Sri Bhagavadgeetha Madanam-2
Chapters
22. రుక్మిణీ కల్యాణము పాతి వ్రత్యము:- భగవద్భక్తురాలికిని పతివ్రతకును చక్కని సామ్య మున్నది. గోపికలు కామోత్కంఠత, ఉద్ధామ ధ్యాన గరిష్ఠులై శ్రీహరిని పొంద గలిగినట్లే, పతినే ప్రత్యక్షదైవముగా భావించి పతివ్రత త త్సేవా నిమగ్నురాలై తరింపవచ్చునని రుక్మిణీ కల్యాణ కథ సూచించుచున్నది. విదర్భదేశమునకు రాజైన భీష్మక మహారాజునకు ఐదుగురు పుత్రులు. వారి కడగొట్టు చెల్లెలు రుక్మిణీదేవి ఆమె శ్రీకృష్ణుని రూపబల గుణాదులను తన తండ్రికడ కేతెంచు అతిథులవలన విని, శ్రీకృష్ణుని యందు బద్ధానురాగయై యుండెను. కాని రుక్మి అను అన్న ఆమెను శిశుపాలున కిచ్చుట కుద్యుక్తుడయ్యెను. క్రూరుడైన రుక్మినెదురించుటకు తల్లిదండ్రులుకూడ వెనుకాడిరి. అందువలన రుక్మిణీ దేవి అగ్నిద్యోతనుడను బ్రాహ్మణుని ద్వారా తన ప్రేమను శ్రీకృష్ణునకు సందేశరూపమున విన్నవించుకొనెను. ''ఈశ్వరాదులు కూడ ఆత్మీయ తమోనివృత్తికొఱకు నీపాదతోయముల మునుగ వాంఛింతురు. అట్టి నీ కరుణకు నేను పాత్రురాలు కావలెనని'' సందేశమంపెను. తమోనివృత్తి అనగా అజ్ఞానాంధకారము తొలగించుట అనిగాక తమోగుణనివృత్తి అని అర్థము చెప్పినచో అనుకూలముగా నుండును. తమోగుణమువలన ఇంద్రియము లేర్పడినను ఇంద్రియములను ఈశ్వర విషయములచూసి వానిని జయింపవలయును. రుక్మిణీదేవి ఆ విధముగ చేయ ప్రయత్నించినదని ముందు తెలియవచ్చును. మ|| ఘను లాల్మీయ తమోనివృత్తికొఱకై, గౌరీశు మర్యాద, నె వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు, రేనట్టి నీ యనుకంపన్ విలసింపనేని, వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిను జింతించుచు ప్రాణముల్ విడిచెదన్, నిక్కంబు బ్రాణశ్వరా! భాగవతము 10-1708 విష్ణు పాదోద్భనమైన గంగయందు మునుగగా ఆత్మయ తమో నివృత్తి కలుగును. అనగా తమోగుణము నశించును. ఇట్టి తమో నివృత్తికొఱకు రుక్మిణీదేవి ప్రార్థించినది. ''అగ్ని ముఖా వైదేవాః'' అనుటచేత హవిస్సును వ్రేల్చి యజ్ఞయాగాదుల నొనర్చి అగ్ని దేవుని ద్వారా దేవతలను తృప్తి పరచునట్లు, రుక్మిణీదేవి మనోయజ్ఞమొనర్చి అగ్నిద్యోతను డను బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునకు సందేశమంపి ఆత్మార్పణము చేసికొన్నదని చెప్పవచ్చును. భగవంతుడను అగ్ని యందు అహంకారమను సమిధను వేల్చుటయే మనోయజ్ఞమని అవ్యక్తోపనిషత్తున చెప్పబడినదని ముందుగ తెలిపియుంటిని. విష్ణు పురాణములో పతియే ప్రత్యక్షదైవమనియు, స్త్రీలకు పతి సేవ దక్క ఉపవాసములు పూజలు వ్రతములు అవసరము లేదనియు చెప్పబడినది. పతిభక్తియే ఐహికాముష్మిక సుఖములను ముక్తిని కలిగించుచున్నది. హిందూధర్మమున పాతివ్రత్యమునకు అగ్రస్థానమివ్వబడినది. మ|| మృతుడౌ భర్తకు జీవమియ్య జమునిన్ మెప్పించె నొక్కర్తె, తా పతిసేవా నిరతిన్ త్రిమూర్తులను పాపల్ గాగ నాడించె నొ క్కతె, సూర్యోదయ మాపె వేరొకతె ---శ్రీసతీ శతకము సావిత్రి యమధర్మరాజును మెప్పించి మగనిని బ్రతికించుకొనెను. అనసూయ త్రిమూర్తులను పాపలజేసి యాడించెను. నర్మద తన భర్తపై మాండవ్యుని శాపము వర్తింన కుండుటకై సూర్యోదయమునే ఆప గల్గెను. ఇట్లు అనేక మహాత్మ్యములను పతివ్రతలు చూపగల్గిరి. ఇచట ఒక సందేహము కలుగవచ్చును. పరమ పురుషుడైన శ్రీకృష్ణుని భర్తగా కోరి గోపికలు, రుక్మిణి, రాధా మొదలగువారు తరించి యుండవచ్చును. కాని సామాన్యపురుషుడైప భర్తను పరమ పురుషుడైన భగవంతునిగా భావించుట తగునా? యని ప్రశ్నింప వచ్చును. మానవునకు ఇంద్రియములు స్థూలదేహము తమోగుణము నేర్పడెను. అత డింద్రియార్థములకు దాసు డగును. కామ క్రోధాదులు ప్రకోపించును. కాన తమోగుణమును ఇంద్రియములను జయించుటకై నవవిధ భక్తి మార్గములచే భగవంతుని సేవించి ఇంద్రియముల నీశర్వపరము జేయుమని భాగవతము సూచించుచున్నది. నిజ మనోరథ ఫలదాయకములయ్యును భగవత్ సేవా విరహితములైన కార్యముల జేయనివాడు ఆత్మంతిక భక్తుడు. ఇట్టి భక్తుడు స్థిత ప్రజ్ఞుడై తమోగుణమును ఇంద్రియములను జయించును. అందులకే గీతలో ''ఇంద్రియాణ్యాదౌని యమ్య భరతర్హభ!'' అని శ్రీకృష్ణుడు తెలిపెను. అట్లే ఆత్యంతిక భక్తునివలె పతివ్రత తన ఇంద్రియ తృప్తికై పతిని సేవింపక, పతిని తృప్తిపరచుటకై పతిసేవ సేయవలయును. ఆమె ఇంద్రియములను ప్రత్యక్ష భగవంతునిగా భావించిన భర్త పరముగా జేయువలయును. అప్పుడు కామ క్రోధాదులు తమోగుణము జయింపగలదు. ఇట్టి నిష్కామసేవయే ఆత్యంతికభక్తి యనవచ్చును. రుక్మిణీదేవికూడ తన పంచేంద్రియములు శ్రీకృష్ణపరముగాని జన్మవ్యర్థమని ఇట్లు సందేశ మంపెను. సి|| ప్రాణశ! నీ మంజు భాషలు వినలేని కర్ణ రంద్రంబుల కలిమి ఏల? పురుషరత్నమ! నిన్ను భోగింపగా లేని తనులత వలని సౌందర్య మేల భువనమోహన! నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్త్వమేల దయిత! నీ యధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధిఏల. గీ|| నీరజాత నయన! నీ వనమాలికా గంధ మబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని జన్మమేల వేయి జన్మలకును. భాగవతము 10-1709 పై పద్యములో పంచేంద్రియములు భర్త పర మొనర్చుటకు సూచింపబడినది కదా? ఇంద్రియములను జయించి తమోగుణమును తొలగించుకొన్న తరువాత మనోవిక్షేప కారణమైన రజోగుణమును తొలగింపవలెను. దీనికి భాగవతములో కపిలుడు సూచించిన అవయవయోగమును అలవరచుకొనవలెను. అనగా భగవంతుని రూపమును లేదా భర్త రూపమును ఫలకమున నిలుపుకొనవలయును. చిత్రపటమున అగుపించు పరోక్షదైవముయొక్క ఆకారముకంటె ప్రత్యక్షదైవమైన భర్త రూపము ఎక్కువ ప్రయత్నము లేకయే మనః ఫలకమున నిలుపవచ్చును, ఇది ఏకవస్తు చింతనమై మానసిక ఏకాగ్రతకు దారి తీయును. ఆపైత్రిపుటి నశించి ఆత్మ సాక్షాత్కార మగును. భగవంతునకుకూడ రూపనామములు లేవు. ఉపాసనా సౌలభ్యముకొరకై దేవునికి నామ రూపములు కల్పించిరి. శ్లో|| చిన్మయస్య అద్వితీయస్య నిర్గుణస్య అశరీరిణః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ---రామ తాపిని ఐహికముగా విచారించినను భర్తకు భార్య అనుకూలవతిగా నుండవలెను కదా. అందులకే మనుచరిత్రలో ప్రవరుడు ''అనుకూల వతి నాదు మనసులో వర్తించు కులకాంత'' అని భార్యను గూర్చి చెప్పెను. శ్లో|| కార్యేషు దాసీ కరణషు మంత్రీ రూపేచ రంభా, క్షమయా ధరిత్రీ పోషేచ మాతా, శయనేతు వేశ్యా షట్కర్మ యుక్తా ఖలు ధర్మపత్నీ. పై విధముగా అనుకూలవతియగు భార్య నిష్కామముతో పతిని దైవముగా భావించి సేవించినను భగవంతుని పొందవచ్చునని రుక్మిణీ కల్యాణ కథ వ్యక్తము చేయుచున్నది. శ్రీ కృష్ణుడు రుక్మిణీదేవి సందేశమును అగ్నిద్యోతముని ద్వారా విని ఆమె భక్తి ప్రపత్తులకు సంతసించి స్వయముగా వచ్చి చేకొని పోయెను.