Na Ramudu   Chapters   Last Page

 

ఆత్మారాముఁడు

చ. అలపదిరెండొ మూఁడొ యగునా చిననాటను నిద్రపోవుచో

బలముగఱోమ్ముపై నెవఁడొ బాధఘటించుచుఁగూరుచుండెలో

పల గల యట్టి రాముఁడును వచ్చెను వాక్కున వాని గుంజితిన్‌

మెలఁకువ వచ్చె వాఁడు నెదమీఁదను లేడును లోన రాముఁడై

అంత చిన్నప్పటినుండి నాకు రాముఁడు దేవుఁడు. ఈ రాముని నా గుండెలో కూర్చుండఁబెట్టిన దెవరు? మా నాయనగారి పురాణము ఎక్కువ భారతముమీఁద, భాగవతముమీఁద,నిజముగా నాగుండెలో కృష్ణుడుకూర్చుండి యుండవలయును. మా యూరిలో నున్నవి రెండు దేవాలయమలు. ఒకటి సంతాన వేణుగోపాల స్వామివారిది. రెండవది శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామివారిది. మా యూరిలో పూర్వము దేవాలయములు ఈ రెండు. దేవాలయముల ప్రతిష్ఠయు నా చిన్నిప్పుడే జరిగినవి. గూడవల్లి బ్రహ్మయ్య గారని పెద్ద కమ్మరైతు. ఆయన సంతాన వేణుగోపాల స్వామిగారి యాలయమును గట్టించి బ్రహ్మాండమైన యుత్సవములు చేయించినాఁడు. ఆ స్వామి యనగా నాకు ప్రాణము. ఇప్పటికిని నేను మా యూరు వెళ్ళినచో ఆ స్వామి వారి దర్శనము చేయుదును. స్వామి విగ్రహములో మఱికొన్ని చోట్ల ఆ మార్పులు చేసినారు. ఈ మార్పులు చేసినారని నే ననుచుందును. ఆ యర్చకుడాశ్చర్యపోవుచుండును. ఈ శివాలయము మా నాయనగారు ప్రతిష్ఠ చేసినది. ఆ శివుఁడు జ్ఞానమూర్తియై లింగా కృతియై తన కిష్టము వచ్చినప్పుడు నా భ్రూమధ్యమునం దాడుచుండును.

కాని, యీ రాముఁడెచ్చట నుండి వచ్చెను స్వప్నములోనెవఁడోనాగుండె మీఁద కూర్చుండెను. రామ రామ యను మాటలు నాకునోట వచ్చెను. వానిని బడ గుంజితిని. మెలకువ వచ్చెను. చూడఁగా మా కూర్చున్నభూతము లేదు. వానిని గుంజిన రాముఁడును లేఁడు. చాల చిన్నప్పటి యనుభవము. అందుచేత నాత్మారాముఁడు తరువాత మానాయనగారి యాజ్ఞచేత నాయనంత భాషా ప్రభుత్వము చేత భావనా నైశిత్యము చేత కల్పనానైరంతర్యము చేత నాచేత కల్పవృక్షమును వ్రాయించుకొన్నాఁడు. ఆత్మారాముఁడనుట లోకము నందున్నది. ఈ లోకములోని మాట కావచ్చును. కాకపోవచ్చును. నా జీవితమున చిన్నతనము నుండి యాత్మారాముఁడు ఈ రాముఁడు నాజీవితములో పలుసార్లు పలు విధములుగా కనిపించును.

ఉ. వ్యగ్రత వచ్చినట్టివయసందున స్వప్నములో మహాశిలా

విగ్రహముల్‌ గలట్టి యొకపెద్దది చిత్రపుశాల గోడలో

విగ్రహముండె రామునిది విల్గొని, నేను సమీపమేగ, హ

స్తగ్రహణంబు చేసె ననుదాను సగంబుగ గోడ వీడుచున్‌.

అర్థము సులభము అయినను అదియొకపెద్ద చిత్రశాల. అన్నియురాతి విగ్రహములు ఒక రాతివిగ్రహము కోదండరామునిది. గోడలోనున్నది. నేను దాని దగ్గఱకుపోయితిని. ఆరాయి గోడలోనుండి సగమివతలకు వచ్చెను. నన్నుపట్టుకొనెను. స్వప్నములు చమత్కారములు, ఇట్టియనుభూతులు కొన్నిస్వాప్నికములు కొన్ని యర్థవ్యగ్రతా సమయ జనితములు నాకుఁగలవు ఎక్కువ బ్రహ్మనిత్యత్వమను గూర్చిన స్వప్నములువచ్చును గిరికుమారుని ప్రేమ గీతములలో నట్టిస్వప్నాను భూతులు రెండుమూఁడు వ్రాసితిని. ఆగ్రంథము నాకు సుమారు పాతిక యేండ్ల వయసులో వ్రాసినది. తరువాత నొక యర్ధవ్యగ్రదశలో స్వప్నముకాదు. నిద్రకాదు, మేల్కొనుటకాదు. ఆ దశలో శివుఁడును పార్వతియును గన్పించిరి స్వామి వచ్చి నన్ను లాలించెను. నాయొడిలో కూర్చుండెను. అక్కడ నమ్మవారు కూర్చున్నది కనుక నేనాయన శివుఁడనుకొన్నాను. కాని ఆ మూర్తియందు శివాకృతి లక్షణము లేమియులేవు. నాకెప్పుడును సరిగానిదుర పట్టదు. స్వప్నములే స్వప్నములు. ఆ స్వప్నములలో ననంతానుభూతులు. నా జీవితములోని జాగ్రదవస్థలోని యనుభూతులును. ఈ స్వప్నావస్థలోని యనుభూతులును కలిసి నాకవిత్వములోని కల్పనలలో సగము మించి యగుచున్నవి. ఊహలేదు. కల్పనలేదు. వట్టి జాగ్రత్స్వప్నానుభూతి నా కవిత్వము.

ఉ. పాయని చిన్నపెద్దవగు బాములు వచ్చును, నోటినుండి రా

మాయనివచ్చు, బాములును మాయమగున్‌ త్రుటిలోన, లోనలో

లోయమియించు రాముఁడువిలుప్తజగత్క్రియుఁడైరమించు, రా

మాయనుమాట అమ్మయను మాటయు జీవుని రెండు వైపులై.

నా కాపదలు వచ్చుచుండును. వచ్చినప్పుడు 'రామా' యని నోటివెంట వచ్చును. ఆ యాపదలు మనోబాధను కలిగించువైనచో 'రామా' యని వచ్చును. శరీరబాధ కలిగించునవైనచో 'అమ్మా' యని వచ్చును. ఈరెండును జీవునకు రెండువైపులు కాపలయును. లోనరాముఁడు. బయట అమ్మ రాముఁడు సరే. ఈ అమ్మ యెవరు? ఈమె మహాశక్తి నా గ్రంథములలో నటు శివకేశవులనుగుఱించి యెంత వ్రాసితినో యిటు శక్తిని గురించి యంత వ్రాసితిని. సీతాదేవి మహాశక్తియని నిరూపించితి ననుకొందును. నాకు వచ్చెడి కష్టములు రామా యన్నప్పుడు కొన్ని మాయమగును. అమ్మా యన్నప్పుడు అనుభవింతును. అనుభవించుటచేత పూర్వకర్మ నశించును గదా!

ఉ. పైకిని మానుసుల్‌. హృదయ భావనచేత క్రియాకలాపముల్‌

పైకిని మూర్తులున్‌.హృదయభావన ముఖ్యమటన్న మాటయీ

లోకములో రహస్యమిది, లోకువ భావన కెప్పుడున్‌ మను

ష్యాకృతి యెన్నినాళ్లు బ్రదుకన్ని దినంబులె మానుషాకృతుల్‌

మానవుల వలె కన్పింతుము. ఈ శరీరములు మన యూహలను భావములను సంకల్పములను ఆచరణకుఁదెచ్చునట్టి సాధనములు, భావనయే ముఖ్యము. ఎంతటి మహాపురుషుఁడైనను వాని భావనచేత నగుచున్నాఁడు. రాజ్య ములు గెలిచినను భావనచేతనే. మహాగ్రంథములు వ్రాసినను భావనచేతనే. ఈ మట్టిబొమ్మకు ప్రాధాన్యము లేదు. ఎన్నాళ్ళు బ్రదుకో అన్నాళ్ళీ మనుష్యాకృతి. లోననున్నది భావన, ఊహ, సంకల్పము, నిశ్చయము. వీని నన్నింటిని మించి సత్పురుషులకు లోన భగవంతుఁడుండును. రాముడుండును. ఆ రాముఁడేమి చేయును? ఈ సంకల్పము ఊహ, భావన, బుద్ధి మొదలైన వానిని సత్కార్యములయందు సదూహల యందు మరలించుచుండును. ఆ రాముఁడో మఱి యొకఁడో లేనివాని సంకల్ప భావనా బుద్ధ్యాదులు లోకము వైపునకు మరలి అదియే ప్రధాన మనుకొని జన్మ పరంపరా హతుఁడగును. ఆ లోనున్న రాముఁడే ఆత్మారాముఁడు.

ఉ. భావముఁబట్టి, రూపమును రూపమును క్రియా కలాపముల్‌

భావములందుఁగొన్నటికిఁ బట్టవు రూపములున్‌ క్రుధా యశో

------------------------------------------------------------------------------------------------

1. రూపమును బట్టిన యట్టి క్రియాకలాపముల్‌

హ్రీవినయాదులై మనుజకృత్యములన్‌ దెలియన్‌ వలెన్‌ సదా

దైవముతత్త్వమయ్యెనవతారముఁదాల్చగలట్టి తత్త్వమై.

మానవులకు దైవమునకు భేదమిది. జంతువులకు దైవమునకు భేదమిది. ఆ జీవుఁడు తన భావన కునుగుణమైన రూపమును దాల్చును. దాని కనుగుణమైన కర్మలుచేయును. క్రుధా-కోపము; యశః-కీర్తి, హ్రీ-సిగ్గు వినయము ఇవి భావములు. వీనికి రూపము లేదు. మనుష్యుఁడుచేసెడి పనులను బట్టి తెలిసికొన వలయును. ఆ జీవుఁడు బహిర్ముఖుఁడై యీ కామ క్రోధాదులను వెలార్చుచుండును. వానికి రూపములు లేవు. అవి రూపములను పొందవు. వీని యన్నింటికిపై నొక తత్త్వమున్నది. అది దైవము. జీవుడు తన భావములతో రూపమును తాల్చినట్లు ఆ తత్త్వము శివుఁడో విష్ణువో యై యవతారము లెత్తును. అనగా మనుజులవలె రూపము దాల్చును. దైవమునకాశక్తియున్నది. కర్మరూపమైన జీవునకాశక్తియున్నది. ఆ లోపలి శక్తి ఆత్మారాముడు.

ఉ. ఆయనయైన తత్త్వమొఁకడాయొకభావము చూడరానిదై

శ్రీయుతి నాకుజాతు విరచించిన లోక హితార్థమైన రా

మాయణ సత్కథానుసృతి నందిన రూపము రామభద్రుఁడై

ఆయన నేడులేఁడును జానావళి తాతలు తాడలుం బలెన్‌.

ఆ దైవమే తత్త్వము. ఆతత్త్వమవతారముఁదాల్చగలదు. నాకు జాతుఁడు-వాల్మీకి (నాకువు-పుట్ట-వల్మీకము) ఆయన వ్రాసిన రామాయణములో నాయన రాముఁడై యవతరించెను. ఆ రామాయణము వలన నాతత్త్వమవతారముఁదాల్చెనని మనకుఁదెలిసెనని యర్థము. ఆయన యంత దైవమైనచో ఆ ధైవమును నాకు చూపించుమని యొకఁడడిగినచో నెట్లుండుననగా నాదైవమును చూపించుమని యడిగిన వానికి తండ్రి యున్నాఁడు కదా! తండ్రి లేకుండ వీడు జన్మించఁడు కదా! ఆ తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి, తండ్రుల వరుస యెన్ని లక్షల సంవత్సరములుగా నెన్నికోట్ల సంవత్సరములుగా నున్నదో తెలియదు గదా. వానిని తన తాత ముత్తాతలను చూపించు మనుము. ఎక్కడ చూపించును? పిచ్చివారు ఈతండ్రులవరుసలో నెప్పుడో కొన్నివేల యేండ్లక్రింద మొదటి మానవుఁడున్నాఁడట. వానిని భగవంతుఁడు సృష్టించినాఁడట అని నమ్ముదురు. ఎందుకు నమ్ముదురో వారికే తెలియవలెను. ఆ మొదటి మానవుని సృష్టించిన భగవంతుడు నేడును హఠాత్తుగా మనుష్యులను సృష్టించ వచ్చును. స్త్రీ లెందుకు? పురుషులెందుకు? ఈ సంసారము లెందుకు? ఈ సృష్టి యెందుకు? ఈ పని నిత్యము భగవంతుఁడు చేయు చున్నచో సరిపోవును గద. వానికి శ్రమ యెట్టిది? శ్రమ మొదలైనవి లేనివాఁడే కద భగవంతుడు?

మఱి మీ వేదములలో కూడ కొన్నిచోట్ల నిట్లే చెప్పబడియున్నది కదా! జాగ్రత్తగ విచారించినచో వేదములలో చెప్పఁబడినది తత్త్వము. 'స్థితస్య గతి శ్చింతనీయా' ఉన్న స్థితి విచారింపఁ దగినది. వేదములలో చెప్పిన విషయములు చింతితములు. ఉన్న సృష్టిని గూర్చి విచారణ చేసినది. ఇది చాల రహస్యము. అందుకని యే వేదములలో సృష్టి వేయిచోట్ల వేయి విధములుగా చెప్పఁబడినది. అప్పుడప్పుడా రీతిగా నారీతిగా ఋషులు తత్కాల సితిని బట్టి చింతించిరి. వారి యాలోచన యంతయు మానవుఁడు తిరిగి తాను బ్రహ్మ పదార్థ భూతుఁ చేయవలసిన ప్రయత్నము ప్రధానముగా కలది. వేదముల యందు నొకే విషయము భిన్న స్థలములయందు భిన్నముగాఁ బ్రతిపాదింపబడు చుండును. ఆ భిన్నత తత్తజ్జీవుల జన్మ పరిణామ సంస్కార కర్మాదలు వివక్ష చేసి వారి వారి కనుకూలముగా చెప్పఁబడినది. ఉదాహరణ :- 'ఆనంద మయుఁడు సృష్టిఁజేసి తాను మానవునిలో చొచ్చెను' అని వేదములో నున్నది. దీనికర్థ మేమనగా జీవునిలోనున్న యానందము భగవదంశ యని. ఇంతే.

ఉ. అచ్చపు చేతనత్వమయి అచ్చపు సత్వమునైన దైవమున్‌

మెచ్చగలేఁడు మానవుఁడు మ్కెత్తినమన్నయి ధీబలంబుబీ

టిచ్చనచోటఁ జొచ్చికొని ఈశ్వరుఁడెక్కువ సందు చేసికొం

చచ్చట కూరుచుండు నెడమైన రమించును ధ్యానమూర్తియై.

పూర్వము చెప్పిన కీర్తికామాదులకే రూపములేదు. అచ్చపుచేతనత్వము అచ్చపు సత్వమునైన దైవమునకు రూపముండునా? ఆ గుణమధికముగా నున్నప్పుడు ఆ గుణమున్న చోటు వాని వానికి రూపముగా చెప్పుదురు. వాఁడు మూర్తిగొన్న కోపము, వాఁడు మూర్తిగొన్న ప్రతిభ,అని లోకమున నందురు. ఆకోపమో ప్రతిభయో యధికముగానే పురుషునందున్నదో వాఁడు దానికి మూర్తి యనుట. అట్లే భగవత్తత్వ మధికముగా నెచ్చుట నున్నదో వానిని భగవంతుఁడందురు.

ఇది కాక యింకొక పరమరహస్యమున్నది. బ్రహ్మ పదార్థము నిర్గుణము. నిరామయము. మానవుఁడు భగవంతుని భావించుటయే కాదు. చూడవలె ననుకొన్నాఁడు. ఇది మానవ బుద్ధిలోని దోషము, శబ్దము లేదు. నోటితో నన్నప్పుడు శబ్దము పుట్టుచున్నది.ఆకాశములో పుట్టుచున్నది. లేని శబ్దమునకు రూపముము కల్గినది. పుట్టిన శబ్దమునకు భిన్న భిన్న భావములు కలుగుచున్నవి. పసిపిల్ల లేడ్చినచో ముద్దు పెద్దవాం డ్రేడ్చినచో దుఃఖము. సంగీతమైనచో సౌఖ్యము.ఈ రీతిగాలేని శబ్దము పుట్టి దానినుండి భావమలు కలుగు చున్నవి. ఆ లేని శబ్దము మొదట నెట్టు పుట్టినది ఓం-కారముగా పుట్టినది, తగినంత బుద్ధి బలములేక ఆలోచన లేకపోయినచో నివి వ్యర్థ మయ్యెడి విషయములుకావు. బుద్ధిహీనులుకాదన్నచో లేకపోయెడివి కావు. మహావిషయములన్నియు నింతే. లేని శబ్దము పుట్టినట్లుగా లేని రూపము పుట్టినది. లేని గుణములు పుట్టినవి.

ఆ మూలభూతమైన వస్తువును వదలిపెట్టినచో మానవులలోమహాబుద్ది మంతులున్నారు. ఎంత బుద్ధి హీనులుందురో అంత బుద్ధిమంతులున్నారు. వారిని ఋషులందము, శాస్త్ర నిర్మాత లందము. ఆ మహర్షులేమి చేసిరనగా నిరాకారము నిర్గుణమునైన తత్త్వమునకు బీజాక్షరములు రూపము గుణములు, ఆ రూప మా గుణమలకుఁ దగినట్లు దేవతాదులను సృష్టించినారు. వారికి రూపమల నిచ్చినారు. వారియందు గుణములను సంక్రమింపించినారు. మనుష్యుడు వట్టి భావనా జీవుఁడు. సంకల్ప జీవుఁడు. మనో జీవుఁడు. ఎటిఁడైనను వీఁడొకప్పుడు శుద్ధ చైతన్యమును భావించుటకు శక్తి హీనుఁడగుచున్నాడు. ఢిల్లీకి పోవుటకు నాగపూరు ఝాన్సీల మీఁదుగా పోవలయునన్నట్లుగా నా శుద్ధ చైతన్యమును చేరుటకు జీవుఁడు విష్ణువు, ఇంద్రుఁడు, బ్రహ్మ వీరిని కల్పించినారు. వారిని మొట్టమొదట చూడుము. అచ్చట నుండి శుద్ధ చైతన్యము సులభ వ్యాప్యము. నీవు నాగపూరు ఝాన్సీలను దాటి మధుర చేరుము. అచ్చటికి ఢిల్లీ చాలా సమీపము. ఆ రీతిగా నేర్పఱిచిన మార్గమునందు నీ దేవతలు ప్రధాన ప్రతీకలుగా నున్నారు. వారిని నీవు నాకు చూపించు మన్నచో నీవు రైలు ప్రయాణము జేసినచో టిక్కెట్టుకు డబ్బు కావలయును. ఆ టిక్కెట్టు కొన్నచో నీవే వెళ్ళగల్గుదువు. నేను లండను లేదందును. ఉన్నచో చూపించుమందును. ప్లేనుకు పట్టవలసిన డబ్బు తీసికొని రమ్ము. ఆ డబ్ము నన్ను పెట్టుకొమ్మందువా? ఓరి బుద్ధిమంతుడా? ఆ భగవంతుడు నీకు కనిపించవలయునన్నచో నీవు సత్కార్యములుచేయుచుండ వలయును. అబద్ధములు మాట్లాడరాదు. దురహంకారమును దురభిమా మును వీడి నిత్యము వారిని ధ్యానించ వలయును. ఇవి యన్నియు లండనో. న్యూయార్కో చూచుటకు పెట్టుకొన వలసిని విమానార్థ వ్యయము వంటివి. నాకు భగవంతుని చూపుమని తైతక్కలాడకుము. అట్లు వెళ్ళినచో న్యూయార్కు కనిపించును ఇట్లుపాసన చేసినచో భగవంతుఁడు కనిపించును. ఇంతే భేదము. ఆ రాముఁడాత్మారాముఁడు. ఆత్మ యందున్నాడు. లోనికి త్రవ్వుకొన వలయును. నీవు బయటికి త్రవ్వినచో గుట్టలకొలఁది మన్ను త్రవ్వుదువు. ఆ మన్నునుకొనెడి వారున్నాను. పొలాలలో పోసికొందురు. అట్లే నీ భగవంతుఁడు లేదన్న వ్రాతలు కూడ. మన్ను అమ్మి ఎఱువులమ్మి డబ్బు చేసికొన్నట్లు. ఇంక నా విషయము.

శా. ఆ రామాయణమిట్లు వ్రాసితిని నిత్యధ్యానమున్‌ జేసెదన్‌

శ్రీరాముండనుమాట విన్నయెడలన్‌ హృత్సీమ పొండెత్తెడున్‌

ఆరామాయణమేమొ పూర్తి మయి నన్నారాముడున్‌ వీఁడఁడా

త్మారాముండయి యుండెనో తెలియరాదాయెన్‌ భయంబయ్యెడున్‌

ఆలోనున్నరాముఁడు నాచేత కల్పవృక్షమును వ్రాయించినాఁడు నేను బహుకావ్యములువ్రాసితిని కదా! కలముపుచ్చికొన్నచో నా కల మాగదు. అంత ఊహసంపత్తి అంత కల్పనాశక్తి, అంతటి యభ్యాసపాటవము నాకున్నది. వేయిపడగలు నెలనాళ్లలో వ్రాసితిని. కొన్ని గ్రంథములకు పది దినములు కూడ పట్టలేదు. అట్టే నేను కల్పవృక్షమును ముప్పది యేండ్లు వ్రాసితిని. ఎందుచేత? తక్కిన కావ్యములు వ్రాయుటకు కావలసిన శక్తివేఱు. కల్పవృక్షము వ్రాయుటకు కావలసిన శక్తివేఱు. రాముఁడు వచ్చి లోనఁగూర్చున్నప్పుడుకల్పవృక్షము సాగెడిది. లేనిచో నొక్కక్కప్పుడు పద్యము సగములో నాగిపోయెడిది. మూడేండ్లు నాలుగేండ్లు గడచిపోయినవి. ఈ మధ్య నెన్నో గ్రంథములను వ్రాయుచుంటిని. అయ్యో రామాయణము వ్రాయుట లేదన్న దిగులట్లే యుండెడిది. ఒక ప్రత్యక్షమైన కథ చెప్పుదును. యుద్ధకాండములో మొదటి మూడు వందల పద్యములు 1957 లో వ్రాసితిని. కరీంనగర్‌ నుండి ఉద్యోగము విరమణ చేసితిని. ఇంటికి వచ్చితిని. ఒకనాఁటి ప్రోద్దున ప్రత్యక్షముగ 'రామాయణమును మొదలు పెట్టుము' అన్నమాటలు వినిపించినవి. ఎవరో చెప్పినట్లు వినిపించినవి. అక్షరమయమైన శబ్దమయమైన వాక్యము వినిపించినది. వెంటనే ప్రారంభించితిని. మూఁడు నాలుగు నెలలలో చివరిదాఁక తరుము కొనిపోయినది. ఒకచోట మరల నాగిపోవు ననిపించినది. రాముఁడు తానువచ్చి భరద్వాజుని యాశ్రమమునందుండి యేనాఁటికి తానువత్తునని భరతునితో చెప్పినాఁడో ఆనాటికి రాలేనని హనుమంతునిచేత వార్తపెట్టినాడు. ఆనాఁటికి రాముఁడు రానిచో భరతుఁడగ్నిప్రవేశముజేయును.ఆంజనేయుఁడు వచ్చు సరికి భరతుఁడగ్ని ప్రవేశముఁ జేయుటకుఏ సిద్ధముగనున్నాఁడు. ఆంజనేయుఁడు దూరమునందుండియే రాముని యాగమన వార్తఁ జెప్పినాఁడు. దగ్గఱకు వచ్చి చెప్పినచో నెవడో తన సంకల్పము విఘ్నము చేయుటకు వచ్చెనని హఠాత్తుగా నగ్నిలో దూకవచ్చును. భరతుఁడప్పుడు పరులమాట వినెడి స్థితిలోలేఁడు. ఒక తన్మయస్థితిలో నున్నాఁడు. అది రసభావము. అందుచేత ఆంజనేయుఁడు దూరమునందుండి రాముఁడు వచ్చెనన్నమాట సంగీతము పాడుచు నా సంగీత ములో చెప్పినాడు. ఆంజనేయుఁడు మహాగాయకుఁడుకదా! సంగీతమేమిచేయును? రససిద్ధి కలిగించును. భరతుఁడు తానారసస్థితిలో నుండెను ఆ స్థితిలోనే వార్త వినిపించెను. లేనిచో వినిపించెడిదికాదు. అది యాంజనేయుని వివేకము. ఆ వార్తవినుచునే భరతుని కన్నులయందు బాష్పము లుదయించినవి. ఆయన కంఠశంఖమున నొక నిస్వానము వచ్చినది.

ఈ పద్యము యుద్ధకాండములో చివరిఖండము ఉపసంహరణలో నున్నది. పద్యపు సంఖ్య 325. ఆ కంఠస్వర మెట్లున్నదో నాకు తెలియలేదు నాల్గవ చరణమాగిపోయినది. రాదు. కొన్ని గంటలు తపన పొందితిని. భోజనములేదు. స్నానముచేసితిని. జపము చేసికొంటిని. ఇంటిలో భోజనము చేయుమందురు. నేను చేయను. చాలసేపటికి నాకు తోచినది. నాల్గవ చరణము సిద్ధముగా నున్నదని. నేనూహించినది కాదు నేను వ్రాసినదికాదు. సిద్ధముగా నున్నది. వెంటనే కాగితము కలమును తెచ్చితిని. నాల్గవచరణమిట్లున్నది 'జైత్రయాత్రాంచచ్ఛ్రీ మధుసూదనాస్య పవమానాపూర్ణమైనట్టులన్‌'

వచ్చినది వ్రాసితిని. పైని కంఠశంఖమున నని నేనే వ్రాసితిని రూపక సమాసము. రాముడు విజయయాత్రకు బయలుదేరినప్పుడు పరమేశ్వరుని కంఠమునుండి వచ్చిన వాయువుచేత నిండినట్లున్నది. భరతుఁడు శంఖావతారము, కంఠశంఖమున నని నేనే వ్రాసితిని. నేను వట్టి రూపకసమాసముగా జమకట్టు కొంటిని ఆ శంఖమును శ్రీరామచంద్రుఁడు జైత్రయాత్రకు బయలుదేరుచు దానిలో తన నోటి వాయువు పూరించగా వెలువడిన ధ్వనివలెనున్న దంట, ఇది నాలోని యాత్మారాముడు పూరించిన చరణము. తరువాత రామాయణము పూర్తియైనది. ఆచరణ మట్లు పూరింపబడగా నాకానందముపట్టలేదు.

ఈ యుపసంహరణ ఖండమునందే 412 వ పదమునుండి 'ఖద్యోనిర్గతమైన' అని ప్రారంభించును. ఆపద్యమును వ్రాసితిని. ఈ పద్యమును ఆ శంఖధ్వనివద్ద వ్రాయుదునా? కథానన్యూతికి భంగమగును. అందుచేత యుద్ధకాండము చివర వ్రాసితిని. ఆత్మారాముఁడనగా నిది కావచ్చును. కాని''వదలం డా రాముడన్‌నన్ను నాత్మారాముఁడయి యుండెనో తెలియరాదయ్యెన్‌ భయం బయ్యెడున్‌ ''

ఎందుకు భయము? నిజముగా నిది యాత్మారాముని స్థితియో నాయంతట నేనీ సన్నివేశమును నా కనుకూలముగా వ్యాఖ్యానముచేసికొనుచున్నానో యిది భయము. భయమనగా జీవలక్షణము, అభయం ప్రాప్యస్వ అని యాజ్ఞవల్కుడు జనకునితో నన్నాడు. అభయం బనగా ముక్తి. జీవలక్షణ పరిత్యాగము. నాకు భయమగుచున్నదనగా స్వామి యెంత ప్రత్యక్షముగానున్నను నా జీవలక్షణము నన్ను వదలి పోలేదని యర్థము. తరువాత వంత పద్యములు వ్రాసిన గాని యుద్ధకాండము పూర్తికాలేదు. జీవలక్షణము తిరిగిరానిచో కల్పవృక్షము పూర్తియయ్యెడిది కాదు.

కం. ఇది యాత్మారాముని దౌ

సదమల రూపంబు సర్వసంపత్కంబై

మది నమ్ముము కడుమంచిది

మది నమ్మకు మంతకంటె మంచిది పోనీ.

ఓపికలేని మానవుని యూహయుఁ జూచినదే గ్రహింపనై

రూపములేనిదానిని నిరూపణ చేయగఁజాల నట్టిదై

కోపము కీర్తియాదిగల కొన్నిటికిన్‌ మనుజాను భావరే

ఖాపరిణామలక్షణము గల్గినయట్టి జహత్‌ స్వభావమై.



జీవుడు రూపముంగను, నశించును రూపము భూతసృష్టియై

జీవుడు రూపముం గను,నచేతనతాగుణ మున్కి లేశ##మై

జీవుడు రూపముం గనున, చేసిన కర్మఫలంబు నొందఁగా

దైవమురూపమూను, నవతారము ధర్మరిరక్షిషుండుగా



ఉండెన్‌ నాకు బ్రవాహభూత ప్రతిభావ్యుత్పత్తు లభ్యాసమున్‌

నిండెన్‌ ముప్పదియేండ్లు వ్రాయుటకు గానీ కల్పవృక్షంబు నే

రెండేడ్లైననుజాలు నెప్డెపుడు తాహృత్సీమలో రాముడై

యుండెన్‌ వ్రాయుట గల్గె లేడు మఱిలే దుత్త్రింశ దబ్దంబుగా



మఱియొక చిత్రమైన దగుమాట యొకప్పుడు రాదు పద్యపుం

జరణము నెంతగింజుకొని సాగద యెప్పుడో వ్రాసియున్నటుల్‌

స్ఫురణము కాగితంబువయి పూన్చుట నాపని వ్రాసినట్టి దె

వ్వరు రఘురామచంద్రుడయివ్రాసెనొ! స్వామికిదెల్గువచ్చునా!''



శ్లో|| యదన్నాః మానవాః తదన్నావై దేవతాః

యద్భాషా మానవాః తద్భాషా వైదేవతాః

మానవులే యన్నము తిందురో ఆ యన్నమునే దేవతలకు పెట్టుదురు. వరిబియ్యము తినెడివాడు దేవతలకు వరి యన్నమును పెట్టును. గోధుమలు తినెడివాడు దేవతలకు గోధుమ యన్నముఁ బెట్టును. మాంసమును తినెడివాడు దేవతలకు మాంసమును పెట్టును. మానవుడు ఏయన్నము కలవాఁడో దేవతలును ఆ యన్నమే కలవారు మానవులే భాషతో స్వామిని కల్పవృక్షాదులతో స్తుతింతురో స్వామియు నాభాషవాడే. స్వామి నేను తినెడి యన్నమును తినును. నా మాతృభాషయైన యాంధ్రభాష యాయనకుదెలియును.



నమః శ్రీరామ చంద్రాయ.

Na Ramudu   Chapters   Last Page