Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

పంచలింగములు

'శంకరనిజయాలు' కాక శంకరులచరిత్రను తెలిసిన పతంజలివిజయం, శివరహస్యం అనే రెండు గ్రంధాలను గూర్చి పేర్కొన్నాను కదా! ఈ గ్రంథాలు అన్యవిషయాలు చెపుతూ నడుమ ఆచార్యులచరిత్రను క్లుప్తంగా చెప్పేయి. వీని వంటి మరికొన్ని గ్రంథాలుకూడ ఉన్నాయి.

బ్రహ్మాండపురాణంలో ఒక భాగం మార్కండేయసంహిత. ఆ సంహితలో తృతీయ పరిస్కంధంలో ఆచార్యులను గూర్చిన కథనం ఉన్నది. శివరహస్యంలోని ఆచార్య చరిత్రలో కడపటి శ్లోకం పంచలింగాలనూ గూర్చి ప్రస్తావించింది. మార్కండేయ సంహితలో ఆ లింగాలు ఎక్కడెక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి? అన్న విషయం ఉన్నది. బదరికాశ్రమంలో ముక్తిలింగము, నేపాలదేశంలోని నీలకంఠక్షేత్రంలో వరలింగము, చిదంబరక్షేత్రంలో మోక్షలింగము, శృంగగిరిలో భోగలింగము, కాంచీపురంలో యోగలింగము ప్రతిష్ఠింపబడ్డాయని ఆ సంహితలో చెప్పబడింది.

శివలింగం ప్రతిష్ఠాప్య చిదంబరసభాతటే|

మోక్షదం సర్వజంతూనాం భువనత్రయసుందరం||

ముక్తిలింగం తు కేదారే నీలకంఠే వరేశ్వరం|

కాంచ్యాం శ్రీకామకోటి తు యోగలింగమనుత్తరం|

శ్రీశారదాఖ్య పీఠేతు లింగం తం భోగనామకం||

శ్రీ ఆచార్యులయొక్క, అద్వైతమతంయొక్క ప్రస్తావన ఎన్నో గ్రంథాలలో కానవస్తుంది.

హరుడని ఒకకవి. ఆయన 'నైషధం' అనే కావ్యాన్ని రచించేరు. ఆయనకు భగత్పాదులయందు ఎక్కువభక్తి. ఆయన రచించిన నైషధం కవితాచాతుర్యానికి ఒక పెన్నిధి. ఆయన తండ్రి పేరు హీరుడు; తల్లిపేరు మామల్లదేవి. తన తల్లిదండ్రులను గూర్చి ఆయన నైషధంలోని ప్రతిసర్గలోను పేర్కొన్నారు.

హరుని తండ్రి ఒక రాజాస్థానంలో పండితులు. ఒకనాడు మరొకదేశం నుంచి వచ్చిన కవి యొకడు తన విద్యా ప్రాభవంచేత ఆయనను ఓడించేడు. ఆ పరాజయాన్ని గూర్చిన విచారంతోనే ఆయన కన్నుమూసేరు. అప్పటికి హరుడింకా బాల్యంవీడలేదు. ఇలా బాల్యంలోనే అతనికి పితృవియోగం కలిగింది. తల్లి ఉన్నది. ఆమె భర్తవల్ల చింతామణి మంత్రం ఉపదేశం పొంది ఉన్నది. దానిని జపించిన వారికి సరస్వతీకటాక్షం లభిస్తుంది. అందుచే తల్లి కుమారుడైన హరున కా మంత్రం ఉపదేశించింది. బాలుడైన హరుడు ఈ మంత్రాన్ని సర్వదావల్లెవేస్తూ ఉండేవాడు. ఏపని చేస్తూఉన్నా నోటితో ఆ మంత్రాన్ని పలకడం బాలహరునకు ఒక అలవాటైంది. ఒకనాడాతడు తన తల్లి గుండెల మీదపరుండి ఆమంత్రాన్ని తన అలవాటుననుసరించి పలుకుతూ ఉన్నాడు. శవం మీద కూర్చుండి మంత్ర జపంచేస్తే ఎక్కుఫలితం కలుగుతుందని, శ్రీఘ్రంగా ఫలిస్తుందని ఒక విధానం ఉన్నది. అది వామాచార ప్రయోగం. ఆ తల్లి ఈ విషయం ఎరుగును. తన బిడ్డ విద్యావంతుడు కావాలని ఆమో ఆశయం. అందుచే ఆమె నిశ్శబ్దంగా తన కంఠాని ఉత్తరించుకొన్నది. హరుని మంత్ర జపం సాగుతూనే ఉంది. అతనికి తన తల్లి చనిపోయినదనే తెలియదు. ఇలా వామాచార విధానంగా మంత్ర జపం హరునకు కూడి వచ్చింది. అందుచే మంత్రం సిద్ధించి అతడు గొప్పకవి అయ్యేడు.

హరమహాకవి తన నైషధకావ్యంలో చింతామణీమంత్ర ప్రయోగాన్ని గురించి, తాను సిద్ధిపొందిన విషయాన్ని గూర్చి వ్రాసుకొన్నాడు.

నైషధంలో నలదమయంతుల కథ వర్ణింపబడినది. దమయంతీ స్వయంవరానికి చాలమంది రాజకుమారులు వచ్చేరు. వారిని దమయంతికి పరిచయం చేయడానికై సరస్వతిదేవియే స్వయంగా వచ్చింది. నలదమయంతుల వివాహం జరిగిన మీదట ఆమె ఆ దంపతులను అనుగ్రహించి వారికి చింతామణి మంత్రాన్ని ఉపదేశించి దాని ప్రయోగాలను వివరించినట్లు నైషధంలో హరుడు గ్రంథించేడు.

చింతామణిమంత్ర జపఫలముగా హరునకు వాక్సిద్ధి కలిగింది. అందుచే ఆయన తనగ్రంథంలో విరివిగా కఠినప్రయోగాలను, క్లిష్టాన్వయాలను వాడేడు. తానే స్వయంగా ఇలా చెప్పుకొన్నాడు.

గ్రంథగ్రంథి రిహ క్వచిత్‌ క్వచిదపిన్యాసి ప్రయత్నాన్మయా

ప్రాజ్ఞంమన్యమనా హఠేనపఠితిఃమా2స్మిన్‌ ఖలః ఖేలతు

శ్రద్ధారాద్ధగురుశ్లథీకృతదృఢ గ్రంథిః సమాసాదయ

త్వేత త్కావ్యరసోర్మి మజ్జన సుఖవ్యాసజ్జనం సజ్జనంః

నైషధం 22. అంతము 3

'ఈ గ్రంథంలో నేను అచ్చటచ్చట కొన్ని గ్రంథలు (ముడులు) కావలెననే వేసిఉన్నాను. శ్రద్ధతో గురువు నొకరిన్వేషించి ఆయన సహాయంతో ఈ గ్రంథులను విడదీసి తెలిసి కొనాలే కాని అన్యథా సాధ్యంకాదు. తెలిసికోవాలనే ఉత్కంఠకలవారు గురువు నారాధించి కావ్యరసంలో ఓలలాడవచ్చు! అహంకారికి గాని మూర్ఖునికి గాని నా కావ్యం కొరుకు వడదు. హఠంతో మంకుపట్టిపట్టి చదివినా ప్రయోజనంలేదు. గుర్వనుగ్రహానికి పాత్రుడైన సజ్జనునకు మాత్రమే ఈ కావ్యం ఆనందాన్ని అందిస్తుంది' అని ఆయన వ్రాసేరు. ఆయన నైషధంలో ఈ ఒక్కశ్లోకమే కొంత తేలికైనది. తక్కినవన్నీ వజ్రాలు, అవి పగలవు.

ఇంతటివారైన హరులకు ఆచార్యులయందు, అద్వైతమందు ఎక్కువ భక్తి, అద్వైతం తప్ప మరొకటి ఏదీ లేదని నిరూపించడానికి ఆయన 'ఖండన ఖండఖాద్యము' అనే గ్రంథాన్ని రచించేరు.

అందులో-'సత్యమన్నది ఒక్కటే. అది అద్వితీయం' - అన్న విషయానికి ఎన్ని ఆక్షేపణలు యుక్తితో కుబుద్ధితో చెప్పడానికి వీలో అన్నీతామే చెప్పి తిరుగతామే వానిని అన్నిటిని ఖండించేరు.

శబ్దార్థ నిర్వచన ఖండనయా నయంతః

సర్వత్ర నిర్వచనభావ మఖర్వగర్వాన్‌|

ధీరాయథోక్త మపి కీరవ దేతదుక్త్వా

లోకేషు దిగ్విజయకౌతుక మాతనుధ్వమ్‌||

ఖండనఖండఖాద్యము 1-3.

'ధీరులు ఇందు నేను చెప్పినవానిని చిలుకలా అప్పగిస్తేచాలు, వారు దిగ్విజయం చేయవచ్చును అని ఆయన చెప్పేరు.

విశిష్టాద్వైతానికి అనుకూలంగా వేదాంతదేశికు లనేవారు 'శతదూషణీ' అనే గ్రంథాన్ని ఒకదానిని రచించేరు. అందులో మొత్తం నూరు విషయాలు ఆక్షేపింపబడ్డాయి. అద్త్వెతంలో నుండి ఎనుబది విషయాలను, ద్త్వెతంలో నుండి ఇరువది విషయాలను గ్రహించి ఆ గ్రంథంలో వేదాంతదేశికులు ఆక్షేపించేరు. వారు కూడా హరునివలె ఒక శ్లోకం చెప్పేరు.

ప్రాచీముపేత్య పదవీం యతిరాజదృష్టాం

తత్సన్ని కృష్టమపి వామతయా శ్రయంతః|

ప్రజ్ఞాయథోదితమిదం శుకవ త్పఠస్తః

ప్రచ్ఛన్న బౌద్ధవిజయే పరితో యతధ్వమ్‌||

'ప్రచ్ఛన్న బౌద్ధులను జయించడానికి ఇందలి విషయాలు చిలుకలా పలుకనేరిస్తేచాలు నన్నారువారు'. ప్రచ్ఛన్న బౌద్ధులను అనేపదం అద్త్వెతులను సూచిస్తుంది. దేశికులు ఇలా 'ప్రచ్ఛన్న బౌద్ధులను మాత్రం జయించగలరు' అని పలికితే, శ్రీహరులు 'దిగ్విజయమే చేయగలరు' అని వ్రాసేరు. దేశికుల వ్రాత హరుల వ్రాతకు అనుకరణంగా కనిపిస్తుందని, తరువాతి వారి వ్రాతలుకూడ ఇట్లే అనుకరణాలుగా ఉన్నాయని చూపించడానికి దీనిని చెప్పడం జరిగింది.

