జగద్గురుబోధలు
తొమ్మిదవ సంపుటము
శ్రీ కంచి కామకోటి జగద్గురు
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామి
శ్రీ స్వామివారు
ఆంధ్రదేశ పర్యటనము ఇచ్చిన ఉపన్యాసములు
సంకలనకర్త:
'విశాఖ'
ఆంధ్రప్రభ నుండి పునర్ముద్రితం
ప్రకాశకులు:
సాదన గ్రంథమండలి, తెనాలి.
కాపీరైటు వెల : 25-00
సర్వస్వామ్యములు
సాధన గ్రంథ మండలివి
బహుధాన్య
శ్రీరామ నవమి
1998
టైప్ సెట్టింగ్, ప్రింటింగ్:
శ్రీ సత్యసాయి గ్రాఫిక్స్
విజయవాడ 2
ఫోన్ : 0866- 434711
ఓమ్
'' తాపింఛ స్తబక త్విషేతనుభృతాం
దారిద్రముద్రాద్విషే
సంసారాఖ్య తమోముషే పురరిపో
ర్వామాంక సీమాజుషే|
కంపాతీర ముపేయుషే కవయతాం
జిహ్వాకుటీం జగ్ముషే
విశ్వత్రాణపుషే నమోస్తు సతతం
తస్త్మె పరంజ్యోతిషే''||
ఇది జగద్గురుబోధలు నవమభాగం, వీనిలోని ఉపన్యాసాలు స్వాములవారు ఆంధ్రదేశపర్యటన చేసినపుడు ఇచ్చినవి. ఆంధ్రప్రభలో ప్రచురించినవి. స్కందలీలా వైభవమును శీరిక మాత్రము స్వాములవారు 1932లో ఇచ్చిన ఉపన్యాసములనుండి సంకలితము. స్వాములవారి ఉపన్యాసములతో బాటు భక్తుల రచనలు కొన్ని అనుబంధముగా గ్రథించినాము.
ఆంధ్రదేశపు జనులకు స్వామి చిరపరిచితులు. స్వాములవారితో దర్శనసంభాషణలు సలిపిన సాధకలోకములనకు ఈ ఉపన్యాసములు మననశీలములు. తదితరులకు, ఆముష్మిక సౌరభాలను వెదజల్లే సరసగంధిక సుమరాజములు.
శృంగేరీ మహా సంస్థానములో గడచిన శతాబ్దములో ఉగ్రనరసింహ భారతులు ముప్పది రెండవ ఆచార్యులుగా విశేషకాలము ధర్మసంస్థాపన గావించారు. వీరికి కాకరకాయ స్వాములనికూడ పేరు. రోజుకు ఒక్క కాకరకాయతిని చాలాకాలము వీరు గడిపారు. తమ వెనుక మఠమునకు అధిపతిగా వచ్చుటకు తగిన పాత్రుని వారు అన్వేషిస్తూ, శివస్వామి అనే తొమ్మిదేండ్ల పిల్లవానిని కడపట ఎన్నుకొన్నారట. అతనిని ఆదరముగా పిల్చి స్వాములవారు 'నాయనా! నీకేమి కావలెను?'' అని అడిగారట. అందులకు ఆ పిల్లవాడు
ఆయం దానకాల స్త్వహం దానపాత్రం
భవానేవ దాతా త్వదన్వం నయాచే |
భవద్భక్తిమేవ స్థిరాం దేహి మహ్యం
కృపాశీల శంభో కృతార్థో7స్మి తస్మాత్||
అనే భగవత్పాదుల శివభుజంగస్తోత్రములోని ఒక శ్లోకం చదివాడట. ఈశివస్వామియే 33వ శృంగేరీ ఆచార్యులుగా - శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి యని ప్రసిద్ధిగాంచిరి.
శ్రీ శృంగేరీ ఆచార్యుల ఉపదేశాన్ని స్మరిస్తూ మనం కూడ శ్రీ కామకోటి సరస్వతివారి - 'అయందానకాలః........ కృపాశీలశంభో భవద్భక్తిమేవ స్థిరా దేహి మహ్యం' అంటూ భక్తిభిక్షను ప్రార్థించి శ్రీ గురుచరణ రేణువులలో కలసిపోవడమే కర్తవ్యం.
'' సమశ్శివాయ చ శివతరాయ చ''
మండలిమాట
ఇదివఱకు జగద్గురుబోధనలు ఎనిమిది సంపుటములను సాధన గ్రంథ మండలి వెలువరించిన విషయము మీకు విదితమే. ప్రస్తుతం మీచేతిలో ఉన్నది తొమ్మిదవసంపుటము. దశమ సంపుటమునకు వ్యాసావళి సేకరణ జరుగుచున్నది. ఈ పది పుస్తకములూ, ఆరసంప్రదాయమునకు, సనాతనమతమునకు, భారతీయ సంస్కృతికీ దర్పణం లాంటివి. ఈ దశమభాగంతో, దాదాపు పదునాలుగేళ్ళకు ముందు ప్రారంభించిన ఈ శీరిక శుభాంతమౌతున్నది. ఈ పుస్తకముల ప్రచురణతో సాధనగ్రంథ మండలిసేవ పరాకాష్ఠ నందుకొన్నదని కొందరు మిత్రులు నా చెవిని వేయగా, హృదయంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సేవాభాగ్యం మండలికి లభించటం ఈశ్వరునికృప; స్వాములవారి అనుగ్రహహమున్నూ.
స్వాములవారిని చూచినప్పుడల్లా, నాకు భవభూతి చెప్పిన ఈ క్రిందిశ్లోకం గుర్తుకు వస్తూ వుంటుంది.
వ్యతికరితదిగంతాః శ్వేతమానై ర్యశోభిః
సుకృతవిలసితానాం స్థానమూర్జస్వలానాం,
ఆకలితమహిమానః కేతనం మంగళానాం
కథ మపి భువనేస్మిన్ తాదృశాః సంభవంతి.
లోక సంగ్రహం కోసం అవతరించిన మహాత్ములలో శ్రీవారు ఒక్కరు. వారు నిజంగా లోకశంకరులే. వారిదర్శనంతో ఆబాల గోపాలమూ, ప్రహర పులకోద్గము చారుదేహ మౌతూవుంటుంది.
పుణ్యోదయేన బహుజన్మ సమర్జితేన
సత్సంగమో యది భవత్ కృతినో జనస్య
ఆజ్ఞాన హేతుకృత మోహ మహాంధకారో
నశ్యేత్తదా హృదయమేతి మహాన్వివేకః||
అని పద్మపురాణం చెబుతున్నది. శ్రీవారివంటి అధ్యాత్మనిత్యుల ప్రవచనములను చదివి, వారిస్తూక్తులను వాచావిధేయములుగ చేసుకొని మనమందరమూ ఆత్మానుభవోన్ముఖులము కావలయునని నా విన్నపము.
లొగడ వెలువరించిన ఎనిమిది భాగములను ఆదరించినట్లే సాధకలోకము, ఈ తొమ్మిదవ భాగమును కూడ ఆదరిస్తుందని విశ్వసిస్తున్నా.
ఈ వ్యాసములను అనువదించిన 'విశాఖ' గారికి, గ్రంథ రూపము దాల్చుటకు అనుమతించిన ''ఆంధ్రప్రభ'' సంపాదకులకు, శ్లోకముల కర్థములు వ్రాసి అనుగ్రహించిన బ్ర. శ్రీ. సూరి రామకోటి శాస్త్రిగారికిని మండలితరుపున ధన్యవాదములు.
|