Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

పాపపుణ్యములు

'మానవునికి అత్యవసరమైన విషయాలు ఏమిటి' అని పరిశీలిస్తే, ఆకలికి అన్నం, మానానికి వస్త్రం, ఎండలకూ గాడ్పులకూఇండ్లూ ముఖ్యమని తేలుతుంది. గృహస్తధర్మాన్ని అనుసరించి వీనికోసం తనకేకాక, తనపై ఆధారపడ్డ బంధుమిత్ర పుత్ర కళత్రాదుల పోషణ భారంకూడా మనుష్యుడు వహిస్తున్నాడు. ఐహిక సౌఖ్యాలకు లౌకికకార్యాలు చేసినట్లే పారమార్థిక ప్రయోజనానికి మనిషి కొన్నికార్యాలు చేయవలసివస్తుంది. దానినే ధర్మం అని మనం అనడం.

'ఉన్నట్టుండి ఒకప్పుడు జీవితమంతా ఉదరనిమిత్తమే గడచిపోతూంటే, మనం ధర్మకార్యాలు చేసేదెపుడు? మోక్షార్థం పాటుపడే దెపుడు?' అన్న ఆశంక జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఇట్టి సద్భావం కలిగిన మనుష్యులు తమకాలంలో చాలాభాగం ద్రవ్యార్జనకై వెచ్చించినా ఫరవాలేదు. సాధారణంగా జీవితంలో ఎంతోకాలం పరిహాసాలకు, ప్రసంగాలకూ, వృధాచర్చలకూ వ్యయమవుతూంటే; ధనార్జనకే వినియోగింపబడ్డ ఒక్కకాలమేనా దుర్వినియోగమయేది? ధనం గడించడానికి అయ్యే కాలంకాక తక్కిన కాలమైనా వృధాచేయక నిశ్శ్రేయసానికీ, ఆత్మలాభ ప్రాప్తికి ఉపయోగిస్తే చాలామంచిది. మనస్సే ఉండాలికాని అవకాశంకలుగకపోదు. అవకాశంకోసం ప్రత్యేకంగా పనికట్టుకొని వెళ్ళనక్కరలేదు. అన్నిచోటులలోనూ దైవాన్ని తలచవచ్చు. ట్రాములలో, బస్సులలో, బండ్లలో ఎక్కడపడితే అక్కడజ్ఞాపకం వచ్చినప్పుడల్లా భగవచ్చింతన చేయగలంమనం. ఇందుకు అలవాటుపడాలి, అది ముదిరినకొద్దీ మఱవం. మనం సంపాదించే ద్రవ్యంలో ఒక్కకాసైనా మన వెంట రాబోదు. వచ్చేది భగవచ్చింతన. అందుచే ఎవరయినా భతవద్వ్యాసంగానికి సమయం దొరకటంలేదంటే అది వట్టి అబద్ధం. ధర్మం నాల్గు విధాల చేయవచ్చు-శారీరకంగా, మానసికంగా, కాయికంగా, ధనరూపంగా, 'ఆత్మలాభార్థం' దానధర్మాలు చేసి వినియోగించడం - మనమే దరిద్రులం. ఇక మనము ఎవరికి ధర్మం చేయగలం?' అని అనుకోకూడదు. ఉన్నదానిలో, ఒకకాని అయినా నిలవచేసి దాన్ని దానంచేయడం ధర్మం, ఇందు సంకల్పం ప్రధానం. యథాశక్తి అందరూ దానంచేయతగ్గవారే. విషయేతర సంపర్కంతో కాలం వృధాచేయకుండా ఉన్న సమయంలో దైవచింతన చేయడం లాభం. తక్కినదంతానష్టం.

ఒక్కొక్కప్పుడు మనం మహాపాపులమే. ఒక్క పుణ్యకార్యంచేయడానికి నోచుకోలేదు, సరికదా మరి మనకు సద్గతి ఎలాఉంటుంది? అని మనకు తోచవచ్చును. ఇట్టి మనో దౌర్భల్యానికి మనం ఎడమివ్వకూడదు. మనకంటే మహత్తరపాపాలుచేసి భగవంతుని ఆశ్రయించి పశ్చాత్తాపంతో పాపవిముక్తులై తరించిన భక్తుల చరిత్రలు మనకు తెలుసు. పరమేశ్వరునికున్న బిరుదులలో పతితపావనుడు అనేదొకటి. ఈలాంటి సందేహమే అర్జునుడికి కల్గింది.

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః,

సర్వం జ్ఞానప్ల వేనైవ వృజినం సంతరిష్యసి|| - గీత.

పాపులలోకెల్ల మహాపాపివైనప్పటికీ జ్ఞాననౌకను ఆరోహించినావంటే, భవసాగరాన్ని దాటగలవని భగవానుడే చెప్పుతున్నాడు. అదే గీతలో ''అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః'' పాపం చాశానే అని శోకించకు. నిన్ను సర్వపాపవిముక్తునిగా చేసే భారం నాది - అని మరొకచోట చెప్పబడినది.

పాపాచరణలో మానవుడు ఏలాప్రయుక్తుడవుతున్నాడు? మానసికంగా కొంత దుష్టాలోచనలతో, వాచికంగా కొంత, ఉత్సాహపూర్వకమైనఅశుద్ధభాషణలలో కాయికంగా కొంత, అధర్మచేష్టలతో ద్రవ్యమూలంగాజరిగే దుష్క్రియారూపంగా కొంత-ఇట్లు నిరంతరమూ పాపకార్యాలు చేస్తున్నాము. పాపం చేస్తున్నామని మన మనసే చెబుతుంది. ఏదో పిశాచగ్రస్తుడు తనకు తెలియకుండానే తాను అనుకొని పనులు చేసేటట్లు మనలను ఏదో ఒక అంతఃశక్తి ప్రోత్సాహంచేస్తూ ఉంటుంది. ఇట్లు చేస్తూచేస్తూ రాగా, పాపాచరణం ఒక అభ్యాసంగా తయారయింది. దీనినుండితప్పించుకోవాలంటే త్రికరణాలతో చేసే కార్యాలు శుద్ధంగా ఉండేటటులూ ద్రవ్యంసద్వినియోగమయేటటులూ జాగ్రత్తపడాలి.

''ధర్మేణ పాపమపనుదతి'' - నారాయణోపనిషత్తు.

పాపాన్ని ధర్మంచేత నివృత్తి చేయవలె. అధర్మానికి విరుగుడు ధర్మం. పాపానికి తల్లి ఆశ. ఆశావశ##మై ప్రాణికోటి పాపం చేస్తూఉంది. ఏది చేయరాదని మనసుకు తోస్తుందో అదేపాపం. ఏది మంచిది శుభం అని తోస్తుందో అదేపుణ్యం. అన్ని కాలాలలోను మనుష్యుడు పుణ్యఫలాన్ని కోరుకొంటూ వుంటాడు. పాపకార్యం చేస్తూవుంటాడు.

పుణ్యన్య ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛంతి మానవాః,

న పాపఫలమిచ్ఛంతి పాపంకుర్వంతి యత్నతః||

మానవుడు పుణ్యఫలాన్ని కోరుతుంటాడు. కాని పుణ్యకార్యం చేయాలని కోరడు. పాపఫలాన్ని కోరుకోడు. పాపకార్యాలను ప్రయత్నపూర్వకంగా చేస్తూఉంటాడు.

పుణ్యంయొక్క ప్రయోజనం కష్టాలేవీ లేక సౌఖ్యంగా కాలక్షేపం జరగడం. పుణ్యకార్యాచరణమూలంగామనశ్శాంతి, ఆనందమూ కలుగుతుంది. మన పాపకార్యాలకు మన మనస్సే సాక్షి. పుణ్యకార్యాలలో అలసత్వం పాపకార్యాలలో ఉత్సాహంఉండటం సాధారణం. పాపఫలం కష్టం. మనస్సాక్షివద్దన్నా చేస్తుంటాము. సుఖంపై ఇచ్ఛఉంది. పుణ్యం చేయాలన్నకోరిక కూడా లేకపోలేదు. కానీ చేసేవి నూటికి ఎనభైపాళ్ళు పాపకార్యాలు. దీనికి కారణం ఏమిటి? మనుష్యు డెందులకు పాపంలో ప్రవర్తిస్తున్నాడు?

అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః,

అనిచ్ఛ న్నపి వార్‌ష్ణేయ బలాదివ నియోజితః||

మనుష్యుడు ఇష్టం లేకపోయినా ఎవరో బలాత్కరిస్తున్నట్లు, ఏదో ఉపద్రవం ముంచుకొనివస్తున్నట్లు, ఎవరిచేతనో నియుక్తుడైనట్లు పాపాలు చేస్తున్నాడే? అట్లు పాపపంకంలో మనిషినిత్రోసే ఆ ఆసామి ఎవడు? పుణ్యం చేయాలన్న జ్ఞానం పూర్తిగావున్నా ''పాపం చెయ్యి పాపం చెయ్యి'' అని ప్రోత్సహించే ఆ బలవత్తరశక్తి ఏది? అని అర్జునుడు ప్రశ్నించాడు.

కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః,

మహాశనో మహాపాప్మా విద్ధ్యేన మిహ వైరిణం||

ఒకవస్తువుపై కోరికపుట్టుతుంది. న్యాయంగాప్రయత్నిస్తాం దానికోసం దొరికితేసరి. లేకపోతే అన్యాయానికి వెనుదీయం. ఈ అన్యాయానికి దారితీసేది ఆకోరికే. అదే కామం. కామం కలి. అది ప్రతిహతమైనపుడల్లా క్రోధం పుట్టుకొనివస్తుంటుంది. ''కామః ష ఏష ప్రతిహతః కేనచిత్‌ క్రోధత్వేన పరిణనుతే'' అని గీతాభాష్యం చెబుతున్నది కామం దేనితోనూ తృప్తిచెందదు. ఉపభోగంతో అది శమించకపోవడమేకాక, పెరుగుతున్నది. అగ్నికి 'కృష్ణవర్త్మ' అనిపేరు. (నల్లని దారి కలది లేక చేసేది.) పోయినచోటంతా మసిచేయడం దానిగుణం. హవిస్సు పోసేకొద్దీఅగ్గి ఆకాశమంటుతుంది. కామమూ అంతే. కామం తీరినవెంటనే సంతోషపూర్వకమైన తుష్టి, వెనువెంటనే యింకా కావలె అనే అసంతుష్టి పుట్టుతుంది. దాని ఆకలి తీరేదికాదు. అందుకే దాన్ని మహాశనమని అన్నారు. (మహాశనమంటే తిండిపోతు, మహాచెడ్డ ఆకలి కలది అని అర్థం) కామం విఘ్నమైనపుడల్లా, క్రోధం పుట్టుకొస్తున్నది. నైషధకావ్యం-కలిదేవతకు కామ క్రోధ లోభ మోహాదులు సైన్యాధిపతులని వర్ణించింది. ఈ సైన్యాధిపతులకు స్తుతిపాఠకులున్నారు, వారు క్రోధుడినిగూర్చి ఇట్లా అంటారు.

దుర్గం కామశుగేనాపి దుర్లంఘ్య మవలంబ్య యః

దుర్వాసోహృదయం లోకాన్‌ సేంద్రానపి దిధక్షతి||

కాముడికి సర్వత్రా ప్రవేశార్హత శక్తిఉన్నది. వాడు పోలేనిచోటు లేదు. అతడు మహావీరుడు. కానీ, క్రోధుడు కామునికంటే బలవంతుడు, 'క్రోధుని దుర్గంలో కామబాణం చొరలేదు. ఇది నిజంగా దుర్గం. ఈకోటలో కూచున్నానంటే ఈ ఇంద్రాది దేవతలు ఒక లెక్కా నాకు? వీరినంతా ఒక చేయి చూస్తాను''అని క్రోధుడు అంటున్నాడట. అట్టిక్రోధుని దుర్గమేది అని అంటే, దుర్వాసుని గుండెకాయట. దుర్వాసుని ముందు పుష్పబాణుడి ప్రతాపం కానీకి చెల్లదు. ఎందుకంటే ఆయన క్రోధభట్టారకుడు.

రజోగుణ భావాలైన కామక్రోధాలే మనంచేసే పాపాలకు కారణం. మహాశనుడు కాముడు. మహాపాపి క్రోధుడు. ఆశారహితంగా చేసే కార్యం పాపం కాదు. ఆశతో చేస్తేనే పాపం. పాపాచరణం ఒక అభ్యాసమైపోయి, త్రికరణాలతోనూ పాపం చేస్తున్నాము మనం. పశువులకు వాగింద్రియం లేదు. అవి తమ భావాలను భాషారూపంగా వ్యక్తం చేసుకోలేవు. భగవంతుడు, హృదయంలో ఉన్నది ఉన్నట్లు చెప్పనీ అని మనకు వాగింద్రియం ప్రసాదించాడు. మనం అట్లుచేయకపోతే వీడు మనుష్యుడుగాపుట్టికూడా గొడులాగున్నాడని మరొక జన్మలో పశుజన్మ మనకు నిర్దేశించవచ్చు. భగవన్నామం రసించడానికే రసనేంద్రియం ఏర్పడింది. దేనిని అభ్యాసం చేసినా, చేసినపనినే మరల చేయాలన్నసంకల్పంఏర్పడుతుంది. అది మంచి ఐనాసరే, చెడ్డది ఐనాసరే ఈసంకల్పపరంపరలే వాసనలు. సత్కార్యాలకుప్రోత్సహించే సద్వాసనలనుఅలవరచుకోవాలి. నిష్కామకార్యాచరణలో పాపబీజాలకు తావులేదు.

అందుచే ఉన్నదాంట్లో దానధర్మాలు చేసుకోవాలి. లేనిది మనకు రాదుకదా? దానికై నిర్దేశించిన ద్రవ్యాన్ని గృహావసరాలకు వినియోగించరాదు. మనం సంపాదించే అర్థం మొత్త మనది కాదనే జ్ఞాపకం ఉండాలి. ఈఅర్థానికి ప్రయోజనమూ సంబంధమూ ఈదేహమున్నంతవరకే. దేహానంతరం కూడాప్రయోజనం కావాలంటే అది ధర్మద్రవ్యం కావాలి. అప్పుడు అది ఏదేశంలోనైనా చెల్లుతుంది. ఎవరుచేసిన ధర్మం వారికి చెందుతుంది. కాబట్టి పెద్దలు మొదలు పిల్లలవరకు ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బీ ప్రత్యేకంగా ఉంచుకోవాలి. మొదటినుండీ ఇలా చేసివుంటే ఎంతో పుణ్యాన్ని ఆర్జించి ఉంటాం. కానీ కర్తవ్యం మరచాం అయినా మించిపోయిందేమీలేదు. ఇప్పటికైనా మనపిల్లలకు ధర్మబుద్ధి అంకురించేటట్లుచేస్తే, వారి ఇహలోక సౌఖ్యానికి లైఫ్‌ ఇన్యూర్‌ చేసినట్లు పారలౌకిక ప్రయోజనానికి ఆఫ్టర్‌ లైఫ్‌ ఇన్యూర్‌ చేసిన వాళ్ళమవుతాం.

వాక్కునిచ్చినందుకు వేయిమార్లైనా ఈశ్వరనామం జపంచేయాలి. వ్యర్థప్రసంగాలవల్ల పాపం, దానివల్ల కలిగే ఉపద్రవం భగవన్నామస్మరణతో తొలగిపోతుంది. వేలకొలది భగవన్నామాలున్నవి. వానిలోఒక్కటైనా వేయిమార్లు ప్రతి దినమూ జపించటం మంచిది. సిద్ధిపొందినవారివద్ద చేసుకునే ఉపదేశం శ్రేష్ఠం. ఉపదేశం లేకున్నా భగవన్నామం చేయగూడదని అనుకోరాదు.

ఒక్క క్షణకాలమైనా వ్యర్థం చేయరాదు. దినములో కనీసం కొన్ని నిముషాలైనా ఒకచోట స్థిరంగా కూర్చుని భగవద్ధ్యానం చేయాలి. హృదయం భగవన్నివాసమని గమనించక, దురాలోచనలతో నింపి, దుర్గంధభూయిష్ఠంచేసి ఆయనకు స్వదేశంలోనే చోటులేనట్లు చేశాం మనం. అందుచే ఆయనను మళ్లా ఆహ్వానించి, ఆయన సింహాసనంలో ఆయనను ఉపవిష్టునిచేసి. మనం ఆయనసాన్నిధ్యంలోకూచోవాలి. కనీసం అరగంటసేపయినా భగవచ్చరణ స్మరణ చేసే అలవాటు చేసుకోవాలి. నియతిగా ఆహారం ఎట్లు గ్రహిస్తున్నామో, ధ్యానమనే ఆహారాన్ని దానితో పాటు గ్రహించాలి. అది ఈశ్వరానుగ్రహానికి అనుకూలిస్తుంది. ద్రవ్యార్జనకైఎంతకాలం వినియోటిస్తున్నాం? అరగంటసేపు ఆత్మలాభంకోసం మనం వినియోగిచకూడదా? ధ్యానానికి అభ్యాసమయిన మనిషికి సత్కార్యాచరణం సహజమైపోతుంది. శారీరకంగా చేసే సదాచరణ గుళ్లకు వెళ్ళి దండప్రణామాలు చేయడం. దండమువలె క్రింద సాగిలపడి ''ఈదేహం నాదికాదు, నీది'' అన్నభావంతోదైవసన్నిధిలో చేసే దేసాష్టాంగదండప్రణామం. ఇట్లుచేస్తూవస్తే పాపంక్షీణించి అహంభావం క్రమేణ అంతరిస్తుంది. అహంత పోయి భగవత్సాన్నిధ్యంలో మనం ఎంతెంత పడతామో అంతంత మన మహిమ బరువెక్కుతుంది.

స్త్రీలు తమ భర్తలకు నమస్కరిస్తేచాలు. దీనివల్ల పురుషులలో చాలామందికి ఆలయాలకు వెళ్ళడం అవసరమని అర్థం. అందుచే వారికి బదులుగా స్త్రీలే వెళ్ళుతుంటారు. ప్రదక్షిణ నమస్కారాదులు చేస్తుంటారు. కొందరు మూలలింగం మాత్రం దర్శిస్తారు. కొందరు ధ్వజ స్తంభదర్శనం, మరికొందరు గోపురదర్శనం చేస్తారు. అధికారులను అనుసరించి విధు లేర్పడినవి.

ప్రయాణకాలే మనసాచలేన

భక్త్యా యుక్తో యోగబలేన చైవ,

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్‌

సతం పరం పురుష ముపైతి దివ్యమ్‌|| - గీత.

దేహాంతర ప్రయాణసమయంలో మనస్సు అచలంగా ఉండాలి. పాపభయం లేనప్పుడు మనస్సు అచలంగానేఉంటుంది. కామక్రోధాలు లేకపోతే పాపభయం లేదు. వీనిని ధ్వంసం చేసేదే ధర్మం. మనంచేసే పాపాలు స్మరిస్తే ఒకపూట అన్నానికైనా మనం పాత్రులమా అని అనిపిస్తుంది. దేవుడు కరుణాళువు కనుక, దేనినీ లెక్కించక, పాపాత్ములమైన మనకు పలు సౌకర్యాలు చేస్తున్నాడు. ధర్మకర్మలే కాక, సర్వకర్మలనూ ఈశ్వరార్పణ చేయాలి. ఈశ్వరుణ్ణి హృద్దేశంలో ప్రతిష్టించినామంటే మన పాపాలు పోకార్చి, స్థిరమైన పరమసౌభాగ్యం ఆయన ప్రసాదిస్తాడు.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page