Na Ramudu   Chapters   Last Page

 

శ్రీ

నారాముడు

*

ఆనందమయుడు

గీ. తగ రసంబంది యానందియగు జనుండు

నవరసమ్మును రామాయణంబు వ్రాసె

మును మహాకవి వాల్మీకి మునివరుండు

మరియు రాముండు నానందమయుcడు గాన. 1

'రసోవైసః రసగ్గ్‌హ్యేవాయం లబ్ధ్వానందీ భవతి.' అని వేదము. రసమనcగా బ్రహ్మ. ఆ రసమును పొంది జనుcడు ఆనంది అగుచున్నాడు. ఆనందము కలవా డానంది. రసము ఆనందమా? అయినచో బ్రహ్మ మెట్లగును? బ్రహ్మనిర్గుణుcడు. సత్‌ చిత్‌ ఆనందము ఈ మూcడునుగుణములు. బ్రహ్మకు ఉపలక్షకములు. అనగాబ్రహ్మను సూచించునవి. రసోవైసః అనగా రసమే వాcడు. వాcడనcగా బ్రహ్మయని అర్థము. రసమును పొంది ఆనంది యగుచు న్నాడనcగా ఆనందము కలవాcడు - బ్రహ్మయగుచున్నాడని యర్థము.

మొదట 'తగన్‌' అన్నమాట యున్నది. తగినట్లుగా అని యర్థము. ఆనంది యగుటకు తగినట్లుగా రసమును పొందియని యర్థము. మనము పొందెడు ప్రతిదియు ఆనందము కాదు.

వాల్మీకి రామాయణమును వ్రాసెను. ఎందుకు వ్రాసెను? రసమును పుట్టించుటకు వ్రాసెను. రసమానందము కదా. రసమును పొందినవాcడు ఆనందమును పొందినవాcడగుచున్నాడు కదా! ఆనందమనగా బ్రహ్మపదార్థము వంటిదేకదా! అందుచేత రామాయణమును వ్రాసినాcడు.

ఎవరిని గూర్చి వ్రాసినాcడు? రామునిగూర్చి వ్రాసినాcడు. రాముడెవcడు? ఆనందమయుcడు. ఆనందమయుని గూర్చి అనగా రసమయుని గూర్చి మహాకావ్యము వ్రాసినచో రసము నిస్సంశయముగా పుట్టును. అందు చేతనే మొదట 'తగరసంబని' వ్రాయుట. తగినట్లుగా అనగా రసము పుట్టుటకు యోగ్యమైనట్లుగా వ్రాసినాcడు అని అర్థము. రసముc బొందుటకు మొదటి యోగ్యత ఉత్తమనాయకుcడుండుట. ఇది కావ్యలక్షణము. రామునికన్న నుత్తమనాయకుc డెవడుండును? ఎవ్వcడును లేcడు.

శా. అందన్‌యోగులకే యసాధ్యమగు బ్రహ్మానంద మట్లుంచితా

నందస్‌రానిది సర్వమానవుల కాహా! మానుషానందమే

నందున్‌ సుష్ఠురసజ్ఞుcడైన యెడc గావ్యాసందమాస్థాయిలో

నందగల్గిన దొక్కడే మరియు బ్రహ్మానంద సాదృశ్యమై.

యోగులకుcగూడ బ్రహ్మానందము సాధ్యముకాదు. అది యట్లుంచి సర్వ మానవులకు మానుషానందమే పొందరానిది. కాని రసజ్ఞుcడైనచో కావ్యానంద మును పొందవచ్చును. కావ్యానంద మా స్థాయిలోనిది. ఆ స్థాయిని పొంద గల్గినది కావ్యానంద మొక్కటియే. అది బ్రహ్మానందము వంటిది గనుక.

మానుషానందమనcగా మానవుcడు పొందెడి యానందము. ప్రతి మానవుcడును మానుషానందమును పొందలేcడు. దానిని పొందుటకు మనుష్యులకే కొన్ని లక్షణములు కావలయును. అతడు యాజ్ఞికుడు. ఆశిష్ఠుడు, బలిష్ఠుడు, నిష్కాముడు కావలయును. మరియు సర్వధాత్రికి చక్రవర్తి కావలయును. వాని పైయధికారి యెవ్వరు నుండకూడదు. ప్రధానముగా వాcడు అకామహతుcడు కావలయును. ఇట్టివాcడు యుధిష్ఠిరచక్రవర్తియని భగవత్పాదులవారైన శంకరాచార్యులవా రన్నారు మానుషానదమనcగానిది. ఈమానుషానందము మొదటి కొలత మనుష్యుcడు, మనుష్యగంధర్వులు, దేవగంధర్వులు, పితరులు, అజానజ దేవతలు, దేవతలు, ఇంద్రుcడు, బృహస్పతి, ప్రజాపతి, యీ మొదలుగా ఒక్కరొక్కరి యానందముకంటె పైపై వారి యానందము వందవంద రెట్లుగా నుండును. అది ప్రజాపతి యానందము. అనగా బ్రహ్మానందము. అందుచేత మానుషానందము పొందుటయే కష్టముగదా! బ్రహ్మానందముc బొందుట యోగులకైన నసాధ్యమనుట.

కాని, చక్కని రసజ్ఞుcడైనవాcడు కావ్యానందమును పొందును. ఆ కావ్యానందము రససబ్రహ్మచారి. బ్రహ్మానంద సదృశ##మైనది. ఈ కావ్యానం దము పొందుటకూడ కష్టమే. ప్రతిమానవుcడు పొందునది మానుషాపనందము కానట్లే ప్రతి సామాన్యుcడయిన పాఠకుcడు పొందునది కావ్యానందము కాదు. రసానందము కాదు. ఛందోజ్ఞానము, బహు పూర్వకావ్య బహువర్షకృతాభ్యాసము, పరమేశ్వరానుగ్రహము - ఇవి కావలయును.

శా. ఆయానందమయుండె బ్రహ్మయని యభ్యాసంబుచే నిశ్చితం

బైయేర్పాటుగ వేదపం క్తులను భాష్యప్రోక్తమై యొప్పcగా

నాయానందమయుండు రాముcడని వ్యాఖ్యానించె వాల్మీకినాన్‌

ఆయానందములున్‌ రఘూత్తముcడుమూcడై యొక్కడైనట్లుగా

బ్రహ్మము, ఆనందము, రాముcడు - ఈ మువ్వురు నొకటియే. వాల్మీకి రామాయణమును వ్రాసినాcడు. కథానాయకుcడు రాముcడు. కావ్యానందమని యున్నది దానిని రసమనుచున్నారు. ఈ రామాయణ కావ్యగతరసము రామునిబట్టి సిద్ధించుచున్నది. నాయకుcడుత్తముcడైనచో రససిద్ధి కల్గును. కనుక రాముcడానందమయుcడు, రసమూర్తి. ఆ రసమును పొందియే జనులు ఆనందము పొందినవార గుచున్నారు. బ్రహ్మ యానందమయుcడని చెప్పితిమి కదా! ఆనందమయ శబ్దములో చివర 'మయ' అన్న శబ్దమున్నది. ఇదియొక ప్రత్యయము పూర్తిప్రత్యయము 'మయట్‌'. ఇది సొంతముగా శబ్దముకాదు. ఈ ప్రత్యయమునకు వికారమని యర్థము. ఉంగరము హేమమయము. దాని రూపము ఉంగరముయొక్క రూపముగాని అందులో నున్నదంతయు బంగారమే. అట్లయినచో భగవంతుc డానందము కావలె. ఆనందముకాcడు. ఆనందము గుణము కనుక ఈ ప్రత్యయమునకు ప్రాచుర్యమని యర్థమున్నది. అప్పుడు భగవంతునిలో నెక్కుపభాగము ఆనందమగును. అదియు కుదురదు. ఆనంద ప్రాయుcడు అన్నచో ఆనంద సదృశుcడని అర్థము రావచ్చును. కొంత కుదుర వచ్చును. ఆనందఘనుడు అని కూడ ననవచ్చును. ఎందుచేత ఆ శబ్దమును పట్టుకొని వ్రేలాడుచున్నావు అనవచ్చును. వేదములో ఈ ఆనందమయ శబ్దము బ్రహ్మపర్యాయముగా చాలసార్లు వాడcబడినది కనుక. అభ్యాసమనగా చాల సార్లు అని అర్థము. అందుచేత ఆనందమయ శబ్దమునకు వేదమునందు బ్రహ్మయని యర్థమున్నది గనుక మేము శ్రీరామచంద్రుని ఆనందమయుcడనగా సరిపోవును గనుక శ్రీరాముcడు బ్రహ్మమగును. రామభక్తులు విష్ణులోకమునకుc బోవలయును, రామలోకములని వేరే లేవు. రాముcడే బ్రహ్మమైనచో ఆయనయే యానందమయుcడై నచో తేలికగా నుండును. బ్రహ్మము సర్వవ్యాపి రాముcడు సర్వవ్యాపి. ఆనందము సర్వవ్యాపి. ఆనందము జీవలక్షనము. మానవుని సృష్టించి యానందమయుcడు తానే జీవునిలో ప్రవేశించినాcడు, అని వేదములో నున్నది.