పుణ్యశ్లోకో నలోరాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిరః

పుణ్యశ్లోకో చ వై దేహీ పుణ్యశ్లోకో జనార్దనః||

ప్రాతః స్మరణము.

నలుడు పుణ్యశ్లోకుడు. ప్రాతఃస్మరణలో అతని పేరుకు స్థానం ఉన్నది. అతని చరిత్రయే నైషధం. అది పుణ్యచరిత్ర. పెద్దలను మనం ఎందుకు స్మరించాలి? పరిశుద్ధులను పరమ ధార్మికులను స్మరిస్తే మన భయాలన్నీ నశిస్తాయి. మన అధర్మచింతనం అంతరిస్తుంది. ఆ క్షణంలోనైనా చిత్తశాంతి ఏర్పడుతుంది. అధికంగా ధ్యానిస్తే అధికంగా శాంతి లభిస్తుంది. అట్టి శాంతి నిరంతరంగా ఉంటుంది. ఎవరినామం స్మరిస్తే చిత్తానికి శాంతి కలుగుతూ ఉంటుందో వారే పుణ్యశ్లోకులు. వారి నామధేయాలు పై శ్లోకంలో ఉన్నాయి. వారిని తలచుకొంటే మన బుద్ధులుకూడ వారి మార్గాలలో ప్రవర్తిల్లుతయి. వారి చరిత్రలు వింటే సత్ఫలం కలుగుతుంది. అందుచేతనే హరులు పుణ్యశ్లోకుడైన నలుని చరిత్రను వ్రాసేరు.

'దమయంతికి స్వయంవరం ప్రకటింపబడింది. స్వయంవరవృత్తాంతం దేవతలకుకూడ తెలిసింది. వారు దమయంతికి నలునియందు ప్రీతి ఉన్నదని తెలిసికొన్నారు. తాము ఆమెను పెండ్లాడవలె ననుకొన్నారు.

అందుచే దమయంతి యొద్దకు దూతగా నలుని పంపేరు. కాని, ప్రయోజనం లేకపోయింది. పిమ్మట అగ్ని, వరుణుడు, యముడు, ఇంద్రుడునలుగురును నలుని పోలినరూపాలను ధరించి స్వయంవరంమండపములో నలునిప్రక్కనే కూర్చున్నారు. అప్పుడు సరస్వతియే స్వయముగా వచ్చి ఆయా రాజకుమారులను గూర్చి దమయంతికి వివరంపనారంభించింది'. ఈ సందర్భంలో ఒకవిషయం గుర్తుకు వస్తోంది.

రఘువంశకావ్యంలో ఇందుమతీ స్వయంవర వృత్తాంతం ఉన్నది. ఆమె అజమహారాజును పెండ్లాడింది. కాళిదాస మహాకవి ఆ సందర్భాన్ని వర్ణించేరు. ఒక్కొక్క రాజకుమారునీ చూస్తూ ముందుకు సాగిపోతూ ఉన్న ఇందుమతి 'సంచారిణీ దీపశిఖలా' ఉన్నదని కాశిదాసకవి వ్రాసేరు.

సంచారిణీ దీపశిఖేవరాత్రౌ యంయం వ్యతీయాయ పతింవరాసా|

నరేంద్రమార్గాట్టఇవప్రపేదే వివర్ణభావంసస భూమిపాలః||

'రాత్రివేళ మనం ఒక దీపాన్ని చేబట్టి ముందుకుపోతూ ఉంటే మనం ఉన్నచోటు కాంతివంతంగా ఉంటుంది. మనం విడచిపెట్టినచోటు తమోమయం అవుతుంది. అలాగే స్వయంవరంలో ఇందుమతి ఏ రాజకుమారుని ఎదుట నిలువబడితే ఆ రాజకుమారుడు ఇందుమతి తన్ను వరిస్తుందనే ఆశతో ప్రసన్న వదనుడుగా ఉంటున్నాడు. కాని ఆమె ఆతనిని దాటి ముందుకు వెడితే అతని మొగం వాడిపోతోంది. ఎవనిముందు ఇందుమతి నిలువబడుతుందో వాని ముఖం వెలిగిపోతోంది. ఎవనినామె దాటి ముందుకు వెడుతూఉన్నదో వాని ముఖం వెలవెలబోతోంది. అందువల్లనే కాళిదాసకవి ఇందుమతిని 'దీపశిఖతో' పోల్చేడు.

దమయంతి కూడ ఆ ఇందుమతివలనే రాజకుమారుల నందరను చూస్తూ వెడుతూఉంది. ఆమె హృదయం నలునియందే లగ్నం అయిఉంది. వేరొకనియందామె కిచ్ఛలేదు. ఇలా అందరును గడచి దమయంతి నలునివేషంలో ఉన్న దేవతలదగ్గరకు వచ్చింది. వారిని చూడగానే ఆమెకు దిగులు ఏర్పడ్డది. వీరిలో నిజమైన నలుడెవరు? ఎలా తెలిసికోగలను? తెలియక ఇతరుని మెడలో మాల నర్పిస్తే పాతివ్రత్యం చెడుతుంది. సరస్వతీదేవి సత్యమే చెబుతుంది కదా! గుట్టు విడిచి ఆమెతో తన రహస్యం చెబితే ప్రయోజనం ఉంటుందా? అనే ఊహలో దమయంతి మనస్సులో ఉద్భవించేయి.

ఇక సరస్వతీదేవి దేవతలలో ఎవరినో ఒకరిని చూపి ఇతడు నలుడు అని చెపితే ఆమె అసత్యం చెప్పిట్లుకాదా! ఆమెకు అసత్యందోషం సంభవిస్తుంది. అలాకాక వారిని గూర్చి సత్యం వెల్లడిచేస్తే వారికి కష్టం కలుగుతుంది. అందుచే ఆమె ఆ దేవతలనుగూర్చి శ్లేషగా చెప్పింది. అంటే ఆమె చెప్పినమాటపైకి 'ఇతడునలుడు' అన్నఅర్థాన్ని వెల్లడించేదిగా ఉండి కొంత పరిశీలిస్తే 'ఇతడు నలుడుకాడు ఫలానాదేవత' అన్న అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ఇలా రెండర్థాలు వచ్చునట్లు మాటలాడి సరస్వతి దమయంతికి యథార్ధం స్ఫురింపజేసింది. నిజమైన నలుని దగ్గఱకు వచ్చిన మీదట సరస్వతి ఒక చమత్కారం చేసింది. ఆమె 'ఇతడే నలుడు' అని నిష్కరచేసి చెప్పవచ్చునా! అలా చెప్పలేదు. ఆమె నలునిగూర్చి చెపుతూ తనమాటలు మొత్తం నలుని నలవేషధారులై నలుగురు దేవతలను మొత్తం ఐదుగురు నలులను సూచించేలాఐదర్థాలు వచ్చేలా చెప్పింది. దీనినే 'పంచనళీయం' అంటారు. ఇట్టి శ్లేషభాషణం సామాన్యులకు కష్టం కాని సరస్వతికి వాగ్దేవికి అదొకలెక్కా! ఆమెకేకాదు, ఆమె అనుగ్రహం పొందినవారికికూడ అది శ్రమకాదు.

సరస్వతి యిలా చెపితే దమయంతి వాస్తవం ఏమో తెలిసికొనలేక తటపటాయిస్తోంది. యథార్థం వెల్లడికాక ఆమె దిగులు దిగులుగా ఉన్నది. అప్పుడు ఆమె పరిస్థితిని హరులు ఇలా వర్ణించేరు.

సాప్తుం ప్రయచ్ఛతి నపక్ష చతుష్టయే తాం

తల్లాభశంసిని న పంచమకోటి మాత్రే|

శ్రద్ధాం దధే నిషధరాడ్విమతే మతానాం

అద్వైత తత్త్వ ఇవ సత్యతరే2పిలోకః||

- నైషధం. 13-36.

హరుల శ్లోకాలన్నీ వజ్రకఠినాలుకదా! దీని అర్థం తెలియాలి అంటే కొన్ని విషయాలు చెప్పాలి.

భారతంలో ముఖ్యమైన మతాలు ఐదని చెప్పబడ్డది. సాంఖ్యము, పాతంజలము (యోగము) పాంచరాత్రము, వేదము, పాశుపతము అని ఆ మతాల పేర్లు.

వీనిలో సాంఖ్యం ప్రస్తుతం లోకంలో ప్రచారంలో లేదు. పతంజలి మహరి ప్రచారంచేసిన మతమే పాతంజలమతం. అది యోగమతం. పాంచారాత్రము వైష్ణవమతం. అందుచే అది రామానుజల మతంలో లీనమైపోయింది. వేదమతం శ్రీ మచ్ఛం కరాచార్యుల మతమైన ఆద్వైతమే. పాశుపత మన్నది శైవమతం. పుష్పదంతుని ఈశ్వరస్తోత్రంలోని ఒక శ్లోకంలోకూడ ఈ ఐదు మతాలు పేర్కొనబడ్డాయి.

త్రయీ సాంఖ్యం యోగః పశుపతి మతం వైష్ణవ మితి

ప్రభిన్నే ప్రస్థానే పరమిద మదః పథ్య మితిచ|

రుచీనాం వైచిత్య్రా దృజుకుటిల నానాపథజుషాం

నృణామేకో గమ్యస్త్వమసి పయసా మర్ణవ ఇవ||

-శివమహిమ్నస్తోత్రము-7.

ఇచ్చట వైష్ణవాన్ని వేరుగా చెప్పినందువల్ల అద్త్వెతం విష్ణు నారాధించడానికి అంగీకరించదా? అన్న సంశయం కలుగుతుంది. వైదికమైన మార్గంలో శివారాధన విష్ణ్వారాధన రెండూ ఉన్నాయి. తంత్రమార్గంలో వైష్ణవాన్ని మాత్రం రామానుజులు గ్రహించేరు. ఆ మతాన్ని ఇచ్చటి వైష్ణవపదం సూచిస్తుందేకాని వేదమతమైన అద్త్వెతానికి విష్ణ్యారాధనతో విరోధం లేదు.

సరే! ఇక ప్రస్తుతానికి వద్దాం! 'ప్రపంచంలో ఉన్న పెక్కు మతాలలో సత్యతరమైన అద్త్వెతాన్ని ఎలా గుర్తించలేకున్నారో అలాగే దమయంతి ఆ ఐదుగురు నలులలో నిజమైన నలుని కనుగొనడానికి అవశ అయిందని' హరులు వర్ణించేరు.

వెనుక చెప్పిన పంచమతాలలో అద్త్వెతం ఉన్నది. అది సత్యతరమైనది. అట్లే పంచనలులలో నిజమైన నలుడున్నాడు. హరులు ఇట్టి ఉపమానం వాడి తమకు అద్త్వెతమునందు, ఆచార్యులయందు ఉన్న భక్తిని వెల్లడించేరు.

హరులు అద్త్వెతం సత్యతరం అని అన్నారు. తరశబ్దాన్ని ప్రయోగించుటద్వారా ఆయన నిమ్నసత్యం ఒకటి, ఉన్నత సత్యం వేరొకటి ఉన్నట్లుగా తలచినట్లు వ్యక్తం అవుతోంది. ఇలా సత్యం రెండు రకాలు. ఇతరమతాలలో పరమేశ్వర సత్యమునకు ఇతర సత్యమునకు వ్యత్యాసమే లేదు. వానిలో నిమ్నోన్నతాలు లేవు. 'తర' మన్నది లేదు. ఇక్కడ సత్యాన్నిగూర్చి కొంత విచారిద్దాం!

ఆదిశంకరులు సత్యము త్రవిధ మన్నారు. ఆయన లోకంలోని పదార్థాలను ఉపనిషత్తులు నాల్గురకాలుగా వింగడించాయన్నారు. ఒకటి పారమార్థికసత్యము, రెండు వ్యావహారిక సత్యము, మూడు ప్రాతిభాసిసత్యము, నాల్గవది అసత్యము అని అవి చెప్పేయున్నారు.

పైవానిలో మొదటిదైన పారమార్థికసత్యమే శివస్వరూపము. 'తదేకో2వశిష్ఠః శివః కేవలో2హమ్‌| (దశశ్లోకి) అను నదే అది.

మనచే చూడబడేది అంతా రెండవదైన వ్యావహారిక సత్యం అనబడుతుంది. ఇక మూడవది ప్రాతిభాసిక సత్యం. రేకుడబ్బామూత క్రిందపడి తెల్లగా మెరుస్తూ రూపాయి అన్న భ్రమను కల్పిస్తుంది. కొన్ని క్షణాలవరకు అదిరూపాయిగా కన్పిస్తుంది-అదుగో! అదే ప్రాతిభాసికసత్యం.

ఏనాడూ లేనిదే అసత్యం. అది గొడ్రాలి కొడుకు, గుఱ్ఱపు కొమ్ము వీనిని ఎన్నడూ చూడలేము. ఇవి అసత్యములు. యోగశాస్త్రం వీనినే 'వికల్పములు' అన్నది.

శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పజః

- పాతాంజలియోగసూత్రములు.

'ఒక శబ్దం మాత్రం ఉంటుంది. దానికి అర్థమైన వస్తువు ఉండదు.' అట్టిదానిని వికల్ప మంటారు. అసత్యమును తుచ్ఛమనియు, అత్యంత అసత్తు అనియు కూడ చెపుతారు. రుజ్జువు సర్పములా కనబడుట ప్రాతిభాసిక సత్యం. మనచే చూడబడేది. ఇంద్రియములచే గ్రహింపబడేది వ్వావహారికసత్యం. ప్రాతిభాసిక వ్యావహారిక సత్యాలు రెండూ 'కల్లలు' అనబడతాయి. కాని అసత్యం కల్లకూడ కాదు. దానికి ఉనికే లేదు. అసత్యం వేరు కల్ల వేరు. వేదాంతంలో కల్లనే మిథ్య అంటారు. ప్రాతిభాసిక వ్యావహారిక సత్యాలు రెండూ మిథ్యలు.

అందుచే సత్యమైనది ఒకటి. అసత్యమైనది ఒకటి. ఆ సత్యానికి ఈ అసత్యానికి నడుమ రెండు సత్యాలుగాతోచే కల్లలు ఉన్నాయి.

సత్యమైనది స్వామి. అసత్యము గొడ్రాలికొడుకు. ఈశ్వరుడు నేడుండి రేపు లేకపోయేవాడుకాడు. అందుచే ఆయన సత్యం. సర్వదా ఉండేదే సత్యం. కొన్ని పదార్థాలు మధ్యలో సంభవించి మధ్యలో అంతరిస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు అవి లేనికాలమన్నది ఉంటుంది. లేదనుమాట లేక సదా ఉండునదే సత్యం. అలా ఉండేవాడు పరమాత్మయే. ముక్కాలములయందు ఆయన ఉండనే ఉన్నాడు.

ముక్కాలములయందు ఉన్నదనుట దేనికిలేదో అది సత్యం. నడుమనున్న రెండును సత్యాంశ కొంత అసత్యాంశకొంత కలది. అవి వ్యావహారిక ప్రాతిభాసికసత్యాలు. అవి కల్లలు.

అసలే లేని దానిని కనబడనిదానిని కల్ల అనరు. కనబడుతూ, ఇంద్రియగ్రాహ్యం అవుతూ కొంత సత్యాంశ కొంత అసత్యాంశ కలదానినే కల్ల అంటారు.

చూడండి! మన ఈ దేహం కొన్ని యేండ్లకు ముందు ఉన్నదా? లేదు. కొన్ని యేండ్లకు తరువాతకూడ ఇది ఉండదు. అందుచే దీనిని సత్యమనుటకు వీలులేదు. మరి ఇది కొన్నియేండ్లనుండి ఉన్నది, ఇప్పుడును ఉన్నది. ఈ కారణంగా దీనిని అసత్యమని కూడ అనజాలము. ఇలా మనదేహం కొంత సత్యాంశ కొంత అసత్యాంశ కలదై ఉన్నది ఇదుగో! కల్లయనగా ఇట్టిది. ఇది వ్యావహారిక సత్యం అనబడుతుంది.

ముత్తెపుజిప్పలో వెండి లేదు. ఉన్నట్లు తోచింది. అది భ్రమ. కాని ఉన్నట్లు తోచినది కదా! ఆ తోచుట సత్యమా అసత్యమా?

'సచ్చే న్న బాధ్యేత ఆసచ్చే న్న ప్రతీయేత'! మూడుకాలములందు నిలచి ఉండునది సత్యము, మూడుకాలములందు లేనిది అసత్యము. ఒక నిముసమే అయినను, ముత్తెపుజిప్పలో వెండి ఉన్న దనిపించెనుకదా! ఇది దీని సత్యాంశ. మన భ్రమతొలగినది. అక్కడ వెండిలేదనిపించినది. ఇది సత్యాంశ ఇదిగో! దీనినే ప్రాతిభాసికసత్యం అంటారు.

గొడ్రాలి కొడుకును, గుఱ్ఱపు కొమ్మును మనం ఎన్నడైన చూడగలమా? చూడలేము. వీనిలో సత్యాంశము అసలే లేదు. శుక్తియందు రజతం ఒక్కనిముసమైనా గోచరించింది, కాని గొడ్రాలికొడుకు, గుఱ్ఱపుకొమ్ము అలా గోచరించవు. వానిని శబ్దమాత్రంగా చెప్పగలమేకాని వానియందు నమ్మిక, యన్నది కలుగదు. ఇదుగో! ఇదే అసత్యం అనబడుతుంది.

శుక్తి యందు కనబడిన రజతము ముందు లేదు. వెనుక ఉండబోదు. ఇప్పుడును లేదు. కాని ఒక్క క్షణకాలం ఉన్నట్లు తోచింది. త్రాటిని చూచి పామనుకొన్నాం. పాము ముందు లేదు. వెనుక లేదు. ఇప్పుడును లేదు. ఒక్క నిముసం పామే అనిపించింది. రజతము సర్పము సత్యమే అయితే అవి చెక్కుచెదరక అలాగే ఉండాలి. కాని ఇది శుక్తి, ఇది త్రాడు అన్నజ్ఞానం కలుగగానే రజతము సర్పమూ కనబడుటలేదు. మాయ అటువంటిది. అది అనిర్వచనీయమైనది. అది నత్తునూ కాదు. అసత్తునూ కాదు. ఇది అని చెప్పవీలుకాని దది. ఉన్నదని కాని లేదని కాని చెప్పలేము. అది రజ్జుసర్పంలా ఒకసమయంలో ఉంటుంది; తరువాత ఉండదు. స్వప్నము ఇట్టిదే. 'మ్సాలేనిది య్సాఏదో, అది 'మాయా' శబ్దానికి అర్థం. ఏదిలేనిదో అదే మాయ. మనమంతా అట్టివారమే. మాయ సత్యమూకాక అసత్యమూకాక ఉన్నది. లేదని చెప్పుటకు అది కనబడుతూ ఉన్నది. ఉన్నదని చెప్పుటకు అదృశ్యం అవుతోంది. అయతే ఈ ఉన్నదనునది స్వామియా కాదా? ఈ మాయను పరమాత్మ స్వరూపమని చెప్పవచ్చునా, చెప్పరాదా?

తత్వాన్యత్వాభ్యా మనిర్వచనీయమ్‌|

-సూత్రభాష్యము.

మాయను పరమాత్మకంటె వేరని చెప్పుటకు వీలుకాదు. పరమాత్మయని చెప్పుటకూడ సరికాదు. అది బౌద్ధులు చెప్పు శూన్యముకాదు. పరమాత్మవలె సత్యమా కాదు. అదేదో! అది అంతే! అది అనిర్వచనీయం! అది కల్ల!

అది రెండు రకాలు. చూస్తూ ఉండగానే లేకుండా పోయేది ఒకటి. అది ప్రాతిభాసిక సత్యం. మన దేహాన్ని గూర్చి చెప్పుకొన్నాం. దాని విధానం వేరు. అది వ్యావహారిక సత్యం. ఈ రెండు సత్యాలూ మాయ.

త్రాడు తెలియబడగానే పాములేకుండా పోతుంది. త్రాడు అధిష్ఠానము, పాము ఆరోప్యము. అధిష్ఠానం సాక్షాత్కరిస్తే ఆరోప్యం అందరిస్తుంది. ఒక వస్తువును వేరొక వస్తువని భ్రమపడ్డాం. ఆ వస్తువుయొక్క సత్యజ్ఞానం కలుగగానే భ్రమచే ఏర్పడ్డ అసత్యవస్తువు అదృశ్యం అవుతుంది. అది ప్రాతిభాసిక సత్యం.

మనము సమూలంగా ఎప్పుడులేకుండాపోతాము? మనం మనలను ఏవస్తువుమీద ఆరోపించి ఉన్నామో ఆ వస్తువు తెలియాలి. అది తెలిసినంతనే 'మనము' అన్నది విడిపోతుంది. సూర్యచంద్రులు, పంచభూతాలు, ప్రపంచం మొదలగువానిని మనం దేనిమీద ఆరోపించి ఉన్నామో ఆ సత్యమైన వస్తువు తెలిసిన వెంటనే యీ ప్రపంచం అంతా విడిపోతుంది.

'పూలదండలోని భ్రాంతిసర్పమువలె పాంచభౌతిక మిశ్రమంచే ఏర్పడిన భేదజ్ఞానం ఎవరిని చూస్తే వీడిపోతుందో ఆయనయే లంకలో యుద్ధం చేసిన శ్రీరాముడు; ఆయనయే వేదవంద్యుడు'. -అని కంబమహాకవి వ్రాసేరు.

'ఇలా కలిగిన భ్రాంతి నిజము కాదు, ఎవనియందీ భ్రాంతులు తోచుచున్నవో అతడు కనడబడినంతనే ఇవన్నీ తొలగిపోతాయి. ఈ ప్రపంచం అంతా పంచభూతాలు వికారం. శ్రీరాముడు వీనికన్నిటికి అధిష్ఠానం, ఈ వికారం తగ్గినంతనే మిగిలి గోచరించే పరమార్థం ఆయనయే.' అని పరమవైష్ణవులైన కంబమహాకవి అన్నారు.

ఇలా ఉండేదే వ్వావహారిక సత్యం, పరమాత్మదర్శనముతో ఏదిపారిపోతుందో అదే వ్యవహారసత్యం. అది పరమాత్మ యందారోపింపబడ్డది కనుక పరమాత్మ గోచరించగానే అంతరిస్తుంది. వ్యావహారిక ప్రాతిభాసికాలు రెండునూ మిథ్యలే; అవి రెండును సత్యమేలే.- ఇట్లు శ్రీ శంకరాచార్యులు విభజించేరని వారికి తరువాతివారు చెప్పేరు.

సత్యం చానృతం చ సత్య మభవత్‌-

-తైత్తరీయోపనిషత్‌బ్రహ్మవల్లీ.

'సత్యమే సత్యముగా అసత్యముగా అయినదని' ఉపనిషత్తు చెపుతోంది. అనృతమే ప్రాతిభాసికము. వాస్తవానికి ఇవన్నీ సత్యమే. కాని నిత్యసత్యములు కావు. నిత్యసత్యము ఒకటి ఉన్నది. అది యీ సత్యములకంటె మిన్నయైనది, అదే సత్యతరము. ఈ దిగువలోనున్న ఆరోపిత సత్యాలు అంతరించగానే ఆ నిత్యసత్యం గోచరిస్తుంది. కల్లనంతను సత్యరూపముగా చేయునది అద్త్వెతం. సత్యతరమైన వస్తువు సర్వత్రా నిండి ఉన్నది; అంతయు సత్యస్వరూపమే. ఆ సత్యమే ఇట్లున్నదని వేదం చెప్పుచున్నది.

సత్యతరమైన అద్త్వెతం ఉన్నప్పటికి లోకం భ్రమపడుతూ ఉన్నట్లు దమయంతికూడ భ్రమపడినదని హరులు వ్రాసేరు.

కల్లరెండు భాగాలు. లేదనే భాగం ఒకటి, ఉన్నదనేభాగం ఒకటి అదే శివము. అదే అద్వైతము. మాయాసముద్రం ఉన్నది లేదు అని చెప్పడానికి వీలులేని వేడుకయై ఉన్నది. ఆ ప్రపంచం అంతా పోగా కడపట మిగిలేది పరమాత్మతత్త్వం ఒక్కటే.

తదేకో2వశిష్టః శివః కేవలో2హమ్‌- అన్నట్లు చివరకు మిగులునది శివ స్వరూపమే. సమస్తము భస్మముకాగా చివరకు మిగులువాడు శివుడే. పరమేశ్వరుని నామావళిలో 'మహాభస్మ' అని ఒక నామం. వివిధ వస్తువులను రూపుమాపగా బూదిసేయగా మిగులునది భస్మమే. దాని తెల్లదనమే నిలచి ఉంటుంది. ఏదో ఒకటిరెండు వస్తువుల కాక సర్వము బూదియే అయినపుడు మిగిలేది 'మహాభస్మ'.

పరమేశ్వరుని వస్తుజాతం అంతా భస్మవలెనే తెల్లనిది. కైలాసము తెలుపు. విభూతి తెలుపు. ఆయన దేహం తెలుపు. గంగ తెలుపు. ధరించే అస్థిమాల తెలుపు. అంతా భస్మవర్ణమే. సమస్తవర్ణాలు ఏ వర్ణంలో లీనం అవుతాయో, ఏవర్ణం చిట్ట చివర మిగిలి ఉంటుందో ఆ వర్ణమే ఆయన. అన్ని వస్తువులు జ్ఞానాగ్నిలో భస్మం కావాలి. అపుడు భేదం ఉండదు. అన్నీ భస్మరూపం ధరిస్తాయి. సత్యతరమైన అద్త్వెతం భాసిస్తుంది. ఆ అద్త్వెత స్వరూపచిహ్నమే పరమేశ్వరుని మూడవకన్ను. అది అగ్ని నేత్రము. ఆ అగ్ని జ్ఞానాగ్ని. అది అన్నిటిని భస్మం చేస్తుంది. అది కలవారే అన్ని యు పోగా సత్యతరమైన అద్త్వెతంగా నిలుస్తారు.

ప్రణవమునకు అర్థం చెప్పవచ్చిన ఒక ఉపనిషత్తు (మాండూక్యోపనిషత్‌) 'శాంతం శివ మద్త్వెతం చతుర్థం మన్యంతే' అని అద్త్వెతమును 'శివము' అని చెప్పినది. శివమే అద్త్వెతం. అదియే సత్యతరము. ఆ హరులకు శంకరులమీద, అద్త్వెతం మీద ఎంతభక్తిభావమో! అద్త్వెతము సత్యతరమన్నారు.

వేరొకచోట హరులు చంద్రమౌళీశ్వరులను గూర్చి ప్రస్తావించేరు!

దమయంతీ స్వయంవరానికి ఇతరదేశములనుండి రాజులు వచ్చినట్లే కాంచీపురప్రభువుకూడ వెళ్ళేరు. ఏ రాజుకు గూర్చి చెప్పినను 'ఈయన తటాకములు త్రవ్వించేరు, అని చెప్పుట హరులకు పరిపాటి. తటాకనిర్మాణం చాలా గొప్పఘనకార్యం అని ఆయన భావించినట్లు తోస్తుంది. ఆయన ఒకపెద్ద చెఱువును ఇలా వర్ణించేరు.

ఉన్మీల ల్లీలనీలోత్పలదల నలినీ మోదమే దస్విపూర

క్రోడక్రీడద్ద్విజాలీ గురుదుదిత మరుత్ఫాల వాచాల వీచిః|

ఏతానాఖాని శాఖానివహ నవహరిత్పర్ణపూర్ణద్రుమాలీ

వ్యాలీఢోపాంతశాంత వ్యథ పథికదృశాం దత్త రాగస్తడాగః||

- నైషధం. 12-103. 1.

చంద్రమౌళీశ్వరులకు సంబంధించ్ది స్తోత్రములు తంత్రము కామకోటి మఠంలో భద్రపరచబడి ఉన్నాయి.



'ఒక సువిశాల కాసారము. అందులో ఎన్నో వికసించిన నల్లకలువలు అలల తాకిడిల కదలాడుతూ ఉన్న తామరపూరేకుల మీద రాయంచలు క్రీడిస్తున్నాయి. కొలనిగట్టుమీద నానావిధాలైన వృక్షరాజాలు. అలసిన పథికులు వానినీడలో శ్రమాపనోదనం చేసికొంటున్నారు' అని హరులు వ్రాసేరు.

కాంచీపుర ప్రభువును గూర్చి ఆయన ఒక శ్లోకం చెప్పేరు. అందే చంద్రమౌళీశ్వరుల ప్రశంసకూడ ఉన్నది.

సింధోః జైత్ర మయం పవిత్ర మసృజత్త తీర్తి పూర్తాద్భుతం

యత్ర స్నాన్తి జగన్తి సన్తి కవయుః కేవా నవాచం యమాః||

యద్బిందుశ్రియ మిందు రంజతి జలం చాలిశ్యదృశ్యేతరో

యస్యాసౌ జలదేవతా స్ఫటిక భూ ర్జాగర్తి యోగేశ్వరః|| - నైషధం 12-104.

'ఈ రాజు (కాంచీపుర ప్రభువు) ఒక కొలను త్రవ్వించేరు. అది పవిత్రమైనదే కాదు, లోతుచే వైశాల్యముచే సముద్రమునుకూడ గెలువజాలినది. ఈయన కీర్తివలెనే అందులోని జలముకూడ స్వచ్ఛమైనది. ఆ తటాకాన్ని వర్ణించడం కవులకు అలవికాని పని. ఎవరైనా వర్ణించాలని దానిని చూస్తే వారు అవాక్కులై మౌనంగా నిలబడతారే కాని వర్ణించలేరు. ఆ చెరువులోనుండి చిందిన జలబిందువే సుమా చంద్రుడు! ఈ రాజు ఊరిలో ఒక యోగీశ్వరుడున్నాడు. ఆయన స్ఫటికమయులు. వారికి ఈ తటాకజలం ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ తీర్థములో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఆ యోగేశ్వరుడు కనిపించడు.'

'జలంలో స్ఫటికం కనబడదు. స్వామి స్ఫటికలింగమును జలంతో అభిషేకించేవేళ లింగము కనబడక జలంలో లీనం అవుతుంది. పరమేశ్వరుని మొదటిమూర్తి జలమే. జలదేవతగా ఉన్నప్పటికి జలంలో తెలియబడడు, నీరు నీటిలో దాగొంటే ఎలాకనిపిస్తుంది. పరమేశ్వరుడు జలమూర్తి గనుక జలధారలలో ఆయనమూర్తి కానరాదు'- అని హరులన్నారు.

ఇందు 'యోగేశ్వరః' అని స్వామి పేరు చెప్పబడినది. అదియే యోగలింగం. చంద్రమౌళీశ్వరులే ఆ యోగలింగము. యోగేశ్వరులాయనయే. హరులు వారినే వర్ణించేరు. అందుచేహరులు శ్రీ శంకరాచార్యులచే ఆరాధింపబడిన యోగలింగము నందు భక్తి కలవారని తెలుస్తోంది. హరులకుఆచార్యులయందు, అద్త్వెతమునందు చంద్రమౌళీశ్వరులయందు ఎంతో పూజ్యభావం ఉండకపోతే ఇలావర్ణిస్తారా!

స్ఫటికలింగం పరబ్రహ్మానికి చిహ్నం. అందులో ఏవర్ణమైనా ప్రతిఫలిస్తుంది. అది తురీయమైన శివమునకు చిహ్నము. అట్టి చంద్రమౌళీశ్వరులకు ఒక కోవెల ఉంటే చాలదు. ఊరంతా వారికి సొంతమే. ఒక ఊరేకాదు దేశంమంతా అందువల్లనే 'ఊరూరు తిరిగి ఉత్సవం చేయండి' అని ఆచార్యులు మమ్ము ఆజ్ఞాపించేరు.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page