Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

శ్రీరస్తు.

త్రిపురారహస్య జ్ఞానఖండసారము

పీఠిక

పరశురాముని పూర్వచరిత్రము

హైహయవంశీయుఁడు కార్తవీర్యార్జునుఁడు దత్తాత్రేయు నారాధించి అణిమాద్యష్టసిద్ధులను పొందెను. యోగశక్తిచే నతఁడు కావలసినపుడు వేయిబాహువులను పొందఁగలిగియుండెను. పరాక్రమమున అతనిని మించినవారు క్షత్రియులు గాని రాక్షసులు గాని అప్పుడు ఎవరును లేకుండిరి.

ఆతఁ డొకనాఁడు వేటకై వనములందు విహరించుచు జమదగ్నిమహర్షి యాశ్రమము చెంతకు వచ్చెను. మహర్షిని సందర్శించుటకై యాతఁడు ఆశ్రమమున ప్రవేశించెను. జమదగ్నియు మహారాజునకు స్వాగతము నొసంగి హోమధేనువుయొక్క మహిమచేత మంత్రిసేనాసమేతముగా ఆశ్చర్యకరమైన యాతిథ్యము నొసంగెను. ఆగోవుయొక్క మహిమకు అందఱును ఆశ్చర్యపరవశులై ఇట్టి దొకటి యీలోకమున కలదా అని ప్రశంసింపఁజొచ్చిరి. సాటిలేని యైశ్వర్యముతో విరాజిల్లుచున్న యామహారాజున కాప్రశంసలు భరింపరాని వయ్యెను. తనసంపదను మించిన సంపదకు సాధనమైన గోరత్నము ఒక సామాన్య బ్రాహ్మణుని యొద్ద నుండుట తనప్రాభవనమునకు కొఱత కలిగినట్లుగా భావించి ఆతఁడు వెంటనే ఆగోవును దూడతో కూడ రాజధానికి తీసికొని రండని భటుల కాజ్ఞాపించి వెడలిపోయెను.

అప్పుడు పరశురాముఁడు ఆశ్రమములో లేఁడు. రాజభటులు హోమధేనువును దూడను బలవంతముగా తీసికొనిపోయిన తరువాత కొంతసేపటికిపరశురాముఁడు తిరిగివచ్చెను. ఆతనిని జూడఁగనే ఆశ్రమవాసు లందఱును ఎదురేగి కన్నీళ్ళతో కార్తవీర్యుని దౌర్జన్యమునుగూర్చి చెప్పిరి. అతఁడు రోషావిష్టుఁడై వెంటనే కవచమును అక్షయతూణీరములను ధరించి విష్ణుధనువును పరశువును గైకొని మాహిష్యతీనగరమువైపు పరువిడెను. అప్పటి కింకను రాజు నగరమున ప్రవేశింపలేదు. భార్గవరాముని పింహగర్జనము విని సైన్యము సంభ్రమముతో వెనుదిరిగి ఆతనిని చుట్టుముట్టెను. భార్గవుడు ఒక్క పిడికిలియందు వందలబాణములను సంధించి ప్రయోగించుచు సమీపించినవారిని పరశువునకు బలిగావించుచు సైన్యమును నిర్మూలించెను. గోరత్నముచేతనేకాక పరాక్రమముచేత కూడ అతిశయించుచున్న యా బ్రాహ్మణుని జూచి కార్త వీర్యుఁడు అసూయావిష్టుఁడై విజృంభించి అయిదువందలచేతులలో అయిదువందల ధనువలును ధరించి మిగిలిన యయిదువందల చేతులతో బాణములను సంధించుచు రథమును రాముని పైకి తోలించెను. భార్గవుడుఁడుగ్రుఁడై ఒక్కవింటియందే అయిదువందల బాణములను సంధించి వానిధనువులను ఖండించి కనుఱప్పపాటు మాత్రమున రథముపైకి లంఘించి కార్త వీర్యుని వేయిబాహువులను శీర్షమును ఖండించి సింహగర్జనము గావించెను. అది చూచి కార్తవీర్యుని పుత్రులు పదివేలమంది భయభ్రాంతులై పారిపోయిరి. రాముఁడు దూడతో కూడ హోమధేనువును గైకొని ఆశ్రమమునకు తిరిగివచ్చెను.

ఆశ్రమవాసు లందఱు ఆశ్చర్యముతో ఆనందముతో చుట్టును చేరి ''జయజయ'' ఘోషలు సలుపుచుండగా రాముఁడు తండ్రియొద్దకు పోయి నమస్కరించి యుద్ధవృత్తాంతమును వర్ణించి చెప్పెను. ఆ మహర్షియు అంతయును శాంతముగ విని యిట్లనెను. ''వత్సా! రామా! సర్వదేవమయుఁడైన మానవేంద్రుని వధించి మహాపాప మొనర్చితివి. తండ్రీ! మనము బ్రాహ్మణులము గదా! బ్రాహ్మణులు క్షమాగుణముచేత పూజింపఁబడుచున్నారు. లోకగురుఁడైన విధాతయు క్షమచేతనే పరమేష్ఠిపదమును పొందియున్నాఁడు. సూర్యుని యందు కాంతివలె మనయందు బ్రాహ్మియైన లక్ష్మి క్షమచేతనే వెలుఁగొందును. విష్ణుదేవుఁడును క్షమావంతుల విషయముననే సంతోషము నొందును. మూర్ధాభిషిక్తుఁడైన రాజును చంపుట బ్రహ్మహత్య కన్నను మించినపాతకము. కావున విష్ణుదేవుని ధ్యానించుచు తీర్థములను సేవించుచు ఈపాపమును పోఁగొట్టుకొనుము''. తండ్రియాదేశమున రాముఁడు అట్లే యొక్కసంవత్సరము తీర్థయాత్రలు గావించి పాపరహితుఁడై తిరిగివచ్చెను.

పలుదిక్కులకు పారియోయిన కార్తవీర్యుని కుమారులు మెల్లగా రాజధానికి చేరి తండ్రివధను తలంచుకొని రోషావిష్టులై ఎట్లయియనను పగఁదీర్చుకో వలయునని నిశ్చయించుకొని అవకాశము కొఱకై వేచియుండిరి. ఒకనాఁడు రాముఁడు అనుచరులతో కూడ ఆశ్రమము నుండి వెడలిపోవుటను గమనించి ఆరాజపుత్రులు వెంటనే ఆశ్రమము నంజొచ్చి అగ్నిహోత్రగృహమునందు పరమాత్మధ్యాననిష్ఠుఁడైయున్న జమదగ్ని శీర్షమును ఖండించి పారిపోయిరి. ఆయన భార్య రేణుక గుండెలపై కొట్టుకొనుచు ''ఓరామా! రామా! రమ్ము'' అని ఎలుగెత్తి ఏడ్చుచుండెను. తల్లి యొక్క ఆర్తనాదమును విని రాముఁడు పరువెత్తుకొని వచ్చి తండ్రిని జూచి విలపించి క్రోధవేగవిమోహితుఁడై క్షత్రియుల నంతమొందింపక తప్ప దని తలంచి యాకళేబరమును కాపాడుచుంచుఁడని సోదరుల కప్పగించి యుద్ధసన్నద్ధుఁడై పరశువును గైకొని మాహిష్మతివైపు పరుగిడెను.

కోటలో గుమికూడిన రాజకుమారులు అనంతరకృత్యమును గూర్చి ఆలోచించుచుండిరి. బ్రహ్మార్షిహత్యనుగూర్చి విని ప్రజలు భాధనొందుచుండిరి. నగరము విగతప్రభ##మై యుండెను. రాముఁడు ప్రళయకాలరుద్రునివలె నగరమున ప్రవేశించి రాజకుమారుల తలలను ఖండించి కుప్పవేయఁగా నగరమధ్యమున అది యొకకొండవలెనయ్యెను. రక్తము కొండవాగువలె భయంకరమై ప్రవహించెను. అంతటితో శమింపక ఆభార్గవుఁడు అనుచరులను అన్ని దిక్కులకుపంపి వీరులైన క్షత్రియులందఱును శమంతపంచకమునకు రావలసినదిగా ఘోషణము గావించెను. క్షత్రియులును ఆఘోషణమును సహింపఁజాలక భార్గవుని ఎట్లయినను నిర్మూలింపవలయు ననుతలంపుతో సన్నద్ధులై గుమికూడి దండెత్తిపోయిరి. రాముఁడు వారి నందఱును నిశ్శేషముగా వధించెను. అట్లు రాముఁడు వీరాహ్వానము గావించు చుండఁగా ఇరువదియొక్క పర్యాయములు క్షత్రయవీరులు సబాలవృద్ధముగా సన్నద్ధులై వచ్చి ఆతని వైష్ణవధనువునకు పరశువునకు బలియైపోయిరి. అతఁడుఇంక ఎచ్చటను క్షత్రియవీరులు లెరని తెలిసికొని శాంతించి తండ్రియొక్క తలను శరీరముతో కూర్చి పితృమేధమును గావించెను. జమదగ్ని తపోమహత్త్వమున సప్తర్షిమండలమునఁ జేరి విరాజిల్లెను.

భూమి యంతయు అరాజక మగుటచే రాముఁడు ప్రజాపాలనము కొఱకై సకలధారుణికి తానే మహారాజుగా పట్టాభిషిక్తుఁడై అకృత వ్రణుఁడు మంత్రిగా పరిపాలించుచు నూతనస్మృతిని సైతము రచించెను. పిదప తాను కావించిన రాజసంహారమువలని పాపము శమించుటకై రాముఁడు పెక్కు యజ్ఞములను గావించి తూర్పుదేశమును హోతకు దక్షిణమును బ్రహ్మకు, పడమటిదిశను అధ్వర్యువునకు; ఉద్గాతకు ఉత్తరభాగమును, మధ్యలోనున్న యార్యావర్తమును ఉపద్రష్టయైన కశ్యపునకును దక్షిణగా నిచ్చి సరస్వతీనదియందు అవబృధస్నానముగావించి మేఘములయావరణము తొలంగిని సూర్యునివలె ప్రకాశించెను. భూమిని గైకొన్న కశ్యపుఁడు భార్గవుని జూచి, ''ఇంక ఈభూమి యంతయు మాది. నీ విచ్చట నుండదారు. ఎక్కడికైనఁ బొమ్ము'' అని శాసింపఁగా రాముఁడు, ''సరే కాని తీర్థయాత్రలకై నాకు కొంచెము అవకాశ మొసంగుఁడు'' అని ప్రార్థించెను. అందులకు కశ్యపుఁడు, ''అట్లయినచో పగలు తీర్థయాత్రలు గావించుచు ఇచ్చట పర్యటించినను రాత్రికి నీ విచ్చట నుండరాదు''అని చెప్పెను. పరశురాముఁడు వెంటనే ఆర్యావర్తమును వీడి దక్షిణమునకువచ్చి పశ్చిమ సముద్రతీరమున సముద్రములోనికి చొచ్చుకొనియున్న మహేంద్రగిరిపై నివాస మేర్పఱచుకొని తపస్సు చేయమొదలిడెను.

యజ్ఞములచేత పాపరాహిత్యమును పొందిన భార్గవుఁడు చిరకాలము తప మొనర్చి ఉత్తమలోకములను సంపాదించెను. తరువాత కొంతకాలమున కాయన తీర్థయాత్రలకై ఆర్యావర్తమున సంచరించుచుండఁగా, ''దశరథునిపుత్రుఁడైన శ్రీరామచంద్రుఁడు శివునివిల్లును భగ్నమొనర్చి జనకుని పుత్రికను పరిగ్రహించెను'' అన్నవార్తను వినెను. ఆయన శివుని శిష్యుఁడు. ఒకానొక క్షత్త్రియార్భకుఁడు పరమేశ్వరుని ధనువును భగ్న మొనరించె నన్నంతనే మరల భార్గవునకు క్షత్రియులపై రోష ముదయించెను, ''పరమేశ్వరుని ధనుస్సునే భగ్న మొనర్చుటకు తెగించిన క్షత్రియుఁడు ఇంక ఏయకృత్యమునకు సాహసింపకుండును? క్షత్రియుల యీపొగరుఁబోతుతనమును సహింపరాదు. దీని నిప్పడే అణఁచివేయవలె'' అను తలంపుతో ఆయన సన్నద్ధుఁడై, మిధిలనుండి అయోధ్యకు సైన్యసమేతముగా మరలిపోవుచున్న దశరథునకు ఎదురుగా నేగెను. వసిష్ఠాదిమహర్షులు భార్గవునకు స్వాగతము పలికి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించిరి. దశరథుఁడు దీనుఁడై తన కుమారులను రక్షింపుమని ఆయనను ప్రార్థించెను. కాని ఆయన దశరథుని మాటలు లెక్కపెట్టక శ్రీరాముని జూచి యిట్లనెను. ''హైహయులు మాతండ్రిని హత్యగావించిరి. ఆపగతీఱుటకై క్షత్రియుల నందఱును ఇరువదియొక్కపర్యాయములు సంహరించి శాంతించి మహేంద్రగిరియందు వసించుచు తపశ్శక్తిని సమార్జించుచుంటిని. ఇప్పుడు నీవు పరమేశ్వరుని ధనుస్సును భగ్నమొనర్చితి వని విని నీశక్తిని పరీక్షించుటయై వచ్చితిని. పూర్వము శివకేశవుల సంగ్రామమున కేశవునియొక్క హుంకారముచే శివుని విల్లు బెండయ్యెను. అదియే నీచేత భగ్నమయ్యెను. విష్ణుదేవుఁడు తన విల్లును ఋచీకున కొసంగెను. ఆయనవలన అది మాతండ్రియైన జమదగ్నికి సంక్రమించెను. ఆయన నా కొసంగెను. క్షత్రియ ధర్మమును స్మరించి నీవు ఈవింటిని ఎక్కుపెట్టఁగలిగినచో నిన్ను వీరునిగా లెక్క పెట్టి నీవు నాతో యుద్ధమొనర్చుటకు అంగీకరింతును'' అని పలికెను. తండ్రి వసిష్ఠాదిగురుజనులును సమీపముననే యుండుటచే శ్రీరాముఁడు కోపించియు ఔద్ధత్యమును చూపక కంఠ స్వరమును పెంటక మెల్లగా ''మీతండ్రిగారియొక్క పగను తీర్చుటకై నీవు కావించిన శత్రుసంహారమునునగూర్చి విన్నాను. అందులకు నేనును అంగీకరించుచున్నాను. కాని నన్ను అశక్తునిగా భావించి నీవు మాటాడుటను మాత్రము సహింపను. ఇదిగో చూడుము'' అని భార్గవుని చేతినుండి ధనువును శరమును గైకొని ఎక్కుపెట్టి బాణమును సంధించి ఇట్లనెను. ''నీవు బ్రాహ్మణుఁడవు. అందును విశ్వామిత్రునకు బాంధవుడవు. కావున నీపై ప్రాణాంతముగా బాణమును ప్రయోగింపఁజాలను. కాని వైష్ణవమైన యీబాణము అమమోఘము. దీనిచేత నీపాదగతిని ఖండింపు ముందువా లేక తపస్సుచే నీవు ఆర్జించిన లోకముల ఛేదింపు ముందువా? చెప్పుము''.

మాటమాత్రముననే శ్రీరాముఁడు శరచాపములను గైకొని శరసంధానము గావించినంతనే భార్గవుఁడు తనశక్తి యంతయు ఉడిగిపోయినట్లు నిశ్చేష్టఁ డయ్యెను. విష్ణుధనువును గైకొని విరాజిల్లుచున్న శ్రీరామచంద్రుని జూచుటకు ఇంద్రాదిదేవతలును వచ్చియుండిరి. ఆసన్నివేశమును చూచినంతనే భార్గవునకు విష్ణుదేవుఁడే ఆబాలుఁడుగా అవతరించెనని స్ఫురించి మెల్లగా నిటన్లనెను. ''నీవు విష్ణుదేవుఁడవు. లోకేశ్వరుఁడవైన నీవలన నేను పరాజయము నొందుట నాకు అవమానకరము కాదు. కశ్యపున కిచ్చినమాట చొప్పున నేను రాత్రియగునప్పటికి మహేంద్రగిరికి చేరవలె. కావున నాగమనమును నిరోధింపకుము. నేను ఆర్జించిన పుణ్యలోకములు పెక్కు కలవు. వానిని ఆబాణమునకు లక్ష్య మొనరింపుము. ఇంక విలంబము వలదు. ఇదిగో నీవిక్రమమును వీక్షించుటకు దేవతలును వచ్చియున్నారు. బాణమును వదులుము. ఆపుణ్యలోకములు దగ్ధములగుటఁ జూచి నేనును సెలవు తీసికొందును''.

రామునిబాణమున భార్గవుని పుణ్యలోకములు భస్మమయ్యెను. వెంటనె భార్గవుఁడు శ్రీరామునకు విష్ణుదేవుఁడే అనుభావముతో ప్రదక్షిణ మాచచించి బయలుదేరెను. శ్రీరాముఁడు ఆయనకు ప్రణమిల్లి సాగనంపెను. అటనుండి తిరిగివచ్చుచు భార్గవుఁడు తనపూర్వచరిత్రమునంతయు తలపోయుచు చాలనిర్వేదము నొందెను. ఆసమయమున దైవికముగా అవధూతయైన సంవర్తుఁడు ఎదురుపడెను. ఆమహాత్ముని యాదేశము ననుసరించి భార్గవుఁడు దత్తాత్రేయు నాశ్రయించి త్రిపురాదేవి నుపాసించెను. తత్ఫలముగా ఆయనకు దేవీస్వరూపమునుగూర్చి జగత్తునుగూర్చి తన్నుగూర్చి పెక్కు సంశయములు కలిగెను. వెంటనే ఆయన మరల గురువు నాశ్రయించి సంశయములను అడిగి తత్త్వమును తెలిసికొని జీవన్ముక్తుఁ డయ్యెను.

ఇందు గమనింపవలసిన యంశములు అనేకములు కలవు. గురువరేణ్యుఁడైన దత్తాత్రేయు నాశ్రయించి సంవర్తుఁడు అవధూతయయ్యెను; భార్గవరాముఁడు జీవన్ముక్తుఁడయ్యెను. మఱి ఆయననే సేవంచిన కార్త వీర్యుడు అసూయాపరుఁడై బ్రాహ్మణుని ధేనువు నేల హరించెను? గురువు ఒక్కఁడే యైనను శిష్యుల యధికారములలోని భేదములనుబట్టి విద్యలయందును భేదమేర్పడును. కార్త వీర్యుఁడు విర్తక్తుఁడు కాదు; జిజ్ఞాసువు కూడ కాదు. అతఁడు శక్తి సంపదను పెంపొందించుకొనటకై దత్తాత్రేయు నాశ్రయించి యోగవిద్య నభ్యసించి అణిమాద్యష్టసిద్ధులను సంపాదించెను. అంతే కాని అతఁడు తత్త్వమునుగూర్చి అడుగలేదు. గురువు బోధింప లేదు. కావున అతఁడు తత్త్వజ్ఞుఁడు కాలేదు. అతఁడు ఐహికమైన యైశ్వర్యమునే అనుభవించుచు సంతోషించుచుండెను. అందువలన ఒకబ్రాహ్మణుఁడు హోమధేనువువలన తనకన్న అధికమైన యైశ్వర్యము కలవాఁడై ప్రకాశించుచుండట ఆమహారాజునకు సహిపరాని దయ్యెను. కావున ఆధేనువును హరించుటకు పూనుకొని వినాశ మొందెను.

కార్త వీర్యునిపుత్రలు జమగద్నిని సంహరింపఁగా భార్గవుఁడు వారిని వధించుటతో ఆగక క్షత్రియులను ఇరువది యొక్క పర్యాయములు వధించినప్పుడు శమంతపంచకములోఅయిదు రక్తపుమడుగు లేర్పడినవి. భార్గవుఁడు కార్తవీర్యుని పుత్రులను మాహిష్మతిలో సంహరించెను. అది నర్మదానదీతీరమున నున్నది. శమంతపంచకము కురుక్షేత్రములో నున్నది. అనఁగా క్షత్రియులను సంహరింపఁబూనుకొనినప్పుడు ఆయన పుణ్యక్షేత్రముననే రణరంగమును ఏర్పఱచెనన్నమాట సంహరింపఁబడినవారికి ఉత్తమ మగతులు కలుగవలయునని ఆయన ఇట్లు ఏర్పఱచియుండును. రక్తము గడ్డకట్టకుండ మడుగులుగా ఏర్పడునా? ఆభూమిలోని ధాతువుల గుణమువలనచుట్టునున్న వృక్షమూలికల ప్రభావమువలన అట్లు సంభవించి యుండవచ్చను.

తనతండ్రినొక్కరిని కొందఱు రాజుపుత్రులు సంహరించి రని భార్గవుఁడు లక్షలకొలఁది క్షత్రియులను వధించుట తగునా? శ్రీరాముఁడు సైతము దానిని ఆక్షేపింపక పోఁగా అంగీకరించుచున్నా నని చెప్పుట గమనింపఁదగియున్నది. అనఁగా అది ధర్మమే యన్నమాట. తక్షకుఁడు పరీక్షిత్తును ఒక్కనిని వధించినప్పుడు కూడ జనమేజయుఁడు సర్పయాగమునుజేసి అసంఖ్యాకములైన పాములను అగ్నికి ఆహుతిఁగావించెను. ఆసందర్బమున ఉదంకుఁడు ''ప్రల్లదుఁడైన యొక్క కులపాంసను చేసినదానఁ దత్కులంబెల్లను దూషితంబగుట యేటియపూర్వము...'' అని జనమేజయునకు బోధించెను. ఇట్లే సీతవిషయమునందును తప్పుచేసినవాఁడు రావణుఁ డొక్కఁడే. అయినను శ్రీరాముఁడు రాక్షసకులము నంతను సంహరింపక తప్పలేదు. ఒకఁడు తప్పుచేయుచున్నప్పుడు వానిని అదుపులో పెట్టవలసినబాధ్యత కులములో ఎల్లరకును ఉండును. అపరాధి బలవంతుఁడైనచో ధర్మజ్ఞులైనవారు వానిదోషమును నిరసించి తొలఁగిపోవలెను. విభీషణుఁడు అట్లు తొలఁగివచ్చి రక్షింపఁబడెను. మఱి కార్తవీర్యుఁడు ఆతని పుత్రులు కావించినయకృత్యములను ఆకాలమున శ్రీరామునివలె ఒక్క క్షత్రియుఁడైనను ఖండింపలేదు. వారందఱును ''ఒకబ్రాహ్మణుఁడు మహారాజులైన క్షత్రియులపై తిరుగఁబడుటయా! ఇది సిహింపరాదు'' అను భావముతో క్షత్రియప్రతిష్ఠను కాపాడవలయు నను నుద్రేకముతో శమంతపంచకమునకు సన్నద్ధులై చనిరి. ఆపరాధిని ఎవరు సమర్థింతురో వారును అపరాధులే అగుదురు. కావుననే భార్గవుఁడు కావించిన క్షత్రియ సంహారమును శ్రీరాముఁ డామోదించెను.

భార్గవుఁడు నైష్ఠికబ్రహ్మచారి. అయినను ఆయన పట్టాభిషిక్తుఁడై ప్రజాపాలనము గావించి షోడశమహారాజులలో ఒకఁడుగా ప్రసిద్ధుఁడయ్యెను. అంతేకాదు. ఆయన పెక్కుయజ్ఞములను గావించి భూమి యంతయు కశ్యపాదిమహర్షులకు యజ్ఞదక్షిణగా నొసంగెను. మఱి బ్రహ్మచారికి పట్టాభిషేకమునకుఁ గాని యజ్ఞములు చేయుటకుఁ గాని అధికార మున్నదా? ధర్మపత్నీసమేతునకే పట్టాభిషేకము చేయుదురు. వానికే యజ్ఞము చేయుటకును అధికారముండును. అట్లయినచో భార్గవునిచే యజ్ఞమును చేయించిన కశ్యపాదిమహర్షులకు ధర్మము తెలియదా? శ్రౌతస్మార్తకర్మలయందు యజమానుఁడు పత్నీసమేతుఁడైయుండవలయు ననుటకు కర్మసమృద్ధిని చెప్పటయందే తాత్పర్యము కాని పత్నీరహితునకు బ్రహ్మచారికి యజ్ఞాధికారము లేదని చెప్పుట యందు తాత్పర్యము కాదు. ఆపస్తంబశ్రౌత సూత్రమున సూ|| యోవా కశ్చి దవిద్యమానాయామ్‌||

(ప్రథమప్రశ్నే-వింశఖండే-త్రయోదశసూత్రమ్‌) అనుసూత్రమును వ్యాఖ్యానించుచు భట్టరుద్రదత్తుఁడు ఇట్లు నిష్కర్ష గావించెను. ''భార్య లేకున్నను ఒకానొకఁడు అగ్నులను సంపాదించుకొనవచ్చును; అనఁగా యజ్ఞ మొనరింపవచ్చును. వయస్సు ఆజ్యము మొదలగు వానివలె యజమానునకు యజ్ఞకర్మయందు భార్యయు ఒకయంగము మాత్రమే అగును. ఏవేని కొన్ని యంగములు లోపించినప్పుడు ప్రతినిధిద్రవ్యములతో యజ్ఞమును కొనసాగింపవలసియే యుండును. అట్లే భార్య లోపించినప్పుడును యజ్ఞాధికారము లోపింపదు. ధర్మవిగ్రహుఁడైన శ్రీరామచంద్రుఁడు సీత లోకాంతరమునకు చేరినతరువాత కూడ పెక్కు అశ్వమేధములను గావించెను. అంతే కాదు శిష్టులలో శ్రేష్ఠులైన భీష్ముఁడు, కణ్వుఁడు మొదలగువారు యజ్ఞములు చేసినట్లు ప్రసిద్ధముగా నున్నది. కావున అపత్నీకునకు యజ్ఞాధికారము లోపింపదు''.

కావున పరశురాముఁడు పట్టాభిషిర్తుఁడగుటలో యజ్ఞములు చేయుటలో ధర్మాతిక్రమణము ఏమియును లేదు.

యజ్ఞములు చేసి భూమియంతయు దాన మొనర్చి ప్రశాంతుఁడై తపస్సు చేసికొనుచున్న భార్గవుఁడు మరల శ్రీరామునిపై ఏల విజృంభించెను? మహారాజయ్యును బ్రహ్మచారి యగుటచే ఆయనకు రాజభోగానుభవము కలుగ లేదు. అందువలన ఆయన ఈలోకసుఖములను రాజ్యమును వదలుకొన్న తరువాత తపస్సు చేసి ఊర్ధ్వలోకములను సంపాదించెను. అట్లే ఆయనయందు క్షత్రియులపై కోపము కూడ కట్టె లయిపోవుటచే నివురుగప్పిన నిప్పువలె, సంహరింపఁదగిన శత్రువీరులు కన్పింపకుండుటచే, నిగూఢముగ నుండనే యున్నది. అది నీటిచే నిప్పువలె పూర్తిగా నశింపలేదు. కావుననే శివధనుర్భంగ వార్త వలన ఆది వెంటనే ప్రజ్జ్వలించెను.

జీవితములో అప్పటివఱకును ఎఱుఁగని పరాజయమును ఆయన శ్రీరామునితో సంఘర్షణమున చవిచూడవలసివచ్చెను. అందువలననే ఆయనకు మొదటిసారిగా నిర్వేదము కలిగినది. కశ్యపుడు ఆర్యావర్తమున ఉండవల దని శాసించినప్పుడు కూడ ఆయన నిర్వేదము నొందలేదు. తపస్సుచే ఇంతకన్నను మిగులదివ్యములైన లోకములను పెక్కింటిని సంపాదింపఁగల ననునాత్మవిశ్వాసము అప్పుడు పుష్కలముగ నుండెను. కాని ఇప్పటి పరిస్థితి వేఱు. ఎప్పుడునులేని నిర్వేద మిప్పుడు ఆయనను పూర్తిగా ఆక్రమించినది. ఇది రెండు విధములు, ఏవి మనకు సుఖసాధనము లగునని ఎంతోతాపత్రయపడి సంపాదించుచున్నామో అవి వ్యర్థము లని తోఁచుట మొదటిది. సుఖసాధనముకు ప్రతిబంధకమై విజృంభించుచున్నదానిని జయింపఁజాల కుంటిని గదా అనుదైన్యము రెండవది, దానముచేసిన మఱుక్షణములో ఆయనకు ఈలోకసామ్రాజ్యము కలవలె చెదరిపోయెను. తపస్సుచే ఆర్జించిన లోకములు చూచుచుండఁగనే దగ్ధము లయ్యెను. ఇట్టి లోకములను మరల సంపాదించినను ఎప్పటికైనను అవి నశింపక తప్పదు; వీనివలన శాశ్వతమైన సుఖము లేదు అనువిషయము ఆయనకు అనుభవసిద్ధ మయ్యెను. ''కర్మచేత సంపాదింపఁబడులోకములు అశాశ్వతములు. అశాశ్వతములైన వానివలన శాశ్వతమైన సుఖము కలుగదు. ఇట్లు పరీక్షించి తెలిసికొని బ్రాహ్మణుఁడు నిర్వేదమును పొందవలెను. కర్మచేత మోక్షము కలుగదు'' అని శ్రుతి చెప్పినట్లుగా భార్గవుఁడు ఏలోకములయైశ్వర్యమును ఎంతగా సంపాదించినను దాని వలన శాశ్వతమైన సుఖములేదని దృఢముగా గ్రహించెను.

అంతే కాదు. పరాక్రమముచే ఈలోకమును, తపస్సుచే దేవలోకములను జయింపఁగలిగినతాను తనయందే విజృంభించుచున్న కోపమును జయింపలేక పోయితినని ఆయన మొదటిసారి గ్రహించెను. దానికి లోఁబడుటవలననే ఎంతో అనరన్థము సంభవించిన దని ఆయన గడచిన జీవితము నంతను విమర్శించుకొని గ్రహించి పరితపింపఁజొచ్చెను. కార్తవీర్యుని సంహరించినప్పుడే బ్రాహ్మణునకు కోపము తగదని. క్షమయే ప్రశస్త మని తండ్రి తనకు బోధించి యుండెను. కాని ఆయనయే హతుఁడై నప్పుడు ఆయన కావించినబోధ క్రోధవేగమున కొట్టుకొనిపోయెను. ''పాపము సంభవించినచో యజ్ఞ ములచే పోఁగొట్టుకొనవచ్చును. ఎట్లయినను ఈక్షత్రియులను నిర్మూలింపవలసినదే'' అను తలంపుతో అప్పుడు ఆయన క్రోధమునకు తనపై నిరంకుశ##మైన యధికారము నొసంగెను. అందువలన బ్రాహ్మణునకు అయోగ్యమైన ప్రాణిహింసను ఎంతో ఆయన కావించెను. యజ్ఞములు ఆపాపమును పోఁగొట్ట: గలిగినను క్రోధమును కదలింపలేక పోయినవి. ఆక్రోధమువలననే, దేవతులు మానవులు ఎందఱో చూచుచుండఁగా, శ్రీరామునివలన ఆయనకు పరాజయము సంభవించినది. అప్పు డాయనకు తనకు నిజమైనశ్రతువు తనకోపమే అని, దానిని జయించుట సులభము కాదని స్పష్టముగా గోచరించెను.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters