Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

17. గజేంద్ర మోక్షము

సంసార విముక్తి

గజేంద్రమోక్షము జీవుడు ముక్తినిజెందు కథ. ''గజరాజ మోక్షణ కథను వినువారికి మోక్ష మరచేతిదై యుండు'' (8-135) నని ఫలశ్రుతి యందు చెప్పబడినది.

పూర్వము ద్రవిడ దేశాధీశ్వరుడగు ఇంద్రద్యుమ్న మహారాజు మౌనియై మహాశైలాగ్ర భాగమున నారాయణుని బూజసేయు కాలమున కలశజు డేతెంచెను. రాజతనిని పూజింపడయ్యెను. దాన కినిసి ఆ ఋషి ఇంద్రద్యుమ్నుని ''గజముగా బుట్టు'' మని శపించెను.

''విప్రులగని అవమానింప దగదు ఘన పుణ్యులకున్‌''

భాగవతము 8-124

శాప కారణమున ఇంద్రద్యుమ్నుడు గజరాజ మయ్యెను. అతని సేవక భటాదులు గజములైరి. అయినప్పటికిని అతడు తొలి జన్మమున విష్ణుసేవా పరతంత్రు డగుటచేత ఆ సేవ చెడని పదార్థమయ్యెను.

క|| చెడు కరులు హరులు ధనములు

జెడుదురు నిజ సతులు సుతులు జెడు చెనటులకున్‌

జెడక మనునట్టి గుణులకు

జెడని పదార్థములు విష్ణుసేవా నిరతుల్‌

భాగవతము 8- 12

ఈ కథలో ఏనుగులు జీవుని అజ్ఞాన అందకారమును సూచించు నన వచ్చును.

ఆ|| అంధకారమెల్ల నద్రి గ్రుహాంతర

వీధులందు బగలు వెఱచి డాగి

యెడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న

వెడలె ననగ గుహలు వెడలె గరులు. భాగవతము 8-27

గజేంద్రుడు తన పరివారముతో బయలుదేరి ఒక కాసారమును బ్రవేశించి నీరు ద్రాగుచు విహరింప దొడగెను. ఇంతలో మకర మొకటి గజేంద్రుని పాదములను బట్టుకొనెను. గజేంద్రుడు ఆ మకరముతో చాల కాలము పెనుగులాడి అలసిపోయెను. మకరము పట్టుదలతో యోగీంద్రుని వలె విక్రమించెను. యోగీంద్రుడు ఏకాగ్ర చిత్తముతో అప్రమత్తుడై చలింపక హరిపాద పద్మములను విడువక బట్టునట్లు మకరము కరీంద్రుని పాదముల నొడసి పట్టెను.

శా|| పాద ద్వంద్వము నేల మోపి, పవనున్‌ బంధించి పంచేంద్రియో

న్మాదంబున్‌ బరిమార్చి, బుద్ధి లతకున్‌ మాఱాకు హత్తించి, ని

ష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిం గ్రీడించు యోగేంద్రు మ

ర్యాదన్‌ నక్రము విక్రమించె గరి పాదాక్రాంత నిర్వక్రమై

భాగవతము 8-65

ఎంతటి గట్టి పట్టోచూడుడు. ''మొసలి పట్ట'' ను సామెత తెలిసినదే కదా? ధ్యాతకు మనసు చెదిరిన దేవతారూపము చెదరి ఏకవస్తు చింతనమగు ధ్యానమునకు అంతరాయము కలుగును. ఏ కార్య సాధన కైన పట్టుదల అవసరము. రాహువుచే మింగ బడిన సూర్యునివలె మొసలిచే గజేంద్రుడు పట్టువడెను. ఇక గజేంద్రుని స్థితిని పరికింతము. గజేంద్రుడు జీవుడు. అతడు ''మోహలతా నిబద్ధ పదమున్‌ విడిపించు కొనంగలేడు.'' సంసార సాగరమున జిక్కుకొని మోహపాశబద్ధుడై దీనుడై యుండెను. అతడు మాయచే గట్టువడిన జీవుడే కదా!

ఉ|| ఊహ గలంగి జీవనపు టోలమునన్‌ బడి పోరుచున్‌ మహా

మోహలతా నిబద్ధ పదమున్‌ విడిపించు కొనంగలేక సం

దేహము బొందు దేహిక్రియ దీన దశన్‌ గజముండె భీషణ

గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై.

భాగవతము 8-67

గజేంద్రుడు వేయి సంవత్సరములు మకరముతో పోరు సల్పినను గెలువజాలక పోయెను. ఇంద్రియార్థములకు లోబడి సంసారమగ్ను డైన జీవుడు తరింప జాలడు. అందులకే శంకరుడు

శ్లో|| సంసార సాగర విశాల కరాళ కామ

నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య

మగ్నస్య రాగలస దూర్మి నిపీడితస్య

లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలంబమ్‌

అని ప్రార్థించెను. సంసార సముద్రము నందలి కామమను మొసలిచే పట్టుబడి విషయ చింతనలను అలలచే పీడింపబడు నాకు చేయూత నిమ్మని వేడికొనెను.

పూర్వపుణ్యవశమున దివ్యజ్ఞాన సంపత్తిగల గజేంద్రుడు మొసలిని పోరున జయింప జాలడని గ్రహించెను. ఆత్మానాత్మ విచారము చేయు వానివలె చింతనముచేయ మొదలిడెను. ''ఎవరి ప్రాపు వలన మకరమును జయింప గలను. దశలక్షకోటి సంఖ్యగల ఏనుగులకు నాథుడనైన నేను సుఖముగా నుండక కర్మవశమున నీటికై కాసారమున కేల వచ్చితిని?'' అని ఇట్లు పరిపరి విధముల చింతించి ''అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ'' అని విశ్వేశ్వరుని శరణువేడెను.

ఉ|| ఎవ్వనిచే జనించు జగ, మెవ్వని లోపలనుండు లీనమై

ఎవ్వనియందు డిందు, పరమేశ్వరు డెవ్వడు, మూలకారణం

బెవ్వడు, అనాది మధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా

డెవ్వడు, వాని నాత్మభవు, నీశ్వరు నే శరణంబు వేడెదన్‌

కాని

క|| కలడందురు దీనుల యెడ

కలడందురు పరమయోగి గణముల పాలన్‌

కలడందు రన్ని దిశలను

కలడు కలండనెడి వాడు కలడో? లేడో?

భాగవతము 8-86

వినుదట జీవుల మాటలు,

సనుదట చనరాని చోట్ల, శరణార్థుల కో

యనుదట పిలచిన, సర్వము

గనుదట, సందేహమయ్యె గరుణా వార్థీ! భాగవతము 8-91

అని సంశయాత్మకు డయ్యెను. ఇంతలో గజేంద్రుని పరిస్థితి విషమించినది.

శౌ|| లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్‌

ఠావుల్‌ దప్పెను, మూర్చవచ్చె, తనువున్‌ డస్సెన్‌, శమంబయ్యెడిన్‌

నీవేతప్ప ఇతః పరంబెరుగ, మన్నింపం గదే దీనుడన్‌

రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!

భాగవతము 8-90

స్వశక్తి దిగజారినది. అన్యుల సహాయము లభింపలేదు. అన్యచింతన లేక అనన్యమైన భక్తితో భగవంతుని శరణు వెడెను. తుదకు ''శరణార్థిని నన్ను గావవే'' యని అపన్న శరణ్యుడగు శ్రీహరిని వేడుకొనెను.

ఇట్లు మొఱలిడు మత్తేభమును రక్షించుటకై వచ్చు శ్రీహరిని పోతన మత్తేభ పద్యములతో వర్ణించెను. ''సంసార చక్రంబును బోలేద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై'' యొప్పు నప్పంకజాకరంబును శ్రీహరి కనుగొని కామ క్రోధన గేహమైన మకరమును చక్రముచే ఖండించెను. కాపారమును సుఖదుఃఖాది ద్వంద్వములు గల సంసారము తోడను, మకరమును కామ క్రోధాదుల చేతను పోల్చుట ఎంత సమంజసముగ నున్నదో పరికింపుడు. అప్పుడు గజేంద్రుడెట్టి సౌందర్యముతో నొప్పెనో చూడుడు.

తమముం బాసిన రోహిణీ విభుక్రియన్‌ దర్పించి, సంసార దుః

ఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిం గ్రాహంబు పట్టూడ్చి, పా

దము లల్లార్చి, కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పె సం

భ్రమ దాశాకరిణీ కరోజ్ఘిత సుధాంభ స్స్నాన విశ్రాంతుడై.

భాగవతము 8-115

అజ్ఞానమను మేఘము తొలగి జ్ఞానచంద్రు డగుపించునట్లు సంసార దుఃఖము వీడ్కొన్న విరక్తచిత్తుని సౌందర్యము గజేంద్రుని యందు కాన వచ్చినది. కావున గజేంద్ర మోక్షము జీవునకు కామము తొలగి ముక్తి ప్రాప్తించు కథయని చెప్పవచ్చును.

ఈ కథ వలన గ్రహింపదగినవి :-

(1) ''మోక్ష మొసంగిన నీవ ఈవలెన్‌'' అని గోపన్న చెప్పినట్లు సర్వ దేవాత్మకుడైన శ్రీహరియే ముక్తి నొసగ సమర్థుడు - త్రిగుణ మూర్తులైన అంబుజాసనాది త్రిమూర్తులు విశ్వమయత లేక కాపాడ జాలరైరి. త్రిగుణా తీతుడైన భగవంతుడే రక్షింప గలిగెను.

ఆ|| విశ్వమయతలేమి వినియు నూరక యుండి

రంబుజాసనాదు లడ్డబడక

విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు

భక్తి యు తున కడ్డపడ దలంచె

--- భాగవతము 8-94

(2) సంశయ రహితుడై శ్రీహరిని శరణు వేడవలయును. ఇంద్రియ బలము తగ్గగా, గజేంద్రుడు మనస్సు నేకాగ్రముచేసి ''నీవే తప్ప ఇతఃపరం బెరుగ'' నని ధ్యానించెను. ''ఇంద్రియంబు లీశ్వర విషయంబులైన, మది సంచిత నిశ్చల తత్త్వమైనచో సరసిజనాభు కీర్తనమెణాలు విపద్దశలన్‌ దరింపగన్‌'' అను విదుర మైత్రేయ సంవాదములోని వాక్యము ఇందు వర్తించుచున్నది.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters