్టభోగ్యసంపదను లభింపజేసి కొనుటకొఱకు, జిజ్ఞానువులై పరమాత్మ సాక్షాత్కారము బడయుట కొఱకును, జీవితలక్ష్యమగు పరమపరుషార్థము (నిర్దుఃఖ నిరతిశయసుఖమును) పొందుటకును ఉపయోగింపగలవు.
విగ్రహారాధన
మానవులు అవశముగా వచ్చు క్లేశములనుండి వినిర్ముక్తులగుటకు, అభీష్ట సుఖమలను బడయుటకు ఈశ్వరారాధనను సాధనముగా స్వీకరించి పూజా, జప, ధ్యానాదులను చేయుచుండెడి వారు. ఈశ్వరుడు నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు అయినను, తన మాయాశక్తిచేత సగుణ సాకార రూపములను ధరించి, సాధకులను అనుగ్రహించుచున్నాడు. నిరాకార, నిర్గుణ పరమాత్మస్వరూపమునందు మానవులచిత్తము దీర్ఘకాలమునిలుచుట కష్టమైనందున, వారు ఈశ్వరునియొక్క సగుణ, సాకారస్వరూపమును ఆరాధించుచున్నారు. పరమాత్మ, సత్యజ్ఞానానన్దస్వరూప నిర్గుణ బ్రహ్మ. శుద్ధసత్త్వ ప్రధానమాయోపాధిచే సర్వజ్ఞత్వ, సర్వ శక్తిత్వ, సత్యకామత్వ, సత్యసంకల్పాదిగుణములతో సగుణ బ్రహ్మ అగుచున్నాడు. ఈ నిరాకారసగుణశ్వరుడు ఒక్కడే సృష్ఠి, స్థితి, లయములు అను కార్యములకొఱకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అను మూర్తిత్రయరూపమును ధరించుచున్నాదు. ఈ త్రిమూర్తులే సగుణ, సాకార బ్రహ్మలు. ఆకారము అనగా శరీరము. ఆ పాఞ్చభౌతికము కాదు. ఈశ్వరోపాధియగు మాయాశక్తి, తన వశమునందుండుటచే స్వేచ్ఛ చేతనే ఈశ్వరుడు శరీరములను ధరించును. ఇట్లే రామ, కృష్ణ, నృసింహాది భవదవతారదేహమలు, శుద్ధసత్త్వమయ మాయా దేహములు. జీవుల శరీరములవలె పఞ్చభూతజన్యములు కావు. ఆవిర్భావ, తిరోభావములు కలవి. భక్తులయెడ ప్రసన్నుడైనపుడు భక్తాభీష్ఠానుసారము, ఈశ్వరుడు ఆయా రూపములతో ఆవిర్భవించి తిరోభావము (అంతర్ధానము) చెందుచుండును. ఈ విధముగా సగుణ, సాకార ఈశ్వరారాధన ప్రారంభ##మైనది.
మానసముగా ఈశ్వరారాధన కొంతకాలము గడచినతరువాత తాము ధ్యానముచేయు దేవతామూర్తి నిరంతరము ఎక్కువ కాలము ఆరాధించుటకు అనువుగా సాలగ్రామ, బాణాదిబాహ్యమూర్తులు, స్వర్ణ, రజతాది లోహమయ అర్చావిగ్రములు ఏర్పఱచు కొనబడినవి. సర్వజనోపయోగకరముగా అర్చావిగ్రములను దేవాలయములందు ప్రతిష్ఠించి ఈశ్వరారాధన చేసికొనుము గ్రామ, నగరవాసులు ప్రయోజనమును పొందుచున్నారు. ప్రయోజనము అనగా కష్ట నివారణము, అభీష్టకార్యసిద్ధి, భోగభాగ్యసంపద పోందుటయే గాక, ఆధ్యాత్మిక దివ్యానుభూతితో జీవితమును ప్రశాంతముగా గడపుకొనుచు, జీవితలక్ష్యమును సాధించుకొనుటకు ప్రయత్నించుచున్నారు. కొందఱు పరమాత్మ, స్వయంజ్యోతి, చైతన్య ప్రకాశస్వరూపుడు గనుక, ఆయనకు విగ్రహకల్పన పూజాదులు యుక్తములు కావని విగ్రహారాధనను నిరసించుదురు. ఋషులు, మానవులందఱును ఈశ్వరాను గ్రహము పొందుటకు, మంత్ర, తంత్ర, శిల్ప, యంత్ర, ఆగమాది శాస్త్రానుసారముగా దివ్యశక్తి, విగ్రహములందు అభివ్యక్తమై దేవతాసాన్నిధ్యము లభించి, ఆ దేవతానుగ్రహముచే ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక ఉపద్రవములు రాకుండా గ్రామ, నగరవాసులను సంరక్షించిరి.
మనుష్యులవలెనే దేవతలు ఉన్నారు. వారు అధిక శక్తి సంపదగలవారు. వారియొక్క అనుగ్రహము మానవకోటి క్షేమ దాయకము, శ్రేయస్కరము. కనుక, విగ్రహారాధన నేటికాలము నందుగూడ, సమాజ శ్రేయస్సునకు ఉపమోగపడుచున్నది.
పలువిధములైన దేవతారూపమలు
'ఏకోదేవః' ఈశ్వరుడు ఒక్కడే. అయినను, సృష్టికొఱకు చతుర్ముఖబ్రహ్మరూపములు. సరస్వతీరూపమును ధరించెను జగత్పాలనము కొఱకు లక్ష్మీనారాయణరూపములను, సంహారము కొఱకు పార్వతీపరమేశ్వరరూపములను ధరించెను. ఒకడే 'పతిశ్చ పత్నీ చ అభవతామ్' పతిపత్నీ రూపములను ధరించెను. మిథున సృష్టిలోని స్త్రీపురుషులకు వీరు ఆదర్శదంపతులు, వారి శరీరములులీలావిగ్రహములు. ఈ త్రిమూర్తులు, వారి భార్యలు, అవతార దేహములను ధరించుటగూడ కలదు. మానవులలో స్త్రీపురుషులు వారి వారి అభీష్టములను నెరవేర్చుకొనుటకొఱకు ఈ దేవతామూర్తులను ఆరాధించెడివారు. మానవుల కోరికలు అనేకములుగా ఉండుటచే ఆ కోరికలను సిద్ధింపజేయుటకు ఆ దేవత, అనేక దేవతా మూర్తిరూపములను ధరించెను. పురాణములందు ఏయే దేవతా మూర్తులు ఏ ఫలమును ఇవ్వగలవో, వర్ణింపబడియున్నది. సరస్వతీదేవి, విద్యాప్రదాయిని. లక్ష్మీదేవి, ఐశ్వర్యప్రదాయిని. పార్వతీదేవి, సౌభాగ్యమునిచ్చునది. వీరుకాక, లలిత, త్రిపురసుందరి, దుర్గ మొదలగు దేవతలుకూడ, భుక్తిముక్తులను ఇచ్చువారు కలరు.
అవతారములలో రామ, కృష్ణ, నృసింహదేవతోపాసనలు ప్రసిద్ధములు. ఏయే దేవతలను ఏ విధముగా ఆరాధించవలెనో శాస్త్రములందు చెప్పబడినది. జీవకోటిలో గూడ. ఈశ్వరాంశ##చే ఆరాధింపబడు దేవతలు కలరు. సూర్యుడు ఆరోగ్యమునిచ్చును. అగ్ని, ఐశ్వర్యము నిచ్చును. మహేశ్వరుడు జ్ఞానమునిచ్చును. ఈశ్వరుడే, నానాదేవతారూపములలో తనశక్తి అంశతో ప్రవేశించి భక్తుల అభీష్టములను తీర్చుచున్నాడు. కొందఱు మూర్తిభేదముచే దేవతలు నానారూపములతో నున్నారు. ఏకేశ్వరుడే నానాదేవతా మూర్తిరూపములను ధరించినట్లు గ్రహింపదగును, రూపభేదము చేత వస్తుభేదము లేదు. జీవభావములోనున్న దేవతలు గూడ
29]
మానవులకంటె దివ్యశక్తిసంపన్నులు అగుటచే మానవులకు సహాయ పడగలరు. ఈ దేవతలయొక్క ఆకార, గుణ, శక్తి, ఆయుధ పరివారములను ఋషులు, మంత్రద్రష్టలు తమ తపస్సు చేతను యోగశక్తిచేతను ఆయా దేవతాసాక్షాత్కారమును పొంది, వారి రూపగుణాదులను, శక్తులను లోకమునకు అందించినారు. వేద, పురాణ, తంత్రగ్రంథములందు ఆ దేవతల విశేషవర్ణనము కలదు. మనము దేవాలయములందు చూచు దేవతావిగ్రహములు పురాణ వర్ణిత దేవతావిగ్రహములను ప్రతిరూపములు. అర్చనాసౌకర్యము కొఱకు శిల్ప. యంత్ర, తంత్రసాహాయ్యముచే ఈ విగ్రహములను ఏర్పరచుకొనివారు. ఆ విగ్రహములందు దేవతలు సన్నిహితులై భక్తులను అనుగ్రహించుచున్నారు. ఒకే విష్ణువు మత్స్య, కూర్మ, వరాహ, రామ, కృష్ణాది దశావతారములను ధరించినను, ఒకే విష్ణువు అని భావింతుము. అట్లే చతుర్భుజ, శంఖ, చక్ర, పీతాంబరాదులతో విష్ణువు, త్రిలోచన, జటాజూటాదులతో శివుడు రూపములు వేఱౖనను శివకేశవులు ఇరువురు ఏకేశ్వరుడని మన సిద్ధాన్తము. రూపభేదమేకాని, ఈశ్వరలక్షము ఇరువురియందు సమానమే గనుక ఒకే దేవుడు అనుకొనుటలో దేవుడు ఒకడే అని గ్రహించ వలయును. దేవాలయములోని విగ్రహములు ఉపాసనకొఱకు ఏర్పడినవి. ఒకే ఈశ్వరుడు భిన్న దేశములందు భిన్న నామములను ధరించుచున్నాడు. ఈశ్వరుడే వెంటేశ్వరుడు. ఇట్లు సర్వదైవతారూపములందును ఏకేశ్వరదర్శనము చేయవచ్చును. ఈ దేవతారూపములలో అభివ్యక్తమగు శక్తులు నానారూపములై నానాఫలములను ఒసంగుచున్నవి. పతిపత్నులుగూడ ఏకతత్త్వమే అయిఉన్నారు. వ్యవహారములో వ్యవస్థలో వైవిధ్యమును దర్శించు చున్నను, దేవతాత్త్వమును జిజ్ఞానువులై గ్రహించుటకు పూనుకొనినచో ఈశ్వరుడు ఒక్కడే యను ఆర్ష సిద్ధాన్తము బోధపడును.
సృష్టికి పూర్వము ఉన్న ఒకే దేవుడు త్రిమూర్తిదేవతా రూపములను ధరించిన విధముగానే, క్రమముగా సృష్టిలోని మానవుల కోఱికలు పెరిగినకొలది, దానికనుగుణముగా దేవతా రూపములుకూడ వస్తృతి చెందినవి. పరిశీలన చేయగా స్థూలరూపములనుండి సూక్ష్మ, వ్యాపకదేవతాతత్త్వమును అన్వేషించుచు ఋషులు ఏకేశ్వరదర్శనము చేసిరి.
ధర్మము, స్వధర్మము, పరధర్మము
''ధరతి, ధారయతి ఇతి వా ధర్మః |'' లోకమును వ్యవస్థతో కాపాడునది, వ్యక్తులను, జాతిని రక్షించునది ధర్మము. ''ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా|'' ధర్మము సమస్త జగత్తునకు విధారకము. ''యతో అభ్యుదయ నిఃశ్శ్రేయససిద్ధిః ధర్మః |'' అని కణాదమహర్షి నిర్వచనము. అభ్యుదయమునకు ఐహికా ముష్మికభోగములకు, నిఃశ్శ్రేయసమునకు (అనగా మోక్షమునకు) ధర్మము సాధనము అని అభిప్రాయము. వీరి
ధర్మము పుణ్య రూపము. ''చోదనాలక్షణో7ర్థో ధర్మః |'' అని జైమిని మహర్షి నిర్వచనము. వేదములందుగాని, స్మృతులందుగాని. ఈ పనులు చేయవలయును అని విధింపబడినవి ధర్మములు. ఇవి యాగ, హోమ, జప, ద్యానాది క్రియారూహములు. శ్రుతులయందు చెప్పబడిన రీతిగా ఆచరించినచో పశు, పుత్ర, ఐశ్వర్యాదులు, ఇహలోకసుఖము, స్వర్గాదిపరలోకసుఖము, ఫలాపేక్షలేకుండా, ధర్మమును ఆచరించినచో, తత్త్వజిజ్ఞాస కలిగి, ఆత్మసాక్షాత్కారముతో ముక్తిని గూడా పొందగలడు. భారతదేశమునందు వర్ణాక్రమ ధర్మవ్యవస్థ శిథిలము కాకుండా నున్నపుడు. ఏ వర్ణముల వారు ఆ వర్ణముల ధర్మములను, ఏ ఆశ్రమములవారు ఆ ఆశ్రమములయొక్క ధర్మమును ఆచరించెడివారు. కొన్ని ధర్మములు మానవసాధారణధర్మములు కూడ కలవు.
శ్లో|| అహింసా సత్య మస్తేయం శౌచ మింద్రియనిగ్రహః |
ఇవి, సామాన్యధర్మములు. భగవద్గీతలో-
శ్లో|| స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః |
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ||
అని కలదు. కనుక, ఎవరి ధర్మములు వారు ఆచరించవలయును, పరధర్మములను బాగుగా ఆచరించుటకు చేతనైనను స్వధర్మమునే ఆచరించవలయును అని కృష్ణభగవానుడు ఉపదేశించుచున్నాదు. ధర్మముయొక్క పరిధి, చట్టము, నీతి ఇహలోకముకంటె వ్యాపక మైనది. పరలోకమున, జన్మాంతరమున గూడ ఫలము నొసంగుశక్తి కలది, భగవద్గీతలోని ఈ స్వధర్మ, పరధర్మ విచారణ లౌకిక ధర్మములకు గూడ, వర్తింపజేయుట యుక్తముగా కనిపించుచున్నది. లౌకికధర్మములు అనగా, ఎవరి విధులు, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించవలయును. తన విధ్యుక్తధర్మమును వదలిపెట్టి పరదర్మాచరణకు పోరాదు. లోకాన్యాయమునుబట్టి, ఆచారమును బట్టి ఈ లౌకికి ధర్మములను గ్రహించవచ్చును. మాతా, పితృ, పుత్ర, గురు, శిష్య, స్వామి, భృత్య, స్త్రీ ధర్మములు భిన్నము లైనను, స్వధర్మమును ఆచరించుటలో సమాజమునకు అభివృద్ధి, రక్షణయు కలవు. లౌకికవ్యవస్థలో గూడ వృత్తులు, వ్యాపారములు, పనులు అభివృద్ధి చెందుటవలన, కొన్ని ధర్మములను వారు వారు తగినట్లుగా నిర్ధేశించుకొని ఘర్షణరాకుండ సమాజములో సుఖముగా జీవించుచున్నారు. ఈ లౌకిక ధర్మములకు మోక్షపర్యంతము వినియోగమును నిర్దేశించుటలేదు గాని, సమాజస్థితి, అభివృద్ధి, వారి లక్ష్యములుగా నున్నవి. అందిరికి ధర్మము అవశ్యకము అను భావము బుద్ధివికాసముగల మానవులలో చోటుచేసికొన్నది. ఏది స్వధర్మము, ఏది పరధర్మము అను విషయమును వారు నిర్ధారణ చేయుటలేదు. తాత్కాలికముగా మేము చేయుదుము అని అంగీకరించినది స్వధర్మము. ఇతరులు తాము చేయుటకు అంగీకరించినది పరధర్మము. సాధారణమును 'స్వభావస్తు ప్రవర్తతే' అను భగవానుని వచనానుసారము వారివారి స్వభావము. సంస్కారములను అనుసరించి దూరదృష్టితో తామే, తమధర్మములను నిర్ణయించుకొనుటగాని, శిష్టులవలన (పెద్దలవలన) తమ ధర్మములను తెలిసికొని ఆచరించుట శ్రేయష్కరము. పరధర్మము. పరులకే శ్రేయస్సును కలిగించును,
కర్మ, వికర్మ, అకర్మ
భగవద్గీతయందు కర్మయోగప్రకరణమున, ఈ కర్మ, వికర్మ, అకర్మలయొక్క ప్రస్తావన వచ్చినది. కర్మలు అనగా శాస్త్రములందు మనము చేయవలయును అని చెప్పబడిన విహిత కర్మలు, శాస్త్రోక్తకర్మలను మనము ఆచరించుచుండవలయును. అవి స్నాన, సంధ్యా, జప, హోమ, స్వాధ్యాయాదులు. ఇవిగాక, ఇంకను విస్తృతముగా శ్రౌతకర్మలు, స్మార్తకర్మలు కూడ కలవు. వికర్మలు అనగా విరుద్ధకర్మలు- నిషిద్ధకర్మలు. 'న సురాం పిబేత్' మద్యమును త్రాగరాదు. 'న మాంసం (కళంజం) భక్షయేత్' మాంసమును తినరాదు. 'న అనృతం వదేత్' అసత్యమును పలుకరాదు. ఈ విధముగా నిషేధింపబడిన సురాపాన, మాంస భక్షణాదులు వికర్మలు. 'న పరదారాం గచ్ఛేత్' పరదారా (పరభార్యా) గమనము చిషిద్ధము. ఈ విధముగా ఏ పనులు చేయరాదు అని శాస్త్రములందు చెప్పబడినవో, అవి వికర్మలు. లోకములో రాగద్వేషవశమున వానియందు ప్రవర్తింతురు. అవి, స్వాభావికకర్మలు. వానిలో శాస్త్రనిషిద్ధకర్మలను మానవలెను. శాస్త్రవిహితములైన కర్మలను యథాశక్తి ఆచరించవలయును. ఇప్పుడు లోకమున, లౌకిక కర్మాచరణమునకే అధికముగా కాలము గడచుచున్నది. అవి ఐహిక ప్రయోజనములు గలవి. శాస్త్రీయ కర్మలు ఆచరింపబడినపుడు పుణ్యలోకప్రాప్తికి, తరువాత ఉత్తమజన్మ లభించుటకు ఉపయోగించును. ఇదిగాక, శ్రీకృష్ణభగవానుడు చెప్పినట్లుగా కర్మయోగమును (నిష్కామకర్మాచరణమును) అనగా, ఐహిక ఫలాపేక్ష వీడి, ఈశ్వరానుగ్రహము కొఱకు ఆచరించినచో, దురితక్షయమునకు తత్త్వజ్ఞానమునకు జీవితలక్ష్యమగు పరమ పురుషార్థమైన మోక్షమునకు గూడ ఉపయోగించును.
అకర్మ - కర్మ చేయకుండుట; వ్యాపార ఉపరమము ; నిష్క్రియస్థితి. భగవానుడు -
శ్లో|| కర్మనో హ్యసి భోద్ధవ్యం భోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోధ్ధవ్యం గహనా కర్మణో గతిః ||
అని చెప్పుచున్నాడు. ఇది కర్మ, అకర్మ, వికర్మలను గుఱించి జాగ్రత్తగా తెలిసికొనవలెను. కర్మగతి దుర్‌జ్ఞేయము. అనగా, కర్మఫలపరిణామములను తెలిసికొనుటలో శ్రమపడవలసియుండుటయే గాక, వీని స్వరూపమును గుర్తించుటలో గూడ, జాగరూకత వహించవలసియున్నది. ఒకప్పుడు కర్మ, వికర్మగాను, వికర్మ, కర్మగాను తోచును. స్వధర్మములో దోషము, పర ధర్మములో గుణము కూడ కనిపించును, ఇదిగాక, భగవానుడు-
శ్లో|| కర్మణి అకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృత్ ||
అనికూడ ఉపదేశించెను. వారి భావమును మనము సరిగా గ్రహించవలయును. కర్మను అకర్మగా చూచుట, అకర్మను కర్మగా చూచుట భ్రాంతిజ్ఞాన మగును. అది ఉపదేశార్హము కాదు. కొందఱు కర్మలు బంధకములు గనుక, సకామ కర్మలు చేయరాదు ; నిత్య కర్మలు బంధకములు కావు గనుక, అవి కర్మలైనను బంధకకర్మలు కావున భావముతో అకర్మలుగా పేర్కొనబడినవి అని భావించు చున్నారు. అదియు, ఇచట సమ్మతము కాదు. మఱమనగా, కర్మణి = మనోవాక్కాయ వ్యాపారమందు, అకర్మ = ఆత్మ నిష్క్రియముగానే యున్నది అని ఎవరు దర్శించునో, వాడు వివేకి, బుద్ధిమంతుడు. 'అకర్మణి చ కర్మయః' కొందఱు తాము చేయు పనులు మానుకొని సాహంకారులై ఊరకకూర్చుండి విశ్రాంతి తీసుకొనుచు మేము అకర్మనిష్ఠులమని అనుకొనుచుందురు. కాని, వారుకూడ, ఆ సమయములో ఊరక ఉండుట 'తూష్ణీం ఆసనమ్ = నిర్వ్యాపారస్థితిః' అను క్రియను చేయుచునే ఉన్నారు. అప్పుడు కూడ అహంకారమునందు, క్రియా శ్రయత్వ, కర్తృత్వములు కలవు. ఇది, గ్రహించి నిష్క్రియమగు ఆత్మస్వరూపస్థితిని అహంకారమును వీడి గ్రహించవలయును. ఇది సదుపదేశ##మే అయి ఉన్నది. కర్మాచరణకాలములో గూడ, ఆత్మస్వరూపజ్ఞానస్థితిని ఉపదేశించుచున్నది. లోకమునందుగూడ, కర్మయందు అకర్మ దర్శనము, అకర్మయందు కర్మదర్శనము కలవు. ఎట్లనగా, పడవ పోవుచుండగా అందున్న మనుజుడు ఒడ్డునందున్న చెట్లు తిరుగుచున్నట్లు (గమనము చేయుచున్నట్లు) చూచును. ఇచట నావయందు గమనక్రియ ఉన్నది. వృక్షములయందు గమన క్రియలేదు. అయినను, నావలోనున్న తాను నేను గమనము చేయుటలేదు అనుట విపరీత దర్శనము. వృక్షములందు గమనము చూచుట భ్రాంతియే. అచట, నావయందు గమన క్రియాదర్శనము, వృక్షములందు గమనాభావదర్శనము సమ్యగ్‌దర్శనము. అట్లే మనోవాక్కాయవ్యాపారము జరుగుచున్న సమయమున గూడ, ఆత్మనిష్క్రియముగానే ఉన్నది అను దర్శనము 'కర్మణి అకర్మ' దర్శనము, సమ్యగ్ దర్శనము, ఈ విధముగా తనకుగాని, ఇతరులకుగాని, ఉపయుక్తములగు కర్మలను ఆచరించు సమయములో ఆత్మస్వరూపజ్ఞానమును వీడరాదు. ఆత్మనిష్ఠుడగుచునే సత్కర్మలను ఆచరించవలయునని భగవానుని ఉపదేశము. కొందఱు వికర్మలు అనగా విశేషకర్మలు. అనగా నిష్కామకర్మలు; కర్మలు అనగా, ఫలాపేక్షతో ఆచరించు కర్మలు అని అభిప్రాయపడు చున్నారు. అప్పుడు వారు అకర్మలు అనగా, నిషిద్ధ కర్మలు అని వ్యాఖ్యానింతురు. పూర్వమునందు శఙ్కరాచార్యాభిమతముగా వ్యాఖ్యానము చేయబడినది. వారి వ్యాఖ్యానములో ఆత్మస్వరూప దర్శము, నిర్లిప్తత, కనిపించును. సాదకుడు కర్మయోగముచే ఆత్మజ్ఞాన స్థితిని చేరుకొనవలయునను లక్ష్యముకూడ నిర్దేశించుట కాననగును.
మతము
మతము అనగా, నిశ్చితాభిప్రాయము. ఒకవిధమైన విశ్వాసము. ఆహార, పానీయములు, గృహవసతి మానవులకు అవశ్యకములుగా తోచును. ఏ మతమును అవలబించకపోయినను మానవజీవితము సుఖముగా సాగుటకు వీలున్నది. మతముయొక్క ఆవశ్యకత యేమి? అని నేడు ప్రశ్నించువారు కలరు. పశుపక్ష్యాదుల కంటె బుద్ధివికాసముచే మానవులు ఉత్కృష్టులు అను విషయము సర్వసమ్మతము. బుద్ధివికాసముతో అధికసుఖములను అనుభవించు చున్నను. అనివార్యములైన దుఃఖములను, క్లేశములను గూడ, అనుభవించుట జరుగుచున్నది. లౌకికోపాయములచే కొంతవఱకు కష్టములను దాటగలిగినను, ఏదియోవిధముగా తిరిగి దుఃఖములను చవిచూచుచునే యున్నారు. మేధావులు ఆలోచించి, జీవితమునకు ఒక లక్ష్యమును, నిర్దేశించుకొని తగువిధముగా, జీవనపద్ధతులను, ఆచారములను దుఃఖములేని సుఖస్థితిని చేరుటకు సాధనములను నిర్దేశించుకొని మానస క్లేశములను నివారించుకొనుచున్నారు. వారి నిశ్చితాభిప్రాయములు, విశ్వాసము, మతముగా రూపొందినది. భారతదేశమునందు ప్రవర్తిల్లినమతము భగవన్మతు - వైదిక మతము; జీవకర్తృకము కాదు. సర్వజ్ఞుడగు భగవంతుడే సృష్ట్యాది యందు అపౌరుషేయ వేదముల ద్వారా జీవులు దుఃఖములేకుండా సుఖపడుటకు తమ నిశ్చితాభిప్రాయమును వివరించెను. అప్పుడపుడు కృష్ణాది అవతారదేహములను ధరించినపుడు గూడ ఆయా సమయములకు తగునట్లుగా నడచుకొనవలసిన తీరును, కొన్ని సిద్ధాన్తములను వేదానుగుణముగానే ఉపదేశించెను. భారత దేశవాసులు భగవద్వచనములనే ప్రమాణములుగా చేసికొని సంఘీభావముతోను, అధ్యాత్మసాధనతోను, ఆత్మగుణసంపదతోను సుఖముగా జీవించెడివారు. ఘర్షణపడువారు కారు. ఈ జన్మలో సాధన, పూర్తి కానిచో, పునర్జన్మయందు విశ్వాసము కలదు గనుక, రాబోవు జన్మలందు సాధనాభ్యాసమును పూర్తిచేసికొని తరింతుమని తలంచెడివారు. కనుక, భారతీయ మతము భగవన్మతము, వైదిక మతము అగుచున్నది.
వేదభాగములైన ఉపనిషత్తులందు 'బ్రహ్మ వా ఇద మగ్ర ఆసీత్', 'ఏకమేవాద్వితీయమ్', 'త్రివిధం బ్రహ్మఏతత్' అని
30]
కలదు, సృష్టికి పూర్వము బ్రహ్మవస్తువు ఒకటే ఉండెను. ఆ బ్రహ్మ ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అను మూడు విధములాయెను అని కలదు. బ్రహ్మ, సత్యజ్ఞానానన్ద లక్షణము. ఈశ్వరుడు జీవుడు చేతనులు. అందు ఈశ్వరుడు సర్వజ్ఞుడు. అసంసారి. జీవుడు సంసారి, అనగా సుఖదుఃఖ అనుభవము కలవాడు. జగత్తు జడము, భోగ్యసంపదను ఇచ్చునది. భోగ్యము కంటె భోక్తయగు జీవుడు స్వతంత్రుడు, ఉత్కృష్టుడు. జీవులు దేహాభిమానముచే దుఃఖమును, క్లేశములను అనుభవించుచున్నారు. ఈశ్వరుడు క్లేశములు లేనివాడు, జీవులను అను గ్రహించగల సామర్థ్యము గలవాడు. జీవుడు క్లేశములనుండి విముక్తుడగుటకు, ఈశ్వరారాధనచేసి క్లేశములను పోగొట్టుకొనుటయే గాక, పూర్ణానన్దస్వరూప మగు బ్రహ్మతో ఏకమగుచున్నాడు. కార్యము కారణాత్మకము గనుక, ఘటము మృదాత్మకమైనటుల, జగత్తు బ్రహ్మాత్మకము. జీవేశ్వరులు చేతనులే కనుక, పూర్ణచేతన బ్రహ్మాత్మకలు అగు చున్నారు. ఈవిధముగా జీవేశ్వరజగత్త్రయము, ఏక బ్రహ్మాత్మకము అని గ్రహించవలయును. శ్రీ శఙ్కరభగవత్పాదులు ఉపనిషదర్థమును వివరించి, బ్రహ్మాద్వైతమును అనగా, అద్వైత మతమును అనుసరించినచో, ముక్తిని బడయగలరు అని బోధించి అద్వైతమత స్థాపనాచార్యులైరి. ఉపనిషత్తులందే 'అయమాత్మా అపహతపాప్మా విజలో విమృత్యః విశోకః విజిఘిత్సః అపిపాసః సత్యకామః సత్యసఙ్కల్పః' సర్వజ్ఞః సర్వవిత్', 'యతో వా ఇమాని భూతాని జాయన్తే', 'యేన జాతాని జీవన్తి యత్ప్రయన్తి అఖిసంవిశన్తి' (ఈశ్వరుడు పాపము లేనివాడు అనగా, విశుద్ధుడు జరామరణములు లేనివాడు, శోకము లేనివాడు, ఆకలి దప్పులు లేనివాడు, సత్యకాముడు, సత్యసఙ్కల్పుడు, సర్వజ్ఞుడు. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణమైనవాడు.) అను మొదలైన ఈశ్వర శ్రుతులను ఆధారముగా జేసికొని, జీవేశ్వర తత్త్వభేదమును అంగీకరించుచు, జీవుడు భక్తిమార్గముచే ఈశ్వరానుగ్రహమును పొంది, వైకుంఠ, కైలాసాది లోకములకు పోయి ముక్తిని పొందుచున్నాడని శ్రీమత్ రామానుజ, మధ్యాచార్యులు ద్వైతమతమును ప్రవర్తింపజేసినాడు. వీరు మువ్వురు భారతదేశ మందలి అద్వైత. విశిష్టాద్వైత, ద్వైత మతత్రయమునకు ఆచార్యులు. వీరందఱును వేదములు, భగవద్గీత ప్రమాణములు; ఈశ్వరుని ఆరాధించవలెను; నిష్కామకర్మయోగ, భక్త, జ్ఞాన, సాధనములచే భగవత్‌సాక్షాత్కారముచే, మానవులు కృతార్థులగు చున్నారని అంగీకరించుచున్నారు. అయితే, విశష్టాద్వైత, ద్వైత మతములందు లోకాంతరమున ముక్తి కాగా, అద్వైతమతమున 'అత్ర బ్రహ్మసమశ్నుతే' అను శ్రుతి ననుసరించి, దేహాభిమాన మున జయించి, బ్రహ్మాత్మైక్యజ్ఞానమును సంపాదించుటచేత మనుష్యలోకమునందే, మనుష్య శరీరమునందే అజ్ఞాన నివృత్తి చేత బ్రహ్మస్వరూపస్థితి రూపమగు కైవల్యముక్తిని పొందగలుగు చున్నారు అని అంగీకరింపబడుచున్నది.
ప్రపంచమున, అనేక మతములు విస్తరిల్లినవి. విదేశీయులు ఇతర మతస్థులు గూడ, మనదేశమున, నివసించుచున్నారు. వారు తమ తమ మతాచార పద్ధతులనే అవలంబించుచు సుఖముగా జీవించుచున్నారు. మతమునకు అవశ్యకత, మానసి క్లేశనివారణ కొఱకు, ముక్తిసాధన అనుష్ఠానము కొఱకు అయిఉన్నది. ఆయా మతస్థులు ఏకీభావముతో వారి జీవిత లక్ష్యమును చేరుకొనుటకొఱకు మతము ఉపయోగపడుచున్నది. భారతదేశమునందు ద్వైత మతములలో గూడ, అనేక భేదములు గలవు, సంప్రదాయములు గలవు, శివ, విష్ణు, శక్తి, గణపతి, సూర్యాది ఉపాసనలు వారి వారి సంప్రదాయానుసారముగా చేయువారు కలరు. అద్వైత మతమునకు ఏద్వైతమత సంప్రదాయముతోను విరోధము లేదు. ఏ ఉపాసనచేతనైనను అద్వైతస్థితిని జ్ఞానముద్వారా సంపాదించ వచ్చును అని అద్వైత సిద్ధాన్తము. అద్వైతమతస్థాపనాచార్యులగు శ్రీ శఙ్కరభగవత్పాదులు గృహస్థులకు పంచాచతనపూజను ఏర్పరచి సాకారోపాసనలను గూడ, నిరాకార, నిర్గుణ, బ్రహ్మ తత్త్వమును చేరుటకు సోపానముగా అంగీకరించినారు.
వసుదైక కుటుంబకమ్
శ్లో|| అయం నిజః పరోవేతి గణనా లఘచేతసామ్ |
ఉదారచరితానాం తు వసుధైవ (క) కుటుంబకమ్ ||
'వీడు మనవాడు, వాడు పరాయివాడు' అని పరిగణించుట అల్పబుద్ధులకు (ఉండును). ఉదారవర్తనము, ఉదాత్త స్వభావము గలవారికి భూమియే (భూమిమీద నివిసించు వారందఱు) ఒకే కుటుంబమునకు సంబంధించిన వారు.
సాధారణము లోకమునందు తనవారికి సహాయము చేసికొనుచుందురు. తనవారు అనగా, భార్యా, పుత్రాదులు, బంధు మిత్రాదులు, పరిచితులు, తనకు ప్రేమాస్పదమైనవారు. పరులు, ఇతరులు మనతో, ఎట్టి సంబంధము లేనివారు. స్వార్థపరులు, తమ సుఖమును తమ మేలునే చూచుకొనెడివారు. వారికంటె కుటుంబము లోని సోదరులకు, బంధువులకు మిత్రులకు సహాయ మాచరించెడి వారు, వారి స్వార్థమును తగ్గించుకొని, తక్కినవారికి సహాయ పడుచున్నందువలన, సద్వర్తనము కలవారుగానే భావించవలెను. మహాత్ములు, ఉదారవర్తనులు, ఉదాత్తస్వభావము గలవారు భూమి మీద నివసించు జనులను అందరును ఒకే కుటుంబమునకు చెందినవారమని భావింతురు.
భాష, మతము, దేశము, బాంధవ్యము మొదలగువాటిని పురస్కరించుకొని, వానియందు అభిమానముతో తనవాడు అని, జనులు భావింతురు, వీరికి భిన్న ములగు దేశ, భాషా, మతములకు అభిమానము కలుగదు గనుక, వారిని పరులనుగా భావింతురు. ఒకప్పుడు ఈ దేశాభిమానాదులు మిక్కుటమై, ఇతరులమీద ద్వేషము కలుగుటగూడ, చూచుచున్నాము. అభిమానమువలన తనవారియందు దోషము కనిపించదు. ద్వేషమువలన ఇతరుల యందు గుణము కనిపించదు. మహానుభావులు ఉదారాశయములు కలవారగుటచే, వారు ఈ రాగద్వేషములకు అతీతులుగా ఉందురు. కుటుంబమనగా, తల్లి, తండ్రి, తాను, భార్య, పిల్లలు మొదలగు వారు. కుటుంబ యజమాని సమిష్టి బాధ్యత వహించి, కుటుంబ సభ్యులయొక్క యోగక్షేమమును విచారించుచుండెడివాడు. అట్లే, బహు కుటుంబములతో గ్రామ, నగరాది వ్యవస్థ ఏర్పడి,
సుఖముగా లోకయాత్ర సాగినది. ఇప్పుడు, విజ్ఞానము వృద్ధి అయినందున, అన్నిదేశములవారు తమ తమ సంపదను ఇచ్చిపుచ్చుకొనుచు, ఏక కుటుంబము వలె మెలగుటకు ప్రయత్నించుచున్నారు. 'వసుధైక కుటుంబకమ్' అను భావన ఆదర్శముగా ఏర్పరచుకొనివారు. భూమిమీద నివసించు జనులందఱు దేశ, కాల దూరము లను అధిగమించి, సన్నిహితులగుచున్నారు. ఈ సందర్భమున మనము ఒక విషయము గుర్తించుకొనవలయును. ఆయా దేశ వాసులయొక్క ప్రత్యేక లక్షణములను, సద్గుణ సంపదను కాపాడుకొనుచునే వైజ్ఞానికముగా, అందరితోను సామరస్య భావముతో, మిత్రభావముతో ఏక కుటుంబమునందువలె వ్యవహరించవచ్చును. మనదగ్గరలేని జ్ఞానసంపదను ఇతరులనుండి తీసికొనుటయు, మన సంపదను ఇతరులకందించుటయు అభివృద్ధికి ఆవశ్యకములు. మన పూర్వులు, భగవంతునిచే చేయబడిన సృష్టియందలి జనులందఱు భగవత్కుటుంబముగా భావించెడివారు. మన మందఱము, ఆ భగవంతుని కుటుంబములోనివారమే గనుక, పరస్పర శ్రేయస్సునకు ఒకరికొకరు తోడ్పడుట అభిలషణీయము. భారతభూమియందు భక్తులే కాక, సాధారణ జనులుగూడ, ఈ ఏక కుటుంబ భావనతోనే, సంఘర్షణలు లేక, సహనముతో ఒకరినొకరు తోడ్పడుచు సుఖముగా జీవించుచున్నారు. సర్వ ప్రాణి దేహములందు ఏకాత్మదర్శనము నేసి, మనము కృతకృత్యులము కావలయును అను ఉపనిషత్సిద్ధాంతము గూడ, ఈ 'వసుధైక కుంటుంబ' మను భావనను సమర్థించుచున్నది.
కాని, ఏవరో మహావైజ్ఞానికులు, భక్తులు, యోగులు ఆ స్థాయిని అందుకొనెదరు. సాధారణ జనులు దేహాభిమానము కలిగి, సుఖదుఃఖానుభవలక్షణమగు సంసార స్వభావమును అనుసరించు వారు. వీరికి ఆదర్శము వసుధైక కుటుంబము అయినను. ఆ స్థాయిని చేరుటకు మొదట నిష్కామకర్మాచరణము, భగవత్పరత, పరోపకార, భూతదయాది ఆత్మగుణాభ్యాసము ఆవశ్యకమగు చున్నది. కుటుంబములో సహపంక్తి భోజనాదులచే ప్రేమాతి శయము వర్ధిల్లునట్లు వసుధైక కుటుంబమున బాహ్య ఆహార విహారాదులచే సమానత్వము మాత్రము చేత, వసుధైక కుటుంబ వ్యవస్థ సిద్ధించదు. కనుక, రాగ, ద్వేష, ఈర్ష్యా, మత్సరాది దోషములను జయించుటకై ఆయా మతానుసారము, అధ్యాత్మ శిక్షణ గూడ, ప్రతి దినము సాధనలో చోటు చేసికొనవలసియున్నది.
విద్య, అవిద్య
'విద్య' అనగా జ్ఞానము. 'అవిద్య' అనగా అజ్ఞానము. జ్ఞానమునకు, అజ్ఞానమునకు మిక్కిలి భేదము కలదు. అజ్ఞానము అనర్థమునకు, దుఃఖములకు మూలము. జ్ఞానముచేత దుఃఖములను, కష్టములను వారించుకొనవచ్చును.
శ్లో|| సర్పాన్ కశాగ్రాణి యథోదపానం జ్ఞాత్వా మనుష్యాః
పరివర్జయన్తి|
అజ్ఞానతః తత్రః పతన్తి కేచిత్ జ్ఞానే ఫలం
పశ్య యథా విశిష్టమ్ ||
అని వ్యాసభగవానుడు మహాభారతమునందు (12-201-17) పలికెను. అజ్ఞానముచే (తెలియక) సర్పములకు, నూతులకు (బావులకు), కంటకములకు గురియై, దుఃఖమును అనుభవింతురు. తెలివిగల మానవులు తప్పుకొని, ఆ అనర్థమును వారించుకొందురు. ఇది లోకమునందు దృష్టము. భౌతిక విద్యలు గూడ, ఐహిక సుఖప్రదములైనవై రాణించుచున్నవి. విద్యలు గడించనివాడు, అభివృద్ధిని పొందలేకున్నాడు. ఈవిధముగా లౌకిక విద్యలు గూడ ప్రాధాన్యము సంతరించుకొనినవి, ఇక, అధ్యాత్మ విద్యకు శాస్త్రము నందు విశేష ప్రాధాన్యము కలదు. 'అధ్యాత్మవిద్యా విద్యానామ్' విద్యలలో అధ్యాత్మవిద్య ఈశ్వరవిభూతి, శ్రేష్ఠమైనది అని కృష్ణ భగవానుడు వర్ణించినాడు. లౌకిక విద్యలలో అన్ని విద్యలు అందఱు అభ్యసించలేరు. కాని, అందఱికి అధ్యాత్మవిద్య ఆవశ్యకమగుచున్నది.
'దూరమేతే విపరీతే విషూచీ' విద్యావిద్యలు భిన్న స్వరూపము, భిన్నఫలము కలలి. అవిద్యా లౌకిక, వైదికకర్మలు సంసార స్థితియందు ఉంచగా, అధ్యాత్మవిద్య, క్లేశములు లేని సుక స్థితిని (మోక్షమును) సాధించుటకు ఉపయోగపడుచున్నది.
అధ్యాత్మవిద్య అనగా, ఆత్మ విషయకము అగు జ్ఞానము. ఇది అందఱికి అవసరము. 'నేను' అని స్ఫురించునది ఆత్మ. ఈ ఆత్మను గుఱించియే ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, వివరించుటకు పూనుకొనినవి. ఈ ఆత్మ వస్తువు అందఱికి తెలిసినది అగును, పూర్తిగా తెలయనిది అగును. శాస్త్రమునందు ఆత్మ తత్త్వము (యథార్థ స్వరూపము) విచారించి, కేవల చిన్మాత్ర స్వరూపము 'మమ' 'నాది' అను- వ్యవహారమునకు లోనగుదేహేంద్రియ మనో, బుద్ధి, ప్రాణముల కంటెను, అహంకారము కంటెను భిన్న మైనదని నిరూపింపబడినది. అట్టి ఆత్మస్వరూప అనుభవజ్ఞానము కలవానికి శోక, మోహ, భయ, దుఃఖాది సాంసారిక క్లేశములు ఉండవు. జ్ఞాని, దేహాభిమానమును జయించి, స్వాస్థ్యమును పొందగలడు. ఈ విధముగా విద్య సుఖస్థితికిని, అవిద్య, సంసారస్థికిని కారణమగుచున్నవి. లౌకిక విద్యలు ఐహిక సుఖమునకును, వైదిక కర్మలు పరలోక సుఖమునకును కారణము లైనను, అవిద్యలోనివే అని అధ్యాత్మవిదుల అభిప్రాయము.
పుణ్యపాపములు
సాధారణముగా సత్కర్మలు (మంచి పనులు) అన్నియు పుణ్యములు, అసత్కర్మలు (చెడ్డ పనులు) పాపములు అని వ్యవహారము. 'సత్' అనగా ప్రశస్తమైనవి, యుక్తములైనవి. శాస్త్రమునందు అవిద్యాకామకర్మపరతంత్రుడు జీవుడు అని చెప్పబడియున్నది. అజ్ఞానముచేత కోరికలు కలుగును. ఆ కోరికల చేత కొన్ని పుణ్య కర్మలను, కొన్ని పాప కర్మలను ఆచరించును. వాటివలన మనుష్యాదిజన్మ లభించును. ఇచట, కర్మచేత పాప పుణ్య కర్మలు గ్రహింపబడినవి. కొన్ని కర్మలు శక్తిమంతము లైనవి. స్వర్గ, నరకాదులకు, పునర్జన్మకు గూడ కారణము లగుచున్నవి. ఇచట, పుణ్యకర్మలు అనగా, శాస్త్రవిహితములు, శాస్త్ర సమ్మతములు అగు కర్మలు. పాపకర్మ లనగా, శాస్త్రముచే నిషేధింపబడిన కర్మలు. హింస చేయరాదు. మద్య, మాంసము లను సేవించరాదు అనురీతిగా చెప్పబడినవి. నిషిద్ద కర్మలు ఆచరించినచో, అనర్థము సంప్రాస్తించును. ఆ అనర్థము, ఆ శరీరమునందే ప్రత్యక్షముగా అనుభవించకపోయినను, శాస్త్ర ప్రామాణ్యముచేత నిషిద్ధకర్మ లకాంతరమున గాని, జన్మాంతరమునగాని అనర్ధదాయకమే అగును. కనుక, నిషిద్ధ కర్మలను మానవలయును. అనగా, పాపము చేయరాదు.
ఇక, విహితకర్మలే పుణ్యములు, శాస్త్రమునందు అనేక కర్మలు విధింపబడి ఉన్నవి. కొన్ని, ఇప్పుడు ఆచరించుటకు సాధ్యములు కాకున్నవి. అయినను, యథాశక్తి, పుణ్యకర్మాచరణము మంచిది. పరోపకారము ఉత్తమ పుణ్యకర్మ. భగవత్ప్రార్థన, జప, ధ్యానాదులు యథావకాశము, యథాశక్తి అనుష్ఠేయములు. చివరకు నేను శాస్త్రమునందు చెప్పినరీతిగా, కర్మలను ఆచరించుటకు అశక్తుడనైతిని, క్షమించి అనుగ్రహించుడని భగవంతుని ప్రార్థించుటే శరణ్యము. ఈ అపరాధ క్షమాపణ భగవదనుగ్రహము కలుగజేసి, శుభములను ఇచ్చును.
'రక్షన్తి పుణ్యాని పురాకృతాని' మనము పూర్వజన్మలో చేసిన పుణ్యములు, అవసర సమయములందు బంధు, మిత్ర
31]
పరితితులు దగ్గర లేనప్పుడుకూడ, మానవులను కాపాడుచున్నవి. చేసిన పుణ్యము ఫలమును ఇచ్చితీరును. ధనము ఐహికముగా ఉపయోగపడినటుల, పుణ్యము పరలోక సుఖమునకు, పునర్జన్మకు, చిత్తము నిర్మలమగుటకు, చివరకు తత్త్వజ్ఞానమునకు గూడ ఉపయోగించును. అట్లే, పాపకర్మ ఫలము గూడ, మనము అనుభవించవలసియుండును. కనుక, తెలిసినంతవఱకు పాపకర్మ జోలికి పోరాదు. పూర్వము పాపభీతి ఉండుటచే, సమాజమునకు రక్షణ ఉండెడిది. పాపభీతి లేనపుడు, మన చట్టములు, లోక న్యాయములు అంతంతమాత్రముగానే ఫలము నిచ్చుచున్నవి. కనుక, ఈ పుణ్య, పాపములను గుఱించి మనము జాగ్రతగా తెలిసికొని మన క్షేమముకొఱకు, సమాజ క్షేమముకొఱకు గూడ, శక్త్యనుసారము పుణ్యకర్మలను ఆచరించుచుండవలయును. దీని వలన మనశ్శాంతి, ఈశ్వరానుగ్రహము కూడ లభించి, జీవితము సుఖమయముగా సాగును.
భగవత్ప్రప్తి (భగవంతుని చేరుట)
భగవత్ప్రాప్తి, మానవ జీవితలక్ష్యముగా పేర్కొనబడుచున్నది. జీవులందఱు 'యథా వహ్నేరివ విస్ఫులింగాః' వహ్ని నుండి మిణుగురులు (నిప్పురవ్వలు) బయలువెడలినట్లుగా సృష్టిలోనికి వచ్చి, పశు, పక్షి, మనుష్యాది శరీరములను గ్రహించు చున్నారు. పశు, పక్ష్యాది శరీరములలో ఆ జీవులకు పూర్వకర్మ అనుభవమే కాని, నూతన కర్మారంభమునకు స్వాతంత్ర్యము లేదు. మనుష్య శరీరము ప్రాప్తమైనపుడు బుద్ధివికాసముండుట వలన విచక్షణజ్ఞానము నుపయోగించి, మంచి పనులను చేయుటకు స్వాతంత్ర్యము కలదు. పుణ్యకార్యముల నొనరించ స్వర్గాది సుఖము ననుభవించవచ్చును. కాని, స్వర్గసుఖభోగముము చేత పుణ్యకర్మ క్షీణింపగా, మఱల మనుష్యలోకమునకు రావలసి ఉండును. (క్షీణ పుణ్య మర్త్యలోకం విశన్తి) పుణ్యకర్మలు చేయుచునే భగవద్భక్తిని, భక్తిసాధనములచే భగవదనుగ్రహమును పొంది, ఈ శరీరమును చాలించిన తరువాత మానవులు భగవంతుని లోకమునకు చేరుదురు. విష్ణుభక్తికలవారు వైకుంఠమునకు, శివభక్తికలవారు కైలాసమునకు, బ్రహ్మోపాసన చేసినవారు సత్యలోకమునకు వెళ్ళుదురు. ఒకే భగవంతుడు విష్ణు, శివ, బ్రహ్మ రూపములలో ఆయా లోకములయందు సేవింపబడుచున్నాడు. ఈ భగవల్లోకములకు వుళ్ళినవారు అచటనే సుఖముగా పునరావృత్తి లేకుండా (మనుష్యలోకమునకు వచ్చి, మనుష్య దేహముతో మఱల దుఃఖమును అనుభవించవలసిన అవసరము లేకుండా) నివసింతురు. స్వర్గసాధనము పుణ్యకర్మ, మోక్షసాధనము భక్తి అయి ఉన్నది. భగవత్ప్రాప్తియే మోక్షము. ఈ ముక్తి సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అని నాలుగు విధములు. 'సాలోక్య' మనగా భగవల్లోకవాసము. 'సారుప్య' మనగా పీతాంబర, చతుర్భుజ, శంఖ, చక్రాది భగవద్ధారణము. 'సామీప్యము' గరుడ, విష్వక్సేనాదులకు వలె సన్నిహితత్వము. 'సాయుజ్యము' సమానభోగైశ్వర్యము. ఈ నాలుగు ముక్తులను క్రమముక్తి అని వ్యవహరింతురు.
నిష్కామ కర్మయోగము, భగవద్భక్తి, భూతదయ, సంఘ సేవ మొదలగు సాధనములతో భక్తిని ప్రధానముగా జేసికొని భగవంతుని చేరగలము.
మతములలో వైవిధ్యము
భారతీయులకు ప్రధానముగా మూడు మతములు కలవు. ఇతర దేశములందు కారుణ్యము. సౌభ్రాత్రము ప్రధానముగా జేసికొని కొన్ని మతములు ప్రవర్తిల్లినవి. భారతదేశమునందు గూడ, చార్వాక, బౌద్ధ, జైన మతములు కలవు. ద్వైతము, విశిష్టా ద్వైతము, అద్వైతము లను మూడు మతములు వైదిక మతములు. వీరకి, వేదములు ముఖ్యప్రమాణము. భగవంతుడు పుణ్యకర్మలకు ఫలము నిచ్చును. ద్వైత, విశిష్టాద్వైత మతము లందు భక్తియే, మోక్షసాధనము. పుణ్యకర్మాచరణలో గూడ, కొంత భగవద్భక్తి ఉండును కాని, భగవంతుని చేరుటకు పరాభక్తి ఆవశ్యకము. భక్తులైన జీవులకు భగవంతునకు స్వామి భృత్య భావము సంబంధము. జీవులు పరంతంత్రులు, స్వామి, స్వతంత్రుడు. భగవత్సేవచేతనే, జీవులు తరించవలయును. విశిష్టాద్వైతము నందు భక్తి, ప్రపత్తి రెండు సాధనములు. 'ప్రవత్తి' అనగా శరణాగతి. జీవులు భగవంతునకు శరీరమువంటివారు. భక్తులకు, భగవంతునకు శరీర, శరీర భావము అనగా, సన్నిహితత్వము అంగీకరింతురు. స్థూల, సూక్ష్మ, చిత్, అచిత్ శరీర విశిష్ట శరీర పరమాత్మ ఒకడు. కనుక, ఈశ్వర ఏకత్వము, జీవనానాత్వము వీరు అంగీకరింతురు. వైకుంఠాది లోకముక్తయే, వీరికి పరమ ముక్తి. అనగా, భక్తి ప్రపత్తులతో ఆరాధింపబడిన భగవంతుడు ప్రసన్నుడై మోక్షమును ఇచ్చును.
ఇక, అద్వైత మతమునుగూర్చి వివరింపబడుచున్నది. వేద ప్రామాణ్యము, వ్యావహారికదశలో నిష్కామకర్మ, భక్తి సాధనములు అంగీకరింపబడుచున్నవి. కాని, జ్ఞానము ముఖ్యసాధనము. జ్ఞానమనగా, ఆత్మైకత్వజ్ఞానము. సృష్టికి పూర్వమునందున్న పరమాత్మయే, పిపీలికాది బ్రహ్మపర్యన్త, నిఖిల దేహోపాధులందు ప్రత్యగాత్మ రూపముగా ఉన్నాడు. ఆ యా దేహములందు అభిమానముతో వ్యవహరించుచున్న ప్రత్యగాత్మ రూపులగు జీవులు పరమాత్మస్వరూపులే అని వీరి సిద్ధాన్తము. కనుక, జీవులకు, పరమాత్మకు స్వరూప సంబంధము. అజ్ఞానముచే కోరికలు, పాప, కర్మలు, దేహాభిమాన, రాగద్వేషాదులతో జీవుడుగా వ్యవహరించు చున్నను, జ్ఞానముచే అజ్ఞానమును నివర్తింప జేసికొనినచో, దేహాభిమానాదులు, జీవత్వము గూడ, నివృత్తమై, పరిపూర్ణ సచ్చిదానంద పరమాత్మ స్వరూపస్థితిలో ఉండి, కృతార్థులు అగుచున్నారు. ఈ ఆనందస్వరూ పరమాత్మానుభవమే సాధింపవలసిన జీవిత లక్ష్యము. ఈ పరమాత్మ స్వరూపానందానుభూతి పొందవచ్చును. దీనిని కైవల్యముక్తి యందురు. భక్తి ప్రపత్తులతో వైకుంఠాది లోకములకు యేగినవారు కూడ, అచట ఆత్మ తత్త్వవిచారణ చేతను, భగవదనుగ్రహము చేతను ఈ ఏకాత్మ తత్త్వజ్ఞానమును బడసి, వారుగూడ కైవల్యముక్తిని పొందగలరు. మతవైవిధ్యములు ఈ లక్ష్యమును చేరుటకు అడ్డురావు. కర్మ, భక్తి సాధనములలోనున్న భేదముకూడ, జ్ఞానము ప్రాప్తమగుట తోడనే సమసిపోవును. కర్మభక్తులు లేకుండా మొదటనే, ఏకాత్మ జ్ఞానప్రాప్తి, సులభము కాదు. కనుక, వేదములు కర్మోపాసనా కాండులను ముందుగాచెప్పి,ఈ జ్ఞానకాండను తరువాత ప్రవర్తింప జేసినవి, అన్ని మతములవారు ఈ ఏకాత్మానుభూతికైప్రయత్నించి పరమానందమును అనుభవించుచు కృతార్థులు కావలయును.
ఆహార నియమమములు
శ్లో|| ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధిః |
సత్త్వశుద్ధౌ ధ్రువా స్మృతిః ||
ప్రతి ప్రాణికి శక్తిని సంపాదించుటకు ఆహారము ఆవశ్యక మైనది. ఈ ఆహారములు సాత్త్వికమలు, రాజసములు, తామసములు అని మూడు విధములుగా భగవద్గీతలో పేర్కొన బడినది. సత్త్వ, రజ, స్తమోగుణములలో సత్త్వగుణము ప్రశస్తమైనది. సత్త్వగుణము వలననే మనస్సు, రాగద్వేషాది దోషముల నుండి తేరుకొని, అధ్యాత్మసాధనకు ఉపయోగించును. శాకాహారము సత్త్వగుణమునకు అనుకూలము. శాకాహారమునందు ఉద్రేకము కలిగించు స్వభావము లేదు. మాంసాహారము శరీరమునకు బలము చేకూర్చినను, మనస్సుమీద దాని ప్రభావము ఉండుటచే అధ్యాత్మ సాధనకు అనుకూలము కాదు. కొందఱు మాంసాహారులు సాత్త్వికులుగా ఉన్నను, కొందఱు శాకాహారులు క్రోధపరవశులైనను, ఆహారమునందు గల భేదమును నిరాకరించుట యుక్తము కాదు. ఋషులు కందమూల, ఫలాదులయందు, సత్త్వగుణమును గ్రహించి అధ్యాత్మ సాధన చేసికొనిరి. మనస్సు, సాధనకు ప్రధానము గనుక, ఆ మనస్సునకు దోషము చేకూర్చునట్టి ఆహారమును స్వీకరించరాదు. మాంసాహారము, బుద్ధిమాంద్యమును గూడ కలిగించునని గ్రహించి, మేధావులు క్రమముగా మాంసాహారమును విడచి, శాకాహారులగుచున్నారు.
మానవసేవయే మాధవసేవ
'మా' అనగా లక్ష్మి. 'ధవుడు' అనగా పతి. మాధవుడు = శ్రియఃపతి, భగవంతుడు, మాధవసేవయనగా భగవత్సేవ అని అర్థము, భగవంతుడు మనకు కావలసిన ఆహారపానీయాదులను, నివసించుటకు భూమిని, వెలుతురు నిచ్చు సూర్య, చంద్రాదులను సృజించి ఇచ్చి ఉన్నాడు కనుక మానవులందఱు కృతజ్ఞతా సూచకముగా భగవంతుని, సేవించవలయును. జీవితకాలమున ఎదురగు, అనేక కష్టములను వారించుకొనుటకు, అభీష్టములను సాధించుకొనుటకు మాధవసేవ ఉపయోగపడుచున్నది. అయితే, ఆ భగవంతుడు మనకు కనబడుటలేదు గనుక, ఒక విగ్రహముతో, పటమునో పెట్టుకుని భగవంతుని పూజించుచున్నాము. ఆ విధముగా ఆచరించి గూడ. భగవదనుగ్రహము పొందుచున్నాము. ఇట్లు ప్రతిమాదులను సేవించుటయే గాక, మానవ శరీరములందు చేతన ప్రత్యగాత్మ -
శ్లో|| అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అని కృష్ణభగవానుడు చెప్పినట్లుగా, భగవద్విభూతి గనుక, జడ ప్రతిమను ఆరాధించుట కంటె, చేతన మానవులను సేవించుట మాధవసేవ అగును. ఇచట, మనుష్య శరీరములోని భగవంతుని సేవించుట అనగా, మనుష్యులకు ఆవశ్యకములగు ఆహారము, విద్య, వస్తు సంపద మొదలగు వానిని చేకూర్చి, సహాయపడుట అయి ఉన్నది. ఈ మానవసేవలో ప్రతిఫలాపేక్ష లేకపోవుట వలనను, తోటి మానవుల అభివృద్ధికి, శ్రేయస్సునకు ఉపయోగపడుచుండుట వలనను, యథాశక్తి, మానవసేవ భగవదనుగ్రహమునకు కారణమగును. అధ్యాత్మసాధనలో ఏకాత్మజ్ఞానమునకు గూడ, ఇది ఉపయోగించును. మానవులను సేవించునపుడు వారు సాక్షాత్తు భగవన్మూర్తులు అను శుద్ధభావముతోను. ఆత్మ ఒకడే గనుక, మన శరీరమునందున్న ఆత్మయే, ఆ మానవ శరీరములందు గూడ కలడను పరిశుద్ధ భావముతో సేవచేసినచో, విశేష ఫలప్రదము, మనము ఎవరికో ఉపకారము చేయుచున్నాము అను భావముకంటె ఈ సేవావకాశము, మనకు ఉపకరించుచున్నది అను భావమతో చేయు సాధన ఆధ్యాత్మిక ఉన్నతికి కారణమగును.
జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము
శ్లో|| అమానిత్యం అదంభిత్వ అహింసా క్షాన్తి రార్జనమ్ |
ఆచార్వోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినగ్రహః ||
ఇంద్రియార్థేషు వైరాగ్యం అహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనమ్ |
అసక్తిః అనభిష్వంగః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు ||
మయి చ అనన్యయోగేన భక్తిః అవ్యభిచారిణీ |
వివిక్తదేశ##సేవిత్వం అరతిః జనసంసది
అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతత్ జ్ఞానమితి ప్రోక్తమ్, అజ్ఞానం య దతో7న్యథా |
భగవద్గీత 13 అ. 7-11 శ్లో.
భగవద్గీతలో పదమూడవ అధ్యాయమున, ఏడవ శ్లోకము మొదలుకొని, పదకొండవ శ్లోకమువఱకు జ్ఞాన, అజ్ఞానములు వివరింపబడినవి. ఇచట జ్ఞానము అనగా జీవేశ్వరఏకత్వ జ్ఞానము అని అర్థము. 1. అనూనిత్వమ్ - నేను గొప్పవాడను అను భావము (ఆత్మశ్లాఘ) లేకుండుట, 2. అదంభిత్వమ్ - దంభము లేకుండుట, 3. అహింసా - ఇతరులను భాదించకుండుట, 4. క్షాన్తిః- ఓరిమి, 5. ఆర్జవమ్ - మనోవాక్కాయములందు ఏకరూపముగా నుండుట, 6. ఆచార్యోపాసనమ్ - మోక్షసాధనోపదేశము చేయు గురువుయొక్క శుశ్రూష, 7. శౌచమ్ - శరర మనో మాలిన్యము లను తొలిగించుకొనుట, 8. స్ధైర్యమ్ - మోక్షమార్గమునందు అంకిత మగుట, 9. ఆత్మవినిగ్రహః - శరీరేంద్రియ మనస్సులను (దేహేంద్రియ సంఘాతమును) సన్మార్గమునందే ప్రవర్తించుటకు నిరోధించుట, 10, దృష్టాదృష్ట భోగ విషయములందు వైరాగ్యము, 11. అహంకారము లేకపోవుట, 12. జన్మ, మరణ, జరా, వ్యాధి దుఃఖదోషములను పరిశీలనజేయుట, 13. అసంగ భావము, 14. పుత్ర, దార, గృహాదులందు తాదాత్మభావము లేకుండుట, 15. ఇష్టానిష్టప్రాప్తియందు చిత్తము ఏకరూపముగా నుండుట, 16. భగవంతునియందు అనన్యభక్తి, 17. విజన ప్రదేశమునందు ఏకాంతముగా నివసించుట. 18. జనసమూహములో జొరబడుటకు ప్రీతి లేకుండుట, 19, నిత్యము, ఆత్మజ్ఞానమునకై విచారించుట, 20. తత్త్వజ్ఞానమునకు ఫలము మోక్షము అని దర్శించుట. ఇవి ఆత్మజ్ఞాన సాధనమునలు. జ్ఞానము అను పేరుతో పేర్కొనబడినవి. ఇందుకు భిన్నమైనవి అజ్ఞానము అని పేర్కొనబడును. అనగా, ఆత్మశ్లాఘనము (తన్ను పొగుడుకొనుట) దుంభము, హింస, కుటిలిత మొదలగునవి అజ్ఞానకార్యములగుటచే అజ్ఞానముగా పేర్కొనబడిన సాధనములవలన, అహంకార వినిర్ముక్తి జీవేశ్వర ఏకాత్మ అనుభవజ్ఞానము కలుగును. అజ్ఞానముగా పేర్కొనబడినవి ఆత్మ జ్ఞానమునకు ప్రతిబంధకములు.
జ్ఞాన, విజ్ఞానములకు భేదము వివరింపబడుచున్నది. ఇచట జ్ఞానము, శాస్త్రార్థ పరోక్ష (పదార్థ) జ్ఞానము. విజ్ఞాన మనగా. ఆ శాస్త్రజ్ఞానమును అనుభవములోనికి తెచ్చుకొనుట.
'అహం అజ్ఞః, అహం న జానామి' నేను అజ్ఞానిని అను అనుభవమునకు గోచరమగునది అజ్ఞానము. ఇది ప్రతిజీవునకు, అనాదిగా పుట్టుకతో గూడ వచ్చునది. అనిర్వచనీయ భావ
32]
పదార్థము. కామ, క్రోధ, లోభ, ఈర్ష్యా, అసూయాది దోషములకు మూలకారణము. అజ్ఞానమునకు ఆవరణశక్తి, విక్షేపశక్తి అను రెండు శక్తులు కలవు. ఉన్న వస్తువును ఆవరించి, కనపడకుండా చేయునది ఆవరణశక్తి. లేని వస్తువును సృజించునది విక్షేపశక్తి. ఆవరణశక్తిగూడ రెండు విధములు. 'న అస్తి'-లేదు అని ప్రతీతికి కారణమగు శక్తి, అసదావరణశక్తి. 'బ్రహ్మ లేదు' అను ప్రతీతిన ఈ అసదావరణశక్తి కలిగించును. 'బ్రహ్మ కనబడుట లేదు' అను ప్రతీతిని అభానావరణశక్తి కలిగించును. శాస్త్రము చేత పరోక్ష బ్రహ్మజ్ఞానము కలిగి 'బ్రహ్మ నాస్తి' అను అసదావరణమును పోగొట్టును. బ్రహ్మాత్మ అపరోక్ష అనుభవము కలిగిననే గాని, అభానావరణము నివర్తించదు. కనుక, మొదటి అసదావరణ రూపమగు అజ్ఞానముయొక్క నివృత్తికై శాస్త్రజ్ఞానము ఉపయోగించును. విజ్ఞానము చేత అభానావరణము (బ్రహ్మ కనబడుటలేదు అను భావము) తొలగి, బ్రహ్మానందము అనుభవించి కృతార్థుడగును.
ధ్యానము, ప్రార్ధన
మనము మనస్సుతోనే అనేక విషయమలను గ్రహించి వ్యవహరించుచుందుము. చక్షురాది ఇంద్రియముల ద్వారా బాహ్య విషయములు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు) మనస్సులో ప్రవేశించి, మనస్సును మలిను చేయును. బాహ్య విషయాకార వృత్తులు మనస్సులో సంస్కార రూపముగా నిలిచి పోవును, ఈ విషయావాసనలే ఉద్బుద్ధములై మనస్సునకు బాహ్యవిషయములందు ప్రవృత్తికి కారణమగును. ఈ మనస్సును శుద్ధము జేసికొనుటకై ధ్యానము ఆవశ్యకమగుచున్నది. ధ్యానమనగా విజాతీయ ప్రత్యయానన్తరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహము. అనగా, తైలధార అవిచ్ఛిన్న బిందుపరంపర అయినట్లుగా, భగవదాకార చిత్తవృత్తిప్రవాహము, మఱియొక విషయము, మధ్యలో స్పురణకు రాకుండా చేసినచో, అది భగవత్ ధ్యానము అగును. ఆత్మాకార చిత్తవృత్తి ప్రవాహమైనచో ఆత్మధ్యాన మగును. ప్రతిదినము ఈ ధ్యానమువలన, మనస్సు ప్రసన్నమగును. సత్త్వగుణము వృద్ధిజెంది, సద్విషయములను ఆలోచించుటకు బలము మనస్సునకు చేకూరును. భగవంతుని గుణగణాదులతో ధ్యానించుటవలన, మనకు ఆ సద్గుణములు అలవాటుపడును. కామ, క్రోధ, లోభ, ఈర్ష్యా, అసూయాది చిత్తదోషములు నశించును. మైత్రీ, కరుణాది సద్గుణములు అలవడును. మనస్సునకు, కొంత విశ్రాంతి ఇచ్చినట్లైనది గనుక, తరువాత పనులను చక్కగా నుసుకొనుటకు వీలుండును. భక్తులు నిరంతరము భగవదాకారవృత్తి ప్రవాహమును అభ్యసించి, భగవత్సాక్షాత్కారమును పొందెదరు. యోగులు, పరమాత్మ సాక్షాత్కారమును పొందుదురు. ఈ ధ్యానాభ్యాసానంతరము మనోవృత్తినిరోధస్థితి లభించి, ఆత్మస్వరూపావస్థానమగు మహాఫలము లభించును. కాయిక, వాచికములగు పూజా, జపములకంటె, ఈధ్యానము ఎక్కువ ప్రభావము కలది. ధ్యానము వలన శాంతి, సుఖములు లభించి, పురుషార్థములను సాధించగలడు. కనుక, సర్వవ్యవహారములకు మూలమగు మనస్సును వశము చేసికొనుటకు, సన్మార్గములో ప్రవర్తింపజేసికొనుటకు ధ్యానము ఆవశ్యము.
'తత్‌క్రతు' న్యాయముచే. మనస్సంకల్పానుసారముచే మానవుడు పరిణతి నొందును గనుక, నిరంతర సద్భావనచే ఉత్తమ పురుషుడుగా రూపొందగలడు.
ధ్యానము కంటె, ప్రార్థన సులభ##మైనది. భగవంతునిస్తుతించి తమకు కావలసిన సంపదను, ధన, కనక, వస్తు, వాహనాదులను, ధైర్య, స్థైర్య, విజయ, ఆరోగ్యాదులను మానవులు కోరుకొనుచున్నాను. అట్లే, ఆపన్నివారణమును, కీర్తిని, చతుర్విధపురుషార్థములను కోరుకొనుచున్నారు. మానవులు చేయు భగవారాధనను అనుసరించి, వారికోరికలు కొన్ని సఫలమగుచున్నవి. 'ప్రకర్షేణ అర్థనా ప్రార్థనా' అధికముగా యాచించుట, కోరుట ప్రార్థనాశబ్దార్థము. ఈ ప్రార్థనను ఎప్పుడో, ఆపద వచ్చినపుడు గాని, కార్యావసరమునందు గాని, చేయుటకాక, ప్రతిదినము కొంతకాలము భగవత్ ప్రార్థనకు ఏర్పరచుకొనుట మంచిది. పేరుకు ప్రార్థన అని ఉన్నను, ఏ ఫలమును కోరకుండ భగవంతుని స్మరించుట, కీర్తించుట గూడ, ప్రార్థన క్రిందకు వచ్చును. ఇది ఉత్తమమైన ప్రార్థన. సర్వజ్ఞుడగు భగవంతుడు, మనము చేయు కర్మలకు ఫలములను ఇచ్చుచునే యుండును. భక్తుల కోరికను తీర్చుట భగవదనుగ్రహముగా భావింపవలెను. ప్రతిదినము చేయు భగవత్ర్పార్థన వలన, మనస్సులోని దోషములు క్రమముగా నశించి, ఆధ్యాత్మిక సాధనకు బలము చేకూరును. ఈ పార్థనాభ్యాసము వలన భగవంతుడు హృదయములో నిలిచి, దురితమును పోగొట్టి, శక్తిని, బలమును ప్రసాదించి, సన్మార్గదర్శకుడగును. భగవత్ర్పార్థన చేయువారు సత్త్వగుణ సంపన్నులై దైవీ సంపదతో విరాజిల్లుదురు. ఆసురస్వభావము, రాక్షస స్వభావము దూరముగా తొలగిపోవును; సద్భుద్ధిచే శుభములను బడయును.
ఆత్మ, జీవాత్మ, పరమాత్మ
శ్లో|| యచ్చ ఆప్నోతి యదాదత్తేయచ్చ అత్తివిషయానిహ|
యచ్చాస్య సన్తతో భావః తస్మాత్ ఆత్మేతి గీయతే ||
''ఆప్నోతి ఇతి ఆత్మా| ఆదత్తే ఇతి ఆత్మా! అత్తి ఇతి ఆత్మా| అతతి ఇతి ఆత్మా| సతా సౌమ్య సదా సంపన్నో భవతి|''
సుషుప్తిసమయమున, జీవుడు దేహేంద్రియాభిమానమును వీడి, పరమాత్మతో ఏక మగుచున్నాడు. పరమాత్మను పొందుచున్నాడు గనుక, 'ఆత్మ' అని పిలువబడుచున్నాడు.
'యత్ ఆదత్తే' స్వప్న సమయమున జాగ్రత్ విషయేంద్రియ అపేక్ష లేకుండగానే జాగ్రదనుభవ సంస్కారములను తీసికొని, స్వప్న ప్రపంచమును అనుభవించుచున్నాడు గనుక, 'ఆదత్తే ఇతి ఆత్మా' 'స్వప్నద్రష్ట ఆత్మ' అని చెప్పబడుచున్నాడు.
'యచ్చాత్తి విషయా నిహ' జాగ్రత్ర్పపంచమున శరీరేంద్రియములతో విషయభోగములను అనుభవించుచున్నాడు. గనుక, ఆత్మ అని చెప్పబడుచున్నాడు. (ఆత్తిభుఙ్త్కే భోగాన్)|
'అతతి ఇతి అత్మా' 'అత సాతత్యగమనే' అని ధాతువు. సుషుప్తి, స్వప్న, జాగ్రత్ అవస్థాత్రయమునందు అనుస్యూతముగా నుండువాడు గనుక, 'ఆత్మా' అని చెప్పబడుచున్నాడు.
ఇంతవఱకు, 1. ఆప్లువ్యాప్తౌ, 2. ఆఙ్‌పూర్వాత్ డుదాఙ్‌దానే, 3. అద భక్షణ, 4. అత సాతత్యగమనే అను నాలుగు ధాతువుల నుండి మనిన్ ప్రత్యయము చేరగా నిష్పన్నమైన 'ఆత్మ' శబ్దమునకు అర్థము వివరింపబడినది. ఈ ఆత్మ, చేతనుడు. అవస్థాత్రయమునందు విశ్వ, తైజస, ప్రాజ్ఞరూపముగా నుండి అవస్థాత్రయసాక్షిగా అనుస్యూతముగా నున్నవాడు 'ఆత్మ' శబ్దార్థముగా వర్ణింపబడినాడు.
ఇంతవఱకు జీవ, జీవసాక్షిరూపముగా ఆత్మ, వర్ణింపబడినాడు, ఇదిగాక, 'ఆప్నోతి' సర్వవ్యాపకుడు అను అర్థముతో పరమాత్మ 'ఆత్మ' శబ్దార్థము అయి ఉన్నాడు. ఉపనిషత్సిద్ధాన్తమున, ఆత్మైకత్వము, ఆత్మవస్తువు ఒకటే అని ప్రతిపాదింపబడినను, వ్యవహారకాలమన, అనగా లోకవ్యవహార, వైదికకర్మ, దేవతోపాసన పర్యస్తము 'జీవాత్మ' అనియు, 'పరమాత్మ' అనియు వ్యవస్థను అంగీకరించి సాధనోపదేశము చేయబడినది.
ఆత్మ, చైతన్యస్వరూపుడు ; అంతః కరణతాదాత్మ్యభావముతో, (జీవుడు) 'జీవాత్మ' అని వ్యవహరింపబడుచున్నాడు. జీవాత్మ, దేహేంద్రియాదులందు అభిమానము కలవాడై సంసారిగా వ్యవహరించుచున్నాడు. దేహేంద్రియ, ప్రాణములకంటె, తాను వేఱని తెలిసియు, అంతఃకరణమునందు గల, రాగ ద్వేష, సుఖ, దుఃఖాదులకు వశుడై, 'నేను' అను అహంకారస్వరూపమే ఆత్మ స్వరూపముగా భావించి, సర్వవ్యవహారములను చేయుచున్నాడు. జీవునకు స్థూలదేహము (మనుష్యాది శరీరము), సూక్ష్మదేహము (అనగా పంచప్రాణ, పంచ కర్మేంద్రియ, పంచ జ్ఞానేంద్రియ మనోబుద్ధి సప్తదశకము-లిఙ్గశరీరము). ఈ సూక్ష్మ (లిఙ్గ) శరీరము కల్పాదియందు లభించినదే, కల్పాంతము వఱకు అనువర్తించుచున్నది. స్థూల శరీరు కర్మాధీనముగా ప్రాప్తమై, సుమారు నూరేళ్ళపర్యన్తము ఉపయోంపడుచుండును. స్థూల శరీరముకంటె సూక్ష్మ శరీరము శక్తిమంతమైనది, ప్రజ్ఞావైభవము కలది, సుకృత, దుష్కృత సుఖదుఃఖభోగాదులన్నిటికి ఆలవాలమైనది, మనము చేయు సుకృత, దుష్కృతములు ఈ సూక్ష్మ శరీరములోనే సంస్కారరూపముగా నుండి, స్థూల శరీరములకు కారణములగుచుండును. కోరికలు ఈ సూక్ష్మ శరీరములోనే (అంతఃకరణములోనే) ఉద్భవించి, సుకృత, దుష్కృత కర్మలను చేయించుచుండును. కోరికలు ఉదయించట అజ్ఞానమువలన జరుగుచున్నది, ఆత్మజ్ఞానికి, అజ్ఞానము నశించును గనుక, కోరికలు ఉండవు, కర్మపరతంత్రుడు కాడు. జీవులందఱు సహజముగా (అనాదిగా) అవిద్యా (అజ్ఞాన) కామ, కర్మపరతంత్రులై క్లేశములను అను భవించుచున్నారు. జీవులు. క్లేశములనుండి విముక్తి కొఱకై పరమాత్మను ఈశ్వరుని ఆరాధించి, ఆ ఈశ్వరానుగ్రహముతో జ్ఞానమును సంపాదించి, అవిద్యా, కామ, కర్మబంధమునుండి విముక్తులై సుఖమును పొందగలుగుచున్నారు.
పరమాత్మ - ఈశ్వరుడు అజ్ఞాత అవరణము కలవాడు కాడు. సర్వజ్ఞుడు. కోరికలు ఉండవు. తనకు ఇది కావలయును, ఇది లేదు, అను భావము ఈశ్వరునకు ఉండదు. పాపుణ్యకర్మలు జీవునకేకాని ఈశ్వరునకు లేవు. కనుక ఈశ్వరుడు జీవునికంటె విలక్షణమైనవాడు.
''అయమాత్మా అపహతపాప్మా విజరో విమృత్యుః విశోకః విజిఘిత్సః అపిపాసః
సత్యకామః సత్యసఙ్కల్పః సర్వజ్ఞఃసర్వశక్తి''
ఈశ్వరుడు పావసంబంధము లేనివాడు, విశుద్ధుడు, జరామరణములు లేనివాడు, శోకము లేనివాడు, ఆకలి, దప్పికలు లేనివాడు, సత్యకాముడు, సతద్యసఙ్కల్పుడు. సర్వజ్ఞుడు, సర్వశక్తిసమన్వితుడు. జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములందును, నిగ్రహానుగ్రహములందును అధికారము కలవాడు. జీవులు, జగత్తు, ఆయనచే నియమింపబడును. ఈవిధముగా పరమాత్మ (ఈశ్వరుడు), జీవ జగద్వ్యవహారమును నడుపుచున్నాడు. స్థావర జఙ్గమసృష్టి, సమష్టి జీవుడగు హిరణ్యగర్భుడు, అపఞ్చీకృత, వఞ్చమహాభూత శరీరాభిమాని, పఞ్చీకృత పఞ్చమహాభూత బ్రహ్మాండశరీరాభిమానియగు సమష్టి విరాట్ జీవుడు, వ్యష్టి జీవులగు మనము (మనుష్యపశు, పక్ష్యాదులు), ఈ జీవులతు భోగ్యమైన లోకములు ప్రపఞ్చము ఆ ఈశ్వరుని వలననే ఏర్పుడుచున్నవి. జడమగు భోగ్యప్రపఞ్చము, కొంతకాలము జీవులకు భోగమునిచ్చి లయము చెందును. జీవులు చేతనాత్మరూపులగుటచే, వారి స్థూల, సూక్ష్మ రూపదేహములే పుట్టుచున్నవి, ఆ స్థూల, సూక్ష్మరూప దేహములే లయము చెందుచున్నవి. ఆ దేహముల యొక్క ఉత్పత్తి లయములను జీవాత్మయందు వ్యవహరించుచున్నారు. (జీవ శరీరము పుట్టగా, జీవుడు పుట్టుచున్నాడని వ్యవహరించుచున్నారు.) దేహాదులయొక్క పుట్టుకతో, జీవుల పుట్టుక, దేహముల నాశము (మరణము)తో, జీవుల నాశము వ్యవహరింపబడుచున్నది. దేహాభిమానమచేతనే జీవాత్మ సంసార బంధములో చిక్కికొని ఉన్నాడు. ఈ జీవాత్మ సుకృతముచేతను, ఈశ్వర భక్తిచేతను, తత్తవజ్ఞానము చేతను దేహాభిమానమును జయించి, ఈశ్వరునకు సన్ని హితుడగును, ఈశ్వ రభావము పొందగలుగును, అనాది సిద్ధమగు అజ్ఞానముచే కలిగిన జీవభావమును గూడ, జ్ఞానబలముచేత త్రోసిపుచ్చి, అజ్ఞానజనిత ఉపాధులను విడనాడు, ఏకాత్మభావముతో, ఆనందస్వరూపముతో విరాజిల్లును.
ఇచట, జీవాత్మ వేఱు, పరమాత్మ వేఱు, వారిరువురికి సంసారిత్వ, అసంసారిత్వ స్వభావమచే స్వరూపభేదమే కలదు. జీవతత్త్వము వేఱు, ఈశ్వరతత్త్వము వేఱు, జీవుడు అణువు, ఈశ్వరుడు విభువు ; జీవుడు కిఞ్చిజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు; ఈవిధముగా భేదము కలదు గనుక, ఈశ్వరోపాసనచే జీవాత్మలు, సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యుములనెడి చతుర్విధముక్తులను పొందగలుగుచున్నారు అని అభిప్రాయపడుచున్నారు. ఉపనిషత్తులందు 'ఆత్మైవేద మగ్ర ఆసీత్' ఆత్మవస్తువు ఒక్కటే మొదట ఉండెను. 'అయమాత్మా అజరః అమరః అమృతః''అయమాత్మా అపహతపాప్మా' ఈ విధముగా ' ఆత్మ' అను శబ్దము ఏకవచనాంతము తత్త్వబోధకముగా ప్రయుక్తమైనది. 'అయమాత్మా బ్రహ్మ' అని ఆత్మయే బ్రహ్మగా మాండూక్యమున పేర్కొనబడినది. బృహదారణ్యకమున 'యత్సాక్షాదపరోక్షాత్ బ్రహ్మ, యో7యమాత్మా అజరో అమరో7మృతః | ' అని ఆత్మవస్తువు జరామరణరహితము, సాక్షాత్ బ్రహ్మవస్తువు అని పేర్కొన బడినది. 'త్రివిధం బ్రహ్మమేతత్' జీవేశ్వరజగత్త్రయము బ్రహ్మ నుండియే, ఆవిర్భూతమైనది అని చెప్పబడినందున ఏకాత్మ తత్త్వమే ఉపనిషదారూఢము అగుటచే, ఏకాత్మ దర్శన పర్యన్తము 'ఆత్మావారే ద్రష్టవ్యః' అను శ్రుతి ప్రకారము సాధకుడు ప్రయత్నించవలెను. వ్యవహార దశయందు, లౌలిక, వైదిక కర్మ ఉపాసనా జ్ఞాన సాధనానుష్ఠానము కొఱకు, ఉపాధికృతముగా జీవాత్మ, పరమాత్మ విభాగము శ్రుతియందు అంగీకరింపబడుచున్నదే గాని, ఆత్మ నానాత్వము (అనేకత్వము) అంగీకరింపబడలేదు. కనుక, సృష్టికి పూర్వమునందు 'ఆత్మ' అను శబ్దముతో పిలువబడిన తత్త్వమే జీవాత్మగాను, పరమాత్మగాను విభక్తమై జీవేశ్వర వ్యవహారమునకు మూలమైనను, జ్ఞానముచే అవిద్యో పాధులు నివృత్తమైనపుడు ఏకాత్మానుభవము పరిపూర్ణ అత్మ స్వరూపానుభవము కలుగుటకు ప్రతిబంధకము ఏమియు లేదు. ఆత్మ భేదవాదులు, వైకుంఠ, కైలాసాది లోకములలో లోకాధిపతి వలన ఏకాత్మ జ్ఞానమును బడసి, 'దదామి బుద్ధియోగం తమ్' అను గీతావచనానుసారముగా వారుగూడ, ఏకాత్మ దర్శనముచే కైవల్య ముక్తిని పొందగలుగుచున్నారు.
33]
జన్మమృత్యువులు, సంసారచక్రభ్రమణము
జీవులకు వారు చేసిన, పాపపుణ్యకర్మలవలన జన్మ, (అనగా మనుష్యాది శరీరములు) ప్రాప్తించును. 'జాతస్య హిధ్రువో మృత్యుః' పుట్టినవాడు మరణముచెందక తప్పదు. 'ధ్రువం జన్మ మృతస్య చ' చనిపోయినవారు చేసిన పుణ్యఫలమును స్వర్గాదులందును, పాపఫలమును నరకాదులందును అనుభవించి, 'తతః శేషేణ' సంచితకర్మలో జన్మనిచ్చుటకు ఉద్బుద్ధమైన శేషకర్మతచేత తిరిగి మనుష్య లోకములో (మర్త్య) జన్మించుట జరుగును. ఈ జీవుడు చేసిన కర్మలు, అనేక జన్మలలో చేసినవి నిలువ ఉండుటచే సంచితములు అనబడును. ఈ సంచిత కర్మలోనుంచియే, ఏకర్మ మరణానంతరము తిరిగి జన్మను ఇచ్పునో, ఆ జన్మాంరంభకమగుటచే 'ప్రారబ్ధకర్మ' యని వ్యవహరింపబడును. 'అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్' మనము చేసిన పాపపుణ్య కర్మలకు ఫలము అనుభవించక తప్పదు. ఆ కర్మలు అనేక జన్మార్జితములు, అనంతములుగా నున్నవి. కనుక ఆ కర్మలవలన ఇహలోకములో జన్మను గ్రహించుట, మరణముచెందుట, తరువాత పరలోకములకేగుట, మఱల 'క్షీణ పుణ్య మర్త్యలోకం విశన్తి' తిరిగి మనుష్యలోకములో జన్మనెత్తుట, ఇట్లు అనవరతము (ఎడతెగకుండా), ఇహలోక పరలోకములకు యాతాయాతములను (గమనాగమనములను) సలుపుచు, జనన, మరణములను ఒకదానివెంట నొకటి అనుభవించుచు, సంసారచక్రభ్రమణమును జీవుడు అనుభవించును.
శ్లో || కసై#్యకాంతం సుఖ ముపనతం దుఃఖమేకాంతతోవా |
నీచైర్గచ్ఛ త్యుపరి చ దశా చక్రనేమిక్రమేణ ||
అను రీతిగా, కేవలము సుఖమునే అనుభవించుచున్న వారు లేదా కేవలము దుఃఖమునే అనుభవించుచున్నవారు - అట్టివారు లేరు. సుఖము తరువాత దుఃఖము, దుఃఖము తరువాత సుఖమును వరుసగా బండిచక్రపు ఆకులు, పైవి క్రిందికి, క్రిందివి పైకి వచ్చినట్లుగా, దశా (అవస్థా) భేదముచే అనుభవించనట్లుగా ఈ జన్మ, మరణ పరంపరను కూడా, జీవులు అనుభవించుచు, ఇహలోక పరలోకములకు యాతాయాతములను సలుపుచుందురు. ఈ కర్మ వశముచే కలుగు భ్రమణము ఆగిపోవలయునన్న, ఈశ్వరభక్తి, ఆత్మజ్ఞానములచే 'జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురుతే' అను గీతావచనానుసారము సంచితకర్మ నాశమొనర్చుకొని, 'ప్రారబ్ధం భోగతో నశ్యేత్' ప్రారబ్దకర్మ భోగమును అనుభవించి, ఈశ్వర సన్నిధాన బ్రహ్మాత్మ అనుభవముతో జన్మ రాహిత్యమును ముక్తిని బడసి, మానవుడు కృతార్ధుడు కావలెను.
సంఘము
కుంటుంబ వ్యవస్థ సంఘమునకు మూలాధారము. కొన్ని కుటుంబములు ఒకచోట నివసించగా గ్రామములు, పురములు, నగరములు క్రమముగా ఏర్పడినవి. మానవుడు సంఘజీవి. సంఘములో నివసించుచున్నాడు కనుక, తనకు శక్తికొలది సంఘముయొక్క అభివృద్ధికి పాటుపడవలయును. సంఘసేవ చేయవలెను. మాతాపితురులను, బంధువులను ఆదుకొనినట్లుగానే, తోటిమానవులకు చేతనైన ఉపకారము ధనాదులచే కాని, విద్య ఉపకరణాదులచే గాని. ఉపచారములచే గాని, చేసినచో తన ధర్మమును పాటించినవాడగును. మానవులందరు విరాట్పురుషుని అంశలు గనుక, ఇది విరాడుపాసన అగును. భగవంతుడు, సంఘసేవకు మెచ్చి శుభఫలమును ఒసంగును. కలియుగమున సంఘము శక్తివంతమైనది గనుక, సంఘమునందు ఈశ్వరశక్తిని దర్శించ వలెను. సంఘసేవాపరాయణులు నిస్స్వార్థముగా తాము చేయు సేవచేత, ఈశ్వరునే ఆరాధించుచున్నారు. ఆ విధముగా తమ యందు దివ్యశక్తిని ఉద్బుద్ధమొనర్చుకొని, తాము శ్రేయస్సును పొందువారు అగుచున్నారు.
మనము సంఘమును సేవించినచో, సంఘము మనలను రక్షించును. మనము సంఘములో చేరుటచే, కొన్ని సౌకర్యములను, లాభములను అనుభవించుచున్నాము. సంఘు అనేక విధములుగా మనకు తెలియకుండా, మనలను కాపాడుచున్నది. సంఘముయడల మనకు, బాధ్యతగూడా కలదు. కనుక, మన విద్యుక్తధర్మమునే పాటించుచున్నాము. సంఘీభావమున శక్తి అధికరమగును. ధర్మాచరణలో గూడా, ఒకరికొకరు తోడ్పడవచ్చును. ఐహిక, అముష్మిక ప్రయోజనములు సంఘీభావముతోనే సాధించు కొనుచున్నాము. యోగముక్తి సాధనకు ఏకాంతవాసము చెప్పసడినది కాని, సాధననిష్ఠ సంఘముమీద ప్రభావము కలది. ఈ సంఘీభావమున స్వార్థము, సంకుచిత స్వభావము తగ్గి, తాను ఇతరులకు ఉపయోగపడుచు, ఇతరులవలన తాను మేలు పొందువాడు అగుచుండును. నేటికాలమున సంఘసేవ ఉత్తమమైన పుణ్యకార్యముగా పరిగణింపబడుచున్నది.
ఆత్మ గుణములు
ధర్మ శాస్త్రమునందు కర్మా చరణపరులకు ఆత్మగుణములను, ముఖ్యములుగా యెంచి పాటించవలయును అని పేర్కొనబడినది. అవి ఎనిమిది - 1. సర్వభూతదయ, 2. క్షాన్తి (ఓరిమి), 3. అనసూయ (అసూయ లేకుండుట), 4. శౌచము, 5. అనాయాసము, 6. మంగళము (శుభము), 7. అకార్పణ్యము (దైన్యము లేకుండుట), 8. అస్పహ (పరుల ద్రవ్యమును ఆశించకుండుట). ఇవికాక 1. సత్యము, 2. అహింస, 3. ఇంద్రియ నిగ్రహము అందఱకు ఆవశ్యకములు.
భారతీయ సంస్కృతి, మొదట వైదిక సంస్కృతిగా ఉండెడిది. వర్ణాశ్రమాచారములను పాటించుచు, దేవతాభక్తితో తత్త్వజ్ఞానమును బడయుటకు ప్రయత్నించెడివారు. తరువాత కాలక్రమమున, శ్రౌత, స్మార్త, కర్మానుష్ఠానము తరిగి భగవద్భక్తిని ఆత్మజ్ఞానమును లక్ష్యముగా పెట్టుకుని యథాశక్తి కర్మాచరణముతో, జీవిత లక్ష్యమును (భగవత్సాక్షాత్కారమును, ఆత్మాను భూతిని) సాధించుటకు ప్రయత్నించుచున్నారు. పూర్వము తత్త్వజ్ఞానమునకు ధర్మాచరణ, దేవతోపాసన ఆవశ్యకములని భావించెడి వారు. ఇపుడు, ఆత్మగుణములకు, దైవీసంపత్తుకు, సత్త్వగుణమునకు, భగవద్భక్తికి ప్రాముఖ్యమునిచ్చి, తత్త్వ విచారణ చేయుచున్నారు. వైదిక కర్మలు తత్త్వజ్ఞానము కొఱకు , చిత్త శుద్ది (రాగ ద్వేషాది దోషములు పోవుట, దురితక్షయము) కొఱకు అని రెండు పక్షములు గలవు. ఆ సంస్కార కర్మలలో కొన్ని ఆచరింపక పోయినను, ఆత్మ గుణ సంపన్నుడగుచో బ్రహ్మసాయుజ్య సాలోక్యములు లభించునని చెప్పబడినది.
శ్లో || గుణాః పూజాస్థానమ్ గుణిషు న చ లిఙ్గం న చ వయః ||
గుణములను బట్టి పూజార్హతగాని, వయస్సును బట్టి గాదు. స్త్రీ, పురుష భేదమునుబట్టి గూడ, పూజ్యత నిర్ణయింప బడరాదు అని పెద్దలు తెలిపియున్నారు. కాల క్రమమున వర్ణాశ్రమ వ్యవస్థ సడలుటచే ముఖ్యాంశములను జారవిడువకుండా, మనము మన సంస్కృతిని కాపాడుకొనవలసియున్నది.
ఇపుడు, ప్రపంచమున అనేక మతములు వ్యాపించియున్నవి. అవి అయా మతములవారికి సహాయపడుచున్నవి. ప్రతి మతము లోను గ్రహింపదగిన అంశములు - కారుణ్యము, సౌభ్రాత్రము- మొదలగునవి కలవు. భారతసంస్కృతి, ఆయా మతములలోని ముఖ్యాంశములను, తనలో ఇముడ్చుకొన శక్తి గలది. భగవంతుని సృష్టిలో మానవులు, ప్రాణికోటి, అందఱు సమానులే గనుక, కేవలము మానవులందఱికే గాక, పశుపక్ష్యాదులకు గూడ సుఖము లభింపవలయునని 'శన్నో అస్తు ద్విపదే శం చతుష్వదే' అను వచనముతో సర్వ జీవరాశులకు, సుఖశాంతులను చాటుచున్నది.
శ్లో || సర్వే జనా స్సుఖినో భవస్తు
సర్వే సన్తు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యస్తు
మా కశ్చిద్ దుఃఖభాగ్భ వేత్ ||
శమ్
సంపూర్ణమ్ |
ఓం శ్రీః
శ్రీ గురు శ్శరణమ్
శ్రీ సూర్యనారాయణ ఆర్యాద్వాదశక స్తోత్రమ్
శ్లో || ఉద్యన్ ఆద్య వివస్వాన్ ఆరోహన్ ఉత్తరాం దిశం దేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చ ఆశు నాశయతు ||
శ్లో || నిమిషార్థేనై కేన ద్వే చ శ##తే (ద్వే) సహస్రే ద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తు తే నళిన నాథాయ || 2
శ్లో || కర్మ జ్ఞాన ఖ దశకం, మనశ్చ, జీవ ఇతి విశ్వ సర్గాయ |
ద్వదశధా యో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదయ || 3
శ్లో || త్వం యజు స్సామం ఋక్ త్వం,
త్వ మాగమ స్త్వం వషట్ కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వ భానో పరమహంస శ్చ ||4
శ్లో || శివరూపాత్ జ్ఞాన మహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాత్ ఐశ్వర్యం త్వత్తశ్చ ఆరోగ్య మిచ్ఛామి || 5
శ్లో || త్వచి దోషాః దృశి దోషాః హృది దోషాః
యో అఖిలేంద్రియ దోషాః |
తాన్ పూషా హతదోషః కిఞ్చిత్ రోషాగ్నినా దహతు || 6
శ్లో || ధర్మార్థ కామ మోక్ష ప్రతిరోధాన్ ఉగ్రతాప వేగకరాన్ |
బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాం శుః ||
శ్లో || యేన వినేదం, తిమిరం జగదేత్య గ్రసతి చరాచరం నిఖిలం |
ధృత బోధం తం, నళినీ భర్తారం, హార్తార మాపదా మీడే ||
శ్లో || యస్య సహస్రాభిశోః అభీశులేశో హిమాం శు బింబ గతః |
భాసయతి నక్తమఖిలం. భేదయతు విపద్గణాన్ అరుణః || 9
శ్లో || తిమిరమివ నేత్ర తిమిరం పటలమివ
అశేష రోగ పటలం నః |
కాశమివ ఆధి నికాయం కాలపితా
రోగ యుక్తతాం హరతాత్ || 10
శ్లో || వాతాశ్మరీ గుదార్మ త్వక్ దోష మహోదర ప్రమేహాం శ్చ |
గ్రహణీ భగంధరాఖ్యా మహతీ రుజోపి మే త్వం హంసి ||
శ్లో || త్వం మాతా త్వం శరణం త్వం ధాతా
త్వం ధనం త్వ మాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తా విపదాం అర్క!
ప్రసీద మమ భానో ః 12
ఇతిఆర్యాద్వాదశకం సాంబస్య పురో నభస్థలాత్ పతితం |
పఠతాం భాగ్య సమృద్ధిః సమస్త రోగక్షయశ్చ స్యాత్ ||
ఇతి ఆర్యా ద్వాదశక స్తోత్రం సంపూర్ణమ్ ||