Sri Tripurarahasya Gnanakandasaaramu
Chapters
పదునెనిమిదవయధ్యాయము - మనస్స్వరూప నిరూపణము దత్తాత్రేయుఁడు భార్గవునకు ఇట్లు చెప్పుచున్నాఁడు. ''అష్టావక్రజనకుల సంవాదమువలన చైతన్యము దృశ్యరహితముగా శుద్ధముగ ఎట్లుండునో నిరూపింపఁబడినది. అది యనేకవిధములుగా స్ఫురించుచునే యున్నను మనుష్యులు దానియొక్క పరిజ్ఞానము లేకపోవుటవలన దానిని గుర్తింపలేకున్నారు. అంతర్ముఖమై సూక్ష్మమైన దృష్టిచే తప్ప మఱియొకవిధముగా అది గోచరింపదు. ఇన్నిమాట లెందులకు! సాధనమును చెప్పెదను వినుము. మనస్సు అనుసాధనముతో సర్వమును తెలిసికొనుచున్నావు, ఆమనస్సునకు తెలిసికొనుటకు సాధనము లేదు. కావున అది ఇతరవస్తువులవలె వేద్యము (Object of knowing) అగుట లేదు. ''ఇది ఇల్లు; ఇది పుస్తకము'' అని చూపి చెప్పినట్లు ''ఇది నా మనస్సు'' అని చూపుటకు వీలు లేదు. కావున మనస్సు ఉన్న దనుట నిశ్చితము. ప్రతిబింబములు లేని అద్దమువలె మనస్సు కూడ దృశ్యరహితముగా ఉండును. అట్టి శుద్ధమైన మనస్సును విత్తి అందురు. వస్తువులను ప్రతిబింబింపఁజేసికొనుటయే అద్దమునకు స్వరూపమైనట్లు మనస్సునకు కూడ వస్తువులను తెలిసికొనుచుండుటయే స్వరూపము. అనఁగా జ్ఞానమే, దానిస్వరూపము. ఆమనస్సు నీదే కాఁబట్టి అది నీకు ఎప్పుడును తెలిసియే యున్నది, ఇది నాపుస్తకము'' అని చెప్పినప్పుడు పుస్తకమును తెలిసికొనుటకు మనస్సు సాధనమైనట్లే ''ఇది నామనస్సు'' అనునప్పుడు దానిని తెలిసికొనుటకు మఱియొకసాధనము ఉండనక్కఱలేదా?'' అని తలంపకుము. మనస్సును తెలిసికొనుటకు మఱియొక సాధనము కావలసివచ్చినచో, ఆసాధనమును గుర్తించుటకు ఇంకొక సాధనము కావలసివచ్చును. అప్పుడు దానికి అంతముండదు. అందువలన అన్నిటిని ప్రకాశింపఁజేయుచున్న మనస్సు తనకు తానుగా ప్రకాశించుచున్న దనియే చెప్పవలె. శుద్ధమై స్వప్రకాశ##మైన మనస్సే నీవు. ఏవస్తువును చూచుచున్నప్పుడైనను నీకు నీవు భాసింపకుండనున్నావా? ''నేను చెట్టును చూచుచున్నాను'' అని ముందుగా నీవే భాసించుచున్నావు; తరువాతనే చెట్టు భాసించుచున్నది. ''ఆచెట్టువలె నాకు నేను భాసించుట లేదు'' అని నీవు చెప్పుదువేని నీవు లేవన్నమాట. అప్పుడు, ''నాస్వరూపమును నేనెట్లు సాధింతును?'' అను నీ ప్రశ్న ఎట్లు సంభవమగును? ఆకాశపుష్పమువలె నీవే లేనివాఁడ వైనచో ఇక నీకు నీవు ఎట్లు హితమును కోరుదువు? ''అయ్యా! నన్నుగూర్చి నాకు సామాన్యముగా తెలియును? విశేషముగా తెలియదు'' అని నీవు చెప్పుదువేని వినుము. నిజమే. లోకములో ఒకవస్తువు సామాన్యముగా తెలిసినపుడు దాని విశేషములను తెలిసికొనుటకై ప్రశ్నించుట సహజమే. ఇది చెట్టుఅని సామాన్యముగా తెలిసిన తరువాత ఆచెట్టుయొక్క జాతి లక్షణములు మొదలుగా విశేషములను (Particulars) తెలిసికొందురు. కాని నీస్వరూపమైన యాత్మకు చెట్లకు జంతువులకువలె సామాన్యరూపము విశేషాంశము అనునవి లేవు. దేహేంద్రియాదివిశేషములు ఏవియు దానికి సంబంధింపవు. దానికి ఏవిశేషములునులేవు. అది అంతటను నిర్విశేషముగా అఖండముగా పూర్ణముగా వ్యాపించియున్నది. కావున అది నీకు సామాన్యముగా (అనగా నిర్వి శేషముగా) తెలిసినచో పూర్తిగా తెలిసినట్లే. అహో! నీస్వరూపమును నీవు తెలిసి కొనుచుండియు భ్రాంతి నొందుచున్నావే! ''నేను'' అని నీవు చెప్పునప్పుడు నీకు ఈశరీరము ఇంద్రియములే తోఁచుచుండుట నిజమే. కాని నీసంకల్పము ననుసరించియే అవి నీస్వరూపముగా తోఁచుచున్నవి. శరీరమునకు బాధ కలిగినపుడు అది బాగుండవలయు నని నీవు భావించుచున్నప్పుడు ఆశరీరమే నీవైనట్లు భావించుచున్నావు. అట్లే ''ఈ యిల్లు నాది'' అని తలంచుచున్నప్పుడు దానికి భంగము కలిగినచో శరీరమునుగూర్చి బాధపడినట్లే యింటినిగూర్చి కూడ అది నీవే అయినట్లు భావించుచున్నావు. ''నాయిల్లు, నాభూమి'' అని ఏయే వస్తువునుగూర్చి భావించుచుందువో ఆయావస్తువుల యందును నీవు వ్యాపించియే యున్నావు. నీవు సర్వమయుఁడవు. అందువలన నీవు ఇల్లు మాత్రమే కాదు; భూమిమాత్రమే కాదు. అట్లే నీవు దేహము మాత్రమే కాదు. కావున ఏది ఏది నీకు కన్పించుచున్నదో అది ఏదియు నీస్వరూపము కాదు. నీవు దృక్కువు. నీకు కన్పించుచున్న దంతయు దృశ్యము, దృక్కు ఎప్పుడును దృశ్యము కాదు. చెట్లు జంతువులు మొదలుగా దృశ్యములు ఎన్ని మాఱుచున్నను దృక్కు మాఱదు. ప్రతిబింబములు ఎన్ని మాఱినను అద్దము మాఱదు. ప్రతిబింబములు అద్దము కానట్లే దృశ్యము దృక్కు కాదు. దేహము దేశము కాలము మొదలుగా ఎన్ని భిన్నవిషయములు దృక్కు రూపమైన చైతన్యమునందు ప్రతిబింబించుచున్నను. అవి ఎంత చిత్రవిచిత్రములుగా భాసించుచున్నను ఆవి శేషములు రవ్వంతయు దృక్కునకు సంబంధింపవు. కావున సంకల్పమును వర్జించి సకలదృశ్యములకు అతీతమై (Beyond all perceptions) శుద్ధ చైతన్యరూపముగా భాసించుచున్న దృక్కును నీస్వరూపమునుగా చూడుము. అట్లు ఒక్కసారి నీస్వరూపమును నీవు గుర్తించినతరువాత దానియొక్క లక్షణమునకు భిన్నముగా దానియందు ప్రతిబింబమాత్రములుగా తొఁచుచున్న దేహము మొదలగునవి నీస్వరూపము కాదని తెలియును. అట్లు తెలియుటవలన సర్వసంసారమునకు కారణమైన యజ్ఞానము తొలఁగిపోవును. మోక్ష మన్నది యాకాశముయొక్క అంచులలోఁ గాని పాతాళముయొక్క లోతులలోఁగాని లేదు. సకలసంకల్పములను త్యజించుటవలన నీబుద్ధియందు స్ఫురించుచుండు శుద్ధచైతన్యమును నీస్వరూపమునుగా గుర్తించుటయే మోక్షము. అది నీకు స్వరూపమే అగుటచేత అది నీకు ఎప్పుడును అప్రాప్తము (Not obtained) కాదు. అది ఎల్లప్పుడు నీకు సంప్రాప్తించియే (Always obtained) యున్నది. ''ఆత్మ నాకు లభింపలేదు'' అను భ్రాంతిని తొలఁగించుకొన్న చాలును. అదియే కృతార్థత, మోక్షమును స్వర్గమువలె వేఱొకలోక మని భావింపకుము. సృష్టింపఁబడినలోకము లన్నియు నశించును. మోక్షము అట్లు నశింపదు. స్వప్నములో చూచుచున్ననీవు తప్ప చూడఁబడుచున్న వన్నియును కుందేటికొమ్మువలె అసత్యము లైనట్లు నీస్వరూపమునకు భిన్నముగా నీకు తోఁచుచున్నదంతము అసత్యమే నీస్వరూపము అంతటను నిండియున్నది. అట్టి యెడల మోక్షము నీస్వరూపము కాక మఱి ఎక్కడ సంభవించును? ప్రతిబింబములు లేకుండుటయే అద్దమునకు స్వరూపమైనట్లు నీయందు ఏవిశేషములు గోచరింపకుండుటయే నీకు మోక్షము. లోకవ్యవహారములో కూడ కట్టివేసియున్నవానిని కట్లు విప్పి విడిపించినచో వానికి మోక్షము కలిగినదనుచున్నాము. వాని కప్పుడు బంధము తోలఁగుచున్నదే కాని మోక్షము అన్నది క్రొత్తగా ఏదియు కులుగట లేదు. కావున మోక్షము వేఱొక సత్యమైన వస్తువు కాదు. ఆత్మకు అన్యమైనది ఏదియు సత్యము కాదు. ఆత్మ పూర్ణస్వరూపముగా ఒక సారి గోచరించుటయే మోక్షము. ప్రతిబింబము లున్నప్పుడు అద్దము సంకుచితమైనట్లు కన్పించును. అవితొలఁగినంతనే అది పూర్ణస్వరూపముతో భాసించును. అట్లే ఆత్మయందును దృశ్యములు భాసించుచున్నప్పుడు అది అపూర్ణముగా తోఁచును, దృశ్యములు తొలఁగినంతనే ఆత్మ పూర్ణస్వరూపమున గోచరించును. ఆత్మయందు దేశము కాలము మొదలగువానివలన విభాగములు ఏర్పడుట లేదు. దేశములను నదులు కొండలు హద్దులై విభజించుచున్నవి. నదులు కొండలు ఆదేశములకు భిన్నములై యున్నట్లు దేశము కాలము ఆత్మకు భిన్నములై దానిని విభజించుచున్న వన్నచో అది అసంభవము. ఆత్మ చైతన్యరూపము. దానికి వెలుపలనున్న ఏ పదార్థమును కూడ స్వరూపమే సిద్ధింపదు. అనఁగా అవి ఉండవు. (They do not exist) దీపపుకాంతి గోడమీఁది బొమ్మలమీఁద పడినచో ఆబొమ్మలు ప్రకాశించుచు ఆకాంతియందు మునింగియుండును. అట్లు ఆకాంతివలన స్ఫూర్తినొందుచు దానియందు మునిఁగియున్న బొమ్మలు ఆకాంతికి విభాగముల నెట్లు కల్పింపలేవో అట్లే చైతన్యము నందు ప్రతిబింబించుచు దానియందు మునిగియున్న దేశకాలములు దానికి విధాగములను కలిగింపలేవు. కావున పదార్థము లన్నియు చైతన్యమునందు ప్రతిబింబించుచు దానియందే గోచరించుచున్నవి. అద్దమునకు భిన్నముగా దానిలోని ప్రతిబింబములకు ఉనికి (Existence) లేనట్లు చైతన్యమునకు భిన్నముగా పదార్థములకు ఉనికియే లేదు. కలలో వలె పదార్థములు జాగ్రత్తులో కూడ వెలుపల నున్నట్లు తోఁచుచుండుట భ్రమవలననే జరుగుచున్నది. భ్రమవలన తోఁచుచున్న పదార్థములు సత్యములు ఎట్లగునో చెప్పుము? కావున చైతన్యరూపమైన మనయాత్మయే మాయారూపమైన స్వాతంత్ర్యశక్తిచేత వివిధపదార్థములుగా భాసించుచున్నది. కలలో మనస్సు ఒక్కటే కదా వివిధపదార్థములుగా సంఘటనములుగా భాసించుచున్నది. జాగ్రద్దశలో కూడ అట్లే జరుగుచున్నది. కావున ఆత్మకన్న భిన్నముగా వెలుపల ఏదియును లేదు.'' ఈ మాటలు విని భార్గవుఁడు మరలప్రశ్నించెను. ''భగవానుఁడా! నీవు చెప్పినది చాలదుర్ఘటముగా తోఁచుచున్నది. శుద్ధమైన చైతన్యము ఒక్కటియే వివిధముగా భాసించుట అసంభవము. చితి చేత్యము అని వస్తువులను రెండువిధములుగా గ్రహించుచున్నారు, చితి స్వప్రకాశము చితిచేత భాసించునది చేత్యము. దీపముచేత భాసించుచున్న వస్తువు దీపముకన్న వేఱుగానే కన్పించుచున్నది. అట్లే చితచేత భాసించుచున్న చేత్యము కూడ దానికన్న భిన్నమైన పదార్థమే యగును. చేత్యము చిదాత్మకము అనుమాట అనుభవమునకు అందుట లేదు, మఱియును సంకల్పమును వదులుకొనుటవలననే మనస్సు నిర్వికల్ప మగునని మహాత్ముఁడైన జనకుఁడు చెప్పెను. అదియే ఆత్మకు రూపము, అదియే సంసారనాశమును గావించు నిర్వికల్పజ్ఞానము అనియు ఆయన చెప్పెను. మఱి జ్ఞానము పొందుటయందు ఆత్మకు మనస్సు సాధనమని చెప్పఁబడినది, మనస్సు సాధనముగా లేకున్నచో ఆత్మ దేనిని గ్రహింపలేక జడమే యగును. అప్పుడు జడమైన ఆత్మకన్న మనస్సే గొప్పదగును. ఆత్మకు బంధము కాని మోక్షము కాని మనస్సుచేతనే కలుగుచున్న దనుట స్పష్టము, మనస్సు సవికల్ప మైనచో బంధము, నిర్వికల్పమైనచో మోక్షము కలుగుచున్నది, అట్టియెడల సాధనమైన మనస్సే ఆత్మ ఎట్లగును? ఖడ్గము, దానిని ధరించినవాఁడు రెండు భిన్న పదార్థములు అయినట్లు మనస్సు నిర్వికల్పమైనను ఆత్మకన్న భిన్నమే అగును. అప్పుడు ద్వైతము తప్పదు. మఱియును లోకములో ఎవని కైనను భ్రాంతి కలిగినప్పుడు, దేనినిగూర్చి వాఁడు భ్రాంతిపడుచున్నాఁడో ఆవిషమును అసత్యమే అగును. కానివానికి భ్రాంతికలుగుట మాత్రము సత్యమే. వ్యక్తి, వానిభ్రాంతి రెండును సత్యములగుచుండుటచే అద్వైత మెట్లు సిద్ధించును. ఎండమావులలో నీరు కన్పించినప్పుడు ఆనీరు అసత్యమే. దానివలన దప్పిక తీఱదు. ఆనీరు చాలసేపు కూడ నిలువదు. పనికి ఉపయోగపడుట చిరకాల ముండుట అన్నది అసత్యవస్తువునందు సంభవింపదు. మఱి జగత్తులోని వస్తువులు చిరకాలము నిలుచుచు ఎన్నోపనులకు ఉపయోగపడుచున్నవి. కావున జగత్తులోని వస్తువులను అసత్యములని ఎట్లు చెప్పవచ్చును? జగత్తు సత్యమైనచో ద్వైతమే సిద్ధించును. అద్వైతము సిద్ధింపదు. మఱియును దృశ్యమైన జగత్తువలన కలుగుచున్న దంతయు భ్రాంతి జ్ఞానము యని మీరు చెప్పుచున్నారు. అట్లయినచో భ్రాంతిరహితమైన జ్ఞానమే యుండదు. అట్టి యెడల ఇదిభ్రాంతి అది సత్యము అను భేదము ఎట్లు కలుగును? భ్రాంతి యైనను అందఱకు సమానముగ ఎట్లు కలుగుచున్నది? ఈసందేహము నామనస్సును వీడకున్నది దయతో వివరింపుఁడు." దత్తాత్రేయుఁడు సంతోషించి ఇట్లు చెప్పమొదలిడెను. "భార్గవా! చక్కఁగా అడిగితివి. ఈవిషయమును చాలవఱకు వెనుకనే చెప్పితిని. అయినను మనస్సునకు సంతుష్టి కలుగు వఱకు మరల మరల విషయమును శోధింపవలసినదే. ఒక్కొక్కనికి ఒక్కొక్కవిధమైన బుద్ధియుండును. అందువలన ఆలోచించు విధానముకూడ ప్రతివానికి భిన్న ముగానే యుండును. అట్టి యెడల శిష్యుఁడు తన మనస్సులోని సందేహమును అడుగకున్నచో గురువైనను ఎట్లుచెప్పగలడు? గురువును అడుగక ఎవఁడైనను సందేహమును ఎట్లు తీర్చుకొనఁగలఁడు? ప్రశ్నించుచుండువానియొక్క విద్య దృఢమగును. సత్యనిరూపణకు ప్రశ్నయే బీజము. కావున గురువును ప్రశ్నించుచు తెలిసికొనువానికే విద్య లంభించును. చితి ఒక్కటే అనేకముగా ఎట్లు అగునని అడుగుచున్నావు. స్వప్నములో ఊహాలోకములో ఒక్కమనస్సు తప్ప మఱదియు ఉండదు. ఒక్కమనస్సే అప్పుడు చూచువాఁడుగా చూచుటగా దృశ్యముగా భాసించుచున్నది కదా! ఇట్లే జాగ్రద్దశయందు కూడ శుద్ధమైన చైతన్యమొక్కకటియే చితిగా చేత్యముగా వివిధరూపములతో భాసించుచున్నది. కావున స్వప్నమునందు ద్వైతము లేనట్లే జాగ్రద్దశలోకూడ ద్వైతము లేదు. దీపపువెలుఁగులో వస్తువుకన్పించుచున్నది. కాఁబట్టి ఆవెలుఁగు కన్న వస్తువు భిన్నముగా నున్నదని చెప్పుచున్నావు. కాని వస్తువు గోచరించుటకు వెలుఁగు ఉండవలయు ననునియమము లేదు. వెలుఁగును చూడ లేకున్నను అంధుఁడు స్పర్శచేత వస్తువును గ్రహించుచున్నాఁడు. ప్రతివ్యక్తియు వస్తువును స్మరించునప్పుడు దానిరూపమును మనస్సునందు చూచుచునేయున్నాఁడు. మనస్సు చైతన్యముతో కూడియుండక పనిచేయక ఉన్నప్పుడు ఎవ్వఁడును ఏవస్తువును చూచుటలేదు. కావున వస్తువు లన్నియు చైతన్యము అను నద్దమునందు ప్రతిబింబించుటచేతనే మనకు గోచరించుచున్నవి. అద్దముకన్న భిన్నముగా ప్రతిబింబము ఎట్లు ఉండదో అట్లే చైతన్యముకన్న భిన్నముగా జగత్తులోని వస్తువులు లేవు. కావున చితికి అన్యముగా రెండవవస్తువు లేదు. కావుననే మనస్సుకూడ చితికి అన్యముగా లేదు. స్వప్నములో మనస్సునకు భిన్నముగా ఆస్వప్నప్రపంచము ఎట్లు లేదో అట్లే జాగ్రద్దశలో కూడ మనస్సునకు భిన్నముగా ప్రపంచము లేదు. స్వప్నమునందు చెట్టును ఖండించుటకు గొడ్డలి సాధనమగుచున్నది. కాని ఆచెట్టు, దానిని ఖండించుట, దానికి సాధనమైన గొడ్డలి మొదలుగా అంతయు అసత్యమే కదా! అట్లే దృశ్యములు ఎట్లు అసత్యములో అట్లే వానిని గ్రహించుటకు సాధనమైన మనస్సు కూడ అసత్యమే. స్వప్నములో జచరుగుసంఘటన లన్నియు అసత్యములు. వానికి కారణమైన మనస్సు కూడ అసత్యమే. అట్లే జాగ్రద్దశలో కూడ దృశ్యములు సంఘటనములు మిథ్య; వానిని గ్రహించుచున్న మనస్సు కూడ మిథ్యయే. కేవలమైన చిదాత్మ స్వచ్ఛమైన తనస్వాతంత్ర్యముచేత మనస్సు మొదలగు వానిని కల్పించి దృశ్యము చూచువాఁడు మొదలగు భేదములతో వ్యవహరించుచున్నది. అది ఒక్కొక్కప్పుడు కేవలము నిర్వికల్పముగా ఉండును. భర్గవా! చితియొక్క తత్త్వమును చక్కఁగా పరిశీలించి గ్రహింపుము. ఆకాశము ఆత్మవలెనే పూర్ణము సూక్ష్మము నిరంజనము నిరాకారము. అయినను అది ఆత్మతో తుల్యము కాదు. ఆత్మయందున్న చైతన్యము దానియందు లేదు. కాని ఆకాశము ఆత్మకన్న భిన్నముగాలేదు. అజ్ఞానులు ఆత్మనే చూచుచు దానిని ఆకాశ మని భ్రమించుచున్నారు. సూర్యునికాంతి ప్రసరించుచున్నను దానిని గుడ్లగూబలు చీకటి గానే చూచుచున్నవి గదా! జ్ఞానులు ఆకాశమును ఆత్మగానే చూచుచున్నారు. చిదాత్మ స్వచ్ఛమైన తనస్వాంతంత్ర్యవైభవముచేత ఒక్కటిగానున్న తాను అనేకవిధములుగా భాసించుచున్నది ఇంద్రిజాలికుఁడు తాను ఒక్కఁడే యయ్యును ఇతరులకు అనేకరూపములతో భాసించుచున్నాఁడు. ఆరూపము లన్నియు వానిమాయచేత మోహితులైనవారికి గోచరించుచున్నను వానిదృష్టిలో అతఁడు కేవలుఁడే; ఆరూపము లన్నియు అసత్యములే. అట్లే మాయామోహితులైనవారికి జగత్తులోని రూపములన్నియు సత్యముగా భాసించుచున్నను, ఆత్మతత్త్వము నెఱింగి చిదాత్మస్వరూపులైనవారికి ఆజగద్రూపము లన్నియు అసత్యములుగా తమస్వరూపమైన చిదాత్మ యొక్కటియే సత్యముగా గోచరించును. ఒక్కటిగా నున్న చిదాత్మ అనేకపదార్థములుగా ఎట్లు భాసించుచున్న దని నీవు శంకించుచున్నావు. చిదాత్మకు అత్యంతమైన స్వాతంత్ర్యము కలదు. అదియే మాయ. అది ఎంతటి దుర్ఘటమైన కార్యమునైనను సమకూర్పఁగలదు. లోకమునందు యోగులే కాక మామూలుగా నుండు మాంత్రికులు ఇంద్రజాలికులు కూడ మనకు దుర్ఘటముగా తోఁచుకార్యములను చేయుచునేయున్నారు. వారు ఎంతగా స్వాతంత్ర్యశక్తిని పొందుచున్నారో అంతగా వారు ఆకార్యములను నిర్వహింపఁగలుగుచున్నారు. చిదాత్మయొక్క స్వాతంత్ర్యము పరిపూర్ణము. అదియే మాయాశక్తి. ఆమాయయొక్క ఆవరణమును యోగము మొదలగు సాధనములచేత ఎవరు ఎంతగా తొలఁగించుకొనుచున్నారో వారి కంతగా స్వాతంత్ర్యము కలుగుచున్నది. ఆస్వాతంత్ర్యముయొక్క శక్తిననుసరించి వారు దుర్ఘటములైన కార్యములను సాధించుచున్నారు. కావున పరిపూర్ణమైన స్వాతంత్ర్యశక్తి కలిగిన చిదాత్మ ఈజగత్తును బాసింపఁజేయుట విచిత్రముకాదు. అఖండమై పరిపూర్ణమైయున్న చిదాత్మయందు జగద్రూపము లైన విభాగములు ఎట్లు ఏర్పడుచున్నవోచూడుము. పూర్ణమైన చిదాత్మతనలో ఒకభాగమునందు "ఇది నేను" అని అభిమానించుచుండుటయే విభాగము తోచుటకు మూలము. ఈయపూర్ణత్వస్ఫురణమే అవిద్య అని శాస్త్రములయందు చెప్పఁబడినది. ఇట్లుతనలో కొంతభాగము నందు చిదాత్మ "ఇదినేను" అనునభిమానముతో స్ఫురించుచుండఁగా ఆభాగము జగత్తుగా భాసించుచున్నది. మిగిలినది ఆకాశముగా బాసించిచున్నది. కావున ఆత్మకు భిన్నముగా జగత్తు గాని ఆకాశము గానిలేవు రెండును ఆత్మయందే తోఁచుచున్నవి. ఈవిషయమున తార్కికులే కాదు పండితులు కూడ అనేకులు భ్రమ నొందుచున్నారు. ఆత్మతత్త్వమునుగూర్చి విన్న పండితులు చాలమంది దానిని తమస్వరూపమునుగా గ్రహింపక బహీర్ముఖమైన దృష్టితో వ్యవహారమున నిమగ్నులై యుందురు. ఆత్మత్వత్త్వమునుగూర్చి ఎంతగా విన్నను మననము చేసినను. ఆపరోక్షముగా (Directly) తన స్వరూపముగా ఆత్మసాక్షాత్కరించువఱకు నిదిధ్యాసనము చేసిననేతప్ప అజ్ఞానము నశింపదు. కావునభార్గవా! బాహ్యదృష్టిని వీడి నేను చెప్పినదానిని అంతర్ముఖమైన దృష్టితో చక్కఁగా చూడము. చిదాత్మకు జడమునకు భేదము ఎట్లుఏర్పడుచున్నదో చూడుము. చిదాత్మ సకలమునందును వ్యాపించి సర్వమును ప్రకాశింపఁజేయుచు. తాను దేనిచేతను ప్రకాశింపఁబడక, స్వయముగా ప్రకాశించుచున్నది. జడములు స్వయముగా ప్రకాశింపక చిదాత్మవలన ప్రకాశించుచున్నది. అద్దమునందు ప్రతింబింబించుచున్న వస్తువులయొక్క విశేషములు ఏవియు అద్దమునకు ఎట్లు సంబంధించుట లేదో అట్లే చిదాత్మవలన ప్రకాశించుచున్న జడములయొక్క విభాగవిశేషములు ఏవియు చిదాత్మకు సంబంధింపవు. జడములకు అతీతమై అఖండమైన స్వయంజ్యోతియై వెలుఁగుచున్న యాత్మను సాక్షాత్కరించుకొనుటయే స్వాత్మవిశ్రాంతి దానినే పూర్ణాహంత పూర్ణాహంకారము అనియు చెప్పుదురు. విషయమును నిరూపించుటకై ఇన్నివిధములుగా చెప్పుచున్నామే కాని వస్తువు మాత్రము ఒక్కటియే. తేజస్సునందు కాంతి ఉష్ణము ఎట్లు అభిన్నముగా నున్నవో అట్లే మాయాశక్తియును చిదాత్మంయందు అభిన్నముగా నున్నది. తేజస్సు కాంతి రెండు పదార్థములు కావు. అవి రెండుపదార్థములేయైనచో రెండింటిని విడఁదీసి చూపవలసియుండును. కాని అట్లు విడఁదీయలేము. అట్లే మాయాశక్తియు చిదాత్మయందు అభిన్నముగానున్నది. అది వాస్తవముగా చిదాత్మయే. అది అద్దమువలె ఎన్నో వస్తువలను భాసింపఁజేయుచున్నది. దానియందు ఎన్నివస్తువులు గోచరించుచున్నను దానిస్వరూపమునందు మాత్రము ఎట్టిమార్పు కలుగుట లేదు. చిదాత్మ మాయాశక్తి చేత నామరూపముల విభాగములతో భాసించుచుండుటయే అనాత్మాభాస, అవిద్య, జడశక్తి, శూన్యము, ప్రకృతి, అత్యంతాభావము, ఆకాశము, తమస్సు అని పేర్కొనబడుచున్నది. ఇది యంతయు మొదటి విభాగము. పరిపూర్ణమైన యాత్మస్వరూపమును గుర్తింపలేక భ్రాంతితో దానియందు కొంతభాగమును చూచుచుండుటవలననే ఆకాశము తోఁచుచున్నది. ఆత్మప్రదేశమునందు ఏ భాగమున "ఇది నేను" అనునహంకారము ప్రసరించుటలేదో అది అకాశముగా భాసించుచున్నది. కొంత అకాశముగా కొంత జగత్తుగా గోచరించుచున్న యీభేదమే సంసారమునకు కారణమగు చున్నది. రామా! సూక్ష్మదృష్టితో చూడుము. దేనిని నీవు ఆకాశముగా చూచుచున్నావో అదియే దానియందున్న జీవరాశులకు ఆత్మచైతన్యము. అదియే నీ యందు ఎట్లుఉన్నదో అట్లే ఇతరులయందును ఆనందఘనముగా (Solid mass of bliss) నున్నది. కల్పితమైన యీయాకాశవిభాగముచేత సంకుచితమైనట్లు తోఁచుచున్నచిదాత్మయే మనస్సు, అది ఆత్మకన్న భిన్నమైన వేఱొకపదార్థముకాదు. అయినను మాయయొక్క ఆవరణశక్తి చేత జగత్తు భాసించుచున్నప్పుడు ఆజగత్తులోని వస్తువులను గ్రహించుటకు మనస్సు ప్రమాణమగుచున్నది. అనఁగా జ్ఞానమును కలిగించుటకు సాధన మగుచున్నది. మనస్సుచేత విషయములను గ్రిహించుచున్న చిదాత్మ జీవుఁడని చెప్పఁబడుచున్నాఁడు. మొదట ఆకాశముచేత ఆవరింపఁబడిన చిదాత్మ క్రమముగా దానియందు ఇతరగుణములను ఆరోపించుచు తక్కినభూతముల చేత, ఆభూతములవలన ఏర్పడిన శరీరముచేత ఆవరింపఁబడినది. ఇట్లు కుండలోపలనున్న దీపమువలె చిదాత్మ శరీరములోపల నుండి దానినంతను కాంతిచేత వ్యాపించి ప్రకాశింపఁజేయుచున్నది. కుండలో నున్న దీపము దానిని భాసింపఁజేయుచు దానితో సంబంధము లేకుండ స్వతంత్రముగా ఎట్లుప్రకాశించుచున్నదో, చిదాత్మ కూడ శరీరేంద్రియములను భాసింపఁజేయుచు వానితో సంబంధములేకుండ స్వతంత్రముగా ప్రకాశించుచున్నది. కుండయొక్క చిల్లులనుండి లోపలి దీపకాంతిఎట్లు వెలికి వచ్చునో అట్లే ఇంద్రియద్వారములనుండి చిదాత్మయొక్క చైతన్యము వెలికి ప్రసరించుచుండును. నిజమునకు చైతన్యము వెలికి ప్రసరించుట యన్నది లేదు. పూర్ణమైన చైతన్యమునకు కదలికయే కుదురదు. తనకు ఆవరణముగానున్న జడశక్తి రూపమైన యజ్ఞానమును చిదాత్మయొక్క స్ఫూర్తి రూపమైన జ్ఞానశక్తి ఎంతదూరము నివారించునో అంతదూరము చైతన్యము వెలికి వచ్చుచున్నట్లుగా తోఁచును. చిదాత్మయొక్క స్పూర్తిరూపమైనజ్ఞానశక్తి జీవునియందు పరిమితమై యుండును. అది ఇంద్రియద్వారములనుండి వస్తువుల నావరించియున్న జడశక్తిని వారించును. ఆవరణము తొలఁగుటయేకాని జ్ఞానము ప్రసరించుట యున్నది లేదు. స్ఫూర్తిచేత వస్తువులను కప్పియున్న యజ్ఞానమును తొలఁగించుట మనస్సుచేయుచున్నపని. కావున మనస్సే ఆత్మ అని చెప్పఁబడు చున్నది. చలించుచున్న చితియే మనస్సు, మనస్సు నిశ్చలమైనచో ఆత్మయే యగును. స్ఫూర్తి చేత ఆవరణమును తొలగించుచుండుటయే చితియొక్క చలనము. ఈచలనమే వికల్పజ్ఞానము. వికల్పములను వదలి మనస్సు నిశ్చలమై నిర్వికల్ప మైనచో పూర్ణవిజ్ఞానమై ముక్తికలిగించును. é 'మనస్సునందు వికల్పములను వదలిపెట్టినంతమాత్రముననే వెలుపలనున్న వస్తువులను ఆవరించియున్న జడశక్తి తొలఁగిపోవునా' అని సంశయింపకుము. అసలు ఆవరణమేలేదు. నీచేతనే కల్పింపఁబడిన యావరణము సత్య మెట్లగును? త్రాడునుచూచి పామునుగా అనుకొనుచున్నప్పుడు త్రాడును ఆవరించియున్న యజ్ఞానము నీచే కల్పింపఁబడినదే కదా! ఊహాలోకమున నీవు నీశత్రువుచేత బంధింపఁబడి బెదిరింపఁబడుచు కొట్టఁబడుచున్నా వనుకొవుము. ఊహ చెదరిపోయినచో బంధనము కొట్టఁబడుట మిగులునా! వ్యవహారము కూడ ఇట్టిదే అని గ్రహింపుము. వికల్పములు తొలఁగినచో సంసారబంధము కూడ మిగులదు. భార్గవా! అనాదికాలమునుండియు ఎవ్వనికి బంధమేలేదు. భ్రాంతి తప్ప బంధము ఎవ్వని కున్నది? ఎక్కడ ఉన్నది? విచారింపుము. "నేను బంధింపఁబడియున్నాను" అని నిశ్చితముగా అనుకొనుచుండుటయే బంధము. ఎంత బుద్ధిమంతుఁడైనను ఎన్నిప్రయత్నములు చేసినను బంధమనుభ్రాంతిని తొలఁగించుకొనిననే తప్ప సంసారమునుండి ముక్తుఁడు కాఁజాలఁడు. నిర్మలమైన చిదాత్మకు బంధమేమి? ఎట్లు కలుగును? ఆత్మరూపమైన యుద్దమునందు ప్రతిబింబములైన భావములచేతనే బంధము కలుగు నని తలంతు వేని, అద్దములో ప్రతిబింబించుచున్న యగ్ని కూడదహించు నని చెప్పవలసియుండును. "సంసారబంధము, మనస్సు ఉన్నవి" అన్ననిశ్చయముతో రెండువిధములుగా ఏర్పడుచున్న భ్రాంతి తప్ప ఎవనికి ఎక్కడను ఎప్పుడును బంధ మన్నదే లేదు, సరియైనవిచారము అను మహాజలముచేత ఈరెండింటివిషయమునఁగల భ్రాంతి అనుమాలిన్యమును కడిగివేసికొనిననే తప్ప ఎవనికి సంసారభీతి నశింపదు. ఆభ్రాంతి తొలఁగనంతవఱకు నేను గాని బ్రహ్మదేవుఁడు గాని శంకరుఁడుగాని విష్ణువు గాని విద్యారూపిణియైన త్రిపురాదేవి గాని ముక్తినికలిగించుట అసంభవము. కావున రామా! ఈరెండింటిని వీడి సుఖింపుము. మనస్సు నిర్వికల్పముగా నున్నప్పుడ ఆత్మయే యగును, కావున ద్వైతమునకు ప్రసక్తి లేదు. "ఇది అది" అని వివిధ పదార్థముల రూపముతో భాసించుటకన్న భిన్నముగా మనస్సేమున్నది? "ఇది అది" మొదలుగా పదార్థముల భావనను విసర్జించినచో మిగులునది ఆత్మయే. త్రాడును చూచి పామునుగా భ్రమించునప్పుడు త్రాడే పాముగా భాసించుచున్నది. పామునకు సంబంధించిన భ్రాంతిజ్ఞానము నశించినపుడు త్రాడునకు సంబంధించిన జ్ఞానము నిలిచియుండును. అట్లే త్రాడు కూడ చిత్తునందు తోఁచుచున్న భ్రాంతియే యని నిశ్చయము కలిగినప్పుడు త్రాటియొక్క జ్ఞానము కూడ నశించి కేవలచైతన్యమే మిగులును. ఇట్లు నీకు కన్పించుచున్న ప్రతి దృశ్యమునందును నామరూపవిశేషములను కల్పితములనుగా గ్రహించి ఆభ్రాంతిజ్ఞానమును తొలఁగించినచో కేవలమైన చైతన్యమే మిగులును. అది నీ దృక్కే. దృశ్యములన్నియు నీదృక్కునందే రూపొందుచున్నవి. నీ దృక్కు ప్రసరింపకున్నచో దృశ్యమే లేదు. ఆదృక్కునందు నామరూపములను గ్రహింపకున్నను దృశ్యము లేదు. వెండిచెంబు వెండికంచము మొదలగునవి వెండికన్న భిన్నముగా లేనట్లు దృశ్యములు దృక్కునకు భిన్నముగా లేవు. కావున దృక్కు ఒకటే వస్తువు. అది నీస్వరూపమే. కావున ద్వైతమునకు ప్రసక్తియే లేదు. "జాగ్రద్దశలో పదార్థములు ఎన్నోపనులకు ఉపయోగపడుచు స్థిరముగా నున్నవి. కావున అవి వస్తువు కావనుట ఎట్లు కుదురును? అవి వస్తువులైనప్పుడు అద్వైత మెట్లుండును? అని నీవనుచున్నావు. పనులకు ఉపయోగపడుచు స్థిరముగా నున్నట్లు తోఁచినంతమాత్రమున పదార్థములు సత్యములు కావు. స్వప్నమునందు పదార్థము లన్నియు ఉపయోగపడుచు ఆసమయమున స్థిరముగా నున్నట్లే తోఁచుచున్నవి. అంతమాత్రమున అవి యధార్థము లగుట లేదు. మేల్కొన్నంతనే అవి యన్నియు మిథ్య యనియే తలంచుచున్నాము. స్వప్న జాగ్రత్తులకు కొంచెమే భేదము. స్వప్నము మిథ్య అను నిశ్చయము జాగ్రత్తులో కలుగుచున్నది. జాగ్రత్తులోని వ్యవహారము మిథ్య అను నిశ్చయము స్వప్నములో కలుగుటలేదు. అంతమాత్రమున జాగ్రత్తులోని వ్యవహారము సత్యము కానేరదు. జాగ్రత్తులో ఈపదార్థములు ఎంత సత్యముగా తోఁచుచున్నవో స్వప్నములో కూడ అంతే సత్యముగా తోఁచుచున్నవి కదా! జాగ్రత్తులో అవి లేక పోవుటచే మిథ్య అనుచున్నావు. అట్లే స్వప్నములో జాగ్రత్తులోని వ్యవహారముండదు. కావున ఈవ్యవహారము కూడ మిథ్యయే. మాఱుచున్నస్వప్నమును జాగ్రత్తులోని వ్యవహారమును చూచుచున్న నీవు మాఱుట లేదు. కావున నీ వొక్కఁడవే సత్యము. మఱియొక దృష్టాంతమును చూడుము. ఇంద్రజాలమునందు కూడ కల్పింపఁబడిన వస్తువులు పనులకు ఉహయోగపడుచు స్థిరములుగా నున్నట్లే తోఁచుచున్నవి. అంత్రమాత్రముచేత అవి సత్యము లగు చున్నవా? ఇంద్రజాలముచేత భ్రాంతులైనవారు ఆవస్తువులను సత్యములుగా ఎట్లుతలంచుచున్నారో అట్లే లోకవ్యవహారమునందును మాయామోహితులైనవారు దీనిని సత్యమనుచున్నారు. రామా! వినుము. ఎల్లప్పుడును ఏదియున్నదో అదియే సత్యము. ఒకప్పుడైనను లేకుండపోవునది సత్యము కాదు. "అయ్యా! స్వప్నములోఁగాని జాగ్రత్తులోఁగాని దృశ్యములను గ్రహించుచున్నప్పుడే దృక్కు కూడ ఉన్నట్లు మనకు తెలియుచున్నది. గాఢనిద్రయందు దృశ్యమును గ్రహింపనప్పుడు దృక్కు ఉన్నట్లు తెలియుట లేదు. కావున నిద్రలో దృక్కులేదు. కాఁబట్టి దృక్కు కూడ అసత్యమే" అని నీవు అనవచ్చును. కాని ఆనిద్రయొక్క కాలము దృక్కు లేకపోవుట నీకు ఎట్లు తెలిసినవి? అవి నీకు తెలిసినవనఁగా అప్పుడు వానిని గ్రహించుచున్న నీవు ఉన్నావన్నమాట. అప్పుడు వానిని గ్రహించుచున్న నీస్వరూపము దృక్కే. కావున దృశ్యములు లేని నిద్రలో కూడ దృక్కు ఉన్నది. అదిలేని సమయమే లేదు కాఁబట్టి అదియే సత్యము. ఏది ఇతరముపై ఆధారపడక స్వయముగా ప్రకాశించుచుండునో అదియే సత్యము. తక్కినదియంతయు అసత్యము. అట్లుకాక, అసత్యమని నిరూపింపఁబడువఱకు కన్పించుచున్నదంతయు సత్యమే అని అందువేని, అది కుదురదు. ఎందువల్ల ననఁగా, ఎండమావులలో నీరు వలె, లేనిది ఉన్నట్లుగా కన్పించుచున్నది; అట్లే ముత్యపుచిప్ప వెండి బిళ్ళవలే తోఁచుచున్నప్పుడు; యథార్థముగ ఉన్న ముత్యపుచిప్ప కన్పించుటలేదు. ఇది అందఱరకును అనుభవసిద్ధము. అట్టియెడల నీవు చెప్పినట్లుగా అసత్య మని నిరూపింపఁబడువఱకు కన్పించుచున్నదంతయు సత్యమే అని అంగీకరించినచో, ఎండమావులలో నీరు కొంతకాలము సత్యముగా ఉన్నదని, ముత్యపు చిప్ప నిజముగా కొంతకాలము లేదని అంగీకరింపవలసియుండును. ఇది కుదరదు. కావున ఎప్పుడును స్వయముగా ప్రకాశించుచున్న దృక్కు సత్యము. తక్కిన దంతయు అసత్యమే. అట్టియెడల కన్పించుచున్న దృశ్యముతప్ప నిర్విశేషముగా ఎప్పుడును గోచరింపనిదృక్కు లేదని వాదించువాఁడు మూర్ఖుఁడు. అట్టివాఁడు "నేను లేను" అని కూడ చెప్పగలఁడు. శరీరమును ఇంద్రియములను వీడినచో తా నున్నాఁడో లేఁడో తెలియక తన యునికి యందే (Existence) సందేహము కలఁవాడు ఎట్టి తర్కముచేనైనను ఇతరులయొక్క అజ్ఞానమును ఎట్లు పోఁగొట్టఁగలఁడు? అట్లు వాఁడు చెయఁగలిగినచో ఒకపెద్దగుండుఱాయి కూడ మానవులయజ్ఞానమును పోఁగొట్టగలుగును. కావున లోకమున వస్తువులు ఉపయోగపడుచు స్థిరముగా నున్నట్లు కన్పించుచున్నంతమాత్రమున ఇవి సత్యములు కానేరవు. ఈ పదార్థవిజ్ఞాన మంతయు భ్రాంతియే ఈశాస్త్రముల విజ్ఞాన మంతయు ఎంతో సత్య మైనట్లు తలంచుచుండుట మాహాభ్రాంతి ముత్యపు చిప్పకన్పించువఱకు వెండి సత్యముగానే తోఁచునట్లు ఆత్మసాక్షాత్కరము కలుగువఱకు జగత్తు సత్యముగానే తోఁచుచుండును. ఆత్మజ్ఞానము కలిగింనంతనే జగత్తుయొక్క విజ్ఞానమంతయు భ్రాంతియేయగును. భ్రాంతి అందఱకు ఎట్లు సమానముగా నుండునని నీవు శంకించుచున్నావు. శూన్మమైన యాకాశము నీలముగా ఉన్నట్లు అందఱకును సమానముగానే గోచరించుచున్నది కదా! అట్లే అజ్ఞానముయొక్క సామ్యమువలన అందఱకును జగత్తు సత్యమైనట్లు సమానముగా భ్రాంతికలుగుచున్నది. ఆభ్రాంతి తొలఁగింనంతనే శుద్ధమైనయాత్మవిజ్ఞానము కూడ అందఱకును సమానముగానే కలుగుచున్నది. భార్గవా! నీవు అడిగినదానికి యుక్తియుక్తముగ సమాధానము చెప్పితిని. చెప్పినదానిని చక్కఁగా విచారించుకొని సందేహమును వీడినిశ్చయమును పొందుము. ముక్తి నొందినతరువాత వ్యవహారము ఎట్లు జరుగునని ఇంతకు పూర్వము ప్రశ్నించియుంటివి. దానికి సమాధానమును వినుము. లోకమునందు ఉత్తములు మధ్యములు అధములు అని ముక్తులు మూఁడువిధములుగా నున్నారు. ప్రారబ్ధమువలన కలుగుచుండు సుఖదుఃఖములచేత క్షణక్షణము కలఁత నొందుచుంéడియు స్వరూపజ్ఞానము కలిగియుండువారు అధములు. మందమారుతమువలన సుఖము నల్లులు దోమలు మొదలుగు వానివలన దుఃఖము కలుగుచున్నను గాఢముగ నిద్రించువారివలె. ప్రారబ్ధమువలన సుఖదుఃఖాభవము కలుగుచున్నను వానిని గుర్తింపక ఎల్లప్పుడు శాంతిచిత్తులై యుండు వారు మధ్యములు. ఆపదలు పరంపరగా వచ్చిపడినను ఉద్వేగమును పొందక, మహాసుఖములు కలుగునప్పుడు హర్షమును పొందక, ఎట్టి యద్భుతసంఘటనములందు విస్మయము నొందక, ఏపరిస్థితియందును స్వరూపమునుండి తొలఁగక, మనస్సునందు కామక్రోధాదులయొక్క క్షోభను రవంతయు పొందక శాంతులైయుండి లోకమున అందఱవలెనే వ్యవహరించుచుండువారు ఉత్తమజ్ఞానులు. ఉత్తముడు కేవలజ్ఞాని. మధ్యముఁడు అధముఁడు జీవన్ముక్తులు. అధముఁడు సంతతము సమాధి స్థితియందు నిలువఁజాలఁడు ప్రారబ్ధమువలన అప్పుడప్పుడు స్వరూపస్థితినుండి తొలఁగి క్లేశము నొందుచుండును. అభ్యాసబలముచేత మనస్సును నిరోధించి ఎల్లప్పుడు లోపల సమాధిస్థితియందు నిలువఁగలిగినవాఁడు మధ్యముఁడు. మనస్సు వ్యవహారమునందు ప్రసరించుచున్నను వెలుపల కూడదృఢమైన సమాధిస్థితిలో నుండువాఁడు ఉత్తముఁడు. కావున బుద్ధియొక్క భేదముల ననుసరించి, జ్ఞానపరిపాకము యొక్క దశలలోని భేదములనుబట్టి, వారివారి ప్రారబ్ధశేషములను బట్టి జ్ఞానులకు కూడ విచిత్రములైన వ్యవహారములు సంభవించుచుండును. ఇది జ్ఞానఖండమునందు మనస్స్వరూపనిరూపణ మన్నది.అష్టాదశాధ్యాయము.