Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ చతుర్నవత్యధిక శతతమో೭ధ్యాయః అథ అశోకపూర్ణిమాదివ్రతాని అగ్నిరువాచ : అశోకపూర్ణిమాం వక్ష్యే భూధరం చ భువం యజేత్ | ఫాల్గున్యాం సితపక్షాయాం వర్షం స్యాద్భుక్తిముక్తిభాక్. 1 కార్తిక్యాం తు వృషోత్సర్గం కృత్వా నక్తం సమాచరేత్ | శైవం పదమవాప్నోతి వృషవ్రతమిదం పరమ్. 2 పిత్ర్యా యామావసీ తస్యాం పితౄణాం దత్తమక్షయమ్ | ఉపోష్యాబ్దం పితౄనిష్ట్వా నిష్పాపః స్వర్గమాప్నుయాత్. 3 పఞ్చదశ్యాం చ మాఘస్య పూజ్యాజం సర్వమాప్నుయాత్ | వక్ష్యే సావిత్ర్యమావాస్యాం భుక్తిముక్తికరీం శుభామ్. 4 పఞ్చదశ్యాం వ్రతీ జ్యేష్ఠే వటమూలే మహాసతీమ్ | త్రిరాత్రోపోషితా నారీ సప్తధాన్యైః ప్రపూజయేత్. 5 ప్రరూఢైః కణ్ఠసూత్రైశ్చ రజన్యాం కుఙ్కుమాదిభిః | వటావలమ్బనం కృత్వా నృత్యగీతైః ప్రభాతకే. 6 నమః సావిత్ర్యై సత్యవతే నైవేద్యం చార్పయేద్ద్విజే | వేశ్మ గత్వా ద్విజాన్ భోజ్య స్వయం భుక్త్వా విసర్జయేత్. 7 సావిత్రీ ప్రీయతాం దేవీ సౌభాగ్యాదికమాప్నుయాత్ | ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే తిథి వ్రతాని నామ చతుర్నవత్యధిక శతతమో೭ధ్యాయః. అగ్ని పలికెను : ఫాల్గునశుక్లపూర్ణిమనాడు వరాహమూర్తిని, భూదేవిని పూజించవలెను. ఈ విధముగ ఒక సంవత్సర మాచరించువాడు భుక్తిముక్తులను పొందును కార్తికపూర్ణిమనాడు వృషోత్సర్గము చేసిర రాత్రి వ్రతమును అనుష్ఠించవలెను. దీనిచే శివలోకము పొందును. దీనికి ''వృషోత్సర్గవ్రతము'' అని పేరు. ఆశ్వయుజమున పితృపక్ష అమావాస్యయందు పితృదేవతల నుద్దేశించి చేసిన దానము అక్షయఫలప్రదము. ఏ సంవత్సరమునం దైనను ఈ అమావాస్యనాడు ఉపవాస ముండి పితృపూజ చేయువాడు పాపవిముక్తుడై స్వర్గము పొందును. మాఘ అమావాస్యనాడు బ్రహ్మను పూజించినవాడు సకలాభీష్టములను పొందును. ఇపుడుభుక్తిముక్తిప్రదమగు వటసావిత్రీ వ్రతమును గూర్చి చెప్పెదను. వ్రత మాచరించు స్త్రీ మూడు దివసములు ఉపవాసము చేసి, జ్యేష్ఠఅమావాస్యనాడు వటవృక్షమూలమునందు మహాపతివ్రతయగు సావిత్రిని సప్తధాన్యములతో పూజించవలెను. కొంచెము రాత్రి శేషించి యుండగా ఆ వటవృక్షమునకు కంఠసూత్రము చుట్టి కుంకుమాదులతో దానిని పూజించవలెను. ప్రభాతసమయమున ఆ వటముదగ్గర నృత్యము చేయుచు గీతములు గానము చేయవలెను. నమః సావిత్య్రై సత్యవతే'' అనుచు సావిత్రీసత్యవంతులకు నమస్కారము చేసి, వారికి సమర్పించిన నైవేద్యము బ్రాహ్మణునకు దాన మీయవలెను. పిదప ఇంటికి వచ్చి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తరువాత తాను భుజించవలెను. ''సావిత్రీదేవీ ప్రీయతామ్'' అని అనుచు వ్రతసమాప్తి చేయవలెను. ఇట్లు చేసిన స్త్రీ సౌభాగ్యాదులను పొందును. అగ్నిమహాపురాణమునందు తిథివ్రతవర్ణన మను నూట తొంబది నాల్గవ అధ్యాయము సమాప్తము.