Na Ramudu   Chapters   Last Page

 

ఆనందమూర్తి

మ. అనుభూతుల్‌ మరి భావముల్‌ గుణచయం బాకారసంతాన మూ

నినదీ సృష్టియనన్‌ నిరంతరముగా నిర్వ్యాజసవ్యాజ మూ

నినరూపంబుల దై వమానవుcడుగా నిండారు నీధాత్రి సా

గును సంఘర్షణలై పరస్పరము ప్రోగుల్‌వడ్డ కార్యంబులై

ఇంతకుముందు ఆనందమయుcడన్న శీర్షికతో స్వామివట్టియానందము. అచ్ఛమైన యానందము అని చెప్పcబడినది. అదియనుభూతి, దానికి రూపము లేదు. అట్టిరాముcడు రాముcడుగా దశరథుని కుమారుcడై యెట్లు పుట్టెనన్నది ప్రశ్న. సృష్టియనగా నిదే. ఒక్క పరమేశ్వరుcడేకాదు. దేవతలును మనుష్యులు కూడ నందఱును కొన్ని యనుభవములు కొన్ని భావములు కొన్ని గుణములు నాకారముcబొందును. అవి నిరంతరముగా పొందుచుండును. అందుచేత సృష్టి సాగుచున్నది. దైవములు మానవులు రూపములు పూనుదురు. కొందఱు నిర్వ్యా జముగా పూనుదురు. అనగా కారణములేకుండ పూనుదురు. కొందఱు సవ్యాజముగ పూనుదురు. అనగా నొక కారణమును పెట్టుకొని శరీరములు ధరింతురని యర్థము. ఇక్కడ నిర్వ్యాజ సవ్యాజశబ్దములకు నిష్కామముగా సకామముగా ననియర్థము. అవతారములు నిర్వ్యాజముగా నుండును. అనగా వారికి కోరికలేదు. వారుకామహతులుకారు. మానవులకు కోరికలుండును. వీరుకామహతులు. ఇది భేదము రాముcడు రావణుని వధించుటకు జన్మించెనుకదా! కృష్ణుcడుకూడ భారత యుద్ధము కొఱకు పుట్టెను కదా! వారి యవతారములు నిర్వ్యాజములనుటయెట్లు? ఆ కోరిక చేత నీ మనస్సు నీజీవుcడు తాడితమై సుఖదుఃఖము లనుభవించినచో నది సవ్యాజము. మనము కొన్ని పనులు చేయుదుము. ప్రయోజనము లేదు ఏదో చేసినాను. నవ్వుచు చేసినాను. ఇట్లందుము. ఇదినిర్వ్యాజము. నీకువచ్చెడి ప్రయోజనములేదు. దానివలన నీకు లాభములేదు. నష్టములేదు. అవతారములయొక్క నిర్వ్యాజలక్షణమిది. ఎదో వాcడు కావలయు ననుకొనినాcడు. చేసిపెట్టినాను. దాని ఫలితము నేనుకోరలేదు. ఇది నిర్వ్యాజము. అవతారములు ప్రధానముగా నిట్టివి. ఇంక నీ సవ్యాజముగా పుట్టెడి మానవులకు నొకరి కోరిక మరియొకరికి నష్టము. అప్పుడు సంఘర్షణ దానినుండి కార్యము పుట్టును. అట్టికార్యముల సమూహమే యీ సృష్టి.

ఉ. ఉత్తమ భావముల్‌ మనుజు లుత్తములై జనియించుచుండగా

చిత్తడి భావముల్‌ మరియు జిత్తడి రూపములన్‌ వహింపగా

నొత్తిడి గల్గి రెంటికిని నుర్విని మానవజాతి మారగా

క్రొత్తడి శీలమెల్లc బెడcద్రోసి చరించెడి స్త్రీజగత్తుగా.

ఈ యనుభవములు గుణములు భావములు రూపములను పొందును. ఆ పొందుట యెట్లుండును? ఉత్తమ భావముకలవాcడు ఉత్తమమైన రూపమును పొందును. చెడ్డభావము కలవారు చెడ్డరూపములను పొందుదురు. ఈ భావము లెట్లుండును? జీవుల యందు సంస్కారరూపముగా నుండును. ఒక పురుషుcడు సత్కార్యములను చేసెను. వాcడు చనిపోయెను. ఒకcడు దుష్కార్యములను చేసెను. వాcడును చనిపోయెను. చనిపోవుట తప్పదుకదా! దానితోనయిపోయి నదా! సత్కార్యములు చేసినవానికి నీవు వర్ధంతులు చేయుదువు. స్మారక చిహ్నములు పెట్టుదువు. అసత్కార్యములు చేసిన వారికి కూడ కొందరికి శిలాప్రతిమలు వేయుదువు. మంచి చెడ్డకార్యముల కింతేఫలమా? అయినచో, లోకము మనకు కనిపించు దానికన్న గూడ ఘోరమయినది. సృష్టియెంతో నిష్ప్రయోజనముగా జరుగుచున్నది. ప్రయోజనము లేకుండ సృష్టిజరుగుట సంభవించదు. సంభవించకూడదు. అది తప్పు. ఈ వర్ధంతులు మొదలయినవి ప్రయోజనములు కావు ఒకcడు చేసిన పనికి ఫలితము నింకొకcడు పొందవచ్చును. చేసిన వాని విషయమేమి? వానికేమియు ప్రయోజనములేదా? వాcడు చచ్చిఊరకుండుట యేనా? వానికి ప్రయోజనముండి తీరవలయును. వాcడుండవలయును. మానవ రూపముతోనున్నప్పుడు వాcడుండెను. ఈ రూపము లేనప్పుడు వాcడు లేదు. ఆ రూపము వాcడు కాడు. ఆ రూపము మారుచుండును. వాcడు మారుచుండెనా? నేను చిన్నప్పుడీ పని చేసితిని. వాcడు పెద్దవాcడైనాడు. ఆ చిన్నప్పుడు పెద్దప్పుడు వాcడు తానుతానుగానే చెప్పుకొనుచున్నాడుకదాః నేను పుట్టినాను. ఈ మాటలు వాcడు పుట్టక పూర్వమున్నాడని యర్థము పుట్టుచున్నది. వాcడు చనిపోయినాcడు. వాcడు వేరే యున్నాcడని అర్థము పుట్టుచున్నది. అందుచేత వాcడు అనువాcడొకడున్నాడు. వాడెవcడు? ఇన్నాళ్ళు నేను నేననుకొని వ్యవహరించెడివాcడు. వాడు వాcడని యితరులచేత వ్యవహరింపcబడినవాcడు. వాcడు జీవుcడు. వాcడుతన గుణములకు భావములకు తన యనుభూతులకు ననుకూల ముగ తానుచేసిన పాపపుణ్యముంకు ఫలముగ నీజన్మల యెత్తినాడు. జీవుcడున్నాడని యర్థము. జీవుcడు లేడనుట పెంకెమతనము. ప్రయోజనములేనిమాట. కార్యకారణ జ్ఞానము లేనిమాట. పరమాధముcడైన జీవుcడనెడి మాట.

ఫలము కార్యము ననుసంధించి పుట్టుట లోకమునందున్నది. దాని నొప్పికొని తీరవలయును. ఒక కార్యమునకొక ఫలము కనిపించి తీరుచున్నది. ఆ రీతిగా జీవుcడు వాcడు చేసిన పాపపుణ్యములకు ఫలమనుభవించి తీరును. ఒక కార్యము దానికి ఫలము కలుగుట లోకమునందు కనిపించుచున్నదికదా! ఇది యెక్కడనుండి వచ్చినది? సృష్టిలో నున్నదన్నమాట. సృష్టియొక్క మూల రహస్యమిది యన్నమాట. ఈ రహస్యము ననుసంధించి సృష్టి ప్రారంభించినది సృష్టి జరుగుచున్నది. మానవులిప్పు డుందురు, రేపు పోదురు. ఆ సృష్టి ధర్మము సాగుచునేయుండును. నీవు కానిచో మరికొందఱు పుట్టుదురు. యుగ యుగములుగ నీ జన పరంపర మీcద నాధర్మము సాగుచునే యున్నది. ఆ ధర్మము జీవులయందుండి యుండవలయును. ఆ జీవుcడు తాను చేసిన కర్మల యొక్క సంపుటియై యుండవలయును. నీ మనస్సు నీకు కనిపించుటలేదు. నీ బుద్ధి నీకు తెలియదు. నీ ప్రేమయొక్క స్వరూపము నీకు తెలియదు. నీకోపము యొక్క లక్షణము నీకు తెలియదు. ఇవి యన్నియు నీవు లోకమునందు ప్రవర్తించుచున్నప్పుడు నీ మాటలచేత నీ క్రియలచేత తెలియcబడుచున్నవి. కాని కంటికి కనcబడవు. అట్లే జీవుcడును. వాcడు కనిపించడు. ఆ జీవుcడు ఉత్తమ భావముల సంపుటి యైనచో ఉత్తములైన స్త్రీపురుషులుగా, చెడ్డ భావముల సంపుటియైనచో దుర్జనులైన స్త్రీ పురుషులుగా జనించును. ఈ ఉత్తమ భావములకు చిత్తడి భావములకు నిత్య సంఘర్షణ. ఇదియే మానవ సృష్టి ఇది లేనిచో మానవులు లేరు. దేశములు లేవు. రాజ్యములులేవు. విమర్శలులేవు. ఈ భావము లతోడి జీవులు మానవులై పుట్టుచున్నారు. మానవులనగా స్త్రీలుకూడ సందులో నున్నారు. ఇంతేకాదు. సర్వజంతువు లిందులో నున్నవి. ఒక పరమ క్రూర భావముకల జీవుcడు పెద్దపులియు సింహమునై పుట్టుచున్నాcడు. ఒక జిత్తుల మారియైన జీవుcడు నక్కయై పుట్టుచున్నాడు. పరమ నీచ భావములు పరమ నీచ కార్యములు చేసిన జీవుcడు కుక్క పంది మొదలైన జంతువులుగ పుట్టుచున్నారు. ఇందులో నొక్క రహస్యమున్నది. ఒక జీవుని సంపుటిలో ననేక సంస్కారము లుండును. ఒక వ్యాఘ్రమును తీసికొందము. దానికి లాఘవ మున్నది. బలమున్నది కోఱలున్నవి. ఆ యాకారమున్నది. ఇట్టి గుణముల సమూహము కదా ఆ జంతువు! ఈ సర్వలక్షణములు కలిగిన జంతువుగ పుట్టుటకు నా జీవునిలో సంస్కారము లున్నవని యర్థము. పెద్దపులియట్లు పుట్టుట యేమి? లేడి యిట్లు పుట్టుటయేమి? అన్ని జంతువులను చూచుకొన వచ్చును. మనుజులై పుట్టినప్పుడు విశేషమున్నది. వీనికి మన స్సున్నది. వీcడు కొన్ని కార్యములు చేయగలcడు. పుణ్యపాపములకు వీcడు కర్త. జంతువులుగా పుట్టి నప్పుడు కర్మననుభవించుచున్నాడు. స్త్రీగా పుట్టినప్పుడు కర్మ ననుభవించుచున్నాడు. మరల కర్మ చేయుచున్నాడు. ఇది తెలివి యనుకొను చున్నాడు. తన కన్న గొప్పవాcడు లేడనుకొనుచున్నాడు. ఇది భేదము. కనుక నేమగుచున్నది? జీవుcడు వాని భావములను వానిగుణములను వాని యనుభూతులను బట్టి భిన్నరూపములు పొందుచున్నాడు. భిన్నములైన జన్మలెత్తుచున్నాడు. సాధులక్షణమున్నచో లేడి. క్రూరలక్షణమున్నచో పులి. ఇందులో మరల భేదములు. మానవులను తీసికొన్నచో సాధులక్షణము కల మానవుని యాకృతి వేరు. అసాధులక్షనములు గల మానవుని యాకృతివేరు. ఈ సృష్టి వైచిత్ర్య మిట్లు వ్యాఖ్యానించవలయును.

సీ. పరమోత్తమంబైన భావం బ దొక్కటి

పరమాధమంబైన భావమొకటి

అవి రూపముల్‌ తాల్చినప్పటికిని గొట్ట

వచ్చినయట్లు కన్పడు మొగాన

తిరిగి దివ్యానుభూతి యొకండు రూపంబు

తాల్చిన, నదియది తానుతాను

గాcగ కన్పడుచుండుc గాకపోవుట¸°ట

చర్చాపరిష్కార సరణిలేక

గీ. అల్ల యానందమే రాముcడై నయట్లు

అల్ల రాముcడే యానందమైన యట్లు

చూచి చూచియుc దెలిసికోనోచుకోని

జన్మయెత్తిన భావాలు చండ్రదినుసు.

పరమోత్తమాధమ భావాలుకల జీవులు జన్మయెత్తినచో వారిని చూచిన యంతనే వీcడుత్తముcడు వీcడు దుర్జనుcడు అను మాట స్పష్టముగా తెలియును. కొందఱిలోనుత్తమాధమ భావములు చిత్ర చిత్రమైన పాళ్ళలో కలిసియుండును. ఒక దుర్మార్గుని గూర్చి లోక మిట్లనును. వాని లక్షణమంతయు వాని కన్నుల లోననే కనిపించుచున్నది. వాని నడకలోనే యున్నది. ఈ రీతిగా విశదమైన భావములతో జన్మించిన వారి రూపములు స్పష్టముగా తెలియవు. వారి దుర్జనత్వము ఒక కన్నులోనో, ఒక పెదవిలోనో. ఒక నడకలోనో కన్పించుచుండును. ఇది యిట్లుండ దివ్యమైన యనుభూతి కలజీవుcడు జన్మయెత్తును. అతని యనుభూతి వెంటనే తెలిసిపోవును. అదియది తాను తానుగా కన్పించుచునే యుండును. కనిపించక పోవుటయున్నది అది చూచెడి వాని దోషము. ఈ చూచెడి వానిలో గుణములు మిశ్రమ ములై యున్నవి. వానికి తెలివిలేదు. చర్చాపరిష్కారము చేయలేcడు. ఆనంద మునకు రామునకు నభేద ప్రతిపత్తి. రెండునొకటే. చూచి చూచి ఆయనను గూర్చి చదివి చదివి కొందఱు తెలిసికోలేరు. ఎందుచేత? వారి భావములు చండ్రదినుసు. చండ్రకఱ్ఱ అని యున్నదికదా. టేకు, మద్ది, చండ్రకఱ్ఱలు. దినుసు అనగా పదార్థము. వారి భావములు చండ్రదినుసనగా వారి మనస్సులు, వారి జీవులు, వారి భావములు నా చండ్రకొయ్య వంటివని యర్థము. దానిని కోసి బల్లలో, స్తంభాలో, ద్వార బంధములో, పీటలో చేసికొనవలయును. ఆ జనుల తెలివి అంతే రామచంద్రుని గ్రహించలేదు, ప్రత్యేకముగా శ్రీరాముcడు ఆనందమయుcడు. ఒక విష్ణుమూర్తి వైకుంఠమునుండి దిగి వచ్చినవాcడు కాడు. ఏ యానందము మూడుగా విభజింపcబడి బ్రహ్మవిష్ణు మహేశ్వరులైనదో ఆయా నందమే రాముcడు. మనలో మనము చూచుకొనcదగినవాcడు.

శా. ఆయానందమెఱుంగcదొందరయెలే దారామునిన్‌జూడ గా

ధేయుండున్‌ మునుపే యెఱుంగుగద డైతేయారి నాదారిలో

రాయైయుండినదౌ నహల్యయును నారాముంగనన్‌ లిప్తలో

నేయానందము రాముcడం చెఱిగె లేcడే లక్ష్మణుండచ్చటన్‌.

గాధేయుcడు అనగా విశ్వామిత్రుcడు. దశరథుని తనకొడుకులను పంపుమనియడిగినాcడు. విశ్వామిత్రునకు రాముని జూడవలయునన్న తొందరయే లేదు. ఎందుచేత? విశ్వామిత్రుcడానందము నెఱుcగును. ఆయానందానుభూతి కలిగినచో రాముని జూచినట్లే. ఇది రహస్యము. అందఱు పోవుచుండిరి. రాముని పాదము తగిలి అహల్య స్త్రీయైనది. తాను స్త్రీ యెట్లయినది? తన శాపవిమోచన మట్లున్నది గనుక. అక్కడ నున్నవారిలో రాముcడెవcడు? రాముని నెట్లు గుర్తు పట్టినది? లక్ష్మణుని పాదస్పర్శచేc దాను స్త్రీ కాకూడదా? వెంటనే రామునెట్లు గుర్తుపట్టినది? ఆయహల్య హృదయములో నొక యానందమున్నది. రాముcడొక్కcడే. ఆ రాముcడు మూర్తి కట్టినట్లున్నాcడు. అందుచేత నామెకు వెంటనే తెలిసినది. ఇంకొక విధముగా తెలియుట కష్టము. రాముడాcనందమూర్తి యనుట కిది ప్రధానసాక్ష్యము.

చం. ఎఱుcగుటకున్‌ బురానుభవ మెంతయుcగావలె జన్మజన్మలం

దెఱిcగినయట్టిదౌ నెఱుక యింతటిలోపలగుర్తు పట్టు దా

పఱికము కన్నలోపది వస్తువు బిట్టుగcద్రవ్వుకోవలెన్‌

మఱచిన వస్తువైన నొకమాత్రముగుర్తుకురాదు చచ్చినన్‌

పూర్వజన్మములయందు నెన్నియోయనుభము లున్నచో నాయానందము వెంటనే గుర్తుకువచ్చును. ఆరాముని వెంటనే గుర్తింతువు వసిష్ఠవిశ్వామిత్రులు అహల్య జనకమహారాజు మొదలైనవారు కొందఱావస్తువు నెఱcగుదురు ఆ వస్తువును దాచుకొందురు. బయటకు రానీయరు. అప్పుడు కొంత లోతు త్రవ్వు కొనినగాని తెలియదు. ఒక గుహుcడు. ఒక మారీచుcడు, ఒక కాకాసురుcడు వారి వారి సంస్కారముల కొలcది త్రవ్వుకొని తెలిసికొనిరి. కొందఱావస్తువును మఱచియే పోవుదురు. తమలో జీవుcడున్నాcడని మఱచిపోదురు. ఆనందమున్నదని మఱచిపోదురు. ఆ యానందము, ఆజీవుcడు, లేనేలేడందురు. వారికి చచ్చినను తెలియదు. జన్మలెత్తుచునే యందురు. అది యే జన్మయో యెవరికి దెలియును? కొందఱు జన్మలనే నమ్మరు. మరీనయము!

మ. మదికిన్‌ గన్పడు నొక్కొకప్పటికి రామస్వామి నాకున్‌ భుజా

స్పదకోదండము ప్రక్కనమ్మయుc బదాబ్జాజతంబునన్‌ హన్మనా

యెదకున్‌ భావనకున్‌ విలోచనములం దేపాఱు దీప్రంబుగాc

బదపద్మంబుల హన్మనా యెద పరీపాకమ్ముతన్మాత్రమో!

నేను తీవ్రముగా ధ్యానించినప్పుడు శ్రీరామచంద్రుcడు బుజమున గోదండము, ప్రక్క సీతమ్మయ, పాదములవద్ద హనుమంతుcడును నాకు చాలసార్లు కనిపింతురు. హనుమంతుడు సర్వదా కనిపించును. వట్టి హనుమంతుcడు కాcడు. రామచరణ సన్నిధానవర్తియైన హనుమంతుcడు. ఆయన దీప్రముగా కనిపించును. ప్రధానముగా ననియర్థము చెప్పుదును. నా హృదయమున కొక పరీపాక మున్నది. ఆ పరిపాకము నిత్యముగా హనుమంతుని చూచెడి మాత్రముదేమో తెలియదు.

శా. కోదండంబటు పెట్టి చక్రమును సంకున్‌బూని నల్సేతులన్‌

పాదూదేశమ మాలి పైపయిని కన్పట్టున్‌ మఱిన్‌ ఱొమ్మునన్‌

బూదండంబలెc గానిపించు మరియాపూదండ మద్భ్రూలతన్‌

బూదండంబలె. సన్నకాంతి యనcగా బొల్చున్‌సమీపించుచున్‌

ఈ యనుభవము నాకేకాగ్రత సిద్ధించినప్పుడు కల్గుచుండును. స్వామి రామునివలెకాక నాలుగుచేతులు శంఖచక్రములతో కన్పించును. పాదములు కన్పించవు. ఆ పూదండ యాయన ఱొమ్మున నుండును. క్రమముగా మూర్తి కనcబడదు. ఆ పూదండ వచ్చివచ్చి నాకనుబొమ్మముడియందు నిలుచును.

మ. శివలింగమ్మును పానవట్టము పయిన్‌ శేషాహి పొల్పారునా

శివలింగమ్మునc బూలదండయది భ్రూసీమన్‌ గుబాళించు మా

ధవుc డొప్పున్‌ మఱియింతలోపల నయోధ్యారాcముడే డేపారుcజి

త్రవిచిత్రంబులు పూర్వజన్మముల ధారారూప సంస్కారముల్‌

ఇదియును నాయనుభూతిలోని విషయమే. పూలదండ కనిపించును. అది శివలింగము పైని వేసినట్లుండును. మఱియు వైకుంఠమునందలి విష్ణుమూర్తి కనిపించును. మరియు కోదండమును బుజానవేసికొని శ్రీరామచంద్రుండు కనిపించును. మరియు శివలింగము పానవట్టము, పైని శేషాహి ఆ శివలింగము చుట్టును పూలదండ. ఈ పూలదండయన్నది నిత్యముగా నుండును. విష్ణుమూర్తి మెడలోనుండును. రామచంద్రుని మెడలో నుండును శివలింగమును చుట్టి యుండును. పూర్వజన్మల సంస్కారములు. చిత్రచిత్రములు నేనద్వైతిని. నాకు శివకేశవులకు భేదములేదు. విష్ణువునకు రామునకు భేదములేదు. నేను వ్రాసినది రామాయణము. అంకితమిచ్చినది మా విశ్వేశ్వరస్వామికి, కల్పవృక్షముయొక్క ఖండాంత పద్యములన్నియు గాఢమైన శివభక్తి పరములు. పేరుశివుcడు. ఆయనయే రాముcడు. వారు బ్రహ్మపదార్థము. బ్రహ్మపదార్థమును ధ్యానించుచున్న పుడు జీవునిలక్షనముగా కనిపించుట యొకటి యుండున. గనుక అదిపూల దండ. చివరకిది యానందానుభూతి. అవియెప్పుడో కలుగును. తక్కినప్పుడివి కలుగును.

ఉ. రాముని జూచినన్‌ తనపురాజని సంస్కృతి యడ్డునంచుc బే

రామున రావణుండు సమరంబున మాత్రము చూచుచుండెcబో

రాముని యుద్ధమం దతిభరమ్మగు కోపము, కక్ష, దీక్షయున్‌

హ్రీ, మతి నెంతయున్‌ దెలియనీయవు రాముని, గుండె విండుచున్‌.

ఇది యొక విశేషము. రాముని మనము చూడకూడదు. రాముని జూచి నచో గుండె నిండిపోవును. వెంటనే భక్తుcడవై పోవుదువు. ఆ సౌందర్యము నకు వశంవదుcడవై పోవుదువు. ఈ రహస్యము రావణునకుc దెలియును. అతcడు పూర్వము వైకుంఠ ద్వారపాలకులలో నొకcడు కదా! శ్రీమన్నారాయణు నెఱుcగును. ఇప్పుడు రాముని జూచును. ఇద్దఱకు నభేదము. రాముని చూచినంతనే రామునకు భక్తుcడయి పోవును. రావణుడు విరోధముచేత భగవంతుని సాధించుటకు జన్మించినాcడు గద; రాముని చూచినచో విరోధము నిలువదు. కనుక రాముని చూడగూడదు. రావణుcడు రాముని యుద్ధములో మాత్రమే చూచినాడు. కాని ఆ యుద్ధములో కోపము, కక్ష, రాముని చంపవలె నన్న దీక్ష. రామునిచేతc బరాభవింపcబడిన సిగ్గు - (హ్రీయనగా సిగ్గు) మొదలైన భావములు బలిసి రాముని చూచినను రాముని తెలిసికొననీయవు. ఇది రావణుని యుద్ధము, వైరము. తాత్పర్యమే మనగా కోపము, తాపము, కక్ష మొదలైన గుణములు బలిసినప్పుడు భగవంతుcడు కనిపించడు; కనిపించినను వాcడు భగవంతుడని తెలిసికొననీయవు. గుండెలో భగవంతుcడు నిండియుండెను. ఆ భగవంతుని స్థానమునందు నీవు కోపము, కక్ష, నీ యహంకారమును నింపదువు. అచ్చట భగవంతుcడుండడు. ఉన్నను వీనిచేత కప్పcబడి యుండును.

మ. అతcడానంద మెఱుంగునో యెఱుcగడో ఆ రామచంద్రాకృతిన్‌

మతి నానందమయంబుగా నెఱుcగ రామస్వామి సౌందర్యమే

మతి నూహించిన యట్లు కన్పడదు తన్మాత్సర్య ఖావంబులోc

గుతిలంపాటు ఘటిల్లె నాతనికి - నాకున్‌ వానికీ భేదమై.

ఈ రావణుcడు వైకుంఠమునందు నిత్యము స్వామి దర్శనము చేయుచుండెడి వాcడు వాని యానందము నిత్యము. స్వామి యొక్కమూర్తిని దర్శించుట చేత గల్గిన ఆనందము వంటి మహాతృప్తి లక్షణము మూరిని వదలి పెట్టి యానందమును దానియంతట దానిని వాcడనుభవించునో లేదో తెలియదు. ఆది యోగులుచేయుదురు. నిత్య పరమేశ్వర సన్నిధానవర్తులైన భక్తులకు నా యానందము కలుగదు. ఆ యానందమునకు పరమేశ్వర నిత్యసన్నిధానమందుండు మహాతృప్తికి భేదమున్నది. శివలోకమందు విష్ణు లోకమందు నిత్య భక్తులున్నారు. వారు నిత్యజీవులు. వారి కితర జీవుల బాధలు లేవు. ఆ భగవంతుని సేవించు చుండుటయే వారి నిత్యవృత్తి. వారికిని జన్మలులేవు. మృత్యువులు లేవు. మహాప్రళయాంత మిట్లే యుందురు. మహాప్రళయాంత మందు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు లేరు. నిత్యమైన బ్రహ్మపదార్థ మొక్కటియే యున్నది. అప్పుడు శివకేశవ నిత్య సన్నిధానవ లైన జీవులు బ్రహ్మములో కలిసి పోవుదురు. అంతవర కాలోకములలో నుందురు. ఎట్లుందురు? పాంచ భౌతికములైనవి గాని తైజసములైనవి గాని కరచరణాద్యవయవము లుండునా? లేక పోవచ్చును. వారి సంకల్పములో నుండును. అనగా చేతులులేవు. చేతులతో పూజ చేయుచున్నామని యూహింతురు. ఈ సృష్టియంతయు సంకల్పము యొక్క వికాసమే కదా!

రావణుcడు రామచంద్రుని శరీర సౌందర్యమును గూడ నూహించినట్లు కనిపించదు. వాని మాత్సర్యములో వాని పట్టుదలలో వాని కామప్రవృత్తిలో వాని పరభావ దాసత్వములో వాని యాపద నిండియున్నది. అందుచేత వానికీ కుతిలంపాటు ఘటిల్లినది. దుఃఖము సంభవించినది.

నాకును రావణునకు నిదే భేదము. ఇక్కడ రావణుcడన్నచో రావణుcడు కాడు. నే నన్నచో నేను కాను. రావణుని వంటి వారు నా వంటి వారు నని అర్థము. ఆ రావణుని వంటి వారికి నావంటి వారి యనుభవములు కలుగవు. వారికి కోపము, మాత్సర్యము, దురహంకారము' అవివేకము, తెలివి కానిది తెలివి యనుకొనుట, వాక్చమత్కారము పాండిత్య మనుకొనుట - వీనితో వారికి స్వామి సంబంధము లేక పోవుచున్నది.

Na Ramudu   Chapters   Last Page