గీ. అట్టియనుభూతు లొక్కరెండైన వనుచు

నీ మదీయ జీవితమున నెంతు నేను

అవియు నిట్టివటంచు నేనాడలేను

భాషలో వానిc జెప్పుశబ్దాలు లేవు.

శా. ఆయానందముc బొందినట్టి సమయంబావేళ నావేళ నం

చోయా హేతువు చేతనంచొయనగా నుల్లమ్మునన్‌ జ్ఞప్తిలే

దాయెన్‌ జ్ఞాపకశక్తి నాకుc బదినూర్లైనంతయేపారుcగా

దా, యానందము తీరుcజెప్పుటకుc గాసైనన్‌ వృథాయత్నమై.

ఉ. ఆ యనుభూతి చిత్రముగనై యొకయెన్బదియేండ్లు జీవితం

బైయొక కీర్తిగా మనికియై యనుభూతియు రెండుమూడు సా

ర్లే యది నిత్యమై చనినయెవ్వరొ యోగులు వారిc జెప్పనే

లా యిcక రామచంద్రుకృప యట్టిది రాముcడువాడు నిత్యుcడై

ఈ యనందానుభూతి నాకు జీవితములో రెండుమూడుcసార్లు జగిరినట్లు జ్ఞాపకము. అప్పుడు జరిగినది అప్పుడు జరిగినది, ఆహేతువుచేత జరిగినది అన్న సంగతికూడ జ్ఞాపకము లేదు. ఇతర విషయములయందు నాకనంతమైన జ్ఞాపక శక్తి కలదు. ఇది చెప్పుటకుcజాల ప్రయత్నము చేసినాడను. ప్రయత్నము వృథాయైనది గాని చెప్పుట సాధ్యము కాలేదు. నా కెనుబదియేండ్లు దాcటినవి కొంతకీర్తికలవాcడను కదా! ఈ చివరి రోజులలో అన్నోదక ములకు లోటు లేదని చెప్పవచ్చును. డబ్బుకోస మిబ్బంది పడుటవేఱు, అన్నో దకముల కిబ్బందిపడుటవేఱు. నా గ్రంథములచ్చు వేయించుటకు వేలకొలcది ధనము కావలయును. నాకు చేతి విసురు కలదు. అందుచేతనా దగ్గఱ ధనముండదు. మొత్తముమీcద నా యీ చివరి జీవితము సుఖముగా లేదనుటకు వీలులేదు. ఎవcడు ధని, ఆరోగ్యవంతుcడు, కామముచేత హతుcడు కానివాcడు

1. నాకు జ్ఞాపక మున్నదైనను నవెట్టివన్న

శ్రోత్రియుcడో వాcడు మానుషానందమును పొందునని చెప్పcబడినదికదా. కామహతుcడను కాని కొన్నిగడియలు నాజీవితములో కలవు. ఒకప్పుడు ఎంత కామహతుcడనో ఒకప్పుడు నేనంత కామహతుcడను కాను. ఆ యానందము ప్రధానముగా కావ్యానందము. ఎనుబది యేండ్ల జీవితములో నేను రెండుసార్లే పొందుట యేమి? ఇది నాకాశ్చర్యము. ఆ యానందమునుగూర్చి యెక్కువగా చెప్పినగాని యీ మాట కర్థము తెలియదు.

