Kathakanchiki    Chapters    Last Page

 

''మతంమీద నమ్మకం లేకున్నా, మంచిచేస్తే చాలు, ముక్తి.''

భారతదేశ చరిత్రను గురించీ, సంస్కృతిని గురించీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విద్వాంసులు డాక్టర్‌ తులయేవ్‌, వారు రష్యన్‌లు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామి వారిని 1965వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 24వ తేదీన మద్రాసుకు ఇంచుమించు 48 మైళ్ళ దూరానవున్న 'సుంకువారి సత్రం'లో సందర్శించారు. సందర్శించినప్పుడు బయటికి తెలిసేటంతగా వారు చలించిపోయారు.

డాక్టర్‌ తులయేవ్‌ చేస్తున్న అధ్యయనాన్ని గురించి స్వామివారు ముందు పరామర్శించారు.

డా|| తులయేవ్‌: మిమ్ము సందర్శించే అవకాశం కలిగినందుకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. తమ కాలాన్ని వృధాచెయ్యను. రెండేరెండు ప్రశ్నలడుగుతాను. ఒకటి మనిషికి మతం మీద నమ్మకం లేదనుకోండి. ఆచారకాండ ఏదీ జరపడనుకోండి. ఏ విధమైన మతసిద్ధాంతాలమీదా లక్ష్యం లేదనుకోండి. ఐనా జీవితమంతా మంచిని గురించే ఆలోచిస్తూ, మంచిపనులేచేస్తూపోతే అతడికి ముక్తికలుగుతుందా?

స్వామివారు కొన్నిక్షణాలపాటు కళ్ళుమూసుకుని ధ్యాన స్థితిలో వుండిపోయారు. వారు ధ్యానస్థితిలో వున్నంతసేపూ పరిసరాలు అతిలోకమైన ప్రశాంతిలో మునిగిపోయాయి. స్వామివారు మెల్లగా దృఢంగా ''కలుగుతుంది'' అన్నారు.

&#ఈ సమాధానం విని డాక్టర్‌ తులయేవ్‌ ఆనంద పరవశులయ్యారు. అలాంటి ఆనందం వారు జీవితంలో అనుభవించి వుండరు. అలాంటి ఆనందానుభవం కోసమే వారు ఎన్నేళ్ళనుండో ఎదురుచూస్తున్నారు. అసాధ్యమైందేదో సాధించిన తృప్తి వారిలో కనబడింది. వారు వినపడీ వినబడనట్లు ''ధన్యుణ్ణి, ఎంతో ధన్యుణ్ణి!'' అన్నారు.

స్వామివారు: (తమ సమాధానాన్ని వివరిస్తూ)

ఆధునిక జీవితాన్ని చూచి ఈ సమాధానం చెప్పాననుకోకండి. కాదు, ఈ మాటలు మన ప్రాచీన శాస్త్రంలోనే వున్నాయి. తమ బుద్ధిబలంతో భగవంతుని అస్తిత్వాన్ని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన భౌతికవాదులు భగవంతుడు లేడనే నిర్ణయానికి వచ్చారు. వీరుకాక, శూన్యవాదులైన బౌద్ధులున్నారు. వారు పూర్తిగా నాస్తికులు. తరువాత జైనులు, వ్రతాలూ, దీక్షలూ పట్టి శరీరాన్ని వీలైనంత బాధించుకునే తత్త్వంకలవారు. వీరినిమించి శైవులున్నారు. వైష్ణవులున్నారు. అలాంటివారే మరికొందరున్నారు. వారి దేవుడు వైయక్తికమైన దేవుడు. ఆ దేవుని ఆరాధనలో బ్రతుకంతా గడుపుతారు వారు. చివరగా అద్వైతులున్నారు. ''ఉన్నదొక్కటే. అదే ఈ అనంత సృష్టిగా అభివ్యక్తమైంది'' అని నమ్మేవారు. వీరందరూ అన్వేషకులే. అందరూ సత్యానికి చేరువులో వున్నవారే. భగవంతునికి వారెంత చేరువలో వున్నారనేది వారిమధ్యవున్న భేదం. సోపానక్రమంలో వీరందరూ భగవంతునికి మరింత మరింత దగ్గరగా వున్నారు. భగవంతుణ్ణి గురించి ఆలోచించేవారు వారు. నిరీశ్వర వాదులైనా సరే. సత్యాన్ని గురించి అసలే అన్వేషించని సోమరులకన్నా యెన్నోరెట్లు నయం. ఈమాట నామాట కాదు. శాస్త్రాల్లోవున్న మాట.

డాక్టర్‌ తులయేవ్‌కు ఈ సమాధానం చాలా నచ్చింది. అతడు రెండో ప్రశ్న అడిగాడు. డాక్టర్‌ తులయేవ్‌: విశిష్టాద్వైతాన్ని కొంతవరకు అర్ధం చేసుకోగలను. కాని అద్వైతమే బొత్తిగా అర్థంకాదు. అందులోనూ ముఖ్యంగా 'మాయ' అనేది. మాయ అంటే ఏమీ లేకపోవటం గదా. లేనిదాన్ని అసలు పిలవటం ఎందుకు?

స్వామివారు: విశిష్టాద్వైతులు కూడా ఒకరకమైన అద్వైతులే. వారు విశిష్టులైన అద్వైతులు వారు 'మాయ' అనేదాన్ని భగవంతుని శరీరంగా భావిస్తారు. అద్వైతులమైన మేము పరమసత్యమే మాయయెక్క రూపంగా అభివ్యక్త మౌతుందని అంటాము. మీకొక ఉదాహరణ చెబుతాను. ఒకరు చక్కెరతో రకరకాల రంగుల బొమ్మలు చేశారనుకోండి. వాటినిచూచిన పసిపాప అవన్నీ నిజంగా బొమ్మలే అనుకుంటుంది. కాని అది సత్యమైన జ్ఞానం కాదు. ఆ పాపపెరిగి పెద్దదై ఆబొమ్మలన్నీ నిజానికి చక్కెర అనీ, ఆ చక్కెరే రకరకాల ఆకారాల్లో కనబడుతున్నదనీ అర్థచేసుకుంటుంది.

సత్యంకాని ఆకారం ఒకప్పు డుంది. సత్యమని తెలిశాక, ఆ ఆకారం మాయమైంది. మరో ఉదాహరణ చూడండి. మసకవెలుతురులో త్రాడును చూచి పాము అని భ్రమపడతాము. పాము అనేది లేక పోయినా మనకు చెమట పోస్తుంది. శరీరం వణుకుతుంది. కాని అది త్రాడు అని తెలిశాక భయం పోతుంది. ఈ భ్రాంతివంటిదే మాయ. బ్రహ్మపదార్థమే పరమసత్యం. అనేక ఆకారాలతో ప్రత్యక్ష్యంగా కళ్ళకు కనిపించే ఈ ప్రపంచమంతా బ్రహ్మమే. అంటే, ఒకే సత్యాన్ని వివిధ రూపాల్లో మనం చూస్తూన్నా మన్నమాట. అలామనం చూడటానికి కారణమైంది మాయ. మనకు సత్యమైన జ్ఞానం కలిగిన తరువాత ఈ మాయ తొలగిపోతుంది అంతే. కంటికి కనపడే సృష్టిలోని ఆకారాలన్నీ మాయమై సత్యం ఒక్కటే కనబడుతుంది. బ్రహ్మజ్ఞానులకు కలిగే దర్శిన మిదే.

మాయఅనేది వున్నదా? లేదా? అంటే సమాధానం చెప్పలేము. ఒకవిధంగా దాన్ని సున్నాతో పోల్చవచ్చు. సున్నాకి విలువున్నదా అని అడిగితే, వున్నది. లేదు. అని సమాధానం చెప్పాలి. తప్పదు. ఊరికే సున్నా పెడితే దానికి విలువ లేదు. దానికి ముందు ఒక అంకె చేరిస్తేదాని కెంతో విలువ. మాయ కూడా ఇంచుమించు సున్నాలాంటిదే.

ఆ సమాధానం తులయేవ్‌ను ముగ్ధుణ్ణి చేసింది. ''సున్నాలాగా'' అనీ ''యిప్పు డర్థమై''ందనీ, మళ్ళీ ''సున్నాలాగా'' అనీ వారు లోలోపలే గొణుక్కోవటం వినబడింది.

తులయేవ్‌ అలా అనటం విని స్వామివారు మందహాసం చేశారు.

డాక్టర్‌ తులయేవ్‌: నాకిప్పుడు తృప్తిగా వుంది. అద్వైత మంటే యేమిటో తెలిసింది స్వామీ. మీకు ధన్యవాదాలు.

డాక్టర్‌ తులయేవ్‌ కింకా యేదో అడగాలనుంది. కాని ఎందుకో ఆజ్ఞాయించారు. ''మీఫోటో తీయటానికనుమతించండి'' అంటూ స్వామి వారిని నీడ లోంచి బయటికి రమ్మనటం ఎలాగో తెలియక తడబడుతొంటే, గ్రహించి స్వామివారే వెలుపలికి వచ్చారు. తులయేవ్‌ ఫోటో తీశారు.

స్వామివా రొక పండిచ్చి, తులయేవ్‌ను ఆశ్వీరదించి, వీడ్కోలు చెప్పారు.

వెనుతిరిగి వస్తూ తులయేవ్‌ ''స్వామివారు నిజమైన యతి. నిరాడంబరంగా, పల్లెపట్టుల్లో, పల్లెప్రజల మధ్య జీవిస్తున్న సమున్నత వేదాంత మూర్తి అలాంటి వేదాంతులే మనమడిగే ప్రశ్నలకు సూటిగా, తీరైన సమాధానం చెప్పగలరు. నా జీవితంలో ఇది పుణ్యదినం. వారిని కలసి మాట్లాడే భాగ్యం కలిగింది'' అన్నారు.

Kathakanchiki    Chapters    Last Page