Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

పదునాఱవయధ్యాయము -

అష్టావక్రజనకసంవాదము

భార్గవుఁడు విస్మితుఁడై దత్తాత్రేయునితో నిట్లనెను. ''భగవాసుఁడా! నీవు చెప్పనయీకథ అద్భుతముగా నున్నది. దీనిని నేను ఎక్కడను వినలేదు. ఆమహాముని జనకుని ఏమి యడిగెనో ఆ రాజేంద్రుఁడు ఏమి సమాధానము చెప్పెనో అది యంతయు నాకు దయతో చెప్పుఁడు.''

దత్తాత్రేయుఁడు ఇట్లు చెప్పెను. ''ఆతాపసి వెడలిపోయినంతనే అష్టావక్రుఁడు చాలమందివిప్రులతో కూడి జనకుని సమీపించి పలికెను. 'మహారాజా! ఆతాపసి చాల సంక్షేపముగా చెప్పుటవలన ఆత్మతత్త్వము నాకు చక్కఁగా బోధపడలేదు. తెలిసికొనుటకు వీలులేనిదానిని నే నెట్లు తెలిసికొనఁగలనో దయతో చెప్పుము.'

అప్పుడు జనకుఁడిట్లు చెప్పెను. ''అది సకల విధముల అవేద్యము కాదు; వేద్యము కూడ కాదు. అది సకల విధముల తెలిసికొనుటకు వీలులేనిదే అయినచో గురువు ఎట్లు చెప్పఁగలఁడు? కొందఱ కది చక్కఁగా తెలియును. అట్టి గురువే దానిని తెలియునట్లు చేయవలె. కాఁబట్టి మొట్టమొదట సద్గురువును ఆశ్రయింపవలె. దీనిని తెలిసికొనుటకు ఒకవిధముగా సులభ మైనను మఱియొక విధముగా దుర్లభము. అంతర్ముఖమైన దృష్టికలవానికి ఇది సులభము; బహిర్ముఖమైన లోకదృష్టి కలవానికి ఇది దుర్లభము. సాధారణముగా చెట్టునో జంతువునో చూపి దానినిగూర్చి బోధించుపద్ధతిలో ఆత్మను నిరూపించుటకు వీలే లేదు; తెలిసికొనుటకు అసలే వీలు లేదు. కాని ఇంకొకవిధముగా దానిని నిరూపింపవచ్చును; అప్పు డది తెలిసికొనుటకును వీలగును,

నీవు దేనిని చూచుచున్నావో దానిని వేద్యము (Knowable) అనుచున్నావు. నీకు ఏది భాసించుచున్నదో దానిని చక్కఁగా విమర్శింపుము. వృక్షమును చూచినప్పుడు నీకు వృక్షజ్ఞానము కలుగుచున్నది. దానియందు వృక్షము జ్ఞానము అను రెండుభాగములు కలవు. వృక్షము భాసించుచున్నపదార్థము. దీనినే భాస్య మందురు. జ్ఞానము దానిని భాసింపఁజేయుచున్నది. దీనిని భానశక్తి యందురు. వృక్షముసు జంతువులు మొదలుగా భాస్యములు (Objects of knowledge) ఎన్ని మాఱినను నీభానశక్తి మాఱదు. వృక్షజ్ఞానము జంతు జ్ఞానము మొదలుగా సకలజ్ఞానములకు అదియే ఏకరూపమైన యాధారము. ఆభానశక్తియే ఆత్మ. భాస్యములకు భానశక్తికి మిక్కిలి అంతరము కలదు. భాస్యమైన పదార్థము స్వయముగా ప్రకాశింపలేదు. అది భానశక్తి చేతనే ప్రకాశించును. భిన్నభిన్నములైన భాస్యములన్నియు దానిచేతనే మనకు గోచరించుచున్నవి. భాస్యముల యొక్క భిన్నభిన్నరూపములచేత భానశక్తియందు భేదము కలుగదు. ఆకారభేధము లన్నియు భాస్యములకు సంబంధించినవే కాని భానమునకు సంబంధింపవు. ప్రతిబింబములయొక్క ఆకారబేదములవలన అద్దమునందు భేదము కలుగుట లేదు కదా? నీయనుభవమునందే నీవు దీనిని గ్రహింపవచ్చును. భాస్యములను గ్రహించుచున్న బుద్ధినుండి ఆభాస్యములయొక్క రూపములను వేఱుచేసి కేవలము భానశక్తిగా లేక జ్ఞానరూపముగా నుండు బుద్ధిని చూడుము. దృశ్యములయొక్క ఆకారములచేత జ్ఞానము వివిధరూపములతో కన్పించుచున్నదే కాని దానికి అసలు ఆకారమే లేదు. కావున దృశ్యములయందుండు ఆకారములను ప్రతిదానిని ''ఇది జ్ఞానము కాదు'' ''ఇది జ్ఞానము కాదు'' అని తొలగించుచున్నచో ఆకారరహితమైన జ్ఞానము స్ఫురించును. అదియే యథార్ధమైన నీస్వరూపము. విశ్వమునకు కూడ అదియే స్వరూపము. తనకు స్వరూపమగుటచేతనే ఎవఁడును ఎదుటనున్న చెట్టునో గుట్టనో గ్రహించినట్లు ఆత్మను గ్రహింపలేకున్నాఁడు. కావున సకల పదార్థములను గ్రహించుచు జ్ఞానమాత్రముగ నీయందే యన్న నీస్వరూపమును ఇట్లు స్పష్టముగా గుర్తింపుము.

శరీరము నీవు కాదు. ప్రాణము నీవు కాదు. మనస్సు కూడ నీవు కాదు. ఎందువల్ల ననఁగా, ''నాశరీరము, నాప్రాణము, నా మనస్సు'' అని చెప్పుచున్నావు; శరీరము ప్రాణము మనస్సు ఎన్ని విధములుగా మాఱుచున్నను వానిని గ్రహించుచు జ్ఞానరూపముననున్న నీవు మార్పులేక స్థిరముగా నున్నావు. నీవు స్థిరుఁడవు. అవి అస్థిరములు. కావున అవి ఏవియు నీవు కాదు. ''నాయిల్లు'' అని నీవు చెప్పుచున్నప్పుడు ఇల్లు నీకన్న అన్య మనుట స్పష్టము. ఇల్లు నీవు కాదు, అట్లే నాశరీరము అని చెప్పుచున్నావు కావున శరీరము నీవు కాదు. అట్లే ''నాప్రాణము, నామనస్సు'' అని నీచేత చెప్పఁబడుచున్న ప్రాణము మనస్సు కూడ నీవు కాదు. చైతన్యము లేక జ్ఞానము ఒక్కటియే నేను అను స్ఫురణమునందు నిత్యముగ నిలిచియున్నది. తక్కినవి ఏవియు నిలుచుట లేదు. కావున సర్వమును తెలిసికొనుచున్న జ్ఞానము మాత్రమే నీవు. ఎప్పుడో ఎక్కడనో కాదు; ఇప్పుడే ఇక్కడనే నీదృష్టిని బహిర్విషయములనుండి మరలించి కేవలజ్ఞాన మాత్రముగనున్న యాత్మను చూడుము. ఉత్తమమైనబుద్ధి కలవారు గురువు ఉపదేశించినవెంటనే స్వరూపమును చూచుచున్నారు.

మఱియొక విషయమును గమనింపుము. చక్షుస్సు అఁనగా శరీరమునందు కన్పించుచున్న కన్ను కాదు. స్వప్నమునందు ఈ కన్ను ఉండదు. కాని అక్కడ మనస్సుతో చూచుచునే యున్నావు. కావున మనస్సే ముఖ్యమైన చక్షుస్సు. ఎందువల్ల ననఁగా నీవు ఏదేని ఒకవస్తువును చూడఁదలచుకొన్నప్పుడు మనస్సును ఆవస్తువునందు నిలిపినప్పుడే అది నీకు గోచరించుచున్నది. అట్లుకాక మనస్సు వేఱోక విషయమునందు లగ్నమై యుండి చక్షురింద్రియములోనికి వచ్చి నిలువకున్నచో ఎదుటనున్న వస్తువు కూడ సరిగా కన్పించదు. శ్రోత్రము మొదలుగా చక్కినయింద్రియములవిషయము కూడ ఇంతే. మనస్సు వానితో కూడియున్నప్పుడే ఆయింద్రియములు విషయములను గ్రహింపఁగలవు; లేకున్నచో గ్రిహింపలేవు. కావుననే ఏదేని ఆలోచనమునందు మనస్సు గాఢముగ లగ్నమై యున్నప్పుడు ఎవరైనను దగ్గరికి వచ్చి మాటాడినను. ''అయ్యా! ఏమి అనుకోవద్దు. నా మనస్సు ఎక్కడనో ఉన్నది. అందువలన నీవు వచ్చుటను నేను గమనింప లేదు. నీవు అన్నదియు నాకు వినఁబడలేదు.'' అని చెప్పుట సంభవించుచున్నది. కావున సకలేంద్రియములకు గ్రహణశక్తి నిచ్చుచున్నది మనస్సే. ఇట్లే మనస్సువలననే సుఖదుఃఖములు భాసించుచున్నవి. మనస్సు సుఖమునందు మగ్నమై యున్నప్పుడు దుఃఖము కాని, దుఃఖమునందు మగ్నమై యున్నప్పుడు సుఖము కాని భాసించుట లేదు. కావున ఏవస్తువుయొక్క స్వరూపము నైనను మనము గ్రహించవలెన నని యనుకొన్నప్పుడు మనస్సును ఇతర విషయముల నుండి మరలించి ఆవస్తువునందు నిలిపినప్పుడే అది గోచరించుచున్నది. అట్లే ఆత్మస్వరూపమును గ్రహించునప్పుడు కూడా మనస్సును ఇతరములైన సకలవిషయములనుండి మరలింపవలయును. మనస్సు విషయములపై ప్రసరింపకుండ నిలిచిన చాలును. అది తతక్షణమే శుద్ధమైన ఆత్మను భాసింపఁజేయును.

ఇచ్చట ఒకవిషయమును చెప్పెదను శ్రద్దగా వినుము. చిదాత్మమనస్సునకు ఆగోచర మగును; గోచరము కూడ అగును. ఈవిషయమున శ్రుతులను ఆగమములను విమర్శించువారు చాలమంది భ్రాంతి నొందుచున్నారు. వెలుపలనున్న వస్తువులు మనస్సునకు గోచరించుటలో రెండుదశలున్నవి. దేనిని చూచుచున్నమో దానియందుతప్ప మనస్సు ఇతరవస్తువులందు ప్రసరింపకుండుట మొదటిదశ. తరువాత ఆవస్తువునందే ఆసక్తితో నిలిచియుండుట రెండవదశ. ఇతర వస్తువులయందు దృష్టి ప్రసరింపకుండుట ఎంత ఆవశ్యకమో చూచుచున్న వస్తువునందు దృష్టి ఆసక్తితో నిమగ్నమగుటయు అంతేఆవశ్యకము. ఇతరవస్తువులనుండి దృష్టిమరలినను చూచుచున్న వస్తువునందు ఉదా సీనత తాటస్థ్యము ఏర్పడినచో దృష్టి ప్రసరింపలేక పోయినచో (Becoming blank) ఆవస్తువు సరిగా భాసింపదు. ఆందువలన మనము చూచుచున్న వస్తువునందు దృష్టి ఆసక్తమగుట ఆవశ్యకము. ఇట్లు వెలుపలనున్న వస్తువులను గ్రహించుటలో మనస్సునకు ఈ రెండుదశలలో రెండువ్యాపారములు ఆవశ్యకి మగును. ఆత్మచైతన్యమును భాసింపఁజేయుటకు మాత్రము రెండువ్యాపారము లక్కఱ లేదు. మనస్సు ఇతర వస్తువులనుండి మరలివచ్చుట ఒక్కటియే చాలును. అది ఆవిషయములనుండి వెనుకకు వచ్చినంతనే ఆత్మ భాసించును. అద్దములో కన్పించుచున్న ప్రతిబింబములలో ఒకదానిని చూడవలయు నన్నచో తక్కినవానిని వదలి దృష్టిని దానియందే నిలుపుట ఆవశ్యకము. కాని అద్దమునందు అంతటను ఎల్లప్పుడు వ్యాపించి యుండునట్టి ఆకాశప్రతిబింబమును చూచుటకు ఇతర ప్రతిబింబముల నుండి దృష్టి మరలించిన చాలును. వెంటనే ఆకాశ ప్రతిబింబము గోచరించును. దానిపైచూపు నిలుపుటకు ప్రత్యేక ప్రయత్న మక్కఱ లేదు. దాని నంతవఱకు కప్పుచున్న ప్రతిబింబములనుండి దృష్టి మరలించుట యన్న యొక్కప్రయత్నముచేతనే అద్దమునంతను ఎప్పుడును వ్యాపించియున్న యాకాశము గోచరించును. అట్లే ఆత్మ గోచరించుటకు కూడ రెండు యత్నములు అక్కఱలేదు. సకలపదార్థములయందువలె మనస్సులో కూడ నిండియున్నది ఆత్మయే. ఆవరించియున్న విషయము లన్నియు తొలఁగినంతనే మనస్సునకు స్వరూపమైన ఆత్మ భాసించును. బావి తవ్వునపుడు మట్టిని తొలఁగించుటకు ప్రయత్నము కావలమును కాని నీటికొఱకు ప్రయత్నింపనక్కఱలేదు. అది మట్టిమడుగున సిద్ధముగనే యుండును. కావున చిదాత్మ గోచరించుటయందు మనస్సు సకల విషయములనుండి వెనుకకు మరలుటయే ఆవశ్యకము. ఇతర వస్తువు విషయమున దానిని చేరునట్లు. తన్ను తాను చేరుట అన్నది లేదు. ఏవస్తువును ఇంద్రియముద్వారా మనస్సుచేరి తెలిసికొనుచున్నదో అది మనస్సునకు వేద్య మగును. అట్లు మనస్సు ఆత్మవిషయమున వెలుపలికి పోనక్కఱ లేదు. కావుననే మనస్సునకు ఆత్మ అవేద్య మని చెప్పఁబడుచున్నది. ఈకారణముచేతనే శుద్ధమైన మనస్సే వేద్యమైన యాత్మతత్త్వ మని చెప్పఁబడచున్నది. సకలవిషయములనుండి తొలఁగి నిలుచుటయే మనస్సునకు శుద్ధి. ఈశుద్థియే తత్త్వజ్ఞానమునకు పరమసాధనము. ఎంతవఱకు మనస్సు శుద్ధము కాదో అంత వఱకు జ్ఞాన మెట్లు కలుగును? మనస్సు శుద్ధమైనచో జ్ఞానము కలుగకుండ నెట్లుండును? కర్మానుష్ఠానము ఉపాసనము వైరాగ్యము మొదలగు సాధనము లన్నియు మనస్సునకు శుద్ధి కలిగించుటకే ఉపయోగించుచున్నవి. వాని కన్నింటికి అదియే ఫలము. కావున శుద్ధమైన మనస్సుచేతనే ఆత్మ భాసించుచున్నది.''

అంతట అష్టావక్రుఁడు ఇట్లు ప్రశ్నించెను. ''మహారాజా! సకల విషయములనుండి మనస్సు మరలినంతనే కేవలమైన యామనస్సు చేతనే ఆత్మ భాసించు నని చెప్పితివి. గాఢనిద్రయందు మనస్సు విషయములతో సంబంధము నొందక కేవలముగా నుండును. కావున సుషుప్తి మాత్రముగనే కృతార్థత కలుగుచుండఁగా ఇతసాధనములతో పని యేమున్నది?''

జనకుఁడిట్లు సమాధానము చెప్పెను. ''నిజమే. నిద్రలో మనస్సు విషయములతో సంబంధమును పొందదు. కాని అది అప్పుడు నిద్రలో లీన మగును. అప్పుడు వస్తువును భాసింపఁజేయు నట్టి దాని శక్తియు పనిచేయదు. అప్పుడు ఆశక్తియు దానియందే లీనమై యుండును. అట్టిమనస్సు ఆత్మను ఎట్లు భాసింపఁజేయఁగలదు? అద్దముపై కాటుకను పూసినపుడు దానియందు ఇతరవస్తువులు ప్రతి బింబింపకుండ నున్నంతమాత్రమున ఆకాశము దానియందు ప్రతిబింబింపదు. అట్లే నిద్రచేత ఆవరింపఁబడిన మనస్సు విషయములతో సంబంధమునుపొందకుండినంతమాత్రమున ఆత్మను భాసింపఁజేయఁజాలదు. ఆసమయమునం దది విషయములను గ్రహించుటకు ఎట్లు అయోగ్యమై యున్నదో అట్లే ఆత్మను భాసింపఁజేయుటకును ఆయోగ్యమే యగుచున్నది. నిద్రలో తమస్సుచేత ఆవరిఁపఁబడిన మనస్సు వలన కూడ ఆత్మ భాసించుట సంభవ మైనచో మట్టిగోడవలన కూడ అది భాసింపవలసియుండును. కావున శుద్ధమైయోగ్యమైన మనస్సునకే ఆది భాసించును. యోగ్యత లేకుండుటవలననే అప్పుడే పుట్టిన శిశువు యొక్క మనస్సునందు ఏదియు భాసించుట లేదు. అద్దమునకు మసిపూసినచో ఆమసియొక్క ప్రతిబింబము అద్దమునందు వ్యాపించియుండును. ఆప్రతిబింబము మనకు కన్పింపదు. వస్తువు అద్దమునకు ఎదురుగా ఎడముగా నున్నప్పుడు మనకు ఆవస్తువుయొక్క ప్రతిబింబమును అద్దములో చూచుటకు అవకాశము ఉండును. అట్లుకాక మసి అద్దమునకు అత్యంతము సన్నిహితముగా ఉండుటచే దానియొక్కప్రతిబింబమును చూచుటకు మనకు అవకాశము కలుగుట లేదు. కాని అంతమాత్రమున ఎదుటనున్న వస్తువును తనయందు ప్రతిబింబింపఁజేసికొనుట అను స్వభావము అద్దమునకు పోయిన దని చెప్పఁజాలము. అప్పుడు మసియొక్క ప్రతిబింబముచేత అద్దము నిండిపోయిన మఱి యొక వస్తువుయక్క ప్రతిబింబమును గ్రహింప లేకున్నది అని మాత్రమే చెప్పవలసియుండును. అట్లే నిద్ర ఆవరించినప్పుడు దాని ప్రతిబింబముచేత మనస్సు నిండిపోయి ఇంకొక వస్తువుయొక్క ప్రతిబింబమును గ్రహింపలేనిస్థితియందు ఉండును. అందువలన అప్పుడది ఆత్మస్వరూపమును కూడ గ్రహింపలేదు. అది నిద్రయొక్క ప్రతిబింబమును గ్రహించుచుండుటవలననే మేల్కొన్నవాఁడు ''నేను సుఖముగా నిద్రించితిని'' అని స్మరించుచున్నాఁడు. దేనిని పూర్వము అనుభవించితిమో దానిని ఇప్పుడు స్మరింతుము, అనుభవింపని దానిని స్మరించుట అసంభవము. కావున సుషుప్తియందు నిద్రయొక్క ప్రతిబింబమును గ్రహించుచు మనస్సు తన్మయమై అన్యవస్తువును గ్రహింపలేకున్న దనుట స్పష్టము.

ప్రకాశము విమర్శ అని మనస్సునకు రెండుదశలు కలవు. వెలుపనున్న పస్తురూపమును మాత్రమే గ్రహించుట ప్రకాశము. ఆరూపమునుగూర్చి వెంటనే మనస్సులో పుట్టునట్టి యాలోచనము విమర్శ, మొదటిదశలో ఇది యేదో ఒకవస్తువు అను సామాన్య జ్ఞానము మాత్రమే యుండును. రెండవదశలో ''ఇది చెట్టు. ఇది పండు'' అని భిన్నశబ్దములతో వస్తువులయొక్క విశేషజ్ఞానము కలుగును. ప్రతివస్తువువలన మొదటఁగలుగుచున్న సామాన్యజ్ఞానమును ప్రకాశ మని నిర్వికల్ప మనియు చెప్పుదురు. భిన్నశబ్ధములతో వస్తువులవలన కలుగుచున్న విశేషజ్ఞానమును విమర్శ అని సవికల్పమనియు చెప్పుదురు. విమర్శజ్ఞానము అభినవము స్మృతి అని రెండు విధములు. మొదటిసారి ఒకవస్తువును చూచినప్పుడు ''ఇది యిట్టిది. దీనిని మామిడిపండు అందురు'' అని మొదటి అనుభవముచేత కలుగు జ్ఞానము అభినవము. రెండవసారి అటువంటిపండునే చూచి గాని తిని గాని ''ఓహో ఇది మామిడిపండు'' అని మొదటియనుభవమును స్మరించుటవలన కలుగుజ్ఞానము స్మృతి.

మనస్సునకు ప్రకాశము విమర్శ అనునీరెండు శక్తులు ఎప్పుడును ఉండును. సాధారణముగా వస్తువుయొక్క రూపము ప్రకాశించి నంతనే మరుక్షణమున ''ఇది యిట్టిది. ఇది పండు'' అను విమర్శ జ్ఞానముకలుగును. ఈరెండు దశలకు మధ్యనున్న యంతరము అత్యంతము సూక్ష్మ మగుటచే గోచరముకాదు. అయినను అంతరము మాత్ర ముండును. నిద్ర మనస్సునందు ప్రకాశించుచున్నప్పుడు ''ఇది నిద్ర'' అను విమర్శజ్ఞానము వెంటనే పుట్టదు. విమర్శజ్ఞానములేని యాప్రకాశదశ నిద్ర కొనసాగినంతవఱ కుండును. విమర్శజ్ఞానములేని యాస్థితిని మూఢదశ యని కూడ చెప్పుదురు. మెలఁకువ వచ్చినంతనే పెక్కు వస్తువులయొక్క విమర్శజ్ఞానము కలుగుచుండును. అందు వలన జాగ్రద్దశను అమూఢదశ అనియు చెప్పుచున్నారు. ఇట్లే దీపముయొక్క ప్రకాశము నిబిడముగా నున్నను దానియందు విమర్శజానము లేకుండుటచే దీపము మొదలగువానియొక్క ప్రకాశమును కూడ మూఢ మనియే చెప్పుచున్నారు.

ఆత్మయందు సంకోచ మేర్పడి వెలుపల ఏదో యున్నట్లు మొదట తోఁచుట ఏది కలదో అదియే మాయ లేక అవ్యక్తము అని చెప్పియుంటిని. ఆయవ్యక్తమే జగత్తు అను చిత్రము భాసించుటకు ఆధారమైన గోడవలె నున్నది. అదియే నిద్ర, దానియందు నామ రూపములతో ఏదియు వ్యక్తము (Manifest) కాదు కావున దానిని అవ్యక్తమనుచున్నాము. అందు ఏదియు భాసింపకుండుటవలననే దానిని మహాశూన్య మనియు చెప్పుచున్నారు. నిద్రనుండి లేచినతరువాత ''నాకేమియును తెలియ లేదు'' అని స్మరించుచున్నాము కాఁబట్టి సుషుప్తియందు ''ఏదియు లేకుండుట'' (Absence of every thing) అన్నది మనస్సునందు ప్రకాశించుచునే యున్నది. ''అయ్యా! నిద్ర యందు మనస్సు విలీన మగు నని యితరులు చెప్పుచున్నారు. మీరు నిద్రయందు మనస్సు నిద్రాప్రకాశనిబిడమై యుండు ననుచున్నారు. ఈరెండును ఎట్లు కుదురును? అని యందు వేని వినుము. నిద్రయందు మనస్సు ప్రతిక్షణభిన్నములైన పరిణామములను పొందక నిర్వికల్పముగా నిశ్చలముగా నుండుటచేత అది విలీనమై యుండు నని వారు తలంచుచున్నారు. నిద్రను తనయందు ప్రతిబింబింపఁజేసికొనుచు మనస్సు ప్రకాశస్థితియందు ఉండునవి మేము చెప్పుచున్నాము. కావున ఎట్లు చెప్పినను వస్తుస్థితియందు భేదము లేదు. జాగ్రద్దశలో కూడ వస్తువును చూచిన తొలిక్షణమునందు మనస్సు ప్రకాశమును మాత్రమే పొంది విమర్శను పొందక లీనమైయుండును, కాని మఱుక్షణముననే ఆస్థితి వికల్పజ్ఞానములయొక్క పరంపరచేత మాయమై పోవుచున్నది.

నాయనుభవము ననుసరించి నీకొక రహస్యమును చెప్పెదను వినుము. ఈవిషయమున విద్వాంసులుకూడ భ్రాంతి నొందుచున్నారు. నిర్వికల్పసమాధియందు నిద్రయందు వస్తుదర్శన క్షణమునందును ప్రకాశము దట్టముగా నుండుట సమానమే. చిదాత్మ స్వప్రకాశమాత్రముగా నుండుట నిర్వికల్పసమాధి. మనస్సు అవ్యక్తమాత్రముగా ప్రకాశించుచుండుట నిద్ర, చెట్టు తీగె మొదలగు పదార్థములు నామరూపరహితముగా వస్తువు మాత్రముగా మనస్సునందు ప్రకాశించుట వస్తుదర్శనము. ఈమూఁడింటియందును, ''ఇది యిట్టిది'' అని శబ్దములతో విమర్శనము ఉండదు; ప్రకాశ##మే నిబిడముగ నుండును. వీని యందు ప్రకాశనిబిడత్వము సమానమే యైనను వీనికి అనంతరము కలుగుచున్న విమర్శనమునందు భేధ మేర్పడుచున్నది. అందువలననే ఇవి భిన్నస్థితులుగా నున్నవి. సమాధి ముగిసినంతనే, ''నేను ఇంత కాలము ఊరకయుంటిని'' అని విమర్శ ఆరంభ మగును. నిద్ర ముగిసినంతనే ''నా కేమియు తెలియలేదు'' అని విమర్శ ఆరంభ మగును. వస్తుదర్శనము ముగిసినంతనే ''ఇది చెట్టు, ఇది తీగె'' అని విమర్శ ఆరంభ మగును. ఈవిమర్శల భేదములవలననే ''ఇది సమాధి''. ''ఇది నిద్ర'', ''ఇది వస్తుదర్శనము'' అని బేదములను గ్రహించుచున్నాము. అట్లే సమాధియందు కేవలచైతన్యము, నిద్రయందు అవ్యక్తము, వస్తుదర్శనమునందు వస్తుమాత్రము అని భిన్నవిషయములు భాసించుచున్నను, ప్రకాశము మాత్రము మూఁడింటియందును నిర్వికల్పముగా నిబిడముగా నుండును, సామాధి సుషుప్తి చాలసేపు ఉండనవి యగుటచే అవి ముగిసిన తరువాత ఎల్లరను వానిని గుర్తించుచున్నారు. వస్తుదర్శనము క్షణకాలము మాత్రమే యుండునది యగుటచే దానిని అందఱును స్పష్టముగా గుర్తింపలేకున్నారు. అట్లే సమాధి నిద్ర కూడ ఒక్కొక్కప్పుడు క్షణకాలములో వచ్చిపోవుచుండును. అప్పుడు సూక్ష్మదృష్టి కలవారు నిద్ర పరిచితమైన దగుటచే ''క్షణములో నిద్ర వచ్చినది'' అని గుర్తించుచున్నారు. అట్లు క్షణకాలము సమాధి కలిగినప్పుడు దానియొక్క పరిచయము అంతకుపూర్వము లేనివారు ''క్షణములో సమాధి కలిగినది'' అని గుర్తింపలేకున్నారు. అయ్యా! వ్యవహారదశలయందు సకలప్రాణులకును సూక్ష్మముగా సమాధిస్థితులు కలుగుచుండును, ఆస్థితియొక్క పరిచయము లేకపోవుటచేత అవి సమాధిస్థితు లని వారికి తోఁచవు. జాగ్రద్దశలో మనస్సులో విమర్శ పుట్టకున్నచో అచి సమాధి యగును. విమర్శ లేకుండుటయే సమాధి. కావుననే సుషుప్తియందు వస్తుదర్శనమునందును సమాధి యున్నది. కాని అది ముఖ్యసమాధి కాదు. సుషుప్తి యందు నిద్ర వస్తుదర్శనము నందు నామరూపసంస్కారములు సన్నిహితములై యుండుటయే అందులకు హేతువు. నిద్రనుండి లేచినవాఁడు ''నా కేమియు తెలియ లేదు'' అని స్మరించుచున్నాఁడు. అనఁగా నిద్రయందు సకలదృశ్యముల యొక్క అభావముయొక్క అనుభవమును (Experience of the absence of every thing) పొందుచున్నాఁడన్నమాట. ఆయభావజ్ఞానమే అవ్యక్తము. సృష్టియొక్క ఆరంభమునందు ఆత్మకు వెలుపల ఏదో ఉన్నట్లు మొదట పుట్టినదే ఈయవ్యక్తము. ఇదియే చిదాత్మ యొక్క జడశక్తి. ఈజడశక్తితో కూడిన సుషుప్తి సమాధి ఎట్లు కాగలదు? అనాత్మవిషయములనుండి మరలిన మనస్సు చిదాత్మాకారముతో నుండుట సమాధి. ఇందు జడశక్తికి ఆవకాశము లేదు. సమాధియందు ప్రకాశించునట్టి చైతన్యశక్తి బ్రహ్మరూపిణి. దాని యందు దేశకాలములు భావింపవు. దేశకాలములకు అతీతముగా సకలముయొక్క అస్తిత్వము అప్పుడు భాసించుచుండును. అందువలన అది నిద్రయందువలె అభావజ్ఞానముకాదు; అది భావజానమే. కావున సుషుప్తి మాత్రమున కృతార్థత లేదు.''

ఇది వష్టావక్రజనకసంవాదమున షోడశాధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters