Na Ramudu   Chapters   Last Page

 

బాలరాముడు

ఉ. అప్పటికేమొ పెండిలియునై నదిలేదు భవిష్యమందునా

యెప్పుడొ మాయలేడియయి యీతఁడు రావలెనంచు దవ్వుగాఁ

జొప్పడ దూసె బాణమును జోద్యముగా నవతారకార్యమై

యెప్పటికో ఫలించఁగల యింతటి దూర రహస్యశిల్పియై.

రాముఁడు సుబాహుని వధించెను. మారీచుని దూరముగా నెచ్చటనో వాయు బాణముతో విసరివేసెను. ఇతఁడు భవిష్యత్తులో నెప్పుడో మాయలేడియై రావలయును. వాని కారణముగా సీత యపహరింపబడవలయును. ఇప్పటికి సీత రాముని భార్యకాలేదు. సీత భార్యయైన తరువాత రాముఁడు వనవాసమేగిన తరువాత పదుమూఁడేండ్లు గడచిన తరువాత మారీచునితో పని అప్పుడు. ఇది యేమగుచున్నది? ఏదో జరిగినది. అట్టి ఫలము పుట్టినది యని లోతుగా నాలోచింపని వాఁడు చెప్పెడి మాటలు. ఆలోచించెడి వానికి నిది కథలోని యొకమహారహస్యము. కథ వ్రాసెడి కవి యున్నాఁడు. అట్లుచేసిన మహాపురుషుఁడున్నాడు. అట్లు వ్రాసిన మహాకవిని మహాశిల్పియందుము. అట్లు చేసిన మహావీరుని సృష్టిరహస్యవేత్త యందుము. కథానాయకుఁడు భగవదవతారమని ప్రసిద్ధిపొందినచో నిది యవతార రహస్యమందుము. రాముఁడు బాలుఁడు పేరునకు బాలుఁడేకాని యవతారమెత్తుటలో భగవంతునకు బాల్య¸°వన కౌమారములు లేవు. ఆయన సర్వజ్ఞుడు, ఇక్కడ వట్టిసర్వజ్ఞుఁడేకాఁడు. భవిష్యత్తున రాబోవుదానికి నిచట బీజమును నిక్షేపించినాఁడు గనుక శిల్పి. అందుచేత దూర రహస్య శిల్పి.

ఉ. జేనెడులోన1 నగ్నులను జేసె సుబాహుని భస్మసాత్కృతున్‌

తోనితనిన్‌ వియత్తునను ద్రోసెను మంటలు తాకకుండఁగన్‌

కాని, పనంతయున్‌ తనదికాదు, వివాహమునాడఁబోవు నా

చానది నేఁడె తత్ర్పబలశక్తికి లొంగినవాని పోలికన్‌

మారీచ సుబాహులిద్దఱు నాకాశములోఁ గొంచెమెడములోనున్నారు అక్కడివానినక్కడ సుబాహుని బూడిద చేయుటకు బాణాగ్ని ప్రళయాగ్నియై

______________________________________________

1. నేల

యుండవలయును. అట్టి అగ్నిప్రక్క నెవఁడుండినను వాఁడు లిప్తలో మాడి పోవలయును. కాని మారీచుఁడు తగులఁబడిపోలేదు. ఇది రహస్యము. మహాగ్ని స్వరూపము తెలిసినవారికిఁగాని తెలియదు. సుబాహుఁడంటుకొననేలేదు. ఇది మహాపురుషుఁడు చేయదగినది. అగ్నిమీఁద నధికారముచేయఁగలవాడు చేయదగినపని కాని, యీపని యంతయు తనదికాదు. తానొకపిల్లను పెండ్లి చేసికొనబోవుచున్నాఁడు. చేసికొనబోవుచున్నానని తనకు తెలియదు. మానవ దృష్టికి సాధ్యము కాదు. రాముఁడు ఈశ్వరుఁడు. ఈశ్వర దృష్టికి తెలియును. ఆమెపని యెట్లన్నను తాను చేసిన కార్యము భగవంతుఁడు చేయఁదగినది. ఇద్దఱంత దగ్గఱగా నుండఁగా అందులో నొకనిని వెంటనే బూడిద కాదగినంత ప్రళయాగ్నిని సృష్టించి చంపి ఆయగ్నిని ప్రక్కనున్నవాని నంటుకొనకుండ చేయుట భగవంతుఁడు చేయవలయును. అంతేకాదు. ప్రయోగించిన వాయవ్యాస్త్రము ఆ మారీచుని తీసికొనిపోయి కొన్నివందల యోజనముల దూరమున నున్న సముద్రములో పడవేయుట కూడ భగవంతుడు చేయఁదగిన పనియే. ఇతరులు ప్రయోగించు వాయవ్యాస్త్రములకింత శక్తియుండదు. మరికొన్ని యేండ్లకు మాయలేడి కాబోవు. మారీచునిట్లు చేయుట శ్రీరామునకు తన పనికాదు. బ్రాహ్మణ కర్మలకు విరోధియైన రావణుని చంపుటయే తనపని. మహావిష్ణువు దైత్యులను వేయి విధముల చంపును. తాను ప్రతిజ్ఞఁబూనినాఁడు సరే. రావణుఁడు సీత నెత్తికొని పోవలయును. తాను సముద్రమును దాఁటవలయును. రావణుని సకుటుంబముగా నాశనము చేయవలయును. ఇది యంతయు సీతపని. ఎట్లు కనిపించుచున్నదనగా శక్తి రామునికన్న గొప్పది. ఆమెకు రాముఁడు లొంగి యీ పనిని చేయుచున్నట్లు కనిపించుచున్నది. సీతమహాశక్తి. ఆ శక్తి యావేశించిన కాని విష్ణువు విష్ణువుకాడు.

ఉ. ఆకడ నొక్కఱాయికల దా శిలయుండిన యున్కిచూడఁగాం

తాకృతి యాపదాగ్రమునఁదాకిన యంతన స్త్రీత్వముంగనన్‌

దాఁకితివా మరిన్‌ దగిలెనా అది నీదగు కాలుతాకుచే

గైకొనె నాఁడ రూపనిన కైవడి యెట్టిది నల్వురాడుటా

అహల్యఱాయివలె నున్నది. ఆఱాయి యొక బండఱాయియా ? ఆ ఱాతికి స్త్రీ యాకారమున్నదా? నీవు రాతివి కమ్మని శపించినాడు. ఆ యున్నరూపము ఱాతి రూపమగును. ఒక ఱాతి విగ్రహమగును. అంతేకాని చచ్చదరముగా నున్న ఱాయివలె నుండనక్కఱలేదు. ఆమె శపింపబడినదని తెలియుచున్నది. ఒక మహా స్త్రీ. ప్రసిద్ధురాలగుటచేత నామె రాతి విగ్రహమునుబట్టణము లలోఁ జెక్కించి పెట్టినదికాదు. ఒక చెడిపోయిన ఆశ్రమము ప్రక్కనున్నది. గౌతముఁ డామెను శపించెనని కథయున్నది. ఆమెను మఱల స్త్రీని జేయుటకు నామెను రాముఁడు కాలితో తాకెనా? కాలికి తగిలెనా? ఆమె స్త్రీయగుట యెట్టిది? తాను కాలితో తాఁకినచో తాను భగవంతుఁడు. ఆమెకు మరల స్త్రీ రూపమును ప్రసాదింపవలెనని చేసినపని, అట్టి రాతికి జనులు దూరముగా పోవుదురు. కాలితో తాకరు. అది కాలికి తగులదు. తగిలినచో మనుష్యుఁడు తూలిపడవచ్చును. అంద ఱనుచున్నారు. దీని రహస్యమేమి?

శా. నీ కాల్తాకిననే వహించినది తన్వీరూప మం చాడఁగా

నే కాల్తాకిన 1చాన కావలయు నేదేఁగాలుగాఁదక్కువార్‌

నాకాల్కాదని కాదు నా పదమనన్‌ నా కాలె యన్నట్లు నీ

కైకోల్‌ చాలు స్వయంత్రి విక్రమ పరీణామకృతి జ్ఞాతృతన్‌.

ఆమె స్త్రీ యగుట నీ కాల్తాకుటచేతనే యైనది. తాకుటయన్న శబ్దము ప్రయోగించుటచేత రాముఁడే బుద్ధిపూర్వకముగా తాకినాఁడని యర్థము. ఇంక నెవరికాలు తాకినను ఆరాయి స్త్రీ కాదు. తక్కువారు అనగా తక్కినవారు. నా కాలు కాదనగా నా కాలు కాదన్నారు. నీవు మాటాడకుండ నూరకుంటివి. నీవు నీకాలే యన్నట్లూరకుంటివి. అది నీకైకోలు. నీవు గ్రహించుట యని అర్థము. అది చాలును, అనగా సమర్థమగును. దేనియందు సమర్థమగును. స్వయముగా నీవు త్రివిక్రముఁడవు. విష్ణుమూర్తివి. మూఁడడుగులతో ముల్లోకము లాక్రమించినవాఁడవు. ఆ త్రివిక్రముడైన నీ యొక్క పరిణామము- మార్పు. దాని యొక్క ఆకృతి-రూపము. అప్పుడు వామనుఁడు, ఇప్పుడు రాముఁడు. ఈ రాముఁడా త్రివిక్రముఁడే అన్న జ్ఞాతృత అని తెలిసికొనుటకు నా నీయంగీకారము కైకోలు చాలును. సరే. నీ వవతారమని నీకు తెలియును. తానవతారమని సీతకు తెలియును. నీ కాలే తాకి తాను శాపవిముక్తి పొందెనని యహల్యకెట్లు తెలియును ?

శా. నీపాదంబని యెట్లుగా తెలిసెనో నీరేజ పత్రాక్షికిన్‌

నీపాదంబని యేమిగుర్తు కలదో నిన్నే స్తుతింపంగనా

----------------------------------------------------------------------------------------------

1.గానురాదదియు నీదేకాలుగాఁ దక్కువార్‌.

నీపాదంబుల శంఖ చక్రములుపైనే యున్నవా, లేనిచో

నీపాదంబుల వ్రేళ్ల పొందికయుఁ దా నిన్నేరి చూపించెనా?

నీరేజ 'పత్రాక్షికిన్‌' అనగా అహల్యకు. అహల్య నిన్ను భగవంతుఁడుగా స్తోతము చేసెను. ఆమె నీ పాదములు చూచినది. ఆ పాదములలో నీవు భగవంతుఁడవని యున్నదా?ఆ పాదములలో శంఖచక్రములున్నవా?శంఖచక్రములరికాళ్లలో నుండును. మరియెట్లు? నీ కాలివ్రేళ్ల పొందిక విశిష్టముగా నున్నదా? ఆ పొందికలో నీవు భగవంతుఁడవని తెలసినదా? అహల్య అచ్చట నున్నయందరి పాదములను పరిశీలించెనా? తాత్పర్యమేమనగా నహల్య ఇంద్రుని విషయములో పొరపాటు పడినది. ఆమె నిజముగా నొక యోగిని, మహాపతివ్రత. కాలుజారి యెప్పుడును పడనివాఁడు ఒకప్పుడు పడవచ్చును. ఆమె అట్లు పడినది. ఆ యొక్కపొరపాటుతో నామె చేసిన మహా తపస్సంతయు సర్వనాశనము కాలేదు ఆ తపస్సులో కొంత లోపము వచ్చినది. ఈ శాపానుభూతితో నా లోపము తీరినది. ఆమె మహాపతివ్రత. యోగిని. కనుక శ్రీరామచంద్రుని వెంటనే గుర్తుపట్టినది. ఇది రహస్యము.

శా. ఆ నీపాదయుగమ్ము కన్గొనుచునే యాత్మేశు పాదంబులం

చా నీరేజ దళాక్షి గుర్తిడఁగ నాహా! యెంత భక్తిప్రప

త్త్యానందైక నికేతనంబొ ఋషిపత్న్యంతస్థమౌ వస్తు వా

చానం గైకొనుటేమి యబ్బురము నీ వంతస్థ తేజంబవై.

ఆత్మేశుడు-ఈశ్వరుఁడు. సర్వజీవాత్మలకు ప్రభువు. నీ పాదములు చూచుచునే యామె నిన్ను గుర్తుపట్టెను. ఆ ఋషిపత్నియొక్క అనగా నహల్యయొక్క అంతస్థమౌ వస్తువు లోపలనున్న పదార్థము. అనగా జీవుఁడు ఎంతభక్తి, యెంత ప్రపత్తి, యెంత యానందమునకు నికేతనమో అనగా ఇల్లో. ఆమె జీవుఁడు చాల పరిపాకము పొందినవాఁడని యర్థము. స్వామిపాదమును చూచుచునే ఆయన స్వామియని తెలిసికొన్నది. ఆమె యంతటి భక్తికలది. అంతటి ప్రపత్తికలది. అంతటి యానందము కలది. ఆమె యంతస్థ్సమైన వస్తువంతది. సర్వజీవులయొక్క పరిణామమును నీవెఱుఁగుదువు. ఆమెలోనున్న జీవుని యొక్క పరిణామము నీవెందు కెఱుఁగవు. అందుకని నీ వామెను వెంటనే గ్రహించితివి. అందులో నాశ్చర్యములేదు. ఆమె మహాపతివ్రత. మహాయోగిని. ఒకసారి పొఱపాటు చేసినది. ఆ పొఱపాటునకు శిక్ష యనుభవించినది. లోకములో కూడ నింతియ కదా? తప్పుచేయును. శిక్షింపఁబడును. వాని దోషము నిష్కారము పొందినట్లేకదా? కాదు. అహల్య చేసిన యా దోషమునకు నామె మరణించిన తరువాత నరకములో ఫలిత మనుభవించును. అనుభవించుటతోడనే దోషము పోవును. ఆమె యిక్కడనే అనుభవించెను. వెంటనే యామె తొలినాఁటిస్థితి ననుభవించుచుండెను. మరల మహాపతివ్రతయే. ఇది స్త్రీ ప్రవర్తనలో లేదు. ఆమె యోగశక్తిలో నున్నది.

ఉ. నీవయసెంత అంతయనవీ పతి సంతతి వంచరానిదౌ

నావిలువంచుమన్న వెనుకాడక ముందుకు దూకినావు నీ

లో విలసిల్లు నిన్నెఱుఁగు లోపల నీవుగ, ముందరే ధను

స్సే విఱిగెన్‌ తనంత నదియే సరిపోయిన దాత్మధర్మమై.

రామున కస్త్రబలమున్నది. ధనుర్విద్య నేర్చికొన్నాఁడు. క్షత్రియ కుమారుఁడు గనుక వయస్సు పండ్రెండేండ్లయినను దేహములో పదునాఱండ్ల వయస్సువాని బలమున్నదందము. కాని పూర్వము మంచి వయస్సులో నుండి మహాబలశాలులైన రాజులు వచ్చి వంచలేక వెడలి పోయినారు. దానిని వంచుమనగా నీవు ముందుకు దూకినావు. మరియెవ్వరైనను ఇది వంచరాని ధనుస్సు. అంతంతవాండ్రే వంచలేక పోయిరి. అస్త్రబలము వేఱు, శరీరబలము వేఱు. అస్త్రబలమును చూచుకొని యుద్ధములోనికి దిగవచ్చును. ఒక ధనుస్సును వంచుటకు శరీరబలము కావలయును. ఈ సంగతి విచారించకుండ ముందుకు దూకినావు. పైగా నీవాధనుస్సును చూడలేదు. ఆ ధనుస్సున్న పెట్టెను కొన్ని వందల మంది మోసికొని వచ్చిరి. నీవు వంచనులేదు. పెట్టనులేదు. నీవు తాకినంతనే ఆ ధనుస్సు విరిగెను. నీవు నిన్నెఱుఁగకముందే ఆ ధనుస్సు నిన్ను తెలిసి కొన్నట్లున్నది. ఈయన భగవంతుఁడు. నన్నెట్లయిన విఱుచును. అని ఆ ధనువునకే తెలిసి తానే విరిగి నట్లున్నది. ఇది ఆత్మ ధర్మము. శరీరబలముతో సంబంధము లేదు. ఆ ధనుస్సునకుకూడ నొక యాత్మయున్నదనవలె. ఉన్నచో నిది యా ధనుస్సుయొక్క యాత్మ ధర్మము. తాత్పర్యమేమనగా రాముఁడు పరమేశ్వరుఁడు అని జ్ఞానము కలిగిన స్థావర జంగమములు కన్నిటికిని తెలియును.

చం.1తన వయ సెంత అప్పటికి ధారణిజా వయసెంత వంచునీ

ధనువు నెవండు వానికిని ధన్వికినిత్తు మటన్నమాటఁ బ

ట్టి నెలతనిచ్చుట కడిందిగ హేతువులేదు రాజులం

దున పరిపాటి మాత్రము వధూవరు లీడును జోడు చూచిరాః

ఏదోక్షత్రియుఁడు. స్వయం వరము చాటించిరి. ధనుస్సును వంచుట పందెము పెట్టిరి. ఆ సీత వయస్సెంత? ఈ రాముని వయస్సెంత? అర్థములేదు. సీత వయస్సెంత? ఒకసారి సీత అనసూయాదేవితో తన పెండ్లి సంగతి చెప్పుచుఁ దనకు యుక్తవయస్సు వచ్చినదనియు, తనకు పెండ్లిచేయుటకు తన తండ్రి తొందరపడెననియుఁ జెప్పినది. ఆ యుక్తవయస్సెంత? బ్రాహ్మణులైనచో కన్యకెనిమిదేండ్లు వచ్చినంతనే యుక్త వయస్సనవచ్చును. క్షత్రియులకానియమములేదు. దమయంతీ వివాహము చూతము. ఆవిడ బాగా వ్యక్తురాలు. రాముని తాతమ్మ ఇందుమతీదేవి యున్నది, ఆమెయు బాగుగా వయస్సు వచ్చిన యావిడ. రాముని అప్పగారు శాంత యున్నది. ఆమెకూడ వయస్సు ముదిరినదే యనవలయును. సీతకు సదునాఱండ్లుండవచ్చును. రామునకు పండ్రెండేండ్లే.

శా. జోకంజూచిన నీడు జోడగును నాజూకుల్‌ వృథా, వారలా

హాకల్పాలు యుగాలుగాఁ బ్రదికి రూహంజేయగా నెప్డు సీ

తా కన్యామణి పెద్ద యెప్పుడును భర్తంగూర్చి యారాటమే.

ఈ కుఱ్ఱాతఁడు భార్యకోసమయి తా నేదైననుం జేసెడున్‌.

ఆమె వేదము యొక్కతత్త్వము మూర్తికట్టిన మహాశక్తియొక్క యవతారము. ఎప్పుడో పెట్టెలో పెట్టి రావణాసురుఁడు సముద్రములో వదలి పెట్టినాఁడు. ఆ సముద్రములోనుండి యీ దున్నిన యజ్ఞభూమిలోనికి నెప్పుడు

__________________________________________________________________________

1. తన వయ సెంత అప్పటికి ధారణిజాత వయ స్సదెంత యీ

ధనువును వంచువానికిని ధన్వి కొసంగెద నన్నమాటఁ జూ

చిన నది యొక్క యబ్బురము చెప్పఁగ రాదు స్వయంవరంబుం

చిన పరిపాటి క్షత్రియులఁ జేడియ కీడును జోడు చూడరా.

వచ్చినదో ఎట్టువచ్చినదో తెలియదని పూర్వమే చెప్పితిమి. ఆమె వయస్సు వేదమున కెంత వయస్సున్నదో అంత. ఈయన వయస్సు శ్రీమహావిష్ణువున కెంత వయస్సున్నదో అంత. ఇతఁడు రాముఁడుగా నున్నప్పటి వయస్సు ఆమె సీతగా నున్నప్పటి వయస్సు లెక్కలోనికి రావు. రాముఁడు వేదమునందు న్నాఁడు. వేదము భగవంతుఁడైన రామునం దున్నది. రాముఁడే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు. వేదముయొక్క తత్త్వమే మహాశక్తి. ఆమెయును బ్రహ్మపదార్థమే సృష్టిలో మాత్రము వారిద్దఱొకరికొకఱు కలిసి యుండుటకు తపించుచుందురు. కనుక నీవివాహ సందర్భములో లోకము రీతిగా వయస్సులు ఈడు జోడులు చూచుట యవివేకము. చూచినచో లోకదృష్టిలో నన్నియు నసంభవములుగా కనిపించును. అందుచేత నిది యలౌకిక వ్యవహారము. లోకాతీతమైనది. ఈ విషయము జాగ్రత్తగా చూచినచో రామాయణమునందు సర్వత్ర తెలియుచునే యుండును. జ్ఞానలవదుర్విదగ్ధులను బ్రహ్మకూడ రంజింప చేయలేడని భర్తృహరి వ్రాసినాఁడు. తెలిసియు తెలియని నరుఁ దెల్ప బ్రహ్మదేవుని వశ##మే? ఆ బ్రహ్మయెవరు? విష్ణువే! రాముఁడే! శివుఁడే! ఈ సృష్టియంతయు వారు మువ్వురు. ఈ తెలిసీ తెలియని వారిని తెలుపుట ఆశక్తికి ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరులకుఁ గూడ సాధ్యము కాదఁట. ఎందుచేత? ఆ బ్రహ్మయే వారినట్లు సృష్టించెను. ఏందుకారీతిగా సృష్టించెను? సృష్టిస్వరూప మటువంటిది గనుక. దేవదానవులను బ్రహ్మ మొదటనే సృష్టించెను. ఎందుకు? సృష్టి సాగవలయును గనుక.

సీ. జన్నంబు కోసమై దున్నుచో ధాత్రిని

కఱ్ఱునకుం దాక కిఱ్ఱుమనియె

పట్టిధాత్రిని కూర్చిపెట్టిరి ధనమును

తొలియేండ్ల పిల్లయో నెలల పిల్లొ

కనిపారవేసిన దనినచో నేటిలో

వదలి పెట్టెద రంతె పాతిపెట్ట

రవనిలోపలను బ్రయాణమ్ము చేసెనా

ప్రత్యేకము విదేహ రాజుకొఱకు

గీ. తరుణి వయసింత యంచు నేర్పఱుపరాదు

ద్వాదశాహస్కరుల యీడు బాలకునకు

బోర్ల గిలఁబడు చిఱుగవ్వబోలె లలిత

లలిత మర్యాదమైన ఫాలంబు వాఁడు

ఇందులో నిద్దఱి వయస్సును గూర్చి చెప్పఁబడినది. లోకములో తోచీతోచని వారి మాటలు పొందుపఱపఁబడినవి. వీనికి సమాధానము పూర్వమే చెప్పఁబడినది. రాముఁడు ద్వాదశాహస్కరుల యీడు వాడనగా పండ్రెండేండ్ల వాఁడని చెప్పుటయేకాక పన్నిద్దరు సూర్యులను పేర్కొనుటచేత సూర్యానాం సూర్యః సూర్యులకు సూర్యుఁడు అని యాయన పరమేశ్వరత్వమును గూర్చి చెప్పుటయైనది. గీత పద్యములోని చివరి రెండు చరణములు రాముని సౌందర్యమును చెప్పుచున్నవి. విచారణ లేదు, తర్కము లేదు. భక్తులకు స్వామి యొక్క సౌందర్యమే ధ్యేయము. ఈ శీర్షిక బాలరాముఁడు. ఆయన బాల్యము యొక్క సొగసంతయు నీ రెండు చరణములలో కవి చెప్పిఁనాడు.

Na Ramudu   Chapters   Last Page