Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్వ్యశీతితమోధ్యాయః అథ సంస్కార దీక్షావిధిః. ఈశ్వర ఉవాచ : వక్ష్యే సంస్కారదీక్షాయా విధానం శృణు షణ్ముఖ | ఆవాహయేన్మ హేశస్య వహ్నిస్థస్య శిరో హృది. 1 సంశ్లిష్టౌ తౌ సమభ్యర్చ్య సంతర్ప్య హృదయాత్మనా | తయోః సన్నిధయే దద్యాత్తేనై వాహుతిపఞ్చకమ్. 2 కుసుమేనాస్త్రలిప్తేన తాడయేత్తం హృదా శిశుమ్ | ప్రస్పురత్తారకాకారం చైతన్యం తత్ర భావయేత్. 3 ప్రవిశ్య తత్ర హుంకారముక్తం రేచకయోగతః | సంహారిణ్యా తదాకృష్య పూరకేణ హృది న్యసేత్. 4 తతో వాగీశ్వరీయోనౌ ముద్రయోద్భవసంజ్ఞయా | హృత్సమ్పుటిత మన్త్రేణ రేచకేన వినిక్షిపేత్. 5 ఓం హాం హాం అత్మనే నమః | జాజ్వల్యమానే నిర్దూమే జుహుయాదిష్టసిద్ధయే | అప్రవృద్ధే సధూమే తు హోమే వహ్నౌ న సిద్ధతి. 6 స్నిగ్ధః ప్రదక్షిణావర్తః సుగన్థిః శస్యతే೭నలః | విపరీతః స్ఫులిఙ్గీ చ భూమిస్పర్శః ప్రశస్యతే. 7 ఇత్యేవమాదిభిశ్చిహ్నైర్హుత్యా శిస్యస్య కల్మషమ్ | పాపభక్షణహోమేన దహేద్వా తం భవాత్మనా. 8 జ్వాజత్వాపాదనార్థాయ తథా రుద్రాంశభావనే | ఆహారబీజసంశుద్ధౌ గర్భాధానాయ సంస్థితౌ. 9 సీమన్తే జన్మతో నామకరణాయ చ హోమయేత్ | శతాని పఞ్చ మూలేన వౌషడాదిదశాంశతః. 10 ఈశ్వరుడు పలికెను- కుమారస్వామీ! ఇపుడు సంస్కార దీక్షావిధిని గూర్చి చెప్పెదను. అగ్ని యందున్న శివుని అర్ధనారీశ్వరరూపమును తన హృదయమునందు ఆవాహన చేయవలెను. శివుడును, పార్వతియు ఒకే శరీరమున కలిసియున్నారు. అని భావన చేసి పూజించి, హృదయమంత్రముచే, తర్పింపచేయవలెను. వారి సాంనిధ్యమును కోరుచు హృదయమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. అస్త్రమంత్రముచే పుష్పమును అభిమంత్రించి, దానితో శిష్యుని హృదయమున తాడనము చేయవలెను. వానిలో నక్షత్రాకారమున ప్రకాశించున్న జీవుని భావించవలెను. హుంకారయుక్త రేచక ప్రాణాయామముతో శిష్య హృదయమునందు ప్రవేశించి నట్లు భావన చేసి, సంహారిణీ ముద్రతో ఆ జీవుని అచటినుండి లాగి, పూరక ప్రాణాయాయముచే తన హృదయమున స్థాపించుకొనవలెను. ఉద్బవముద్రను ప్రదర్శించుచు, హృత్సం పుటితమగు ఆత్మముద్రను ఉచ్చరించుచు, రేచక ప్రాణాయామ సాహాయ్యముచే దానిని వాగీశ్వదీదేవి యోనియం దుంచి నట్లు భావన చేయవలెను. ''హాం హాం హామాత్మనే నమః'' అనునది ఆత్మమంత్రము. బాగుగా ప్రజ్వలించుచున్న, ధూమరహిత మైన అగ్నిలో అభీష్టసిద్ధికొరకై హోమము చేయవలెను. ధూమయుక్తమై, ప్రజ్వలించని అగ్నిలో చేసిన హోమము సఫలము కాజాలదు. అగ్నిజ్వాలలు దక్షిణావర్తములై ప్రసరించినను ఉత్తమమగు గంధము వచ్చుచున్నను, అగ్ని చాలా తేజోవంతముగ కనబడినను, అది శ్రేష్ఠము. ఇందుకు విపరీతముగ, అగ్ని నుండి నిప్పునెరసులు ఎగురుచున్నను, అగ్ని జ్వాల భూమిని స్పృశించుచున్నను ఉత్తమముకాదు. ఈ గుర్తులచే శిష్యుని పాపమును గుర్తించి ఆగ్నిలో హోమము చేయవలెను. లేదా పాపభక్షణహోమములచే ఆ పాపమును భస్మము చేయవలెను. శిష్యునకు నూతన విధమున ద్విజత్వము సిద్ధించుటకును, రుద్రాంశ భావనకును, ఆహార బీజశుద్ధి నిమిత్తమును, గర్భాదాన - గర్భస్డితి - శీమంతోన్నయన - జాతకర్మ - నామకరణములకొరకును, వేరు వేరుగా, మూల మంత్రముతో, ఐదేసి వందల ఆహుతుల నీయవలెను. చూడా కర్మాదులకొరకై దశమాంశ హోమములు చేయవలెను. శిధిలీభూతబన్ధస్య శక్తావుత్కర్షణం యత్ | ఆత్మనో రుద్రపుత్రత్వే గర్భాధానం తదుచ్యతే. 11 స్వాతన్త్ర్యాత్మగుణవ్యక్తిరిహ ప్రంసవనం మతమ్ | మాయాత్మనోర్వివేకేన జ్ఞానం సీమన్తవర్ధనమ్. 12 శివాదితత్త్వశుద్ధేస్తు స్వీకారో జననం మతమ్ | బోధనం యచ్ఛివత్వేన శివత్వార్హస్య నో మతమ్. 13 సంహారముద్రాయాత్మానం స్థురద్వహ్నికణోపమమ్ | విదధాత సమాదాయ నిజే హృదయపఙ్కజే. 14 తతః కుమ్భకయోగేన మూలమన్త్రముదీరయేత్ | కర్యాత్సమవశీభావం తదా చ శివయోర్హృది. 15 బ్రహ్మాదికారణత్యాగ క్రమాద్రేచకయోగతః | నీత్వా శివాన్తమాత్మానమాదాయోద్భవముద్రయా. 16 హృత్సంపుటితమన్త్రేణ రేచకేన విధానవిత్ | శిష్యస్య హృదయాంభోజకర్ణికాయాం వినిక్షి పేత్. 17 పూజాం శివస్య వహ్నేశ్చ గురుః కుర్యాత్తరోచితామ్ | ప్రశాతిం చాత్మనే శిష్యం సమయాఞ్ఛ్రావయేత్తథా. దేవం న నిన్దేచ్ఛాస్త్రాణి నిర్మాల్యాది న లఙ్ఘయేత్ | శివాగ్ని గురుపూజా చ కర్తవ్యా జీవితావధి. 19 బాలబాలిశవృద్ధస్త్రీభోగభుగ్వ్యాధితాత్మనమ్ | యథాశక్తి దదీతార్ధం సమర్థస్య సమగ్రకమ్. 20 ఈ విధముగ శిధిల మైన బంధనము గల జీవాత్మలో కలుగు శక్త్యుత్కర్షమే రుద్రపుత్రుడు అగుటకు నిమత్త మగుటచే గర్భాధాన మని చెప్పబడును. వానిలో స్వతంత్రముగ ఆత్మగుణములు ఆవిర్భవించుటయే పుంసవనము. మాయ వేరు, ఆత్మ వేరు అను జ్ఞానము కలుగుటయే సీమంతోన్నయనము. శివాదిశుద్ధ సద్వస్తుస్వీకారమే జన్మ. 'నేను శివుడను' అను జ్ఞాన ముదయించుటయే శివత్వయోగ్యుడగు శిష్యునకు నామకరణము ప్రకాశించుచున్న అగ్ని కణము వలె ఉన్న జీవాత్మను, సంహారముద్రచే తీసి తన హృదయ కమలమునం దుంచుకొనవలెను. పిమ్మట కుంభక ప్రాణాయామముతో మూలమంత్రోచ్చారణము చేయుచు హృదయమునందు శివశక్తులను కలుపవలెను. క్రమముగా బ్రహ్మాదికారణములను పరిత్యజించుచు, రేచకముచే జీవాత్మను శివుని దగ్గరకు తీసికొనిపోయి, మరల ఉద్భవముద్రచే వెనుకకు తీసికొనివచ్చి, వెనుక చెప్పిన హృత్సంపుటితాత్మమంత్రముతో, రేచక ప్రాణాయామము చేయుచు, విధానము నెరిగిన గురువు శిష్యుని హృదయకమల కర్ణికయందు ఆ జీవాత్మను స్థాపించవలెను. పిమ్మట గురువు తత్కాలోచితముగ శివాగ్నుల పూజ చేసి, శిష్యునిచే తనకు నమస్కారము చేయించుకొని, ఆతనికి సమయాచారోపదేశము చేయవలెను. ''నీవెన్నడును ఇష్టదేవతా (శివ)నిందగాని, శైవశాస్త్రనిందగాని చేయరాదు. శివనిర్మాల్యాదులను దాటకూడదు. జీవితాంతము వరకును శివ-అగ్ని-గురువుల పూజ చేయవలెను. బాలకులకు, మూఢలకు, వృద్ధులకు, స్త్రీలకు, భోగమును కోరువారికిని (అన్నార్థులకును), రోగులకును యథాశక్తి ధనాదిదానము చేయవలెనను.'' సమర్థులైనవారు సర్వమును దానముచేయవలె నని నియమము చెప్పబడినది. భూతాఙ్గాని జటాభస్మదణ్డకౌపీనసంయమాన్ | ఈశానాద్యైర్హృద్యైర్వా పరిజప్య యధాక్రమాత్. 21 స్వాహా న్తసంహితామన్త్రైః పాత్రేష్వారోప్య పూర్వవత్ | సంపాదితం ద్రుతం హుత్వా స్థణ్డివేశాయ దర్శయేత్. 22 రక్షణాయ ఝటాధస్తాదారోప్య క్షణమాత్రకమ్ | శిరస్యాజ్ఞాం సమాదాయ దదీత వ్రతినే గురుః. 23 ఏవం సమయదీక్షాయాం విశిష్టాయాం విశేషతః | వహ్నిహోమాగమజ్ఞానయోగ్యః సంజాయతే శిశుః. 24 ఇత్యాదిమహాపురాణఆగ్నేయేసంస్కారదీక్షావిధిర్నామద్వ్యశీతితమో೭ధ్యాయః. వ్రతాంగములైన జటా-భస్మ-దండ-కౌపీనాదులను, సంయమపోషకములను అన్యవస్తువులను, ఈశానాది నామములచే గాని, లేదా వాటి ప్రారంభమున 'నమః' చేర్చి నామమంత్రములచే గాని అభిమంత్రించి, స్వాహాంతము లగు సంహితామంత్రములను పఠించుచు పాత్రలలో ఉంచి, వెనుకటి వలెనే సంపాతాభిహతములు (సంస్కార విశేషసంస్కృతములు) చేసి, స్థండిలీశు డగు శివుని ఎదుట ఉంచవలెను. వీటి రక్షణము కొరకై క్షణకాలము పాటు కలశము క్రింద ఉంచవలెను. పిమ్మట శివుని ఆజ్ఞగైకొని వాటిని శిష్యున కీయవలెను. ఈ విధముగ విశిష్టసమయదీక్షాసంపన్ను డగు శిష్యుడు అగ్నిహోమఅగమజ్ఞానాది యోగ్యత కలవా డగును. అగ్నిమహాపురాణమున సంస్కారదీక్షా విధి యను ఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.