Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

స్వామి అంటే?

వైకుంఠంలో స్వామిఉన్నాడు, హృదయంలో స్వామి ఉన్నాడు. గుడులలో స్వామిఉన్నాడు అని మన పెద్దలు బోధించారు. గుడిలో స్వామి ఉన్నాడన్న నమ్మకంచేతనే మనం గుడులకువెళ్ళి దైవానికి సాష్టాంగ నమస్కారం చెయ్యడం, హృదయదేశంలో ఈశ్వరుడు ఉన్నాడన్న ఉద్దేశ్యంచేతనే శివపూజ చేసేవారు. మొదట శివునికి హృదయంలో వుపచారం చేస్తారు. అటుపిమ్మట మూర్తిలో ఆవాహన చేసి పూజాదికాలు ప్రారంభిస్తారు. వైకుంఠంలో విష్ణువు వున్నాడన్న రీతిగనే కైలాసంలో పరమేశ్వరుడు ఉన్నాడని కూడా పెద్దలు అంటున్నారు. వైకుంఠం పరమపదం. 'తద్విష్ణోః పరమం పదం' అని వేదవాక్యం. చనిపోయినా రనేదానికి వైష్ణవపరిభాషలో పరమపదించారు అని అర్థం. వైకుంఠవాసునికి మరొకపేరు పురుషోత్తముడు అంటే ఉత్తముడైన పురుషుడు అని అర్థం. తేట తెలుగులో చెపితే - 'పెద్దమనిషి'. ద్రావిడభాషలోని పెరుమాళ్ళు అనే శబ్దానికి పెరుం ్స పెద్ద, ఆళ్స్‌ మనిషి అని అర్థం. మిగిలినవారందరూ దేవుణ్ణి స్వామి అని అంటే వైష్ణవులు స్వామిని పెరుమాళ్‌ అనియే అనడం గమనించతగ్గది. స్వామిశబ్దంలో స్వం - అనేదానికి సొత్తు అని అర్థం. స్వామ్సిసొత్తుకలవాడు. ఒడయుడు, అయితే స్వామికి ఉన్న సొత్తు ఏమిటి? మనమే నా స్వామి అంటే నేను ఆయన సొత్తు అని అర్థం. తెలుగులోని ఒడయడు అనే పదానికి తమిళములోని ఒడయర్‌ అనేపదానికి సామ్యం స్పష్టంగా కనపడుతూనే ఉంది. నాలుగు, ఐదుశతాబ్దాలకు పూర్వం ఆలయ శాసనాలలో కూడా స్వామికి ఒడయర్‌ అనే పదం పర్యాయముగా వాడబడినది. కపాలీశ్వఒడయర్‌ నాగేశ్వర ఒడయర్‌ అన్న ప్రయోగములవల్ల స్వామికి ఒడయర్‌ అనేది పర్యాయమైనట్టు తెలుస్తూంది. బగవత్పాదులను 'శిక్కొడయర్‌' అని అన్నారు. కర్ణాటక భాషాజన్యమైన చిక్క శబ్దానికి 'చిన్న' 'చిరుత' అని అర్థం. కాంచీపురంలోని ఏకామ్రనాథుడు దొడ్డ ఒడయార్‌ అనగా దొడ్డప్రభువు.

చెన్నపురంచుట్టూవున్న తిరువళ్ళూరు మొదలగుమూడు తాలూకాలలో చిక్కొడయారు అనే ఆచార్యులకు కలంథాన్యానికి అళాకువంతున పన్ను చెల్లించవలసిందని తమ ప్రజలకు చోళరాజులూ, పల్లవరాజులూ శాసించారట. ఈ పన్ను భూమికి సంబంధిచినది కనుక భూస్వాములు ఏమతస్థులైనా పన్ను చెల్లించవలసివచ్చేది. చెన్నపురపరిసర ప్రాంతాలకున్నూ కామకోటి మఠానికిన్నీ సంబంధము ఉండడంచేత మఠం యీ ప్రాంతాలకు చేరినదని వ్యక్తమగుచున్నది. కామకోటిపీఠానికి చెందిన ఒకరిద్దరుస్వాములకు కట్టిన బృందావనాలు తిరువెట్రియూరులో ఉన్నవి. తిరువెట్రీశ్వరుని ఆలయంలోనూ కంచి ఏకామ్రనాథుని దేవళంలోనూ చెన్నపురీశ్వరుని కోవెలలోనూ ఆదిశంకరుల విగ్రహం వున్నది. ఇట్లా రెండు మూడు దేవళాల్లో ఆదిశంకరుల విగ్రహాలు ఉండడం యితరత్రా కనపడదు. అందుచేత చెన్నపురికిచెందిన ప్రదేశాలు ఆచార్యులకు చాలా సొంతమైనవని వూహించడానికి వీలుగా ఉన్నది. స్వామి అనే పదానికి ఒడయర్‌ అని అర్థం అని విశదంచేసే సందర్భంలో యీ ప్రస్తావన వచ్చింది.

శ్రీరామానుజాచార్యులవారికి కూడా ఒడయార్‌ అన్న పేరుండట స్వామి శబ్దానికి ప్రత్యామ్నాయమే.

స్వామి ఎక్కడున్నాడు? వైకుంఠములోను కైలాసంలోను హృదయంలోను ఉన్నాడన్న పెద్దలమాటకు అర్థం ఏమిటి? గుడులలో దేవుడువున్నాడంటే వెలుపల ఇక ఎక్కడా లేడనియా? ఒక్కొక్క గుడిలోనూ ఒక్కొ దేవుడు ఉన్నాడు. ఈ దేవుళ్ళు ఒక్కరా? నేను వేరా? ఆయన విశ్వమంతా నిండివున్నాడన్న విశ్వాసమున్నవారికి గుళ్ళకు గోపురాలకు వెళ్ళవలసిన పనియేమి? 'అటువైపు కాళ్ళుచాపకు' దేవుడున్నాడు అని మందలించి నప్పుడు ఇటువైపూ, ఇంకొకవైపూ దేవుడు లేడనియా?

దేవుడు ఎక్కడబడితే అక్కడ వెలసివున్నా ఆయన అనుగ్రహశక్తి ఆలయాలలో అధికంగా అభివ్యక్త మవుతూ ఉంటుంది. ఆశక్తి ఎట్లా ఆవిర్భవం అవుతుందీ అనే విషయం మనకు తెలియదు. మన దేవాలయాలు ప్రార్థనామందిరాలు కావనీ ఈశ్వరానుగ్రహార్థం శాస్త్రీయంగా కట్టబడ్డవనీ మనం తెలుసుకోవాలి. మహం్షులు వెళ్లిసేవించిన మహాక్షేత్రాలు అవి.

సరి? స్వామి అంటే? మనమే. హిరణ్యశివుడున్నూ ఈ విధముగానే అన్నాడని కొందరికి తోచవచ్చుకానీ అద్వైతం చొప్పున మనకున్నా స్వామికిన్నీ అభేదం. మనం కించిదజ్ఞులం. ఆయనైతే సర్వజ్ఞుడు 'బాగా ఉండిపోయే సామ్యం ఎల్లాకుదురుతుందండీ?' అని అంటారేమో! స్వామి ఎక్కడనో ఏరిపారేసినట్లు విడిగా ఉన్నాడేమో అని అనుకుంటారేమో, అలా అనుకోవద్దు. స్వామి మనమే అని మన ఆచార్యులు తెలియ చెప్పుతున్నారు.

సంధ్యావందనానికి ఉద్ధరిణి, పంచపాత్ర వీట్లతో కూర్చుంటాము. ఉద్ధరణిలోని నీరు పంచపాత్రలో నుండి వచ్చింది. పంచపాత్రలోనికి నీరు బిందెలోంచి వచ్చింది. బిందెలోని నీరు బావిలోంచి వచ్చింది. జలాశయాలలో జలధి పెద్ద. ఇట్లా వస్తుపరిమాణంలో భేదం ఉన్నప్పటికీ వస్తువేమో ఒక్కటంటే ఒక్కటే. మనం ఉద్ధరిణిలోని జలం అయితే. ఆయన సముద్రం. అదేవిధంగా మనం ఏ కొద్దిపాటి భారాన్ని మోయకలిగితే, ఆ చక్రథారి సర్వలోక భారము మోస్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడూ, సర్వజ్ఞుడూ, మనకు ఒకనియతి ఉన్నది. ఆయన నిరవధికుడు. ఆయన దయాసముద్రుడు. శక్తి సముద్రుడు జ్ఞానసముద్రుడు. మనం ఆయన సొత్తు. ఇట్లా నిండివున్న స్వామిని కృష్ణభగవానుడు విస్తారంగా వర్ణంచి ఉన్నాడు. భగవంతుని చరిత్ర ఎంత వ్యాపించిందో కృష్ణ శబ్దమే సూచిస్తుంది.

మహారాష్ట్రదేశంలో కృష్ణశబ్దం కిష్టోకిష్టూ అని పరివర్తనం చెందింది. కిష్టు శబ్దానికి క్రైష్టు శబ్దానికీ సంబంధం శ్రవణం గోచరంగా ఉంది. కృష్ణభగవానుడు పాదాంగుష్ఠంలో శిలీముఖం గుచ్చుకోగా దేహత్యాగం చేశాడని చదువుతున్నాము. క్రైష్టున్నూ శిలువమీద దేహత్యాగం చేసినాడు. ఇది పురాణాలలోని కృష్ణకథే కావచ్చు. ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలను చదివి అర్థాన్ని సరిగా గ్రహించలేనట్లుంది. జాకోబ్‌ అన్న పదం తీసుకుందాం అది హిబ్రూపదం. యాకోబ్‌ అని ఆపదం మారింది. జోసఫ్‌ అను పదం యూసఫ్‌గా పరిణమించింది. జమున-యమున, జాతర-యాత్ర జూదవ్‌-యాదవ్‌ అనే వైకృతులద్వారా 'జా' 'యా'గా మారుతుందని మనం ఊహించగలం. ఆదిలో ఆత్మమాత్రం ఉన్నదనీ, మాయాసంబంధం చేత జీవుడు సంబవించాడనీ ఆ జీవుడు పిప్పలమును (కర్మఫలమును) తింటున్నాడని ఒక ఉపనిషత్తులో ఉన్నది. ఆత్మను ఆడం అనిన్నీ, జీవుడిని ఈవ్‌ అనిన్నీ, పిప్పలమును అప్పిల్‌ అనిన్నీ గ్రహించినట్లు కనపడుతుంది. కృష్ణుడు గోపాలుడు. పశురక్షకుడు, యాదవుడు, క్రీస్తుసైతం గొల్లవాడే అని అన్నారు. క్రీస్తుచరిత్ర కృష్ణ చరిత్రలాగానే ఉన్నది. ఒక ప్రాంతంనుంచి మరొక ప్రాంతానికి ఏవిషయం వ్యాపించినా ఎంతో పరిణామానికి పాల్పడుతుంది. ఈరీతిగా ఎన్ని చేతులు మారి కృష్ణచరిత్ర క్రీస్తుచరిత్రగా అయిందో! అలెగ్జాండ్రియా పట్టణంలో జరిగిన ఎన్నో సమావేశాల ఫలితమే మనకిప్పుడు కానవచ్చే బైబిలు.

ఇంకొక్క విశేషం. మనుష్యుని 'మాన్‌' అని వారు అంటారు. ఇది మనుజశబ్దభవం. మనువునుండి కలిగినవాడు మనుజుడు. అందుచేత పురాణాలు క్రీస్తుతర్వాత రాయబడ్డవని మనం చెప్పలేము. ఇతర భాషాపదాలకు సరిగా అర్థం తెలియనప్పుడు సంస్కృతశబ్దార్థాలువానిని విశదీకరిస్తవి. పారసీకుల గ్రంథం 'జెందవెస్తా' 'సంధోవస్తా' అనేది 'జెంచవెస్తా' గా మారినట్లు తోస్తున్నది. ఋగ్వేదమంత్రాలు ఆ జెందవేస్తాలో ఆభాసగా ఉన్నవి. నవధాన్యాలు కలిసిపోతే ఎట్లా వేరుచేయలేమో అట్లే పాశ్చాత్య కథావాజ్మయంలో మన పురాణ కథలు కలిసిపోయినయ్‌. క్రీస్తుచరిత్రకు మనపురాణాలే మూలం అని నా అభిప్రాయం. అయితే మిమ్ములను ఒప్పుకొని తీరవలసిందని చెప్పడం లేదు.

అసలు సుద్దికి వద్దాం. 'అన్నిటా దొడ్డవస్తువు స్వామి' అని శ్రీకృష్ణపరమాత్మ - ' ఓ అర్జునా! భూతా లన్నిటి హృదయంలోనూ చైతన్యం నేనే. పూలలో తావిని నేను. నెలలలో మార్గశీం్షంనేను. ఋతువులలో వసంతం నేను' అని అన్నాడు. ఏ యే వస్తువు శ్రీమంతమో అత్యుత్కష్టమో ఆయా వస్తువెల్లా స్వామే. దయలో జ్ఞానంలో శక్తిలో ఆయనపరిపూర్ణుడు. మనమో అన్నిటిలోనూ పూర్ణానుస్వారం. మనకూ ఆయనకూ నడుమ ఏదో అగడ్త ఉన్నటునున్నది. ఆ అగడ్త పూడ్చటానికి ఆయన శ్రమపడుతున్నటులున్నది. ఆయన యెంత శ్రమించినా మనకోరికలనే ఎండమావులు నిండే సూచన లేదు. మన కాహారం కావాలి; అర్థంకావాలి, పదవులు కావాలి బిరుదులు కావాలి; ఇట్లా మన కోరికలూ కొరతలూ కోటానకోట్లు. ఎదుటివారి జేబులోని డబ్బుతో మనజేబు నిండదా అన్న ఎదురుచూపు మనలను వదలిపెట్టడం లేదు. దానిచే ఈపల్లం పూడే ఉపాయం కనిపించడంలేదు. కాని స్వామికి కావలసినది కానీగూడాలేదు. ఆయన నిండు సముద్రం.

ఎవరి విధులు వారివి. మగవారికి కొన్ని విధులున్నవి; ఆడువారికి కొన్ని విధులున్నవి. పెండ్లియీడుకు వచ్చిన కన్యలు సుశీలము లజ్జ వినయము మొదలయిన గుణములు అలవరిచుకోవాలి. అది వారికి ఉచితం. అట్లే ఆయాయీవారికి ఆయా యీస్థితీ భూమికా మొదలైనది ఆయాయీవారికి స్వామి. అదేవారి కానందదాయకం మనం మన కొమార్తెలను ప్రేమిస్తాం. మన కొమార్తెలో తమ తమ భర్తలను ప్రేమిస్తారు. వారివారి ప్రేమ వారివారి కుత్కృష్టం. ప్రేమింపరానిచోట ప్రేమను ఉంచితే అది నికృష్టమౌతుంది. అపుడు రసం అభాసం ఔతుంది. పానకంలో పిడికెడు ఉప్పు కలిపితే రసాభాసే, కవిత్వంలోనూ గానంలోనూ రసాలు ఉన్నవి. వీనికికూడా క్రమం నియమం మొదలైన వున్నవి. స్వరక్రమమే రసాస్వాదనానికి సాధకం. కాలక్రమేణ మన రసనేంద్రియాలు పొగాకుకు అలవాటుపడడంవల్ల రసమంటే ఏమిటో రసాభాసమంటే ఏమిటో ముంగల నాలుకకే తెలియకుండా పోయింది. మన నాలుకలు చెడినటులే ధర్మమూ చెడినది. ధర్మపతనమయినపుడల్లా ధర్మాన్ని మనకు బోధించడానికి స్వామి అవతరిస్తాడు.


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page