సాధన గ్రంథ మండలి - 86
జగద్గురు బోధలు
ద్వితీయ సంపుటము
శ్రీ కంచికామకోటి జగద్గురు
శ్రీ చంద్ర శేఖరేంద్రసరస్వతీ శంకరాచార్యస్వామి
ఆంధ్రానువాదము :
''విశాఖ''
పరిశోధకులు :
శతావధానులు, శ్రీ వేలూరి శివరామశాస్త్రి
''ఆంధ్రప్రభ'' నుండి పునర్ముద్రితం.
ప్రకాశకులు :
సాధనగ్రంథమండలి, తెనాలి.
కాపీరైటు వెల రు. 25-00
యువ సం|| జ్యేష్ఠము
తృతీయ ముద్రణ
1995 జూన్
న్యూ విజయ ఆర్టు ప్రెస్, తెనాలి.
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆర్థిక సహాయముతో ఈ గ్రంథము ముద్రింప బడినది. వారికి మా మండలి తరపున కృతజ్ఞతాపూర్వక మా ధన్యవాదములు.
పీఠిక
''అజ్ఞాతం బ్రహ్మతత్త్వం నిజహృదయదరీ లీనమాత్ర ప్రకాశం
వ్యక్తీకర్తుం స్వనిత్యాక్షరవిదితమహా మాతృకాత్వం ప్రపన్నః
త్వం దివ్యామ్నాయవిద్యా సువిదితమహిమా నంతశక్తిప్రకాశ
స్తత్వద్వర్ణాత్మభేదై రుపదిశసి పరం శ్రీగురో స్వస్వరూపమ్.''
ఏ విద్యకైనా గురువు అవసరం. ఇక ఆధ్యాత్మిక విషయం చెప్పనక్కరలేదు. ఎన్నో జన్మలలో చేసుకొన్నఫలమే గురులాభం. ఆ గరువునకు లక్షణములు 'శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం' అని ఉపనిషత్తు చెప్పినది. సద్గురువు ఎట్లు దుర్లభుడో, సచ్ఛిష్యుడున్నూ అట్లే అరుదు, శిష్యునికి గురువుపట్ల అఖండమైన విశ్వాసం ఉండాలి. భక్తీ, ప్రేమా ఉండాలి. 'ఈశ్వరో గురు రాత్మేతి' ఈ మూడింటికినీ భేదము లేదు అన్నభావం ఓతప్రోతంగా ఉండాలి.
సాధకుడికి గురుభక్తి వృద్ధికానుకాను సాధన సులభ##మైపోతుంది. సాధకుని వ్యక్తిత్వం క్షీణం కానుకాను గురువు యొక్క ప్రతిభ అతనిలోను సుస్థిరంగా దీపిస్తూ రాజమార్గాలలో ఉద్దిష్టలక్ష్యానికి అతనిని తీసికొని వెళ్ళుతుంటుంది. ఒక్కటే నిబంధన, గురువు ఎడ అనన్యశరణ్యం. అఖండవిశ్వాసం. ఎన్నడైతే శిష్యుడు తన్ను పూర్తిగా గురువునకు నివేదించుకొన్నాడో, ఆనాటినుండీ అతని భారం గురువుది. 'గురుదేవో మహేశ్వరః' గురుచరణములకడ పూర్ణంగా స్వాత్మార్పణ చేసుకొన్న శిష్యుడిని దైవబలం అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది. తమ లేఖలలో ఈ విషయాన్ని వివేకానందులవారు చర్వితచర్వణంగా తడివేవారు.
ఉద్యోగ వ్యాపారాలలో చిక్కుకొన్న మనకు తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి వ్యవధికానీ, అవకాశంకానీ ఉండదు. కానీ సంసారంలో అనుదినమూ ఎదుర్కొనే కష్టాలకూ, పరిష్కరించవలసిన సమస్యలకూ, కలిగే ధర్మసందేహాలకూ మనకొక సలహాదారుడు అవసరం. సాధన ముదిరే కొద్దీ భగవత్కృపచేత మనకు మార్గం గోచరిస్తూనే ఉంటుంది. ఆమాత్రం సదుపాయం కలుగడానికీ గురువు అవసరం. ఈ కాలపు జీవనవిధానంలో అన్ని వేళలా గురుసమక్షంలో ఉండటం జరుగనిపని. మనం ఎవరిని గురువుగా ఎన్నుకొంటామో వారి వాక్యాలే మనకు గురుస్వరూపం. ఆ గురుబోధలను మననం చేయడం, ఆచరించడం గురుసమక్షం, అందుచేత ఎన్ని మైళ్ళ దూరంలోఉన్నా గురుసమక్షం. గురుస్వరూపం మన కందరికీ అందుబాటులోనే ఉంటుంది.
'ఏకంసద్విప్రా బహుధావదన్తి' సత్యమేమోఒక్కటే. దానిని బహువిధములుగా వర్ణించి ఉండవచ్చును. అట్లే మహాత్ములందరూ ఒకే సత్యాన్ని బోధించినారు. మతాలెన్నో ఉన్నా అవి బోధించిన సత్యమేమో ఒక్కటే. మన అజ్ఞానం కొద్దీ మన దృష్టులు వెవ్వేరుగా ఉన్నాయి. ఏ కాన్ని అనేక మనుకొని మనం భయపడుతున్నాం. దీనికి కారణమేమి? 'రుచీనాం వైచిత్రాత్' అని పుష్పదంతుడు. మన రుచులు, ఋజుకుటిల నానాపథగాములై పోతున్నవి. ఇన్ని అర్చామూర్తులూ, ఇన్ని మతాలూ, ఇన్ని మతాచార్యులూ అందుచేతనే ఏర్పడ్డారు. అద్వైతులమైతే మనకేబాధాలేదు. వీరందరమూ మనమే ఐతిమి !
రామకృష్ణపరమహంసలవారన్నారు. అందరూసర్కారు వారి దండోరానే పాటిస్తారని, సర్కారువారి దండోరావెనుక రాజుగారి హుకుం ఉన్నది. అది రాజశాసనం. దానికి తిరుగు లేదు. దానిలో నిజాయితీ ఉన్నది. దానిలో పటిమ ఉన్నది. అట్లే ఆధ్యాత్మిక విషయాలలో మనం జాగరూకతతో ఉండాలి. ఒక్క ఆదేశ##మేకాక ఆచరణకూడా ఎవరు చేస్తున్నారో వారే మనకు మాన్యులు.
'యద్య దాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః,
స యత్ర్పమాణం కురుతేలోక స్తదనువర్తతే.'
శ్రీ మచ్ఛంకర భగవత్పాదుల అడుగుజాడలలో నడిచే పరివ్రాజక శిరోమణులూ, మఠాధిపతులూ ఐన స్వామివారు:
మౌనే మౌనీ గుణిని గుణవాన్ పండితే పండితశ్చ
దీనే దీనః సుఖిని సుఖవాన్ భోగిని ప్రాప్తభోగః,
మూర్ఖే మూర్ఱో యువతిషు యువా వాగ్మిని ప్రౌఢవాగ్మీ
ధన్యః కోపి త్రిభువనజయీ యో7వధూతే7వధూతః |
వారి బోధలలో ఏ ఒక్కటైనా మనం చిత్తశుద్ధితో ఆచరించగల్గితే, అది వారికి సంతోషపాత్రమవటమేకాక మన జీవన పథములు ఉజ్జ్వలంగా వెలుగుతవనుటకు సందేహం లేదు.
శంకర భగవత్‌పాదులు
సాక్షాత్ పరమేశ్వరుడే వేదమత పునరుద్ధరణకై వ్యాసుల వారి తరువాత శంకరుడుగా అవతరించెను. వీరే ఆదిశంకరులు. వ్యాసులు నారాయణస్వరూప మగునెడల శంకరు లీశ్వర స్వరూపము. అతడు తల్లికి ఏకైకపుత్రుడు. పుట్టినందులకు ఋణము తీర్పవలయునని తలచు కొడుకు తల్లికి సేవచేయును' తద్ద్వారా దేశమునకును సేవచేయును. ఆచార్యులవారితల్లి ఒకనాడు బలముడిగి ఉస్సురస్సురు మనుచు నిత్యమును చేయు స్నానమును చేయజాలకపోయెను. అపుడు శంకరులు ఏటి జాలునే త్రిప్పి తమయింటివంకకు చేరి పాఱునటులు చేసిరట. అంతట తల్లి ఆయేటినీట మునుకలాడగలిగెను. శంకరులును స్నానము చేయు నదిలోనికి దిగీదిగడముతో మొసలియొకటి వారి పాదములను పట్టుకొనెను. అప్పటికే శంకరుల తండ్రి గతించెను. ఆ తల్లి భర్తపోవుటేకాక కొడుకుగూడ పోనున్నాడే యని చాల వగచెను. చాలకాలమునుండి సన్న్యసింప గోరుచున్న శంకరులు తల్లినిజూచి - 'అమ్మా! మొసలినోటబడి నేను చనిపోయినయెడల నిది దుర్మరణమగును. నీకు పుత్త్రకృత్యము చేయువారుండరు. కాన నాకు ఆపత్ సన్న్యాసమునకు నీ వనుమతింపుము. అటులయినయెడల నాకుదుర్మరణము తప్పుటయకాక నీతోపాటు ఇరువదొక తరములవాటును తరింతురు' అని అనెను.
తల్లి ఏమి చెప్పగలదు? 'నీ యిష్ట మేదో కానీ' అని అనెను. అంత శంకరులు పై#్రషమంత్రమును ఉచ్చరించి సన్న్యాసి యాయెను. దుర్వాసుని శాపమున క్రకచమై యుండిన దేవత ఆక్షణముననే మొసలిరూపమును విడిచి కానరాకుండ బోయెనట!
ఎనిమిదేండ్ల ఆయుర్దాయముతో పుట్టిన శంకరులకు సన్న్యాసము పుచ్చుకొన్నందున మరల మరొక ఎనిమిదేండ్ల ఆయుర్దాయము ఒనగూడెను. గృహత్యాగము చేసి, సంచారార్థము ఆయన బయలుదేరెను. తల్లి దుఃఖించగా, శంకరులు తల్లిని ఇట్లు ఊరడించిరి.
బిక్షాప్రదా జనన్యః పితరో గురవః కుమారకా శ్శిష్యాః
ఏకాంతరమణ హేతుః శాంతి ర్వనితా విరక్తస్య||'
''తల్లీ! నేటి వరకు నేను నీకుమాత్రము తనయుడగా నుంటిని. ఇకమీదట నాకు బిక్షనిచ్చువారి కందరకును నేను తనయుడను. నాగురువులే నాకుతండ్రులు. నాశిష్యులే నాకు కుమారులు. ఏకాంతవాస కారణమున కల్గు శాంతియే నాకు వనిత.'' అని చెప్పి మరల 'అమ్మా! నేను ఇపుడు నిన్ను విడిచి వెళ్లుచున్నాను నీకు మృత్యువాసన్న మగునపుడు నీకడకు తప్పక వచ్చెదను.' అనిరి.
తల్లికడ సెలవుతీసికొని శంకరులు పరివ్రాజకులైరి. ఆపత్సన్న్యాసమున గురువుప్రణవముగాని, మహావాక్యముగాని ఉపదేశించ నవసరములేదు. పై#్రషమంత్రము మాత్రము చాలును. కాని ఆపదతొలగి అతడు బ్రతికినచో మంత్రోపదేశమును పొందవలెను. ఆచార్యులు పుట్టుకతో మహాపురుషులైనప్పటికిని ఆశ్రమ విధులను పాటించుటకై గురువును వెదుకసాగిరి. ఇందు శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు చెప్పిన సూక్తినే వారు పాటించిరి.
నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన,
వా నవాన్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి||
యది హ్యహం న వర్తేయం జాతు కర్మ ణ్యతంద్రితః,
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః||
''అర్జునా! నాకు మూడు లోకములలోను చేయవలసిన కర్తవ్య మేదియునులేదు. కాని, నేను కర్మచేయుచున్నాను. నేను కర్మచేయనిచో అందరును నన్నే అనుసరింతురు.''
అందుచే ప్రపంచమునకు ఆదర్శముగా శ్రీ శంకరులు గురువులను వెదకి ''గోవిందం పరమానందం మద్గురుం ప్రణతోస్మ్యహం'' అని ప్రణామము చేసిరి, వారు వ్రాసిన అమృతతుల్యమైన భజగోవిందస్తోత్రము గురుపరముగను, దైవపరముగను వెలయుచున్నది. ఉత్సవములలోకూడ సందడి ఎక్కువయిన 'గోవిందనామ సంకీర్తనం' అని పెద్దగా కంఠాన్ని పైకెత్తి ఘోషిస్తే, సందడి తానుగతగ్గి స్తబ్ధమవుతుంది. ప్రపంచములోని సమరసంకులమును - గోవింద గురూపదేశము గోవింద భక్తియు తగ్గించును.
అటుపై వ్యాసభగవానుల ఆజ్ఞపై ఆచార్యులవారు బ్రహ్మసూత్రములకు భాష్యమును వ్రాసిరి. బ్రహ్మసూత్రములనే భిక్షసూత్రములందురు. అనగా దీని పఠనార్హత సన్యాసులకే. శంకరులు కాశీక్షేత్రమందే వాసంచేస్తూ, దేశ##దేశాల నుండి వచ్చే పండితులలో తమ భాష్యమును వ్యాప్తము చేసినారు. వారిభాష్యము దేశములో బహుళవ్యాప్తమైనది. నేటికిని దానికి ఈడు లేకున్నది.
ఆదిశంకరులు మానవజాతికే యొక చిరతరమైన సేవ చేయదలచి ప్రపంచములో కష్టాన్ని, దుఃఖాన్ని ప్రతిఘటించుటకు సత్యజ్ఞానముకంటె తాను ఈయగల బహూకృతి వేరు లేదని నిశ్చయించిరి. అందుచే ప్రాపంచిక బాధానివారకములైన ఉపదేశములనే వారు చేసిరి. బాధ, దుఃఖము సర్వత్ర ఉండునది. వ్యక్తి, సమాజము, దేశము, ఏదియూ సంతోషముగా నుండుటలేదు. ఒక దుఃఖముపోయిన, వేరొక దుఃఖము వచ్చుచున్నది. మనోదేహములకు రెండిటికిన్నీ వ్యథలే. దీనికి ఏ చికిత్సలయినను తాత్కాలికములే. దుఃఖ మధికమయినపుడు జ్యోతిష్కునివద్దకు వెళ్ళితే అతడు మంచిరోజులు రానున్నవి అని చెప్పునుగాని, ప్రస్తుతపు వ్యథను తొలగించుకొనే ఉపాయము చెప్పడు. అందుచే పై పూతలచే ప్రయోజనము లేదు. వ్యాధియొక్క మూలకారణమును వెదకి నిర్మూలించవలెను. మన దుఃఖమునకు కారణమేమి? ఎందుకీ బాధ? దేహముండుటచేతనే బాధలు. ఈ దేహముతో మనస్సుకలసియున్నది. కనుక దేహము పోయినగాని దుఃఖముపోదు. ఐతే ఆత్మహత్య చేసికొనడమా? అది ఉన్నబాధకాక లేనిబాధ తెచ్చిపెట్టును. ఈ దేహము సంచిత కర్మకారణమున కల్గినది. ఆత్మహత్య దుష్కర్మ. అది మరొక జన్మకు కారణమగును. అప్పుడుగాని ఈదుష్కర్మ ఫలితము తొలగిపోదు. ఈ జన్మలో చేయు కర్మలే కలుగబోవు. జన్మయొక్క దేహధారణకు కారణములవుతవి. దుఃఖనాశనమునకు దేశనాశనము అవసరము. దేహనాశనమునకు కర్మనాశనము అవసరము. కర్మ నశించుటకు కర్మకారణములను నాశనము చేయవలెను. కర్మ కారకులు కామక్రోధాదులు, మనది కానిదానిపై కోరిక కల్గును. అది లభించిన పిదప దాని నితరులు లాగుకొన్నప్పుడు క్రోధము కల్గుతున్నది. అందుచే కర్మక్షయమునకు కామ క్రోధములు పోవలెను.
కామక్రోధములు బాహ్యవస్తు సంబంధమైనవి. ద్వేషముకాని, కోరికగాని మనవికాని ఇతరములగు వస్తువులపైన కామక్రోధములు పోవుటకు ద్వైతబుద్ధి పోవలెను. 'ఉన్నదంతయు ఒక్కటే.' అదియే ఉపనిషత్తులు చాటుసత్యము; మనమందరము ఒక్కటే అన్న సత్యమును గ్రహించిననేకాని ద్వైతబుద్ధిపోదు. బహిఃప్రపంచమున చూడబడు విస్తారవస్తు జాలము. నామరూపాదులు, సమస్తము ఆ పరమాత్మ యొక్క ఆకృతులే. ఆ పరమవస్తువు వివిధాకృతులతో కనిపించుచున్న దనువిషయమును గుర్తుంచుకొనవలెను. కార్యములు అనంతముగానున్ననూ కారణమొక్కటే. కారణము సత్యము. కార్యములు దాని ఆకృతులు, ఆకారణమే సత్యము. అదియే చిత్తు. వైవిధ్యమును చూడని జ్ఞాని సర్వదా సర్వతః ఏకత్వమునే దర్శిస్తూ మోహాగ్రస్తుడు కాడు.
తిరుమంత్రమున తిరుమూలర్ ఇట్లు వ్రాసిరి: ఏనుగు బొమ్మ కఱ్ఱతో చేయబడినది. ఆ బొమ్మతో ఆడుకొను బాలునికి అది ఏనుగే. కఱ్ఱకాదు. ఆ ఏనుగు ఏ వస్తువుతో చేయబడినదో ఆ వస్తువును అనగా కఱ్ణను బాలుని దృష్టినుండి మరుగుచేయును. కాని దానినిచేసిన వడ్రంగికి అంతయు కఱ్ఱయే; దానినతడు ఏనుగుగా చూడడు. అటులనే ప్రాపంచికులకు పంచ భూతాత్మకమగు ఈ ప్రపంచము తన నిజరూపమగు పరమాత్మ స్వరూపమును మరుగుచేయును. కాని జ్ఞానికి ప్రపంచము పరమాత్మగనే కనబడును. ఈదృష్టాంతమునే శంకులు ఈ క్రింది విధముగ చెప్పిరి.
దంతిని దారువికారే దారు తిరోభవతి సోపి తత్రైవ,
జగతి తధా పరమాత్మా పరమాత్మ న్యపిజగత్ తిరోధత్తే|
ఈ పరమ సత్యమును గ్రహించిన ద్వైతవైవిధ్య మంతయూ ఆ ఏకరూపుని ఆకృతులే అని గోచరించును. అపుడు మనకు ద్వైతబుద్ధి యుండదు. మనముకాక మరొకరు అపుడు మనకు కానరారు. కోరిక, ద్వేషము ఏదియును అప్పుడు లేదు. ఆశా ద్వేషము లెపుడు లేవో కర్మకారణమున్నూ నశించుచున్నది. కర్మలెపుడు కర్మఫలమున్నూ లేదు. కర్మ ఫలము లేనిచో దేహము; దేహసంబంధములైన దుఃఖములు ఏవియు లేవు. శంకరులు ప్రపంచమునకు చేసిన దుఃఖ నివారకమగు మహోపదేశము ఇదియే.
ఈ ఉపదేశమునకు వలసిన ఆచరణ దృష్టాంతమును కాశీవిశ్వనాథుడే కల్పించెను. శంకరు లొకరోజు గంగాస్నానముచేసి తిరిగి వచ్చుచుండిరి. మార్గమధ్యమున నొక ఛండాలుడు ఎదురయ్యెను. అతనితో నాలుగువేదముల రూపములో అన్నట్టు నాలుగు కుక్కలుండెను. శంకరులు అతనిని దానినుండి తొలగిపొమ్మనిరి. ఆ ఛండాల వేషధారి 'నీవు తొలగిపొమ్మనునది దేహమునా? ఆత్మనా?' అని ప్రశ్నించెను. ఈ ప్రశ్నను వినినతోడనే శంకరులు పృచ్ఛకుడు మహాజ్ఞాని అని గుర్తించి మనీషాపంచకమను ఐదు శ్లోకములను ఆశువుగా చెప్పెను. అందు కడపటి శ్లోకమిది.
యత్సౌఖ్యా-బుధి లేశ##లేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా ముని ర్నిర్వృతః,
యస్మి న్నిత్యముఖాంబుధౌ గలితధీ ర్బ్రహ్మైవన బ్రహ్మవిత్
యః కశ్చిత్ ససురేంద్రవందితపదో నూనం మనీషా మమ||
ఆనందమహాసముద్రపు బిందులేశ##మే ఇంద్రాదుల ఆనందము. ప్రశాంతచిత్తుడైన ముని, ఆ సౌఖ్యాంబుధియొక్క పరిపూర్ణతను ధ్యానించిన ఆ ఆనందమును పొందును. ఆనంద నిమగ్నుడగు ఆ యోగి తన అహంవృత్తిని పోగొట్టుకొని తాను బ్రహ్మవేత్తయే (బ్రహ్మను తెలిసికొన్నవాడు) కాక, తానుబ్రహ్మమే యని గుర్తించును. బ్రహ్మజ్ఞానము పొందిన యోగి లక్షణమిది. మనోదేహములకు చెందిన కష్టములను ఒక్క బ్రహ్మజ్ఞానమే తొలగించగలదు. అట్టి జ్ఞానులు నేటికిని ప్రపంచమున నున్నారనిన అది ఆదిశంకరుల బోధనా ఫతితమే. అట్టిస్థితిని మనము ఒక్క దాటున అందుకోలేము. ఇట్టి శ్లోకములను తరచు చదువుచూ, ఈ భావములకు అలవాటు పడి ఆచరణలోనికి తెచ్చితే, సంస్కారములు మెలమెల్లగా బలీయములై మనకు సిద్ధి తప్పక లభిస్తుంది.
|