Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

15. భరతోపాఖ్యానము

వ్యామోహము

భరతుడను మహారాజు పంచజని యను కన్యను పెండ్లియాడి, అహంకారమునకు పంచ తన్మాత్రలు పుట్టిన రీతిని, ఏవురు పుత్రులను కనెను. అతడు ధర్మంబున రాజ్యము చేయుచుండి భగవదారాధనల యందు కాలము గడపి ఏబది లక్షల వేలయేండ్లు రాజ్యము పాలించిన తరువాత తన ధనంబును పుత్రులకు పంచి యిచ్చి పులహాశ్రమంబు చేరెను. అచట సాలగ్రమముల పూజించి శ్రీహరిసేవ చేయుచుండెను. దానివలన శమ దమాది సాధన చతుష్టయ సంపత్తి అతని కేర్పడెను. ఒక దినము నదియందతడు స్నారమాచరించు చుండగా నిండు చూలాలుగా నున్న ఒకజింక నీరుత్రాగుటకై వచ్చి, సింహ గర్జనమువిని భీతచిత్తయై యెగురగా గర్భస్రావమై యది మరణించెను. దానికి జనించిన లేడికూన నీటబడి తేలుచుండుట జూచి భరతుడు కరుణార్ద్ర చిత్తుడై తల్లిలేని ఆహరిణ శాబకమును తన యాశ్రమమున పెంచెను. అతడు భగవదర్చనాదుల విస్మరించి ఆ లేడికూన లాలన పాలన పోషణముల యందు లగ్నచిత్తుడయ్యెను. ఇట్లు పుత్రాదులను కూడ వదలివచ్చిన భరతుడు పూర్వ కర్మవశమున యోగభ్రష్టు డయ్యెను. అతడు ప్రాణోత్క్రమణ సమయమున హరిణరూపమునే మనస్సున నిల్పుటచేత తరువాత జన్మమున హరిణమై పుట్టి పూర్వజన్మ స్మృతి కలిగియుండెను. మృగ దేహమును వదలగోరి భరతుడు శుష్కవర్ణ తృణాహారుడై కొన్ని దినములకు శరీరము వదలి అంగిరసు డను బ్రాహ్మణనకు సుతుడై పుట్టెను.

ఉత్కృష్టమైన బ్రాహ్మణ జన్మను పొంది తన పూర్వజన్మ పరంపరల స్మరించుచు ఉన్మత్త జడాంధ బధిరులవలె నగుపించు చుండెను. జనకు డతనికి జాత కర్మాదులు నిర్వర్తించి గాయత్రి మంత్రో పదేశ మొనర్చెను. తల్లితండ్రులు గతించిన తరువాత అన్న లతనిని చదువనీయక గృహకర్మల చేయుమనిరి. సుఖదుఃఖముల యందభిమానము జూపక బ్రహ్మచర్యము బూని దొరికిన దానితో తృప్తి జెందు చుండును.

ఒకనాడు సంతాన కాముడైన వృషలపతి భరతుని కాళికకు బలియివ్వ గొనిపోయెను. అప్పుడు భరతుడు

''...........................చంపగా

వచ్చిన వారియందు, గరవాలము నందును, గాళియందు దా నచ్యుత భావముంచి హృదయంబున బద్మదళాక్షు నిల్పి''

అనుమానము బొందక యుండెను. భాగవతము 5-126

భద్రకాళి, బ్రహ్మభూతాత్ముడైన భరతుని బ్రహ్మతేజము చూడ దుస్సహమైన, భయమంది వృషలపతిని భృత్య వర్గమును చంపివైచెను.

ఒకనాడు రహూగణుడను సింధు భూపాలుడు కపిల మహాముని వద్ద బ్రహ్మజ్ఞానము నెఱుగ గోరి శిబిక నారోహించి యరుగుచుండెను. శిబికను మోయు బోయలు చేనిలో గాపున్న భరతుని జూచి శిబికను మోయమని అతని తలపై బెట్టిరి. అతడు దానికి జింతింపక మోయుచుండెను గాని భారమును సరిగా మోయ జాలక అందులో గూర్చున్న రాజునకు బాధ కలిగించెను. ఆ వాహకులు తమవలన తప్పులేదన భరతుని మహాత్మ్యము తెలియక అతనిని దూషించెను. భరతు డతనికి తత్త్వోపదేశములైన మాటలు జెప్పెను. రాజతని వాక్యముల భావము గ్రహించి, అత డవధూతయని భావించి, శిబిక దిగి, యతనిని క్షమింపుమని వేడికొని, అతనివలన తత్త్వ విజ్ఞానమును తెలిసికొని దేహాత్మభ్రమను బాసెను.

ఈ కథ విన్నవారిని పుండరీకాక్షుడు రక్షింమను. ఆయు రభివృద్ధి, ధనధాన్య సమృద్ధి, స్వర్గాది భోగములు కలుగును.

భరతోపాఖ్యానము వలన గ్రహింపదగినవి.

(1) అంత్యకాలమున మనమున నెట్టి చింత యుండునో అట్టి జన్మ కలుగును. దీనినే భగవద్గీతలో ఇట్లు కృష్ణపరమాత్మ తెలిపెను.

శ్లో|| యం యం నాపి స్మరన్‌ భావం త్యజ త్యంతే కలేవరమ్‌

తం తమే వైతి కౌన్తేయ! సదా తద్భావ భావితః

ఎవడు మరణకాలమున ఏఏ భావమును స్మరించుచు శరీరమును విడుచునో ఆయా భావమునే పొందును.

భరతుడు మరణకాలమున తాను పెంచిన జింకను స్మరించుట వలన అతడు జింకయై పుట్టెను కదా? కావున యోగభ్రష్టుడయ్యెను.

(2) భగవద్గీతలో యోగభ్రష్టుడు మరుజన్మలో శ్రీమంతుల ఇంటగాని యోగుల ఇంటగాని జన్మించునని తెలుపబడినది.

శ్లో|| ప్రాప్స పుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీ స్సమాః

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో7భి జాయతే

శ్లో|| అథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం ---భగవద్గీత

యోగసిద్ధిని పొందని మనుజుడు రెండవ జన్మమున పరిశుద్ధులగు శ్రీమంతుల ఇండ్లలో బుట్టుచున్నాడు లేదా యోగుల ఇండ్లలో బుట్టును.

అట్లే యోగభ్రష్టుడైన భరతుడు హరిణజన్మను త్యజించిన తరువాత ఉత్కృష్టమైన బ్రాహ్మణ జన్మను పొందెను.

(3) #9; అవధూతలు ఉన్మత్త జడాంధులవలె అగుపింతురు.

(4) మాయా శక్తియైన భద్రకాళి బ్రహ్మభూతాత్ముడైన భరతుని బలిగొనలేదు.

''నాత్మానం మాయా స్పృశతి''

(5) భక్తులకు భగవంతుని యందు దక్క ఇతరుల యందు వ్యామోహ ముండరాదు.

(6) విధి బలీయ మగుటచేత పూర్వకర్మాను సారము జరుగును.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters