Naa Ramanasrma Jeevitham
Chapters
65. ఏకాకీ, యతచిత్తాత్మా అయితే ఈ రమణసదనం ఆశ్రమంలో ఎప్పుడూ వుండేది భగవానూ, (అరూప భగవాన్) నేనూ ఇద్దరమే. భక్తు లెవరు వచ్చినా కొంతసేపు వుండి వెళ్ళటమేగాని నిలవ వుండరు. భోజనాది వసతులు ఇక్కడ లేనందువల్ల సకృత్తుగా ఏ ఒకరోతప్ప ఎవరూ వుండరు. ఇప్పుడే గాదు. 1941 జూలైలో అరుణాచలం వెళ్ళినప్పటినుండీ నేటివరకూ నాకు ఏకాంత వాసమే. అప్పుడు ఆశ్రమంలోవున్న సరూపభగవానుడూ, ఇప్పుడు చిత్రపటరూపంగావున్న అరూప భగవానుడూ తోడు నీడగా సదా వుంటూవున్నారన్నమాట. ఎవరైనా ''ఒంటరిగా ఎల్లా వుంటున్నావమ్మా?'' అంటే ''భగవాన్ ఉన్నారుగా?'' అని నిర్భీతిగా సమాధానం చెప్పే శక్తిని భగవాన్ అనుగ్రహించారు. ఆ భగవదనుగ్రహమే ధైర్యస్థైర్యములనిచ్చి, ''యోగీయుంజీత సతత, మాత్మానం, రహసి, స్థితః | ఏకాకీ, యతచిత్తాత్మా, నిరాశీ రపరిగ్రహః'' (భ=అ=6=శ్లో=10) తా=ఆత్మధ్యానముగల యోగి, నియమింపబడిన మనస్సు, దేహము కలవాడయి, కోరికలు లేనివాడయి పరిగ్రహ శూన్యుడై, ఒంటరిగా రహస్య ప్రదేశమునందు నివసించి అంతఃకరణమును సదా నిగ్రహించవలెను.) అన్న గీతావచనము 1941 నుండీ నేటివరకూ నా జీవితాన్ని నడుపుతూ వున్నదని భావిస్తూ వున్నాను. ఆ అనుగ్రహమే క్రమంగా నన్ను పరిపక్వ స్థితికి తెచ్చి, ''విహాయ కామాన్ యస్సర్వా&, పుమాంశ్చరతి నిస్స్పృహః | నిర్మమో నిరహంకార, స్సశాన్తి మధిగచ్ఛతి || (భ=అ=2=శ్లో=1) (తా=ఏ పురుషుడు సమస్తములైన కామములను విడచి కాంక్షారహితుడై నిస్స్పృహతో అహంకార మమకారములు లేనివాడై సంచరించుచున్నాడో ఆ పురుషుడు శాంతిని పొందుతున్నాడు.) అని కృష్ణభగవానులు చెప్పిన ఉత్తమ స్థితికి తీసుకొని పోగలదని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. భగవాన్ అనుగ్రహించునుగాక. నా నివాసం అరుణాచలం నుంచి మారినా ఏటేటా కొంత కాలం ఆశ్రమంలో గడపటం నా విధిగా భావించి నేటి వరకూ అల్లాగే గడుపుతున్నానని చాలాచోట్ల వ్రాసే వున్నాను. వెళ్ళినప్పుడల్లా ఆశ్రమంవారంతా నన్నెంతో వాత్సల్యంగా పూర్వంవలెనే చూస్తూ వున్నారు. భగవానుకు పెద్ద కూతరువనీ ఆశ్రమానికి పెద్దాడబడుచువనీ వెనుకటి రోజుల్లో అంతా అనేవారు. ఇప్పుడున్నూ అల్లాగే అంటూవున్నారు. భగవాన్ పూర్వాశ్రమ బంధువులంతా నన్ను వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా భావిస్తారు. టి.యన్. వెంటకరామన్ నన్ను అక్కా అనీ, అతని పిల్లలు అత్తా అని పిలుస్తారు. వారంతా గురుబంధువులన్న మాట. ''గురువే తల్లియుఁ దండ్రియు గురువే దైవంబు జీవ కోటికి నెల్లన్ | గురువు వినా, దైవంబీ ధరలో గలడనుచు, దలప దగదే మనసా?'' అన్న పద్యం అందరికీ స్మరణీయమైనది.