ఉ. చాయగ సన్నగా నుపనిషత్తులు భాష్యము లెట్లుచెప్పెనో

ఆ యనుభూతి ఆపయిన నట్టుల నున్ది యూహలో నస

ర్పీ యిదియా యటంచు ననిపించెను నాకును రామచంద్రు మై

చాయయు, గన్ను, నూహయును చాలనిచోటున వ్యాప్తిచెందెనాన్‌

ఆ యనుభవ మెట్లున్నదనగా ఉపనిషత్తులలో భాష్యములలో చదివినట్లే యున్నది. ఎట్లు చదివితిని? మానుషానంద మున్నది. ఆశిష్ఠుcడు, ద్రఢిష్ఠుcడు బలిష్ఠుcడు, పృథివి యందలి సర్వవిత్తము సంపూర్ణముగ కలవాcడుc శ్రోత్రి యుcడు, అకామహతుcడు, ఇట్టివానిది మానుషానందమని చెప్పcబడినది. ఈ మానుషానంద మతని నిత్యస్థితియా, అప్పుడప్పుడు పొందెడిదియా? లోక ములో ఒక మహా ధనవంతుcడున్నాcడు, ఒక మహా పండితుcడున్నాcడు. ఒక మహా గాయకుcడు నొక మహాకవి యున్నారు. ఆ ప్రతివానికిని నేనిటు వంటి వాcడనన్న యూహ నిత్యము నెడతెగకుండ నుండును. తక్కిన పరిస్థితులు తెచ్చెడి మార్పులు వేఱు, ఈ ధన విద్యాధికారముల చేతcగలిగెడి యొకతృప్తి వేఱు. ఈ తృప్తి నిత్యముగా నుండును. అదియొక యానందలక్షణమని చెప్ప వలయును. అదే యానందమనుటకు వీలులేదుగదా! ఇది ఆనందలేశము కావచ్చును. దీనిని అహంకారమందుము. ఎదో పేరుతో దానిని చెప్పుదుము. వాcడు ఆకామహతుcడైనచో ''వాcడు సాధువు. తానంతటి వాcడనని అతనికి అహంకారములేదు'' అందుము. అకామహతుని లక్షణ మట్లుండును. సంపూర్ణమయిన మానుషానందము పొందుటకు యోగ్యమైన పైని చెప్పిన లక్షణము లన్నియు నుండి యీ కామము లేని లక్షణమున్నచో నప్పుడువాcడు మానుషానందము సంపూర్ణముగా కలవాcడు.

'అసర్పీ' అని యొక సంబోధనమున్నది. ఓసి కదలనిదానా! అని యర్థము. ఆయనుభవమును గూర్చి యాలోచించగా దానియందు కదలెడి స్వభావము లేదనిపించినది. అది కదలదు స్థిరముగా నుండును. ఎక్కడున్నది? దానిని చూచుటకు కన్ను చాలదు. ఊహ చాలదు. మోహింపcజేయు శ్రీరామ చంద్రుని శరీరచ్ఛాయ చాలదు. ఈ మూcడింటి కతీతమైన యొకచోట నా యనుభవము వ్యాపించినట్లున్నది. ఆ చోటుతెలియదు. దానిని గుఱించి ఒక్కటి యే గట్టిగా తెలియును. అది నిశ్చలముగా నున్నది. ఆ మానుషానందము మొదలైనవి యట్లుండునేమో యనిపించినది. అనిపించుటయే కాని తక్కిన దేమియు తెలియదు.

శా. ఆయానందములందు నొండు విడిగానై సాహితీలోకకు

ల్యాయూషాకృతిc బొల్చినట్లు 'కవితా యద్యస్తిరాజ్యేనకిమ్‌'

ప్రాయఃస్మారక హేతువై నెగడె నాపై నున్నదా లోనివేc

డో యా రాముcడు స్వస్వరూపఘటనాఢ్యుం డయ్యెనో నాcజనెన్‌

యూషము పప్పుకట్టు అని యర్థము. పథ్యము కొఱకు పప్పులతో కట్టులు చేయుదురు. నీళ్ళుపోసి మెత్తగా జాలుగా చేయుదురు ఉడికింతురు. సాహితీలోక కుల్యా యూషాకృతి అనగా సాహిత్య ప్రపంచమునందలి ఒక యూహకాలువయున్నది. అది పప్పుకట్టువలె నున్నది. చిక్కcగాలేదు పలుచగా లేదు. సేవించినచో నారోగ్యము దానిలో కొద్దిగా లవణము వేయుదురు కావున నొక రుచి కలిగియుండును.

'కవితా యద్యస్తి రాజ్యేనకిమ్‌?' కవిత్వమున్నచో రాజ్యముతో నేమి పని? యని భర్తృహరి చెప్పినాcడు. ఈ కవిత్వము ఇట్టి యానందదాయకము. ఆ వెనుక జెప్పిన యొక నిండుతనము, ఒక యానందపు స్పర్శ ధనవంతులు మొదలైన వారికున్నట్లే ఒకరాజున కుండును. కవిత్వమున్నచో రాజ్యమెందుకు? అనగా ఒక మహాకవి ఆ రాజుపొందెడి యానందలక్షణమును పొందునని యర్థము. 'కవితా యద్యస్తి రాజ్యేనకిమ్‌' అనునది ఒక శబ్దముగాc దీసికొని దానిని స్మరింపజేసెడు కారణమై ఆ యనుభవముండెనని యర్థము.

మొదటి మూcడు చరణములలో కవి యనుభవించిన కావ్యానందము చెప్పcబడినది. చివరిది కావ్యానందము కాదు. భగవంతుని దయవలన కలిగిన యొక యనుభూతి విశేషము. కావ్యానంద విషయమున నున్న గుర్తు రెండవదాని విషయములో లేదు. శ్రీరామచంద్రుcడు ఎప్పుడో యెందుకో దయకలిగి ఆ యనుభూతిని కలిగించినాcడు. మొదటి దట్లుకాదు ఒక కావ్యము చదువు చుండగా దానిని మనము చేయుచు చేయుచు తన యొడలు తనకుcదెలియని యొకస్థితిలోనికి తాను వెళ్లెనని యర్థము. అక్కడ ఇంద్రియ వ్యవహారము లేదు. ఆలోచనలేదు. మనస్సులేదు. ఆ స్థితిలో నెంతసేపున్నాcడో తెలియదు. కొంతసేపటికి మరల నింద్రియజ్ఞానము కలిగినది. ఇంద్రియజ్ఞానము కలిగిన తరువాత ఓహో! ఈ కడచిన నిమేషమో యెంతో ఆ యనుభూతిని పొందితి ననిపించినది. నిద్రపోయి లేచి నిద్రపోయితినను కొన్నచో నిద్రాసమయమునందు తెలియదు. అట్లే అనుభూతి సమయమునందు తెలియదు. ఆ యనుభూతి సమయము నిద్రకాదనికూడ తెలియునుగదా?

ఉ. పొందగరాని యొక్కయెడc బొందిన నెట్టిదొ నేర్వరానిదా

నంద మటన్నమాటను జనంబొక తేలిక గాగ వాడుచు

న్నందుకె నాకు నిచ్చలును నబ్బురపాటొదవించు నిక్కమా

నందముc గాంచుటన్న రఘునాధుని కన్నులతోడcజూచుటే

లోకములో మనము దేనినో పొందుదుము. అది సామాన్యముగc బొంద రానిది. ఆ యనుభవమునకు జనము ఆనందమని వాడుదురు. ఒకకూరయో పచ్చడియో చాల రుచిగా నుండును. ఒక ప్రియమైన మాట విందుము. బ్రహ్మానంద మనుభవించినా మందుము. ఇది నాకెప్పుడు నాశ్చర్యముగా నుండును. నేనానందమును పొందితిననగా శ్రీరామచంద్రుని కన్నులతో చూచితిననిరయర్థము బ్రహ్మానందము పొందితిననగా దానికవధిలేదు. లోక మీ మాటను అంతతేలికగా వాడుచున్నారు.

ఉ. వందలు లోతులౌ ననుభవంబులు భావన లర్థమైన వాగ్‌

బృందము కంటిముందు కనిపించుట యెట్టులుకల్గు రాముcడా

నందము రెండురెండు నవినాస్థితి లోcతుగ నూహసేయ, నా

యందున స్వామియింతటి దయాజలరాశి యెఱుంగ నౌటకున్‌

ఎన్నెన్నో లోతులైన భావములు పదేపదే త్రవ్వుకోగా త్రవ్వుకోగా కొన్ని మాటల సమూహము కంటిముందు కనిపించునా? ఆమాటలానందము కాదు. మాటలు నోటివెంట వచ్చుటతోడనే యానందాన భూతి చెడిపోయినది. ఊహలకు మాటలకు నానందానుభూతితో సంబంధము లేదు. ఒకటి యానందము, రెండు శ్రీరామచంద్రుcడు. రెండు నొకటే, ఆ రెంటికి నవినాస్థితి. రాముcడనcగా నానందము. ఆనందమనcగా రాముcడు. ఎంతో లోతుగ నూహసేయగా శ్రీరామచంద్రుని దయయున్నచో నాయనుభూతి కలుగును. అప్పుడే రాముని జూచినట్లు రాముcడు కనిపించుటయు నదియే. మనస్సునకు మాటకు సంబంధము లేని యొక యనుభూతి యని యర్థము.

శా. ఆనందం బొకcడుండె రాముcడదియే యన్నటుగా నుండెడిన్‌

సానందాకృతి రాముcగన్నులను గాంచం గల్గుటం చున్నదా

కానంగల్గుదు రెవ్వరైన నెద యేకాగ్రంబుగా భావనా

ధీనైశిత్యముcగల్గి శీలమున సాధీయాంసుcడై పొల్చినన్‌.

ఆనందమున్నది. నా మనస్సులో రాముcడే అది అన్నట్లుగా నున్నది. అనగా రాముcడు వేరే లేcడు. ఆయానందము ననుభవించుటయే రాముని దర్శించుట యని యర్థము. రాముcడు కనిపించినాc డనcగా నొక ధనుస్సును బుజాన వైచికొని సీతాదేవి ప్రక్కనండగా ఒకబొమ్మవలె కనిపించినది ఆ యనుభూతి దానియంతట నది గొప్పదియే. అది నిజమైన యానందముకాదు. ఈ చర్మ చక్షుస్సులతోనో మనోనేత్రము తోడనో ఆరాముని చూచుచున్నాము. నేత్రము మన యింద్రియములలో నొకటి. ఆ యానందానుభూతి కాని శ్రీరామ చంద్రుని దయగాని యా యింద్రియముల కతీతమైనది. అక్కడ చూచునది లేదు, చెప్పునదిలేదు. అది యెట్లు కల్గును? లోతైన భావన కావలయును. ఎంతో యేకాగ్రత కావలయును. భావనచేత ధీనైశిత్యము - బుద్ధి పదునెక్కి యుండవలయును. ఆ పురుషుcడు తన ప్రవర్తనచేత సాధీయాంసుcడు. మిక్కిలి సాధువై యుండవలయును. దురహంకారము, నోటికి వచ్చినదెల్ల మాటాడుట, వ్రాయుట, ఇతరుల కపకారము చేయుట, మహావిషయములను తూలనాడుట మొదలైనవి దుర్జన లక్షణములు. అట్టివారి బుద్ధికి నైశిత్యము - (నిశిత్వము - పదును) కలుగనే కలుగదు. వారి కేకాగ్రత సిద్ధించదు. ఈ దుర్లక్షణములు లేనివారికి నేకాగ్రత సిద్ధించవచ్చును. ఆయేకాగ్రత మిక్కిలియు పరాకాష్ఠను పొందినచో నప్పుడు ఆనందానుభూతి కలుగవచ్చును. అది యథార్థమైన శ్రీరామచంద్రుని సాక్షాత్కారాము. అప్పుడు రామచంద్రుcడు కనిపించినట్లు తక్కిన మాటలన్నియు ఠాలాఠోలీ మాటలు. దుర్జనులకు దుష్టములైన వ్రాతలు వ్రాయువారికి నీ యానందమునకు సంబంధము లేదు. అనగా రామునికి వారికి సంబంధము లేదని యర్థము. కనులకుc గనిపించెడి రాముcడు మనము చర్చించెడి రాముcడు, పొగడcబడు రాముcడు, తిట్టcబడు రాముcడు అసలు రాముcడుcకాడు. నీ మనో లక్షణముల కనుకూలమైన రాముcడు నీవు సద్భావన చేసి ఆ రాము నచ్చట నిలిపి యింద్రియాతీతమైన యొక యనుభూతిని పొంది నచో అది రాముcడు. అదియే భగవంతుcడు కనిపించుట యనగా. నాకు భగవంతుని చూపించుము. ఉన్నచో నాకు కనిపించడేమి? అన్నమాటలు అర్థము లేని మాటలు, వీడసాధువు. ఇతరుల కపకారము చేయుచుండును. బూతులు వ్రాయుచుండును. బూతులు మాటాడుచుండును. ఇంద్రియ వ్యాపారము లేనిచో వాcడులేడు స్వామి ఇంద్రియాతీతుడు. వీcడు ఇంద్రియముల నడుమ కూర్చుండి నా కింద్రియాతీతుcడు కనిపించడేమి యనుమాట తెలియనిమాట. వాడు విజయవాడలో కూర్చున్నాడు. కదలడు; కదలుటకు శక్తిలేదు. నాకు న్యూయార్కు కనిపించదేమి? నాకు లండను కనిపించదేమి? మొదట నీదగ్గఱ డబ్బులేదు రెండవది నీవు పక్షవాతముతో పడియున్నావు. ఎట్లుకనిపించును? నాకు భగవంతుcడు కనిపించడేమి యనునది యిటువంటి ప్రశ్న.

శా. ఆ యానందమె స్వామి లక్షణముగానై యాత్మ దీపింపగా

ఆ యానందమె నాహృదగ్రమున నిత్యంబై విడంబించినన్‌

నా యీ జన్మమె చారితార్థ్య ఫలమైనా కల్పవృక్షంబునే

వ్రాయంగా నయినట్టి దివ్యఫలమై వాంఛింతు నాయొక్కcడే

ఆ యానందము స్వామి లక్షణము కావలయును. ఆనందమునకు స్వామికి భేదము లేకుండ నుండవలయును. ఆనందము యొక్క లేశము సుఖము మొదలైన వానివలె నొక యల్పమైన యనుభూతిగ సర్వజనుల హృదయమునందున్నది. భగవంతుcడు సృష్టి చేయుచునే సర్వజీవుల హృదంత రాళమునందు తానైన బ్రహ్మానందములోని యొక పరమాణువుకంటె పరమాణువైన భాగముగా సర్వజనులయందుంచినాcడు. దీనిని మనము సాధన చేసి చదువుకొని సత్ర్పవర్తనచేత లోతైన భావనచేత వృద్ధి పొందించుకొని తొలుత మానుషా నందము వంటి యానందమునైన పొంది చివరికి నట్టి మహానుభూతిని పొందవలయును. అది జన్మయొక్క చారితార్థ్యము, కావ్యానందము పొందగలిగినచో నదియొక మంచి సాధన. సాధనా మార్గములో కావ్యానందమొక గొప్పమెట్టు. మానవుల బుద్ధియు నూహయు నెప్పుడును లోకము ననుసరించి యుండును. లోకమును వదలిపెట్టి యూహించుటయొకటి. అది యోగులు చేయుదురు. లోకము ననుసరించి తీవ్రమైన సద్భావన చేయుట రెండవది. అప్పుడు రామాయణము పనికి వచ్చును. ఆ భావననే నూఱగా నూఱగా నొక పరిపాకము సిద్ధించును. దానినుండి కావ్యానందము పుట్టును. నీ సంస్కారము కొలcది నా యానందము దానికి యోగ్యమైనంత సేపే యుండును. అది నిత్యముగా నుండవలయు నన్నచో నెంతప్రయత్నము చేయవలయును? ఎంత సాధనచేయవలయును! అప్పుడు జన్మచరితార్థమగును. నేను కల్పవృక్షమును వ్రాసితిని. ఈ గ్రంధమంతయు శబ్దములు, సమాసములు, తెలుcగు పలుకుబడులు, వ్యాఖ్యానములు, తత్త్వబోధనములు, కావ్యలక్షణములు - వీని నన్నింటిని శ్రీరామచంద్రాత్మగా భావన చేసి చేసి యీ గ్రంథమున వ్రాసితిని. నేను పడిన యీ శ్రమయంతయు నా సాధన. లోకమున కదియొక కావ్యము. వారు మెచ్చుదురు మెచ్చరు. నాకు దానితో నవసరములేదు. ఈ రామాయణ కల్పవృక్ష ఫలముగా నేను వాంఛించునది ఆయానందము నాయందు నిత్యమై యుండవలయునని. ఇంకొక కోరిక లేదు.

Na Ramudu   Chapters   Last Page