Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

ఏడవయధ్యాయము-ఈశ్వరునిరూపణము

హేమలేఖ భర్తతో నిట్లనెను. ''నీవు అడిగినదానికి సమాధానము చెప్పెదను. స్థిరచిత్తుఁడవై ఆదరముతో వినుము. మనస్సు మర్కటమువంటిది. దానివలననే పామరులు గొప్పయనర్థమును -పొందుచున్నారు. మనస్సు నిశ్చలమైనప్పడు నిద్రలో సుఖము కలుగుచుండుట, -చంచలమైనప్పుడు అదియే సర్వదుఃఖములకు మూరకారణ మగుచుండుట తెలిసినదే. కావున స్థిరచిత్తముతో వినుము. అనాదరముతో విన్నచో అది విననిదానితో సమానమే యగును. అది బొమ్మలోని చెట్టువలె ఫలము నొసంగఁజాలదు. వినాశకరమైన శుష్కతర్కమును వదలి శాస్త్రానుకూలమైన తర్కమును ఆశ్రయించిన వాఁడు సత్వరముగా ఫలము నొందును. కావున శాస్త్రానుకూలమైన తర్కముతో శ్రద్ధతో నీకు ఏది శ్రేయస్సో నిశ్చయించుకొని దానికై ప్రయత్నంపుము. సర్వమును శూన్యముగా భావించిన శుంగునియనుచరులవలె పురుషకారమును వీడకుము. పౌరుషముతో ప్రయత్నింపకున్నచో ఫల మెట్లు కలుగును? ప్రయత్నమువలననే కదా ఎల్లరును తమకు అభీష్టములై నవానిని పొందుచున్నారు. అంతులైని తర్కముతో అశ్రద్ధతో ఎప్పుడైనను ఎచ్చటనైనను ఎవ్వఁడైనను కొంచెను ఫలము నైన పొందెనేమో విమర్శించి చెప్పుము. ఎక్కడనో ఒకచోట అనుకొన్నట్లుగా ఫలము లభింపలేదని దేనిని నమ్మకుండువాఁడు దైవహతుఁడని యెఱుంగుము. వాఁడు తనకు తానే శత్రు వగును. కావున శ్రద్ధతో సరియైన తర్కముతో ప్రయత్నించి శ్రేయస్సునకు ముఖ్యతమమైన సాధనమును అవలంబింపవలయును. విచిత్రములుగానుండు వివిధసాధనములలో ఏది నీకు అన్నివిధముల సులభసాధ్యమో అధియే నీకు ముఖ్యతమము. దానిని పెద్దలయనుభవముతో విచారించి నిశ్చయించి వెంటనే ఆరంభింపుము. ఆపద్ధతి నంతయు చెప్పెదను. సావధానుఁడవై వినుము.

దేనిని పొందినతరువాత మరల శోకము కలుగదో అదియే శ్రేయస్సు. సూక్ష్మదృష్టితో చూచినచో ఎల్లయెడలశోకమే కన్పించునును. ఏది శోకముతో కూడియుండునో అది శ్రేయస్సు కానేకాదు. భార్య పుత్రులు రాజ్యము మొదలగునది యంతయు అస్థిరము; కాలము అనుసర్పముచేతక మ్రింగఁబడుచున్నది. ఈ విషయములలో అన్నింటియందు శేకమునకు చాలశక్తివంతమైన బీజ మున్నది. ఇట్టివి పరమ శ్రేయస్సునకు సాధనము లెట్లగును? ఈధనాదివిషయములు గ్రహింపఁదగినవే అనుభ్రమ మోహమువలన కలుగుచున్నది. జగత్కర్తయైన మహేశ్వరునివలన ఎల్లరును మోహమును పొందుచున్నారు. కొంచెము విద్యగలిగిన గారడీవానివలననే అనేకులు మోహితు లగుచుండఁగా జగత్కర్తయైన మహేశ్వరుని మహామాయనుండి ఎవఁడు తప్పించు కొనఁగలఁడు? గారడిలోని మాయ నెఱింగినవాఁడు దానినుండి తప్పించుకొనఁగల్గుచున్నాఁడు. అట్లే మహేశ్వరునిమాయ నెఱింగిన వాఁడును దానినుండి తప్పించుకొని శాశ్వతమైన సుఖమును పొందుచున్నాడు. కాని ఈశ్వరుని యనుగ్రహమును పొందినవాఁడే ఆ మహామాయను గుర్తించి దానినుండి తప్పించుకొనఁగలఁడు. కావున సర్వవిధముల మహేశ్వరుని శరణమును పొందినవాఁడు ఆయనవలన ఆత్మవిద్యను పొంది మాయామోహమునుండి తప్పించుకొనఁగలఁడు. శ్రేయస్సాధనములైన యోగము లనేకములు కలవు. అవి ఏవియును మహేశ్వరుని యనుగ్రహములేక ఫలింపవు. కావున మొదట విశ్వకారణుఁడైన మహేశ్వరుని ఆరాధింపవలె. అనంతరము మోహమును నశింపఁజేయు ఏయోగము నైనను సాధింపవచ్చును.

ఈజగత్తు ప్రత్యక్షముగా కన్పించుచున్నది. వస్త్రము గృహము మొదలుగా ప్రతిపదార్థము ఒకానొకకర్తచేత సృష్టింపఁబడుచున్నది. అట్లే ఈజగత్తు ఈశ్వరునిచే సృష్టింపఁబడుచున్నది. ఇది తర్కము చేతనే కాక పెక్కశాస్త్రములచేత కూడ నిరూపింపఁబడుచున్నది. 'ఈలోకమునకు కర్త ఎవఁడునులేఁడు. సృష్టి తనస్వభావముచేతనే జరుగుచున్నది' అని చెప్పు ఆగమము ఒకటి కలదు. కాని అతి తర్కయుక్తములైన పెక్కు ఆగమములచేత ఖండింపఁబడినది. ప్రత్యక్షము నొక్కదానినే ప్రమాణముగా గ్రహింప, దేహము నశించుట తోడనే ఆత్మకూడ నశించు నని చెప్పుచున్న యీయాగమము యధార్థముగా ఆగమమే కాదు. కావుననే దానిని వివేకముగల మహాత్ము లెవ్వరును అంగీకరింపలేదు. శుష్కతర్కముపై ఆధారపడిన యీశాస్త్రమును పరిగ్రహింపరాదు.

ఈజగత్తు సనాతనమైన దని, దీనికి అచేతనమైన ప్రకృతియే కారణ మని కొందఱు చెప్పుచున్నారు. ఈమతము కూడ అసమంజసమే. క్రియ లన్నియు బుద్ధిపూర్వకముగానే జరుగుచున్నవి. బుద్ధి రహితమైనయెడ క్రియ కన్పించుటలేదు. బుద్ధి కలవాఁడే క్రియను చేయున్నాఁడని శాస్త్రములవలననే కాక ప్రత్యక్షముగాకూడ కన్పించచున్నది. కావున బుద్ధిశాలియైన కర్తయే ఈజగత్తును సృష్టించుచున్నాఁడని నిరూపిత మగుచున్నది. కాని ఈజగత్తు సాధారణపదార్థమువలె కాక, ఊహకందనిరూపముతో అనంతమైనశక్తితో విలసిల్లుచున్నది. కావున ఇట్టి జగత్తు యొక్క కర్త కూడ లోకములని పదార్థముల యొక్క కర్తలకన్న విలక్షణముగా మితిలేనిసామర్థ్యముకలవాఁడై యున్నాఁడు.

అట్టి జగత్కర్తయైన యీశ్వరుండే తన్ను ఆశ్రయించినవారిని సముద్ధరింపఁగలఁడు. కావున ఆయననే ఎల్లప్పుడు సకలవిధముల శరణుపొందుము; లోకమున కొంచెము ప్రాభవము కలవఁడు కూడ తన్ను నిష్కపటముగా ఆశ్రయించినవానియెడల ప్రసన్నుఁడై వాని యభీష్టములను తీర్చుచున్నాఁడు. అట్టియెడల లోకేశ్వరుఁడు భక్తవత్సలుఁడును ఆయిన దేవుని చక్కఁగా ఆరాధించినచో ఆయనవలన మనము పొందరానిదే ముండును? లోకములో ప్రభువుల నిలుకడ లేని వారుగ నిర్దయులుగా కృతఘ్నులుగా నుందురు. అందుచేత వారివలన కలుగుఫలము కూడ అస్థిరముగనే యుండను. మఱి పరమేశ్వరుఁడు దయాసముద్రముఁడు కృతజ్ఞుఁడు చక్కని వ్యవస్థ కలవాఁడు. అట్లు కానిచో ఆయన ఎట్టినిందను పొందకుండ అనాదియైన యీజగత్తును ఇంతచక్కనియేర్పాటుతో ఎట్లు నడుపఁగలుగుచున్నాఁడు? వ్యవస్థలేనిరాజ్యము నశించుచుండుట మనము చూచుచునే యున్నాము. కావుననే ఆయన దయాసముద్రుఁడని చక్కనివ్యవస్థ కలవాఁడని ప్రశంసింపఁబడుచున్నాఁడు. వెంటనే నీవు ఆయనను శరణము పొందుము. ఆయనయే నీకు శ్రేయస్సును కలిగించుసాధనమును నిర్దేశింపగలఁడు. దేవినవల శ్రేయస్సు కలుగును. అని సాధనమునుగూహర్చి నీవిప్పుడు ఆలోచింపవలదు.

రోగము పోవలయు నని కొందఱు, సంపదలు కావలయునని కొందఱు అనేకవిధములుగా ఈశ్వరుని ఉపాసించుచున్నారు. ఎవఁడో ఒకానొకఁడు ఎట్టికోరికలు లేకుండ ఆయనను ఉపాసించును. అదియే సత్యమైన యుపాసనము. ఆర్తితో ఆరాధించునప్పుడు ఈశ్వరుఁడు భక్తియందలి తారతమ్యమునుబట్టి ఒకటికి దయతో రోగమును తొలగించును; మఱియొకనికి ఉపేక్షింపవచ్చును. అట్లే సంపదలు కోరు వారికిని లభించు ఫలము మితముగ అనేక విధములుగ నుండును. ఒకానొకఁడు తమ్ము నిర్హేతుకముగా సేవించుచున్నచో లోకములో ప్రభువులు ఆవిషయమును కొంతకాలమునకు గ్రహించి వానికి అధీనులగుచున్నారు. ప్రభువులు అజ్ఞులు కావుల సేవకునియందలి నిష్కామత్వమును గ్రహించుటకు వారికి చాలకాలము పట్టును. కాని సర్వజ్ఞుఁడైన పరమేశ్వరుఁడు భక్తుని యొక్క నిష్కామత్వమునువెంటనే గ్రహించి సత్వరముగా ఫలమము నొసంగును. ఆర్తునకు ధనాదుల నర్థించువానికి ఈశ్వరుఁడు జగత్తుయొక్క వ్యవ్సథ ననుసరించి వారియొక్క కర్మ పరిపాకమును పొందినప్పుడే ఫలము నొసంగును. ''నీవు తప్ప నాకు శరణము లేదు'' అని శరణాగతి చేసిన భక్తుని విషయమున భగవంతుఁడు వానియోగక్షేమములను వహించుచు వానకర్మ పరిపాకములను పొందినను పొందకున్నను జగత్తులోని వ్యవస్థయొక్క నియమములను కూడ అతిక్రమించి వానికి సత్వరముగా శ్రేయస్సాధనమును కలిగించుచున్నాఁడు ఇదియే ఆయనయొక్క మహాప్రభుత్వము ఎదురులేని స్వాతంత్ర్యము.

ప్రారబ్ధము కాని, జగత్తు యొక్క నియతి కాని, మహేశ్వరుని యెదుట నిలువలేవు. మార్కండేయుని విషయమున మహేశ్వురుఁడు ప్రారబ్ధమును నియతిని అతిక్రమించి దీర్ఘాయువు నొసంగుట ఎల్లరకును తెలిసినదే. ప్రారబ్ధము నియతి సాధారణముగా దాటరానివే. అసమర్థులైనవారి ప్రారబ్ధమును అతిక్రమింపలేరు. కాని సమర్థు లైనయోగులు ప్రాణాయామములచేత దానిని జయించుచున్నారు. యోగులు ప్రారబ్ధమును జయింపఁగల రనుటయు నియతిలో ఒక భాగమే. ప్రారబ్ధమనఁగా ఫలము నిచ్చుటకు ప్రారభించిన మన కర్మయే. నియతి యనఁగా ఈశ్వరునియొక్క సత్యసంకల్పరూప మైనశక్తి. అందువలననే అది దాటరానిది. కావున నియతి ప్రారబ్ధమును త్రోసివేయఁగలదు. అట్టినియతి కూడ సంపూర్ణముగా పరమేశ్వురుని శరణుచొచ్చిన భక్తునియందు కుంటువడును. అట్టిభక్తుల యందు అది అట్లు కుంఠిత మగుచుండుట కూడ దానిస్వభావమే. కావున కుతర్కమును వదలి నిష్కామముగా పరమేశ్వరుని శరణుపొందుము. ఇదియే క్షేమ మనుసౌధమునకు మొదటి సోపానము. దీనిని వదలినచో తక్కిన సాధనము లేవియు ఫలింపవు.''

అంతట హేమచూడుఁడు చాలసంతోషముతో నిట్లనెను. ''ఎవని శక్తిచేత ఈ జగత్తు నియమింపఁబడుచున్నదో అట్టి సర్వకర్త స్వతంత్రుఁడు అయిన మహేశ్వరుఁడెవరో చెప్పుము. విష్ణువు శివుఁడు గణపతి సూర్యుఁడు నృసింహుఁడు బుద్ధుడు సుగతుఁడు అర్హతుఁడు వాసుదేవుఁడు ప్రాణము సోముఁడు పావకుఁడు కర్మ ప్రధానము అణువులు మొదలుగా అనేకులు అనేకవిధములుగా పరమేశ్వరుని నిరూపించుచున్నారు. ఈదేవతలలో ఎవరు మహేశ్వరుఁడని మన మామరాదింపవలె? భగవంతుఁడైన వ్యాఘ్రపాదుని వాత్సల్యమునకు పాత్రురాలవైన నీకు తెలియని దేమియు నుండదు. ఆయన యనుగ్రహము వలననే కదా స్త్రీ వైనను నీవు ఇట్టి జ్ఞానముచేత ప్రకాశించుచున్నావు.''

అప్పుడు హేమలేఖ హర్షముతో నిట్లనెను. ''నాథా! ఈశ్వర స్వరూపనిర్ణయమును చెప్పదను వినుము. లోకములను సృష్టించి పాలించి లయమొందించువాఁడే ఈశ్వరుఁడు. ఆయనయే విష్ణువు శివుఁడు బ్రహ్మ. ఆయనయే సకలదేవతలు ''ఆయన శివుఁడే విష్ణువు కాదు; విష్ణువే శివుఁడు కాదు'' అని ఈ విధముగా చెప్పుటకు వీలులేదు. పంచముఖుఁడు త్రినేత్రుఁడు ఆయిన శివుఁడు జగత్కర్త అని చెప్పుచున్నారు. లోకములో కుండలు మొదలగువానిని చేయువాఁడు చేతనుఁడుగా శరీరము కలవాఁడుగా నున్నాఁడు. అచేతనుఁడు శరీరములేనివాఁడు ఎక్కడను కర్తగా కన్పించుటలేదు. కావున ముఖ్యకర్తృత్వము చేతనునకే సంభవించును. స్వప్నములయందు జీవుఁడు స్థూలశరీరమున వదలిచైతన్యమయమైన దేహముతో వివిధ పదార్థములను సృష్టించుచున్నాఁడు. కావున చేతనుఁడైన జీవునకు శరీరము ఉపకరణము మాత్రమే. జీవులు అపూర్ణులు అస్వతంత్రులు. కావున వారికి ఉపకరణములు ఆవశ్యక మగుచున్నవి. మఱి పరమేశ్వరుఁడు పూర్ణుఁడు స్వతంత్రుఁడు. అందువలన ఆయన ఏసాధనమును అపేక్షింపక సర్వమును సృష్టించుచున్నాఁడు. కావున ఆయనకు శరీరము లేదు. ఆయనకు శరీరము ఉన్నదన్నచో లోకము లోని కార్యకర్తలకువలె ఆయనకుకూడా, కుండను చేయుటకు మట్టివలె జగత్తును సృష్టించుటకు ఒక పదార్థము కావలసియుండును. ఆయన ఆవిధముగా దేశము కాలము మొదలగు వానిని అవలంబించి సృష్టిచేయువాఁడైనచో, ఆయన కూడ జీవుఁడే అగును ఆయన సృష్టిచేయుటకు అసాధనములను అవలంబించుచున్నాఁడన్నచో అవి సృష్టికి పూర్వమే సిద్ధమైయున్నవన్నమాట. అనఁగా వానిని ఆయన సృష్టింపలేదని చెప్పవలె. అట్లయినచో ఆయన సర్వమునకు కర్త అని చెప్పుట కుదురదు. కావున దేహము దేశము కాలము మొదలగు సాధనములు ఏవియు లేకుండఁగనే ఈశ్వరుఁడు సృష్టించును. కావున ఆయనకు స్థూలమైన శరీరములేదు. స్థూలమైన బుద్ధికలవారు పరమే శ్వరుని యొక్క అశరీరత్వమును గ్రహింపఁజాలరు. అందువలన భక్తులు తన్ను ఏలోకమునందు ఏరూపముకలవానినిగా ధ్యానించుచున్నారో వారికి ఆయన ఆరూపమును ధరించి ప్రత్యక్షమగును. కావున ఆయన చైతన్యమాత్రుఁడు. ఆయన ధరించుదేహము కూడ చైతన్య మైత్రమే. ఆచైతన్యరూపిణియే త్రిపురా పరమేశ్వరి. ఆమె యందే జగత్తు అంతయు వివిధ భేదములతో భాసించుచున్నది. చరాచరాత్మకమైన యీజగత్తు అంతయు ఆమెయందు, అద్దములోనగరమువలె, కన్పించుచున్నది. ఈజగత్తులో ఆమెకన్న అన్యముగా ఏదియు లేదు. అంతయు అమెయే. అందువలన జగత్తులో ఉత్తమము అధమము అనుభావనకు అవకాశము లేదు. శివుఁడు విష్ణువు మొదలకు మూర్తులందున్న చైతన్యశక్తి ఆమెయే కావున ఆదేవతలయందును ఒకరు ఎక్కువ మఱియొకరు తక్కువ అని భావింపరాదు. మఱి ఆయాశాస్త్రములందు ఆయాదేవతలకు సర్వశ్రేష్టత్వము వచెప్పఁబడియున్నను ఆరూపము లన్నియు ఆమెయందు కల్పింపఁబడినవే కావున అవి ముఖ్యములు కావు. ప్రాజ్ఞుఁడు నిరాకారమైన చైతన్యమునే ఉపాసింపవలె. అందులకు సామర్థ్యములేని వాఁడు తనకు ఏదేవతారూపమునందు బుద్ధి లగ్న మగునో ఆరూపమునే ద్యానించుచు, ఫలమును కోరకుండ, ఈశ్వరుని ఆరాధించినచో శ్రేష్ఠమైన శ్రేయస్సును పొందును. ఈశ్వరారాధనము చేయకుంéడ కోటిజన్మలెత్తినను సుగతి కలుగదు.

ఇదిజ్ఞానఖండము హేమచూడోపాఖ్యానమునందు ఈశ్వర నిరూపణ మున్నది సప్త మాధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters