Nadayadu Daivamu  Chapters  

 

భాష్యత్రయసారాంశ ప్రతిపాదన

''తర్క వేదాంత సామ్రాట్‌'' ''తర్క వేదాంతాచార్య''

బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రిగారు

ప్రాతః స్మరణీయులు, లోకానుగ్రహ పరాయణులు, సర్వజ్ఞులు, వేదశాస్త్ర ఆగమాది సకల విద్యాసంరక్షణ తత్పరులు, సకలసత్సంప్రదాయ సముద్ధరణ సంరక్షణ పరులు, షణ్మతస్థాపనాచార్యులు, ఆద్య శంకర భగవత్పాదావతార మూర్తులును, జగద్గురువులును అగు శ్రీ కామకోటి పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేద్ర సరస్వతీ మహాస్వాముల వారి జయంతి సందర్బమున కృష్ణాజిల్లా గురజాడ గ్రామ నివాసులు శ్రీవారి, అనుగ్రహ పాత్రులు, ఉత్తమ శిష్యులును అగు చల్లా శేషాచలశర్మగారి ప్రోత్సాహముతో ముద్రింపబడు శ్రీవారి దివ్యచరిత్ర వైభవాది వర్ణనలో నేను చేయు భాష్యత్రయ సారాంశ ప్రతిపాదన.

శంకర భగవత్పాదులవారు సుమారు 2500 సంవత్సరముల క్రిందట కేరళ దేశములో కాలడీ క్షేత్రమున శివగురు ఆర్యాంబా గర్భవాసమున అవతరించి పూర్ణానదీ తీరమందు వారిదివ్యవైభవమును ప్రదర్శించి పరశివావతారమైననూ లోకసంగ్రహదృష్టితో పరమహంసాశ్రమమును స్వీకరించి లోకమంతయు సంచరించి బౌద్ధ జైనాది నాస్తికమతములను ఖండించి పండ్రెండు సంవత్సరముల వయస్సులోనే భగవద్గీతలకును, బ్రహ్మసూత్రములకును, ఉపనిషత్తులకును, అద్వైత సిత్ధాంతానుసారముగ భాష్యములను రచించిరి. ఈ భాష్యత్రయము మీద సంగ్రహముగా సారాంశమును వ్రాయతలచితిని. ఆ భాష్యత్రయములో ఏ భాష్యమును విచారించినను అతి ప్రసన్న గంభీరముగనుండును. అనగా చదువుచున్ననూ, వినుచున్ననూ సులభమగునట్లు కనిపించును గాని, లోతుకు దిగి పరమార్థమును పరామర్శించిన యెడల చాలా దురవగాహముగ నుండును. అందులో భగవద్గీత పదునెనిమిది అధ్యాయములు మొదటి ఆరు అధ్యాయములు ''తత్త్వమసి'' అను మహా వాక్యములో చేరిన ''త్వం'' పదమునకు వాచ్యార్థమగు జీవ స్వరూపమును, లక్ష్యార్థమగు పరమాత్మ స్వరూపమును నిరూపించి ఏడవ అధ్యాయము మొదలు 12 అధ్యాయాంతము యీ ఆరు అధ్యాయములకు తత్పరవాచ్యార్థ మయిన యీశ్వర స్వరూపమును, లక్ష్యార్థమయిన పరమాత్మ స్వరూపమును నిరూపించి పదమూడవ అధ్యాయము లగాయతు పద్దెనిమిదవ అధ్యాయంతము చివర ఆరు అధ్యాయములకు ''అసి'' పదార్ధము అనగా జీవేశ్వరులకైక్యమును భాష్యమందు ప్రతిపాదించిరి. జీవబ్రహ్మైక్యములను బోధించు మహా వాక్యములకెంత అర్ధమో అంతే అర్థము గీతా శాస్త్ర ప్రతిపాదితమని, మహా వాక్యములతో గీతా శాస్త్రము ఏక వాక్యతను పొందునని స్పష్టమగుచున్నది. మరియు ''సర్వోపనిషదోగాపః దోగ్ధా గోపాలనందనః పారథోవత్సః సుధీర్భోక్తా దుగ్ధంగీతామృతం మహత్‌'' అను వచనమును బట్టి ఉపనిషత్తులన్నియూ గోవులనియు, పాలు పిదుకువాడు శ్రీకృష్ణపరమాత్మ యనియు, అర్జునుడు దూడయనియు, ఉపనిషత్తులనే గోవులను అర్టునుడనే దూడను పురస్కరించుకొని శ్రీకృష్ణ పరమాత్మ పిదికిన పాలే భగవద్గీత యనియు, ఆ పాలను త్రాగుటకు అధికారి ముముక్షువనియు, ఉపనిషదర్థబోధకమే భగవద్గీతయనియు స్పష్టమగుచున్నది. కనుక గీతా భాష్యమంతయు పరమాత్మ తత్త్వమును బోధించుచూ పరమాత్మ తత్త్వజ్ఞానమునకు సాధనమగు కర్మయోగాదులను ప్రతిపాదించెనని ఆస్తికులు గ్రహించదగిన విషయము.

బ్రహ్మసూత్ర భాష్యము నాలుగు అధ్యాయములు. ఒక్కొక్క అధ్యాయమునకు నాల్గుపాదములు. ప్రధమాధ్యాయ మంతయు వేదాంత వాక్యములకు అద్వితీయమైన పరమాత్మయందు తాత్పర్యమని శంకర భగవత్పాదులవారు భాష్యమందు ప్రతిపాదించిరి. ద్వితీయాధ్యాయమందు సర్వమత విరోధ పరిహారమును చేసిరి. తృతీయాధ్యాయమందు అంతరంగ బహిరంగ సాధనములను నిరూపించిరి. చతుర్థాధ్యాయమందు అర్చిరాది మార్గము ద్వారా సగుణ బ్రహ్మలోక ప్రాప్తి నిర్గుణ బ్రహ్మసాక్షాత్కారము ద్వారా పరమముక్తిని ప్రతిపాదించిరి. దశోపనిషద్భాష్యమందు కూడ బహువిధ శాస్త్ర చర్చలొనర్చి అనేక దుర్మతములను ఖండించి అద్వైత పరముగ సమన్వయము చేసి అద్వైత సిద్ధాంతమును స్థాపించిరి. అట్టి శాంకర సిద్ధాంతమును ఉద్ధరించు శ్రీశ్రీశ్రీ చంద్రేశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చరణుల చరణారవిందముల యందు భక్తినొంది ఆస్తిక మహాశయులెల్లరూ తరించవలెను.

Nadayadu Daivamu  Chapters