ఆశీస్సులు శ్రీదమ్మలు, శ్రితజన ర
కోదండరాము, ద్విజవై
ద్యాదరు, గురునాథు ప్రోచుత న్నిరతమ్మున్.
ఇరువురు నాప్తబంధువులు, నిర్వురు మిత్రులు, ధర్మవర్తనుల్,
వరకవితా రసజ్ఞులు, కలారతు, లాత్మల విశ్వనాథ స
ద్గురువరుc బార్వతీ విభునితో సరిచూచెడివారు, వారికిన్
నిరత సుఖాయురున్నతులు నిచ్చలు కూర్చుత నాది దంపతుల్.
శ్రీరామాయణ కల్పవృక్షమును వ్రాసెన్ విశ్వనాథుండు శి
ల్పారామమ్ముగ, నాంధ్రవాఙ్మయ మహోద్యానామ రాగమ్ముగా,
ధీరుల్ శిష్యసమాను లిర్వురును నర్థింపంగ తత్సారమున్,
''నా రాముం'' డనుపేర వెల్వరిచె, నూత్నంబైన భాష్యంబనన్.
కాదు వట్టి వ్యాఖ్య, కాదర్థ వివృతియు,
కాదు స్వప్రశంస, కవిగురుండు
నాకు జాతు, తనదు నానావిధములైన
శిల్ప మణులు ప్రోవుసేసె నందు.
కనిపించు నొకచోట కవి విశ్వనాథుని
తాత్త్వి కాంతర్‌జ్ఞాన దర్పణముగ
తోచు నొక్కొకచోట తోయరు ట్సంభవు
సృష్టి రహస్య విశ్లేషణముగ
గోచరించు నొకప్డు కోసలాత్మజ తనూ
భవు నుద్భవాద్భుత వివరణముగ
స్పష్టమౌ నొకచోట శక్తి వేద స్వరూ
పిణి సీత తత్త్వ సంవేదనముగ
రసమనోజ్ఞము దశరథ రాట్కుమారు
నద్భుత చరిత్రcగల రహస్యములనెల్ల
విశ్వనాథ మహాకవి విస్తరించె
నెన్నcదగురీతి నారాముcడన్న కృతిని.
గురువర్యుల్ మనియున్నచో ప్రియతమున్ కోదండరామాభిధున్,
బరమాప్తున్ గురునాథు, భావవిలసత్పద్యామృతాసార బం
ధుర ధారా నికరాభిషేకమున సంతోషాబ్థి నోలార్చి యుం
దురు, వారిప్పుడు శిష్యునుక్తులనె యెతో తృప్తి నొందన్‌వలెన్.
గురువన్నన గురుమాత్రుడా! సుకవితాకూపార కుంభీసుతుం,
డురు సారస్వత సర్వరూప సృజనప్రోద్దామ ధీశూరుc, డా
గిరికన్యా జనకాత్మజాదయిత భక్తిన్ బూర్ణసిద్ధుండు, త
త్పర మాశీర్వచనమ్ము లెల్లయెడలన్ బాలించు మిత్రద్వయిన్.
పమిడి గంటాంబుధివార్ధి చంద్రుండు కో
దండ రాముcడు న్యాయ తత్త్వ విదుcడు
వరముక్తి నూతలపాటి వంశపు మణి
గురునాథ నాముండు కూర్చు సఖుcడు
విశ్వనాధాన్వయాబ్ధి శశాంక మూర్తికి
మధు మనోజాతుల మాడ్కి వారు,
ఆంధ్రశారద కంఠహారాయితంబైన
కృతి రచింపcగc బ్రోత్సహించినారు
కారయితయును, గర్తయు, బ్రేరకాను
మోదకులు భాగభాక్కులు పుణ్యమునను,
ఛాత్రుc డగునాకు గతజను స్సుకృతి వితతి
పండి, యిందను మోదకత్వము లభించె.
వీరల్ కోరకయున్న విశ్వకవిరాడ్ విద్వన్మ హేంద్రుండు. తా
నారంభింపcడు నాదు రాముcడను కావ్యం, బాంధ్ర గీర్వాణికిన్
శ్రీరమ్యంబగు నీయలంకృతి సిరుల్ లేకుండెడిన్, దత్కృపన్
బారంపర్యముగా సుఖాయురయ లాభం బబ్బెడిన్ వారికిన్.
హైదరాబాదు
1-6-1978 దివాకర్ల వేంకటావధాని