Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

దక్షిణమును చూచెడి రాజులు

సాధారణముగా ఆలయములలోని మూలవిగ్రహములు ప్రాగ్దిశాభిముఖములై యుండును. శివాలయములుగానీ, విష్ణ్వాలయములుగానీ - అనేకము లీ తరగతిలోనివే. కొలది ఆలయములలో మాత్రము స్వామి పశ్చిమాభిముఖుడై యుండును. ఇట్టి సన్నిధులున్న చోట కనీసము గోపురములైనను ప్రాగ్దిశాభిముఖములుగ కట్టుదురు. మైలాపూరులోని కపాలీశ్వరుని గుడి ఇట్టిదే. కాంచీపురమునందలి దైవరాజపెరుమాళ్లు - వరదరాజ పెరుమాళ్ళ సన్నిధియు నిట్టిదే. పెరుమాళ్లు పశ్చిమదిశను చూచుచుండును. గోపురము తూర్పుదిశలో మహోన్నతముగా కట్టబడినది.

సాధారణముగా జనుల పరిభాషలో స్వామి యనగా భగవానుడని యర్థము. కానివైష్ణవ సంప్రదాయముస్వామి శబ్దము పూజ్యులగు పెద్దలనుగూర్చి చెప్పునప్పుడు మాత్రము వాడుకచేయుదురు. వారు దేవుని పెరుమాళ్లు అని వ్యవహరింతురు. స్మార్తులు వైష్ణవులను చూచినతోడనే పెరుమాళ్ళువచ్చినారని అందురు. వైష్ణవులు మరొకవైష్ణవుని రాకనుగూర్చి స్వామి వచ్చినారనియే చెప్పుదురు. వారు పెరుమాళ్ళను స్వామియని చెప్పరు. సకలవర్ణస్థులు స్వామియను పదమును సాధారణముగా భగవంతునకే వాడుదురు. ఇతరమతస్తులు బాహ్మణులలో కడుయోగ్యులును. పూజనీయులును అగువారిని స్వామి యని పిలుచుటయు కలదు. ఇట్లు ఒక్కొక్క పదమునకు లోకరీతిచే ఒక్కొక్క అర్థము, సంప్రదాయరీతిగా మరియొక అర్థము ఉండుట చూచియున్నాము.

ఒక్కొక్క సంప్రదాయమును అనుసరించి కొన్ని కొన్ని పరిభాష లేర్పడియున్నవి. రామానుజాచార్య సంప్రదాయమున ననేక పరిభాషలేర్పడినవి. శైవసిద్ధాంతము - శ్రీ కంఠుల శివాగమరీత్యా - వేళర్లు అని చెప్పబడు వర్గమునందు కొన్ని సంప్రదాయపు పలుకులున్నవి. వైష్ణవపరిభాషయు, శైవపరిభాషయు ఒకే విధముగా నున్నది. స్మార్తులకు పరిభాషయనునదిలేదు. శైవగ్రంథములను చూచినచో మనకు వైష్ణవపరిభాషకు అర్థము తెలియుచున్నది. వైష్ణవపరిభాషలో తిరుమంజనము చేయుట అనగా మెయ్‌అంజనము చేయుట యని చెప్పియున్నారు. మెయ్‌ అనగా తిరుమణి అంజనము. అనగా తైలాదులను పూయుట. కనులకు అంజనము వేయుట అనగా కాటుక పూసికొనుట. మెయ్‌ అంజనము అనగా - సత్యమునకు తైలాదులను పూయుట అని అర్థము. దీనినంతయు నేల చెప్పవచ్చితిననగా వైష్ణవపరిభాషలో స్వామియనిన మరొక వైష్ణవునే సూచించును. కాని నేను స్వామి, స్వామి యనునది లోకరీత్యా భగవంతుని సూచించుటకు.

సామాన్యముగా దేవాలయము లన్నిటిలో స్వామి తూర్పుదిశనో, పడమటిదిశనో చూచుచుండును. దక్షిణదిశను చూచెడివారు. ఇరువురే. వారిరువురును రాజులు. ఈ రాజు లిరువురు చిదంబరము నందును, శ్రీ రంగమునందును వెలసియున్నారు. ఒకరు నటరాజు, మఱియొకరు రంగరాజు. వీరు తూర్పు పడమరలవంక తిరిగియుండక - దక్షిణాభిముఖులై, కళాక్షేత్రమునకు చెందినవారై యున్నారు. రంగ మనగా నాట్యస్థలి. 'పూర్వరంగ ప్రసంగాయ నాటకీయస్య వస్తునః' అనునెడ (మాఘకావ్యము) రంగమనిన, నాట్యార్థము నర్తకులకు సభలో ఒకించుక ఉన్నతముగా నిర్మింపబడిన నాటకస్థలియని చెప్పబడినది. అట్టి రంగమందలి రాజుగానుండు నతడే రంగరాజు. మరియొకరు నటరాజు. నృత్యమాడెడి వారికిరాజు.

తిరుపతిలోని స్వామికి రాజబిరుదములేదు. వారిని ఊరక ఈశ్వరుడని పేరేచేర్చి వేంకటేశ్వరుడనియే చెప్పుదురు. మళయాళమున వెంటేశ్వరన్‌ అనుపేరు అధికము. తెనుగు దేశమునను వెంకటేశ్వరనామము బహుళముగా కలదు. కాని రాజశబ్దము మాత్రము ఈ ఇరువురకే:- రంగరాజు, నటరాజు.

శివాలయమునకు వెళ్ళిన మహాలింగము ప్రాగ్దిశాముఖమై యుండును. వారికి ఈశాన్యదిశలో నటరాజు దక్షిణాభిముఖుడై నాట్యభంగిమలో ఉత్థితపాదుడై యుండును. ఆయనను మన హృదయమున ధ్యానించి ధ్యానించి, కొంచెము కొంచెము తలచి తలచి ఆ ఆనంద తాండవమూర్తి స్వరూపము మనస్సున స్ఫురించునట్లు చేసికొనిన అదియే సిద్థియని అర్థము. మనకు మిగుల ప్రియులగు బిడ్డలనో బంధువులనో తలచినతోడనే వారిస్వరూపము మనస్సున పొడకట్టును. కాని వీరిని తలచి ఏమిప్రయోజనము? ఎన్నడో ఒకరోజు వీరందరు మనలను వదలి చనెడివారే. లేదా మనమైనా వారిని వదలి పోవలసినవారమే.

'వియోగే కో భేదః?' వియోగములో ఏమిభేదమున్నది? ఒకరి నొకరిని ఎంత ప్రేమించి, అభిమాన ముంచినను, ఆనందముగానున్నను - అంతకంతకు ఎవరో ఒకరు ఏడువవలసినదే. వియోగము కల్గియే తీరును. వియోగము లేనిస్థితి - స్వామియందలిస్థితి. అందు దుఃఖమునకు తావేలేదు. ఆ ఆనందమూర్తి మనోనేత్రములకు గోచరించినచో మనకు మంత్రసిద్ధి యయినదని అర్థము. దక్షిణాభిముఖమగు ఈ రాజద్వయము ఈ యిరువురయు రూపము మన మనోనేత్రములకు గోచరము కావలెను, దక్షిణాధీశుడు కాలుడు. కాలుని భయము మీ కక్కరలేదన్నట్టు భక్తుల కభయము ఒనగుచున్నాడా యన్నట్లు కుంచితపాదుడై నటరాజు ఆనందమను తాండవము చేయుచుండును. మఱియొకరాజు రంగరాజు. ఆనందసుషుప్తిలో మగ్నుడై యుండును. నృత్యము నందు, సుషుప్తి స్థితియందును ఆనందమే స్ఫురించును.

ఆనందము అధికమగుచో, నృత్యము చేయుదురా? నేను విన్నదేకాని చూచినదిలేదు. తెల్లదొరలకు కులాసా ఎక్కువ. అయినచో బాల్‌డాన్స్‌ చేయుదురట. ఎప్పుడును ఏడ్చెడి మనజాతికి అది తెలియదు. మనకు స్వాతంత్ర్యమూ లేదు, ఆనందమూలేదు. చూచినవారికెల్ల భయపడుచూ, కన్నులు లోనికిదించుకొనిపోయి, తిండిలేదే, పని దొరకలేదే, పనియున్నను వేతనాభివృద్ధి అనుస్వారముగా నున్నదే - అని సదాచింతలో మునిగినవాళ్ళము మనము. మనకు ఆనందమూ లేదు, ఆటలు అంతకుముందే లేవు.

తెల్లదొరలవలె మనము గంతులు వేయకపోయినను, కూనరాగములైనను తీయుదురు. మనకు ఎక్కువ ఉత్సాహము కలిగిన కాలములలో చేయు గానము. నృత్యము ఇవి ఆనందమునకు సంబంధించిన విషయములు.

ఆత్మజ్ఞానులు బ్రహ్మానుభవము కల్గినపుడు ఆనందముగా గానము చేయుదురు. సామగానము చేసినది ఆ సందర్భములందే 'హావు3' 'హావు3''హావు3' (ఏమీ యీ యాశ్చర్యము!) ఓహో ఏమి ఆశ్చర్యము! అని సామగానము చేసెడివారిని, బ్రహ్మవేత్తులని తైత్తిరీయమ చెప్పును. ఇద్దరు కలిసినపుడు మిగుల సంతోషముగానున్న యొకడు కూనరాగమును దీయును. ఏమి నాయనా! ఈ సంగీతము? అని ప్రశ్నను అతడు గమనించడు. అటులనే మనస్సునకు కొంచెము వ్యాకులత యేర్పడినవానిని పాడుమని యెంత నిర్బంధించినను అతడు పాడడు. కొంచెము సంతోషము, నెమ్మది యేర్పడినపుడు నిదురవచ్చును. ఇంకను కొంచెము సంతోష మధికమగుచో పాట మొదలగును. మరింత సంతోష మధికమగుచో నృత్యము మొదలు. లోకములోని కాంతి ఎటుల సూర్యుని నుండి కల్గుచున్నదో, అటులనే మనలో ఏ కొంచెమో ఆనందముండినను, అది ఆ ఆనందసముద్రములోని పయిపయిపొంగే. గదిలో ఎంత చీకటియున్నను ఒక సన్నని కన్నమునుండి వచ్చెడి సూర్యకిరణలేశము ఎట్లు గదిని ప్రకాశముగావించునో, అటులనే మనకెంత మనోవ్యాకులత, చింతయున్నను ఆనందమున యోగనిద్రాస్థితుడగు రంగరాజును, నర్తనానందమున వెలిగెడి నటరాజును స్మరించినచో మన దుఃఖములు, చింతలు పోయి మన హృదమయులును ఆనందముచే ప్రకాశించును.

నటనోద్ధతిలో రేగి ప్రక్కకు నిక్కపొడుచుకొనిన జటలతో నటరాజు నిలిచి యుండును. ఆయన హస్తమున నున్న ఝల్లరినుండి 'అయిఉణ్‌ ఋఇక్‌' అను పదునాలుగు సూత్రము లేర్పడినవి. పరమగతికి మార్గమగు పదునాలుగు శ్లోకముల నందికేశ్వరకారిక అందుండి పుట్టినదే. దానికి శాండిల్యుడు భాష్యమును వ్రాసెను. ఈ ఆనంద నృత్య శబ్దములు కల్గిన పుస్తకమును చేతిలో నుంచుకొని దక్షిణామూర్తి దక్షిణాభిముఖుడై ఈశ్వరాలయమునకు దక్షిణపార్శ్వమున కూరుచుండి యుండును. ఈయన జటలు, మండలముగా ఏర్పడి వ్రేలుచుండును.

నటరాజు ఆనందమూర్తి, దక్షిణామూర్తి జ్ఞానమూర్తి దక్షిణామూర్తి చూపెడిముద్రకు చిన్ముద్ర యని పేరు. ఆనందముపొంగి అణగునపుడు జ్ఞానపరిపూర్ణతయున్నచో అదియే శాంతము. జ్ఞాన పరిపూర్ణునికడ ఆనంద పరిపూర్ణతకూడ ఉండునని అర్థము. జ్ఞనానంద పరిపూర్ణుడగు దక్షిణామూర్తి సాన్నిధ్యమున ఆయనవలెనే కొందరు పెద్దలు కూర్చుండి కనులు మూసికొని - పంచాక్షరీ జప పరాయణులగుదురు. జపముచేయునది ఆనందతాండవమూర్తి, సన్నిధిలో కనులు తెఱచుచో ఎట్టెదుట ఆ మూర్తి దరిసెనము. కనులు మూసికొన్న అంతర్ముఖ జపము.

భిక్షాటనమూర్తి అధోన్ముఖముగా రెండు వ్రేళ్ళతో చూపెడి ముద్రను సయితము చిన్ముద్ర యనియే చెప్పెదరని తలచెదము. ఆయన చేతిలో రెండుకాళ్ళను పైకెత్తి నిలుచుండెడి బాలహరిణ మొకటి యుండును. ఇదిగో నీకు ఆహారము అన్నట్లు రెండు వ్రేళ్ళతో ఆయన కసవును చూపునట్లు కనపడును. రంగరాజు మాత్రము 'నిద్రాముద్రాం నిఖలజగతీ రక్షణ జాగరూకాం' అని నిద్రాముద్రలో నుండును. నిద్రయనునదొక అవస్థ. ఆ అవస్థలో అణగిన ఆనందమును నిద్రాముద్ర వెలిబుచ్చును. ఇట్లు అ నేక మూర్తులు. ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క విశేషము.

'దర్శనాత్‌ అభ్రసదసి' చిదంబరమున నటరాజు దర్శనీయమైన మూర్తి. ఆలంగుడి యను క్షేత్రమున దక్షిణామూర్తి ప్రసిద్ధి. తిరువారూరునందు త్యాగరాజ ప్రసిద్ధి. శ్రీరంగమందు రంగరాజ ప్రసిద్ధి. ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క క్షేత్రమునందు ప్రాధాన్యము.

ఇన్ని మూర్తు లెందుకు? ఒక్కమూర్తి యున్నచో చాలదా? మన మతముతక్క తక్కిన మతము లన్నియు ఒకే దేవుని గూర్చికదా చెప్పుచున్నది? అవి ఇంతమంది స్వాములను, ఇన్ని మార్గములను చెప్పుటలేదు. మనకును ఒక్కస్వామి చాలడా? అన్న సందేహము కలుగవచ్చును.

ఆకలి కొరకు మనము అన్నము తిందుము. కడుపు నిండుటకు మాత్రము వట్టి అన్నమును తినిన చాలును. నానా విధభక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాదులు అవసరము లేదు. కాని తినుట కడుపు నిండుటకేకాక రసనేంద్రియమునకు గూడ రుచికరముగ ఉండవలెనని అభిప్రాయము. రుచికరములును, కనులకు సొంపగు వస్తువులును నాలుక కోరును. ఒక్కొక్కరికి ఒక్కొక్క పదార్థముపై రుచి, 'లోకో భిన్నరుచిః' ఇట్లు దేవుడొకడైన భక్తులు తమకు ఇష్టమగుమూర్తిపై ప్రేమనుంచి ఏ మూర్తియందు తమ మనసు సులభముగా లయమగునో ఆ మూర్తిని విశేషప్రేమతో నుపాసింతురు. గీతయందు భగవంతుడు-

యోయో యాం యాం తనుం భక్త్యా

శ్రద్ధయార్చితు మిచ్ఛతి,

తస్య తస్యాచలాం శ్రద్ధాం

తామేవ విదధా మ్యహమ్‌||

లోకమున ఎవడెవడు ఏఏ మూర్తిని శ్రద్ధాభక్తులతో నర్చించుటకు ఇష్టపడునో వానిశ్రద్ధను బలపరచి నేను అచలముగా చేయుదును అని అనును.

లోకమున ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువుపై ఆశ. అదేకాక నేడు ఒక వస్తువుపై నున్న ఆశ రేపు ఉండదు. మరొక దానిపై మనసు పోవును. ఒకరోజు ప్రొద్దుపోక బజారులవెంట తిరుగుదమని యొకడు అనుకొనును. మరుసటిరోజు ఆ వ్యక్తికే సముద్రతీరమున షికారుచేయుటకు ఇచ్ఛ పుట్టును. అటులే భక్తులు తామర్చించు మూర్తులు 'ఈ విధముగానున్న బాగుగా నుండును, ఆ విధముగా నుండిన బాగుగా నుండును' అని అనేక విధముల కోరుదురు. ఇందుకొరకే మతాంతరములు వెలసినవి.

వైష్ణవులు పెరుమాళ్ళనే సేవించినప్పటికినీ అందులో కొందరికి కన్ననియందే మిన్నయగు ప్రేమ. మరియొకరికి రాముడు ఆదర్శమూర్తి. మరియొకరికి రుద్రస్వరూపుడును, భయంకరమూర్తియగు అగు నరసింహమూర్తిపై భక్తి. కొందరకు ఇట్లే పరమేశ్వరునియందు భక్తి, దక్షిణామూర్తి యందు భక్తి, అంబికయందు భక్తి, ఇటులు ఏమూర్తి యందు శీఘ్రముగా సులభముగా మనస్సుల యమగుచున్నదో ఆ రూపమును వారు కొలుతురు.

''యో యో యాం యాం తనుం భక్త్యా

శ్రద్ధయార్చితు మిచ్ఛతి''

ఇందు భగవానుడు 'ఇచ్ఛతి' యను పదప్రయోగమును చేసెను. 'ఏఏ మంగళస్వరూపములయందు భక్తుడు భక్తిశ్రద్ధలనుంచునో వాని శ్రద్ధను నేను అచలమొనరింతును అని యనును.

'సాంఖ్యయోగో వృథ గ్బాలాః ప్రవదంతి న పండితాః'

సాంఖ్యము వేరనియు, యోగము వేరనియు పండితుల అనుభూతిపరులు చెప్పడములేదు.

'ఏక మ ప్యాస్థితః నమ్య గుభయో ర్విందతే ఫలమ్‌'

ఏ ఒక్క దానిని చక్కగా నిర్వర్తించినను ఈ రెంటి నుండియు ఏ ఫలముకల్గునో, ఆ ఫలమే కల్గును.

'సాంఖ్యం యోగం పాంచరాత్రం వేదాః పాశుపతం'

అని ప్రాచీనకాలము నుండియు వచ్చుచున్న ప్రధాన మతములు అయిదు.

కొందరది సాంఖ్యమార్గము, మరికొందరది యోగ మార్గము, మరికొందరది పాంచరాత్రము. పాంచరాత్ర మనునదియే వైష్ణవమార్గము. పాశుపత మనునది శైవాగమమును అనుసరించునది. చర్య క్రియ యోగము జ్ఞానము ఇవి వీనికి చేరినవి. కొందరు పాశుపతమును అనుసరింతురు. వేదోక్తములగు యజ్ఞాది కర్మానుష్ఠానము చేయుచు, కర్మకాండము అనుసరించెడివారును కొందరున్నారు.

సాంఖ్యమునకు వేదము ప్రమాణము. అచేతనవస్తువులు, చేతనవస్తువులు అని విభజించి తెలిసికొనుటచేత మోక్షము కల్గును అని సాంఖ్యసిద్ధాంతము. (నిత్యానిత్యవస్తు వివేకము).

యోగ మనగా మనోవృత్తులను నియమించి విరోధించుట. ఈ ఐదుమార్గము లున్న- ఇవన్నియు భగవదాజ్ఞానుసారము ఏర్పడినవే యని తెలుసుకో - నాయనా! నీవే మార్గము నవలంబించినను తక్కిన మార్గములను యుక్తి చేత ఆక్షేపము చేయకుము. అని భగవానుడు ధర్మపుత్రునకు ఉపదేశము చేసెను.

ఈశ్వరుడు భూతగణములతో కైలాసమున నున్నపుడు అంబిక పుష్పదంతుని 'నీవు మనుజజన్మ నెత్తుదువుగాక'! యని శపించెనట. అతడు ప్రణామమొనర్చి శాపవిమోచనముగూర్చి ప్రార్థింపగా, 'నీకు మనుజజన్మ కలిగినను ఈశ్వరునిపై భక్తి మాత్రము మరుగుపడదు. అందుచే నీవు మరల ఈశ్వరుని యెడకు వచ్చెదవులే.' అని దేవి అనుగ్రహించెనట. అతడు మనుష్యుడుగా భూలోకమున పుట్టినపుడు శివమహిమ స్తోత్రమును వ్రాసెనని చెప్పుదురు.

వింధ్యకు ఉత్తరభాగమునను, పూనానగరమునకు ఉత్తరప్రాంతమునను శివమహిమస్త్నోత్రము తెలియనివారే యుండరు. అచ్చట అది అంత వ్యాప్తిలో నున్నది. గీతా శ్లోకమురీతినే భారతముననున్న శ్లోకమునకు సారమో యనదగు శ్లోకమొకటి యున్నది.

త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవ మితి

ప్రభిన్నే ప్రస్థానే పర మిద మదః పథ్య మితిచ.

రుచీనాం వైచిత్య్రా దృజు కుటిల నానాపథ జుషాం

నృణా మేకో గమ్య స్త్వ మసి పయసా మర్ణవ ఇవ.

వేదానుగమములగు వేద బ్రాహ్మణమతములను ఇందు పుష్పదంతుడు పేర్కొనును. త్రయీ అనగా వేదమతము. వేదము సాంఖ్యము పశుపతిమతము అని. 'ప్రభిన్నే ప్రస్థానే'్స పోయెడు మార్గములు అనేకములైనను అన్నియుపోయి చేరునదొక్కచోటే. ఒకే చోటునకు పోవుటకు నాలుగైదు మార్గములున్నట్లు ఉపాసనామార్గము లెన్నియున్ననుగమ్యస్థానమేమో యొక్కటే. 'పరమిదం అదః పథ్య మితి చ'్స మార్గము లెట్లు అనేకములో - ఆయా మార్గములలోనికి ఆహ్వానించెడి వారును అనేకులు. రైల్వేస్టేషనునందు రిక్షావాడు, గుర్రపు బండివాడు, టాక్సీడ్రైవరు తమ తమ వాహనాదుల ప్రాశస్త్యమును వర్ణించుచు, మన మూటలను లాగుకొందురు. మిషనరీలును ఈతరగతికి చెందినవారే. 'మా మతమే గొప్పదిచాలా అనుకూలమైనది. మా మతమున జేరుడు.' అని అందురు. మునుపు శివదీక్ష, వైష్ణవదీక్షలు ఇట్లు ఏర్పడినవే. ఏ మార్గమున పోయినను చేరున దొక్కచోటునకే. 'పర మిదం అదః పథ్య మితి చ' ్స పథ్యమనగా అనుకూల్యమని అర్థము. దేహమునకు అనుకూలించిన భోజ్యవస్తువులను పథ్యమందురు. ఈ మార్గములలోని కీడ్వబడిపోయెడువారును అనేకులు. 'రుచీనాం వైచిత్య్రా దృజు కుటిల నానాపథ జుషాం'- లోకులరుచులు ఏకరీతి నుండవు. అందుచేతనే తినెడు తిండియందును, కట్టెడు బట్టయందును ఇంత వైవిథ్యము. అందరికిని రుచి ఒక్కటే ఐనచో ఒకే విధమగుతిండి, ఒకే విధమగుబట్ట, ఒకటే ఆకారము, ఒకేదేవుని - నియమించుకొన వచ్చును. అది లేనికారణముననే - వివిధ ఆహారపదార్థములు, వివిధ వస్త్రసంచయములు, వివిధ ఆభరణములు, వివిధ అర్చనాస్వరూపము లేర్పడినవి.

బ్రహ్మసమాజము, ఆర్యసమాజము, థియాసఫీ, బౌద్ధము, గాంధీజము అని ఒక్కొక్క లక్ష్యమును ఆధారము చేసికొని ఒక్కొక్క మార్గము ఏర్పడినది. వ్యాధి వచ్చినచో ఔషధమును సేవింతుము. మూలతత్త్వము క్షీణించగా, పరదేశస్థులు మీ మతములోని లోపములు ఇవియని వేలెత్తి చూపినపుడు వారికి తృప్తికరముగా బదులు చెప్పవలెననెడు అభిమానముతో 'మా మతము ఆదిలో ఇట్లుండలేదు, ఇందులో ఇపుడు కలుపులు బయలు దేరినవి. వీనిని మేము నిర్మూలింతుము' అని కొందరు బయలు దేరుదురు. 'వేదోక్తమగు కర్మకాండ అనవసరము, మనకు ఉపనిషత్తులున్నచాలును. అదియే నిజమైన తత్త్వము.' అని రామమోహనరాయలు బ్రహ్మసమాజమును లేవదీసిరి. కర్మకాండయే ప్రధానము అని దయానందులు ఆర్యసమాజమును స్థాపించి, ఆలయములలోని ఆచేతనములగు ఈ శిలాస్వరూపములకు అర్చన పూజాదు లెందులకు అను ప్రశ్నకు ఆ కాలమున బదులు ఎట్లు చెప్పవలయునో తెలియలేదు. వెంటనే 'దేవుని పూజలకు విగ్రహాదులు అనవసరము. వీనిని మేమే నిర్మూలింతుము'అని కొందరు బయలుదేరిరి. ఇది ముస్లిముల సవాలును ఎదుర్కొని బదులుచెప్పలేక అటులెవ్వరు ఏది లోపమని చూపిరో, ఆయా లోపమును సంస్కరించుటకు మనవారు సమకట్టిరి, ఇట్లు ఆర్యసమాజ ముత్పన్నమాయెను క్రైస్తవుల పోటీ నెదుర్కొనుటను థియాసఫీ ఏర్పడెను. ఆ కాలమున వీరు మంచి కార్యము లనేకములు చేసిరి. వానిని మరవలేము.

రామకృష్ణపరరమహంస కాళికాలయమున కాళీ, కాళీయని కాళికాపూజ ప్రారంభించిరి. వారియందు భక్తి మహిమలు ఏర్పడిన కాలమున విగ్రహారాధన అవసరమే యని మరల ఒప్పుకొన నారంభించిరి. 'వీడు అప్పృశ్యుడు, వాడు అప్పృశ్యుడు' అని చెప్పుట సరికాదు. 'మన మతములో చెప్పినది, తక్కినదెల్లయు సరే' యని గాంధీ కాలమున తక్కినవారెల్లరు ఒప్పుకొన నారంభించిరి. వర్ణాశ్రమము శరీరమునకే యని మన మెల్లరము అనుకొనుచుంటిమి. ఆత్మ కూడ అది కలదని థియాసఫీవారు మరొక మెట్టునకుపోయి ఉపదేశింపనారంభించిరి.

వ్యాధి వచ్చునపుడెల్ల మందును వేయుదురు. గుణము కనుపించినతోడనే మందును నిలిపివేయుదుము. అటులనే మత విషయములలో సయితము ఏదో లోపములు కనుపించినపుడు తన్ని వారణార్థము ఒక్కొక్క తత్త్వము బయదుదేరి, ఆ లోపము నివారణ అయినంతనే, దానికొక సమాధానము లభించినంతనే ఆ తత్త్వము సయితము మాయమగును.

ఆయా కాలములయందు ఆయాయివారు అనేక కర్మానుష్ఠానములను బయటికి తెలియజేయుచుండెడివారు. వారును లోలోపల పాపములను రహస్యముగా చేయుచునే యుండిరి. అయినప్పటికీ వారి మనస్సాక్షియైనను, కొన్ని కొన్ని సమయములలో వారిని బాధించెడిది. ఇప్పుడు మనస్సాక్షి యనునదియే లేదు. పాపములు సయితము రహస్యముగా చేయడము లేదు. పాపకార్యము చేయుచున్నామే యనెడు మనశ్శంకయు, మహాబాధయులేదు. ఒక విధముగా ఆ కాలమున లోపల ఒకటియు, బయట మరొకటియుగా అపచారము చేయుచున్నను ఇప్పుడు అదియును లేదు. అనాచారములు పరోక్షముగా గాక ప్రకాశముగనే జరుగుచున్నవి. రహస్య మనునది లేదు. ఐనప్పటికినీ భక్తిశ్రద్ధలు వృద్ధియగుచున్నవనియే చెప్పవలెను. అది అటులుండనిండు.

ఇట్లు భారతోక్తములగు ఐదు మతములను 'యో యో యాం యాం తమం భక్త్యా' అను గీతాశ్లోకమును అనుసరించిన పుష్పదంతుని శివమహిమ స్తోత్రశ్లోకమును ఒక్క విషయమునే ప్రస్తావించుచున్నది. గీతాశ్లోకమందలి 'ఇచ్ఛతి' అనెడు పదమునకు 'రుచీనాం వై చిత్ర్యాత్‌' అని పుష్పదంతుని వివరణము: ఋజు, కుటిల నానాపథగాములయినను 'నృణాం ఏకో గమ్యః' అందరును భగవంతునికడకే వెళ్లుచున్నారు. ఐననూ అందరూ భగవంతునికడకే వెళ్లచున్నారని చెప్పుట ఎట్లు? 'దానిని గూర్చి నీకు విచారమక్కరలేదు. ఏదో ఒక మార్గమును త్రొక్కి పురోగమించుచునే యుండును. మార్గమధ్యమున మాత్రము నిలిచిపోకుము. గమ్యస్థానము తానుగ వచ్చును' అని సమాధానము.

మన మొకచోటునుండి బయలుదేరి ఏ దిశకు వెళ్ళినను పోయి చేరునది సముద్రము. భూమి నలుదెసలనూ సముద్రము చుట్టియున్నది. 'త్వ మసి పయసా మర్ణవ ఇవ' నీవే నాలుగు దెసలను సముద్రమువలె వ్యాపించియున్నావు' అని అనుట ఇందులకే.

నది ఎటుప్రవహించినను సముద్రములో కలియవలెనునట్టి సముద్రమే నాలుగు దెసలనూ ఆవరించియున్నది. ఇక కృపా సముద్రపుమాట ఏమిటి? మన మేమార్గమున వెళ్ళినను మనముపోయి చేరుచోటున అది ఉండకపోవునా? మన మేవంకకు వెళ్ళినను మనరాకకై ఆయన నిరీక్షించుచునేయుండును. 'నీ రుచికి తగిన మార్గములో వెళ్లు! మధ్యలో ఆగకు! నీవు వెపుడు వచ్చిచేరుదువు? అని నిరీక్షించెడి వాడొకడున్నాడు. ఆ కృపాసముద్రము నాలుగుదెసలనూ వలయితమయియున్నది. శ్రద్ధలో లోపించక - ఆరంభించిన కార్యమును మధ్యలో వదలక - ప్రయత్నించునే యుండును. ఇన్ని మార్గము లున్నవే యనిన, యాత్రికులు పెక్కుమంది, వారిరుచులు విచిత్రములు. (అనేక విధములు.)

యత్‌ సాంఖ్యైః ప్రాప్యతేస్థానం తత్‌ యోగై రపి గమ్యతే,

ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి న పశ్యతి||

అను గీతాశ్లోకభావమే శివమహిమస్తోత్రములోని శ్లోకమందును కలదు.

ఒక్కొక్కనికి ఒక్కొక్క మూర్తియందు భక్తి ఉదయించును. అందుచేత అతడు ఆ ఉపాసనామూర్తిని శ్రేష్టుడని భావించును. వానినేల ద్వేషించుట? వైష్ణవుడు ఈశ్వరుని నిందించుట అటుండనీ - ఎవరో ఒక వైష్ణవుడు రంగనాథుని గూర్చి పాడుచుండగా ఆయనను తిరుపతి పెరుమాళ్ళపై నొక కీర్తనను పాడుమన్నారట. 'రంగనై పాడియ వాయాల్‌ అంద కురంగనై పాడువెనో?' యని బదులిడెనట. కురంగు అనిని అరవమున కోతి అని అర్థము. తిరుపతిలో కోతులధికము. అందుచే - ఆయన 'రంగడినిపాడిన నోటితో ఆ కోతినిగూర్చి పాడుదునా?' యని తిరుపతి వేంకటేశ్వరుని ఒకకోతి క్రింద జమకట్టెనట. ఇట్లు కొందరు చెప్పుదురు. కాని వైష్ణవులు శివునిపై కోపగించుకొన్నను, శైవులు విష్ణువుపై కోపగించుకొన్నను వారి కోపము వారి ఉపాసనామూర్తుల యందలి భక్త్యాధిక్యమునే చాటును. 'న హి నిండా' అది నిందించినట్లు కాదని యర్థము. వీరు తమ దైవమతముల గూర్చి చేసెడు స్తోత్రమును ఇతర దైవతముల గూర్చి చేసెడు నిందయు అన్నియూ ఒకటే యగుచున్నది. అందుచే ఎవరికి ఏ ఏ రూపములందు మనసు లయమగునో ఆఆ స్వరూపములను ఉపాసించి సద్గతిని పొందచ్చును. అనుటకే వేదమూలము ననుసరించి ఇన్ని రూపములు, ఇన్ని మార్గములు ఏర్పడుట.

కాలబద్ధులమైన మనము, కాలవిజయమునకు దక్షిణాభిముఖులైన మూర్తులను ధ్యానించవలెను. ఒకరు జ్ఞానమూర్తి ఒకరు ఆనందమూర్తి, ఇంకొకరు యోగనిద్రామూర్తి. ఇందులో ఏ మూర్తినైనా ఉపాసనచేసి ధ్యానించి, స్మరించి ఆ మూర్తిని చిత్తము నావహించునట్లు ప్రకాశమగునట్లు చేసిన మరణనివృత్తియగును. మరణభయము వీడును. ఇట్టి తత్త్వమును బట్టియే ఆలయములు, ఆలయములలోని మూర్తులు ఏర్పడినవి. తత్త్వము తెలిసిననే సత్యము గోచరించును.

వైష్ణవులైనను, శైవులైనను, మాధ్యులైనను వేదము ప్రమాణముగా అంగీకరించువారి కందరకును భస్మథారణ కలదు. పాంచరాత్రదీక్షయందును హోమభస్మధారణ కలదు. భస్మమును ధరించునపుడు చాలామంది ఒక మంత్రమును చెప్పుదురు. దానికి త్య్రంబకమంత్రమని పేరు. జలసంబంధము ఉచ్ఛరింతురు. సుగంధము, శ్రేయస్సు, పుష్టి, కల్యాణగుణములన్నియునుండిన యొకనికి త్ర్యంబకుడనిపేరు. అతడే ఈశ్వరుడు.

త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్‌|

ఉర్వారుక మివ బంధనాత్‌ మృత్యోర్మృక్షీ యమామృతాత్‌||

అనునదియే ఆ మంత్రము.

అతడు మనకేమి ఇచ్చును? అమృతమును, మరణ రాహిత్యమును ఇచ్చును. ఇపుడు పుట్టినాము గనుక - ఇక పుట్టుక లేని స్థితినిచ్చి మృత్యువశముగాకుండ, ఆనందమునుండునట్లు చేసెడి మహాదేవుని మంగళచరణములలో ఆత్మలయమగునట్లు చేయవలెను.

ఈశ్వరుడు తక్క, తక్కినదెల్లయు మృతమే. మృతమనగా చచ్చునది యని అర్థము. మరణము మరుజన్మకు బీజ కారణము. మరుజన్మలేక - మరగిపోవుటకు -అమృతమని పేరు. అమృతముగ నుండునదొక్క దైవమే. మృతులమగు మనకు అమృతస్థితి నీయగల శక్తి ఆయనకు కలదు. ఇట్టి అర్థము స్ఫురించునట్లు చేసికొని త్ర్యంబకమంత్రము నుచ్చరించుచు భస్మధారణ చేయనగును.

అన్ని వస్తువులు దగ్ధముకాగా శేషించునది భస్మము. ఎరుపు, పసుపు, నలుపు మొదలగు వర్ణములన్నియు పోయిన పిదప మిగులునది ఏదియో అదియే తెలుపు. అదియే భస్మము. భస్మమును మరల అగ్నిలోవేసిన మిగులునది మరి భస్మమే. ప్రపపంచమంతయు నాశనముకాగా మిగులునది అదియే. అందుచే త్ర్యంబకుని ధ్యానించి భస్మధారణ చేయుదురు.

మూడు మూర్తులును మోక్షము నిచ్చినను మూడు కన్నుల ప్రభువు ముక్కంటి యిచ్చెడు మోక్ష మది యొక దినుసు. అది ఈ వేదమంత్రమునందే చెప్పబడియున్నది.

దుఃఖించుచు మనము చనిపోయిన, మరల దుఃఖించెడి జన్మయే కల్గును. ఆనందముగా సంతోషముగా ప్రాణత్యాగము కావించుచో అట్టిస్థితికి అమృతమని పేరు. మృతముకాకా అమృతము నొసగునది ముక్కంటి. రంగనాథుడైనను మూడు కన్నులవాడైనను ఇచ్చెడి మోక్షము ఒకతెరగే.

మోక్షము, మోక్షము - అననేమి? మోక్ష మను పదము 'మఞ్చ' ధాతుభవము. దీనికి ముంచతి, ముంచతే ఇత్యాది పరిణామము. మోక్షమనగా విడివడుట. తగులుకొన్నవాడు తగులుబాటులోనుండి తప్పించుకొనుటయే మోక్షము. మనకున్న బంధములనుండి విడివడుటయే మోక్షము. తమిళ వ్యాకరణరీత్యా మోక్షమునకు గృహమని అర్థము. చెఱనుండి యొకనిని విడుదలచేసిన అతడు తన స్వగృహమునకు వచ్చి చేరును. విడుదల అయినతోడనే వచ్చిచేరునది గృహము. సంసార బంధములనుండి విడుదల కాగానే మనము మన స్వగృహములకు వెళ్ళి చేరవలెను.

మనము తలచినది తలచినట్టు చేయజాకుండ జేయునది సంసారబంధము బంధింపబడినవానికి స్వేచ్ఛ కొరత. మన మందరము బద్ధులమే. ఎదుటివారు ఎదురుచూచెడి తెరగు మనము నడచుకొన లేకున్నాము. అది అటుంచి మనము మన మనసు చెప్పినటులయినను నడచుకొన లేకున్నాము ఎవరో మనలను గట్టి త్రాళ్ళచే కట్టినట్లు తోచును. అల్లరి ఎక్కువగా చేయు పిల్లలను మనము కట్టివేయుదుము. వారు తమకు తెలియకయే తమకును ఊరివారికిని బందిలిదొడ్లకు తోలుదుము. లేనిచో చెట్టునకు కట్టివేయుదుము. వారికిని మనకును ఉపద్రవము లేదని నిశ్చయము కలిగిన పిదప వాని కట్లను వదలింతుము. మన బంధములు మనకెపుడు తొలగును? మనస్సు పక్వమగునపుడు, ఎంతదుఃఖము, ఎంత విచారము కల్గినను కామక్రోధముల వశము కాకుండ నిరంతరానందస్థితిలో నుండెడి పక్వస్థితి ఎపుడు కల్గునో అప్పుడే మన బంధములు వీడినవని అర్థము. ఇట్లు విడువటమే మోక్షము.

జగత్తున ఎన్నో రకములగు వృక్షములున్నవి. వాని కాయలు పులుపు, చేదు, వగరుగానున్నపుడు వృక్షమునుండి అవి విడివడవు. కాని పక్వస్థితికివచ్చి, మధురములైనపుడు ఆ వృక్షమే తాను చాలా రోజులు భరించలేనని తన సంతానమునకు చెప్పినచందముగా వానిని తానే తొలగించుచున్నది. మొదట మొదట పలురకముల రుచులతో కూడియున్నను కడపటిదశలో ఆ కాయలు మధురము లగును. అటులే జనులు సయితము మొదట కామక్రోధద్వేషాదులు కల్గియున్నను పక్వస్థితికి వచ్చినపిదప నిస్పృహులై సదా ఆనందముగా కరుణతో ఉండెడి సెలవును పొందెదరు. కాయలు పులుపు, చేదు, వగరుతో నున్నపుడు చెట్టును అంటిపెట్టుకొనియే యుండును. అటులే క్రోధాదులన్నంతవరకు మనకు సంసారవృక్షమునుండి విమోచనములేదు. బద్ధులమైయే యుందుము. పక్వస్థితిలో అరిషడ్వర్గము అడగి ఆనందనిలయుల మైనపుడు ఆత్మ తానుగ సంసారవృక్షమునుండి విడిపోవును. అదియే మోక్షము.

పచ్చికాయ వగరు. పండినపుడు తీపి, మనమును ఇటులే, భగవానుడు అందుచేతనే 'తస్మాత్‌ యుద్ధ్యస్వ భారత' - అని అనుట. మనము తప్పుత్రోవను చనక ధర్మపథగాములము కావలెను. అపుడే వృక్షమున పిందె క్రమాభివృద్ధినొంది పండుటకు అప్పదమగును.

పండినపండ్లు అన్నియు పతనము చెందును. పతనము చెందుట యొక మోక్షమా? ఇదేటి మోక్షము? అని అర్జునునకు దోచెను. అర్జునునిసారథి పార్థసారథి ఆ సంశయనివారణచేయును. 'సంసారవృక్షము అన్ని వృక్షములవలె కాదు. అది ఊర్థ్వమూలమును, అధశ్శాఖమును, వ్రేళ్ళు పైన, శాఖలు క్రింద ఉండెడి అశ్వత్థవృక్ష మది. ఇందు పతనమనగా పైకి వెళ్లుటయే.'

ఉన్నచోటు వదలి వేరొక చోటునకు పోవు టెందులకు? స్వామి యిచ్చట తేడా? 'అంత ర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణః స్థితః' ఆయన బహిరంతరముల లోపలా, వెలుపలా, క్రిందా, పైనా అంతటా కలడని వేదవాక్కు.

ఉర్వారుక మనగా దోసకాయ. జన్మాష్టమికిని, వినాయకచతుర్థికిని - ఇవి అధికముగా దొరకను. ఉర్వారుక పండినచో ఏశ్రమలేక అనాయాసముగా తొడిమనుండి తొలగి తీవ ప్రక్కనే పడియుండును. అది ఉన్న ఎడము సయితము తెలియదు. గాలి బలముగా వీచి, తీగలు కదలాడినపుడు మాత్రము కన్నులకు తెలియును. ఇట్టి సులభమోక్షము, ఉన్నచోటనే లభ్యమగు మోక్షము- 'ఉర్వారుక' మోక్షము కావలెననియే వేదమంత్రమందలి ప్రార్థన.

అందుచే మనము మోక్షమును వెదకికొనుచు పోకుందుముగాక! మోక్షము మనమున్న చోటుననే కలదు. సంసారము మనలను వదలిపోవలెను. దాని వలన దుఃఖము, చింత మనల నంటకూడదు. అదియే నిజమైన విడుదల. దీని నెవరిత్తురు? మూడుకన్నుల తండ్రియే యీవలెను. అతడిచ్చు మోక్షమే నిజమగు మోక్షము. అందేచేతనే భస్మధారణ చేయునపుడు 'ఇట్టి మోక్షమును ప్రసాదించు తండ్రీ!' యని త్ర్యంబకుని ప్రార్థించుచు ధారణచేయుట.

పశువులవలె, మృగములవలె మనము మరణించిన యెడల నీమతమున నున్నందుల కేమిప్రయోజనము? దుఃఖముతో నసువుల బాసిన దుఃఖభాజనమగు పునర్జన్మ సిద్ధముగా నుండును. అందుచే అవసానకాలమున ప్రయాణ సమయమున ఆ ముక్కంటి స్వరూపమును హృదయస్థముచేసి ఆనందముగా కళేబరమును వదలవలెను. చిత్రములను వ్రాసెడువారికి మోక్షము సులభసాధ్యమనుట ఇందులకే. వారిమనసు వారి చిత్రములయందు లయించును. చిత్తముయొక్క స్వభావమే చాంచల్యము. అది లయించి, యొకచోట నిలుకడ చెందవలెనన్న ఈశ్వరకటాక్ష ముండవలెను.

అతని అనుగ్రహమే ఇన్ని రూపములు, ఇన్ని లీలలు, తత్త్వవేత్తలకు ఏభేదమునూ గోచరించదు. నటరాజు నాట్యమగ్నుడు. రంగరాజు యోగముద్రాస్థితుడు. దక్షిణామూర్తి జ్ఞానయోగారూఢుడు. లోకమే వాస్తవముగా వీరి లీల.

మాయా హ్యేషా మయా సృష్టా య న్మాం పశ్యసి నారద|

సర్వభూతగుణౖ ర్యుక్తం నైవం మాం జ్ఞాతు మర్హసి||

'నన్ను నీవు చూచుచున్నావే ఇదియే మాయ. ఎల్లలేనివాడు నీ కనులకు కట్టునట్టు రూపమును దాల్చుటయే మాయ యని తెలుసుకో. నా మాయాచేతనే నిన్ను అనుగ్రహించుటకై యీ రూపు దాల్చితిని.' అని కృష్ణపరమాత్మ అనును.

దక్షిణమును చూచెడి దైవతములు మువ్వురు. మన జన్మనివృత్తి కొఱకే వారు దక్షిణాభిముఖులగుట. వీరి అనుగ్రహ మున్నంతవరకు దక్షిణాధిపతి - తోకను ముడుచుకొని కూర్చుండును. అందుచే మనము వీరి శరణు చొరవలెను. వీరి స్వరూపములు స్మరణమాత్రమున హృదయదర్పణముల ప్రతిబింబితములు కావలెను. అందులకై నిత్యమును ధ్యానము చేయవలెను. వారి స్వరూపములు మన మనోవీధుల భాసిల్లుట మన యత్నముచే కాదు, వారి కటాక్షప్రాభవమే.

మనము వారల నెల్లయపుడు కొలుచుటచే మదిలోని మలము తొలగును. దాన వారి రూపు కనుగొను భాగ్యమబ్బును. వారి యనుగ్రహమున కాలజయము కలుగు శక్తి పొడమును. నాడు నాడును దక్షిణదిశ జూచెడి రాజుల యెట్టెదుట శరణాగతి చెందుట మన పని.


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page