Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

పదునాల్గవధ్యాయము- భావనాసిద్ది

మునికుమారుఁడుచెప్పిన దంతయు మహాసేనుఁడు మంచి బుద్ధితో విచారించి జగత్తుయొక్క స్థితి స్వప్నస్థితివంటిదే అని తెలిసికొని వెంటనే శోకమును వీడెను. ధైర్యము నవలంబించి యతఁడు శోకరహితుఁడై మరల మునికుమారుని ఇట్ల ప్రశ్నించెను. ''మహాభాగా! నీకు తెలియనిది ఏదియుకొంచెను కూడ లేదని తలంచుచున్నాను. కావున నేను అడుగుచున్నదానిని దయతో చెప్పుము. ఇది యంతయు భావనవలననే కలుగుచున్నది. చెప్పుచున్నావు. అది ఎట్లు కుదురును? నేను నామనస్సులో దేనినిగూర్చి ఎంతగా భావించి ననుఅది వెలుపల వస్తువుగా రూపొందుట లేదు. మఱి నీవు భావనయొక్క సిద్ధచేత శైలమునందు పెద్దలోకమును కల్పించితివి. అదియును గాక దేశము కాలము ఒక్కసమయమునందే శైలలోకములో ఒకవిధముగా ఈజగత్తులో ఇంకొకవిధముగ ఎట్లున్నవి? వీనిలో సత్యమైన వేవి, అసత్యమైన వేవి;

మునికుమారుఁడిట్లు చెప్పెను. ''ఇది యిట్టిది అని అనుకొనుటయే భావన. అది సిద్ధము ఆసిద్ధము అని రెండువిధములు. ఇది అట్టిది కాదు అనుతలంపు వికల్పము. వికల్పములేని భావన సిద్ధమగును. వికల్పము కలిగినచో భావన అసిద్ధమగును. బ్రహ్మ యొక్క సిద్ధభావనచేత ఈజగత్తు పుట్టినది. ఆయనయొక్క భావన అత్యంతదృఢ మగుటచేత ఈ జగత్తు అందఱకును సత్యముగానే తోఁచుచున్నది. ఈబ్రహ్మసృష్టియందున్న సత్యత్వబుద్ధి మన భావనలయందు మనకు లేదు. ''ఇది నాభావనయే కాని, సత్యము కాదు. బహ్మ సృష్టియే సత్యము'' అని తలంచుచున్నాము. ఈవికల్పముచేత మన భావనకు సిద్ధి కలుగుటలేదు. లోకమునందు భావనయొక్క సిద్ధి అనేకవిధముల ఏర్పడుచున్నది. జన్మము మణులు ఔషధము తపస్సు మంత్రసిద్ధి దేవత లిచ్చువరము మొదలగువానిచేత భావనయొక్క సిద్ధి పెక్కువిధముల రూపొందుచున్నది. బ్రహ్మదేవునకు జన్మచేత, యక్షులకు రాక్షసులకు మణులచేత, దేవతలకు ఓషధీరూపమైన యమృతముచేత, యోగులకు యోగముచేత, తాపసులకు తపస్సుచేత, జపపరాయణులకు మంత్రసిద్ధిచేత, విశ్వకర్మ మొదలగువారికి వరమువలనను భావనకు సిద్ధి కలుగుచున్నది. అట్టిసిద్ధి కలుగవలయు నన్నచో, ''ఈకార్యమునకు నేను ఇట్లు సంకల్ప మొనర్చితిని'' అన్నవిషయమును మఱచిపోవలయును. అప్పుడే భావన స్థిరమగును. అట్లు గాక ''నేను ఈకార్యమును సంకల్పించితిని'' అని మనస్సునకు తోఁచుచున్నచో, ఆకార్యము అంతకు పూర్వము లేకుండుట అప్పుడు క్రొత్తగా ఆరంభమగుట తోఁచును. అప్పుడు ఆకార్యము అసత్య మనియు తోఁచును. ఇది వికల్పమైన భావనను భంగపఱచును. అప్పుడు భావనకు సిద్ధ కలుగదు. నాటకమునందు పాత్రధారిని చూచునప్పుడు ''వీఁడు హరిశ్చంద్రుఁడే'' అన్న బావన దృఢముగ నున్నంతవఱకే ప్రేక్షకునకు రససిద్ధికలుగుచుండును ఏకారణముచేత నైనను ''వీఁడు హరిశ్చంద్రుఁడు కాఁడు. మనవీధిలోనున్న వెంకయ్య కదా వీఁడు; ఈవేషము వేసినాఁడు'' అని తోఁచినచో ప్రేక్షకునకు రససిద్ధి కలుగదు. అట్లే భావనయందును క్రొత్త విషయముగా సంకల్పించినతరువాత దానికి పూర్వమందున్న స్థితిని పూర్తిగా విస్మరించి ఆవిషయమునే నిరంతరము భావించుచుండవలె. ఇట్లు చిరకాలము అభ్యసించినచో పూరక్వస్థితి జ్ఞప్తికి రాకుండు బావన స్థిర మగును. ఈయభ్యాసముయొక్క ఆరంభమునందు పూర్వస్థితివి విస్మరీంచుటకై పూనిక చేయవలసియో యుండును. కాని అభ్యాసము కొనసాగుకొలఁది అప్పయత్నముగనే పూర్వవిస్మృతి కలిగి భావనయందు నిమగ్నమగుట సభవించును. ఇట్లు అభ్యాసబలమున భావనను మొదలుపెట్టినంతనే పూర్వస్మృతి కొంచెము కూడ లేకుండ, ఆభావనను నిర్వికల్పముగా కొనసాగింపఁగల సామర్థ్య మేర్పడును. అప్పుడు ఆభావన సిద్ధమై మహాఫలమును సాధింపఁగలుగును. మఱి నీకు పూర్వస్మృతులు బలముగా నున్నవి. అవి మాటిమాటికి నీభావనకు వికల్పములను కలిగించుచు భంగపఱచుచున్నవి. అందువలన నీ భావము సిద్ధమగుట లేదు. నీవు కూడ సృష్టిని చేయఁగోరుచున్నచో భావనను శీఘ్రముగా సాధింపుము.

ఇంక నీవు అడిగిన దేశకాలముయొక్క ద్వైవిధ్యమునుగూర్చి (Dual nature of time and space) వినుము. ఏకకాలమునందే ఈలోకములో అర్థక్రోశమాత్రముగనున్న కొండలో అనంతమైన దేశము. ఆకొండలోపలి లోకములో ఒక దినము కాఁగా ఈలోకములో నూటిరువదికోట్లసంవత్సరము కాలము ఎట్లు సంభవించిన వని నీవు ఆశ్చర్యపడుచున్నావు. లోకవ్యవహారమును నీవు చక్కఁగా పరిశీలించి విమర్శింపలేదు. అందువలన నీకది అద్భుతముగానున్నది. జగత్తులో ఒక్కవిషయమే అనేక విధములుగా భాసించుచుండుట సహజముగా నున్నది. సూర్యునికాంతి మనకు వెలుఁగు నిచ్చుచుఁడఁగా గ్రుడ్లగూబలకు చీఁకటి యగుచున్నది. నీటిలో మునిఁగినప్పుడు మానవులకు పశువులకు ఆనీరు శ్వాసకు ప్రతిపంధక మగుచున్నది. ఆనీరే చేపలయొక్క శ్వాసకు ఆటంకమగుట లేదు. మన కందఱకు గాలి పీల్చుకొనుటకు హాయిగానుండు తీరప్రదేశమున అవిగాలి పీల్చుకొనలేవు. అగ్ని అన్నింటిని దహించును. కాని అత్తిరిపక్షులు అగ్ని కణములను భక్షించును, నీటిచేత నిప్పు నశించును. కాని బడబాగ్ని సముద్రమధ్యమున జ్వలించుచున్నది. ఇట్లు జగత్తుల విషయము లన్నియు ద్వైరూప్యముతో (Duality) నున్నవి.

ఇంతవఱకును ఇంద్రియములు చక్కఁగా పనిచేయుచు సమానములైన యనుభవములను పొందుచున్న మనుష్యులు పశువులు పక్షులు మొదలగుప్రాణులలో కన్పించుచన్న ద్వైవిధ్యము (Duality) మాత్రమే గమనించితిమి. ఇంక ఒక్కొక్కఇంద్రియము ఒక్కొక్క లోపముతో పనిచేయుచుండు ప్రాణులయందు ఒకవిషయమునే విరుద్ధభావములు వందలకొలఁదిగా వేలకొలధిగా నున్నవి. దృష్టాంతమును చెప్పెదను శ్రద్ధాగా వినుము. మనకు కన్పించుచున్న పదార్థము లన్నియు మన చక్షురింద్రియమువలన మనమనస్సులో రూపొందుచున్నవే. మనమనస్సుల ఏర్పడుచున్న రూపములకన్న అన్యముగా మనకు ఏదియ వెలుపల లేదు. అందువలన ఆ చక్షురింద్రియమునందు ఏవికారముండునో ఆవికారమునుబట్టియే పదార్థములు కూడ వమనస్సునందు రూపొందుచుండును, పైత్యప్రకోపము కలిగిన వానికి ప్రతి వస్తువు పచ్చగా కన్పించుచుండును. తిమిరదోషము కలవాడు ఒక్కదానిని రెండుగా చూచును. ఇట్లు విచిత్రములైన కంటిదోషములు కలవారు జగత్తును వివిధప్రకారములుగా చూచుచందురు తూర్పుసముద్రమధ్యమున కారండకమను ద్వీపముకలదు. అందలి జనులకు ఎల్లప్పుడు ప్రతివస్తువు ఎఱ్ఱగా కన్పించుచుండును. అట్లే రమణకద్వీపమున జనులకు ప్రతివస్తువు తలక్రిందులుగా కన్పించును. ఇతరద్వీపములందును ఇట్లే విశేషములు కలవు. ఎల్లయెడలను జనులు తమనేత్రములయొక్క స్వభావము ననుసరించి వస్తువులను చూచుచుందురు. ఎప్పుడైనను ఒకానొకఁడు తనద్వీపములోనివారి కన్న భిన్నముగా చూచుట తటస్థించినచో వెంటనే వానికి ఔషధములతో చికిత్స చేసి వెనుకటివలె అందఱతోఁబాటు సమానముగా చూడఁగల్గునట్లు చేయుదురు కావున ఎవఁడు తనదృష్టిచేత ఏపదార్థములను ఎంతవఱకు ఏరూపములతో గ్రహించుచున్నాఁడో అదియే వాని దృశ్య ప్రపంచమగుచున్నది. (His visible world). ఇట్లే తక్కిన యింద్రియముల విషయమున కూడ ఆయింద్రియముల విశేషములను బట్టి ఒక ప్రపంచమే భిన్నజనులచేత భిన్నభిన్నముగా గ్రహింపఁబడుచున్నది. కొందఱకు వినిపంచుధ్వనులు మఱికొందఱకు వినఁబడటవు. నేలపై అడుగులగుర్తులను వాసనచూచి కుక్కలు దొంగలను గుర్తింపఁగలవు మనుష్యులకు అట్టిశక్తి లేదు. ఇట్లే కేవలము మానసికములైన భావనలు (Imaginations) ఆలోచనలు (Thoughts) మొదలగునవి కూడ ఆయావ్యక్తులయొక్క సంస్కారవిశేషములనుబట్టి (Differences in out look and culture) భిన్నభిన్నముగనే యుండును.

దేశమునందు కాలమునందు మనము భావించుచున్నక్రమము కూడ ఇట్టిదే. ''ఇది ముందు అది వెనుక'' అని అనుకొటయే క్రమము. సూర్యుఁడుదయించుచున్న దేశమును ముందు తూర్పు అనుకొన్నచో దాని కెదురుగా తరువాత కన్పించుదేశము పడమర యగును. లేదా ముందుగా దక్షిణమును గుర్తించినచో దానికెదురుగా తరువాత కన్పించునది ఉత్తరమగును. కాశీక్షేత్రము ప్రయాగలో నున్నవారికి తూర్పున నుండఁగా దాక్షిణాత్యులకు ఉత్తర మగుచున్నది. ఇట్లే కాలమునందు కూడ ముందు ఒకపని జరిగినప్పుడు అది భూతకాలమని, తరువాత ఇప్పుడ జరుగుచున్న పనిని వర్తమానకాల మని, జరుగఁబోవు క్రియను భవిష్యత్కాల మని చెప్పుచున్నాము. ఈదేశక్రమము గాని కాలక్రమము గానిఇంద్రియములవలన మన మనస్సులలో కలుగుచున్నభావములను అనుసరించే గ్రహించుచున్నాము. మనప్రపంచము మనభావములందే యున్నది కాని కొంచెము కూడ వెలుపల లేదు. అంతకు మించి ఇతరుల ఏదేని గ్రహించుచున్నచో అది వారిప్రపంచమున వారికి ఉండును గాని మనప్రపంచమున మనకు ఉండదు. మనము దేనిని గ్రహించుచున్నామో అదియే మనప్రపంచము. ఎవనికి ఏది తెలియదే వానికి అది యుండదు. కావున దేశముయొక్క కాలముయొక్క దీర్ఘత్వము (Length) అల్పత్వము (Shortness) మన యింద్రియముల జ్ఞానముపైననే ఆధారపడియుండును. అందువలన ఒక్కదేశము ఒక్కకాలము రెండువిధములుగ తోఁచుట అసంభవము కాదు. నీవు శైలలోకములో దేశమును చూచునపుడు దానికి అంతము (End) నీకు కన్పించలేదు. అందువలన నీకు అది అనంతముగా కన్పించినది. కొండను చుట్టివచ్చినప్పుడు అదియే నీకు అర్థక్రోశముగా కన్పించినది. అందువలన నీకు అది అల్పప్రదేశముగా తోఁచినది. అట్లే శైలలోకములో చాలకొలఁదిగా సంఘటనములను (Events) చూచితివి. అందువలన అది అల్పకాలముగా తోఁచినది. వెలుపలికి వచ్చినతరువాత ఇక్కడ వేలకొలఁది తరములలో సంభవించిన సంఘటనములను పరిణామములను చూచితివి అందువలన అది దీర్ఘకాలముగా తోఁచినది. కావున దేశకాలములు భావనామాత్రములు.

ఇంక మనకు వెలుపల వస్తువుగా (Objective reality) బహిఃప్రపంచ మున్న దనుమాటనుగూర్చి వినుము. గోడమీఁద బొమ్మలను చిత్రించినప్పుడు ఆచిత్రములకు ఆధారముగా గోడ యున్నది. అట్లే జగత్తు అనుచిత్రమునకు కూడ ఆధారమైన పదార్థము ఒకటి యుండవలె. అనఁగా గ్రహించుచున్న మనము కాక మనచేత గ్రహింపబడుచున్న బహిఃప్రపంచము వేఱుగా నుండవలె నిజమే. రెండు పదార్థములు లున్నప్పుడు వానిలో ఒకదానియొక్క స్వరూపమైన విస్తృతిని (Magnitude) గ్రహించునప్పుడు మొదటిదానిని అవధిగా (Demarcation) చేసి రెండవదానియొక్క స్వరూపమును గ్రహింతుము. ఈ యవధినే అపాదాన మనియు చెప్పుదురు. హిమాలయమునుండి గంగ పుట్టినది. గంగయొక్క స్వరూపనిస్తృతిని హిమాలయమును అవధిగా చేసికొని అక్కడనుండి గ్రహింపవలసియున్నది. అప్పుడు హిమాలయము గంగకు అపాదాన మగును. ఆవిధముగా నీవు బహిఃప్రపంచము అని చెప్పుచున్నదానికి ఏది అపాదానము? దేనిని అవధిగా చేసికొని దానిని గ్రహింపవలె? ''నాశరీరమే అవధి. దానికి వెలుపల నాకు గోచరించుచున్న దంతయు బహిఃప్రపంచము'' అని నీవనవచ్చును. కాని నీపైనున్న వస్త్రములు నీకు ఎట్లు గోచరించుచున్నవో అట్లే నీశరీరము కూడ నీకు గోచరించుచున్నది. కాఁబట్టి శరీరము కూడ నీకు గోచరించుచున్న బహిఃప్రపంచములో భాగమగునే కాని దానికి అవధి కాఁజాలదు.

''అయ్యా! అట్లయినచో శరీరమును బహిఃప్రపంచమును భాసింపఁజేయుచున్నది నాయాత్మ. అది యవధిగా దానిచేత భాసింపఁజేయఁపబడుచున్న శరీరముతో కూడ ఈప్రపంచ మంతయు వెలుపల నున్నది'' అని నీ వనవచ్చును. కాని భాసకమునకు (Illuminater) వెలుపల దానిచేత భాసింపఁజేయబడుచున్న భాస్యము (That which is illuminated) ఉండు నని చెప్పుటకు వీలు లేదే! దీపముయొక్క కాంతి సూర్యుని వెలుఁగు పదార్థములను ప్రకాశింపఁజేయుచున్నవి కాంతి, వెలుఁగు భాసకములు; పదార్థములను భాస్యములు. పదార్థములు దీపపుకాంతిలోపల సూర్యుని వెలుఁగులోపల ఉన్నప్పుడే ప్రకాశించుచు భాస్యము లగును. లేకున్నచో అవి వానికి భాస్యములు కావు; ప్రకాశింపవు. కాఁబట్టి భాస్యము భాసకమునకు వెలుపల నుండునని చెప్పుటకు వీలు లేదు. కావున ఆత్మచైతన్యముచేత భాసింపఁజేయఁబడుచున్న శరీరము ప్రపంచము ఆచైతన్యములోపల నున్నవని చెప్పవలయునే కాని దానికి వెలుపల నున్న వని చెప్పుటకు వీలు లేదు. కిరణములు వానివలన కలుగుచున్న ప్రకాశనము సూర్యునికన్న భిన్నములు కావు. అనఁగా భానము భాసకముకన్న భిన్నము కాదు. (Illumination is not different from the illuminater) భాసకస్వరూపమే భానము (Illumination is the nature of illuminater). చైతన్యము ప్రకాశరూపమై పూర్ణమై యున్నది. దానిచేత దేశకాలములు వ్యాప్తములై యున్నవి (Time and spce are pervaded by it). అది ఆవిధముగ అఁతటను వ్యాపించియుండుటచేతనే అది పూర్ణమై యున్నది. సూర్యకిరణములకు లోపల ఉండనివస్తువు ఎట్లుప్రకాశింపదో అట్లే చైతన్యమునకు లోపల ఉండనిది ఏదియు ప్రకాశింపదు. అందువలన దేశకాలములు ఆత్మచైతన్యమునకు లోపలనే యున్నవి. కావున ఆత్మ చైతన్యమును అవధిగాఁజేసి దానికి వెలుపల దేశకాలములు ఉన్న వని చెప్పుటకు వీలు లేదు. కాఁబట్టి ఆత్మచైతన్యమునకు వెలుపల బహిఃప్రపంచ మన్నది ఏదియు లేదు. లోపల వెలుపల అని నీవు ఏది చెప్పినను అది యంతయు, అద్దములో ప్రతిబింబ మున్నట్లు, ఆత్మ చైతన్యమునందే యున్నది.

ఈవిధముగ ఆత్మయొక్కటియే సర్వప్రపంచమును తనయందే ప్రతిబింబింపఁజేయుచు స్వతంత్రముగా సర్వాద ప్రకాశించుచున్నది. ఈ యాత్మయే పరాచితి త్రిపురాపరమేశ్వరి బ్రహ్మము విష్ణువు శివుఁడు శక్తి అని యనేకులచేత అనేకవిధములుగా పేర్కొనఁబడుచున్నది. ఆత్మకు చైతన్యమే స్వరూపము. అదియే ముఖ్యము. దానినిగూర్చి నామరూపములతో త్రిపురామహేశ్వరి విష్ణువు శివుఁడు అన వర్ణించుట యంతయు అల్ప మని (Unimportant) ఎఱుంగుము. ఆచైతన్యమును భాసక మని చెప్పుట కూడ సహజమైన వర్ణనము కాదు. ప్రపంచము మనకు గోచరించుచున్నది. కాబట్టి, అది యట్లు ఆచైతన్యమువలన భాసించుచున్నది కాఁబట్టి, ఆచైతన్యమును భాసక మని మనము చెప్పుచున్నాము. అంతే కాని దానికి స్వతసిద్ధముగా భాసకత్వమను లక్షణము లేదు. అది కేవలము చైతన్యమాత్రమే.

ప్రతిబింబము అద్దమునందు ఎట్లు ఇమిడియుండునో అట్లే భాసకమైన చైతన్యమునందు భాస్యమైనజగత్తు (Illuminated world) ఇమిడియున్నది. ప్రతిబింబము అద్దమును ఎట్లు అతిక్రమించియుండదో అట్లే జగత్తు కూడ ఆత్మచైతన్యమును అతిక్రమించి యుండదు. నిండుగా గట్టిగా ఏకరూపముగా ఉన్నయద్దమునందు దానికి భిన్నముగా వేఱొకపదార్థముగా (Another reality) ఒక నగరము ఉండుట ఎట్లు అసంభవమో అట్లే పరిపూర్ణము చైతన్యఘనము ఏకరూపమును అయిన యాత్మయందు దానికి భిన్నముగా వేఱొకవస్తువుగా జగత్తు ఉండుట అసంభవము. ఎన్నివిధములైన ప్రతిబింబములు వచ్చచు పోవుచునున్నను అద్దము ఏ వికారమును పొందక ఒక్కరూపముతోనే పరిశుద్ధముగా ఎట్లు వుండునో అట్లే చిత్రవిచిత్రములైనజగత్ప్రిబింబములు ఎన్ని వచ్చుచు పోవుచునున్నను, సృష్టియందు ప్రళయమునందును, ఆత్మచైతన్యము కూడ ఏవికారమున పొందక ఏకరూపముగ పరిశుద్ధముగా నున్నది. కాని ఆత్మ కేవలము అద్దమువంటిది కాదు. అద్దము అచేతనము. ఆత్మ చైతన్యఘనము (Absolute intelligence) స్వతంత్రము (Independent). ఎదుట వస్తు వున్నప్పుడే అద్దమునందు ప్రతింబింబము కన్పించును. ఆత్మయందు ప్రతింబింబము కన్పించుటకు దానికి ఎదురుగా వేఱొక వస్తువు ఉండ నక్కఱలేదు. అది తన స్వాతంత్ర్యముయొక్క మహిమవలన రెండవస్తువే లేకుంéడ తనయందే చరాచరమైన జగత్తును భాసింపఁజేయుచున్నది. కుండరూపొందుటకు కుమ్మరివాడు, వానిదండము నిమిత్త కారణములు. మట్టి దానికి ఉపాదానకారణము. ఈకారణములు ఏవియు లేకుండఁగనే ఆత్మతనయందే జగత్తును భాసింపఁజేయుచున్నది. ఆయ్యా! ఇది యెట్లు సంభవ మని సందేహింపకుము. నీ మనః ప్రపంచమునే పురిశీలింపుము. నీసంకల్పమాత్రముచేతనే కదా నీమనస్సునందుఒక ప్రపంచము భాసించున్నది. అద్దమునకు ఎదురుగా వస్తువువలె నీ మనస్సునందు వేఱొకవస్తువు వేమున్నది? ఆప్రపంచ మంతయు నీమనస్సేతప్ప మఱియొకటికాదు ''మనస్సునందు పూర్వసంస్కారము లున్నవి. వానియొక్క ప్రతిబింబములు మనస్సునందు రూపొందుఅని నీ వనవచ్చును. కాని మట్టి తనయంతట తాను మట్టిగానే యుండును గాని కుండ కాఁజాలదు. అద్దమునకు ఎదురుగా మట్టి యున్నప్పడు మట్టి తప్ప కుండ ఎట్లు ప్రతిబింబింపదో అట్లే మనస్సు చెంత సంస్కారము లున్నచో నామారూపాత్మకమైన ప్రపంచ మెట్లు ప్రతింబింబించును? కావున ఆత్మయందు జగత్తు భాసించుచుండుటకు అద్దమునకు ఎదురుగా వస్తువు కావలసినట్లు, వేఱొకవస్తువు అక్కఱలేదు.

ఇట్లు ఆత్మయందు బాహ్యపదార్థము ఉన్నట్లు తోఁచుటయే మొదటిసృష్టి. అదియే అవిద్య తమస్సు అని చెప్పఁబడుచున్నది. పూర్ణమైనవస్తువు ఒక్కయంశముగా తోఁచుటయే అవిద్య. మనకు శరీరమునందు ''నేను'' అనుభావన పూర్ణముగ వ్యాపించి యున్నది. కాని శరీరమునుండి ఏదేని ఒకయంగము ఖండింపఁబడినప్పుడు, ఆ యంగమునందు ''నేను'' అను భావన ప్రసరించుట లేదు. అట్లే అఖండము పూర్ణమును అయినయాత్మయొక్క ఒకయంశమునందు ఆత్మస్వరూపము తోఁచకుండుట అవిద్య. దీనినే అవ్యక్త మని జడశక్తి అని చెప్పుచున్నారు. తరంగములు లేకుండ నిశ్చలముగానున్న సముద్రమునందు దానియందలిజలమే అనంతములైన భిన్నతరంగము లుగా రూపొందునట్లు, సృష్టియొక్క ఆరంభమునందు ఆఖండము పూర్ణము నిశ్చలము అయిన ఆత్మయందు దానయందలి చైతన్యము నుండియే అనంతములైన చిదంశలు ఉదయించును. అన్నితరంగములలో సమానముగనున్న జలమువలె అన్నిచదంశలయందును సమానముగనున్న చైతన్యమును శివతత్త్వమందరు. చిదంశలుపుట్టుటకు పూర్వమున్న నిశ్చలమైన యాత్మను పరశివతత్త్వ మందురు. ఒక్కొక్క చిదంశలో సామాన్య చైతన్యముగానున్న శివతత్త్వము ''నేను'' ''నేను'' అని అనుకొనుట శక్తి యను తత్త్వముగా చెప్పఁబడుచున్నది. అవిద్యయే వెలుపలనున్న వేఱొకవస్తువువలె చిదంశలకు తోఁచుచుండును. అదియే జగత్తు అనుచిత్రమునకు ఆధారము. ''నేను?, ''నేను'' అని అనుకొనుచున్న శివతత్త్వము బహిఃపదార్థముగా తోఁచుచున్నయవిద్యను చూచి ''నేనుఇది'' అని తలంచినప్పుడు సదాశివతత్త్వ మని చెప్పఁబడుచున్నది. అదియే అవిద్యయే తాను అయినట్లుగా అనుకొనుచు, ''ఇది నేను'' అని తలంచినప్పుడు ఈశ్వర తత్త్వమగును. అనఁగా చైతన్యము ప్రధానమై అవిద్యను ఆవరించి నప్పుడు సదాశివతత్త్వముగా, అవిద్య ప్రధానమైచైతన్యమును ఆవరించినప్పుడు ఈశ్వరతత్త్వమగును. ఈశ్వరతత్త్వమును చైతన్యము అప్రధానమై అవిద్య ప్రధాన మగును. సదాశివతత్త్వ మునకు ఈశ్వరతత్త్వమునకుగల భేదమును అభేదమును విమర్శించి గ్రహించుశక్తి శుద్ధవిద్యాతత్త్వము. ''నేను ఇది'', ''ఇది నేను'' అను రెండు విధములైన భావనలయందును అంతర్గతముగా ఉన్న ''నేను'' అను చైతన్యమును గుర్తించుచుండుట శుద్ధవిద్య. శివము శక్తి సదాశివము ఈశ్వరము శుద్ధవిద్య అనునీయైదు తత్త్వములందు అవిద్య ప్రబలముగా ముండదు; అనఁగా అది జడరూపమై కార్యముగా పరిణమింపదు. అందువలన అద్వితీయమైన యాత్మచైతన్యము గోచరించుచునే యుండును. ఆకారణముచేత ఈయైదుతత్త్వములను శుద్ధతత్త్వములందరు.

అవిద్యయే జడశక్తి. అదియే భేదశక్తి. శుద్ధతత్త్వములసృష్టికి పిమ్మట జడశక్తి బలమును పొంది ప్రధానమైన చైతన్యము ఆప్రధానమగును. వస్తువును ధర్మిఅని, దాని గుణమును ధర్మము అని చెప్పుదురు. అగ్ని అనువస్తువు ధర్మి. దహించుట అను దాని యొక్క గుణము ధర్మము. వస్తువు ప్రధానము, దానిగుణము అప్రధానము. ఇచ్చట జడశక్తి ధర్మియై చైతన్యము దానికి ధర్మముగా నుండును. శుద్దతత్త్వము లై దింటియందును చైతన్యము ధర్మియై జడశక్తి ధర్మముగా నుండును. భేదబుద్ధి ప్రబలమై జడశక్తి ధర్మి త్వమును పొంది మాయాతత్త్వమగును. మాయచేత ఆవరింపఁబడిన చైతన్యము సంకుచిత మగును. అప్పుడు కళ, అవిద్య, రాగము, కాలము, నియతి అను నైదుకంచుకములచేత చుట్టఁబడి చైతన్యము పురుషుఁడగును, కొంచెము కర్తృత్త్వము కళ. కొంచెము తెలిసియుండుట అవిద్య. ''ఇది నాది యగును గాక'' అనుకోరిక రాగము. ఆయుస్సు ననుసరించి దినములు మాసములు వత్సరములు అను పరి గణనమే కాలము. ఈనాలుగింటికి లోఁబడియుండుట నియతి. పరమశివునకు సర్వకర్తృత్వము సర్వజ్ఞత్వము నిత్యతృప్తత్వము నిత్యత్వము స్వాతంత్రము అను నైదు శక్తులు కలవు. అవియే సయేచితములై అయిదు కంచుకము లైనవి. ఈ యైదుకంచుకములచేత చైతన్యము నకు పురుషుఁడను వ్యవహారము ఏర్పడుచున్నది. జనులయొక్క విచిత్రములైన కర్మసంస్కారముల అనాదిగా నున్నవి. సృష్టియొక్క ఆరంభమున ఆసంసారము లన్నియు ఒకపెద్ద ముద్దవలె చైతన్యము లోని జ్ఞానశక్తి ఆశ్రయించి యుండును. ఆసంస్కారములముద్దను ప్రకృతి యందురు, పుణ్యములు పాపములు మిశ్రమములు అని కర్మలు మూఁడువిధములుగా నుండును. అందువలన వానిసంస్కారములు ముద్దయైన ప్రకృతి కూడ సత్యము రజస్సు తపస్సు అను మూఁడురూపములను గలిగియుండును. జీవులకు సంబంధించి ఈ ప్రకృతియే ఒకదశయందు చిత్త మని చెప్పఁబడుచున్నది. ఇది గాఢ నిద్రయందు ప్రకృతి యని జాగ్రత్స్వప్నముల యారంభమునందు చిత్తమని చెప్పఁబడుచున్నది. వాసనలయొక్క ముద్దగానున్న యీప్రకృతియే అవ్యక్త మని చెప్పఁబడుచున్నది. వాసనల సముదాయముతో అనఁగా ప్రకృతితో కూడిన చైతన్యమే చిత్తము. పురుషులయొక్క వాసనలు వివిధములుగా నుండును. దానియొక్క భేదములనుబట్టి పురుషుల చిత్తము భిన్నములుగా నుండును. సుషుప్తియందు వాసనలు అవ్యక్తస్థితిని (Unmanifest state) పొందును. కుండలు మట్టి ముద్దలైనట్లు పురుషులయొక్క భిన్నభిన్నములైన చిత్తము లన్నియు గాఢనిద్రయందు ప్రకృతి యగును. జాగ్రద్దశ గాని స్వప్నము గాని ఆరంభ మైనంతనే ఆప్రకృతియే చిత్తముగా వ్యవహరించును. చైతన్యముయొక్క ప్రాధాన్యమును ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుఁడని చెప్పఁబడుచున్నది. ప్రకృతియొక్క ప్రాధాన్యమును ఉద్దేశించినప్పుడు చిత్త మని చెప్పుచున్నారు.

చిత్తమును అంతఃకరణ మందురు. కరణ మనఁగా సాధనము. దేహేంద్రియాదులకు లోపల ఉండి పనిచేయుచుండు సాధనము అంతఃకరణము. ఇది నిర్వహించుపనులయందలి భేదములనుబట్టి అహంకారము బుద్ధి మనస్సు అని మూఁడువిధములుగా పేర్కొనఁబడుచున్నది. దీనియొక్క సత్త్వగుణమునుండి జ్ఞేనేంద్రియములైదు రజోగుణమునుండి కర్మేంద్రియము లైదు, తమోగుణమునుండి శబ్ద స్పర్శరూపరస గంధములు అను సూక్ష్మభూతములు ఐదు కలిగినవి. సూక్ష్మభూతములనుండి ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి అను నైదుస్థూలభూతములు పుట్టినవి.

ఈవిధముగా ఆపరమచైతన్యము వెలుపల ఏదో పదార్థమున్నట్లుగా భాసింపఁజేయుచు జగత్తుయొక్క సృష్టి స్థితి లయము అను క్రమమున క్రీడించుచు దాని కంతకును సాక్షిగా నున్నది. అది శక్తియైన త్రిపురాదేవియొక్క భావనచేత హిరణ్యగర్భఁడు ఉదయించెను. ఆయనయొక్క భావననుండి ఈజగత్తు ఉదయించెను. ఈ జగత్తులో ''నీవు'', ''నేను'' అని స్ఫురించుచున్న జ్ఞానము పరమచైతన్యమే. ఎవరిచే ఎన్ని విధములుగా సృష్టి జరిగినను ఎల్లయెడల ఈ చైతన్యము ఏకరూపముగానే యుండును. పెద్దకుండలు చిన్నపిడులు మొదలగుభేదమలు కుండలకు పిడుతులకే గాని మట్టికి ఎట్లు సంబంధిపవో అట్లే సృష్టిభేదములు కూడ చైతన్యమునకు సంబంధింపవు. ఈభేధము లన్నియు బ్రహ్మయొక్క భావనచేతనే భాసించుచున్నవి. ఆయన భావించుట మానుకొన్నచో భేదములు భాసింపవు. ''చిదాత్మకు భావనయందు స్వాతంత్య్రము సహజము. నాయందును చిదాత్మకలదు. మఱి నాయందు అభావనాశక్తి కన్పించుట లేదే?'' అని నీవు అడుగవచ్చును. నీయందున్న భావనాశక్తి మాయచేత ఆవరింపఁబడి యున్నది. మాయ తొలఁగినచో నీకుఁగూడ భావన సిద్ధించును. దేశమునుగాని కాలమును గాని ఎవఁడు ఏ విధముగా భావించుచున్నాఁడో అది ఆప్రకారముగా దీర్ఘము అల్పము మొదలగు భేదములతో భాసించుచున్నది. నేను శైలలోకమున ఏకదినరూపమున ఏకాలమునుగూర్చి భావించితినో ఆకాలమునే బ్రహ్మ నూటనిరువదికోట్లసంవత్సరములుగా భావించెను. ఆకారణముచేత ఒకకాలమే శైలలోకమున అల్పముగా ఇచ్చట దీర్ఘముగా భాసించినది. ఇట్లే బ్రహ్మ శైలమునుగూర్చి అరకోసుమాత్రముగా భావింపఁగా నేను దానిలోపల ప్రదేశమును అనంతముగా (Unending space) భావించితిని. అందువలన నీకది అనంతముగా తోఁచినది. ఈవిధముగా ఈ రెండు సత్యము అసత్యము కూడా అగుచున్నవి. నీవు కూడ నీమనస్సు నందు మొదట క్రోశమాత్రమైన ప్రదేశమును సూక్ష్మమైనకాలమును భావింపుము. తరువాత ఆప్రదేశమునందే అనంతములైన యోజనములను, ఆకాలమునందే అసంఖ్యాకములైన సంవత్సరములను భావింపుము. నీవు ఎంతవఱకు అట్లు భావించుచుందువో అంతవఱకు అవి అట్లే భాసించుచుండును. ఆవిధముగానే చిదాత్మరూపమునందు వెలుపల నున్నట్లుగా ఈజగత్తు భావనామాత్రముగానే భాసించుచున్నది. గోడమీఁది కన్పించుచున్నబొమ్మ గోడకన్న అన్యమైనవస్తువు ఎట్లు కాదో అట్లే ఆత్మకు వెలుపల నున్నట్లుగా తోఁచుచున్నయవ్యక్తుమను గోడపై భాసించుచున్న జగత్తు అనుచిత్రము కూడ అవ్యక్తముకన్న భిన్నము కాదు. చిదాత్మయందు తోఁచుచున్న యా యవ్యక్తము చిదాత్మకన్న అన్యముకాదు. కావున జగత్తు చిదాత్మయందే భాసించుచున్నది కాని వెలుపల ఎచ్చటను లేదు. సర్వము చిదాత్మయే యగుటచే దానికి వెలుపల అన్నమాటకు అవకాశ##మే లేదు. ఈకారణము చేతనే సాధారణమానవులు ఎంతోకాలము ప్రయాణముచేసి చేరుకోఁగలుగునట్టి దూరప్రదేశములకు యోగులు క్షణకాలములో చేరి అక్కడటి విశేషములు అన్నింటిని చక్కఁగా చూచుచున్నారు. కావున దూరము దగ్గర చిరకాలము శీఘ్రము అనునవి యన్నియు భావనామాత్రములే. ''జగత్తు చిదాత్మ అనునద్దమునందు ప్రతిబింబమాత్రమే. అది చిదాత్మ కన్న భిన్నముగ వస్తువుగా లేదు.'' అని నిశ్చయించుకొని ''దేహేంద్రియాదులుకు అతీతముగానున్న చైతన్యమే నేను'' అను భావనను నిరంతరముగా కొనసాగించుచు ''ఈజగత్తు సత్యము'' అను భ్రాంతిని తొలగించుకొనుము. అప్పుడ నీవు కూడ నావలెనే స్వతంత్రుఁడవు కాఁగలవు.''

ఇట్లు తంగణునిపుత్రుఁడు బోధింపఁగా మహాసేనుఁడు ''జగత్తు సత్యము. దేహము నేను'' మొదలైన భ్రాంతిని వీడి చిదాత్మ తప్ప మఱిఏదియు లేదని తెలిసికొని కామక్రోధాదిరహితుఁడై సమాధియోగములు అభ్యసించి భావనాసిద్ధిచే సృష్టించుటయందు స్వాతంత్ర్యమును పొంది చిరకాలము విహరించి అభాసమాత్రముగ తోఁచుచున్న శరీరమును కూడ త్యజించి విదేహముక్తి పొందెను. కావున భార్గవా! ఈజగత్తు ''ఇది సత్యము'' అను నీ భావనమాత్రమే. విచారించినచో ఈ భ్రాంతి పోవును.''

ఇది జ్ఞానఖండమున భావనాసిద్ధి యన్నది చతుర్దశాధ్యాయము సమాప్తము.

బాలప్రియ

భావనాబలముయొక్క సామర్థ్య మెట్టిదో నిరూపించుటయే ఇందలి మహాసేనుని వృత్తాంతమునకు ప్రధానతాత్పర్యము. అయినను ఇందు విశేషము లనేకములు కలవు. తంగణునికుమారుఁడు యజ్ఞాశ్వమును బంధించుట మొదటి విశేషము. సమాధియందున్న తమ తండ్రికి ఆమార్గమున పోవుచున్న వారు వచ్చి నమస్కరించుచున్నారా లేదా అను విషయము సాధారణ మునిబాలకులకు పట్టదు. ఒకవేళ వా రావిషయమును గమనించినను''ఈరాజపుత్రులు గర్వితులు. పెద్దలను గౌరవింపరు'' అన యనుకొందురే కాని వారితో ఆవిషయముపై కలహింపరు. ఒకవేళ కలహించినను యజ్ఞాశ్వమును బంధింపవలయునను తలంపు కలుగనే కలుగదు. మఱి తంగణుని పుత్రుడు అట్లేల చేసెను? అతఁడు క్షత్రియుఁడగుటయే యిందులకు కారణము. ఆతని తల్లిదండ్రులు క్షత్రియులు. తంగణుఁడు ఆత్మజ్ఞానము నొంది విరక్తుఁడై పదికోట్లయేండ్లు తపస్సు చేసెను. ఆతని భార్యయు ఆతనిని సేవించుచు ఆత్మజ్ఞానము నొంది అట్లే తపస్సు చేయుచుండెను. ఆత్మజ్ఞానము కలిగి కోట్లయేండ్లు తపస్సు చేసినను ఆమెయందున్న క్షత్త్రియరక్తగుణము మాఱలేదు. ఆక్షత్త్రియత్వమే కుమారునకు సంక్రమించినది. అతఁడు కూడ తండ్రివలన ఉపదేశము పొంది యోగవిద్యనే కాక ఆత్మజ్ఞానమును కూడ పొంది గొప్ప తపస్సు చేసెను. గండశైలమునందు అతఁడు లోకమునే సృష్టింపఁగలిగెను. ఇంతేకాదు. అతనిబోధచేత మహాసేనుఁడు ఆత్మజ్ఞానము నొందిజీవన్ముక్తుఁడయ్యెను. ఇంతవాఁడైనను ఆతనియందు క్షత్రియత్వము పోలేదు; బ్రహ్మణత్వము కలుగలేదు. అందువలననే అతఁéడు ప్రతి దినము గండశైలలోకమునకు పోయి దానిని పాలించుచు క్షత్రియ సహజమైన యధికారవాంఛను తీర్చుకొనుచుండెను. క్షత్త్రియవృత్తి ఇట్లు కొనసాగుచుండుటవలననే యజ్ఞాశ్వమును రాజపుత్రులను చూచి నంతనే ఆతనియందు రాజసము పొంగి అశ్వమును బంధించి తన మహావీరత్వమును ప్రకటింపవలయును నను నావేశము కలిగెను. ఆ యావేశముచేత ''నేను మునికుమారఁడును; తాపసవృత్తి లోనున్నాను'' అను నాఆలోచనయే కలుగులేదు. అందువలన అతఁéడు తాపసస్వభావమునకు విరుద్ధముగా పెద్దయుద్ధము చేసి అశ్వమును రాజపుత్రులను బంధించెను. దీనివలన ఎంతో తపస్సు వ్యయ మయ్యెను. తాను చేసినతప్పు ఎట్టిదో తండ్రి ''ఇది దైత్యుల లక్షణము; మునులకు తగదు'' అని మందలించువఱకు అతనికి తోఁచలేదు. కుమారుని స్వభావమునకు కారణమును నిరూపించుటకే తంగణుఁడు వాని జన్మవృత్తాంతమును వివరించెను. దీనినిబట్టి ఎంత తప్ససుచేసినను జన్మ వలన సిద్ధమగునట్టి వర్ణములయొక్క లక్షణములు మార్పు నొందుట ఎంత అసాధ్యమో స్పష్ట మగుచున్నది.

సమాధిస్థితికి వచ్చినసాధకురాలికి పుత్రుఁడుదయించుట రెండవవిశేషము. తంగణుఁడు విరక్తుఁడై తపోవనమునకు రాఁగా భార్యయు వెంటవచ్చినది. కాని ఆమెకు కామవాసనలు పూర్తిగా నశింపలేదు. అయినను పతివ్రత కావున కామభోగములను అపేక్షింపక భర్తను సేవించుచు ఆత్మజ్ఞానము నొంది భర్తతోపాటు కోట్ల కొలఁది సంవత్సరములు సమాధియందుఁడెను. కాని అతృప్తమైన కామవాసన (Unstiated sexual desire) అమెకు కూడవ తెలియకుండ నిగూఢమై ఆమెమనస్సునందు దాగియుండెను. పుత్రుని పొందవలసిన ప్రారబ్థకర్మము కాలవశమున అప్పటికి పక్వమై పైకివచ్చి నిగూఢమైయున్న కామవాసనను వెలికి తెచ్చి విజృంభింపఁజేసెను. ప్రారబ్ధవేగమువలననే ఆమె అంత తపశ్శక్తిని కలిగియుండియు ఆకామ విజృంభణము సహింపలేకపోయినది. విశ్వామిత్రుని తపోభంగమునకు మేనక కారణమైనట్లు, ఆమెతపోభంగమునకు కారణ మేదియు కన్పింపదు. అందువలన ప్రారబ్ధమే కారణ మని చెప్పవలసియున్నది. విధివశముననే అట్లు జరిగినదని తంగణుండు కూడ చెప్పియున్నాడు. కావున కామాదివాసనలు వివేకముతో కూడిన అనుభవముచేత నశింపవలె; లేదా ఆత్మవిచారముచేత నశింపవలె. కామము క్రోధము మొదలగుభావములు మనస్సులో పైకివచ్చునప్పుడు ''ఇదిగో కామము వచ్చుచున్నది. ఇదిగో క్రోధము వచ్చి ఆక్రమించుచున్నది. దీనికి లోఁబడరాదు. ఇది నాస్వరూపము కాదు'' అని తొలఁగించుకొను చున్నచో వాసన లన్నియు క్రమముగా క్షీణించి నశించును. నిద్రయందువలె సమాధిస్థితియందు ఎన్నిలక్షలయెడ్లు సుఖముగానున్న మనస్సునకు క్షాళనము జరుగదు. అది విచారమువలననే సంభవించును. అందువలననే కుమారుఁడు రాజ్యమును పాలింపవలయునని కోరినప్పుడు తంగణుఁడు, ''స్వభావము అతిక్రమింపరానిది (స్వభావోదురతిక్రమః)'' అను తంలపుతో అట్లే కానిమ్మని అనుమతించెను. అతఁడు కొంతకాలము ఆరాజ్యపాలనమును అనుభవించి విరక్తుఁడై విచారముచేత కామక్రోధాదివాసనలను నిర్మూలించుకొనవలయును నని ఆయన అభిప్రాయము. కుమారఁడును అట్లే చేసియుండును.

పురుషసంబంధము లేకయే స్త్రీకి పుత్రుఁడుదయించుట మూఁడవ విశేషము స్వప్నమునందు భోగము సంభవించినచో అది కేవలము భావనయే. కాని దానివలన జచరుగు దాతుస్ఖలనము మాత్రము శరీరము నందు భౌతికముగానే (Physical) జరుగును. తంగణునిభార్య కేవలము భర్తనుగూర్చిన భావనచేతనే రతిపారవశ్యమును పొందినను ఆమెకు ధాతుస్ఖలనము మాత్రము శరీరమునందు భౌతికముగానే జరిగినది. వ్యాసుఁడు మొదలుగా మహతపస్వులకు స్త్రీసంబంధము లేకయే పుత్రు లుదయించినట్లు, తంగణుని భార్యకూడ తపస్సంపన్ను రాలగుటచే పురుషసంబంధము లేకున్న పుత్రుఁడుదయించెను.

తంగణుఁడు కోరుకున్నను పుత్రుఁడు కలుగుట నాల్గవవిశేషము. ఇది ఆయనకు కేవలము ప్రారబ్ధవశముననే సంభవించినది. వ్యాఘ్రపాదుఁడు హేమలేఖను పెంచుటయు ఇట్టిదే. జడభరతుండు కూడ లేడిపిల్లను ఇట్లే పెంచెను. మఱి జడభరతునకు వలె వీరికిన ఈ శిశుపోషణము సంసారబంధమై మఱియొక జన్మను కలిగించునా? మువ్వురును కేవలము దయతోనే శిశువులను పోషింపఁబూనుకొనిరి. కాని జడభరతుఁడు లేడిపిల్లయందు లౌల్యమును కూడ వహించెను, అందువలన ఆయనకు లేడిజన్మ కలిగినది. దయవేఱు లౌల్యము వేఱు. ఇతరుల దుఃఖమును తొలఁగింపవలయునను తలంపు దయవారి సుఖదుఃఖములను గూర్చి మాటిమాటికి ఆలోచించుచు వారి సుఖమువలన తాను సుఖమును వారి దుఃఖమువలన దుఃఖమును పొందుచుండుట లౌల్యము. లౌల్యమువలన సంసారబంధము తప్పదు. కావుననే భగవంతుఁడు దైవీసంపదనుగూర్చి చెప్పునప్పుడు ''దయా భూతే ష్వలోలుప్త్వమ్‌'' అని భూతములయందు దయ ఉండవచ్చును గాని లౌల్యము ఉండరాదని స్పష్ట మొనరించెను. వ్యాఘ్రపాదఁడుతంగణుడు దయామాత్రముగా శిశువులను పోషించి పెద్దవారిని చేసిన తరువాత వారిసంగతిని పట్టించుకొనలేదు. ఆవిషయమువారు కలలో జరిగిన వృత్తాంతమునువలె. విస్మరించియుందురు. అందువలన వారికి ఆవ్యవహారము బంధమును కలిగింపలేదు. ప్రారబ్ధానుభవము అందఱకును సమానమే. ఆజ్ఞానులు ప్రారబ్ధమువలన కలుగుచున్న సంపదలవలన సుఖమును ఆపదలవలన దుఃఖమును తన్మయత్వముతో అనుభవించుచు ఆవాసనలను పెంపొందిచుకొనుచుందురు. జ్ఞానులు కలుగచున్న సుఖము గాని దుఃఖమును గాని మనసులో పుట్టు చున్నంతనే చూచుచు, ''ఇది నాస్వరూపము కాదు. దృక్స్వరూపుఁడనైన నాయందు ఇది దృశ్యమాత్రమే'' అని వానిని విస్మరించుచుందురు. అందువలన వారికి పూర్వవాసనలు నశించునే కాని క్రొత్తవాసనలు పుట్టవు.

మునికుమారుఁడు ప్రసన్నుఁడై, ''నీకోర్కె ఏమో చెప్పుము. నేను తీర్చెదను'' అని చెప్పినప్పటికి మహాసేనుఁడు తంగణునితోన మాటాడవలయునని కోరుట మరియొక విశేషము. సైనికులు జరిగిన వృత్తాంత మంతయు చెప్పినను మహారాజు, ''ఎట్లయినను తంగణమునిని ప్రసన్నుని గావించుకొని అశ్వమును రాజపుత్రులను శీఘ్రముగ తీసికొని రమ్ము'' అని మహాసేనుని నియోగించుటఇందులకు ముఖ్యకారణము. ఆయనయును అట్లేల నియోగింపవలె? కుమారుఁడు ప్రసన్నుడైనచో చాలదా? ఆమునికుమారుఁడు చేసినది అక్రమము. తప్పుచేసినవానిని ప్రార్థించి ప్రసన్నుని చేసికొని పనిజరుపుకొనుట పరిపాలకులకు తగదు. వాని నెట్లయినను మందలించి సరియైనమార్గమునకు తేవలె. లేకున్నచో అతఁడు గర్వితుఁడై ఇంకొకప్పుడు తమవిషయమునఁగాని మఱియొకరి విషయమునఁగాని ఇట్లే ప్రవర్తింపఁగలడు. కావున ధర్మదృష్టితో వానిన శిక్షించుట ఆవశ్యకము కాని ఆశక్తి తమకు లేదు. వానిని అదుపులో పెట్టఁదగినఁవాడు తండ్రియే. కావున కుమారునివర్తనమును తండ్రికి తెలియఁజేయుట తమకు కర్తవ్యము. తండ్రి కూడ పుత్రమోహమున కుమారునిపక్షమునే అవలంబించినచో తాము ఱియొక మహర్షిని శరణు పొందవలసియుండును. ఎట్లయినను తప్పుచేసినవానిని ప్రార్థించుట తమకు తగదు. అందువలననే సుషేణుఁడు మహాసేనుఁడును ఎట్లయినను తంగణమహామునినే ప్రసన్నుని చేసికోవలయును నని తలంచిరి. తగినట్లే తంగుణఁడును కుమారుని మందలించెను.

మునికుమారఁడు తండ్రిని సమాధినుండి మేల్కొలుపవలసి వచ్చినప్పుడు తాను స్థూలదేహమునుండి సూక్ష్మశరీరముతో బయల్వెడలితండ్రియందు ప్రవేశించి ఆత్మయందు లీనమైయున్న యాయన యొక్క మనస్సున ఆకర్షించి మేల్కొలిపి మరల వచ్చి తనస్థూలశరీరమున ప్రవేశించెను. అంతకు పూర్వము తంగణునిభార్య కూడ అట్లే చేసెను. కాని మునికుమారుఁడు గండశైలములోనికి పోవునప్పుడు వెలుపలికి వచ్చునప్పుడు స్థూలశరీరమును వదలినట్లు లేదు. అట్లే గుఱ్ఱమును రాజపుత్రులను శైలములోనికి తీసికొని పోయినప్పుడు వారి సూక్ష్మశరీరములను తీసికొని పోయినట్లు లేదు. మహాసేనుని విషయమున మాత్రము వానిని సూక్ష్మశరీరమునే లోనికి తీసికొనిపోయి అక్కడ మఱియొక శరీరమును సృష్టించి దానియందు అతనిని ప్రవేశ##పెట్టెను. మఱి మహాసేనుండు స్థూలశరీరముతో ప్రవేశింపలేని శైలములోనికి గుఱ్ఱము రాజపుత్రులు ఎట్లు ప్రవేశ##పెట్టఁబడిరి? మునికుమారుఁడు స్థూలశరీరముతో శైలములోనికి రాకపోకలు ఎట్లు చేయుచున్నాఁడు.

అష్టసిద్ధులలో అణిమ అనుసిద్ది కలదు. దానివలన స్థూల దేహమును అణువంతదిగా తగ్గించుకొనవచ్చును. ఈశక్తి చేతనే అజంనేయుఁడు లంకలో ప్రవేశించినప్పుడు పిల్లయంత శరీరముతో నుండెను. సీతతో ప్రసంగించుచు ఆయన ''నిన్ను రామునియొద్దకు ఇప్పుడే తీసికొనిపోయెదను. నావీపుపై నెక్కుము'' అని పలికెను. ఆయనయొక్క చిన్నశరీరమును చూచుచు ఆమె. ''ఇంత చిన్నశరీరముపై నన్నెట్లు గొనిపోవుదువు? ది గాదా నీ కపిత్వము'' అని పరిహసించెను. వెంటనే ఆయన ''మహిమ'' ఆను సిద్ధితో ఆశరీరమునే మహోన్నతముగా పెంచెను. అట్లే మునికుమారుఁడు స్థూలశరీరమునే అణువంతగా నొనర్చుకొని శైలములోనికిరాకపోకలు చేయుచు నుండవచ్చును. అట్లే గుఱ్ఱమున రాజపుత్రులను కూడ అణువంతగా నొనర్చిలోనికి తీసికొనిపోయి యుండవలె. అట్లు కాక వారి సూక్ష్మ శరీరములను లోనికి గొనిపోయియున్నచో వారిస్థూలశరీరములు శైలమునకు వెలుపల గోచరములై యుండవలె. మొదట రాజపుత్రులు చూచుచుండగనే మునిపుత్రుఁడు గుఱ్ఱముతో శైలములోనికి పోయెను. అప్పుడు వారికి మునిపుత్రునియొక్క గుఱ్ఱయొక్క స్థూలశరీరములు శైలమువెలుపల కనిపించి యుండవలె. అట్లు కన్పింపలేదు. గుఱ్ఱముతో మునికుమారుఁడు శైలములో ఉన్నాఁడనియే రాజపుత్రులు శైలమును పగులఁగొట్టిరి. అప్పుడతఁడు మహాసేనతో వెలుపలికి వచ్చి రాజపుత్రులను జయించి బంధించి మరల వారిని శైలములోనికి గొనిపోయెను. అప్పుడు వారి నందఱును అణవులంతగా చేసి తీసికొనిపోయె నని చెప్పుట సమంజసము.

మఱి, అతఁడు మహాసేనుని విషయమున అట్లేల చేయలేదు? అతఁడు మహాసేనుని ఆలోకమున బంధించుట లేదు. ఆతనిని ఆ లోకమునందు చంద్రమండలము సూర్యమండలము మొదలుగా అన్ని ప్రదేశములందును త్రిప్పవలసియున్నది. అట్టియెడల స్థూలమైన యతని సాధారణశరీరము ఆమండలములోని శీతలత్వము ఉష్ణోగ్రత మొదలగు మార్పులకు తట్టుకొనఁజాలదు. అందువలన అతని స్థూలశరీరమును శైలమునకు వెలువలనే యుంచి దానిలోనుండి యతనిలింగ శరీరమును శైలములోనికి తీసికొనిపోయి అక్కడ ఆలోకమునకు తగిన మఱియొక శరీరమును సృష్టించి దానిలో ఆతని లింగశరీరమును ప్రవేశ##పెట్టెను. వెలుపలికి వచ్చినప్పుడు మరల ఆతని లింగశరీరమును శైలము వెలుపలనున్న స్థూల శరీరములో ప్రవేశ##పెట్టెను.

మహాసేనునకు స్థూలశరీములు మాఱినవి. కాని లింగశరీరము మాఱలేదు. అందువలననే అతఁడు గండశైలమున చూచిన దానిని మరల స్మరింపఁగలిగెను. అనఁగా అతనికి స్వప్నములోనుండి జాగ్రత్తులోనికి వచ్చినట్లే యున్నది. కావున విజ్ఞానము అనుభవము అన్నవి కేవలము లింగశరీరమునకు సంబంధించిన వనుట స్పష్టము. స్థూలము, సూక్ష్మము, కారణము అని శరీరములు మూఁడువిధములు. కాళ్ళు చేతులు తల మొదలగు నవయవములతో కన్పించుచున్న శరీరము స్థూలము. దీనికి లోపలనుండి దీనిని నడుపుచున్న శరీరము సూక్ష్మము. దీనినే లింగశరీర మందురు. ఇది స్వప్నమునందు స్థూలశరీరముకన్న విడిగా స్వతంత్రముగా వ్యవహరించుచున్నది. చెట్టునకు వేరువలె, లింగశరీరమునకు లోపలనుండు 'అవిద్య' కారణ శరీరము. ఈయవిద్యయే అవ్యక్తము మాయ ప్రకృతి అనియు చెప్పఁబడుచున్నది. ఇది సత్త్వము రజస్సు తమస్సు అను మూఁడు గుణములతో రూపొందియుండును. మరణసమయమున కారణశరీరముతో లింగశరీరము స్థూలశరీరమును వదలి పెట్టిపోవును. వివేక చూడామణియందు భగవత్పాదులచే లింగశరీరము ఇట్లు వర్ణింపఁబడినది. ''వాక్కు మొదలుగా కర్మేంద్రియములు ఐదు, శ్రోత్రము మొదలుగా జ్ఞానేంద్రియములు ఐదు, పంచప్రాణములు, పంచభూతములు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అను నంతఃకరణచతుష్టయము, అవిద్య, కామము, కర్మము - ఆను నెనిమిదిపురములు (భాగములు) కలదానిని సూక్ష్మశరీర మని చెప్పుదురు. ఇదియే లింగశరీరము. ఇది అపంచీకృతములైన సూక్ష్మభూతములనుండి ఏర్పడుచున్నది. కర్మవాసన లన్నియు దీనియందే యండును. ఇదియే కర్మఫలముల ననుభవించుచుండును. ఆత్మస్వరూపము తెలియకుండుట అను నజ్ఞానము కారణముగా ఇది జీవునకు అనాదిగా నున్నది.''

శ్లో||వాగాది పంచ శ్రవణాది పంచ

ప్రాణాది పంచాభ్రముభాని పంచ||

బుద్థ్యా ద్యవిద్యాపి చ కామకర్మణీ

పుర్యష్టకం సూక్ష్మశర మారీహుః ||98

శ్లో|| ఇదం శరీరం శృణు సూక్ష్మసంజ్ఞితం

లింగం త్వపంచీకృతభూతసంభవమ్‌ ||

సవాసనం కర్మఫలానుభావకం

స్వాజ్ఞానతోనాది రుపాధి రాత్మనః|| 99

ఇందు కారణశరీరమైన యవిద్యకూడ సూక్ష్మశరీరమున భాగముగా చెప్పఁడియున్నది. పైకథవలన యోగవిద్యయందు సిద్ధి నొందినవారు లింగశరీరమును స్థూలశరీరమునుండి సులభముగా విడఁదీయఁగల రని స్పష్ట మగుచున్నది. శరీరములోపలి భాగములను విడఁదీసి పైకితెచ్చి మరల లోపల నుంచఁగలిగిన వైద్యునియొక్క నైపుణ్యమువంటిదే యిది. ఈవిద్యచేత కూడ అవిద్యాకామకర్మలు నశింపవు. అవి జ్ఞానముచేతనే నశించును.

మహసేనుఁడు శైలమునుండి వెలుపలికి వచ్చునప్పటికి నూట నిరువదికొట్లయేండ్లు భూలోకమున గడచె నని మునికుమారుఁడు చెప్పెను. అప్పటివరకును ఆగండశైలము సమాధియందున్న తంగణుఁడు గుంటలోనున్న మహసేనుని స్థూలశరీరము అట్లే యున్నవి. తక్కిన జగత్తు అంతయు మాఱను. ఇవి యేల మార్పునొంది నశింప లేదు? అంతకాలము భౌతికశరీరములు చెదరకుండ నుండునా? తంగణుఁడు కాని ఆతని కుమారుఁడు కాని ఆప్రదేశమునందు కాలవశమున సంభవించు భౌతికములైన మార్పులు కలుగకుండునట్లు తపశ్శక్తిచేతనే రక్షణము (Insulation) కల్పించి యుందురని యూహింప వలసి యున్నది.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters