Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

భార్గవరాముని నిర్వేదము

శ్రీరామునివలన పరాభవమునొందిన భార్గవరాముఁడు అత్యంతము నిర్వేదము నొంది మార్గమున ఇట్లు చింతించుచు పోవఁజొచ్చెను. ''అహో నాచిత్తసమ్మోహ మేమని చెప్పదును? ప్రబలశత్రువైన క్రోధముచేత మోహమను పెద్దగోతిలో కూలి ఇట్లయితిని. తపస్సునకు మృత్యువు క్రోధమే. క్రుద్ధుఁడైన వానినుండి ఆలోచన యన్నది దూరముగా తొలఁగిపోవును. క్రుద్ధుండైనవాఁడు పిశాచమువలె ఏనీచకార్యమును జేయఁడు? వారి కీరువురకును భేదము కొంచెముకూడ లేదు. మాత్రండి నెవరో సంహరింపఁగా నేను ఎందఱనో సంహరించితిని. శత్రువులు పెరుగుచుండఁగా ప్రభువునకు రాజ్యసౌఖ్య మెట్లుండదో అట్లే నాకును ఈకోప మున్నంతవఱకు సుఖముండదు. మనుష్యభక్షకునివలె నేను చాల నీచకృత్యమును గావించితిని. అభిమానము క్రోధమునకు మూలము. ఆయభిమానము వలననే నేను పెద్దయజగరమువంటి క్రోధసర్పముచేత మ్రింగఁ బడితిని''.

ఇట్లు చింతించుచు పోవుచున్న పరశురాముఁడు దారిలో జ్వలించుచున్న యగ్నిపర్వతమువలె తేజోరాశిమయుఁడైన యొకపురుషుని గాంచెను. అతఁడు పుల్లపంకజలోచనుఁడై పుష్టసుందరసర్వాంగుఁడై యుండెను. అతఁడు మలినాంగుఁడై జుట్టు విరఁబోసికొని పిచ్చివాని వలె నున్నను మహాపురుషునివలె మహర్షివలె భాసించుచుండెను. వర్ణాశ్రమాదిచిహ్నములు ఏమియు లేక దిగంబరుడై మదపుటేనుఁగు వలె నిలిచియున్న యావిప్రుని జూచి పరశురాముఁడు చాల సంశయము నొందెను. ''ఎవ రీతఁడు? మంచి లక్షణములు చెడులక్షణములు కలిగి విలక్షణమైన వర్తనము కలవాఁడుగా నున్నాఁడు. ఇతఁడు మహాపురుషుఁడా లేక ప్రమత్తుఁడా? వేషాంతరము నొందియున్ననటునివలె వీనిని నిశ్చయించి గుర్తింపలేకున్నాను. మదించినవాఁడైనచో ఇతఁడు తేజోముయుఁడుగా ఎట్లుండును? ఇతఁడు సత్పురుషులను ధర్మమునుండి తప్పించి చెఱచువాఁడా లేక స్వరూపమును కప్పిపుచ్చుకొనియున్న మహాపురుషుఁడా? వీని నెట్లయినను ప్రయత్నించి పరీక్షింపవలె''.

ఇట్లు తలంచి పరశురాముఁడు నవ్వుచు వానినిజూచి ''పురుషవరేణ్యా, ఎవరు నీవు? మహాపురుషునివలె కన్నించుచున్నావు. నీయీ స్థితి ఎట్టిదో చెప్పుము '' అపి పలికెను. అమాట విని ఆతఁడు పెద్దగా మాటిమాటికి నవ్వుచు రాళ్లు రువ్వుచు పిచ్చివానివలె వర్తించుచు ఏదో మాటాడుచు పారిపోఁజొచ్చెను. భార్గవుఁడు ఆతనివెంట పరువెత్తి పట్టుకొని ''ఈతఁడెపరో తెలియుట లేదు. ఇంకను వీనిని పరీక్షించి నాకోరికను తీర్చుకొందును'' అని తలంచి ఆతనిని అనేక విధముల ఆక్షేపింప మొదలుపెట్టెను. ఎంతగా ఆక్షేపించినను ఎంతగా పరిభవించినను ఆతని స్థితియందుఁగాని ముఖర్ణమునందుఁ గాని కొంచెమైనను మార్పు రాలేదు. అప్పుడు పరశురాముఁడు అతఁడు మహాపురుషుఁడే అని నిశ్చయించుకొని ఆయన పాదములయందు వ్రాలి ప్రార్థించెను.

ఆయన ప్రసన్నుఁడై భార్గవుని కరుణించి నవ్వుచు ఇట్లనెను.''ఎవరు నీవు అని ప్రశ్నించితివి గదా? వినుము. ''నీవు'' అనుపదము యొక్క అర్థము నీకు తెలిసినచో నీప్రశ్న, పిండియైనదానిని మరల పిండిచేయుటవలె (పిష్టపేషణము) వ్యర్థము. ఆపదముయొక్క అర్థము నీకు తెలియనిచో నీమాట అర్థము లేనిదగును. ఈశరీరమును ఉద్దేశించి ''నీవు'' అనుపదమును ప్రయోగించితి నందు వేని. ఇందులోనున్నచైతన్యము నీకు గోచరించ లేదన్నమాట మఱి అన్నమయమైన యీశరీరము నీకు ప్రత్యక్షముగా కన్పించుచున్నది గదా! ప్రశ్నింపవలసినసంశయ మేమున్నది? కాఁబట్టి నీప్రశ్న పేరునకు మాత్రమే సంబంధించుచున్నది. కాని పేరు శరీరముతోపాటు సహజముగ సిద్ధించుట లేదు. అది అనేక విధముల కల్పింపఁబడుచున్నది. జనుల సముదాయములో ఒకపేరు ఒకశరీరమునందే నియమితమై యుండదు. కావున నీవు నన్ను చక్కఁగా ప్రశ్నించినచో సమాధానము చెప్పుదును''

ఆమాటలకు సమాధానము దొఱకక పరశురామునకు వాక్కుతో పాటు బుద్ధియొక్క పౌరుషము కూడ స్తంభించెను. అతఁడు సిగ్గువడి ఆయోగీశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించెను. ''మహాపురుష! నీవు చెప్పినదానినిబట్టి ఎట్లు ప్రశ్నింపవలయునో నాకు తెలియుట లేదు. నేను అకల్మషుఁడనై నీకు శిష్యుఁడనై యున్నాను. ఆప్రశ్న యేదో నీవే తెలిసికొని నాకు బోధింపుము''. అప్పు డాయన మధురములైన మాటలతో తన వృత్తాంతమును చెప్పస నారంభించెను. ''భార్గవా, నేను ఆంగిరసుఁడను; బృహస్పతికి తమ్ముఁడను; మూఁడులోకములయందును సంవర్తుఁడని ప్రఖ్యాతుఁడనై యుంటిని నాస్థితిని చెప్పెదను శ్రద్ధతో వినుము. పూర్వము అన్నతో నాకు విద్వేషము కలిగెను. దానిచేత నాకు నిర్వేదము పుట్టి గురువైన దత్తాత్రేయునిచే చక్కఁగా బోధింపఁబడి ఈస్థితిని పొందితిని. ''ఆత్మయే అఖిలము; ఇది యంతయు దానివిలాసము'' అని తలంచి శంకారహితుఁడనై అభయమైన మార్గము నాశ్రయించి, దారముచేత కదలింపఁబడు బొమ్మవలె సంచరించుచున్నాను''.

అదివిని రాముఁడు అంజలించి, ''మహాత్మా! సంసారభయపీడితుఁడను దీనుఁడను అయిన నన్ను అనుగ్రహించి నిర్భయము శుభమునైన మార్గమునందు ప్రవేశ##పెట్టుము''. అని ప్రార్థించెను. దయార్ద్రమృదయుడైన యాముని మరల నిట్లనెను. ''వత్సా! సర్వార్థ సంగ్రహమైన సారమును చెప్పెదను వినుము. దొంగలు ప్రబలముగా నున్న మార్గమును ఒకానొకఁడు దైవమోహితుఁడై నిర్భయమైన దారి అనుకొని ముందుకు పోవుచున్నట్లు నీవు నడచుచున్న మార్గము కూడ మిగుల అనర్థదాయకము, భయంకరము. ఆజ్ఞానమువలన దొంగలున్న మార్గమున ప్రవేశించినవాఁడు అడుగడుటున భయపుడుచు కష్టపడుచు క్షేమము కలుగు ననునాశతో ముందుకు పోవుట యెట్టిదో సంసార మార్గమున వర్తించుచుండుటయు అట్టిదే. మార్గము నెఱింగిన యొకానొక మహనీయునిచే బోధింపఁబడి దొంగలున్న మార్గమున వదలి మంచి మార్గమున పయనించువాఁడు దుష్టమార్గమున పోవుచున్న వారిని జూచి నవ్వుకొనుచుండును. అట్లే గురువు బోధించిన మంచిమార్గము నుందున్న నేను కుత్సితములైన యితరమార్గములలో పోవుచున్నవారిని చూచి నవ్వుకొనుచు ఆనందముతో ఎల్లయెడల చరించుచున్నాను. సంసారమార్గము మనము చేరవలసిన గమ్యమునకు విరుద్ధము, విపత్కరము. దానియందు నిరంతరము క్లేశములను పొందుచున్నను, జనులు మోహవశులై తెలిసికొనలేకున్నారు. పరంపరగా కష్టములు వచ్చిపడుచున్నను ఎప్పటికైనను సుఖము కలుగు ననుబుద్ధితో దానినే నమ్మియుండువారికి మావంటివారు సేవించుచున్న యీ మార్గము దుర్లభము. కావున సంసారము సరియైన మార్గము కాదని తెలిసికొని అందు విరక్తుఁడవై గురువు నాశ్రయించి ఆయన చెప్పినపద్ధతిలో స్వాత్మశక్తియైన త్రిపురామహేశ్వరిని ఆరాధించి ఆమె యొక్క కృపను పొందుము. ఆమెయనుగ్రహమువలన 'నాయందున్న యాత్మయే సకలపదార్థములయందును సమముగా నున్నది; దానిశక్తి యందే ఇతరమైన జగత్తు అంతయును ఆధాసమాత్రముగా నున్నది' అని గ్రహింపుము. అప్పుడు సంశయరహితుఁడవై నిర్భయుఁడవై నిశ్పలుఁడవై నావలెనే జగద్గురుత్వమును పొంది యథేచ్చగా విహరింపుము. తనచే గుర్తింపఁబడుచున్న తనశరీరము. గుర్తించుచున్న తాను కానని, తానే సకలపదార్థములయందు ఉన్నానని, అఖిలపదార్థములు తనయందే ఉన్నవని తెలిసికొని ఎల్లప్పుడు జ్ఞానసింహాసనస్థుఁడై ఎల్లయెడల చరించువానికి ఈసంసారమునందు కర్తవ్యమే గోచరింపదు. సంసారమునందు మాటిమాటికి దోషమును గుర్తించుచుండుటయే ఇందులకు మొదటిమెట్టు. దానివలన సంసారమునందు వైరాగ్యము కలుగును. దానివలన సన్మార్గమున ప్రవేశించుట సంభవించును. నాచేత సంక్షేపముగా చెప్పఁబడిన యీసారమును ఎల్లప్పుడును అభ్యసించు మానవుఁడు అచిరకాలముననే పరమపదమును చేర్చునట్టి శుభమార్గమున ప్రవేశింపఁగలఁడు.''

ఈప్రసంగములోని విషయము అతీంద్రియమై ఆలోచించుటకు కూడ అలవిగాకుండుటచే పరశురాముఁడు కలఁత నొందిన మనస్సుతో మరల ఇట్లు పలికెను. ''మహాత్మా! మీరు చెప్పినది సారవంతముగనే తోఁచుచున్నది. కాని అది చాల గంభీరమగుటవలన, మీరు చాల సంక్షేపముగ చెప్పుటవలన నాకు చక్కఁగా తెలియలేదు. కావున సందేహములు కలుగుచున్నవి. నన్ను కరుణించి ఆవిషయము నాకు ఎట్లు చక్కఁగా తెలియునో అట్లు వివరించి బోధింపుము. నీవు సర్వజ్ఞుఁడవు. శరణాగతుఁడనైన నన్ను రక్షింపుము''.

అంత సంవర్తుఁడు కొంతసేపు అంతర్ముఖుఁడై యుండి భార్గవుని యొక్క భవిష్యత్తు నంతను తెలిసికొని మధురముగా నిట్లనెను. ''రామా! వినుము. ఈమార్గము ఎవరికైనను సులభముగా గోచరించునది కాదు. ఇది చాల సూక్షమమైన విషయము. ఆందువలన కొండపైకి ఎక్కుటవలె, సంసారమునుండి పైకిపోవు నీమార్గమును గ్రహించుట మలినచిత్తులకు దుర్ఘటము. ఇది తెలిసికొనుటకు సులభముకాని దగుటవలననే చెప్పుటకును సులభము కాదు. ఇది ఎట్టి లోకపరిజ్ఞానమునకు అందనిది యగుటచే దుర్లభ మని చెప్పఁబడుచున్నది. ఇది త్రిపురాదేవియొక్క సేవవలన తప్ప వేఱోకవిదమున లభింపదు. ఆదేవియొక్క సేవాభాగ్యము కూడ గురువర్యుని కృపవలన తప్ప మఱియొక విధమున లభింపదు. సత్సంగమే అందులకు హేతువు. సకలశుభములకుని సత్సంగమే మూలము. కావున గరునాథుఁడైన దత్తాత్రేయుని యొద్దకు పొమ్ము. ఆయనను ఆరాధించి సంతోషపెట్టి త్వరలోనే వాంఛితమును పొందఁగలవు. రాత్రి యందు చీఁకటిలో త్రోవతప్పినవాఁడు సూర్యునివలన తప్ప ఎట్లు మరల సరియైనత్రోవకు రాలేఁడో, అట్లే ఎవ్వఁడై నను గురుసేవవలన తప్పసుఖమును పొందఁజాలడు. నేత్రరోగికి అంజనమునొసంగు వైద్యునివలె సంసారరోగికి గురువుతప్ప వేఱొకగతి లేదు. సాక్షాత్తుగా సదాశివుఁడే శిష్యులను అనుగ్రహించుటకై గురువుగా మనుష్యరూపమును పొంది ఎల్లప్పుడును పర్యటించుచుండును. ధనము కీర్తి మొదలగువానిని సమృద్ధిగా పొందియున్నను మూఁడులోకములలో ఎవ్వఁడైనను గురుదేవుని పాదాబ్జములను ఆశ్రయింపక శ్రేయస్సును ఎట్లు పొందఁగలఁడు? కావున నీవు ఇచ్చటినుండియే వెంటనే గురువు నొద్దకు పొమ్ము. ఆయనను కైతవములేని చిత్తముతో దృఢమైన భక్తితో ఆరాధింపుము. గురువు ప్రసన్నుఁడైనచో మూఁడులోకము లందును దుర్లభ మేముండును? ఆయన ఇప్పుడు గంధమాదన శైలమున సిద్ధయోగులచే సేవింపఁబడుచు ఆశ్రమమునందున్నాఁడు. నీకు శుభ మగును గాక! నేను పోవుచున్నాను.''

అంతట పరశురాముఁడు చూచుచుండఁగనే ఆయన ఈశాన్యముగ బయలుదేరి ఆకాశమార్గమునందు పోవుచు, గాలిచే తఱుమఁబడుచున్న మేఘపటలమువలె నిమేషమాత్రమున అగోచరుఁడయ్యెను. వెంటనే భార్గవుఁడును సంవర్తునిమాటలవలన కలిగిన కుతూహలముతో త్వరాన్వితుఁడై దత్తగురునియొద్దకు బయులుదేరెను.

బాలప్రియ

''అభిమానము క్రోధమునకు మూల''మని (అభిమానః క్రోధమూలః) పరశురాముఁడు తలంచుట గమనింపఁదగియున్నది. నే నింతవాఁడ నని తన శక్తి సామర్థ్యములను గూర్చి భావించుకొనుట అభిమానము. పరశురాముఁడు మహావీరుఁడు. మహాకార్యములను సాధించుటకు కావలసిన యుత్సాహశక్తియే మహావీరత్వము. మహావీరుఁడ నైన నాతండ్రియొక్క హోమధేనువును ఒకరాజు హరించుటేమి? అనునభిమానమువలననే ఆయనయందు క్రోధము ప్రజ్జ్వలించినది. జమదగ్ని సంహరింపఁబడినప్పుడు కూడ ఆ యభిమానము మూలముననే క్రోధము దావాగ్ని వలె విజృంభించి క్షత్రియాటవులను దహించినది. తండ్రి క్షమాగుణమునుగూర్చి బోధించియున్నను ఆయన క్షత్రియ సంహారమునకు పూనుకొనుటకు కూడ మహావీరత్వాభిమానమే కారణము. ఏ వీరత్వముతో ఆయన శత్రుసంహారము కావించెనో ఈవీరత్వముతోనే యజ్ఞములు చేసి పాపమును పోఁగొట్టుకొనెను. అట్లే ఆర్జించిన భూమి యంతయు దాన మొనర్చి అందులోకూడ ఆయన సాటిలేని వీరత్వమును ప్రకటించెను. పిమ్మట ఆయన తపస్సునకు పూనుకొని దివ్యలోకములను పెక్కింటిని ఆర్జించి తపోవీరుఁడయ్యెను. ఈవీరత్వాభిమానమువలననే ఆయనయందు మాటిమాటికి క్రోధము విజృంభించుచుండెను.

ఈయభిమానము మొదటిసారిగా శ్రీరాముని తోడిసంఘర్షణమున దెబ్బతినెను. శ్రీరామునియందు వైష్ణవతేజమును చూచినప్పుడు ఆయనకు నిర్వేదముతోఁబాటు ఆత్మవిమర్శ ఆరంభ##మైనది. జమదగ్నియు ధనుర్విద్యావిశారదుఁడే. కాని ఆయన కార్తవీర్యునిపై పరాక్రమింపలేదు; తపశ్శక్తి సంపన్నుఁడయ్యును శపింపలేదు. అంతే కాదు. తన కుమారుఁడు మహారాజును సంహరించి విజేతయై తిరిగివచ్చినప్పుడు సంతోషింపక పోఁగా అది మహాపాప మని ప్రాయశ్చిత్తము చేసుకొమ్మని ఆదేశించినాఁడు. ''సమ్మానమును విషమునుగా అవమానమును అమృతముగా బ్రాహ్మణుఁడు భావింపవలె'' అని మనువు చెప్పిన ధర్మమును ఆయన దృఢముగ అవలంబించెను. తన కుమారుఁడును అట్లే యుండవలయు నని ఆయన బోధించెను. కాని వీరత్వాభిమానమువలన ఆబోధ పరశురామునకు పట్టలేదు. తనవంటి మహావీరుఁడు పూనుకొని దుష్టశిక్షణము కావింపకున్నచో లోకమున ధర్మ మెట్లు నిలుచు నను నావేశముతో ఆయన పరాక్రమించెను. తన తేజము కన్నను చాలరెట్లు అధికమైన విష్ణుతేజమును శ్రీరాముని యందు చూచినపుడు, లోకరక్షణభారము తన భుజస్కంధములపైననే లేదని, తానును తనతండ్రివలె బ్రాహ్మణధర్మము నవలంబించి అవమానమును సహించియున్నచో, విష్ణుదేవుఁడు అవతరించి దుష్టులను శిక్షించియుండెడివాఁడని, తాను దురభిమానమువలననే బ్రాహ్మణునకు అనుచితమైన హింసాకృత్యమునకు పాల్పడె నని ఆయన గ్రహించెను.

సరిగా ఆసమయమునకు సంవర్తుఁడు ఆయనకు కన్పించెను. అది యాదృచ్ఛిక మని అనుకొనవచ్చును. కాని కర్మసిద్ధాంతము ననుసరించి యేదియును నిష్కారణముగా సంభవింపదు. కొన్ని సంఘటనములకు మనకు కారణములు తెలియకపోవచ్చును. అంత మాత్రమున అవి లేవని తలంపరాదు. సంవర్తుఁడు పోఁదలఁచు కొన్నప్పుడు ఱప్పపాటులో ఆకాశమార్గమున అదృశ్యుఁడయ్యెను. గదా! పరశురాముఁడు తన్ను పట్టుకొనుటకై పరువెత్తి వచ్చినపుడు ఏల అదృశ్యుఁడు కాలేదు? అనఁగా ఆయన పరశురాముని అనుగ్రహించుటకే వచ్చి ఆతని శ్రద్ధను, అట్లు పరీక్షించెనన్నమాట. ఆయనను భార్గవుఁడు ఇంతకు ముందు ఎన్నఁడును చూడలేదు. మఱి ఆయనకు ఆతనియందు అనుగ్రహము కలుగుటకు కారణమేమి? విష్ణుదేవుని ధ్యానించుచుండు మని తండ్రి పరశురామునకు తీర్థయాత్రలు చేయుమని చెప్పిన సందర్భమున బోధించెను. అట్లే ఆతఁడు తీర్థయాత్రలు యజ్ఞములు తస్సులు చేసెను. అవి పాపపరిహారమును కలిగించి కీర్తిని ప్రాభవమును కలిగించినవి. కాని అవి అభిమానమును క్రోధమును కొంచెము కూడ కదలింపలేక పోయినవి. తన్ను ధ్యానించుచున్నందులకు ఫలముగా విష్ణుదేవుఁడు అనుగ్రహించి ఆతనిని సన్మార్గమునకు మరలింప నారంభించెను. ఆదేవుని యనుగ్రహము వలననే శ్రీరాముని తోడి సంఘర్షణమున పరశురామునకు అభిమానము భంగపడి తీవ్రమైన నిర్వేదము కలిగినది. ఆయనుగ్రహమువలననే సంవర్తుఁడు కూడ సాక్షాత్కరించెను. అప్పటికి పరశురామునియందు వీరత్వాభిమానము భగ్నమైనను ''నేను బుద్ధిశాలిని, వాక్పటుత్వము కలవాఁడను'' అన్న అభిమాన మింకను మిగిలియున్నది. సామాన్యులైన పండితులకు మేధావులకు ఇట్టి యభిమాన ముండును. మఱి మహారాజై పరిపాలించి నూతన స్మృతిగ్రంథమును సైతము నిర్మించిన భార్గవునకు ఇది యెంతగాఢముగ నైన నుండవచ్చును. ఈయభిమానము మున్నంతవఱకు ఎవఁడును ఇతరునకు హృదయపూర్వకముగా శిష్యుఁడు కాఁజాలడు. సంవర్తుఁడు భార్గవునియందు ఈయభిమానమును భగ్న మొనర్చి వినయమును కలిగించెను. ఆతఁడు వేసిన ''ఏవరు నీవు'' అను ప్రశ్ననే విమర్శించి సంర్తుఁడు ''నీకు ప్రశ్నవేయుట కూడ తెలియలేదు'' అని నిరూపించెను. ఆవిమర్శకు భార్గవుఁడు విభ్రాంతుఁడయ్యెను. అప్పుడు భార్గవుఁడు ''స్తబ్ధవాగ్బుద్ధి పౌరుషుఁ'' డయ్యె నట. అఁనగా ఆయనయందు వాక్కు యొక్క బుద్ధియొక్క పౌరుషము స్తంభించె నని యర్థము. పురుషుని యొక్క ఉత్సహము, పౌరుషము, నేను చక్కఁగా మాటాడఁగల ననుకొనుట వాక్పౌరుషము. నేను బుద్ధిశాలి ననుకొనుట బుద్ధి పౌరుషము. ఈరెండును స్తంభితము లయ్యె ననఁగా వానికి సంబంధించిన యభిమానము భంగపడె నన్నమాట. ఇది యాయనకు రెండవ పరాజయము. అందువలననే ఆయన సిగ్గుపడి ప్రణమిల్లి. ''అకల్ముషుఁడనై శిష్యుఁడనై యున్న నాకు దయయుంచి బోధింపుము'' (బోధనీయో వై శిష్యభూత మకల్మషమ్‌) అని సంవర్తుని ప్రార్థించెను. నేను శిష్యుఁడ నైతి నని చెప్పిన చాలదా? అకల్మషుఁడనై శిష్యుఁడ నైతినని ఏల చెప్పవలె? ఆక్షణమువఱకు పరశురాముఁడు వాక్కు యొక్క బుద్ధియొక్క పౌరుషము నవలంబించి సంవర్తుని పరీక్షింపఁబూనుకొని యుండెను. ఆయభిమానమే కల్మషము. అది యిప్పుడు నశించినది. అభిమానరాహిత్యమువలన ఆయన అకల్మషుఁ డయ్యెను. అనఁగా ఆయన, ''అయ్యా! నీవు మహాత్ముఁడవు. నేను అల్పుఁడనే. నిన్ను పరీక్షింపఁబూని నందులకు మన్నింపుము. శిష్యునిగా స్వీకరింపుము'' అని సంవర్తుని ప్రార్థించె నన్నమాట. ఇట్టి శిష్యత్వము ఏర్పడిననే తప్ప పెద్దలు తత్త్వమును బోధింపరు. అర్జునుని విషయమున కూడ ''నేను నీకు శిష్యుఁడును. నిన్నుశరణము పొందియున్న నన్ను శాసింపుము'' అని (శిష్య స్తేహం శాధి మాం త్వాం ప్రసన్నమ్‌) అతఁడు శరణాగతుఁడైనప్పుడే శ్రీకృష్ణుఁడు బోధింపఁబూనుకొనుట గమనింపఁదగియున్నది.

ఇంతే కాదు. దత్తాత్రేయుని ఆశ్రమింపుమని చెప్పుచు సంవర్తుడు, ''కైతవములేని బుద్ధితో దృఢమైన భక్తితో ఆయనను ఆరాధింపుము'' అని భార్గవునకు బోధించుట గమనింపఁ దగియున్నది. కితవుఁ డనఁగా జూదరి. జూదరిచేయు వంచనము కైతవము. వంచనములేని బుద్ధితో గురువునారాధింపు మని చెప్పవలయునా? దత్తాత్రేయుఁడు కార్తవీర్యునకు గురువు. ఆయన ఆశిష్యునియందు వాత్సల్యము కలిగియుండుట సహజము. అట్టియెడల ఆతనినే గాక, ఆతని కుమారులనే గాక సకలక్షత్రియ సంహారము గావించిన తన్ను ఆయన చిత్తశుద్ధితో శిష్యునిగా స్వీకరించునా అను సందేహము పరశురామునకు కలుగవచ్చును. అట్టిసందేహముతో ఆయనను సమీపించి మాటిమాటికి ఆయన తనయందు ప్రసన్నుఁడై యున్నాఁడా లేడా అని గమనించుచుండుట అనుచితము. అది యించుమించుగా కైతవమేయగును. కావున అట్టిసందేహములు ఏమియు లేకుండ నిస్సంకోచముగా ఆయనను శరణుపొంది ఆరాధింపు మని సంవర్తుఁడు బోధించెను. అనఁగా సంవర్తుఁడు భార్గవుని సరియైన శిష్యునిగా రూపొదించి తగిన గురువునొద్దకు పంపించినాఁడన్నమాట.

ఈసందర్భమున సంవర్తుండు తన్ను పరీక్షించినందులకు పరుశురాముని మందలింపకుండుట గమనింపఁ దగియున్నది. మఱి శిష్యుడు గురువును పరీక్షింప వచ్చునా? తండ్రి మొదలగు పెద్దలు మనలను గురువలయొద్ద అప్పగించునప్పుడు వారిని పరీక్షింపఁబూనుట తప్పు. అట్లు కాక మనమే స్వతంత్రించి యొకనూతన వ్యక్తిని మహాత్ముఁడనుకొని గురువునుగా ఆరాధింపఁ బూనుకొనునప్పుడు మాత్రము జాగరూకతతో వ్యవహరింపవలసినదే. లోకమున మహాత్ములుగా గోచరించువారందఱు యథార్థముగా మహానీయులు కాకపోవచ్చును. అవధూతలవిషయమున పరీక్ష ఆవశ్యకము. వారు బాలురవలె, ఉన్మత్తులవలె పిశాచములవె నుందురు. వారు బాలురు ఉన్మత్తులు పిశాచములు కారు. కాని వారి యందు బాలురయొక్కదిగంబరత్వము, ఉన్నమత్తులయొక్క వ్యవహారధర్మశూన్యత్వము. పిశాచములయొక్క భయంకరత్వము గోచరించుచుండును. ఈలక్షణములను చూచి ఎవనినైనను అవధూత యని భ్రమించి వాని నాశ్రయించినచో పతనము సంభవింప వచ్చును. కావుననే శ్రుతి కూడ, "తత్త్వ విజ్ఞానముకొఱకు శ్రోత్రియుఁడైన బ్రహ్మవిష్ఠుఁడైన గురువునొద్దకే పోవలయును" అని విధించుచున్నది. కావున నూతనవ్యక్తులను గురువులనుగా ఆశ్రయింపఁదలఁచుకొన్నప్పుడు వారు తత్త్వజ్ఞులగుదురో కాదో తెలిసికొనవలసిన యావశ్యకత ఎంతయేని కలదు. కొల్లాయిగట్టినవా రందఱు కోవిదులు కారు. కాషాయమును వేసినవారందఱు జ్ఞానులు కారు. అందువలన పరీక్ష యావశ్యకమే. కావుననే దత్తా త్రేయుఁడు పరశురామునకు క్రొత్తవాఁడైనప్పటికి ఆయనను పరీక్షింప నక్కఱలేదని సంవర్తుఁడు హెచ్చరిక గావించి పంపినాఁడు.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters