Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

వేదము - ఉపాంగములు

మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము అనే నాలుగున్నూ (వేదానికి) ఉపాంగాలు. మీమాంస మొదటి ఉపాంగం. మీమాంసాపదంలో మాజ్‌ అనేది ధాతువు. సన్‌ అనేది ప్రత్యయము. మీమాంస అంటే పూజితవిచారణ లేక సద్విషయవిచారణ. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని మీమాంస రెండు తెగలు.

సాధారణంగా శాస్త్రాలన్నీ సూత్రబద్ధాలు. వాని అర్థ వివరణకు వారికి భాష్యాలు ఉంటై. సూత్రకారులు ఋషులు. పూర్వమీమాంసా సూత్రకారుడు జైమిని. శబరస్వామి భాష్యమూ, కుమారిభట్టు వార్తికమూ వ్రాశారు. అర్జునుడికి పాశుపతం ఇచ్చిన శబరుడు అనగా పరమేశ్వరుడు శాబర భాష్యం వ్రాసినట్లు ప్రతీతి.

కొన్నిసూత్రాలను ఒక ఘట్టంగాచేర్చి విషయవిచారణ చేసేది అధికరణం. పూర్వమీమాంసలో వేయి అధికరణాలున్నవి. సహస్రాధికరణి అని దానికి ఒక పేరు. వేదం పూర్వకాండ అనిన్నీ, ఉత్తరకాండ అనిన్నీ రెండు విభాగాలు, ధర్మానుష్ఠానాలు దెలిపేది పూర్వకాండ లేక కర్మకాండ. ధర్మానుష్ఠానానికి ఫలం చిత్తశుద్ధి. తద్వారా అద్వైతసిద్ధి దానిని ఉత్తరకాండ చెపుతుంది. అదే జ్ఞానకాండ లేక ఉపనిషత్తులు. వేదాంతశాస్త్ర అర్థవిచారణచేసే ఉత్తరమీమాంసే వేదవ్యాసుల బ్రహ్మసూత్రాలు, దానిలో నూటతొంభై రెండు అధికరణాలు. సూత్రభాష్యకర్త భగవత్పాదులు. వార్తికకర్త సురేశ్వరులు. సురేశ్వరుల పూర్వాశ్రమపుపేరుమండనమిశ్రులు. పూర్వాశ్రమంలో కర్మ అనుష్ఠిస్తూ, ఆచార్యులవారిదర్శనమైన పిదప వారు జ్ఞానభూమికలోకి దిగారు. తైత్తిరీయ బృహదారణ్యకాలకు ఆచార్యులు భాష్యాలు వ్రాస్తే, సురేశ్వరులు వార్తికాలు వ్రాశారు.

న్యాయశాస్త్రం గౌతమఋషి వ్రాసినది. యుక్తులసాయంతో ప్రపంచకర్త పరమేశ్వరుడని తీర్మానించడమే న్యాయశాస్త్రానికి ముఖ్యోద్దేశం. వేదం చెప్పే విషయాలను మీమాంస నిర్ణయం చేస్తున్నది. ఐనా మనకు సందేహం పోదు. కాని ఆవిషయాన్నే నానావిధాలైన యుక్తులతో తీర్మానిస్తే, అట్టి తీర్మానం దృఢంగా ఉంటుంది. ఒక ఉంజను వేలలో పాతుతాం. అది కదలక దృఢంగా ఉందా లేదా యని దానిని ఊపిచూస్తేకాని తెలియదు. న్యాయశాస్త్రం ఆపనే చేస్తున్నది. యుక్తివాదాలను మన మొప్పుకోవలసిందే. కుయుక్తులే త్యాజ్యాలనిసాధనపంచకంలోభగవత్పాదులు సెలవిస్తున్నారు.

వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం

తేనేశస్య విధీయతా మపచితిః కామ్యే మతి న్త్యజ్యతామ్‌,

పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతా

మాతేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్‌.

సంగం సత్సువిధీయతాం భగవతో భక్తిర్దృఢా ధీయతాం

శాంత్యాదిః పరిచీయతాందృఢతరంకర్మాశుసంత్యజ్యతామ్‌,

సద్విద్వాసుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకాసేవ్యతాం

బ్రహ్మైకాక్షర మర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్‌||

వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షః సమాశ్రీయతాం

దుస్తర్కస్తు విరమ్యతాం శ్రుతిమతస్తర్కోను సంధీయతామ్‌.

బ్రహ్మైవాస్మి విభావ్యతా మహారహర్గర్వః సరిత్యజ్యతాం

దేహేహం మతిరుజ్ఝ్యతాం బుధజనై ర్వాదః పరిత్యజ్యతామ్‌||

''వేదం అధ్యయనం చేయండి. అదే ఈశ్వరోపాసన. చిత్తశుద్ధితో సద్గురువును ఆశ్రయించి వారి పాదసంసేవనం చేయండి. వారిని ప్రణవోపదేశానికై ప్రార్థించండి. అటుపై వేదాంతశ్రవణం చేయండి. దుస్తర్కాన్ని వదలి శ్రుతిసమ్మతమైన తర్కాన్ని అనుసంధించండి'' అని ఆచార్యులవారన్నారు.

వేదాంతనిర్ణయానికి కుయుక్తు యుపయుక్తం కావు. యుక్తిశ్రుతిమతంగా ఉండాలి. నిర్ణయం యుక్తిబద్ధంగాఉండకపోతే కారడవిలో ప్రయాణం చేసినట్లే. యుక్తిసాహాయ్యంతో వేదాంతనిర్ణయం చేసేదే 'న్యాయం'. గౌతమునితో పాటు కాణాదుడనే ఆయన వై శేషికమనే మరో న్యాయశాస్త్రం వ్రాశారు.

న్యాయంలో ప్రధానమైనది అనుమానం. ఉపనిషత్తులు గురుముఖంగా వినాలని ఆచార్యులు సెలవిచ్చారు. ఆ వినడమున్నూ శిష్యుడు కొంతసాధనచేసి మనశ్శాంతి పొందినవాడైతే సత్ఫలం ఇస్తుంది, దున్ని, పదనుచేసిన నేలలోనే విత్తులు ఫలిస్తవి. ప్రతిరోజున్నూ ఎన్నోఉపదేశాలు వింటూనేఉన్నాం. కాని దుఃఖోపశమనం కావటంలేదు. కారణం చిత్తశుద్ధిలేక శ్రవణం చేయడంచేతనే. చిత్తాన్ని శాంతంగా వుంచుకొని మరీ వినాలి. వైదికకర్మలని భగవదారాధనక్రింద చేస్తే మనశ్శాంతి కలుగుతుందని భగవత్పాదులు చెప్పారు.

గురుభక్తి దైవభక్తికన్న గొప్పది. గురుభక్తి ఉన్న వాడికి శాంతిసులభంగా లభ్యమవుతుంది. మనశ్శాంతి తానుగా ఏర్పడుతుంది. మనం మహాత్ములముందు ఏదైనా చదివినట్లైతే మనశ్శాంతి కల్గుతున్నది. ఆ శాంతి గ్రంథాలయాలలోకాని, క్లబ్బులలోకాని కనిపించటంలేదు. మనస్సు గురుభక్తితో ఆర్ద్రమైందంటే సద్యఃఫలం ఇస్తున్నది. మొదట మహాత్ములను అన్వేషించాలి. అటుపైవారి ముఖతః ఉపదేశాలు వినాలి. అందుచేతనే దేనినైనా గురుమూలకంగా నేర్చుకోవాలని ఆదేశం. మనం ఎంతో చదివినాము. కానీ అజ్ఞానం మాత్రం వీసమన్నా తగ్గడం లేదు. యధారూపంగా వుంది. ఏచోటికి వెడితే అది మొదలంటా నశిస్తుందో ఆచోటు వెదుక్కుంటూ వెళ్ళి ఆశ్రయం పొందాలి. బృహదారణ్యకం ఈ మాటే చెపుతున్నది.

'ఆత్మావా అరేద్రష్టవ్యః శ్రోతవ్యోమంతవ్యోనిధిధ్యాసితవ్యః'

'సద్‌ విద్వాంసుని ఆచార్యునిగావరించి వారిపాదుకలను సేవించి బ్రహ్మోపదేశం పొందండి' అని ఆచార్యస్వాములు అన్నారు.

శ్రవణమయిన పిదప మననం. మననమంటే ఆచార్యమూలకంగా విన్నదానిని యుక్తిసాహాయ్యంతో మరలమరల తరచిచూడడం. యుక్తియే అనుమానం. అంటే ప్రత్యక్షంగా తెలుసుకోలేనిది. కారణసహాయంతో తెలిసికొనేది. జీవాత్మ పరమాత్మ స్వరూపాలు మనకు దృష్టిగోచరం కావడంలేదు. కరచరణ నాసికాది అంగరాశికిన్నీ తెలియటంలేదు. మోక్షస్వరూపమున్నూ మనకు తెలియటంలేదు. తరణోపాయమున్ను అగమ్యంగా వున్నది. వీనినంతా అనుమానమూలంగా అర్థం చేసికోవాలి. వ్యక్తాన్ని సాధనంగా ఉంచుకొని అవ్యక్తాన్ని సాధించడమే అనుమానం.

పదార్థజ్ఞానం కల్గిందంటే దుఃఖంపోతుందని మనశాస్త్రాలు వక్కాణిస్తున్నవి. ఆ పదార్థజ్ఞానంకోసం అన్ని ప్రమాణాలున్నూ వినియోగం కావాలి. 'పదార్థత్వం' 'అభిధేయత్వం' అని తర్కసంగ్రహం చెప్పుతున్నది. కండ్లు, చెవులు ప్రత్యక్ష ప్రమాణాలు. వీనికి గోచరమయ్యేది ఏకొద్దియో అగోచరాలు లెక్కలేనన్ని. వానినంతా అనుమానప్రమాణంతో తెలిసికోవాలి. అందుచే న్యాయశాస్త్రం ఒక ఉపాంగం అయింది. మీమాంస శ్రవణానికి ఉపాంగమైతే, న్యాయం మననానికి ఉపాంగమైంది.

పదార్థములు ఏడురకాలు. వీనిలో మళ్లా రెండు విభాగాలు. ''భావో భావశ్చ''. మొదట ఆరుపదార్థాలు ఉండేవి. అవి భావము. కడపటిదైన ఏడవది అభావం. అభావ మంటే లేనిది.

ఐతే ఒకసంశయం కలుగవచ్చును. లేనిది పదార్థమెట్లా అవుతుంది? పదార్థం అంటే ఏమి? పదంయొక్క అర్థం 'లేదు' అనేపదానికి కూడా ఒక అర్థం ఉందికదా!

అభావం కొన్నిచోట్ల ఉన్నది. మరికొన్నిచోట్ల లేదు. అక్కడ పూలులేవు అని అనుకొందాం. అక్కడ పూలఅభావం ఉన్నదని అర్థం. ఇట్లు అభావం కొన్నిచోట్ల ఉన్నది. కొన్నిచోట్ల లేదు. అట్లే కొన్నిసమయాలలో ఉన్నది. కొన్ని సమయాలలో లేదు. అందుచే కొన్ని దేశకాలాలలో అభావం ఉండడంచేత అదిపదార్థ మవుతూంది.

ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయము, అభావము అనునవి ఏడురకముల పదార్థాలు. ద్రవ్యము, గుణము, కర్మ అనే ఈమూడున్నూ సత్పదార్థాలు. ఉన్నదని చూపగల్గినది సత్తు. తక్కినవానిని అట్లాచూపలేము. ద్రవ్యాన్ని స్థూలంగా చూపగలం.

జ్ఞానము, దుఃఖము, సంతోషము మొదలైనవి ఒక దానిని ఆశ్రయించుకొని ఉండడాన వానిని విడదీసి చూపలేము. అందుచే అవి గుణపదార్థాలు. తామర ఎరుపు. ఎరుపుతామర యొక్క గుణం. దానిని ప్రత్యేకించికానీ విభజించికానీ చూపలేము. ఇట్లు ఒకదానిని ఆశ్రయించిఉండేది గుణం. గుణానికి ఆశ్రయం ద్రవ్యం. నడవడం, పరుగెత్తటం, రాక, పోక ఈ మొదలయినవన్నీ కర్మలు. అవి యేదో ఒకద్రవ్యాన్ని ఆశ్రయించికొని ఉంటై. ''సామాన్యం'' జాతిని సూచిస్తుంది. మృగములున్నవి. వానికి మృగత్వం సామాన్యం. దానినే మనం జాతి అని అంటున్నాము. ఆ జాతిలోనివే అయిన ఆవు ఇఱ్ఱి యీ మొదలైనవానిని విశేషం అని అంటాము. ద్రవ్యము, గుణము ఈ రెండున్నూ అవిభక్తంగా ఒకదాని నొకటి ఆశ్రయించిఉంటే అది సమవాయం. అగ్నిలోని ప్రకాశరూపం సమవాయం. ద్రవ్యమూ కర్మా చేరినాకూడా సమవాయమే!

పదార్థాలను ఏడువిభాగములుగా చేసినట్లే, ప్రతి పదార్థమునూ పలువిధాలుగా విభజించారు. ద్రవ్యం తొమ్మిదిరకాలు. అవి పృథివి, జలమూ, తేజస్సూ, వాయువు, ఆకాశమూ, కాలమూ, దిక్కు, ఆత్మా, మనస్సూ, అన్నిటికీ ఆశ్రయమిచ్చేదే ఆకాశం. పైనచెప్పిన పంచభూతాలకు సామ్యంగా దేహంలో శ్రోత్ర, త్వక్‌, చక్షుర్‌, జిహ్వాఘ్రాణములనే పంచేంద్రియాలున్నవి. వీనికి ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పనిచేస్తున్నది. ఒకదానిపని మరొకటి చేయదు. చెవులతో చూడలేము. కనులతో వినలేము. కలకండతీపి ముక్కుకు తెలియదు.

కనులు రూపం గ్రహిస్తవి. వర్ణవైవిధ్యం కలదేరూపం. శుక్ల, నీల, పీత, హరిత, రక్త, కపిశము అనగా తెలుపు, నలుపు, పసుపు, పచ్చ, ఎఱుపు, పసుపుమీరిన ఎఱుపు. ఇవి ఆరురంగులు. శబ్దభేదం చెవులు గ్రహిస్తవి. సువాసన, దుర్వాసనలను నాసిక పసికట్టకలదు. షడ్రుచిభేదాలను నాలుక తెలిసికొంటున్నది. శీతోష్ణాలను స్పర్శేంద్రియం ఎరుగుతూంది. స్పర్శ బాహ్యమే కాక ఆంతరం కూడా. అందుచేతనే కడుపునొప్పివంటి అంతర బాధలు మనకు వ్యక్తమవుతున్నవి.

పై జెప్పిన ఐదుగుణాలున్నూ పంచభూతాల కున్నవి. ప్రథమభూతంపృథివి. అనగాభూమి, మట్టికిరూపంఉన్నది. గంధం ఉన్నది. రుచి ఉన్నది. శీతోష్ణ కాఠిన్యాదులైన స్పర్శయున్నూ శబ్దగుణమున్నూ భూమికి ఉన్నది. మన దేహంకూడా ఒకమట్టికుండే,ఒళ్ళు,వంకాయ,బెల్లం ఈవస్తువులన్నీ ఒకవిధంగామన్నే. వాసనలతోగుబాళించేరోజాపువ్వు ఉన్నది. అదీ ఒకరకమైన మన్నే. మట్టిలోపుట్టి కుసుమించి సుగంధిలమైన జీవితాన్ని కొన్ని గంటలు గడిపి తొడిమనుండి రాలిపోయి భూమిలో కలసిపోతున్నది. నీటిలో గంధంతప్ప తక్కిననాలుగు గుణాలున్నవి. మనం గంధ ద్రవ్యాలని కలిపితేతప్ప నీటికి సొంతంగా గంధం లేదు. కాని తక్కినగుణాలు రూప, రస, శబ్ద, స్పర్శలున్నవి, ఒక్కొక్కభూతంలో ఒక్కొక్కగుణం విశేషం. నాలుగు గుణాలున్న నీటికి రసగుణం విశేషం. నీరు లేకపోతే రసంలేదు. రసనేంద్రియమైన నాలుక సదాఆద్ద్రమై లాలాజలంతో నిండి ఉంటుంది. రసమనే పదానికే నీరనికూడా ఒక అర్థం.

తేజస్సునకు రసగంధాలు లేవు. కాని తక్కిన మూడు శబ్ద స్పర్శ, రూపాలు ఉన్నవి. గాలికి రూపంలేదు. శబ్ద, స్పర్శలు మాత్రమే. ఆకాశానికి ఒకేగుణం శబ్దం. నవీనులు కొంతకాలం శబ్దప్రసారానికి గాలి ఆధారమని అనుకొన్నారు. కాని నిస్తంత్రీవార్తలు మొదలైనవి బయటపడగానే శబ్ద ప్రసారానికి ఆకాశగుణమే ఆధారమని తెలిసికొన్నారు.

పంచభూతాలనబడే ఐదు ద్రవ్యాలున్నూ ఈ ఐదు గుణాలనూ ఆశ్రయించి ఉన్నవి. మిగిలిన ద్రవ్యాలు కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు, నిమిషము, గంట, నేడు, రేపు, నిన్న, ఎడాది, యుగం, ఇత్యాదులు కాలాన్ని చెపుతవి. ఎగువ దిగువ అక్కడ, ఇక్కడ అనేవి దిక్కులు లేక దేశాన్ని చెపుతవి. వీనినన్నింటిని గుర్తించే జ్ఞాత ఒకటి వున్నది. అది ఆత్మ, జీవాత్మ అనీ, పరమాత్మ అనీ ఆత్మ రెండువిథాలు, లోకంలో జరిగేదంతా చూస్తున్నద్రష్ట ఒకడు. సంపర్కం ఏర్పరుచుకొని దుఃఖించేవాడు ఒకడు. జీవాత్మలు పలువురు, పరమాత్మఒకడు. ఈరెండున్నూ చైతన్యవస్తువులే. ఎరుకనే వేదాంతాలు ఆత్మ అని అంటవి, న్యాయశాస్త్రము ఎరుకను గుణములలో చేర్చి దానితో కూడిన జ్ఞాతను ఆత్మఅని అంటుంది. ఆత్మ ద్రవ్యం దానిని ఆశ్రయించుకొని ఉండేది జ్ఞానం. పరమాత్మ సర్వజ్ఞుడు. అన్నిటినీతెలిసినవాడు. జీవాత్మకించిద్‌ జ్ఞుడు. కొంచెము తెలిసినవాడు, మనము ఎటూకాక కొంతజ్ఞానంతోటీ, కొంత ఆజ్ఞానంతోటీ ఉన్నాము. పరమాత్మ పూర్ణజ్ఞాని, విభువు, సర్వగతుడు.

పరమాత్మ అంతటా ఉన్నప్పటికిన్నీ ఎరుక ప్రత్యేకంగా ఒకేచోట కలుగుతూంది. ఆ చోటే మనస్సు, దానికే సుఖదుఃఖాలు కల్గుతున్నవి. జ్ఞానం గుణాలలోనిదని న్యాయశాస్త్రం చెపుతుంది. ఇరువదినాలుగు గుణాలున్నో, ఐదు కర్మలున్నూ న్యాయశాస్త్రం నిర్దేశించింది. పదార్థజ్ఞానం కలిగితే వైరాగ్యం ఏర్పడి మోక్షగాములము అవుతాము. వేదాంతాలు చెప్పిన మోక్షం అపేక్షించినా న్యాయశాస్త్రం ఉపయోగకారియే. న్యాయశాస్త్ర ప్రకారం పంచభూతాలు ప్రత్యక్ష ప్రమాణంతోనూ, ఆత్మ అనుమానప్రమాణంతో తెలియదగినదిగా ఉంది. ఈశ్వరుడున్నాడని శ్రుతులు చెపుతున్నవి. ఒకవస్తువును చూచి దానికి ఒక కర్త ఉన్నాడని అనుమానిస్తున్నాము. అట్లే ప్రపంచాన్నంతా సృష్టించినవాడు ఒకడు ఉండాలి. వాడు సర్వజ్ఞుడున్నూ సర్వశక్తిమంతుడున్నూ అయిఉండవలె. తాను చేసిన సృష్టినంతా రక్షిస్తూ, భరిస్తూ ఉండాలి. కనుక వాడు కరుణాళువైకూడా ఉండాలి. ఇట్లు ఆక్షేపసమాధానాలతో సిధ్ధాంతీకరించేదే న్యాయశాస్త్రం.

మనకంటికి సరిగా కనపడని, సూక్ష్మమైన వస్తువును చూడదలచుకొంటే భూతద్దపుసహాయంతో చూస్తాము. పురాణాలు వేదాలకు భూతద్దాలవంటివి. వేదోక్తులు ఆజ్ఞారూపంగా ఉంటవి. 'సత్యంవద' (నిజంచెప్పు) అన్న వాక్కున్నది. ఇది వేదాలు విధించే ఆజ్ఞ. కాని మనకు జ్ఞప్తికిరాదు. ఈ సూక్తి హరిశ్చంద్రుని కథను తలచుకొంటేనే జ్ఞాపకం వస్తూంది. 'పితృదేవో భవ' (తండ్రి దేవుడనిఅనుకో) అన్నది మరొక వేదవాక్యం. రామాయణం చదివితేగాని ఇది అర్థంకాదు. వేదఘనతను చక్కగా తెలిపేవే పురాణాలు.

పురాణం అంటేపాతది అని అర్థం. 'అన్ని దేశాలకూ చరిత్రలున్నాయి. మనదేశానికి చెప్పుకోతగ్గ చరిత్రలేదు' అని కొందరి అభిప్రాయం. పురాణాలు వాస్తవమయిన చరిత్రలు. రెండు వేలఏండ్లకు లోపుగా జరిగినదే చరిత్ర అని చాలామంది అభిప్రాయం. వేలకొలది ఏండ్లముందు జరిగిన కథలు మనమెందుకు చదవడం? గడిసిపోయినది అనుభవం. అది భవిష్యత్తుకు సాధనం. సచ్చరిత్రలు, కథలు చదువుతుంటేవారి అడుగుజాడలలో మనమూ నడుస్తే ఎంత బాగుంటుంది అన్న ఉబలాటం ఏర్పడుతుంది. కొందరు లోకకంటకాలైన పనులుచేస్తూ లోకాన్నిక్షోభ##పెట్టి తామున్నూ ఎలానశించిపోయారో దుష్టుల చరిత్రమూలంగా తెలిసికొంటున్నాం. ఈ పఠనంవల్ల దుష్కార్యాలు ఎన్నటికినీ చేయరాదన్న వివేచన ఏర్పడుతున్నది. అట్టి కథలూ గాథలే పురాణాలు, ఏసంబంధమూలేని కథలు అనవసరంగానీ, ఆత్మలాభం ఆర్జించిపెట్టే పురాణాలెట్లు పనికిరానివౌతవి?

వేదోక్తాలను వివరించేవే పురాణాల. ఇవిపదునెనిమిది. ఉపపురాణాలు పదునెనిమిది. పదునెనిమిది పురాణాలు చేరి నాలుగులక్షల గ్రంథములుగా నున్నవి. ముప్పది రెండుక్షరాలు ఒక గ్రంథం అని లెక్క. పదునేడుపురాణాలు మూడు లక్షల గ్రంథం ఒక్క స్కాందంమాత్రం లక్షగ్రంథం. భగవదవతారములలోని ఒక్కొక్క మూర్తిని ఒక్కొక్క పురాణం చెపుతున్నది. పరమశివునిగూర్చి చెప్పేవి పదిపురాణాలు, వానిలో స్కాందమొక్కటే లక్షగ్రంథం కలది.

యద్వేదాత్‌ ప్రభుసమ్మితా దధిగతం శబ్దప్రమాణాచ్చిరం

యచ్చార్థప్రవణాత్‌ పురాణవచనాదిష్టం సుహృత్యమ్మితాత్‌,

కాంతాసంమితయా యయా సరసతా మాపాద్యకావ్యశ్రియా,

కర్తవ్యే కుతుకీ బుధోవిరచిత స్తసై#్యస్పృహాం కుర్మహే||

- ప్రతాపరుద్రీయము.

ఒకకార్యం ఉందనుకొందాం. దానిని మూడువిథాలుగా నెరవేర్చుకోవచ్చు. మొదటిది ఆజ్ఞ. ఆజ్ఞాపించగానే భృత్యుడు భయపడి దానిని చేస్తాడు. అదిప్రభుసమ్మితం, స్నేహం పురస్కరించుకొని స్నేహితుణ్ణి బ్రతిమాలి ఆపనే చేయించుకొంటాం. అది సుహృత్సమితం. భార్యచెప్పే కార్యం ఎంత కష్టమైనా భర్తకు లఘువుగానే కనిపిస్తుంది. శ్రమయని అనిపించదు. అది కాంతాసమ్మితం, ఆచరణీయాలను బోధించే పురాణాలను మనము చక్కగా తెలుసుకోవాలి.

ధర్మశాస్త్రమును స్మృతులని అంటారు. వేదాలు అనంతాలు. వానిలో కొంతమాత్రం లభించినవి. ఈకలికాలంలో మూలసూత్రం చూచి వేదం తెలిసికొనటం కష్టం. అందుచే అనుష్ఠానాని కుపయుక్తములయ్యె విషయాలను స్మృతులుగా వ్రాశారు. (అనగా అవి స్మృతిరూపంలోఉన్నవి) స్మృతికర్తలు మనువు. యాజ్ఞవల్కుడు, పరాశరుడు, గౌతముడు, హారీతుడు, యముడు, విష్ణువు మొదలైనవారు. ''శ్రుతిం పశ్యంతి మునయః'' శ్రుతులను మునులు చూస్తారు. అనుభవముయొక్క జ్ఞాపకమే స్మృతి. స్మృతి అనగా చట్టముఅని కొందరు చెపుతున్నారు. కాని అది తప్పు. 'సంస్కారజన్యం జ్ఞానం స్మృతిః'అని న్యాయశాస్త్రం. సంస్కారంనుండి ఏర్పడిన జ్ఞానమే స్మృతి. స్మృతి అనుభవము. స్మృతి అతీంద్రియము లేక సంస్కారము. కాశీనగరం చూసినపిదపనే మనకు దాన్నిగూర్చిన స్మృతి యేర్పడుతూంది. ఏదైనా ఎన్నోమార్లు ఎరిగి చూచిన తరువాతనే జ్ఞాపకంలో స్థిరంగా ఉంటుంది. ఇట్లా తెలియనిస్థితి అతీంద్రియం లేక సంస్కారం. స్మృతులన్నీ వేదమూలంగా వచ్చినవి. అవి వేదానుభవములు. అవి వేదమూలములు కాకపోతే వానిని స్మృతులనడమే తప్పు.

స్మృతులనుగూర్చి మనోహరంగా కాళిదాసకవి రఘువంశ కావ్యంలో ఒక ఉపమానం చెప్పాడు.

''తస్యాః ఖురన్యాస పవిత్రపాంసుం

అపాంసులానాం ధురికీర్తినీయా,

మార్గం మనుష్యేశ్వరధర్మపత్నీ

శ్రుతే రివార్థం స్మృతి రన్వగచ్ఛత్‌||

సంతానములేని దిలీపుడు వశిష్ఠాశ్రమంలో నందినికి సేవచేస్తుంటాడు. నందినిని మేతకై తోలుకొని పోతుంటే పతివ్రతయైన సుదక్షిణ భర్తనూ' నందినినీ కొంతదూరం వెంబడించి వెళ్ళుతుంది. ఆమె అపాంసుల. కామధేనువు సంతానమైన నందిని గిట్టలచే రేగి పవిత్రమైన పరాగమేకాక, తనభర్తపాద రేణువులతో కలసి మరీ పవిత్రమైనది సుదక్షిణ. స్త్రీలకు తమ పురుషుల ననుసరించడమే పుణ్యం. పురుషులకన్నా స్త్రీలకే సాధన అనుకూల. కంటికి తెలిసే స్వామికదా వారికి భర్త. భర్తృరూపంగా స్త్రీలు పరమేశ్వరుణ్ణి కొలుస్తుంటే, శిష్యులకు ఈశ్వరసాన్నిధ్యం గురువులలో లభిస్తున్నది.

'ఉపమా కాళిదాసస్య' అన్న కీర్తి కాళిదాసుది. ఉపమాన మెపుడూ ఉపమేయంకంటె శ్రేష్ఠంగాఉండాలి. సుదక్షిణ నందినిని అనుసరించడం, స్మృతులు శ్రుత్యర్థాలను అనుగమించినట్లుందని కాళిదాసు స్మృతుల ఉత్కృష్టతను చాటాడు, శ్రుత్యర్థాలను విశిదీకరించే ఉద్దేశంతో మహరులు వ్రాసిన ఉద్గ్రంధాలే స్మృతులు.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page