Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టత్రింశో7ధ్యాయః.

అథ దేవాలయ నిర్మాణఫలమ్‌.

అగ్నిరూవాచ:

వాసుదేవాలయస్తస్య కృతౌ వక్ష్యే ఫలాదికమ్‌| చికేర్షోర్దేవధామాది సహస్రజని పాపనుత్‌. 1

మనసా సద్మకర్తౄణాం శతజన్మాఘానాశనమ్‌| యో7నుమోదన్తి కృష్ణస్య క్రియమాణం నరా గృహమ్‌. 2

తే7పి పాపైర్వినిర్ముక్తాః ప్రయాన్త్యచ్యావలోకకమ్‌| సమతీతం భవిష్యం చ కులానామయుతం నరః. 3

విష్ణులోకం నయత్యాశు కారయిత్వా హరేర్గృహమ్‌| వసన్తి పితరో హృష్ణా విష్ణులోకే హ్యలఙ్కృతాః 4

విముక్తా నారకైర్దుఃఖైః కర్తుః కృష్ణస్య మన్దిరమ్‌| బ్రహ్మహత్యాదిపాపౌఘఘాతకం దేవతాలయమ్‌. 5

ఫలం యన్నాప్యతే యజ్ఞేర్ధామ కృత్వా తదాప్యతే| దేవాగారే కృతే సర్వతీర్థస్నానఫలం భ##వేత్‌. 6

అగ్నిదేవుడు చెప్పెను:- మునీశ్వరా! వాసుదేవాదులకొరకు దేవాలయమును చేయించుటకే కలుగు ఫలమును చెప్పుచున్నాను. దేవాలయములు కట్టవలె ననియు. తటాకాదులు నిర్మింపవలె ననియుకలిగిన శుభసంకల్పము అట్టి సంకల్పము కలవాని వేల కొలది జన్మ పాపములను నశింపచేయును. భావనచేతనైన దేవాలయనిర్మాణము చేసినవాని అనేక జన్మల పాపములు తొలగిపోవును. ఎవరైన దేవమందిరాదులు గట్టుచున్నప్పుడు దానిని ఆమోదించినవారు కూడ సమస్తపాపములు తొలగి విష్ణులోకమును పొందుదురు. శ్రీమహావిష్ణువునకు ఆలయము నిర్మించినవారు భూతకాలమునందలి వేయి తరములవారిని భవిష్యత్తులోని వేయి తరములవారిని విష్ణులోకనివాసార్హులనుగ చేయును. శ్రీకృష్ణుని ఆలయమును నిర్మించినవాని పితరులు వెంటనే నరకదుఃఖమునుండి విముక్తులై. దివ్యవస్త్రాభరణాదులు ధరించి ఆనందముతో విష్ణులోకమున నివసింతురు. దేవాలయనిర్మాణము బ్రహ్మహత్యాదిపాములను తొలగించులు. యజ్ఞము చేయుటవలన కలుగని ఫలములు గూడ దేవాలయనిర్మాణముచే కలుగును. దేవాలయనిర్మాణమువలన సమస్తతీర్థములందును స్నానము చేసిన ఫలము కలుగును.

దేవాద్యర్థే హతానా చ రణ యత్తత్ఫలాదికమ్‌| శాఠ్యేన పాంసునా వాపి కృతం ధామ చ నాకదమ్‌. 7

ఏకాయతకనకృత్స్వర్గీ త్య్రగారీ బ్రహ్మలోకభాక్‌| పఞ్చాగారీ శమ్భులోకమష్టాగారాద్ధరౌ స్థితిః. 8

షోడశలాయకారీ తు భుక్తిం ముక్తి మవాప్నుయాత్‌ | కనిష్ఠ మధ్యమం శ్రేష్ఠం కారయిత్వా హరేర్గృహమ్‌. 9

స్వర్గం చ వైష్ణవం లోకం మోక్షమాప్నోతి చ క్రమాత్‌ |

శ్రేష్ఠమాయతనం విష్ణోః కృత్వాయుద్ధనవాన్లభేత్‌. 10

కనిష్ఠేనైన తత్పుణ్యం ప్రాప్నోత్యధనవాన్నరః| సముత్పాద్య ధనం కృత్వా స్పల్పేనాపి సురాలయమ్‌. 11

కారయిత్వా హరేః పుణ్యం ప్రాప్నోత్యభ్యధికం వరమ్‌| లక్షేణాథ సహస్రేణ శతస్యార్ధేన వా హరేః 12

కారయన్‌ భవనం యాతి యత్రాస్తే గరుడధ్వజః|

దేవతాబ్రాహ్మణాదుల రక్షణము నిమిత్తము రణభూమిలో ప్రాణాత్యాగము చేసిన వీరునకు ఏ ఫలము లభించునో ఆ ఫలము దేవాలయనిర్మాణము చేయువానికి లభించును. లోభముచే మట్టితో దేవాలయము కట్టించినవానికి గూడ స్వర్గముగాని దివ్యలోకము గాని లభించును. ఏకాయతన దేవాలయము (ఒకే దేవతా విగ్రహమునకై ఒక గది గల ఆలయము నిర్మించినవాడు స్వర్గమును పొందును. త్య్రాయతనదేవాలయమును నిర్మించినవాడు బ్రహ్మలోకములో నివసించును. పంచాయతనదేవాలయమును నిర్మించినవాడు శివలోకమును చేరును. అష్టాయతనమందిరము నిర్మించినవాడు శ్రీహరిసాంనిధ్యము నందుండును. షోడశాయతనదేవాలయ నిర్మాణముచేసినవాడు భోగమును, మోక్షమును కూడా పొందును. శ్రీహరి దేవాలయములలో కనిష్ఠము, మధ్యమము, శ్రేష్ఠము అను మూడు శ్రేణు లున్నవి. వీటి నిర్మాణము వలన క్రమముగ స్వర్గలోక-విష్ణులోక-మోక్షములు ప్రాప్తించును. ధనవంతుడు శ్రేష్ఠశ్రేణికి చెందిన విష్ట్వాలయమును నిర్మించుటచే ఎట్టి పలితమును పొందునో ఆ ఫలితమునే కనిష్ఠ శ్రేణికి చెందిన దేవాలయమును నిర్మించిన నిర్ధనుడు పొందును. తాను సంపాదించిన ధనములో స్వల్పధనమును మాత్రమే వెచ్చించి దేవాలయమును నిర్మించినను భక్తుడు అధిక మగు పుణ్యమును, భగవంతుని అనుగ్రహమును పొందును. ఒక లక్షగాని, ఒక వెయ్యి గాని, నూరు గాని, దానిలో సగము గాని ముద్రలను వెచ్చించి విష్ణుమందిరమును నిర్మించువాడు శ్రీ మహావిష్ణులోకమును చేరును.

బాల్యే తు క్రీడమానా యే పాంసుభిర్భవనం హరేః. 13

వాసుదేవన్య కుర్వన్తి తే7పి తల్లోకగామినః| తీర్థే చాయతనే పుణ్య సిద్ధక్షేత్రే తథాశ్రమే. 14

కర్తురాయతనం విష్ణోర్యథోక్తాత్త్రిగుణం ఫలమ్‌| బన్దూకపుష్పవిన్యాసైః సుధాపఙ్కేన వైష్ణవమ్‌. 15

యేవిలిమ్పన్తి భవనం తే యాన్తి భగవత్పురమ్‌| పతితం పతమానం తు తథార్ధపతితం నరః 16

సముద్ధృత్య హరేర్ధామ ప్రాప్నోతి ద్వగుణంఫలమ్‌| పతితస్య తు యుః కర్తా పతితస్య చ రక్షితా. 17

విష్ణోరాయతనస్యేహ స నరో విష్ణురూపభాక్‌| ఇష్టకానిచ యస్తి ష్ఠేద్యావదాయతనం హరేః 18

నకులస్తస్యవై కర్తా విష్ణులోకే మహీయతే| స ఏవ పుణ్యవాన్‌ పూజ్య ఇహలోకే పరత్ర చ. 19

కృష్ణస్య వాసుదేవస్య యః కారయతి కేతనమ్‌| జాతః స ఏవ సుకృతీ కులం తేనైవ పాలితమ్‌. 20

బాల్యమునందు ఆట లాడుచు మట్టితో విష్ణ్వాలయమును నిర్మించినవారు కూడ విష్ణలోకమును చేరుదురు. తీర్థములందు, పవిత్రాస్థానములందు, సిద్ధక్షేత్రములందు, ఆశ్రయములందు విష్ట్వాలయమును నిర్మించువారికి ఇతర ప్రదేశము లందు నిర్మించువారికంటె మూడు రెట్లు ఎక్కువ ఫలము లభించును. విష్ణ్వాలయమునకు వెల్లవేసినవారును, దానిపై బంధూకపుష్పముల చిత్రములు వేసినవారును విష్ణులోకమును పొందుదురు. కూలిపోయిన లేదా కూలిపోవుచున్న లేదా సగము కూలిపోయిన దేవాలయమును జీర్ణోద్ధారణము చేసినవానికి క్రొత్తదేవాలయము నిర్మించినవానికంటె రెట్టింపు ఫలము లభించును. కూలిపోయిన విష్ణ్వాంయమును మరల నిర్మించి రక్షించినవాడు సాక్షాత్‌ భగవత్స్వరూపుడు. భగవంతుని ఆలయమునందు ఇటుకలు ఎంతకాల ముండునో అంతవరకును, వాటిని నిర్మించినవాడు, తన కులముతో కూడ, విష్ణులోకములో నుందును. ఇహలోకమునందును, పరలోకమునందును గూడ ఆతడే పూజనీయుడు; అతడే పుణ్యవంతుడు.

విష్ణురుద్రార్కదేవ్యార్గృహకర్తా స కీర్తిభాక్‌ | కిం తస్య విత్తనిచయై ర్మూఢస్య పరిరక్షిణః. 21

దుఃఖార్జితైర్యః కృష్ణస్య న కారయతి కేతనమ్‌ | నోపభోగ్యం ధనం తస్య పితృవిప్రదివౌకసామ్‌. 22

నోపభోగాయ బన్దూనాం వ్యర్థస్తస్య ధనాగమః | యథా ధృవో నృణాం మృత్యుర్తిత్తనాశస్తథా ధృమః. 23

మూఢస్తత్రానుబధ్నాతి జీవితేథ చలే ధనే | యదా విత్తం న దానాయ నోపభోగాయ దేహినామ్‌. 24

నాపి కీర్తైన ధర్మార్థం తస్య స్మామ్యే7థ కోగుణః | తస్మాద్వితం సమాసాద్య దైవాద్వా పౌరుషాదథ.

దద్యాత్సమ్యగ్ద్విజాతిభ్యః కీర్తనాని చ కారయేత్‌ | దానేభ్యశ్చాధికం యస్మాత్కీర్తనేభ్యో వరం యతః 26

అతస్తత్కారయేద్దీమాన్‌ విష్ణ్వాదేరమన్దిరాదికమ్‌| వినివేశ్య హరేర్ధామ భక్తిమద్భిర్నరోత్తమైః. 27

నివేశితం భ##వేత్కృత్స్నం త్రైలోక్యం సచరాచరమ్‌|

భూతం భవ్యం భవిష్యం చ స్థూలం సూక్ష్మం తథేతరత్‌. 28

ఆబ్రహ్మస్తమ్బపర్యన్తం సర్వం విష్ణోః సముద్భవమ్‌ | తస్య దేవాదిదేవస్య సర్వగస్య మహాత్మనః. 29

నివేశ్య భవనం విష్ణోర్న భూయో భువి జాయతే | యథా విష్ణోర్ధామకృతా ఫలం తద్వద్దివౌకసామ్‌. 30

శివబ్రహ్మార్కవిఘ్నేశ చణ్డీలక్ష్మాదికాత్మనామ్‌ | దేవాలయకృతేః పుణ్యం ప్రతిమాకరణ7ధికమ్‌. 31

ప్రతిమాస్థాపనే యాగే ఫలస్యాన్తో న విద్యతే | మృన్మయాద్ధారుజే పుణ్యం దారుజాదిష్టకోద్భవే. 32

ఇష్టకోత్థాచ్ఛైలజే స్యాద్దేమాదేరిధికం ఫలమ్‌ | సప్తజన్మకృతం పాపం ప్రారమ్భాదేవ నశ్యతి. 33

దేవాలయస్య స్వర్గీ స్యాన్నరకం న స గచ్ఛతి | కులానాం శతముద్ధృత్య విష్ణోర్లోకం నయేన్నరః. 34

యమో యమభటానాహ దేవమన్దిరకారిణః |

శ్రీకృష్ణునకు ఆలయము కట్టించిన పుణ్యాత్ముడే పుట్టినవారిలో లెక్క. అతడే తన వంశమును రక్షించువాడు. విష్ణు-శివ-సూర్య-దేవ్యాదులకు ఆలయమును నిర్మించువాడే ఈ లోకమునందు కీర్తి పొందును. ఎంతో శ్రమపడి సంపాదించిన ధనమును, శ్రీకృష్ణాలయమును నిర్మించుటకు వినియోగింపక, కేవలము దానిని రక్షించుచుండు మూమార్ఖునకు దానివల్ల ఏమి ప్రయోజనము కలుగును? పితరులు, బ్రాహ్మణులు, దేవతలు-వీరికై తన ధనమును వినియోగించని వాని ధనము, బంధువులకు ఉపకరించని వాని ధనము వ్యర్థము. దానమునకు గాని, భోగమునకు గాని, ధర్మాచరణమునకు గాని, కీర్తికొరకు గాని ఉపకరించని ధనమునకు స్వామి అయి ఏమి ప్రయోజనము? అందుచే పూర్వజన్మాదృష్టముచేత గాని, పురుషప్రయత్నముచేత గాని, మరి ఏఉపాయాంతరముచేత గాని లభించిన ధనమును ఉత్తమబ్రహ్మణులకు దానము చేయవలెను; స్థిరకీర్త లభించుటకు ఉపయోగించవలెను. దానికీర్త్యాదుకంటె గూడ దేవాలయనిర్మాణము ఉత్తమ మైనది గాన బుద్ధిమంతుడు విష్ణ్వాదిదేవతలకు ఆలయములు కట్టించవలెను. భక్తిమంతు డగు పురుషుడు దేవాలయమును నిర్మించి, దానిలో దేవతా ప్రతిష్ఠ చేసినా డనగా, అతడు చరాచరరూపములగు ముల్లోకములగు ముల్లోకములను భవనమునిర్మించినాడని యర్థము భూతవర్తమాన భవిష్యత్కాలములకు చెందిన, స్థూల-సూక్ష్మరూపము. తద్భిన్నము అయిన బ్రహ్మాదిస్తంబాంత మగు ప్రపంచ మంతయు మహావిష్ణువునుండియే జనించినది. దేవాధిదేవుడును, మహాత్ముడును అగు అట్టి విష్ణువునకు ఆలయమును నిర్మించినవాడు మరల ఈ సంసారమునందు జనింపడు. శివ-బ్రహ్మ-సూర్య-గణశ-దుర్గా-లక్ష్మాదిదేవతలకు ఆలయమును నిర్మింపచేసి వారికి ఆలయనిర్మాణము చేయించినవారికంటె గూడ అధికఫలము లబించును. దేవతాప్రతిమా స్థాపనరూప మగు యజ్ఞమువలన లభించు ఫలము అనంతము, మట్టితో చేసిన ప్రతిమకంటె కఱ్ఱతో చేసిన ప్రతిమ ఉత్తమ మైనది. దానికంటె ఇటుకలతో నిర్మించినది, దానికంటె ఱాయితో నిర్మించినది, దానికంటె సువర్ణాదిలోహముంతో నిర్మించినది శ్రేష్ఠమైనది, దేవాలయ ప్రారంభము చేసినంతమాత్రముననే ఏడు జన్మల పాపము నశించును. నిర్మించువాడు స్వర్గలోకప్రాప్తికి అధికారి యగును. అతడు నరకమునకు వెళ్ళడు. అంతే కాదు-ఆతడు తన వంశములోని నూరు తరములవారిని విష్ణులోకమునకు పంపును యమధర్మరాజు తన దూతలతో, దేవాలయములు నిర్మించువారిని గూర్చి ఇట్లు చెప్పెను.

యమ ఉవాచ:

ప్రతిమా పూజాదికృతో నానేయ నరకం నరాః. 35

దేవాలయాద్యకర్తార ఆనేయాస్తే విశేషతః |

విచరధ్వం యథాన్యాయ్యం నియోగో మమ పాల్యతామ్‌. 36

నాజ్ఞాభఙ్గం కరిష్యన్తి భవతాం జన్తవః క్వచిత్‌ | కేవలం యే జగత్తాత మనన్తం సముప్రాశ్రితాః. 37

భవిద్భః పరిహర్తవ్యాస్తేషాం నాత్రాస్తి సంస్థితిః | యత్ర భాగవతా లోకే తచ్చిత్తాస్తత్పరాయణాః. 38

వూజయన్తి సదా విష్ణుం తే వస్త్యాజ్యాః సుదూరతః | యస్తిష్ఠన్‌ ప్రస్వపన్‌ గచ్ఛన్నుత్తిష్ఠన్‌ స్ఖలిత్‌ స్థితే. 39

సఙ్కీర్తయన్తి గోవిన్దం తే చవస్త్యాజ్యాః సుదూరతః| నిత్యైర్త్నెమిత్తికైర్దేవం యే యజన్తి జనార్దనమ్‌. 40

నావలోక్యా భవద్భిస్తే తద్వ్రతా యాన్తి సద్గతిమ్‌ | యే పుష్పధూపవాసోభిర్భూషణౖశ్చాతివల్లభైః. 41

అర్చయన్తి న తే గ్రాహ్యా నరాః కృష్ణాలయం గతాః | ఉపలేపనకర్తారః సంమార్జనపరాశ్చ యే. 42

కృష్ణాలయే పరిత్యాజ్యాస్తేషాం పుత్రాస్తథా కులమ్‌ | యేన చాయతనం విష్ణో కారితం తత్కులోద్భవమ్‌.

పుంసాం శతం నావలోక్యం భరవద్భిర్దుష్టచేతసా | యస్తు దేవాలయం విష్ణోర్దారుశైలమయం తథా. 44

కారయేన్మృన్మయం వాపి సర్వపాపైః ప్రముచ్యతే | అహన్యహని యజ్ఞేన యజతో యన్మహాఫలమ్‌. 45

ప్రాప్నోతి తత్ఫలం విష్ణోర్యః కారయతి కేతనమ్‌ | కులానాం శతమాగామి సమతీతం తథా శతమ్‌. 46

కారయన్భగమద్ధామ నయత్యచ్యుతలోకకమ్‌ | సప్తలోకమయో విష్ణస్తస్య కయః కురతే గృహమ్‌. 47

తారయత్యక్షయాన్‌ లోకానక్షయాన్ప్రతిపద్యతే | ఇష్టకాచయవిన్యాసో యావన్త్యబ్ధాని తిష్ఠతి. 48

తావద్వర్షసహస్రాణి తత్కర్తుర్దివి సంస్థితిః | ప్రతిమాకృద్విష్ణులోకం స్థాపకో లీయతే హరౌ. 49

దేవసద్మప్రతికృతి ప్రతిష్ఠాకృత్తుగోచరే |

అగ్నిరువాచ :

యమోక్తా నానయంస్తేథ ప్రతిష్ఠాదికృతం హరేః | హయశీర్షః ప్రతిష్ఠార్థం దేవానాం బ్రహ్మణ7బ్రవీత్‌. 50

ఇత్యాది మహాపురాణ అగ్నేయే దావాలయాది నిర్మాణ మాహాత్మ్యాదివర్ణనం నామాష్టత్రింశో7ధ్యాయః.

యమధర్మరాజు చెప్పెను: "దేవ ప్రతిమా నిర్మాణముచేసినవారిని, దానికి పూజలు సలిపిని వారిని మీరు నరకమునకు తీసికొనిరాకూడదు. దేవాలయాదులను నిర్మింపనివారిని మాత్రమే తీసికొనిరావలెను. మీరందరు లోకములో సంచరించుచు నా ఆజ్ఞను పాలింపుడు. ప్రపంచమునందలి ఏ ప్రాణియు మీ ఆజ్ఞను ధిక్కరింపజాలడు. జగత్పిత యైన ఆనంతుని శరణుజొచ్చినవారిని మాత్రము మీరు విడచివేయవలెను. వారి కీ లోకములో నివాసము ఉండదు. భగవంతునిపై చిత్తము లగ్నము చేసి, భగవంతుని శరణుజొచ్చినభగవద్భక్తు లగు మహాత్ములను, సదా విష్ణుపూజ చేయువారిని మీరు విడిచివేయవలెమ. నిలచినపుడు గాని, నిద్రించినపుడు గాని, నడచునపుడు గాని, అన్ని వేళలందును శ్రీకృష్ణనామస్మరణము చేయువారి దరికి పోవలదు. నిత్యనైమిత్తికకర్మల ద్వారా జనార్దనుని పూజ చేయువారి వైపు కన్నెత్తి యైనను చూడవలదు. అట్టి భగవద్వ్రతశీలులు భగవంతునే చేరుదురు.

పుష్పములు, ధూపము, వస్త్రములు మొదలగు అలంకారములను సమర్పించి భగవంతుని పూజ చేయువారి జాడలకు పోవలదు. వారు శ్రీకృష్ణుని చేరినవారు. దేవాలయములందు ఆలికి ముగ్గులు వేయువారి పుత్రులను, వంశీయులకను కూడ విడిచివేయవలెను. విష్ణ్వాలయమును నిర్మించినవారి వంశములో నూరు తరములవరకును మీరెవ్వరిని దుష్టభావముతో చూడరూదు. కఱ్ఱతో గాని, మట్టితో గాని, ఱాతితో గానీ విష్ణువులనకు ఆలయము కట్టించినవాడు సమస్తపాపనిర్ముక్తుడగును. ప్రతిదినము యజ్ఞములు చేసి భగవదారాధన చేయువానికి లభించు ఫలమే విష్ణ్వాలయము నిర్మించినవానికి గూడ కలుగును. విష్ణ్వాలయము కట్టించినవాడు తన వంశము నందలి వెనుకటి నూరుగురిని, రాబోవు నూరుగురిని విష్ణలోకమునకు పంపును మహావిష్ణువు సప్తలోకమయుడు. అట్టి విష్ణుమూర్తికి ఆలయము కట్టించువాడు తన వంశమును తరింపచేయును. తన వంశీయులకు అక్షయపుణ్యలోక ప్రాప్తి కలుగు నట్లు చేయును. తాను కూడ అక్షయలోకములను పొందును. దేవాలయములోని ఇటుకల కట్టుబడి ఎన్ని సంవత్సరము లుండునో అన్ని వేల సంవత్సరములపాటు ఆ దేవాలయ నిర్మాత స్వర్గలోకములో నుండును. భగవత్ప్రతిమ నిర్మించినవాడు విష్ణులోకము చేరును. దానిని స్థాపించినవాడు భగవంతునిలో లీన మగును. దేవాలయము నిర్మించు దానిలో ప్రతిమాస్థాపన చేసినవాడు సర్వదా విష్ణులోకములో నివసించును."

అగ్నిదేవుడు పలికెను.: యమధర్మరాజు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారము, యమదూతలు విష్ణస్థాపనాదిపుణ్యకార్యములు చేసినవారిని యమలోకమునకు తీసికొవివెళ్ళరు. దేవాలయాదిప్రతిష్ఠాదివిధానమును గూర్చి హయగ్రీవుడు బ్రహ్మతో విర్ణించి చప్పెను.

అగ్ని మహాపురాణము నందలి దేవాలయనిర్మాణమాహాత్మ్యదివర్ణన మను ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters