Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ పఞ్చోత్తర ద్విశతతమో7ధ్యాయః అథ భీష్మపఞ్చకవ్రతమ్ అగ్నిరువాచ : భీష్మపఞ్చకమాఖ్యాస్యే వ్రతరాజం తు సర్వదమ్ | కార్తికస్యామలే పక్షే హ్యేకాదశ్యాం సమాచరేత్. 1 దానాని పఞ్చ త్రిః స్నాత్వా పఞ్చ వ్రీహితిలైస్తథా | తర్పయేద్దేవపిత్రాదీన్మౌనీ సంపూజయేద్దరిమ్. 2 పఞ్చగవ్యేన సం స్నాప్య దేవం పఞ్చామృతేన చ | చన్దనాద్యైః సమాలిప్య గుగ్గులుం సఘృతం దహేత్. దీపం దద్యాద్దివా రాత్రౌ నైవేద్యం పరమాన్నకమ్ | ఓం నమో వాసుదేవాయ జపేదష్టోత్తరం శతమ్. 4 జుహుయాచ్చ తిలాభ్యక్తాం స్తిలవ్రీహీన్తతో వ్రతీ | షడక్షరేణ మన్త్రేణ స్వాహాకరాన్వితేన చ. 5 కమలైః పూజయేత్పాదౌ ద్వితీయే బిల్వపత్రకైః | జానుసక్థితృతీయే థ నాభిం భృఙ్గరజేన తు. 6 బాణబిల్వజపాభిస్తు చతుర్థే పఞ్చమే7హని | మాలయా భూమిశాయీ స్యాదేకాదశ్యాం తు గోమయమ్. 7 గోమూత్రం దధి దుగ్ధం చ పఞ్చమే పఞ్చగవ్యకమ్| పౌర్ణమాస్యాం చరేన్నక్తం భుక్తిం ముక్తిం లభేద్వ్రతీ. 8 భీష్మః కృత్వా హరిం ప్రాప్తస్తేనై తద్భీష్మపఞ్చకమ్| బ్రహ్మణః పూజనాద్యైశ్చ హ్యుపవాసాదికం వ్రతమ్. 9 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే భీష్మపఞ్చకవ్రతం నామ పఞ్యాధిక ద్విశతతమో7ధ్యాయః. అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు సకలమనోరథములను తీర్చు వ్రతరాజు మైన భీష్మపంచకవ్రతమును గూర్చి చెప్పెదను. కార్తిక శుక్లైకాదశినాడు ఈ వ్రతమును ప్రారంభించి, ఐదు దినములపాటు మూడు వేళల స్నానము చేయుచు తిలలతోను, యవలతోను దేవతలకును. పితరులకును ఐదు తర్పణము లీయవలెను. మౌనముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను, పచామృత-పంచగవ్యములతో స్నానము చేయించి, చందనాది సుగంధద్రవ్యములు అలది, ఘృతయుక్తమగు గుగ్గులు వెలిగించవలెను. ప్రాతఃకాలమునందును, రాత్రియందును శ్రీమహావిష్ణువునకు దీపము చూపి, భోజ్యపదార్థములు నివేదనము చేయవలెను. ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అను ద్వాదశాక్షరీమంత్రమును నూట ఎనిమిది పర్యాయములు జపించవలెను. ద్వాదశాక్షరమంత్రమునకు చివర 'స్వాహా' చేర్చి ఘృతసిక్తము లగు తిలలను, యవలను హోమము చేయవలెను. మొదటి దినము భగవంతుని పాదములను కమలములతోను, రెండవ దినము మోకాళ్లను, తొడలను బిల్వపత్రములతోను, మూడవ దినమున నాభిని భృంగరాజముతోను, నాల్గవ దివసమున బాణపుష్ప-బిల్వపత్ర-జపాపుష్పములతోను, ఐదవ దివసమున మాలతీపుష్పములతోను సర్వాంగములను పూజించవలెను. వ్రతము నాచరించువాడు భూమిపై శయనించవలెను. ఏకాదశినాడు గోమయమును, ద్వాదశియందు గోమూత్రమును, త్రయోదశియందు పెరుగును. చతుర్దశి యందు క్షీరమును, చివర దినమునందు పంచగవ్యములను ఆహారముగ గ్రహించవలెను. పౌర్ణమాసియందు నక్తవ్రతము చేయవలెను. ఈ విధముగ వ్రతము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. భీష్ముడు ఈ వ్రతము నాచరించుటచే శ్రీహరిని చేరెను. కావుననే దీనిక 'భీష్మపంచకము' అను పేరు వచ్చినది. బ్రహ్మ కూడ ఈ వ్రతమాచరించి శ్రీహరిని పూజించెను. అందుచే ఈ వ్రతము పంచోపవాసాదులతో కూడియున్నది. అగ్ని మహాపురాణమునందు భీష్మపంచకవ్రతకథన మను రెండువందలఐదవ అధ్యాయము సమాప్తము.