Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్వినవత్యుత్తర శతతమోధ్యాయః అథ చతుర్దశీ వ్రతాని అగ్నిరువాచ : వ్రతం వక్ష్యే చతుర్దశ్యాం భుక్తిముక్తిప్రదాయకమ్ | కార్తికే తు చతుర్దశ్యాం నిరాహారో యజేచ్ఛివమ్. 1 వర్షం భోగధనాయుష్మాన్ కుర్వన్ శివచతుర్దశీమ్ | మార్గశీర్షే సితే೭ష్టమ్యాం తృతీయాయాం మునివ్రతః. 2 ద్వాదశ్యాం వా చతుర్దశ్యాం ఫలాహారో యజేత్సురమ్ | త్యక్త్వా ఫలాని దద్యాత్తు కుర్వన్ ఫలచతుర్దశీమ్. 3 చతుర్దశ్యామథాష్టమ్యాం పక్షయోః శుక్లకృష్ణయోః | అనశ్నన్పూజయేచ్ఛమ్భుం స్వర్గ్యుభయచతుర్దశీమ్. 4 కృష్ణాష్టమ్యాం తు నక్తేన తథా కృష్ణచతుర్దశీమ్ | ఇహ భోగానవాప్నోతి పరత్ర చ శుభాం గతిమ్. 5 కార్తికే తు చతుర్దశ్యాం కృష్ణాయాం స్నానకృత్సుఖీ | ఆరాధితే మహేన్ద్రే తు ధ్వజాకారాసు యష్టిసు. 6 తతః శుక్లచతుర్దశ్యామనన్తం పూజయేద్ధరిమ్ | కృత్వా దర్భమయం చైవ వారిధానీసమన్వితమ్. 7 శాలిప్రస్థస్య పిష్టస్య పూపనామ్నః కృతస్య చ | అర్ధం విప్రాయ దాతవ్యమర్ధమాత్మని యోజయేత్. 8 కర్తవ్యం సరితాం చాన్తే కథా కృత్వా హరేరితి | అనన్తసంసారమహాసముద్రే మగ్నాన్సమభ్యుద్ధర వాసుదేవ | అనన్తరూపే వినియోజయస్వ హ్యనన్తరూపాయ నమో నమస్తే. 9 అనేన పూజయిత్వాథసూత్రం బద్ధ్వా తు మన్త్రితమ్ | స్వకే కరే వా కణ్ఠ వా త్వనన్తవ్రతకృత్సుఖీ. 10 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నానాచతుర్దశీ వ్రతాని నామ ద్వినవత్యధిక శతతమో೭ధ్యాయః. అగ్నిదేవుడు పలికెను : భుక్తిముక్తి ప్రదాయకములగు చతుర్దశీవ్రతములను చెప్పెదను. కార్తికచతుర్దశినాడు నిరాహారుడై శివుని పూజించవలెను. అది మొదట ప్రతిమాసము శివచతుర్దశినాడు వ్రతము-శివపూజనము ఒక సంవత్సరము పాటు జరుపవలెను. ఇట్లు చేయువాడు భోగ - ధన - దీర్ఘాయుఃసంపన్ను డగును. మార్షశీర్ష శుక్లపక్షమున అష్టమీ-తృతీయా ద్వాదశీ - చతుర్దశులలో ఒక నాడు మౌనవ్రత మవలంబించి, ఫలములు మాత్రము భుజించుచు దేవతాపూజ చేయవలెను. కొన్ని ఫలములు త్యజించి, వాటిని దానము చేయవలెను. ఈ విధముగ ఫలచతుర్దశీవ్రతమాచరించువాడు రెండు పక్షముల చతుర్దశీ-అష్టమీ తిథులయందు ఉపవాస ముండి శివునిపూజించవలెను. ఇట్లు రెండు పక్షములందును చతుర్దశీవత్రము చేయువానికి స్వర్గము లభించును. కృష్ణపక్ష అష్టమీ - చతుర్దశులందు రాత్రిభోజనము మాత్రము చేయువాడు ఇహలోకమున అభీష్ట భోగములను పరలోకమున శుభగతిని పొందును. కార్తిక కృష్ణచతుర్దశినాడు స్నాన మాచరించి, ధ్వజాకారమగు వెదురు గడపై ఇంద్రిని పూజించువాడు సుఖవంతుడగును. పిదప ప్రతిమాసమునందును శుక్లచతుర్దశినాడు కుశలతో విష్ణువిగ్రహము నిర్మించి దానిని జలపూర్ణకలశముపై నుంచి పూజించవలెను. ఆనాడు ఒక ప్రస్థము బియ్యము పిండితో అప్పములు వండి సగము బ్రాహ్మణునకు దానము చేసి, సగముతాను ఉపయోగించవలెను. నదీతటమున ఈ వ్రతపూజాదులు చేసి, అనంతవ్రతకథ వినిపించవలెను. పదునాలుగు ముడులు గల అనంతసూత్రము నిర్మించి దానిని అనంతునిగ పూజించి - ''ఓ వాసుదేవా! అనంత మైన సంసార మహాసముద్రమునందు మునిగిన మమ్ము ఉద్ధరించుము. నీ అనంతరూపమునందు మమ్ములను కలుపుకొనుము. ఓ అనంతరూపా! నీకు నమస్కారము'' అను అర్థము గల మంత్రము పఠించుచు, చేతికి గాని కంఠమునకు గాని కట్టుకొనవలెను. ఈ విధముగ అనంతవ్రతమాచరించువాడు పరమానందసంపన్నుడగును. అగ్నిమహాపురాణమునందు వివిధచతుర్దశీవ్రతవర్ణన మను నూట తొంబదిరెండవ అధ్యాయము సమాప్తము.